Saturday, September 29, 2018

పృధ్వీ స్తోత్రం

అత్యంత పుణ్యప్రదమైన పృథివీ స్తోత్రమును భూపూజ చేసి పఠించినచో కోటి జన్మలలో చేసిన పాపమంతయు నాశనమగును. అతడు చక్రవర్తిగా కూడా కాగలడు. అట్లే ఈ స్తోత్రమును పఠించినందున భూమి దానము చేసిన పుణ్యమును పొందును. ఇతరులకు దానము చేయబడిన భూమిని అపహరించినందువలన కలుగు పాపము తొలగును. భూమిని త్రవ్వినచో కలుగు పాపము. దిగుడు బావులలో మైల అంటుకొనిన పాదములనుంచి కడుగుకొనినచో కలుగు పాపము, ఇతరులు ఇంటిలో శ్రాద్ధము చేసినందువలన కలుగు పాపము, భూమిపై వీర్య త్యాగము చేసినందువలన, దీపాది ద్రవ్యములనుంచి నందువలన కలుగు పాపములన్నితొలగును. అంతేగాక ఈ స్తోత్రమును పఠించినందువలన నూరు అశ్వమేధయాగములు చేసినచో కలుగు ఫలితము లభించును.

జయజయే జలా ధారే జలశీలే జలప్రదే l
యజ్ఞ సూకరజాయే త్వం జయందేహి జయావహే ll

మంగళే మంగళా ధారే మంగళ్వే ప్రదే l
మంగళార్ధం మంగళేశే మంగళం దేహి మే భవే ll

సర్వాధారే చ సర్వజ్ఞే సర్వశక్తి సమన్వితే l
సర్వకామప్రదే దేవి సర్వేష్టం దేహి మే భవే ll

పుణ్యస్వరూపే పుణ్యానాం బీజరూపే సనాతని l
పూణ్యాశ్రయే పుణ్యవతా మాలయే పుణ్యదే భవే ll

సర్వసస్యాలయే సర్వసస్యాఢ్యే సర్వసస్యదే l
సర్వ సస్యహరేకాలే సర్వసస్మాత్మికే భవే ll

భూమే భూమిప సర్వస్వే భూమిపాలపరారుణే l
భూమిపానాం సుఖకరే భూమిం దేహి చ భూమిదే ll

ఇదంస్తోత్రం మహాపుణ్యం ప్రాతరుత్థాయ యః పఠేత్‌ l
కోటిజన్మసు సభవే ద్బలవాన్బూ మిపేశ్వరః ll

భూమి దానకృతం పుణ్యం లభ్యతే పఠనా జ్జనైః.

Tuesday, September 25, 2018

పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం... మహాలయం

భాద్రపదమాసంలోని బహుళపక్షం పితృదేవతలకు ప్రీతిపాత్రమైన కాలం. అందుకే దీనిని పితృపక్షం అంటారు. భాద్రపద బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకు మొత్తం పదిహేను రోజులూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధవిధులను నిర్వర్తించాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు ఆత్మశాంతి చేకూరుతుందని శాస్త్రవచనం.

ప్రతి సంవత్సరం నిర్వహించే తద్దినాల కన్నా అతిముఖ్యం ఈ పక్షం. ఈ పక్షమంతా తర్పణలు చేయలేనివారు కనీసం ఒక మహాలయమైనా చేసి తీరాలి. గతించిన తల్లిదండ్రులకు తద్దినాలు పెట్టే అలవాటు లేనివారు సైతం ఈ మహాలయపక్షాలలో తర్పణలు వదిలి, వారి పేరు మీదుగా అన్నదానం చేసినట్లయితే పితృదేవతలకు ఉత్తమగతులు కలిగి సంతుష్టి పొందుతారు. వారి ఆశీస్సులతో సకలశుభాలూ కలుగుతాయి. ఈ విధానాన్ని పాటించడానికి శక్తి లేదా స్థోమత లేనివారు ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, పండ్లు, దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణునికి స్వయంపాకం సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల పితృదేవతలకు ఆకలిదప్పులు తీరి తమ వంశస్థులను సుఖశాంతులతో వర్ధిల్లమని ఆశీర్వదిస్తారు. మన పితరుల ఆత్మకు శాంతి కలిగినప్పుడే ఇహలోకంలో మనకు శాంతిసౌఖ్యాలు లభిస్తాయనీ, వంశాభివృద్ధి కలుగుతుందని ప్రామాణిక శాస్త్రగ్రంథాలయిన ధర్మసింధు, నిర్ణయసింధు చెబుతున్నాయి.

