Friday, November 30, 2018

తురగా రామకవి


రామకవి బొబ్బ పెద్ద ఫిరంగి దెబ్బ అని ప్రసిద్ధి. ఆయన 1720 ప్రాంతం వారు.
ఆడిదం సూరకవి సమకాలికుడు.
చాటు కవిత్వానికి ప్రసిద్ధులు.

జీవిత విశేషాలు:

భగవదనుగ్రహం వలన  ఆగ్రహానుగ్రహ శక్తిని పొందిన పొందిన కవులు కొందరుండేవారు. వారిలో అందరికీ తెలిసి తిట్టు కవిగా  ప్రఖ్యాతి పొందిన వారు  వేములాడ భీమకవి కాగా,  అంతగా కాకపోయినా అటువంటి శక్తి కలిగిన వాడుగా పేరుపొందిన మరొక కవి శ్రేష్టుడు తురగా రామకవి. ఈయన స్వగ్రామం  తూర్పు గోదావరి జిల్లా లోని తుని లేక ఆ దగ్గర లోని ఏదో గ్రామం. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తరచుగా దేశాటనం వెళ్లి వస్తూ ఉండేవారు. అయనకి అక్కడి చాలా ఆస్థానాల్లో వార్షికాశనాలు ఉండేవి. వార్షికాశనాలంటే  యేడాదికొక్కసారి  ఆ సంస్థానానికి వెళ్లి  అయిదో పదో రోజులు ఆ రాజు గారి ఆతిథ్యాన్ని స్వీకరించి వారిచ్చిన ధనాదికములను స్వీకరించి దీవించి వెళ్లడమన్నమాట.

ఈ కవి గారొక సారి పిఠాపురాన్ని ఏలుతున్న వత్సవాయి తిమ్మరాజు గారి దర్శనం కోరి వారి కోటకు వచ్చారట. అంతకుముందే ఆయన వచ్చి తన వార్షికాన్ని స్వీకరించి వెళ్లి ఉండడం చేత, మళ్ళీ ఏం కోరి వచ్చాడోనని, రాజు గారు దర్శనమివ్వక అనాదరించారట.

 అందుకు కోపగించిన కవిగారు రాజు గారి కోట గోడమీదో తలుపు మీదో  మసి బొగ్గుతో “ పెద్దమ్మ నాట్యమాడును దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్..” అని వ్రాసేడట. పెద్దమ్మంటే జ్యేష్టా దేవి కదా? చిన్నమ్మి లక్ష్మీ దేవి  అదృష్ట దేవతైతే,  ఆమె అక్కగారు పెద్దమ్మ దురదృష్ట దేవత. అంటే దురదృష్టం రాజు గారి ఇంట నాట్యమాడాలని శపించినట్లన్నమాట.

 కవిగారు అగ్రహించి చేసిన ఈ పని గురించి తెలుసు కున్న రాజుగారు, కవిగారి ఆగ్రహానుగ్రహ శక్తి  ఎరిగిన వాడు కనుక  స్నానం చేస్తున్న వాడు కాస్తా ఆ తడి బట్టలతోనే వచ్చి కవిగారిని శాంతింపజేసి, వారు వచ్చిన కార్యం కనుక్కున్నారట. కవిగారి కోరిక సమంజసమైనది కాక పోయినప్పటికీ రాజుగారు ఎంతో కొంత సంతృప్తి పరచడంతో మొహమాటం చెందిన కవిగారు తన పద్యం లో ముందు భాగాన్ని ఇలా పూరించారట.
“ అద్దిర, శ్రీ , భూ, నీళలు
ముద్దియలా హరికి గలరు, ముగురమ్మలలో
పెద్దమ్మ నాట్యమాడెను
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్ ”
చూడండి కవి గారి చాతుర్యం. శ్రీ హరికి, శ్రీదేవి అంటే లక్ష్మీ దేవి, భూదేవి, నీలా దేవి అని ముగ్గురు భార్యలున్నారట. అందులో పెద్దమ్మ అంటే లక్ష్మీ దేవి వత్సవాయి తిమ్మరాజు గారింట నాట్యమాడుతుందనీ అంటే సకల సంపదలతో అతడు తులతూగుతాడనీ దీవించినట్లయ్యింది కదా? అయితే మొదట కవిగారికి జరిగిన నిరాదరణ వల్ల కవి వాక్కు పూర్తిగా వృథా పోలేదనీ  తిమ్మరాజు గారి కాలంలో కాకపోయినా ఆయన మనుమల కాలంలో జమీందారీ కష్టాలపాలై నశించిందన్నదీ ఐతిహ్యం.

ఈ కవి లేటవరపు పోతురాజ అనే క్షత్రియుని యింటికి వెళ్లగా అతడు కవి గారి కి ఏమైనా ఇయ్యాల్సి వస్తుందని, ఇంటిలో వుండి కూడా లేడని భార్య తో చెప్పించాడట. అప్పుడు రామకవి,

 కూటికి గాకులు వెడలెడు| నేటావల మూకచేరి యేడువ దొడగెన్
   గాటికి గట్టెలు చేరెను| లేటవరపు పోతరాజు లేడా లేడా?

అని ప్రశ్నించారట. వెంటనే పోతురాజు చనిపోయినాడట. దహన నిమిత్తం బంధువుల ఇంటి నుండి శవమును తీసుకుని పోతున్నప్పుడు అతని భార్య వచ్చి కవి గారి కాళ్ళమీద బడి పతిభిక్ష పెట్టుమని వేడుకోగా  రామకవి కరుణించి,

 మేటి రఘురాముతమ్ముడు| పాటిగ సంజీవిచేత బ్రతికినరీతిన్
   గాటికి బో నీ కేటికి| లేటవరపు పోతురాజ లెమ్మా రమ్మా.

అని కవి పిలువగానే మరల బ్రతికిలేచి పోతురాజు కాడి మీదనుండి దిగివచ్చాడట!

రామ్ కవి బావయైన తల్లాప్రగడ సూర్యప్రకాశరావు గారు వారి స్వగ్రామము ఉంగుటూరు లో  ఒక పెద్ద యిల్లు కట్టించి, దానిని చూపించటానికి కవి గారిని లోపలికి తీసుకుని వెళ్ళి ఒక గదిలో విడిచి బావమరిది ని ఆట పట్టించాలనుకుని తాను వేరొక గది లో దాక్కున్నారు. కవి గారు ఆ పెద్ద ఇల్లంతా తిరిగి తిరిగి దారి కనుగొనలేక విసిగి,

  అంగణము లెన్ని కేళీగృహంబు లెన్ని
   యోడుబిళ్ల లయిండ్లెన్ని మేడ లెన్ని
   కట్టె గాకేమి సూర్యప్రకాశరాయ
   డుంగుటూ రిండ్ల రాకాసు లుండవచ్చు.

అనగానే కావుకావని అరుస్తూ ఇంటికి నలుమూలల  పట్టపగలు పిశాచాలు సంచరించటానికి వచ్చాయట.

రామకవి ఇల్లు కట్టించుకొంటునప్పుడు దారిని పోయేవారిని అందరినీ పిలిచి తన గోడకు ఇటుకలు అందించమని చెప్పీవారు! ఒకనాడు ఆ దారిన అడిదము సూరకవి గారు పోతుండగా రామ కవి గారు వారిని పిలిచి తక్కినవారిని అడిగినట్లే వారి ని కూడా కొన్ని ఇటుకలు అందిచ్చి పొమ్మని అడుగగా  కోపింతో రామకవి అని తెలియక, సూరకవి

"సూరకవితిట్టు కంసాలిసుత్తెపెట్టు"
అని పలికి పో బోయెనట| రామకవి యామాట విని కన్ను లెఱ్ఱచేసి బిగ్గఱగా,
"రామకవిబొబ్బ పెద్దపిరంగిదెబ్బ"

అని కేకలు వేసారట. అంతట సూరకవి గారు అడిగింది  రామకవి గారు అని తెలిసికొని  వారి నోటి వాక్కు కు భయపడి, కొన్ని ఇటుకలు అందించి  మరీ వెళ్ళారట.!

ఇవి అన్ని కేవలం కల్పిత కథలనే వాళ్ళు ఉన్నారు..

ఇటువంటి మహా మహిమగల వాడన్న వేములవాడ భీమకవి కోమటి పేర కృతి చేసి స్తుతించినట్లే  ఈ రామకవి కూడా కంసాలి పేర కృతి చేసి స్తుతించారు..

ఆయన మరియు అయ్యంకి బాలసరస్వతి అనే మరొక కవి కలిసి రచించిన నాగరఖండము అనే 5 అశ్వాసముల గ్రంథం ఒకటి కనబడుచున్నది.

ఈ ఇద్దరు .కవులు తమ గ్రంథము యొక్క యాశ్వాసాంత గద్యము ను ఈ ప్రకారముగా వ్రాసుకొన్నారు-

"ఇది శ్రీమద్దుర్గాదక్షిణామూర్తివరప్రసాదాసాది సారస్వత తురగా రామకవి వరాయ్యంకి బాలసరస్వతినామధేయ ప్రణీతంబైన శ్రీస్కాందంబను మహాపురాణమునందు సనత్కుమారసంహితను నాగరఖండము"

ఈ నాగరఖండము ధవళేశ్వరపు మార్కండేయుడు అనే స్వర్ణకారుడి కి అంకితము ఇచ్చారు. అతను బెజవాడకు ప్రభువు గా ఉండినట్ల ,క్రింది పద్యము వల్ల తెలుస్తోంది.

రజతాగం బొకరాజమౌళికి వినిర్మాణంబు గావించి యి
    చ్చె జగంబెన్నగ విశ్వకర్మ మును దా జిత్రంబు గా దిప్పు డీ
    బెజవాడప్రభు డియ్య నెంతయును గల్పించున్ ధరిత్రిన్ మహా
    రజతస్వర్ణగృహంబు లెప్పుడు బుధవ్రాతంబు మోదింపగన్.

ఈ ధవళేశ్వరపు మార్కండుడు మహమ్మదు కుతుబ్ షాహి కాలములో ఉన్నట్లు నాగరఖండము యొక్క అవతారికలో ఈ క్రింది పద్యమున చెప్పబడింది.

క. అతడు ప్రసిద్ధి వహించెన్
   క్షితినగరజపతుల గెల్చి చెలగి జయశ్రీ
   సతి జేకొనిన మహమ్మదు
   కుతుపశ హాచంద్రునకును గుడుభుజమనగన్.

నాగరఖండము అను గ్రంథమున కవితా శైలి:

నాగరఖండమునందు గొన్ని వ్యాకరణ విరుద్ధములగు ప్రయోగములు ఉన్నా  మొత్తం మీద కవిత్వము హృద్యముగానే ఉన్నది. నాగరఖండము నుండి కొన్ని పద్యములు

ఉ. ప్రీతియొనర్ప నగ్గిరి నిరీక్షయొనర్ప దరీసరత్ప్రవం
   తీతటజాతరూపధరణీరమణీయమణీసమగ్రమై
   స్ఫీతసుధాంబుపూర సరసీరుహశీకరశీతలానిలా
   న్వీతవిహార దేవతరుణీహరిణీకరిణీసమూహమై.

 ఆదికి నాదికారణ మహర్సతికోటిసమానతేజు డు
   త్పాదితసర్వలోకుడును బ్రహ్మమునై తగు విశ్వకర్మ నా
   నాదినిజాళిలోన భువనంబుల నెల్లను హేతుకార్యక
   ర్త్రాదులు తానయై తగు యథార్థమునుమ్ము మయూరవాహనా.

 ఇచ్చిన నైదుసాధనము లింపుగ నైదుగురున్ ధరించి యు
   ద్యచ్చరిత ప్రశస్తయజనాదిరతుల్ శివతత్వబోధులై
   యచ్చెరు వంద జేసిరి సమస్తజగంబుల దత్క్షణంబునన్
   హెచ్చినయాత్మవర్తనల నెన్నికగాగ సరోజబాంధవా.

 కమలజుకంటె మున్ను శశిఖండశిఖామణికంటెమున్ను శ్రీ
   రమణునికంటెమున్నుగ విరాజిలు బోధకు డైనయట్టిబ్ర
   హ్మముగ మహానుభావుడని యాత్మవివేకముచే నెఱుంగుమా
   యమితపువిశ్వకర్మను మహాత్ముని లోకకృతిప్రవీణునిన్.

కడక గనుంగొనంగ దొలుకారుమెఱుంగులు గ్రుమ్మరింపగా
   నడుగిడ గల్లుగల్లు మను హంసకనాదము హంసరావమున్
   దడబడ బద్మరాగసముదాయముదాపున నేపు చూసి యె
   ల్లెడల బదాగ్రరాగరుచు లీనగ వచ్చెను గౌరి వేడుకన్.

