Monday, July 30, 2018

ఆహార నియమాలు

దేవుడికి నివేదన చేయడానికి ముందు విస్తట్లో ఉప్పు వడ్డించకూడదని పండితులు చెబుతున్నారు. స్వామికి సమర్పించే విస్తట్లో ఉప్పు మాత్రం ప్రత్యేకంగా వడ్డించకూడదని వారు అంటున్నారు.

ఇక యోగశాస్త్రం ప్రకారం మనుష్యుని శ్వాసగతి 12 అంగుళాల దాకా ఉంటుంది. భోజనం చేసేటపుడు 20 అంగుళాల దాకా ఉంటుంది. మాట్లాడితే శ్వాసగతి ఎక్కువవుతుంది. కాబట్టి ఆయుష్షు తగ్గుతుంది. కనుక ఆహారం తీసుకునేటప్పుడు మాట్లాడకూడదు.

అలాగే త్రయోదశినాడు వంకాయ తినకూడదు. అష్టమి నాడు కొబ్బరి తినకూడదని, పాడ్యమి నాడు గుమ్మడికాయ తినకూడదని, పురాణాలు చెబుతున్నాయి. దొండకాయ తింటే వెంటనే బుద్ధి నశిస్తుంది.

రాత్రి అన్నం తినేటపుడు దీపం ఆరిపోతే విస్తరాకును గాని, పాత్రను గాని చేతులతో పట్టుకొని సూర్యుణ్ణి స్మరించాలని దీపాన్ని చూసి మిగిలినది తినాలని అప్పుడు మరోసారి వడ్డించుకోవద్దని పెద్దలంటారు.

రాత్రి తింటూ ఉన్నప్పుడు తుమ్మితే నెత్తిపై నీళ్ళు చల్లడం, దేవతను స్మరింపచేయడం ఆచారంగా ఉంది. రాత్రి పెరుగు వాడకూడదు. ఒకవేళ వాడితే నెయ్యి, పంచదార కలిపివాడవచ్చు. ఇలా చేస్తే వాతాన్ని పోగొడుతుంది.

రాత్రిళ్లు కాచిన పెరుగును మజ్జిగపులుసు మొదలైనవి వాడకూడదు. ఆవునేయి కంటికి మంచిది. ఆవు మజ్జిగ చాలా తేలికైనది. అందులో సైంధవలవణం కలిపితే వాతాన్ని పోగొడుతుందని, పంచదార కలిపితే పిత్తాన్ని పోగొడుతుందని, శొంఠికలిపితే కఫాన్ని పోగొడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

నలుగురు కూర్చొని తింటూ ఉన్నప్పుడు మధ్యలో లేవకూడదు. తేగలు, బుర్రగుంజు, జున్ను, తాటిపండు మొదలైనవి వేదవేత్తలు తినరు. మునగ, పుంస్త్వానికి (మగతనానికి) మంచిదంటారు.

ఆకలితో బాధపడేవారు కోడి, కుక్క మొదలైనవి చూస్తూ ఉండగా తినకూడదన్నారు.

ఎప్పుడూ నిర్ణీత సమయం లోనే భోజనం చెయ్యాలి. ( అందువలన బయోలాజికల్ క్లాక్ సక్రమంగా ఉంటుంది )

ఆహారం నెమ్మదిగా పూర్తిగా నమిలి తినాలి ( ఘన పదార్ధాలను త్రాగండి అంటారు. అంటే నోటిలోనే సగం నమలబడాలి . అందువలన లాలాజలం పూర్తిగా కలిసి, ముద్దా మింగడం సులువు అవుతుంది . పిండి పదార్ధాలు పూర్తిగా జీర్ణం అవుతాయి . కడుపులో ఊరే ఆమ్లాలకు లాలాజలం ( క్షారం ) విరుగుడు గా పనిచేస్తుంది .

ఆహార నియమాలను పాటించే వ్యక్తికి ఔషధాల అవుసరం ఏమి ఉంటుంది ? ఆహార నియమాలను పాటించని వ్యక్తికి ఔషధాలు ఏమి ఫలితాలను ఇవ్వగలవు?

పధ్యే సతి గదార్తస్య కి మౌషద నిషేవనై:
వినాపి భేశాజేవ్యర్ది : పత్యాదేవ్ నివర్తత
న తు పథ్య విహీనస్య భేశాజానాం శథైర్యపి

అంటే రోగికి ఔషధాల అవుసరం లేకుండానే కేవలం నియమిత ఆహారం పాటించడం వలన వ్యాధులు దూరమవుతాయి .