ఎంతో దానశీలుడిగా పేరుపొందిన కర్ణుడు కోరినవారికి కాదనకుండా ధన, కనక, వస్తు, వాహన రూపేణా భూరిదానాలు చేశాడు. అయితే అన్నిదానాలలోనూ మిన్న అయిన అన్నదానం మాత్రం చేయలేదు. దాని ఫలితంగా మరణానంతరం ఆయన ఆత్మ ఆకలిదప్పులు తీరక ఆర్తితో అలమటించవలసి వచ్చింది. అప్పుడు దేవతలందరి అనుమతితో తిరిగి భూలోకానికి వచ్చి పక్షం రోజులపాటు ఉండి, కురుక్షేత్ర సంగ్రామంలో అసువులు బాసిన తన జ్ఞాతులకు అంటే దాయాదులకు, సైనికులకు తదితరులందరికీ తర్పణలు వదిలి తన రాజ్యంలోని పేదసాదలకు, పెద్దఎత్తున అన్నసంతర్పణలు చేసి, తిరిగి అమావాస్యనాడు స్వర్గానికి వెళ్లాడు. కర్ణుడు భూలోకంలో ఉన్న ఈ పక్షం రోజులకే మహాలయపక్షాలని పేరు. శాస్త్రరీత్యా ఈ పదిహేను రోజులూ ఎటువంటి శుభకార్యాలూ నిర్వర్తించకూడదు.

స్వర్గస్థులైన తల్లిదండ్రులకు, పితామహులకు, మాతామహులకు, (తల్లిదండ్రుల జననీ జనకులు) తల్లిదండ్రుల తోబుట్టువులకు, గురువులకు, జ్ఞాతులకు, తోడబుట్టినవారికి, అత్తమామలకు, స్నేహితులకు, గురుపత్నికి, స్నేహితునికి, అతని భార్యకు..... వీరిలో వారసులు లేకుండా మృతి చెందినవారికి ప్రాముఖ్యతనివ్వాలి. అదేవిధంగా వివిధ ప్రమాదాలలో అకాల మరణం చెందిన వారికోసం కూడా తర్పణ విడిస్తే మంచిది.

లౌకికంగా కూడా... అసలు ఈ తర్పణలు, తిలోదకాలు ... వంటి వైదికపరమైన ఆచారాలు, సంప్రదాయాల మీద నమ్మకం లేనివారు కూడా కనీసం ఏడాదిలో ఒక్కసారైనా చనిపోయిన తల్లిదండ్రులను లేదా తాతముత్తాతలను తలచుకుని, మనం ఏ అన్నాన్నయితే తింటున్నామో, దానినే... అర్హులయిన పేదలను ఎంచుకుని వారికి సంతృప్తి కలిగేలా భోజనం పెడితే... వారికి కడుపు, మనకు గుండె నిండుతుంది. ఎందుకంటే ఎంత ఉన్నవారైనా, వస్త్రదానం, ధనదానం తదితర ఏ రకమైన దానాలు చేసినప్పటికీ, ఆయా దానాలు పుచ్చుకునేవారు మాత్రం మొహమాటానికి చాలని చెప్పినా, మనసులో మాత్రం ‘వీరికి అంత ఉంది కదా, మరికొంచెం ఇస్తే బాగుండును’ అనిపిస్తుంది. అదే అన్నదానంతో మాత్రం కడుపు నిండా తిన్న తరువాత తృప్తి పడి ‘ఇక చాలు’ అని అనాల్సిందే. అందుకే అన్ని దానాలలోకీ అన్నదానమే మిన్న అని శాస్త్రం చెప్పింది. ఈ పక్షంలో మిగిలిన కొద్దికాలాన్నైనా ఈ రీతిగా సద్వినియోగం చేసుకోవడం మంచిది.

మహాలయపక్ష తిథులలో శ్రాద్ధకర్మలు చేస్తే వాటి ఉపయోగాలు.