Thursday, November 29, 2018

మీలో ఎంత మందికి తెలుసు? "ఆడిదము సూరకవి"

మన తెలుగు సాహితీ చరిత్రలో చెప్పుకో దగిన కవులలో “అడిదము సూరకవి” ఒకరు. ఈయన 18వ శతాబ్ధమునకు చెందిన వారు. కవితా వృత్తిచే ఆంధ్రదేశమంతటా పేరు పొందిన  బ్రాహ్మణులు శివ శ్యామలా దేవతోపాసకులు. ఈ వంశీయులు 23 తరాలనుండి కవితా వృత్తిచే జీవించారు. వీరికి 14 తరాల నుండి రాజాస్థానం లభించింది. వీరు కళింగ దేశంలోని విద్వత్కవి వంశములోని వారు.

అసలు అడిదము వారి వంశం మొదట మోదుకూరు పిమ్మట గంధవారణం, అనే ఇంటి పేర్లు ఉండేవట. తదుపరి వీరి పూర్వీకులైన నీలాద్రి కవి రణరంగ వీరుడై ఒక అడిదాన్ని(కత్తిని) కానుకగా పొందారట. అప్పడినుండి “అడిదం” వారని ప్రసిద్ధి వచ్చిందట.

చినవిజయరామరాజు భోజుడని చెప్పుకోడానకి ముందు సూరన ఆర్థికంగా చాలా బాధలు పడ్డారు. ఆయన తండ్రి భాస్కరయ్య లక్షణసారం రాసేడని చెప్పుకోడమే కాని ఇప్పుడు అందుబాటులో లేదు.

ఇతడు లోకంలో తిట్టు కవిగాను, లోకజ్ఞుడు గాను, విఖ్యాతుడైనప్పటికీ “రామలింగేశ శతకం” వంటి పదహారణాల చాటుత్వం గల చక్కని శతకం రచించారు. ఆయన నీలాద్రి కవికి 9వ తరం వాడు. ఆయన సంభాషణాత్మక చాటువును ఇలా వ్రాసారు.

“ఊరెయ్యది చీపురు పలి
పేరో సూర కవి ఇంటి పేరడిదము వార్
మీ రాజు విజయ రామ మ
హా రాజతడేమి సరసుడా ? భోజుడయా ?”

ఇలా ఈ పద్యాన్ని బట్టి తనకి తనే స్వయం గా చాటువులో చెప్పుకున్నారన్న సంగతి విదితమౌతోంది. అంతే కాదు ఈయన విజయనగర ప్రభువు పూసపాటి విజయ రామరాజు ఆస్థాన కవి గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రభువును స్తుతిస్తూనే పెద్దాపుర ఆస్థానంలో ఈ కవి గారు చెప్పిన సుప్రసిద్ధ చాటువు ఇది.

అంతే కాదు మన సూర కవికి కనకాభిషేకం చేయించిన విలువైన చాటువు కుడా ఇదే .

“రాజు కళంక మూర్తి,రతిరాజు శరీర విహీను,డంబికా
రాజు దిగంబరుడు,మృగరాజు గుహాంతర సీమవర్తి,వి
బ్రాజిత పూసపాడ్విజియ రామ నృపాలుడు రాజు కాక ఈ
రాజులు రాజులా పెను తరాజులు కాక ధరాతలంబునన్ !”

ఈ పద్యం వినగానే సభలో ఉన్న రాజులందరు తమని తరాజులంటున్నాడని రోష పడ్డారట. అప్పుడు “తాను పేర్కొన్న రాజు చంద్రుడు, వానికి మచ్చ రతిరాజు అనగా మన్మధుడు, అతగాడికి శరీరమే లేదు, ఇక శివుడికి కట్టు బట్టల్లేవు, సింహం గుహల్లొ నివాసం, వీళ్ళు రాజు లేమిటి?” అని వారినే తాను రాజులు గా చెప్పినట్టు చమత్కరించారట.

ఈ పద్యాన్ని ఆశువుగా చెప్పినందుకు ఆయన విద్వత్తుకు మెచ్చి విజయ రామరాజు కనకాభిషేకం చేయించాడట. ఐతే ఆనాటి ఆనవాయితీ గా తనకు అభిషేకించబడిన ఆ బంగారు నాణాలను ఆ కవి తీసుకోవాలని రాజాజ్ఞ. కానీ సూరన మాత్రం తనకి జరిగిన సత్కారానికి మిక్కిలి సంతసించి “తమ దయవలన ఇంత వరకు స్నానం చేసిన ఉదకమును పానము చేయ లేదు. తమరి ఆజ్ఞని సిరసావహించనందుకు మన్నించమని తీసుకోవడనికి సమ్మతించలేను” అన్ని ఆ నాణాలు తీసుకోలేదట. అందుకు ముగ్ధుడైన రాజు తగు రీతిన సత్కరించాడట. బహుశ అప్పడి నుంచే “డబ్బు నీళ్ళలా వాడటం” అనే నానుడి వచ్చిందని ప్రతీతి. అంటే దీని బట్టి మన సూర కవి దారిద్ర్యానికి అధికారానికీ తల వొగ్గలేదన్న మాట.

18వ శాతాబ్దం తొలి పాదంలో సుమారు 1720 లలో జన్మించిన సూరన తండ్రిదగ్గరే ఛందస్సూ, అలంకారశాస్త్రం, సంస్కృతవ్యాకరణం చదువుకుని, తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారు. ఏదో చిన్న మడిచెక్క వున్నా పంటలు లేక, ఆయన వూరూరా తిరిగి ఆశువుగా కవిత్వం చెప్పి ఆనాటి భత్యం సంపాదించుకునేవారు. గడియకి (24 నిముషాలు) వంద పద్యాలు ఆశువుగా చెప్పగలదిట్టనని తనే చెప్పుకున్నారు.

 సూరన దినవెచ్చాలకి పద్యాలు చెప్పడం “ఇచ్చినవాడిని ఇంద్రుడనీ చంద్రుడనీ మెచ్చుకోడం, ఇవ్వనివాడిని చెడామడా తిట్టడం” చేసేవాడని సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆరుద్ర గారు రాశారు. అట్టే భాషాజ్ఞానంలేని పామరులకోసం రాయడంచేత తేలికభాషలో చాటువులు రాసేడు అన్నారు. అయితే చందోబద్ధంగా కవిత్వంలో వింతపోకడలు పోతూ చమత్కారం, ఎత్తిపొడుపూ మేళవించి రాయడంవల్ల ఈ చాటువులు పామరజనరంజకమే కాక పండితుల ఆదరణకి కూడా అంతగానూ నోచుకున్నాయి.

సంస్థానాలు తిరుగుతూ, జీవనభృతి సంపాదించుకునే రోజులలో విజయనగరం వచ్చినప్పుడు పెదసీతారామరాజు ఆయనని ఆదరించలేదు. ఆసమయంలో సూరకవి చెప్పిన పద్యం –

గీ. మెత్తనై యున్న యరటాకు మీదఁ గాక
మంటమీఁదనుఁ జెల్లునే ముంటివాడి
బీదలైయున్న మాబోంట్ల మీదఁ గాక
కలదె క్రొవ్వాడి బాదుల్లాఖాను మీఁద.

చేవ వుంటే బాధుల్లాఖాను మీద చూపించు నీప్రతాపం, అంతే కాని కూటికి గతిలేని నామీద ఏమిటి అంటూ ఎత్తిపొడిచారు.

సూరన ఎంత దారిద్ర్యం అనుభవించినా, ఆత్మగౌరవం కాపాడుకుంటూనే వచ్చేడు కానీ అధికారులకి తల ఒగ్గలేదు.

చినవిజయరామరాజు సూరనని ఆదరించిన తరవాత, రాజుగారి సవతి అన్నగారు అధికారం వహించి, సూరనని ఉప్పూ, పప్పూకోసం కోమటులని పొగడడం మానుకోమని ఆంక్ష పెట్టారు కానీ సూరన ఆఆజ్ఞని తలకెత్తుకోక, తన అభీష్టంప్రకారమే జీవనసరళి సాగించుకున్నారు..

మామూలుగా మనఇళ్లలో నిత్యం అనుభవమే, భార్య, భర్తని వూళ్లో అందరికీ చేస్తారూ, అందరినీ పొగుడుతారు, మనవాడిని కూడా ఓమంచిమాట అనొచ్చు కదా అని.

అలాటిదే ఈ చాటువు. సూరన సతి సీతమ్మ ఒకసారి “అందరిమీదా పద్యాలు రాస్తారు, మన అబ్బాయి బాచన్న మీద రాయరేం” అని అడిగిందిట. అందుకు సూరకవి తన సహజ ధోరణిలో

క. బాచా బూచుల లోపల
బాచన్నే పెద్ద బూచి పళ్లుం దానున్

బూచంటే రాత్రి వెఱతురు
బాచన్నంటే పట్ట పగలే వెఱతుర్
అని చదివాడట, తన కుమారుడు రూపసి కాడని స్పష్టం చేస్తూ.

సీతమ్మ చాల్లెండి మీవేళాకోళం అని ఆయన్ని మందలించిందిట.

అలాగే మరోసారి ఆయన చీపురుపల్లినుండి ఆదపాకకి వెళ్తుంటే, దారిలో ఒక సాలెవారి చిన్నది కనిపించింది. ఆయనే పలకరించేరు ఎక్కడికి అని. అదపాక అత్తవారింటికి వెళ్తున్నానని చెప్పి, బాబూ, నామీద ఒక పద్యం చెప్పండి అని అడిగింది. ఆయన వెంటనే తన సహజ ధోరణిలో ఆశువుగా చెప్పిన పద్యం.

క. అదపాక మామిడాకులు
పొదుపుగా నొక విస్తరంట బొడినవాఁడే
ముదమొప్ప విక్రమార్కుఁడు
అదపాకా అత్తవారు ఔనే పాపా.

ఇక్కడ కవిగారు మామిడాకుల ప్రసక్తి తేవడానికి కారణం అదపాకలో మామిడాకులు విస్తరాకులు కుట్టడానికి వెడల్పులేనివి, విస్తరాకులు కుట్టడానికి వీలుగా వుండవు అనిట.

ఎవరిని నువ్వు అనొచ్చు. ఎవరిని గౌరవపురస్సరంగా మీరు అనాలి అన్న వాదన ఈమధ్యనే వచ్చింది గాదు.

ఈకింది పద్యం, దానిమీద జరిగిన చిన్న చర్చ చూడండి. సూరన చినవిజయ రామరాజు శౌర్యపటిమని ప్రశంసిస్తూ చెప్పిన పద్యం.

ఉ. పంతమున నీకుఁజెల్లు నొకపాటి యమీరుఁడు నీకు లక్ష్మమా
కుంతము గేలు బూని నిను గొల్వనివాడు ధరిత్రిలోన భూ
కాంతుఁడొకండు లేడు కటకంబు మొదల్కొని గోల్కొండ ప
ర్యంతము నీవెకా విజయరామనరేంద్ర! సురేంద్రవైభవా.

కటకం నించీ గోల్కొండ వరకూ కత్తి చేత పట్టి నీకు సలాములు చెయ్యని రాజు ఒక్కడు కూడా లేడు, నీకు నీవే సాటి అన్నాడు సూరన. సభికులు భళీ అంటూ కరతాళధ్వనులు చేశారు. రాజు గారు కూడా మెచ్చుకున్నారు కానీ నొచ్చు కోకుండా వుండలేకపోయారు. తనంతటి ప్రభువుని నువ్వు అంటూ ఏకవచనంలో సంబోధించడం బాగులేదు అన్నారు.

సూరకవి వెంటనే,
క. చిన్నప్పుడు రతికేళిని
నున్నప్పుడు కవితలోనన్ యుద్ధములోనన్
వన్నెసుమీ ‘రా’ కొట్టుట
చెన్నగునో పూసపాటి సీతారామా!

పిల్లలవిషయంలో, పడగ్గదిలో, కవిత్వం చెప్పినప్పుడు, యుద్ధంచేసే అప్పుడూ ఏకవచనం వాడితే తప్పులేదు అంటూ రాజుగారిని సమాధాన పరిచారు. ఇంచుమించు ఇదే అర్థాన్నిచ్చే శ్లోకం ఒకటి సంస్కృతంలో వుందిట.