రోగికి ఆహారం పై నియంత్రణ లేక పోతే మాత్రం అత్యుత్తమ మైన మందులు కూడా ఫలితాన్ని ఇవ్వలేవు అని అర్ధం .

అన్నం బ్రహ్మ రసోవిష్ణు: బోక్తా దేవో మహేశ్వర: ఇతి సంచింత్య భుంజానం దృష్టిదోషో నబాధతే అంజనీగర్భంసంభూతం కుమారం బ్రహ్మచారిణం దృష్టిదోషవివానాశాయ హనుమంతం స్మరామ్నహం||

అనగా అన్నం బ్రహ్మం, అన్నరసం విష్ణురూపమై ఉన్నది. తినువాడు మహేశ్వరుడు, ఇట్లా చింతిస్తే దృష్టిదోషం ఉండదని పండితులు అంటున్నారు.

Monday, July 23, 2018

గురు పౌర్ణమి

జ్ఞానామృతం పంచే గురు పౌర్ణమి

వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువు అందుకే ఆయన పేరిట వ్యాస పూర్ణిమ రోజున గురు పూర్ణిమగా పండుగను జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశమంతా గురు పూజా మహోత్సవాన్ని జరుపుకుంటారు. అసలు గురువు శబ్దానికి అర్థం; ఆచార్యుడంటే ఎవరు? వ్యాసుని కధ... గురుపూర్ణిమ చేసే విధానం తెలుసుకుందాం!

గురువు అంటే:

గురువు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకటై జన్మించిన రూపం అంటే సాక్షాత్‌ పరబ్రహ్మ స్వరూపమే గురువు. గు అంటే అంధకారము లేదా అజ్ఞానాన్ని, రు అంటే నిరోధించుట లేక నశింప చేయుట అని అంటే గురువు అంటే అజ్ఞానాన్ని నశింప చే యువారు అని అర్ధము. గు శబ్దమంధకారస్యరుతన్నిరోధకః అని పెద్దల వచనం!గురువు చేయవలసినది తన శిష్యులను అంధకారంలోంచి వెలుగులోకి తీసుకు రావడం. ఈ భౌతిక జగత్తులో ఏ మానవుడూ సంసారయాతనలు అనుభవించకుండా చూడటం ఆ గురువు కర్తవ్యం.

వేదవ్యాసుని కథ:

వేదవ్యాస మహర్షి మానవ జాతికే గురువని తెలుసుకదా? శ్రీహరి అంశతో సత్యవతీ, పరాశరునికి జన్మించిన కృష్ణ దెై్వపాయనుడే వ్యాసుడు. ఈయన వల్లే కురువంశం అభివృద్ధి చెందింది. తల్లి కోరికపై దృతరాష్టుని, అంబాలికకు పాండు రాజుని, అంబిక దాసికి విదురుని ప్రసాదించినాడు.పాండవాగ్రజుడైన ధర్మరాజుకి ప్రతిస్మృతిని ఉపదేశించింది వ్యాసుడే! దానిని ధర్మరాజు ద్వారా అర్జునుడు ఉపదేశం పొంది దేవతలను మెప్పించి అస్త్రశసా్తల్రు పొందాడు.కురుపాండవ చరిత్ర ఖ్యాతి పొందేట్లుగా మూడు సంశ్ర…మించి జయం అనే పేరు మీద వారి గాథలు గ్రంథస్థం చేసాడు వ్యాసుడు. ఆ జయమే మహా భారతమైంది. అష్టాదశ పురాణాలు వ్రాసింది వ్యాసుడే! భాగవాతాన్ని రచించాడు.

వేదాలను నాలుగు భాగాలుగా విభజించి దైలుడనే శిష్యునికి ఋగ్వేదాన్ని, వైశాంపాయనునికి యజుర్వే దాన్ని; జైమినికి సామవేదాన్ని; సుమంతునికి అధర్వణ వేదాన్ని తెలియజేసి వ్యాప్తి చేయించాడు. తాను వ్రాసిన పురాణాతిహాసాలు సుతునికి చెప్పి ప్రచారం చేయించాడు. పరమేశ్వరుని దయతో వ్యాసునికి పుత్రుడు జన్మించాడు. ఒక రోజు వ్యాసుడు తన ఆశ్రమంలో అరణి మధిస్తుండగా ఘృతాచి అనే అప్సరస కనబడింది. ఆమె అందానికి చలించిన వ్యాసుని వీర్యస్కలనం కాగా అందుండే శుకుడు జన్మించాడు. ఆ బాలునికి వ్యాసుడు దివ్యబోధలు చేసాడు. సృష్టి్ట క్రమం, యుగధర్మాలు, వర్ణాశ్రమ ధర్మాలు తెలియజేసి జ్ఙానిగా మార్చాడు.

