Friday, October 25, 2013

ఆచరించి చూపాలి

ఆచరించి చూపాలి

ఒకానొక అడవిలో ఓ పక్షుల గుంపు ఉండేది. ఆ గుంపులో అందరికంటే పెద్దదైన పక్షి రాజుగా, ఆ గుంపుకి పెద్దగా వ్యవహరిస్తూ ఉండేది. ఆ గుంపులో పక్షులన్నీ రోజంతా కష్టపడి గింజలు సంపాదించి, సాయంత్రం వేళ ఓ చోట చేరి అందరూ తెచ్చుకున్నవి పంచుకునేవి. ఆలా ఒకవేళ ఎవరికైనా ఆహారం దొరక్కపోయినా పెద్ద సమస్యగా ఉండేది కాదు. ప్రస్తుతం ఉంటున్న అడవిలో తిండి గింజలు సరిగా దొరకడం లేదని, అవి మరో కొత్త చోటికి ప్రయాణమయ్యాయి. ఆ కొత్త ప్రదేశానికి చేరగానే పక్షిరాజు అందరినీ ఉద్దేశించి “కొత్త ప్రదేశం కనుక ,జాగ్రత్తగా మసలుకోండి. ఇద్దరు, ముగ్గురుగా గింజలకోసం వెళ్ళండి. ఒంటరిగా వెళ్ళకండి” అని హెచ్చరించింది. రోజులు గడుస్తున్నాయి. ఓసారి ఆ గుంపులో ఒక పక్షికి ధాన్యం బస్తాలతో అటుగా వెళ్తున్న బళ్ళు కంటబడ్దాయి. ‘ఆహా! ఎన్ని గింజలో!!’ అనుకుంది. ఈ దారిలో చాలా గింజలు దొరుకుతాయన్నమాట, ఎక్కువ కష్టపడక్కర్లేదు అనుకుంది. ఈ సంగతి మిగతా వాటికి తెలిస్తే అవన్నీ కూడా ఇటుగానే వచ్చేస్తాయి, అలా జరగకుండా చూస్తాననుకుంటూ గూటికి చేరింది. మర్నాడు గింజల వేటకి బయలు దేరుతూ అందరినీ ఉద్దేశించి "ఇదిగో నా మాట కాస్త వినండి. మనం ఉంటున్న ఈ ప్రదేశానికి కాస్త దూరంలో పెద్ద పెద్ద బళ్ళు ధాన్యం గింజలు తీసుకుపోతూ కనిపిస్తాయి.అటుగా గానీ వెళ్ళేరు , కష్టాల్లో పడగలరు
చాలా రద్దీగా ఉండే ఆ బాటలో ఏ బండి కిందో పడొచ్చు, లేదా ఆ బండి మీద వాళ్ళు దాడి చెయ్యవచ్చు. అతిగా ఆశ పడకండే! ప్రాణానికే ప్రమాదం" అంటూ జాగ్రత్తలు చెప్పింది. తను ఈ పూటకి బయటకు రాలేననీ, కాబట్టి తనకు జతగా ఎవరూ రావక్కర్లేదనీ చెప్పింది. సరే అనుకుని మిగతా పక్షులన్నీ గింజల వేటకి వెళ్ళిపోయాయి. ఎవ్వరూ చూడట్లేదని నిర్ణయించుకున్నాక, తను మాత్రం ఆ ధాన్యం బళ్ళు తిరిగే బాటకు బయలుదేరింది. ఆ బాటలో కింద పడిన గింజలన్నీ కడుపు నిండా ఆరగించింది.
అంతలో పెద్ద శబ్దం వినిపించింది. ఏమిటా అని చూస్తే అటుగా ఓ పేద్ద బండి వస్తోంది. ఆ బండి ఇంకా చాలా దూరంలో ఉందనుకుంది. మరి కాసిన్ని గింజలు తీసుకుని గూటికి చేరుకుందామనుకుంది. అంతలోనే ఆ బండి పక్షి దగ్గరకు రావడమూ, పక్షి మీదుగా వెళ్ళి పోవడమూ, ఆ పక్షి బండి చక్రాల కింద పడి చనిపోవడమూ జరిగిపోయాయి. ఆ సాయంత్రం గూళ్ళకి చేరిన పక్షులన్నీ పక్షిరాజు దగ్గర గింజలు పంచుకోవడానికి సమావేశమయ్యాయి. అందులో ఈ పక్షి కనిపించక పోయే సరికి ‘అదేమిటి? అసలు బయటకే రాలేనంది, ఈ కొత్త ప్రదేశంలో ఎక్కడైనా తప్పిపోయిందేమో చూసి రమ్మని’ పక్షిరాజు ఆదేశించేసరికి, వెతకడానికి వెళ్ళిన వాటికి, చనిపోయి పడి ఉన్న పక్షి కనిపించింది. అప్పుడు పక్షి రాజు
"అందరికీ నీతులు, జాగ్రత్తలు చెప్పి తనే ప్రాణాలు పోగొట్టుకున్న ఈ పక్షి జీవితం మీ అందరికీ ఓ గొప్ప గుణపాఠం. ఇతరులకి మనం ఏమైనా నీతులు, జాగ్రత్తలూ వంటివి చెప్పేటప్పుడు మనం ఆచరించి చూపాలి " అంది.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...