ఇక ఆయన “పొణుగుపాటి వేంకట మంత్రి” అనే మకుటంతో 39 కంద పద్యములు కళింగ దేశ ప్రాంతంలో వ్యాప్తి లో ఉన్నాయట. ఈయన శృంగవరపు కోట జమిందారు శ్రీముఖి కాశీపతిరావు గారి వద్ద దివానుగా ఉండేవాడట. అంతే కాదు మన సూర కవి గారు ఈ మంత్రి గారి ఇంట ప్రతి ఏటా మూడు నాలుగు మాసాలు గడుపుతూ ఉండేవాడట. మచ్చుకి ఒకటి రెండు కంద పద్యములు…

1. వెన్నెల వలె కర్పూరపు
దిన్నెల వలె నీదు కీర్తి దిగ్దేశములన్
మిన్నంది వన్నెకెక్కును
విన్నావా పొణుగు పాటి వేంకట మంత్రీ !

2. చుక్కలవలె కర్పూరపు
ముక్కలవలె నీదు కీర్తి ముల్లోకములన్
క్రిక్కిరిసి పిక్కటిల్లెను
వెక్కసముగ పొణుగు పాటి వేంకట మంత్రీ !

3. పొగ త్రాగ నట్టి నోరును
పొగడం గా బడయ నట్టి భూపతి బ్రతుకున్
మగడొల్లని సతి బ్రతుకును
వెగటు సు మీ పొణుగు పాటి వేంకట మంత్రీ !

కంద పద్యానికి చౌడప్ప అలవరించిన తేట దనానికి మెరుగులు దిద్దడం సూరకవి కందములో అందముగా అగుపిస్తుందట. ఇక పోతే చుక్కలవలె అన్న పద్యం “కన్యాశుల్కం”లో గిరీశం ఉపన్యాసాలలో చోటు చేసుకునేంత ప్రసిద్ధమైనదట. ఈయన చాటువులు సమకాలీన కవితా రంగం పై గంట పట్టిన ప్రతి వాడూ వ్రాయడాన్ని గురించి ఇలా విమర్శించాడట.

“దేవునాన మున్ను దేశాని కొక కవి
ఇప్పుడూర నూర నింట నింట
నేవు రార్గు రేడ్గు రెనమండ్రు తొమ్మండ్రు
పదుగురేసి కవులు పద్మ నాభా !” అని ఎత్తి చూపారట.

సూర కవి “తిట్టు కంసాలి సుత్తి పట్టు” అన్నట్టు గా సూర కవి చాటువులు విజయనగర సమీపంలోని రామచంద్రాపురంలో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందాయట.

ఆయన రామలింగేశ శతకం సమకాలీన సాంఘిక జీవనానికి దర్పణం వంటిది.

అంతే కాదు, ధన ధాన్యాలను దోచుకునే రాజులను
“పదుగురు కోతి వెంబడి సంచ రింపరే-వాహకుల్లేరె శవంబునకును
గంగి రెద్దుకులేని ఘన తూర్య రావముల్-కలిమి గల్గదె వారి కామినులకు
న్యాయ పద్ధతి నడువని యవనిపతికి నెన్ని చిన్నెలు గలిగిన నెందు కొరకు”

-అంటూ ఈ శతకము నుంచి ఉదహరింప బడినవి. వీరి రచనల్లో నింద దూషణ అధిక్షేపముతో బాటు హాస్యం మేళవించిన రచనలే ఎక్కువ.

శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింట నుంట,
రాజీవాక్షుండు అవిరళముగ శేషుని పై పవళించుట
నల్లి బాధ పడలేక సుమీ
-అన్న పద్యంలో చాటువు హాస్యం కుడా మిళిత మై ఉండటం గమనార్హం.

 ఈయన తిట్టు పటిమను గురించి తిట్టు కవిగా

“గంటకు నూరు పద్యములు గంటము లేక రచింతు తిట్ట గా
దొడ గితినా పఠీలుమని తూలి పడన్ కుల రాజముల్
విడువ కనుగ్రహించి నిరుపేద ధనాధిపు లార్యు చేతునే
నడిదము వాడ సూరన సమాఖ్యుడ నాకొకరుండు సాటియే”
-అంటూ ఆయన రాజాస్థానాలను సందర్శించి విజయాన్ని చేపట్టి నట్టు తెలుస్తోంది

సాహిత్యం సిరిగలవారిళ్ల రసజ్ఞులకోసం మాత్రమే అనుకునే రోజుల్లో సామాన్యులని తనకవితా మాధురితో చమత్కారంతో అలరించిన కవి అడిదము సూరకవి.

వీరి రచనల్లో నింద దూషణ అధిక్షేపముతో బాటు హాస్యం మేళవించిన రచనలే ఎక్కువ.

ఈయనకు శాపానుగ్రహ సమర్థుడు అనే బిరుదు కలదు. దేశం లో అనేక ప్రాంతాల్లో సందర్శించారు. సంవత్సరం లో ఆరు మాసాలు దేశ సంచారము చేసేవారట. సూరకవి తన సమకాలీన పండితులనెందరితోనో, వాగ్వివాదాలు చేసి, గెలిచారట.

సూరకవి బహు గ్రంధకర్త. ఆయన రచనలు.

కవిజనరంజనము

కవిసంశయ విచ్ఛేధ

చంద్రలోకం

ఆంధ్ర నామ శేషము

రామలింగేశ శతకము

పొణుగుపాటి వేంకట మంత్రి శతకము

రామదండకము

 ఈయన 1785 లో పరమపదించారు.

Wednesday, November 28, 2018

"దక్షిణామూర్తి స్తోత్రం"

గురుగ్రహ దోష నివారణకు

దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలించినప్పుడు ఒక మర్రి చెట్టుకింద కూర్చుని ఒక కాలు రాక్షసుణ్ణి తొక్కిపట్టి ఉంటుంది. మరో కాలు పైకి మడిచి ఉంటుంది.చుట్టూ ఋషులు కూర్చుని ఉంటారు. ఈ భంగిమలోని ఆంతర్యమేమిటో తెలుసుకుందాం.

బ్రహ్మ యొక్క నలుగురు కుమారులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు బ్రహ్మ జ్ఞానం కోసం అనేక రకాలుగా తపస్సు నాచరించారు. అయినా వారికి అంతుపట్టలేదు. వారు చివరికి పరమ శివుని దగ్గరకు వెళ్ళి తమకు పరమోత్కృష్టమైన జ్ఞానాన్ని ప్రబోధించాల్సిందిగా కోరారు. అప్పుడు శివుడు ఒక మర్రి చెట్టు కింద కూర్చున్నాడు. ఆయన చుట్టూ నలుగురు ఋషులు కూర్చున్నారు. శివుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆ యోగ భంగిమలోనే కూర్చున్నాడు. ఋషులందరికీ అనుమానాలన్నీ వాటంతట అవే తొలగిపోయి జ్ఞానోదయమైంది. ఈ రూపాన్నే దక్షిణామూర్తిగా హిందూ పురాణాల్లో వర్ణించబడింది.ఈ రూపం మనకు ఏమని సూచిస్తుందంటే జ్ఞానమనేది మాటల్లో వర్ణించలేనిది, కేవలం అనుభవించదగినది అని. గురు దక్షిణామూర్తిగా మనం పూజించే దక్షిణామూర్తి గురువులకే గురువు. అందుకనే ఈయన గురించి మన పురాణాల్లో విస్తృతంగా వర్ణించారు.

స్మార్త సంప్రదాయంలో గురు సంప్రదాయానికి ఆద్యుడు దక్షిణామూర్తి. ఉత్తర భాగాన (అనగా ఎడమభాగాన) అమ్మవారి స్వరూపం లేని కేవల శివ స్వరూపం కనుక దానికి ‘దక్షిణామూర్తి’ అని పేరు. మేధా దక్షిణామూర్తి వేరే దేవత కాదు. ఆ స్వామిని ప్రతిపాదించ మంత్రాలలో ఒక మంత్రానికి అధి దేవతామూర్తి మాత్రమే. అలాగే శ్రీ దత్తాత్రేయుడు, గురుదత్తుడు అనేవారు వేరేవేరే దేవతామూర్తులు కాదు. ఈ దత్తుడు త్రిమూర్త్యాత్మకుడు. సర్వసంప్రదాయ సమన్వయకర్త. ఇక దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు వీరిద్దరూ ఒకరేనా అంటే, తత్త్వ దృష్టిలో ఖాయంగా ఒకరే. వ్యావహారిక దృష్టిలో, ఉపాసనా విధానంలో మాత్రం భిన్నులు. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఒకరా? వేరా? అంటే, ఏమి చెబుతామో, ఇక్కడా అలాగే చెప్పుకోవాలి. ఒక దృష్టితో భిన్నత్వం! మరో దృష్టితో ఏకత్వం!!

శివుని గురు స్వరూపాన్ని దక్షిణామూర్తిగా ఉపాసించడం సంప్రదాయం. దక్షిణ అంటే సమర్థత అని అర్ధం. దుఃఖాలకు మూల కారణం అజ్ఞానం. అలాంటి అజ్ఞానం నాశనమైతే దుఖాలన్నీ తొలగిపోయాయి. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించేది దయాదాక్షిణ్యం. ఈ దాక్షిణ్యం ఒక మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి.

మహర్షులు దర్శించిన దక్షిణామూర్తులు అనేక రకాలు. మొట్టమొదట బ్రహ్మకు దర్శనమిచ్చారు దక్షిణామూర్తి. ఆ తర్వాత వశిష్టునకు, సనకసనందనాదులకు కూడా సాక్షాత్కరించారు దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఉపాసించేవారికి బుద్ధి వికసిస్తుంది. అందుకే దక్షిణామూర్తిని పూజించమని విద్యార్ధులకు ప్రత్యేకంగా చెప్తారు. విష్ణు, బ్రహ్మ, సూర్య, స్కంద, ఇంద్ర తదితరులు దక్షిణామూర్తిని ఉపాసించి గురుత్వాన్ని పొందారు.

మంత్రశాస్త్రం అనేక దక్షిణామూర్తులను ప్రస్తావించింది.

ఆ రూపాలు వరుసగా....

శుద్ధ దక్షిణామూర్తి, మేధా దక్షిణామూర్తి, విద్యా దక్షిణామూర్తి, లక్ష్మీ దక్షిణామూర్తి, వాగీశ్వర దక్షిణామూర్తి, వటమూల నివాస దక్షిణామూర్తి, సాంబ దక్షిణామూర్తి¸హంస దక్షిణామూర్తి, లకుట దక్షిణామూర్తి, చిదంబర దక్షిణామూర్తి, వీర దక్షిణామూర్తి, వీరభద్ర దక్షిణామూర్తి¸ కీర్తి దక్షిణామూర్తి, బ్రహ్మ దక్షిణామూర్తి¸ శక్తి దక్షిణామూర్తి, సిద్ధ దక్షిణామూర్తి.

ప్రధానమైన ఈ 16 మూర్తులలో వట మూల నివాస దక్షిణామూర్తినే వీణా దక్షిణామూర్తిగా శాస్త్రం చెబుతోంది. భస్మాన్ని అలముకున్న తెల్లనివాడు, చంద్రకళాధరుడు, జ్ఞానముద్ర, అక్షమాల, వీణ, పుస్తకాలను ధరించి యోగముద్రుడై స్థిరుడైనవాడు, సర్పాలను దాల్చిన కృత్తివాసుడు పరమేశ్వరుడైన దక్షిణామూర్తి. తెలివిని, విద్యను మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు.

పైన వివరించిన దక్షిణామూర్తులలో మేధా దక్షిణామూర్తి విద్యార్ధులకు చదువును ప్రసాదించగలడు. సరస్వతీదేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం హిందువులు కొలిచే దైవం మేధా దక్షిణామూర్తి. మేధా దక్షిణామూర్తి చలవతో పిల్లలు చక్కటి విద్యావంతులై, జీవితంలో సుఖసంతోషాలను సొంతం చేసుకుంటారు.

చిన్న పిల్లలకు చదువు దగ్గర నుండి,సంపద(ధనము) దగ్గర నుండి, పెద్దలకు మొక్షము వరకు, దక్షిణా మూర్తి ఇవ్వలేని సంపద,విద్య లేనేలేదు. చదువుకు, సంపదకు, మోక్షముకి అదిష్టానం అయి ఉంటాడు.