తిథి ఉపయోగాలు

పాడ్యమి ధన సంపద
విదియ రాజయోగం, సంపద
తదియ శతృవినాశనం
చతుర్థి ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి
పంచమి ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి
షష్టి శ్రేష్ఠ గౌరవం
సప్తమి యజ్ఞం చేసిన పుణ్యఫలం
అష్టమి సంపూర్ణ సమృద్ధి, బుద్ధి ప్రాప్తి
నవమి అంతులేని సంపద
దశమి ధాన్య , పశు సంపద వృద్ధి
ఏకాదశి సర్వశ్రేష్ఠదాన ఫలం
ద్వాదశి సమాజ అభివృద్ధి, ఆహార భద్రత
త్రయోదశి ఐశ్వర్యం, దీర్ఘాయువు, సంపూర్ణ ఆరోగ్యం
చతుర్థశి శతృభయం నుండి విముక్తి

అమావాస్య అన్ని కోరికలు నెరవేరుతాయి

శ్రాద్ధ కర్మలలో స్వధాదేవి నామాన్ని ఉచ్చరిస్తే సర్వపాపాల నుండి విముక్తి లభిస్తుంది

బ్రహ్మ దేవుని యొక్క పెద్దకుమారుడు అగ్ని అని విష్ణు పురాణం లో చెప్పబడి ఉన్నది . అగ్ని దేవుని భార్య పేరు స్వాహా . హోమాలు చేస్తూ లేదా పూజలు చేస్తూ మంత్రాలు చదివేటప్పుడు చివరి లో "స్వాహా " అనడం జరుగుతుంది . ఈ స్వాహా అన్న పదాన్ని ఉచ్చరించేటప్పుడు మనిషి చేసే పూజలు ప్రార్ధనలు, మంత్రాలు అన్ని దేవునికి చేరుతాయి .

అగ్ని దేవునికి 2 తలలు, తలపైన 2 +2 కొమ్ములు, 7 నాలుకలు, 7 చేతులు, 3 కాళ్ళు ఉంటాయి. ఈయనకి దక్షిణంలో భార్య స్వదా దేవి, ఎడమ వైపున స్వాహ దేవి ఉంటుంది. దైవ కార్యాల్లో ఈయనకు సమర్పించిన ఆజ్యం హవిస్సు అన్నిటిని స్వాహా దేవి స్వీకరించి ఏ దైవం నిమిత్తం మనం ఆ హోమ౦ చేస్తున్నామో వారికి అందిస్తుంది. అదే విధంగా పితృ కార్యాల్లో స్వదాదేవి తన పాత్ర పోషిస్తుంది.

స్వధాదేవి ధ్యానము, స్తోత్రము వేదములలో చెప్పబడినది.  శరదృతువులోని అశ్వయుజ కృష్ణ త్రయోదశినాడు, లేక మఖా నక్షత్రము నాడు, కానిచో శ్రాద్ద  దినమున స్వధాదేవిని పూజించి శ్రాద్దము నాచరింపవలెను. ఈవిధముగా స్వధాదేవిని రమ్యమైన కలశమున, లేక సాలగ్రామశిల యందు ఆవాహనము చేసికొని ధ్యానించి మూల మంత్రముతో పాద్యము మొదలగు ఉపచారములను సమర్పించవలెను. "ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యైస్వాహా" అను మూలమంత్రముచే ఆమెను పూజించి స్తోత్రము చేసి నమస్కరింపవలెను.

బ్రహ్మదేవుడు, పితృదేవతా గణాలకు శ్రాద్ధ కర్మలలో తర్పణ పూర్వకంగా సమర్పించే పదార్ధాన్ని ఆహారంగా నియమించాడు. బ్రాహ్మణులు తర్పణాలు ఇస్తున్నప్పటికీ పితృదేవతలకు సంతృప్తి కలుగలేదు. ఆ పితృగణాలు బ్రహ్మను ప్రార్ధించగా ఆయన ధ్యాన నిమగ్నుడై మానస పుత్రికను సృష్టించి, ఆమెను గుణవతిగా , విద్యావతిగా తీర్చిదిద్ది , ఆ కన్యకు "స్వధాదేవి" అని నామకరణం చేసాడు. పితృదేవతలకు పత్నిగా స్వధా దేవిని నియమించాడు. ఆనాటి నుండి పితృదేవతలు, మహర్షులు,విప్రులు ,మానవులు "స్వధాదేవి"ని పూజిస్తూ, ఆమె అనుగ్రహంతో పితృదేవతలను సంతృప్తి పరుస్తూ వచ్చారు.

"బ్రాహ్మణో మానసీం శశ్వత్సుస్థిర యౌవనాం |
పూజ్యానాం పితృ దేవానాం శ్రద్దానాం ఫలదాం భజే "||

అని స్వధాదేవిని ప్రార్ధిస్తూ ఉంటారు.

