Friday, March 23, 2018

విందా ముహూర్తం యొక్క ప్రాముఖ్యత

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నష్టం ధనం విందతి (లభతే) అస్మిన్ – ఇతి విందః. ఏదైనా వస్తువు, డబ్బు, మనిషి  ఈ ముహూర్తంలో తప్పిపోతే తిరిగొస్తారట.

సనాతనధర్మం ప్రకారం ముహూర్తానికి చాలా ప్రాముఖ్యత ఉంది.  శుభాన్ని, విజయాన్ని ఆశిస్తూ చేసే పనులు ముహూర్తం చూసుకొని చేయమని పెద్దలు చెబుతారు.

రౌద్ర: శ్వేతశ్చ మైత్రశ్చ తథా సారభట: స్మృత:|
సావిత్రో వైశ్వదేవశ్చ గాంధర్వ: కుతపస్తథా||
రౌహిణస్తిలకశ్చైవ 'విజయో' నైరృతస్తథా|
శంబరో వారుణశ్చైవ భగ: పంచదశ: స్మృత:||

ఈ పదునైదు (15)ను పగటి ముహూర్తములు.  11వదీ యైన విజయ ముహూర్తమునకే 'విందము'  అని నామాంతరము.

రౌద్ర-శ్వేత-మైత్ర-సారభట-సావిత్రి-విరోచన-జయదేవ-అభిజిత్‌-రావణ-నంది-విజయ-వరుణ-యమ-సౌమ్య-భవులు పదిహేను ముహూర్తములు.

రౌద్ర ముహూర్తము నందు భయానకములగు కార్యములు చేయవలెను. స్నానాది కార్యములు శ్వేత ముహూర్తము నందు చేయవలెను.

కన్యావివాహమునకు మైత్ర ముహూర్తము శుభకరము. సారభట ముహూర్తము నందు శుభకార్యములను, సావిత్ర ముహూర్తమున దేవతా స్థాపనమును, విరోచన ముహూర్తము నందు రాజకీయ కార్యములును చేయవలెను.

జయదేవ ముహూర్తమున విజయమునకు సంబంధించిన కార్యములును, అభిజిత్ ముహూర్తనమున దేవతోపాసన, రావణ ముహూర్తము నందు సంగ్రామమును,నందీ ముహూర్తమున షట్కర్మలను, విజయ ముహూర్తము నందు కృషి, వ్యాపారములను చేయవలెను.

వరుణ ముహూర్తము నందు తడాగాది నిర్మాణమును, యమ ముహూర్తము నందు వినాశకర కార్యములను, సౌమ్య ముహూర్తము నందు సౌమ్యకార్యములను చేయవలెను.

భవ ముహూర్తము నందు అహోరాత్రములు శుభలగ్నమే. అందుచేత దాని యందు శుభకార్యము లన్నియు చేయవలెను. ఈ విధముగ ఈ పదునైదు ముహూర్తముల శుభాశుభహేతుత్వము వాటి పేర్లను పట్టియుండును.

శ్రీమద్రామాయణంలో అరణ్యకాండలో విందా ముహూర్తం యొక్క ప్రాముఖ్యత గురించి ఉంది.

రావణుడు సీతను అపహరించుకొని పోయిన తరువాత, ఆమెను వెతుకుతున్న శ్రీరామ లక్ష్మణులకు కొస ఊపిరితో  ఉన్న జటాయువు కనిపిస్తాడు.  సీత కోసం దుఖిస్తున్న శ్రీరాముని ఓదారుస్తూ, జటాయువు ఇలా అంటాడు.

యేన యాతో ముహూర్తేన సీతాం ఆదాయ రావణ:|
విప్రణష్టం ధనం క్షిప్రం తత్స్వామీ ప్రతిపద్యతే|   (అరణ్యకాండ 68వ సర్గ 12వ శ్లోకము)

"రావణుడు సీతను అపహరించుకొని పోయిన ముహూర్తమును బట్టి, నీకు కనబడకుండ పోయిన సీతారూప ధనము యజమాని వైన నీకు మఱల త్వరలోనే లభించును. ఇది నిశ్చయము."

విందో నామ ముహూర్తోऽయం స చ కాకుత్‌స్థ నాऽబుధత్|
త్వత్ప్రియాం జానకీం హృత్వా రావణో రాక్షసేశ్వర:|
ఝషవద్బడిశం గృహ్య క్షిప్రమేవ వినశ్యతి|      (అరణ్యకాండ 68వ సర్గ 13వ శ్లోకము)

"ఓ కాకుత్‌స్థా!  రాక్షసరాజైన రావణుడు నీ ప్రేమ పెన్నిధియైన సీతాదేవిని అపహరించుకొని పోయిన సమయము "వింద" ముహూర్తకాలము.  ఆ విషయమును అతడు ఎఱుగడు.  ఆ ముహూర్తము అతనికి మరణాంతకము.  కనుక అతడు గాలమునకు చిక్కుకొనిన చేపవలె వెంటనే నశించిపోవుట నిజము"

నష్టం ధనం విందతి (లభతే) అస్మిన్ - ఇతి వింద:

"వింద" ముహూర్తకాలమున నష్టమైన ధనం తప్పక యజమానికి భద్రముగా లభించును.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ..........

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...