దక్షిణామూర్తి స్తోత్రం

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః
మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం
మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే
సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్
యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం
జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే
జానామీతి తమేవ భాంతమునుభాత్యేతత్సమస్తంజగత్
తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః
స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః
మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తా స్వను వర్తమాన మహమి త్యంతస్స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటికరోతిభజతాం యోముద్రయా భద్రయా
తస్మైశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః
శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః
స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః
తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః పుమాన్
నిత్యాభతి చరాచరాత్మక మిదం యస్మైచ మూర్త్యష్టకం
నాన్యత్కించ నవిద్యతే విమృశతాంయస్మాతత్పర స్వాదిభో
తస్మై గిరిమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే

సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్వశ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్
సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్వాదీశ్వత్వం స్వతః
సిద్ధేత్తత్పురష్టధా పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్

Monday, November 26, 2018

పూజ..? యజమాని ఉత్తరీయం..? గోచీపోసి పంచె..?


సాధారణంగా నిత్య పూజ ప్రతి ఇంట్లో స్త్రీనే చేస్తుంది. కాని నిత్య పూజ చేయడం అనేది పురుషుడు చేయాలి అంటే యజమాని నిత్యపూజా చేయాలి. సంకల్పంలోనే ఉంది "ధర్మపత్నీ సమేతస్య" అని ఉంది. కానీ ‘పతీసమేతస్య’ అని లేదు. అంటే దాని అర్థం ఇంట్లో పూజ ఇంటి యజమాని చేయాలి. ఇల్లు అబివృద్ధిలోకి రావాలి అని యజమాని కోరుకోవాలి. యజమానిగా ఉన్నవాడు అది కూడా అడగడం బరువైపోతే ఎలా..? అందువలన పురుషుడు వళ్ళు వంచి ప్రతిరోజూ పూజ చేయ్యాలి.

అదేవిదంగా నైమిక్తిక తిథులలో గాని, వ్రతమప్పుడు గాని పూజ చేసేటప్పుడు ధర్మపత్నీ, పిల్లలు కూడా ప్రక్కన ఉండాలి.

ఇక వస్త్రధారణ విషయనికి వస్తే ప్రధానంగా ఆడపిల్ల అయితే లంగా వోణీ,వివాహిత అయితే చీర కట్టుకోవాలి. అమ్మవారికి అవే కదా ప్రధానం.

మరి పురుషుల విషయనికి వస్తే, పురుషులకు సంబంధించి వేదం ఒక మాట చెప్పింది."వికచ్ఛః అనుత్తరీయశ్చ, నగ్నశ్ఛావస్త్ర ఏవచ" అనగా వికచ్ఛః అంటే గోచీ పెట్టుకోలేదు, అనుత్తరీయశ్చ అంటే పైన ఉత్తరీయం లేదు అని. గోచీ పోయకుండా కేవలం బట్టను చుట్టు మాత్రమే తిప్పి కట్టడం దిగంబర అవుతుంది. కాబట్టి పురుషుడికి ఉత్తరీయం ఉండాలి, అలాగే గోచీపోసి పంచె కట్టుకోవాలి. వెనక్కి తీసి కుచ్చిళ్ళు పోసి గోచీ వెనక్కి దోపుకోవాలి. దానిని "కచ్ఛము" అంటారు. అందుకే వేదం చదువుకున్న పెద్దలు, వాళ్ళు భోజనం చేస్తుంటే కనీసం అంగవస్త్రం అంటారు. చిన్న గుడ్డ అయినా సరే గోచీ పోసుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అసలు వికచ్ఛంగా భోజనం చేయరు. వికచ్ఛంగా పూజ దగ్గరికి వెళ్ళరు. కాబట్టి పురుషులు ఈ రెండు పద్దతులు తప్పనిసరిగా పాటించాలి. 

ఉత్తరీయం ఎటువైపు వేసుకోవాలి అంటే, ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉంటే వాడు భార్యా సహితుడు, మంగళప్రదుడు అని గుర్తు. కుడి భుజంమీద ఉత్తరీయం వేసుకుంటే భార్య చనిపోయింది అమంగళకరుడు యజ్ఞయాగాది క్రతువులకు పనికి రాడు అని గుర్తు. అసలు ఉత్తరీయం వేసుకోకపోతే పూజకు అర్హుడు కాదు అని గుర్తు. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే   యజమాని యందు పెద్దరికం వాళ్ళు చూస్తున్నారు అనడానికి గుర్తు ఎడమ భుజం మీద ఉత్తరీయం ఉన్నది చూసి, ఎందుకంటే యజమానికి అయన పెద్దరికం భుజం మీద ఉన్న ఉత్తరీయం వలనే.

కాబట్టి చొక్కా కానీ, బనీను కానీ ఏదీ ఉండకూడదు పూజ చేసేటప్పుడు.దేవాలయంలోనైనా అంతే. దేవాలయంలో వెళ్తే ఎదో చిన్నపిల్లలకి చెప్పినట్లు చొక్కా విప్పండి, బనియను విప్పండి అని చెప్పించుకోకుండ మనంతట మనమే తీసి కూర్చోవాలి. ఇలా ఎందుకంటే దేవాలయం అనే మన మనశరీరంలోని ఆత్మ పరమాత్మను చూడాలి, ఆత్మకు పరమాత్మ, పరమాత్మకు ఆత్మ కనపడాలి. అలా చెయ్యకపోతే  భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అపేక్షిస్తున్నావు అని అర్ధం. అందువలన పురుషులు(యజమాని)పూజ చేసెపుడు ఉత్తరీయం వేసుకోవాలి, గోచీపోసి పంచె కట్టుకోవాలి.....

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

Sunday, November 25, 2018


శ్రీ దేవీ ఖడ్గమాలా పుష్పార్చన ---- అమ్మా! శుద్ధ సత్త్వ రూపిణియై దశ సంస్కార రహితయైన విమలాదేవీ మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! బాలభాస్కరసమమగు అరుణవర్ణం కలిగి, అరుణ వస్రాన్ని ధరించి, మందారాది అరుణపుష్పాలయందు ప్రీతి కల దేవీ మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! జయమే స్వరూపంగా గలిగి భక్తులకు జయాలను ప్రసాదించు తల్లీ మీకు నమస్కరించుచున్నాను . అమ్మా! చరాచర విశ్వానికీ, సృష్టిస్థితి సంహారాలు చేయునట్టి త్రిమూర్తులకూ సైతం ఈశ్వరి అయిన సర్వేశ్వరీ దేవీ మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడగు శివుడు -జగత్కారణ స్వరూపిణియగు సగుణ బ్రహ్మశక్తియే మాత. ఇట్టి శివశక్త్యాత్మక సామరస్య సూచక కౌళినీ స్వరూపిణియగు దేవీ మీకు నమస్కరించుచున్నాను.అమ్మా! శ్రీ చక్రాధిష్టాత్రియై తేజరిల్లుతూ తన ఉపాసకులకు రోగములు రాకుండ కాపాడు నట్టియు, జన్మాంతర ఆదివ్యాధులను కూడా రూపుమాపునట్టిదియు అయిన మహేశ్వరీ మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! శ్రీ చక్రాంతర్గత నవావరణ దేవతలలో గల రహస్యయోగినీ బృందానికి అధిష్టాత్రియైన మాతా మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! బాణములను దాల్చి భక్తులను రక్షించు మాతా మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! చాపాయుధధారిణీ మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! మహాకామేశ్వరి,మహావజ్రేశ్వరి,మహాభగమాలిని,సర్వసిద్దిప్రద చక్రస్వామిని అతి రహాస్యయోగిని,శ్రీ శ్రీ మహాభట్టరకే,సర్వనందామయి చక్రస్వాభిని,పరఅపర రహాస్య యోగిని,దేవీ మీరు మా పుష్పాలంకరణ స్వీకరించండి తల్లీ! ఈ గులాబీ మొక్క చూడమ్మా! నీ కోసం ఎన్ని పువ్వులు పూచిందో! ఈ రోజు ఈ పువ్వులను మీకు సమర్పించాలని మొక్కతల్లి తన బిడ్డలను అందముగా తయారుచేసి, అమ్మ దగ్గర వినయ విదేయతలు, భక్తితో మెలగమని, అమ్మకు తలలు వంచి నమస్కరించమని, తమ బిడ్డలకు బుద్ధులు చెబుతుంది ఈ మొక్క తల్లి. తల్లి మాట జవదాటని ఆ చిన్ని గులాబీలు తలలు వంచి వినయవిదేయలతో మీకు నమస్కరించుచున్నాయి. కొన్ని గులాబీలు లేత ఎరుపురంగులో, కొన్ని గులాబీలు కుంకుమరంగులో శోభిస్తున్నాయి అమ్మ. తమ బిడ్డలు దూరం అవుతున్నాయి అని తెలిసినా, ''అమ్మ దగ్గరికే కదా వెళ్ళేది'' అని ధైర్యంతో వున్నదమ్మా ఆ మొక్క తల్లి. తను కన్నీరు పెట్టుకుంటే ఆ చిన్ని చిన్ని గులాబీలు ఎక్కడ తల్లడిల్లి పోతాయోనని, తన కన్నీటిని తనలోకే పంపుకుని, ఆ చిన్ని చిన్ని గులాబీలను తన ఒడిలో చేర్చుకుని, వాయు స్పర్సతో, తను ఊగుతూ, బిడ్డలని ఊపుతూ, జోల పాట పాడుతుంది ఆ తల్లి. అమ్మా! ప్రేమలు మాకేనేమో అనుకున్నాను. ఈ మొక్కలకు కూడా ఉంటాయని అర్ధం అయ్యిందమ్మా! ఆ మొక్కతల్లి త్యాగానికి, ధైర్యానికి, శాంతికి యేమని కృతజ్ఞతలు చెప్పుకోవాలో మాటలు రావడంలేదు తల్లి. నా భావాన్ని ఆ మొక్కతల్లి దగ్గర నివేదించుకున్నాను అమ్మ. అప్పుడు నాకేమి అనిపించిందంటే! ఆనందముతో వాయుదేవుడు ఎంత వేగముగా వచ్చినా, తను మాత్రం చిన్నగానే ఊగుతుంది. తామర పువ్వు రాలిపడిపోతాయో నని భయంతో, ఆ తల్లి భూమాతకు ఎన్నోసార్లు ఆ తామరపువ్వులను నివేదన చేసింది. ఇప్పుడు ఈ నవరాత్రులలో ఈ చిన్ని చిన్ని తామర పువ్వులను నేలరాలకముందే మీ సన్నిధికి చేర్చాలని తన భావనని తెలియచేసింది మొక్కతల్లి. అమ్మా! ఆ మొక్కతల్లికి నమస్కరించి, ఇప్పుడు సంతోషముతో మీ నామజపం చేస్తూ మీకు ఈ పువ్వులను మీకు సమర్పించాలని అనిపించింది అమ్మ. ఇప్పుడే పువ్వులు కోసుకుని తీసుకుని వస్తాను అమ్మా. ఆలస్యం అయ్యిందని ఆగ్రహించకు తల్లి. ఇప్పుడు సంతోషముతో ఈ పువ్వులను మీకు సమర్పిస్తాను, తల్లికి దూరం అయిన ఆ బిడ్డలను అక్కున చేర్చుకోని ఓదార్చి నీలో కలుపుకో అమ్మ. బిడ్డలకు దూరం అయిన ఆ తల్లికి మనోధైర్యాన్ని ఆ తల్లికి ఇచ్చి తన కర్తవ్యాన్ని తను చేసేటట్లుగా ఉత్సాహాన్నిచ్చి చివరికి నీలో కలుపుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లి. అమ్మా ! ఇంకేమి చెప్పను మాటలు రాని మౌనంతో పువ్వులు సమర్పిస్తూ పూజ చేస్తున్నాను. ఇంతకు మించి నాకు ఏమి కావాలి అమ్మ. ధన్యురాలిని అమ్మ. మీకు నమస్కరించుచున్నాను. మా నమస్కారాన్ని స్వీకరించు అమ్మా!శ్రీ జోగుళాంబాదేవి
అలంపుర క్షేత్రే!!!!!!
*సేకరణ: నా మిత్రబృందం *
నమ్మకం

శ్రీరాముడు రావణునితో
యుద్ధం చేసి అతనిని సంహరించాడు
యుద్ధం ముగిసింది ఆ రాత్రి రామలక్ష్మణులు
కపి సైన్యంతో సముద్ర తీరంలో విశ్రమించారు

అర్థరాత్రి అయింది .......
రాముడు లేచి సముద్రం దగ్గరకు వెళ్ళాడు
ఒక్కొక్క రాయి తీసికొని సముద్రం నీటిలో వేస్తున్నాడు
ప్రతి రాయి మునిగిపోతుంది .........