ప్రాచీన గాథలు, గత కల్పాలలో జరిగిన చరిత్రలు, సృష్టికి పూర్వం అనేక సృష్టులలో జరిగిన విశ్వం యొక్క పూర్వ వృత్తాంతం మన పురాణాల్లో నిగూఢంగా నిక్షిప్తమయినాయి. ఎవరు వాటిని అర్ధం చేసుకోవాలన్నా, ఇతరులకి చెప్పాలన్నా అంతరార్ధాలతో బోధించాలన్న వ్యాస మహర్షి అనుగ్రహం అత్యవసరం. వ్యాస మహర్షి అంశ లేనిదే ఎవరూ పురాణ గాథల్ని చెప్పలేదు, చదవలేదు.అందుకే వ్యాసపూర్ణిమ నాడు వ్యాస పూజను తప్పక చేయాలంటారు. ఈ పర్వము యతులకు అతి ముఖ్యం! వ్యాస పూర్ణిమ పర్వాన్ని ఆదిలో శంకరాచార్యులు ఏర్పాటు చేశారని చెబుతారు.

పూజా విధానం (వ్యాస పూజ / గురు పూజా విధానం)...

కొత్త అంగవస్త్రం మీద (భూమి మీద పరచి) బియ్యం పోస్తారు. ఆ బియ్యంపైన నిమ్మ కాయలు ఉంచు తారు. శంకరులు, అత ని నలుగురు శిష్యులు వచ్చి దానిని అందుకుంటారని నమ్మకం. పూజ అయ్యాక ఆ బియ్యం తీసుకెళ్ళి పిడికిడు చొప్పున తమ ఇళ్లల్లో బియ్యంలో కలుపు తారుట. బియ్యం, కొత్త వస్త్రం లక్ష్మీ చిహ్నం. నిమ్మపళ్ళు కార్యసిద్ధికి సూచన. బియ్యం, నిమ్మపళ్ళు లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. దక్షిణాదిన కుంభ కోణంలో, శృంగేరీలో శంకర మఠాలలో వ్యాసపూర్ణిమ ఎంతో వైభవంగా జరుపుతారు.

ఎంతో మంది ఋషులున్నా వ్యాసుని పేరిటే ఎందుకు జరుగుతుంది అంటే, ఈ పూజలో ప్రత్యేక పూజలు పొందే ఆది శంకరులు వ్యాసుని అవతారమని అంటారు. సన్యాసులంతా ఆది శంకరుని తమ గురు వుగా ఎంచుకుంటారు. అయితే ఈ రోజున సన్యాసులంతా వ్యాసుని రూపంలో వున్న తమ గురువుని కొలుస్తున్నారన్న మాట!వైష్ణవ పురాణం దానం చేస్తే ఆషాఢ పూర్ణిమనాడు విష్ణులోకం పొందుతారుట. వ్యాసుడు సకల కళా నిధి, సకల శాస్త్రవేత్త, శస్త్ర చికిత్సవేది, మేధానిధి, వైద్యవరుడు, ఆత్మవిద్యానిధి, వైద్య విద్యానిధి.ఈ రోజున అష్టాదశ పురాణ నిర్మాత అయిన వ్యాసుని తప్పక పూజించాలి.

వ్యాస పూర్ణిమ నాడు ఈ శ్లోకాన్ని పఠించాలి.

శో: శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం
సూత్ర భాష్యవృతా వందే భగవంతౌ పునః పునః
అని పఠిస్తే బ్రహ్మత్వసిద్ధి కలుగును!

ఆషాఢ పూర్ణిమ ప్రత్యేకతలు...

ఈ రోజు గురు పూర్ణిమతో పాటుగా కోకిలా వ్రతం, మహాషాఢి అని, వ్యాస పూజ, శివశయనోత్సవం, జితేంద్రరాయ జాతర. ఆ, కా, మా, వై పూర్ణిమలో మొదటిదైన ఆషాఢ పూర్ణిమ స్నానం... ఎన్నో వున్నాయి. కోకిలా వ్రతం విచిత్రంగా వుంటుంది, ఈనాడు సాయంకాలం నది స్నానం చేసి తెలకపిండితో కోకిల ప్రతిమ చేసి పూజ చేయాలి. నెల రోజులు పాటు అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరు చేసినా అందమైన భాగస్వామి దొరుకుతాడని అంటారు. కోకిల, తెలకపిండి ప్రధానంగా కావాలి. ఆషాఢంలో తెలకపిండి తీసుకోవాలి, కోకిల వలస వెళ్ళిపోతుంది. కోకిలాదేవి ద్రుపదుని భార్య.