పరాశక్తి అంశావతారంగా స్వధాశక్తి ఆవిర్భవించి, పితృదేవతలకు సంతృప్తిని ప్రసాదించింది. శ్రాద్ధ కర్మలలో, బలితర్పణాల్లొ,తీర్ధస్నానాల్లో స్వధాదేవి నామాన్ని ఉచ్చరిస్తే సర్వపాపాల నుండి విముక్తి లభిస్తుందని వ్యాసమహర్షి వివరించాడు.

స్వధాదేవి స్తోత్రం

స్వధోచ్చారణమాత్రేణ తీర్ధస్నాయీభవేన్నరః ı
ముచ్యతే సర్వపాపేభ్యో వాజపేయ ఫలంలభేత్ ıı

స్వధా స్వధా స్వధేత్యేవం యది వారత్రయం స్మరేత్ ı
శ్రాద్దస్య ఫలమాప్నోతి తర్పణస్య  జిలైరపి ıı

శ్రాద్దకాలే స్వధా స్తోత్రం యః శృణోతి సమాహితః ı
సలభేట్ శ్రాద్ద శంభూతం ఫలమేవన సంశయః ıı

స్వధా స్వధా స్వధేత్యేవం త్రిసంధ్యం యః పఠేన్నరః ı
ప్రియాంవినీతాం సలభేత్ సాధ్వీం పుత్రగుణాన్వితామ్ ıı

పితౄణాం ప్రాణతుల్యాత్వం ద్విజజీవన రూపిణీ ı
శ్రాద్దాదిష్ఠాతృ దేవీచ శ్రాద్దాదీనాం ఫలప్రధా ıı

నిత్యాత్వం సత్యా రూపాసి పుణ్యరూపాసిసువ్రతే ı
ఆవిర్భావతిరోభావౌ సృష్టౌచ ప్రళయేతవ ıı

ఓం స్వస్తిశ్చ నమః స్వాహా స్వధా త్వం దక్షిణాతధా ı
నిరూపితాశ్చతుర్వేదైః ప్రశస్తాః కర్మిణాం పునః ıı

కర్మ పూర్త్యర్దమే వైతా ఈశ్వరేణ వినిర్మితాః ı 
ఇత్యేవ ముక్త్వా సబ్రహ్మా బ్రహ్మలోకే స్వసంసది ıı

తస్ధౌచ సహసాసద్యః స్వధాసా విర్బభూవహి ı
తధా పితృభ్యః ప్రదదౌ తామేవకమలాననామ్ ıı

తాం సంప్రాప్యయయుస్తేచ  పితరశ్చ ప్రహర్షితాః ı
స్వధా స్తోత్ర మిదంపుణ్యంయః శృణోతి సమాహితః ıı

సుస్నాతః సర్వతీర్ధేషు వాంఛితం ఫలమాప్నుయాత్ ıı

Friday, September 14, 2018

మట్టి గణపతి నిమజ్జనం వెనుక దాగి ఉన్న పర్యావరణ పరమ రహస్యం.

వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు. కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్ధం. ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వితీస్తారు. మట్టి తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకు వెళతారు. అలా చేయాలనే ఈ పనిని పెద్దలు పురమాయించారని చెబుతుంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువులు, వాగులు, కుంటలు నిండిపోతాయి. మరీ ఎక్కువగా వానలు పడితే పక్కనే ఊర్లు కూడా మునిగిపోతాయనే ఆలోచన చేసేవాళ్లు. అందుకే అలా జరుగకుండా ఉండాలంటే చెరువులు, కుంటల్లో పూడికలు తీయాలి. నీరు నిల్వ ఉండాలే కానీ అవి ఊర్ల మీద పడకూడదని భావించేవారు. వానల వల్ల మట్టి కొట్టుకెళ్లి చెరువుల్లో చేరిపోతుంటుంది. కాబట్టి ముందుగా పూడిక తీయాల్సిందే. ఆ పని పూర్వం రోజుల్లో గ్రామస్తులే చేసేవారు. అలా చేసేందుకు ఉత్సాహంగా ఆ పని పూర్తి చేసేందుకు మత పెద్దలు వినాయక ప్రతిమలను మట్టితోనే చేయాలన్న నిబంధన పెట్టారు.

