Tuesday, January 1, 2019

కోరాడ రామచంద్రశాస్త్రి గారు


రచయిత, కవి

కోరాడ రామచంద్రశాస్త్రి గారు ప్రథమ తెలుగు నాటక రచయిత. క్రీడాభిరామం తరువాత తెలుగు నాటకం వ్రాసిన వారిలో వీరే ప్రథములు. సంస్కృతం నుండి తెలుగులోని అనువాదం చేసిన మొదటి రచయిత కూడా వీరే కావడం విశేషం.

జీవిత విశేషాలు :
----------------------
ఈయన 1816లో అమలాపురం తాలూకాలోని కేశనకుఱ్ఱు గ్రామంలో జన్మించారు. తండ్రి పేరు లక్ష్మణశాస్త్రి. ఈయన నివాసము బందరు. ఈయన చాలా మంచి కవి అని మిత్త్రులు ఒక వివాహం లో మెచ్చుకుంటుండగా, ఆ సమయమున చిరపరిచయులగు శిష్టుకవి గారు రామచంద్రపురము రాజుగారికి "ఆయన ను ఆస్థాన పండితునిగా గౌరవించండి అని ఉత్తరము వ్రాసి ఇవ్వగా ఆ రాజు గారు  "దేశమున క్షామము వలన ఈ కవిని రెండు నెలల కంటే ఎక్కువ పోషింపలేమని చెప్పారట. ఆమాట రామచంద్రశాస్త్రి గారి కి నచ్చలేదు. మదరాసు వెళ్ళి ఏదో ఒక ఉద్యోగము సంపాదించుటకు సంకల్పించి ప్రయాణమయ్యారు. త్రోవలో మచిలీపట్టణమున ఆగవలసివచ్చి ఇంగువ రామస్వామి శాస్త్రి గారి వద్ద మంత్ర శాస్త్రమభ్యసించారు. వఠ్ఠెం అద్యైత పరబ్రహ్మ శాస్త్రి గారి స్వస్థలము నడవపల్లి. ఆ ఊరి వారు రామచంద్ర శాస్త్రి గారి సామర్ద్యము పరీక్షించుటకు శతావధానము చేయమన్నారు. మహా కవితా ధార కలిగిన వీరికి అది ఒక లెక్కా ! పద్యములు తడువుకొనకుండ అవధానమును చెప్పారట. ఆ పద్యములు మాత్రం అపలబ్ధములు.

క్రమముగా శాస్రి గారి పాండితీ కవితా ప్రతిభలు నలుదిక్కులా వ్యాపీంచాయి. బందరు నోబిల్ పాఠశాలలో ఉద్యోగము లభించింది. అక్కడ 43 వత్సరములు పని చేసారు. దొరలు వీరి నైపుణ్యానికి నివ్వెఱపోయేవారు. వారెవ్వరిని లెక్క చేసేవారు కాదు. ఉద్యోగంలో వున్న నలువది మూడేండ్లలో ' ఈ తప్పు చేసారు  ' అని ఒక్క అధ్యక్షుడు చేత కూడా ఆక్షేపింపబడలేదు.

 కళాశాల అధ్యక్షునకు ఈయనకు ఒక శ్లోకార్దములో వ్యతిరేకాభిప్రాయములు వచ్చాయి. శాస్త్రులు గారు ముక్త కంఠమున "మీ అర్ధము పొరపాటు" అని కరాఖండిగా చెప్పారు. తాత్కాలికముగా అధికారికి క్రోధావేశము కలిగినను శాస్త్రులు గారి యధార్ధవాదం కు ఆయన తలయొగ్గక తప్పినదికాదు.

మాడభూషి వేంకటాచార్యులు మన శాస్త్రిగారి ప్రతిభ నెరుంగదలచి

 "శ్లో. చింతకాయ కలేకాయ బీరకాయ తమారికే, ఉచ్చింతకాయ వాక్కాయ సాధకాయ తమాంజలిమ్"

అని యొక శ్లోకము వ్రాసి శిష్యున కిచ్చి రామచంద్ర శాస్త్రిగారు దీనికి అర్ధం ఎట్లు చెప్పుతారో కనుక్కుని రమ్మని పంపించారు. అంతట శాస్త్రులుగారు దాని కర్ధము చెప్పుటమే కాకుండా రెండు గడ్డు శ్లోకములు వ్రాసి ఆచార్యులు గారికి పంపి నిరుత్తరులను చేశారని వదంతి.