రాముడు లేచి కడలి చెంతకు వెళ్ళడం
గమనించిన హనుమంతుడు
తాను రాముని వెంట వెళ్ళాడు
రాముడు రాళ్ళను సముద్రంలో వేయడం గమనించారు
రాముని ముందుకు వెళ్ళి నమస్కరించి మహాప్రభూ
ఎందుకిలా రాళ్ళను అంబుధిలో వేస్తున్నారు
అని ప్రశ్నించాడు

హనుమా ! నువ్వు నాకు
అబద్ధం చెప్పావు అన్నాడు రాముడు
అదేమిటి స్వామి ! నేను మీకు అబద్ధం చెప్పానా ?
ఏమిటి స్వామి అది ?
ఆశ్చర్యంతో అడిగాడు ఆంజనేయుడు
వారధి కట్టేటప్పుడు నా పేరు
జపిస్తూ రాళ్ళను కడలిలో వేశామని
అవన్నీ తేలి వంతెనలాగా ఏర్పడ్డాయని చెప్పావు
నిజమేనా ? .. అన్నాడు రాముడు
అవును స్వామీ !..

నా పేరు జపింవి వేసిన రాళ్ళు తేలడం నిజమైతే
నేను స్వయంగా వేస్తున్న రాళ్ళు ఎందుకు
తేలడం లేదు ? మునగడానికి కారణమేమిటి ?..
నువ్వు చెప్పిన మాట అబద్ధం కాదా !..
అడిగాడు రాముడు

హనుమంతుడు వినయంగా
చేతులు కట్టుకుని ఇలా అన్నాడు
రామచంద్ర ప్రభూ ! ....
మేము మిమ్ము మీ శక్తిని నమ్మాము
మీ మీద నమ్మకంతో వేశాము
మా నమ్మకం వలన అవి తేలాయి
మీకు మీ శక్తి మీద నమ్మకం లేదు
అనుమానంతో అపనమ్మకంతో రాళ్ళను వేశారు
అందుకే అవి మునిగిపోయాయి
నమ్మకం విలువ అది .....

గుట్టీ సుబ్రహ్మణ్యశర్మ.....

నవ దుర్గా స్తోత్రం


హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ |
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ||

వందే వాఞ్ఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||

ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ||

వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||

సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

బిల్వాష్టకం


త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం;
త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ||1||

త్రిసాఖైః బిల్వపత్రైశ్ఛ, అస్ఛిద్రై కోమలై శుభైః;
తవ పూజాం కరిష్యామి, ఏక బిల్వం శివార్పణం. ||2||

కోటి కన్యా మహా దానం, తిల పర్వత కోటయః;
కాంచనం శైలదానేన, ఏక బిల్వం శివార్పణం. ||3||

కాశీ క్షేత్ర నివాసంచ, కాల భైరవ దర్శనం;
ప్రయాగే మాధవం దృష్ట్వా, ఏక బిల్వం శివార్పణం. ||4||

ఇందు వారే వ్రతమస్థిత్వ, నిరాహారో మహేశ్వర;
నర్థం ఔష్యామి దేవేశ, ఏక బిల్వం శివార్పణం. ||5||

రామ లింగ ప్రతిష్ఠాచ, వైవాహిక కృతం తధా;
తటాకాచిద సంతానం, ఏక బిల్వం శివార్పణం. ||6||

అఖండ బిల్వ పత్రంచ, ఆయుతం శివ పూజనం;
కృతం నామ సహస్రేన, ఏక బిల్వం శివార్పణం. ||7||

ఉమయా సహదేవేశ, నంది వాహన మేవచ;
భస్మ లేపన సర్వాగం, ఏక బిల్వం శివార్పణం. ||8||

సాలగ్రామేషు విప్రాణాం, తటాకం దశ కూపయో;
యజ్ఞ కోటి సహస్రస్య, ఏక బిల్వం శివార్పణం. ||9||

దంతి కోటి సహశ్రేషు,అశ్వమేవ శతకృతౌ;
కోటి కన్యా మహా దానం,ఏక బిల్వం శివార్పణం. ||10||

బిల్వనాం దర్శనం పుణ్యం,స్పర్శనం పాప నాశనం;
అఘోర పాప సంహారం,ఏక బిల్వం శివార్పణం. ||11||

సహస్ర వేద పాఠేషు,బ్రహ్మ స్థాపన ముచ్చతే;
అనేక వ్రత కోటీనాం, ఏక బిల్వం శివార్పణం. ||12||

అన్నదాన సహశ్రేషు,సహస్రోప నయనంతాధా,
అనేక జన్మ పాపాని,ఏక బిల్వం శివార్పణం. ||13||

బిల్వాష్టక మిదం పుణ్యంయః, పఠేచ్ఛివ సన్నిధౌ;
శివలోక మవాప్నోతి, ఏక బిల్వం శివార్పణం. ||14||

శతానంద మహర్షి

శతానంద మహర్షి ఎవరో కాదు గౌతమ మహర్షి అహల్యలకు పుట్టిన నలుగురు కొడుకులలో పెద్దవాడు. గౌతమ మహర్షి అహల్యలు కొన్ని వేల సంవత్సరాలు దాంపత్య బ్రహ్మచర్యము గడుపుతూ లోకంలో కరువు కాటకాలు ప్రబలినపుడు తమ తపఃశక్తితో మూడులోకాల వాళ్లకి అన్నవస్త్రాలు ఇచ్చారు. ఇలా చాలా కాలం గడచిన తరువాత గౌతముడు అహల్యని ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె స్త్రీకి సహజంగా ఉండే కోరిక అయిన మాతృత్వాన్ని కోరుకుంది.

అహల్య కోరిక మేర గౌతముడు ఆమెను వంద వనములలో తిప్పి, వందరకాలుగా ఆనందపడేలా చేసాడు. అలా శత రకాలుగా ఆనందపడి కొడుకుని కన్నారు కాబట్టి ఆ బాలుడికి శతానందుడు అని పేరు పెట్టారు. శతానందుడు తండ్రి గౌతముని దగ్గరే సమస్త వేదశాస్త్రాది విద్యలు నేర్చుకుని బ్రహ్మచర్యాశ్రమము పాటిస్తూ మహా తపశ్శాలి అయ్యాడు. అతని బుద్ధివైభవము, జ్ఞానసంపద, తపోనిరతి విని జనక మహారాజు తన ఆస్థాన పురోహితునిగా వుండుమని ప్రార్ధించాడు. ఇది విన్న గౌతమ మహర్షి ఆనందించి, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి ఇద్దరినీ మిథిలా నగరానికి పంపాడు. అక్కడ జనకుడు శతానండుడిని తమ కులగురువుని చేసుకున్నాడు.

తరువాతి కాలంలో గౌతముడు అహల్యను శపించటం, శ్రీరాముదు పుట్టటం, వనవాసము, యాగ రక్షణకోసం విశ్వామిత్రుని వెంట వెళ్ళటం, శతానందుని తల్లి అయిన అహల్య శాపవిమోచనము మొదలయినవి జరిగిపోయి, శ్రీరాముడు మిధిలకు వచ్చినప్పుడు, జనక మహారాజుతో శతానందుడు వారికి స్వాగతం పలుకుతాడు. శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుడి గొప్పతనం గురించి వివరంగా చెప్తాడు.

మిథిలా నగరంలో ఏర్పాటు చేసిన సీతా స్వయంవరంలో రాముడు శివధనస్సును విరిచి సీతమ్మను పెల్లిచేసుకునే సందర్భంలోదశరథుడి వైపు వశిష్టుడు ఉంటే జనకుడి వైపు శతానందుడు ఉండి గోత్రప్రవరాలు చెప్పి సీతారామ కళ్యాణం చేయించారు.

కొంతకాలం తరువాత సతానండుడికి తన భార్య వల్ల సత్యధృతుడు అనే కొడుకు పుడతాడు. అతను పుడుతూనే చేతిలో బాణంతో పుట్టటం వల్ల అతనికి 'శరద్వంతుడు' అని పేరు వచ్చెను. అప్పటినుండే శరము అంటే బాణం వదలకుండా ఉండటం వల్ల అతని మనస్సు వేదశాస్త్రాది విద్యల వైపు కన్నా ధనుర్వేదం వైపే ఎక్కువగా మనసు పారేసుకునేవాడు. గొప్ప తపఃశక్తితో ఎన్నో అస్త్రాలు పొంది ఇంకా మరెన్నో అస్త్రాలని పొందటానికి తపస్సు చేస్తూనే ఉండేవాడు.

శతానందుని కొడుకైన శరద్వంతుడికి కృపుడు, కృప అని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుట్టారు. వాళ్ళని ఎక్కువ కాలం శంతనమహారాజే పెంచుతాడు. కృపుడు కూడా ధనుర్విద్యలో గొప్పవాడయ్యి కృపాచార్యుడిగా పేరు పొంది కౌరవ - పాండవులకి గురువయ్యాడు.

ఈ విధంగా శతానంద మహర్షి తన తపఃశక్తి వల్ల మాత్రమే కాకుండా మంచి కొడుకు, మంచి మనవల్ని కూడా పొందటం వల్ల ఇంకా గొప్పవాడయ్యాడు.

నంది తిమ్మన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకరు


శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకరు. ఆయన రాయల భార్య తిరుమల దేవికి అరణంగా విజయనగరం వచ్చిన కవి. ఈయన అనంతపురం పరిసర ప్రాంతానికి చెందిన వాడని భావిస్తున్నారు. ఈయన నివసించిన రాజ్యం, విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. ఆ సామంత రాజ్యపు యువరాణి తిరుమలాదేవి ఆ తరువాత కృష్ణదేవరాయల ధర్మపత్ని అయ్యింది.

వీరు నంది సింగన, తిమ్మాంబ దంపతులకు జన్మించారు.

ఈయన తాత నంది మల్లయ్య మరియు మేనమామ ఘంట సింగన్న (ఈయనకే మలయమారుత కవి అనికూడా మరోపేరు) కృష్ణదేవరాయల తండ్రి అయిన వీరనరసింహరాయల ఆస్థానంలో జంటకవులుగా ఉండేవారు. నంది తిమ్మనను ముక్కు తిమ్మన అని కూడా అంటారు. వీరి జీవిత కాలం 1475-1540.

తిమ్మన జన్మతః శైవుడు, అఘోర శివాచార్యుల శిష్యుడైనా, వైష్ణవ రాజాస్థానంలో ఉన్నందువలన, అప్పటి రాజకీయ-సామాజిక పరిస్థితుల వల్ల కొన్ని వైష్ణవ రచనలు కూడా చేశారు.. .

1521లో ముక్కు తిమ్మన రాయల తరఫున గయను సందర్శించి అక్కడ నావాడ నాయకులపై కృష్ణదేవరాయల విజయానికి ప్రతీకగా ఒక విజయశాసనం ప్రతిష్టించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ప్రసిద్ధి చెందిన కృష్ణదేవరాయల గయ శాసనం క్రింద రాజప్రశస్తిని కీర్తిస్తూ చెక్కబడిన కంద పద్యం ముక్కు తిమ్మన వ్రాసిన పారిజాతాపహరణంలోనిది కావటం, కృష్ణదేవరాయలు గయను సందర్శించిన ఆధారం లేకపోవటం ఈ సంభావ్యతకు మద్దతునిస్తున్నాయి.

రచనా శైలి:
--------------
తిమ్మన రచన పారిజాతాపహరణం ప్రసిద్ధి చెందింది. ఇతను “వాణీ విలాసము” అనే మరొక కావ్యాన్ని రచించినట్లు తెలుస్తున్నా అది లభ్యం కావడం లేదు.

తన సమకాలికుడైన అల్లసాని పెద్దన వలే క్లిష్టమైన పదప్రయోగాలకు పోకుండా సున్నితమైన, సులువైన పద్దతిలోనే రచనలు చేశాడు. ఈయన రచనలు కేవలం పండితులకే కాక పామర జనులను సైతం విశేషంగా ఆకర్షించేవి. అందుకే ఆయన రచనలను ముక్కు తిమ్మన ముద్దు పలుకులు అని వ్యవహరిస్తారు. పారిజాతాపహరణం లో ఆయన రచించిన సుకుమారమైన శృంగార రసాత్మకమైన పద్యాలు ఇప్పటికీ పండితుల నోళ్ళలో నానుతూనే ఉంటాయి.