విశ్వవ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యమును చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు(లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది. సర్వజీవ సమానత్వమునకు ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ" అని చెప్పాడు

పత్రిపూజ-రహస్యం
గణనాథుడ్ని 21 పత్రితో పూజించడం ఆచారంగా వస్తుంది. అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం కూడా చెబుతోంది. పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవి ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలే కానీ వేరే వాటితో చేయకూడదు. ఔషధపవూతాల నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలిస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైరస్, బాక్టీరియా వంటి వాటి వల్ల ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిదిరోజులు చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు. ఏ మందైనా డాక్టర్ ఇచ్చేటప్పుడు మూడు రోజులో, వారం రోజులో వాడమని చెప్పినట్లుగానే పూర్వీకులు పత్రిలోని ఔషధ గుణాలతో ఊరు బాగుపడాలంటే తొమ్మిది రోజులు పూజలు చేయమని చెప్పారని చెబుతుంటారు.

నిమజ్జనం-అసలు రహస్యం
నవరాత్రుల తర్వాత వినాయక ప్రతిమను సమీపంలోని చెరువులోనో, లేదంటే కుంటలోనూ నిమజ్జనం చేయడం కూడా ఆచారంగానే వస్తుంది. చెరువులు, కుంటలు లేని చోట బావిలోనే నిమజ్జనం చేయవచ్చు. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలిశాక 23 గంటలకు తమలోని ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశిస్తుంది. ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఇదే వినాయక నిమజ్జనం వెనుక దాగి ఉన్న పర్యావరణ పరమ రహస్యం.

Tuesday, September 11, 2018

వివిధ ఆగమ శాస్త్రాల్లోని గణపతులు

ముద్గల పురాణాన్ని అనుసరించి 32 మంది గణపతులు ఉన్నారు.

1. బాల గణపతి 2.తరుణ గణపతి 3.భక్త గణపతి 4.వీర గణపతి

5. శక్తి గణపతి 6.ద్విజ గణపతి 7.సిద్ధ గణపతి 8.ఉచ్చిష్ట గణపతి

9.విఘ్న గణపతి 10.క్షిప్ర గణపతి 11.హేరంబ గణపతి 12.లక్ష్మీ గణపతి

13.మహా గణపతి 14. విజయ గణపతి 15.వృత్త గణపతి

16. ఊర్ద్వ గణపతి 17.ఏకాక్షర గణపతి 18.వర గణపతి 19.త్ర్యక్షర గణపతి 20.క్షిప్ర ప్రసాద గణపతి

21.హరిద్రా గణపతి 22.ఏకదంత గణపతి 23.సృష్టి గణపతి 24.ఉద్ధండ గణపతి

25.ఋణ మోచన గణపతి 26.దుండి గణపతి 27.ద్విముఖ గణపతి 28.త్రిముఖ గణపతి

29.సింహ గణపతి 30.యోగ గణపతి 31.దుర్గా గణపతి 32 .సంకష్ట గణపతి

ఈ గణపతి రూపాల్లో మొదటి 16 గణపతులు చాలా మహిమాన్వితమైనవి. వీటిని "షోడశ'' గణపతులు అంటారు.

నంజనగూడు దేవాలయంలో ఉన్న 32 గణపతి విగ్రహాల పేర్లలో 15 పేర్లు మాత్రమే ఇప్పుడు చెప్పుకున్న పేర్లతో సరిపోలుతున్నాయి. తక్కినవి వేరుగా ఉన్నాయి. ఈ అంశాన్ని మైసూరు ప్రాచ్య పరిశోధనా సంస్థ వెల్లడించిన నివేదిక కూడా పేర్కొంది.

విద్యార్ణవ తంత్రంలో గణపతి రూపాల్లో 15 విభేదాలు కనిపిస్తాయి.

1. ఏకాక్షర గణపతి 2.మహా గణపతి 3. క్షిప్ర గణపతి

4. వక్రతుండ గణపతి 5. లక్ష్మీ గణపతి 6. హేరంబ గణపతి

7. వీర గణపతి 8.లక్ష్మీ గణపతి 9. శక్తి గణపతి

10. సుబ్రహ్మణ్య గణపతి 11. మహా గణపతి 12. త్రైలోక్య గణపతి

13. హరిద్రా గణపతి 14. వక్రతుండ గణపతి 15. ఉచ్చిష్ట గణపతి

ఇందులో రెండు మహా గణపతులు ఉన్నాయి. కాగా మూడు లక్షణాలు ఉన్న గణపతులు కనిపిస్తున్నాయి. లక్ష్మీ గణపతులు రెండు, వక్రతుండ గణపతులు రెండు, శక్తి గణపతి లక్షణాలు అయిదు, త్రైలోక్య మోహన గణపతి లక్షణాలు రెండు, వీర గణపతి లక్షణాలు రెండు, ఉచ్చిష్ట గణపతి లక్షణాలు రెండు స్పష్టమౌతున్నాయి.