కోకిలా వ్రతం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది

సద్గుణ సంపన్నురాలైన యువతి భార్యగా లభించడం కోసం యువకులు, తల్లిదండ్రులను మరిపించే ప్రేమానురాగాలను అందించే యువకుడిని భర్తగా పొందాలని యువతులు ఆశిస్తుంటారు. వాళ్ల కోరిక నెరవేరాలంటే 'కోకిలా వ్రతం' చేయాలని శాస్త్రం చెబుతోంది.

సాధారణంగా ఆడపిల్లలు తల్లిదండ్రుల దగ్గర కాస్త గారాబంగా పెరుగుతుంటారు. అంతటి అపురూపంగా పెంచుకున్న తమ కూతురికి ఎలాంటి భర్త లభిస్తాడోనని వాళ్లు ఆందోళన చెందుతుంటారు. ఆమెకి తగిన జోడీని వెతకడంలో తాము పొరపాటు పడకుండా చూడమని దైవాన్ని కోరుతుంటారు.

ఇక యువకుడి విషయానికి వచ్చేసరికి అతని గురించి కూడా తల్లిదండ్రులు అదే విధంగా ఆలోచిస్తూ వుంటారు. తమ తరువాత ఆ కుటుంబాన్ని చక్కదిద్దవలసిన బాధ్యత కోడలికే వుంటుంది కనుక, ఉత్తమురాలైన అమ్మాయి తమకి కోడలిగా లభించేలా చేయమని దేవుడిని ప్రార్ధిస్తుంటారు. ఎందుకంటే సరైన తోడు దొరక్కపోతే అది ఒక జీవితకాలపు శిక్షగా మిగిలిపోతుందని ఇరు కుటుంబాలవాళ్లు భావిస్తుంటారు.

మరి జీవితాన్ని అనూహ్యమైన మలుపుతిప్పే వివాహం విషయంలో అంతా మంచే జరగాలంటే ' కోకిలా వ్రతం' చేయాలని శాస్త్రం చెబుతోంది. 'ఆషాఢ శుద్ధ పౌర్ణమి' మొదలు తెలక పిండితో ప్రతిరోజు కోకిల ప్రతిమను తయారుచేస్తూ, నెలరోజులపాటు దానిని పూజించాలనేది ఈ వ్రతం చెబుతోంది. ఈ వ్రతానికి సంబంధించి వివరాలు తెలుసుకుని, నియమబద్ధంగా ఆచరించడం వలన ఆశించిన ప్రయోజనం లభిస్తుంది.

Friday, July 20, 2018

తొలి ఏకాదశి

హిందువులకు అతి ముఖ్యమైన, పవిత్రమైన తిథి ఏకాదశి. మేరుపర్వతమంత పాపాన్నికూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగింది ఏకాదశి వ్రతం.
ఏకాదశినాడు చేసే పూజలు, జపతపాలు, స్నానం దానం ఇలా ఏ ఒక్క పుణ్యకార్యమైనా అఖండమైన ఫలితాన్నందిస్తుంది. వ్యాసమహర్షి అందించిన పురాణాలను శౌనకాది మునులందరికీ విశదపరచిన సూతుడే నైమిశారణ్యంలో ఏకాదశిగురించి కూడా చెప్పినట్టు నారద పురాణం తెలియజేస్తోంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఏకాదశిని ‘హరివాసరము’ అని కూడా అంటారు.

పూర్వం కుంబుడు అనే రాక్షసుడు వాని కుమారుడు మృదుమన్యుడు అచంచలమైన శివభక్తితో అనేక వరములు సంపాదించుకున్నారు. అలాగే స్ర్తి, పురుషులనుండి గాని ఏ ఇతర ప్రాణినుండిగాని తనకు మరణం లేకుండా వరాన్ని కోరుకున్నారు. అయితే మరణం అనేది అనివార్యం కాబట్టి ఆ వరం కుదరదని, ఒక అయోనిజ అయిన స్ర్తి చేత తప్ప ఇంకెవరివల్లను మరణం లేకుండా వరాన్నిచ్చాడు శివుడు. అయోనిజ ఉద్భవించడం ఎలాగూ సాధ్యంకాదు. కాబట్టి ఇక తమకు మరణం లేదన్న గర్వంతో విర్రవీగుతూ సకల జనులను బాధపెట్టసాగారు. వారు చివరకు త్రిమూర్తులను కూడా జయించే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిలో త్రిమూర్తులు తమ భార్యలతో పాటు వెళ్ళి ఉసిరిక వృక్షం తొర్రలో దాక్కొనవలసి వచ్చింది. అందరూ ఆ తొర్రలోనే ఇరుక్కున్నందువలన ఆ రాపిడికి ఒక కన్య ఉద్భవించింది. ఇంతలోనే రాక్షసుడు త్రిమూర్తులను వెతుక్కుంటూ అక్కడకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో తొర్రలోనుండి వచ్చిన కన్య రాక్షసుని సంహరించింది. ఇలా దుష్ట సంహారం చేసి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగించింది కాబట్టి మహావిష్ణువుకు ఇష్టురాలయ్యింది. ఆ బాలికే ఏకాదశి అని ప్రతి పక్షంలోను పదకొండవ రోజు ఆమెను స్మరించుకొని శ్రీమన్నారాయణుని పూజిస్తే సకల పాపహరణమని పురాణాలు చెప్తున్నాయి.