ఈయన సంస్కృతాంధ్రములలో చాలా కృతులు రచించారు. పన్నెండవ ఏటనే ఉపదేశము పొందారు. 'దేవివిజయము', కుమారోదయము' అను గ్రంధములు వీరి ఉపదేశ విషయమును తెలుపుతాయి. 1860 ప్రాంతమున మంజరీ మధుకరీయం నాటకము ను రాశారు.

రచనలు :
------------
శాస్త్రిగారు కావ్య నాటకాదులను, తర్క వ్యాకరణాది గ్రంథములను చదివి సాహిత్యంలో గొప్ప ప్రావీణ్యత సంపాదించారు.

వీరు సుమారుగా 30 గ్రంథాలు రచించారు.

ఆధునిక కాలంలో వెలువడిన తొలి తెలుగు నాటకం "మంజరీ మధుకరీయం". దీనిని కోరాడ రామచంద్రశాస్త్రి గారు 1860 ప్రాంతాల్లో రచించారు; ముద్రణ మాత్రం 1908లో జరిగింది. సంస్కృతంలోని నాటక లక్షణాలను అనుసరించి తెలుగులో వెలువడిన స్వతంత్ర రచన ఇది. ఇందులోని కథ మంజరీ మరియు మధుకరుల మధ్య ప్రణయ వృత్తాంతము. క్షుద్ర మంత్రకత్తె వలన మంజరి అన్నో కష్టాలు అనుభవించి చివరకు రాజును వివాహం చేసుకొనడం కథాంశం. నాటకం అంతా దీర్ఘ సమాసాలతో నిండి పద్య రూపంలో ప్రబంధ ధోరణిలో ఉంటుంది.

వీరు సంస్కృతంలోని వేణీ సంహారం నాటకాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఇది సంస్కృతం నుండి తెలుగులోకి వచ్చిన మొదటి నాటకం.

కృతులు :
--------------
మంజరీ మధుకరీయ నాటిక
ఉన్మత్త రాఘవము
నయప్రదీపము
రథాంగదూతము
శాకుంతలము(ఆంఢ్రీకరణం)
వేణీసంహారము
ముద్రారాక్షసము
ఉత్తరరామచరితము
పరశురామ విజయము

సంస్కృత రచనలు :
--------------------------
కుమారోదయము
ఘనవృత్తము
దేవీవిజయము
శృంగార సుధార్ణవము
ఉపమావళి

ఆముద్రిత సంస్కృత కృతులు :
-----------------------------------------
మృత్యుంజయ విజయ కావ్యము
పుమర్థసేవధి కావ్యము
కమనానందభాణము
రామచంద్ర విజయవ్యాయోగము
త్రిపురాసుర విజయడిమము
ఉత్తర రామాయణము
ధీసౌధము
మంజరీ సౌరభము
...ఇంకా ఎన్నో

ఘనవృత్తము :-
------------------
ఇది మేఘదూతమునకు తరువాతి కథ. శాపవశాత్తు భార్యనుండి వేరుపడి విరహ మనుభవిస్తున్న యక్షుడు వర్ష ఋతువులో మేఘమును చూచి తన సందేశమును తన భార్యకు అందజేయుమని ప్రార్థించి, అలకాపురికి మార్గమును కూడ చక్కగా తెలిపినాడు. అది మేఘదూతములోని కథ. ఇక ఇక్కడ ఒక ప్రశ్న మనకు ఉదయిస్తుంది. అదేమంటే పాపము తన బాధను మేఘునితో యక్షుడు మొర పెట్టుకొన్నాడు. ఐతే ఆ మొరలను ఆలకించిన మేఘుడు ఏమి చేసినాడు అన్నదే ఆ ప్రశ్న. అసలు ఆ నీలజీమూతము విన్నదా, వింటే ఏమి చేసింది? అలకాపురి చేరిందా, యక్షుని భార్యను చూసిందా? ఆమె ఏలాగుంది?

ఈ ప్రశ్నలకు జవాబు మనకు కోరాడ రామచంద్రశాస్త్రి గారు వ్రాసిన ఘనవృత్తములో లభిస్తుంది.