శిల్ప ఆగమ శాస్త్రాలను అనుసరించి 21 గణపతుల రూపాలు ఉన్నాయి. అవి వరుసగా...

1.వినాయకుడు 2.బీజ గణపతి 3.హేరంబ గణపతి 4.వక్రతుండ గణపతి

5.బాల గణపతి 6.తరుణ గణపతి 7.భక్తి విఘ్నేశ 8.వీర విఘ్నేశ 9.శక్తి గణేశ

10.ధ్వజ గణపతి 11.పింగళ గణపతి 12. ఉచ్చిష్ట గణపతి 13. విఘ్నరాజ గణపతి

14.లక్ష్మీ గణేశ 15.మహా గణేశ 16. భువనేశ గణపతి 17.నృత్త గణపతి

18.ఊర్ద్వ గణపతి 19.ప్రసన్న గణపతి 20.ఉన్మత్త వినాయక 21.హరిద్రా గణేశ

విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 33 రూపాలున్నాయనీ, వీటిలో 16 మాత్రం అత్యంత ప్రముఖమైనవని చెబుతారు. ఈ 16 రూపాలలో ఒక్కో రూపానిదీ ఒక్కో విశిష్టత.

1. బాల గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి వైపు చేతులలో అరటిపండు, పనసతొన, ఎడమవైపు వైపు ఉన్న చేతులతో మామిడిపండు, చెరకుగడని పట్టుకుని దర్శనమిస్తారు. బుద్ధి చురుకుగా పనిచేయాలంటే ఈ బాల గణపతిని పూజించాలి.

కరస్థ కదలీ చూత పన పేక్షుక మోదకమ్
బాలసూర్య నిభం వందే దేవం బాలగణాధిపమ్
అనే మంత్రంతో ప్రతిరోజూ సూర్యోదయ సమయాన చదవాలి.

2. తరుణ గణపతి:

ఈ వినాయకుడి రూపానికి ఎనిమిది చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, వెలగగుజ్జు, దంతం, చెరకు ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, నేరేడు పండు, వరివెన్ను పట్టుకుని అభయముద్రతో దర్శనమిస్తారు. ఈయనను...

పాశాంకశాపూస కపిత్థ జంబూ స్వదంత శాలీనమపి స్వహస్త్రైః ధత్తే సదా య సతరుణాభః పాయాత్స యుష్మాం ష్తరుణో గణేశః అనే మంత్రంతో పూజించాలి.

3. భక్త గణపతి

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో కొబ్బరికాయ, అరటిపండు ఎడమ వైపు ఉన్న చేతులలో మామిడి పండు, బెల్లపు పరమాన్నం ఉన్న పాత్ర పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

నాలికేరామ్ర కదలీ గుడపాయాస ధారిణమ్
శరచ్చంద్రాభ్వవుషం భజే భక్త గణాధిపమ్

అనే మంత్రతో స్తుతించాలి...ఈయనను సేవిస్తే భక్తిభావం పెరుగుతుంది.

4. వీరగణపతి

ఈ వినాయకుడి రూపానికి పదహారు చేతులుంటాయి కుడి వైపు చేతులతో బాణం, బేతాలుడు, చక్రం, మంచపుకోడు, గద, పాము, శూలం, గొడ్డలిబొమ్మ ఉన్న జెండా, ఎడమవైపు ఉన్న చేతులతో శక్తి అనే ఆయుధం, విల్లు, ఖడ్గం, ముద్గరమనే ఆయుధం, అంకుశం, పాశం, కుంతమనే ఆయుధం, దంతం ధరించి దర్శనమిస్తారు. ఈయనను....

బేతాల శక్తి శర కార్ముక చక్ర ఖడ్గ
ఖట్వాంగ ముద్గర గదాంకుశ నాగపాశాన్
శూలం చ కుంత పరశుధ్వజ మాత్తదంతం
వీరం గణేశ మరుణం త్వనిశం స్మరామి
అనే మంత్రంతో కీర్తించాలి. ఈయనను పూజించిన భక్తులకు తిరుగులేని ధైర్యం ప్రసాదిస్తారు.