మరో కథనం ప్రకారం, కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు ఎన్నో వరాలను సంపాదించి ఆ వరగర్వంతో మునులను, దేవతలను హింసిస్తూ చివరకు ఇంద్రుడు, బ్రహ్మలను కూడా వారి స్థానాలనుండి వెళ్ళగొట్టాడు. వారందరి బాధ తీర్చడానికి విష్ణువు మురాసురునితో తలపడ్డాడు. వెయ్యేళ్ళు యుద్ధం చేసినా రాక్షసుని నిర్జించలేకపోయాడు. మహావిష్ణువు చివరకు అలసటతో ‘సింహావధ’ అనే గుహలో దాక్కున్నాడు. విష్ణువును వెతుక్కుంటూ వచ్చాడు రాక్షసుడు. ఆ సమయంలో విష్ణువు తన శరీరం నుండి ఒక బాలికను ఉద్భవింపజేసి మురాసురునిపైకి వదిలాడు. ఆ బాలిక రాక్షసునితో యుద్ధం చేసి సంహరించింది. ఆమే ఏకాదశి.

తనకు ఈ విధంగా రాక్షస సంహారంతో సంతోషం కలిగించినందుకు ఫలితంగా వరం కోరుకొమ్మన్నాడు విష్ణుమూర్తి. దానికా బాలిక ఏకాదశి ‘‘శ్రీమన్నారాయణా! సర్వతిథులలోను నేను ప్రముఖంగా పూజించబడాలి. ఎల్లవేళలా నేను నీకు ప్రియమైనదానిగా ఉండాలి. నా తిథిలో ఉపవాసం ఉండి వ్రతం ఆచరించినవారు మోక్షాన్ని పొందాలి’’ అని అడిగింది. ఆ వరానిచ్చాడు విష్ణువు. ఇలా ఏకాదశి తిథి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్టు భవిష్యపురాణం చెప్తోంది. ఏకాదశులన్నింటిలోకి అత్యంత ప్రధానమయినది తొలి ఏకాదశికి.

ఈ ఆషాడమాసంలోని ఏకాదశే తొలి ఏకాదశి ఎలా అయిందిఅంటే
పూర్వకాలంలో వర్షఋతువే ప్రథమ ఋతువుగా ఆషాఢమాసంతోనే సంవత్సరం ప్రారంభమయ్యేదట. అలా ఆషాఢంలో వచ్చిన ఏకాదశి తొలి ఏకాదశి అయింది. తొలి ఏకాదశినేశయనైకాదశి అనీ అంటారు. ఈ ఏకాదశి రోజునే శ్రీ మహావిష్ణువు పాలకడలిలో నిద్రకు ఉపక్రమిస్తాడు. దానివల్ల ఈ ఏకాదశి శయనైకాదశి గా పేర్గాంచింది.

ఈ తొలి ఏకాదశి రోజున గోపద్మ వ్రతాన్ని ఆచరించాలని పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజు ఆవుల కొట్టాన్ని శుభ్రం చేసి కొట్టం మధ్యలో ముప్ఫైమూడు పద్మాలను వేసి మధ్యలో లక్ష్మీనారాయణులను ఉంచి పూజించాలి. గంధపుష్పాలతో అర్చించాలి. ఇలా సంవత్సరం రోజులు చేసి వాయనాలతో దక్షిణతాంబూలాలనిచ్చి వ్రత ఉద్యాపనచేయాలి.