ముక్కు తిమ్మనాచార్యు ముద్దు పలుకు
ఈ నానుడి తిమ్మన పద్యరచనారీతిని బట్టి, శైలీశయ్యాది సౌభాగ్యాన్ని బట్టి ఏర్పడి ఉంటుంది.పాత్రనుబట్టి శైలిని మార్చడం, నాటకీయతను పొందుపరచడం, సామెతలు, సూక్తులు ప్రయోగించడం, సమయోచిత ఉపమానాలు ప్రయోగించడం, తెలుగు నుడికారాన్ని వాడడం, చమత్కారంగా చెప్పడం మొదలైన వాటివల్ల ఇవి “ముద్దు పలుకులు” అనిపిస్తాయి.

అనవిని వ్రేటుబడ్డ యురగాంగనయుంబలె నేయివోయ
 బగ్గున దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి హె
 చ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సం
 జనిత నవీన కాంతి వెద జల్లగ గద్గద ఖిన్న కంఠియై!

పద్యానవనం
 తెలుగునాట పద్యాన్ని ఎంతో రమ్యంగా నడిపిన వారిలో నంది తిమ్మన ఒకరు. సాహితీ సమరాంగణ  సార్వభౌముడని పేరు గడించిన కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఆయనొకరు. అందమైన మహిళ ముక్కును సహజాతి సహజమైన సంపెంగ పూలతో పోలుస్తూ అత్యద్భుతంగా వర్ణించినందుకు ఆయన్ని ముక్కుతిమ్మన అని కూడా పిలిచేవారట. భాష మీద పట్టు, విలక్షణమైన శైలి కారణంగా విషయం అలవోకగా చదువరుల హృదయాలను తడుతూ, మెదళ్లను కదిలిస్తుంది.

" నానాసూనవితాన వాసనల నానందించు సారంగ మే లా న న్నొల్లదటంచు, గంధఫలి బల్కాకం తపంబంది యో షానాసాకృతి బూని సర్వసుమనస్సౌరభ్యసంవాస మై పూనెం బ్రేక్షణమాలికామధుకరీ పుంజంబునిర్వంకలన్”

అని ఆడవారి ముక్కు మీద రాసిన ఒక అందమైన పద్యం కారణంగా ‘ముక్కు తిమ్మన’ గా ప్రసిద్దికెక్కారు

తిమ్మన ప్రబంధ యుగంలో కాకుండా ప్రబోధ యుగంలో ఉండి ఉంటే,  తెలుగుజాతి మరింత ప్రయోజనం పొంది ఉండేదనిపిస్తుంది. కృష్ణ లీలల్లోని ఓ సందర్భాన్ని తీసుకొని ‘పారిజాతాపహరణం’ అనే రసవత్తర ప్రబంధ కావ్యాన్ని రాశారాయన. నారదుడిచ్చిన అరుదైన వేయిరెక్కల పారిజాత పుష్పాన్ని కృష్ణుడు పోయి పోయి రుక్మిణికిచ్చాడు. సత్యభామ లాంటి మరో భార్య ఉన్న భర్తగా కృష్ణుడు చేసే ఇంతకు మించిన తప్పిదమేముంటుంది వాతావరణం రచ్చ రచ్చ కావడానికి! అంతిమంగా అదే జరిగింది. ఇదీ సన్నివేశం.
 
 విషయం తెలియగానే దిగ్గున మంచం నుంచి లేచి సత్యభామ ఎలా స్పందించిందో చెబుతున్నాడీ పద్యంలో. మాటలు వినగానే, ఒంటిపై దెబ్బ పడగానే చర్రున లేచే ఆడపాములాగా సత్య లేచిందట! ఇంకొక పోలిక చూడండి, ఎంత పెద్ద పద సముచ్ఛయమో! ఇందులో ఇరవై అక్షరాలున్నాయి. ‘నేయివోయ భగ్గున దరికొన్న భీషణ హుతాశన కీల’ అన్నట్లు లేచిందట! అగ్నిలో నేయి పోస్తే మంటలెలా ఎగుస్తాయి? భగ్గుమని, అలా జ్వాలలా ఎగిసిందని! లేచి ఏం చేసింది? గద్గద స్వరంతో ఏదో మాట్లాడింది. అది తర్వాతి పద్యంతో అన్వయం. ఏవో మాటలు చెబితే (పూర్వపు పద్యంతో అన్వయం) విని, ఎలా స్పందించింది అన్నదే ఈ పద్యంలో పేర్కొన్నాడు.
 
 బాధ, కోపం, ఆవేశం ముప్పిరిగొనగానే కళ్లల్లో ఎర్రజీరలొస్తాయి, సహజం. ఆ ఎరుపునకు మరో ఎరుపు తోడయింది. అలంకరణలో భాగంగా కొన్ని పూల, పత్రాల లేపనాలను చెంపలపై రంగరించుకుంటారు. అటువంటి కుంకుమ పత్రపు అలంకరణ చెడిపోయి అదోరకమైన ఎరుపు కాంతి జనించిందట. ఈ రెండు ఎరుపులు కలగలిసి ఓ నూతన కాంతి ఆవిష్కృతమైంది, వెదజల్ల బడింది. అదుగో ఆ దృశ్యం గోచరమౌతున్నపుడు దుఃఖం పొంగుకొస్తుంటే, ఆమె గద్గద స్వరంతో...
 
 రమ్యమైన పదాల వాడుక ఒక్కటే భాషకు అందం తీసుకురాదు. అదొక అంశం అంతే! ఇంగ్లీషులో ఫ్రేజ్ అని చెప్పే పదసముచ్ఛయాలు, సంక్లిష్ట పదాలు తెలుగు పద్య సాహిత్యంలో చాలానే ఉంటాయి. నన్నయ లాంటి వాళ్లు ‘నిజోజ్వలత్కవచుడు’ ‘శశ్వత్కుండలోద్భాసితుడు’ ‘జగత్కర్ణపూర్ణాలోలద్గుణుడు’ వంటి పదసముచ్ఛయాల్ని ఒక్క కర్ణుడిని వర్ణించడానికే వాడారు. ఇవి ఒక రకంగా టంగ్‌ట్విస్టర్స్. ‘రిపుమర్ధనదోర్దాముడు భీముడు శపథనిబద్ద గదాయుధుడు’ (23 అక్షరాలు) అని, భీముడిని వర్ణిస్తూ ఓ సినీగీతంలో శ్రీశ్రీ వాడారు.

 ఇటువంటి పదాలు చక్కని శబ్దాలంకారాలౌతాయి. భాషను సుసంపన్నం చేయడానికి శబ్దాలంకారాలకు తోడు అర్థాలంకారాలూ ముఖ్యమే! శబ్దం-అర్థం శివపార్వతుల్లా అవిభాజ్యమైనవి. ఇదే విషయాన్ని ‘వాగార్థా వివసంప్రక్షౌ వాగర్త ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ!’ అని కాళిదాసు అత్యద్భుతంగా చెప్పారు.

 పార్వతీపరమేశ్వరౌ అన్న పదాన్ని ఉమాశంకరులు గానే కాకుండా ‘పార్వతీప’(పార్వతి పతియైన శివా!) ‘రమేశ్వర’ (లక్ష్మీ పతివైన కేశవా!) అని కూడా విడదీయవచ్చని భాషా పరిశోధకుడు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు గొప్పగా విడమర్చారు. అలా ఇంపైన పద్యాలతో అర్థ-శబ్ద రమ్యతను సాధించిన నంది తిమ్మన కీర్తి తెలుగునాట అజరామరమైనది.

రాజుగారికి, రాణిగారికి వచ్చిన అపార్ధాన్ని సవరించడం కోసం పారిజాతాపహరణ కావ్యాన్ని రాసాడని అంటారు. ఏది ఏవైనా అయిదొందల ఏళ్ళనాటి ప్రాచీన సాహిత్యాన్ని మనం ఎందుకు చదవాలి? అంటే …

పాత వాళ్లైనా కొత్త వాళ్లైనా కవులు కవులే. ఆనాటి కవులు సృష్టించిన పాత్రలు వాటి గుణగణాలు, స్వభావాలు మనకి పరిచయం ఉన్నవే. వాళ్ళ భాషాప్రయోగాలు చూసి పెదవి విరిచిన సందర్భాల కంటే ‘ ఔరా’ అనుకున్న సందర్భాలే మోతాదులో కాస్త ఎక్కువని చెప్పాలి.

భాగవత దశమస్కంధంలో మూడు శ్లోకాలని తీసుకుని ఐదు ఆశ్వాసాల పారిజాతాపహరణాన్ని సృష్టించాడు నంది తిమ్మన. నిజానికి ఈ కావ్యం విషయంలో సృష్టి అనే పదం చక్కగా నప్పుతుంది. ఎందుకంటే మూల కథలో చిరుగీతల్లా ఉన్న పాత్రలని తీసుకుని, మరువలేని,మరపురాని సజీవశిల్పాలుగా తీర్చి దిద్దాడు తిమ్మన.

ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అన్న నానుడే కాదు

“లోకమునం గల కవులకు
నీ కవనపు ఠీవి యబ్బునే కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నంది సింగయతిమ్మా! “

-నీకూ తక్కిన కవులకి హస్తిమశకాంతరభేదం ఉంది అంటూ నాటి పండిత కవులచే మెప్పులు పొందిన కవి యితడు. సరళ సుందరమైన శైలి, నాటకీయత, పాత్ర పోషణాచాతురి, అతిసుందరంగా ప్రయోగించిన అలంకారాలు, చక్కగా ఎంపిక చేసి తూచి తూచి చేసినట్టుండే పదప్రయోగం – ఇవన్నీ వాటంతట అవే పోటీలు పడి తోసుకుంటూ వచ్చి తిమ్మన కవితలో చోటు చేసుకున్నాయి

ముక్కు తిమ్మన తలనొప్పి :
---------------------------------------
'మాటలాడ గల్గు మర్మము లెరిగిన- పిన్న పెద్దతనము లెన్నవలదు - పిన్న చేతి దివ్వె పెద్దగా వెలుగదా' అంటాడు వేమన. చిన్నవాళ్లనీ, పెద్దవాళ్లననీ ఏమున్నది; పాండిత్యమే ప్రధానం. చిన్నవాడి చేతిలో ఉన్నా సరే, వెలిగే ప్రతి దీపమూ వెలుగునిస్తుంటుంది- కదూ?

అష్టదిగ్గజాలలో‌ ఒకడైన నంది తిమ్మన కవికి ఒకసారి విపరీతమైన తలనొప్పి పట్టుకున్నది.

రాయలవారు ఆయనను ఎంతో మంది వైద్యులకు చూపించారు; ఎన్నో మందులు వాడించారు. అయినా ఏమంత ప్రయోజనం లేదు. ఏ మందులు వాడినా కొద్దిపాటి ఉపశమనం; మళ్ళీ కొన్నాళ్ళకు రెట్టింపు తలనొప్పి!

'ఇలా కాదు- కాశీలో గొప్ప వైద్యులున్నారు. అక్కడికి వెళ్లి చూపించుకుంటాను' అని పరివారంతో సహా కాశీకి ప్రయాణం కట్టారు తిమ్మనగారు.

అలా వెళ్తూ వెళ్తూండగా మధ్యలో తలనొప్పి చాలా ఎక్కువైపోయింది. ఆ సరికి వాళ్ళు నెల్లూరు దగ్గర దర్శి మండలంలో ఉన్నారు. ఆ దగ్గర్లోనే 'బోదనం పాడు' అనే ఊరున్నది. వీళ్ళంతా ఆ ఊరి శివార్లలోనే డేరాలు వేసుకొని బస చేశారు.

తిమ్మన గారు తలనొప్పికి తట్టుకోలేక-పోతున్నారు. పెద్దగా అరుపులు, మూలుగులు. తిమ్మనతో పాటు వచ్చిన రాజవైద్యుడు ఏవేవో‌ మూలికలు నూరుతూనే ఉన్నాడింకా. ఆయన పరివారానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంతా గందరగోళ పడుతున్నారు.
సరిగ్గా ఆ సమయానికి అటుగా వచ్చారు, ఇద్దరు వైద్య సోదరులు. వాళ్ళిద్దరూ ఇంకా చిన్నవాళ్ళే. తండ్రి తాతలనుండి వచ్చిన వైద్యాన్ని కొనసాగించుకుంటూ బోదనం-పాడులో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. వాళ్లకు వినిపించాయి ఈ అరుపులు.

వాళ్ళు ఆ డేరాల దగ్గరకు పోయి కాపలాగా వున్న సైనికులతో "అయ్యా! మేము ఈ ప్రాంతపు ఘన వైద్యులము. ఇక్కడ ఎవరో బాధతో మూలుగుతున్నారు. మేము లోపలి వెళ్లి చూస్తాము" అన్నారు.