5. శక్తి గణపతి

ఆలింగ్య దేవీం హరితాంగయష్టిం
పరస్పరా శ్లిష్ట కటిప్రదేశమ్
సంధ్యారుణం పాశ స్ఫటీర్దధానం
భయాపహం శక్తి గణేశ మీదే
అనే మంత్రంతో ఈ గణేశుని ప్రార్థించాలి. నాలుగు చేతులున్న ఈ గణపతి అంకుశం, పాశం,
విరిగిన దంతం పట్టుకుని దర్శనమిస్తారు. ఈయన కరుణిస్తే ఏదయినా సాధించగలమనే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.

6. ద్విజ గణపతి
ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పుస్తకం, దండం ఎడమవైపు ఉన్న చేతులతో అక్షమాల, కమండలం పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

యం పుస్తకాక్ష గుణదండ కమండలు శ్రీః
విద్యోతమాన కరభూషణ మిందువర్ణమ్
స్తంబేరమానవ చతుష్టయ శోభమానం
త్వాం ద్విజగణపతే ! సిద్ధ్విజ గణాధిపతే స ధన్యః అనే మంత్రంతో పూజించాలి. ఈ గణపతి తెలివి తేటలు ప్రసాదిస్తాడు.

7. సిద్ధి (పింగల) గణపతి

ఈ గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయమన్నది ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పండిన మామిడిపండు, ఎడమవైపు ఉన్న చేతులతో పూలగుత్తి, గొడ్డలి పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

పక్వచుత ఫల పుష్పమంజరీ
ఇక్షుదండ తిలమోదకై స్సహ
ఉద్వహన్ పరశుమస్తు తే నమః
శ్రీ సమృద్ధియుత హేమం పింగల
అనే మంత్రంతో స్తుతించాలి.

8. ఉచ్ఛిష్ట గణపతి

కోరిన కోర్కెలు తీర్చే ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడివైపు చేతులతో నల్ల కలువ, వరివెన్ను ఎడమ వైపు ఉన్న చేతులతో దానిమ్మపండు, జపమాల పట్టుకుని కనిపిస్తారు. ఈయనను....

నీలబ్జ దాడిమీ వీణా శాలినీ గుంజాక్ష సూత్రకమ్
దధదుచ్ఛిష్ట నామాయం గణేశః పాతు మేచకః
అనే మంత్రంతో ప్రార్థించాలి.

9. విఘ్న గణపతి

గణపతి అసలు లక్షణమైన విఘ్ననాశనం ఈ రూపంలో కనిపిస్తుంది. ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడివైపు చేతులతో శంఖం, విల్లు, గొడ్డలి, చక్రం, పూలగుత్తి, ఎడమ వైపు ఉన్న చేతులతో చెరకు, పూలబాణం, పాశం, విరిగిన దంతం, బాణాలు పట్టుకుని కనిపిస్తారు. ఈయనను...

శంఖేక్షు చాప కుసుమేషు కుఠార పాశ
చక్ర స్వదంత సృణి మంజరికా శరౌఘై
పాణిశ్రిఅఅఅ పరిసమీహిత భూషణా శ్రీ
విఘ్నేశ్వరో విజయతే తపనీయ గౌరః అనే మంత్రంతో ప్రార్థించాలి.

10. క్షిప్త గణపతి

ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులలో దంతం, రత్నాలు పొదిగిన బంగారు కుండ ఎడమ వైపు ఉన్న చేతులతో కల్పవృక్షపు తీగ, అంకుశం ధరించి కనిపిస్తారు. ఈయనను....

దంత కల్పలతా పాశ రత్న కుంభాంకుశోజ్జ్వలమ్
బంధూక కమనీయాభం ధ్యాయేత్ క్షిప్ర గణాధిపమ్
అనే మంత్రంతో స్తుతించాలి.