Thursday, July 5, 2018

వటసావిత్రీ వ్రతం


సకల సౌభాగ్యాలను ప్రసాదించడంతో పాటూ వైధవ్యం నుంచి కాపాడేవ్రతం - ‘వటసావిత్రీ వ్రతం’. దీనిని జ్యేష్ఠ శుధ్ధ పూర్ణిమనాడు ఆచరించాలి. ఆ రోజు వీలుకాకపోతే జ్యేష్ఠబహుళ అమావాస్యనాడు ఆచరించవచ్చు. పూర్వం నారద మహర్షి సావిత్రికి ఈ వ్రతాన్ని గురించి వివరించినట్లు కథనం.

ఈ వ్రతాచరణ వెనుక ఆసక్తికరమైన గాథ ప్రచారంలో ఉంది. పూర్వం అశ్వపతి, మాళవి దంపతులకు ‘సావిత్రి’ అనే కుమార్తె వుండేది. యుక్తవయస్కురాలెైన సావిత్రికి నీకు ఇష్టమైనవాడిని వరించమని తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. రాజ్యం శత్రువులపాలు కావడంతో అరణ్యంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తోన్న ద్యుమత్సేనుడి కుమారుడెైన సత్య వంతుని వివాహమాడతానని తల్లిదండ్రులకు తెలిపింది. సత్య వంతుడి ఆయుష్షు మరో సంవత్సరమేనని నారదుడు చెప్పినప్ప టికీ, సావిత్రి పట్టుపట్టడంతో సత్యవంతుడితోనే వివాహం చేశా రు. మెట్టినింట చేరి భర్త, అత్తమామలకు సేవ చేయసాగింది. సత్యవంతుడు ఒకనాడు యజ్ఞ సమిధలు, పుష్పాలకోసం అడ వికి బయలుదేరగా, సావిత్రీ భర్తను అనుసరించింది. సమిధుల ను కోసి చెట్టు దిగిన సత్యవంతుడు తలభారంతో సావిత్రి ఒడి లో తలపెట్టుకుని పడుకున్నాడు. నారదుడు చెప్పిన సమయం ఆసన్నమైనదని సావిత్రి గుర్తించింది.

కొద్దిసేపటికి యముడు తన దూతలతో వచ్చి సత్యవంతుడికి యమపాశం వేసి తీసుకుని పోసాగాడు. సావిత్రి కూడ తన భర్తను అనుసరించి వెళ్ళసాగిం ది. యముడు వారించినప్పటికీ భర్త వెంటే తనకూ మార్గమని చెప్పి వెళ్తూండడంతో ఆమె పతి భక్తిని మెచ్చిన యముడు సావి త్రిని వరం కోరుకోమన్నాడు.

‘మామగారికి దృష్టి ప్రసాదించండి’ అని ఓ వరాన్ని కోరింది, యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తుండడంతో, యముడు మరో వరాన్ని కోరుకోమన్నా డు. మామగారు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి ప్రసా దించమని కోరింది, యముడు ప్రసాదించాడు. అయినా సావిత్రి వెంట వస్తూండడంతో, ఆమె పతిభక్తిని మెచ్చి మూడో వరం కోరుకోమనగా - ‘నేను పుత్రులకు తల్లిని అయ్యేట్లు వరాన్ని ప్రసాదించండి’ అని కోరింది. యముడు సావిత్రి పతిభక్తిని మెచ్చి ఆ వరాన్ని ప్రసాదించాడు. సావిత్రి అడవిలో వటవృక్షం కింద ఉన్న భర్త శరీరం వద్దకు చేరింది. భర్త లేచి కూర్చోగా, వటవృక్షం వరకు పూజ చేసి భర్తతో సహా రాజ్యానికి చేరినట్లు కథ నం. వటవృక్షాన్ని, సావిత్రిని పూజిస్తూ చేసి ‘వట సావిత్రి వ్రతం’ అమల్లోకి వచ్చినట్లు పురాణ కథనం.