ఒక కాపలావాడు వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి లోపలికి వెళ్లి దండనాయకుల వారితో "ఎవరో వైద్యులట, వచ్చారు- లోపలికి పంపమంటారా?" అని అడిగారు.

ఆ సరికే ఏం చేయాలో తెలీక తల పట్టుకొని కూర్చున్న దండనాయకుడు "సరే ప్రవేశ పెట్టు" అన్నాడు. ఇద్దరినీ లోపలి తీసుకొని వచ్చారు సైనికులు.

దండనాయకుడు వాళ్ళను కూర్చోబెట్టి "మీరెవరు? మీ పరిచయం?" అన్నాడు.

"అయ్యా! మేం యిద్దరం అన్నదమ్ములం. ఈ బోదనంపాడు గ్రామానికి చెందిన వాళ్ళం. మా పేర్లు పుల్లాపంతుల పుల్లన్న, సూరన్న. యిక్కడెవరో జబ్బు పడినట్టున్నారు- మూలుగులు బయటికి వినిపిస్తున్నాయి. మేం వారికి వైద్యం చేస్తాం" అన్నారు.

"ఆయన విజయనగర సామ్రాజ్యాధీశులు శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థాన అరణపు కవులు శ్రీ నంది తిమ్మనార్యుల వారు" చెప్పాడు దండనాయకుడు.

"ఏమీ! పారిజాతాపహరణ కర్త అయిన నంది తిమ్మనగారా?! ఏమైంది? వారికొచ్చిన జబ్బు ఏమిటి?!" అడిగారు వాళ్ళు. ముక్కు తిమ్మనగారు రచించిన 'పారిజాతాపహరణ కావ్యం' గురించి తెలీని పండితులే లేరు మరి, ఆ రోజుల్లో.

"లోపలికి రండి" అని పిలుచుకొని వెళ్ళాడు దండనాయకుడు.

తిమ్మనగారు అక్కడ పడక మీద పడుకొని దొర్లుతూ పెద్దగా అరుస్తున్నారు. పక్కన రాజవైద్యుడు కల్వంలో మందు నూరుతున్నాడు. లోపలికి వచ్చిన వాళ్ళని చూసి 'ఎవరు మీరు?' అని గద్దించాడు రాజ వైద్యుడు.

దండనాయకుడు వారి వివరాలు చెప్పగానే వైద్యుడు ముఖం చిట్లించాడు. "మహా మహా వైద్యులే ఏమీ చెయ్యలేక పోయారు. పిల్లలు- మీరేమి చేస్తారు? నాయనలారా, మీకు తెలుసో లేదో, వీరు నంది తిమ్మన గారు. వీరి తలనొప్పిని ఎలాగైనా తగ్గించాలని స్వయంగా రాయలవారే పూనుకొని, గొప్పగొప్ప వైద్యులకు చాలా మందికి చూపించి, 'ఇంక కుదరదు' అని ఆశ వదులుకున్నారు. ఈ మారుమూల గ్రామంలో చిన్న చిన్న వైద్యాలు చేస్తూ బ్రతుక్కునే మీ వల్ల తీరే సమస్య కాదు నాయనా ఇది!" అన్నాడు పెదవి విరుస్తూ.

"ఇలాంటి శిరోవేదనకు మంచి వైద్య ప్రక్రియ ఉంది మా దగ్గర- మాకు ఒక్క అవకాశం యిచ్చి చూడండి. మా అన్నగారు నాడీ పరీక్షలో ఘనులు" అన్నాడు సూరన్న, అన్నను ముందుకు నెడుతూ.

ఇంతలో "ఏమిటి, ఈ అల్లరి? నన్ను అసలు విశ్రాంతి తీసుకోనిచ్చేట్లు లేరే?!" అంటూ కోపంగా పాన్పు మీదినుండి దిగి వచ్చారు తిమ్మన గారు.

వైద్య సోదరులు ఇద్దరూ లేచి నిలబడి ఆయనకు నమస్కరించారు. "కవివర్యా! మేం ఈ గ్రామ వైద్యులం. మిమ్మల్ని దర్శించి మీ ఆరోగ్యం గురించి పరామర్శించి వెళ్ళడం మా ధర్మం కదా! అందుకే వచ్చాం" అన్నారు.

"సరే, కూర్చోండి" అని సైగ చేస్తూ చెప్పారు తిమ్మనగారు- "నాకు ఈ తలనొప్పి బాధ చాలా ఏళ్ళుగా వుంది. ఈ మధ్య మరీ ఎక్కువయింది. తలలో ఏదో తోలుస్తున్నట్టు బాధ. ఒక్కోసారి తలని గోడకు గ్రుద్ది బద్దలు కొట్టుకోవాలనిపిస్తుంది" అన్నారు తిమ్మన-గారు, తలను నొక్కుకుంటూ.

"తమరి సెలవైతే మేము ఓసారి మిమ్మల్ని పరీక్షిస్తాం. మాకున్న పరిజ్ఞానంతో, మా పూర్వీకుల ఆశీస్సులతో మీకు మంచి వైద్యం అందించగలమని మా నమ్మకం" అన్నాడు పుల్లన్న.

"ఏమి చేస్తారో?! నాకైతే ఈ వైద్యం మీద నమ్మకం పోయింది. రాయలవారు నాకోసం చెయ్యని ప్రయత్నం లేదు. ఎందుకు వచ్చిందో ఏమో గానీ నా ప్రాణాలు తోడేస్తోంది, ఈ మహమ్మారి. ఇట్లా బాధ పడుతూ ఉండటం కంటే 'చావే మేలు' అనిపించింది. అందుకే ఇట్లా కాశీ ప్రయాణం పెట్టుకున్నాను. అయితే భగవంతుడి కరుణ ఇలా ఉంది- మధ్యలోనే శిరోవేదన ఎక్కువై ఇలా యిక్కడ బస చెయ్యాల్సి వచ్చింది" అన్నాడు తిమ్మన.

"అయ్యా! అర్థమైంది. మీ బాధ నిజంగానే వర్ణనాతీతం. ఏనుగు కుంభస్థలంలోకి పాము ప్రవేశించినప్పుడు అది ఎంతగా విలవిలలాడి పోతుందో, ఎన్నెన్ని కొండల్ని ఢీకొంటుందో మీరు వర్ణించి ఉన్నారు గతంలో. మీ ఈ శిరోవేదన అంతకు వెయ్యి రెట్లు వుంటుంది. భరించడం ఎవరికైనా కష్టమే. ఒకసారి చెయ్యి యివ్వండి- నాడి పరీక్షిస్తాం" అంటూ తిమ్మనగారి చేతిని అందుకొని శ్రద్ధగా నాడిని పరీక్షించాడు సూరన్న.

అటుపైన "అవునవును. అర్థమైంది" అంటూ పుల్లన్నకు ఏదో వివరించాడు వైద్య పరిభాషలో. పుల్లన్న చిరునవ్వు నవ్వి, తిమ్మనగారి వైపు తిరిగి "అయ్యా! ఏమీ‌ పరవాలేదు. మీ సమస్య తీరిపోతుంది. మీకు ఇక్కడే శాంతి లభించనున్నది. భయంలేదు" అన్నాడు.

అతని నవ్వును చూడగానే తిమ్మన్నగారికి కోపం వచ్చేసింది. "విషయాన్ని మీరు యింత తేలికగా తీసుకోవడం విడ్డూరంగా ఉంది. ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ప్రయత్నించి, 'మా చేత కాద'ని చేతులెత్తారు. అల్లాంటిది మీరు విముక్తి కలిగించడమా? మీ వైద్యమూ వద్దు, మీ మందూ వద్దు, మీ పథ్యాలూ వద్దు! మీకో నమస్కారం! యిలాగే కాశీ దాకా వెళ్ళ నివ్వండి. తర్వాత ఆ కాశీనాథుడే చూసుకుంటాడు" అన్నారు మూలుగుతూ.

"అయ్యా మా మాట నమ్మండి. మావి వ్యర్థపు మాటలు కావు. ఈ రోగానికి మందులూ, మాకులూ, పథ్యాలు ఏమీ లేవు. దీనికి జరగాల్సిన వైద్య ప్రక్రియ వేరే ఉన్నది. ఒక్క రోజులోనే నయమైపోతుంది. ఓపిక పట్టాలి- అంతే" అన్నాడు పుల్లన్న ధీమాగా.

"ఔనౌను- ఓపిక పట్టాల్సిందే! మందూ-మాకూ-పథ్యమూ లేని వైద్యం కదా!! లోకంలో ఎక్కడా లేని వైద్యాన్ని చెప్తున్నారు" అంటూ శిరోభారంతో కూలబడి తల పట్టుకున్నారు తిమ్మన గారు.

"అయ్యా! మీ మూలుగు వినగానే మీ సమస్య ఏమిటో, అది ఎలా తగ్గుతుందో మాకు అర్థమై పోయింది. మీరు మాకు ఒక్క అవకాశం యిచ్చి చూడండి- తప్పులేదు కదా!" అన్నారు వైద్య సోదరులు బ్రతి మాలుతూ.

దాంతో తిమ్మన రాజ వైద్యుడి వైపు చూస్తూ "ఆర్యా! ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? వీరికి ఒక అవకాశం యిచ్చి చూద్దామా?" అన్నాడు.

"కవి వర్యా! యిదంతా పనికిరాని వ్యవహారమే. ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులకు లొంగని జబ్బు ఈ మారు మూల పల్లెల్లో కప్పల్లాగా నివసించే వారికి సాధ్యం కాదు. మనం కాలాన్ని వ్యర్థం చేయకుండా త్వరగా కాశీనగరం చేరుకుంటే మంచిది" అన్నాడు రాజవైద్యుడు.

తిమ్మన కొంచెం సేపు ఆలోచించి, నిట్టూర్పు విడుస్తూ "నేను ఇప్పుడు మళ్ళీ వెంటనే ప్రయాణం ఆరంభించే స్థితిలో లేను. ఊరికే ఇక్కడ ఆగినా, వీరు చెప్పే ఉపచారం ఏదో అది చేసినా నావరకూ ఒకటే- వీరి మాటా విని చూద్దాంలెండి. తప్పులేదు" అన్నాడు.

"ఇదిగో అబ్బాయిలూ! మీ వైద్యానికి ఒప్పుకుంటున్నాం. అయితే ఒక షరతు. మీరు నయం చేయలేని పక్షంలో రాజ దండనకు గురికావల్సి వస్తుంది. తెలుసా?" గద్దించాడు రాజవైద్యుడు.

వాళ్ళు ఇద్దరూ జడుసుకోలేదు. "అయ్యా! ఇది మా వైద్యానికి పరీక్షా సమయం.. కానివ్వండి" అన్నారు.

"అబ్బో మంచి పట్టున్న వైద్యులే!" అంటూ ముక్కున వేలేసుకుని, నవ్వలేక, తలపట్టుకున్నారు తిమ్మనవారు.

ఆ రోజునుంచీ వరుసగా మూడు రోజుల పాటు వైద్య సోదరులు ఇద్దరూ తిమ్మన ముక్కులో చుక్కల పసరు పిండుతూ వచ్చారు. నాలుగోరోజు వైద్యానికి కావలిసిన పదార్థాలన్నీ ఒక జాబితాగా తయారు చేసి యిచ్చారు. చూస్తే అందులో విశేషంగా వైద్యానికి కావలిసిన వస్తువులేమీ లేవు: పుట్టెడు బియ్యం మాత్రం కావాలన్నారు.

"పుట్టెడు బియ్యమా? ఊరందరికీ సమారాధన చేస్తారా, ఏమి?!" అన్నాడు రాజవైద్యుడు వెటకారంగా.

"కాదు- అవసరం ఉంది తెప్పించండి. అలాగే ఇరవై మంది వంటవాళ్లు, నిర్మాణపు పని తెలిసిన పదిమంది కూలీలు కూడా కావాలి" అన్నారు వైద్య సోదరులు.

"ఉప్పు, పప్పు కూరగాయలు కూడా తెప్పించండి. వండి, ఊళ్ళో పోలేరమ్మ జాతర జరిపించండి- సరిపోతుంది" దెప్పి పొడిచాడు రాజవైద్యుడు.

"కాదు కాదు- మా వైద్యానికి ఇది చాలా అవసరం" అన్నాడు పుల్లన్న.

"ఏమి అవసరమో ఏమో! మా తిమ్మన గారితో ముక్కు పట్టించి మూడు చెరువుల నీళ్ళు త్రాగిస్తున్నారు. వారి యాత్ర యిక్కడే పూర్తి అవుతుందేమో!" అన్నాడు రాజవైద్యుడు.