.
యక్షుడు ఇచ్చిన ప్రయాణమార్గపు వివరాలు తీసికొని అలకాపురి చేరుకొంటాడు మేఘుడు. అక్కడ యక్షుని ఇంటిని కూడ కష్టము లేకుండ కనుగొంటాడు. కిటికిలోనుండి తొంగి చూడగా చిక్కిపోయిన యక్షుని భార్య దేవీపూజలో నిమగ్నమై యుంటుంది. శోకాకులయైన ఆమె మేఘునికి అశోకవనములో నున్న సీతను జ్ఞప్తికి తెస్తుంది. హనుమంతుని వలెనే మేఘుడు సూక్ష్మరూపము దాల్చి సుందరాకారముతో ఆమె ముందు ప్రత్యక్షమయి యక్షుని విరహబాధను తెలియజేస్తాడు. యక్షుని ఇంద్రియ నిగ్రహము, ఏకపత్నీవ్రతమును ఆమెకు విశదపరచినాడు.యక్షాంగన ఇది తాను దేవికి చేయు పూజాఫలము అని తలపోస్తుంది. శాపగ్రస్తుడైన యక్షుడు రామగిరిలో తపము చేసెడి సమయాన ఇంద్రుడు ఆతని తపోభంగము కోసం సురూప అనే అప్సరను పంపాడనీ, ఆమె నటనలకు, సౌందర్యమునకు బానిస కాక ఆమెను తూలనాడి ఆమెకు సద్బుద్ధిని కలిగించి తిరిగి దేవలోకానికి యక్షుడు పంపించాడనీ మేఘుడు చెబుతాడు.

“స్వర్గం గాయాః – పయసి విహరత్ – రాజహంసస్య కుల్యా
సిత్వం యాహి – ద్రుతతరమితో – యాహి కుంజాంతరం తత్”

నా భార్య ఆకాశగంగ వంటిది. నావంటి రాజమరాళం అట్టి ఆకాశగంగలో కాక నీవంటి పిల్లకాలువలో విహరిస్తుందా? నీ వృథాప్రయాస చాలించి ఇక వెంటనే వెళ్ళు అని యక్షుడు సురూపతో అన్న మాటలను ఆమెతో చెబుతాడు. తన భర్తను గురించి యక్షుడు చెప్పిన మంచి మాటలను విన్న యక్షవనిత ఆనందాధిక్యముతో మూర్ఛపోతుంది. ఆమెకు శైత్యోపచారములను జేస్తూ చెలికత్తెలు మేఘునికి ఆమె ఎలా యక్షుని వదలి కాలము గడిపినదో అనే విషయాన్ని వివరిస్తారు. కుబేరుడు తనకిచ్చిన శాపము మాట విన్న యక్షుడు బాధతో భార్యకు ఈ వార్తను తెలుపుట కిష్టము లేక ఇంటికి రాకుండ వెళ్లిపోయిన పిదప కుబేరుడు తన భార్యను యక్షవనిత వద్దకు పంపుతాడు. ఆమె కుబేరుడు తనకు బోధించిన అంబికా మంత్రమును యక్షాంగనకు ఉపదేశించి దేవిని ఆరాధించమని ఓదార్చుతుంది. యక్షపత్ని అలాగే భక్తితో పార్వతిని పూజిస్తుంది. ఆమె పూజలకు తృప్తిబొంది పార్వతి ఆమెకు ప్రత్యక్షమై ఇలా అంటుంది – కుబేరుడు నా ప్రియమైన భక్తుడు. అతని శాపమును నేను తిరగజేయలేను. కాని శాపము త్వరలో ముగుస్తుంది, నీకు శుభము కలుగుతుంది. అదియును గాక యక్షుని శాపమునకు కారణము పూర్వజన్మలో అతడు తన కూతురిని అల్లుడిని కలువనీయకుండ దూరముంచుతాడు. నీవు కూడ నీ చెలికత్తెలను వారి పతులనుండి దూరము చేస్తున్నావు, అలా చేయకు అని చెప్పుతుంది.