11. హేరంబ గణపతి

అభయ వరదహస్త పాశదంతాక్షమాల
సృణి పరశు రధానో ముద్గరం మోదకాపీ
ఫలమధిగత సింహ పంచమాతంగా వక్త్రం
గణపతి రతిగౌరః పాతు హేరంబ నామా

అనే మంత్రంతో స్తుతించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో అభయముద్రనిస్తూ, కత్తి, అక్షమాల, గొడ్డలి, మోదకం ధరించి, ఎడమవైపు ఉన్న చేతులతో వరద హస్త ముద్రతో విరిగిన దంతం, అంకుశం, ముద్గరం, పాశం ధరించి కనిపిస్తారు. ఈయనను సేవిస్తే ప్రయాణాలలో ఆపదలను నివారిస్తారు.

12. లక్ష్మీ గణపతి

బిభ్రాణ శ్శుకబీజపూరక మిలన్మాణిక్య కుంభాంకుశన్
పాశం కల్పలతాం చ ఖడ్గ విలసజ్జ్యోతి స్సుధా నిర్ఘరః
శ్యామేనాత్తసరోరు హేణ సహితం దేవీద్వయం చాంతికే

గౌరాంగో వరదాన హస్త సహితో లక్ష్మీ గణేశోశావ తాత్ అనే స్తోత్రంతో పూజించవలసిన ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతితో వరదముద్రనిస్తూ, కత్తి, చిలుక, మాణిక్యం పొదిగిన కుంభం, పాశం, ఖడ్గం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అభయ హస్త ముద్రతో దానిమ్మ, అంకుశం, కల్పలత, అమృతం ధరించి కనిపిస్తారు. ఈ సేవిస్తే ఐశ్వర్యం కలుగుతుంది.

13. మహాగణపతి

ఈ వినాయకుడి రూపానికి పది చేతులుంటాయి కుడి వైపు చేతులతో మొక్కజొన్న కండె, బాణం తొడిగిన విల్లు, పద్మం, కలువ, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో గద, చక్రం, పాశం, వరికంకి, రత్నాలు పొదిగిన కలశం ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని సేవిస్తే సమస్త శుభాలూ కలుగుతుంది.

హస్తీంద్రావన చంద్రచూడ మరుణచ్చాయం త్రినేత్రం రసాదాశ్యిష్టం శిరయమాస పద్మకరయా స్వాంకస్థయా సంతతమ్

బీజాపూరగదా ధనుర్విద్య శిఖయుక్ చక్త్రాబ్ద పాశోత్పల
వ్రీహ్యగ్ర స్వవిశాణ రత్న కలశాన్ హస్త్రై ర్వహంతం భజే
అనే మంత్రంతో ప్రార్థించాలి.

14. విజయ గణపతి

సమస్త విజయాలను చేకూర్చే ఈ గణపతి రూపానికి నాలుగు చేతులుంటాయి కుడి వైపు చేతులతో పాశం, విరిగిన దంతం ధరించి, ఎడమ వైపు ఉన్న చేతులతో అంకుశం, పండిన మామిడి పండు ధరించి కనిపిస్తారు. ఈ గణపతిని....
పాశాంకుశ స్వదంత్రామ ఫలావా నాఖు వాహనః
విఘ్నం నిఘ్నంతు నమః స్సర్వం రక్తవర్ణో వినాయకః అనే మంత్రంతో పూజించాలి.

15. నృత్య గణపతి

సంతృప్తిని, మనశ్శాంతినీ ఇచ్చే ఈ గణపతి కుడి చేతులలో పాశం, అప్పాలు, ఎడమ వైపు చేతులతో అంకుశం, పదునుగా ఉన్న విరిగిన దంతం ధరించి దర్శనమిస్తారు.

పాశాంకుశాపూస కుఠారదంతః చంచత్కరః క్లుప్త పరాంగులీకుమ్
పీతప్రభం కల్పతరో రథః స్థం భజామి తం నృత్త పదం గణేశమ్
అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.

16. ఊర్ధ్వ గణపతి

కారాగార బాధ నుండీ తప్పించే ఈ గణపతి కుడి చేతులలో కలువ, పద్మం, విల్లు, విరిగిన దంతం, ఎడమ వైపు చేతులతో వరివెన్ను, చెరకుముక్క, బాణం, మొక్కజొన్న కండె ధరించి దర్శనమిస్తారు.

కల్హార శాలి కమలేక్షుక చాపదంతా ప్రరోహ కనకోజ్జ్వల లాలితాంగ ఆలింగ్య గణోద్యతకరో హరితాంగ యష్ట్యా దేవ్యా కరోతు శుభమూర్ధ్వ గణాధిపో మేః అనే మంత్రంతో ఈ వినాయకుడిని స్తుతించాలి.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...