వ్రత విధానం

ఈ వ్రతం నాడు స్ర్తిలు వేకువ జామునే నిద్ర లేస్తారు. భక్తిశ్రద్ధలతో తలారా స్నానం చేస్తారు. కొత్త దుస్తులు ధరించి, చుట్టుపక్కల వారితో కలసి ఏటి ఒడ్డుకు వెళతారు. అక్కడ కడవలతో నీటిని సేకరించుకుని, సమీపంలో ఉన్న మర్రి చెట్లు దగ్గరికి వెళతారు. ముందు ఆ నీటితో మర్రిచెట్ల మూలాగ్రాన్ని శుభ్రం చేస్తారు. అనంతరం పసుపు, కుంకుమలు అద్ది, చెట్టుకుముందు అందమైన ముగ్గులు వేస్తారు. కొబ్బరికాయలు, అరటి పళ్ళు, ఇతర పిండివంటలు నైవేద్యం పెట్టి అనంతరం నూలు దారంపోగుల్ని చెట్టుమొదలు చుట్టూ కడతారు. అనంతరం చెట్టు చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేసి, తమ భర్తలు పది కాలాలపాటు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. తమ అభీష్టాలు నెరవేరాలని కోరుకుంటూ ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. ప్రశాంతతకు, శాంతికి చిహ్నంగా భావిస్తున్న వట (మర్రి) వృక్షాన్ని సాక్షాత్తు దైవస్వరూపంగా భావించి పూజలు చేస్తారు. అత్యంత పవిత్రమైన వృక్షరాజంగా పేర్గాంచిన మర్రిచెట్టును బోధి వృక్షంగా కూడా పిలుస్తారు. బౌద్ధులు ఈ వృక్షానికి అత్యంత ప్రాధాన్యతనిస్తారు. గౌతమబుద్ధుడంతటివారు ఈ వృక్షం కిందే జ్ఞానవిముక్తిని పొందాడు. అలాగే బంధవిముక్తుడయ్యింది కూడా ఈ చెట్టు కిందే కావడంవల్ల ఈ వృక్షానికి అత్యంత ప్రాధాన్యం పెరిగింది. ఈ పూజలో భాగంగా వటవృక్షం కొమ్మలు విశాలంగా విస్తరించి, సేద తీరాలని కోరుకునే వారందరికీ నీడనిచ్చి, ఈ వృక్షానికి మల్లే తన భర్త కూడా కుటుంబ సభ్యులందరికీ, నీడనివ్వాలని మనసా వాచా కోరుకుంటారు. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో కొత్తగా పెళ్ళయిన యువతులతో ఈ వ్రతం చేయిస్తారు. ఈ సందర్భంగా మిఠాయిలు, పిండి వంటలు, ప్రసాదాలు తయారుచేస్తారు. వ్రతం సందర్భంగా బంధుమిత్రుల్ని ఆహ్వానించి, ఘనంగా పూజాది వేడుకలు నిర్వహిస్తారు.

వట సావిత్రి వ్రతం ప్రాచీన భారతం అయిన ‘మిథిల’లో ప్రాచుర్యం పొందినట్లు చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ఈ వ్రతం ఆచరించే స్ర్తిలు మర్రిచెట్టుకు పూజలు చేసిన అనంతరం ఉపవాస దీక్షలు నిర్వహిస్తారు. తమ కోర్కెలకనుగుణంగా కొంతమంది ఒక రోజు, మరికొంతమంది ఒక పూట చొప్పున ఉపవాస దీక్ష చేసి, వ్రతం జరుపుకుంటారు. తమ భర్తల ఆరోగ్యాన్ని కాపాడి, మరో పది కాలాలపాటు మర్రిచెట్టులా కుటుంబమంతటికీ నీడనివ్వాలని, సాగించే ఈ వ్రతాన్ని జరుపుకోవడం విజ్ఞానపరంగా కూడా ఎంతో మేలైనదని పండితులు చెబుతారు.

వ్రతాన్ని చేసే వారు ముందు రోజు రాత్రి ఉపవాసం ఉం డాలి. వ్రతం రోజు తెల్లవారుఝామునే నిద్రలేచి తలస్నా నం చేసి, ఇంటిని శుభ్రపరిచి, దేవుడిని స్మరించుకుని, పూజావస్తువులను తీసుకుని వటవృక్షం (మర్రి) చెట్టు వద్దకు వెళ్ళి, చెట్టు మొదలు వద్ద అలికి ముగుగ్లు వేసి, సావిత్రీ సత్యవంతులను ప్రతిష్టించాలి. వారి చిత్రపటాలు దొరకపోతే పసుపుతో చేసిన బొమ్మలనుగానీ ప్రతిష్టించు కోవాలి.

మనువెైధవ్యాదిసకలదోషపరిహారార్థం బ్రహ్మసావిత్రీ ప్రీత్యర్థం
సత్యవత్సావిత్రీ ప్రీత్యర్థంచ వటసావిత్రీ వ్రతం కరిష్యే అనే శ్లోకంతో సంకల్పించాలి.

చెప్ప వలసిన శ్లోకం:

వట మూలే స్తితో బ్రంహ వట మధ్యే జనార్దనః వటాగ్రే తు శివం విద్యాత్ సావిత్రివ్రత సమ్యుత వట సిన్చామితే మూలం సలిలైహి రంరుతోపయైహి ||

ఈ విధముగా మఱ్ఱి చెట్టుకు నీరు పోసి ప్రదక్షణము చేస్తే మీ భర్త అయురరోగ్యములతో వుండి మీకు దీర్ఘ సౌమంగల్యము కలిగేటట్టు అశీర్వాదము లభిన్చును.