అప్పటినుండి ఆ యక్షవనిత దేవీ ధ్యానములో తన భర్తను తలచుచు కాలమును గడపుతున్నది. కొద్ది సేపటికి ఆమె మూర్ఛనుండి తేరుకొని మేఘుడిని ఆదరించి బహుమానముల నిచ్చి తన పతిని గూర్చి కొన్ని రహస్యములను తెలిపి ఒక సందేశాన్ని కూడ ఇస్తుంది. ఆ సందేశములను గొని మేఘుడు మళ్లీ రామగిరికి వెళ్ళి యక్షుని జూచి నీ ప్రియురాలు జీవించి వున్నది, నిన్నే తలుస్తూ ఉన్నది, త్వరలో మీరు శుభములను పొందగలరు అనే మేఘసందేశమును ఇచ్చి వెళ్ళిపోతాడు. వర్షఋతువు పిదప శరదృతువు వస్తుంది. యక్షునికి శాపము తీరుతుంది. అలకాపురికి వెళ్లి తన భార్యను మళ్లీ దర్శిస్తాడు. మేఘుడు వారిని కలిసికొని ఇద్దరిని శ్లాఘిస్తాడు. కుబేరుడు యక్షుని సన్మానించి తన సేవకా వృత్తి నుండి తొలగిస్తాడు. ఇది ఘనవృత్తపు కథ.

ఈ కావ్యము నుండి రెండు పద్యాలు:

యత్తే ప్రేయాన్ – మయి సదయయా – గ త్తనూజత్వభావం
దూరే తస్మి – న్నపిచ భవసి – ప్రేమ ధూర్మిర్భరాత్మా
సూనం తస్మా – దహముపగతో – న్యాయతస్త్యాతభావం
పుత్రం మత్వా – తవహృదయ సం – భాషణం నిర్విశంకా

దూరంబున్నన్ – నెనరు మదిలో – నుంచుకొన్నావు నీవున్
ప్రేమన్ జూపెన్ – బ్రియ సుతునిగా – నన్ను నీ భర్త తానున్
నేనున్ దల్తున్ – గనుక నతనిన్ – దండ్రిగా దప్పకుండన్
నీవున్ నన్నున్ – సుతునివలెనే – యెంచుమా శంకలేకన్

యక్షుడి భార్యను చూచిన తరువాత మేఘుడు ఆమెతో, యక్షుడు నన్ను తన కొడుకులా ఆదరించాడు, నేను కూడ అతడిని పితృసమానముగా తలుస్తాను, నీవు నీ భర్త ఎంతో దూరములో ఉన్నా, ప్రేమతో అతనిని మరువకుండా సదా జ్ఞాపకము చేసికొంటున్నావు. నీవు కూడ సందేహాలను తొలగించి సంకోచ పడక నన్ను పుత్రసమానునిగా తలంచుకో, అని అంటాడు.

అన్యోన్యోద్యత్ – ప్రణయవశతా – జాతకందర్పదర్ప
క్రాంతక్రీడా – వశగమనసో – రర్హయోనోఃకయోశ్చిత్
ఆళీహిత్వం – స్వపదవినయం – బోద్దుకామావకాశం
వాదా ఏవం – తదసివిధురా – శాప ఏవప్రసహ్యః

ఆనాడొక్కం – డెఱిగి తనయన్ – భర్తనున్ వేఱు జేసెన్
జ్ఞానంబున్నన్ – మతియు జెడగా – దానె గల్గించె బాధన్
తా నీ జన్మన్ – ధనపతి యిడన్ – శాపమందేను, నీవున్
వేఱుంచేవే – చెలుల పతులన్, – పాప మద్దాని వల్లన్

ఈ పద్యము పార్వతీదేవి యక్షుడికి శాపము ఎందుకు వచ్చిందో అని యక్షపత్నితో వివరించినప్పుడు చెప్పిన మాటలు. వయసులో ఉండే ప్రేమికులను వేరుజేయడము తప్పు. ఆ తప్పునే నీ భర్త పూర్వజన్మలో చేసినాడు, తన కూతురిని అల్లుడిని కలుసుకోకుండా అడ్డంకులు పెట్టేవాడు. దాని ఫలితమే కుబేరుడు ఈ జన్మలో తన శాపముచే మిమ్ములను విడదీసినాడు. నీవు కూడ నీకు పనిచేస్తూ ఉండే చెలికత్తెలను వారి భర్తలను కలిసికోకుండా వేరు చేస్తున్నావు, అది పాపకరమైన కార్యము, అలా చేయరాదు అని దేవి బోధిస్తుంది.

ఆయన జూన్ 6, 1897 ను పరమపదించారు.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...