మీ గృహములో దేవుని సన్నిధిలో చెప్పుకోవలసిన సంకల్పము

మమ జన్మ జన్మని అవైధవ్యప్రాప్త్యే భర్తుహు చిరాయు రారోగ్య సంపదాది ప్రాప్తి కామనయ సావిత్రి వ్రతం కరిష్యే తర్వాత కలశము స్తాపించి ప్రాణప్రతిష్ఠ వరకు చేసి
అస్మిన్ చిత్ర కలశే వట వృక్షం బ్రమ్హానం సావిత్రిం సత్యవంతం ధర్మరాజం నారదంచ ఆవాహయామి షోడశోపచార పూజలు చేసి కింద చెప్పిన శ్లోకములతో అర్ఘ్యము ఇవ్వవలెను

౧ ఓంకార పూర్వికే దేవి వీణా పుస్తక ధారిణి వేదమాత నమస్తుభ్యం సౌభాగ్యంచ ప్రయచ్చమే
౨ ఓంకార పూర్వికే దేవి సర్వ దుక్ఖ నివారిణి, వేదమాతర్నమస్తుభ్యం అవైదవ్యం ప్రయచ్చమే
౩ పతివ్రతే మహాభాగే వన్హియానే సూచి స్మితే ద్రుడవ్రతే ద్రుడమతే భర్తుస్చ ప్రియవాడిని
౪ అవైధవ్యం చ సౌభాఘ్యం దేహిత్వం మామ సువాతే పుత్రాన్ పౌత్రామ్స్చ సౌక్యంస్చ గృహాణార్ఘ్యం నమోస్తుతే
౫ త్వయా సృష్టం జగత్సర్వం సదేవాసుర మానవం సత్యవ్రతధరో దేవా బ్రమ్హరూప నమోస్తుతే
౬ త్వం కర్మసాక్షి లోకానాం శుభాశుభ విశేషకః గృహాణార్ఘ్యం ధర్మరాజ వైవస్వత నమోస్తుతే
౭ అవియోగ యథా దేవా సావిత్ర్యా సహితస్య చ అవియోగాస్థథాస్మాకం భూయాత్ జన్మని జన్మని

తర్వాత వినాయకుడు, సావిత్రీసత్యవంతులు, యమధర్మరాజు, బ్రహ్మదేవుడు, వటవృక్షాన్ని పూజించాలి. వట వృక్షమూలంతో బ్రహ్మ, మధ్యభాగంలో విష్ణువు, అగ్రంలో శివుడు ఉంటారు కనుక త్రిమూర్తులను పూజించిన ఫలం కలుగుతుంది. పూజానంతరం ‘నమోవెైవస్వతాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ వటవృక్షానికి దారాన్ని చుడుతూ, 108 ప్రదక్షిణలు చేసి నెైవేద్యం సమర్పిం చడంతో పాటూ ముతె్తైదువులకు, బ్రాహ్మణుడికి దక్షిణ తాంబూలాలను సమర్పించాలి. ఇలా మఱ్ఱిచెట్టు చుట్టూ దారాన్ని చుట్టడం వల్ల మఱ్ఱి చెట్టు యొక్క దీర్ఘాయుర్దాయంతో, తన భర్త ఆయుర్దాయాన్ని బంధించినట్లవుతూ తన ఐదవతనం వర్థిల్లుతుందనేది ప్రతి స్ర్తీమూర్తి కోరిక.

కొందరు స్ర్తీలు ఈపండుగను పూర్ణిమనాడు మాత్రం అనుసరిస్తుంటారు. మూడు రోజుల పాటు ఈ పర్వాన్ని అనుసరించే స్ర్తీలు, త్రయోదశి ఉదయాన్నుంచి, పెైర్ణమి నాడు సాయంకాలం వరకు ఉపవసిస్తారు. పూర్తిగా నిరాహారంగా ఉండలేని వారు నీళ్ళు, పాలు, తేనీరు, పళ్ళు పుచ్చుకోవచ్చు.

అయితే ఈ వ్రతాన్ని మనదేశంలో ఒక్కొక్క ప్రాంతములో ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. కొంతమంది పూర్ణిమ నాటి మధ్యాహ్నం పురోహితునితో సావిత్రి కథను చెప్పించుకుంటారు. పురోహితుని ద్వారా కథను వింటే తప్ప ఆ వ్రతానికి ఫలం దక్కదని కొంతమంది నమ్మకం. ఇలా వటసావిత్రి వ్రతవిధానాన్ని చేయవచ్చు.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...