"శివ శివా! మీకా సందేహం అక్కరలేదు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులై రాయలవారిని దర్శిస్తారు- తన కవిత్వం తో మెప్పిస్తారు" అన్నాడు సూరన్న ధైర్యంగా.

"ఎవరి గతి ఎలా వుందో ఆ విరూపాక్షుడికే ఎరుక" అంటూ దండనాయకుడికి పట్టీ యిచ్చి అన్నీ తెప్పించమన్నాడు రాజవైద్యుడు.

ఐదవనాటికల్లా గాలి కూడా చొరనంత దట్టంగా, బాగా ఎత్తుగా ఉన్న గుడిసె ఒకటి తయారైంది.

గుడిసె బయట వంటవాళ్ళు పుట్టెడు బియ్యాన్ని వండటం మొదలు పెట్టారు. ఊళ్ళో వాళ్లంతా వచ్చి నిలబడి 'ఏం జరుగుతున్నది' అని ఆశ్చర్యంగా చూస్తున్నారు.

వైద్యులిద్దరూ వచ్చి తిమ్మనను గుడిసెలోకి పిలుచుకొని వెళ్ళారు.

"మిమ్మల్ని ఈ గుడిసెలో తలక్రిందులుగా వేలాడదీయాల్సి వుంటుంది" అన్నారు.

తిమ్మనకు దిక్కు తోచలేదు. ఎలా పారిపోవాలో అర్థం కాలేదు. ఏమనేందుకూ‌ నోరురాక విలవిలలాడాడు.

"భయపడకండి- ఇది వైద్య ప్రక్రియలో భాగమే" అన్నారు వైద్య సోదరులు ఇద్దరూ ఏక కంఠంతో.
"సరే- ఒకసారి మీ వైద్యానికి ఒప్పుకున్నాక తప్పుతుందా, ఏదైతే అది అవుతుంది- కానివ్వండి" అన్నారు తిమ్మన. వెంటనే వైద్యులు ఆయన శరీరం అంతటా లావు పాటి కంబళ్ళు చుట్టారు. తల, ముక్కు మాత్రం బయటకు ఉండేలా ఒక దట్టమైన తొడుగు తగిలించారు. గుడిసెకు ఒక మూలగా ఆయన్ని తలక్రిందులుగా వేలాడ దీశారు.

మరుక్షణం అప్పుడే వండి వార్చిన అన్నపు హండాలు గుడిసెలోని తేబడ్డాయి. ఆ అన్నం అంతా గుడిసెలో కుమ్మరించబడింది. తలక్రిందులుగా వ్రేలాడుతున్న తిమ్మనగారి క్రిందంతా ఆవిర్లు క్రక్కుతున్న అన్నం నిండింది. గుడిసె మొత్తం‌ ఒక్కసారిగా ఆవిర్లు క్రమ్ముకున్నాయి.

తన శరీరానికి ఏమైందో అసలు అర్థం కాలేదు తిమ్మనకు. ఆయన ముక్కు పుటాల ద్వారా లోనికి ప్రవేశించిన వేడి వేడి అన్నపు ఆవిరి సెగలు ఒక్క పెట్టున ఆయన నషాళానికి అంటాయి.

రెండు క్షణాలు గడిచాయో లేదో- ఆయన ముక్కు పుటాల నుంచి విష క్రిములు రెండు- గిజ గిజ లాడుతూ వెలువడి, ఆ అన్నపు రాశి పై పడ్డాయి. అదే క్షణంలో తిమ్మన స్మృతి తప్పాడు!

వైద్యులిద్దరూ వెంటనే ఆయనను క్రిందికి దింపి, బయటకు తీసుకొని వచ్చి, శీతలోపచారాలు చేశారు. క్రమంగా ఆయనను తెలివిలోకి తెచ్చారు. తిమ్మన తలనొప్పి మాయమైంది! అయితే ఆయన పూర్తిగా కోలుకునేందుకు మరో రెండు వారాలు పట్టింది.
కవిగారి శిరోభారం తగ్గిందనీ, రోగం నయమైందనీ వెంటనే రాయలవారికి కబురు అందింది. పుల్లాపంతుల వైద్య సోదరుల ఖ్యాతి వెనువెంటనే విజయనగర సామ్రాజ్యపు నలుమూలలకూ పాకింది. వారిని దర్శించుకునేందుకు ప్రజలు తండోప-తండాలుగా రాసాగారు.
నాలుగైదు రోజుల్లో కృష్ణదేవరాయల వారే నేరుగా బోదనంపాడు విచ్చేసారు.

వైద్యులిద్దరూ రాయలవారిని ప్రస్తుతించారు:

శ్రీ వేంకటగిరి వల్లభ-
సేవా పరతంత్ర హృదయ! చిన్నమదేవీ
జీవితనాయక!కవితా
ప్రావీణ్య ఫణీశ కృష్ణరాయ మహీశా!
ప్రభూ మేము వైద్యులమేగానీ కవులం కాదు. అందుకే ముక్కు తిమ్మన గారి పద్యాన్నే ఒప్పజెప్పాం. అందుకు మమ్మల్ని మన్నించండి. మా పెద్దలు దయతో మాకు నేర్పించిన వైద్యాన్ని సేవాదృష్టితో మా బోదనంపాడులోనే పదిమందికీ అందిస్తూ వస్తున్నాం. నంది తిమ్మనగారంతటి వారికి వైద్యం చేసే మహద్భాగ్యం కలగడం కేవలం మా పుణ్య విశేషమే. వారి ఆశీస్సులు మాకు సదా వుండగలవని విశ్వసిస్తూ, తమరి అనుగ్రహంతో మా ఈ వైద్యవిద్య యిలాగే పది కాలాలపాటు శాశ్వత కీర్తి పొందగలదని భావిస్తున్నాము" అన్నారు పుల్లాపంతుల సోదరులు.

తిమ్మనగారు లేచి "ప్రభూ! శతాధిక వందనాలు.'కాశ్యాం తు మరణానురక్తి:- కాశీకి పోయేది కాటికి పోయేందుకే" అని నిశ్చయించుకొన్న నేను, వీరి చలువతో పునర్జన్మ ఎత్తాను. వీళ్ళు నా పాలిట నిజంగా అశ్వినీ దేవతలే. మొదట నేను వీరిని శంకించాను- అది నా అవివేకం. వీరి హస్తం ఒక సంజీవ కరణి. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు గనక వీరు అక్కడ ఉండి ఉంటే హనుమంతుడికి ఆ సంజీవనీ పర్వతాన్ని ఎత్తి తేవలిసిన పని ఉండేది కాదేమో. కుగ్రామంలో నిస్వార్థంగా వైద్యసేవలనందిస్తూ గ్రామంలో వారిని అందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచుతున్న వీరి సేవకి ఎంత యిచ్చినా తక్కువే.

వీరి ఋణం ఎలా తీర్చుకోగలం? ప్రభువులవారు వీరిని తమ ఆస్థాన వైద్యులుగా నియమిస్తే సాహిత్యం తో బాటు వైద్యశాస్త్రాన్ని కూడా పోషించినట్లుంటుంది అని నా అభిప్రాయం. ఆ తర్వాత తమరి చిత్తం' అన్నారు.

"కవీశ్వరుల సూచన ఆమోదదాయకం. మరి పుల్లాపంతుల సోదరులు అందుకు సమ్మతిస్తారో? వారి సమ్మతం మాకు సంతోషదాయకం" అన్నారు రాయలవారు. కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి.

"ప్రభూ! మీ ఆజ్ఞ శిరోధార్యమే- కానీ మా వంశీకుల నియమానుసారం మేము స్వస్థలంలోనే వైద్యం చెయ్యాలి తప్ప, మరో చోటుకు పోగూడదు. ధన సంపాదనకూ, స్వలాభాపేక్షకూ లోనుకాకూడదు. మా గ్రామం వైద్యానికి పెట్టింది పేరుగా శాశ్వత కీర్తిని ఆర్జించాలని మా పెద్దల ఆశయం. ప్రభువులు దీన్ని వేరుగా తలచరాదని ప్రార్థన" అన్నారు ఆ సోదరులు.

"భేష్ ! మీ పూర్వీకుల ఆశయం ఉదాత్తంగా ఉంది. వైద్యుడి కోసం రోగి అన్వేషించడమే ధర్మం. అప్పుడే వైద్యానికి విలువ. మీ గ్రామాన్ని వైద్య కేంద్రంగా పరిగణిస్తూ బోదనంపాడును అగ్రహారంగా మీకు దానశాసనంతో వ్రాయించి ఇస్తున్నాం! అమూల్యమైన మీ సేవను ప్రశంసిస్తూ మేమిచ్చే ఈ చిన్న బహుమతిని స్వీకరించండి" అన్నారు రాయలవారు గంభీరంగా. సభలో మరోసారి హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.

సాలగ్రామం_అంటే_ఏమిటి.?


           సాలగ్రామం అనేది ఒక రకమైన రాయి. అయితే, ఇది ఓ పురుగువల్ల.. అంటే ఓ జలచరం వల్ల తయారౌతుంది అంటే అతిశయోక్తి కాదు. సాలాగ్రామాలు చాలా చాలా అరుదైనవి. ఇవి గండకీనదిలో దొరుకుతాయి. అలాగే ఖాట్మండు నగరానికి ఉత్తరాన గండకీనదిలో దొరుకుతాయి. ఈ గండకీనది తీరంలో ”ముక్తినాథం” పేరుతో సాలగ్రామం ఉంది. ఈ ప్రాంతాల్లో మాత్రమే సాలగ్రామాలు దొరుకుతాయి. మరెక్కడా ఇవి లభ్యం కావు.

సంస్కృతంలో ”శిలగా మారిన శలభమే సాలగ్రామం” అంటూ నిర్వచనం చెప్తారు. సాలగ్రామం ఎంత ఎక్కువ సంవత్సరాలు గడిస్తే అంత మహత్తరమైంది. అలాగే, ఎంత చిన్నది అయితే అంత గొప్పది. కాలం గడిచిన తర్వాత సాలగ్రామానికి ఔషధ గుణాలు వచ్చి చేరతాయి.

ఒక విధమైన పురుగు సాలగ్రామంగా రూపొందుతుంది. అయితే కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మాత్రమే అది రాయిలా గట్టిపడుతుంది. రసాయనికంగా చూస్తే సాలగ్రామం సిలికాన్ డయాక్సైడ్. దీనికి చెకుముకి రాయి లక్షణాలు ఉంటాయి. గట్టిపడకముందు సాలగ్రామంలో సున్నపు లక్షణం ఉంటుంది.

సాలగ్రామం విశిష్ట శిలారూపం. ఇవి వేల, లక్షల సంవత్సరాలు యథాతథంగా ఉంటాయని రుజువైంది. నీళ్ళలో ఉండే ఒక జీవి సుదీర్ఘకాలం తర్వాత సాలగ్రామంగా రూపాంతరం చెందుతుంది. అంటే ఇది జరాసిక్ టెతీన్ కాలానికి చెందినది.

సాలగ్రామాన్ని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పూజిస్తారు. సాలగ్రామాన్ని పూజించేచోట విష్ణుభగవాణుడి అనుగ్రహముంటుంది. సాలగ్రామం సంపాదించి, దేవుడి మందిరంలో ఉంచుకుంటే ఎంతో మంచిది. దీన్ని నియమనిష్టలతో పూజించాలి. ఏ మంత్రాలూ రానివారు మనసునే అర్పించుకుంటూ ప్రార్ధించాలి. సాలగ్రామం ఒకవేళ పగిలిపోయినా, దాని విలువ తగ్గదు. సాలగ్రామాలను ప్రతిరోజూ తులసీదళాలతో పూజిస్తే ఐశ్వర్యవంతులవుతారు. విశేషంగా శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది. సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని సేవించడం శ్రేష్టం.

*శ్లో౹౹సాలగ్రామ శిలా వారీ
        పాపహారీ విశేషతః
       ఆ జన్మ కృతపాపానామ్
        ప్రాయశ్చిత్తం దినేదినే.

సాలా గ్రామం అభిషేకించిన జలాన్ని స్వీకరించుట వలన అనేకజన్మల పాపాలు నశిస్తాయి. ప్రతి రోజు స్వీకరించుట వలన రోజూ చేసే పాప పరిహారం ప్రాయశ్చిత్తము జరుగుతుంది.

Friday, November 23, 2018

శ్రీనాథ కవి సార్వభౌముడు


శ్రీనాథుడు- రాజసంతో బతకడమెలాగో తెలిపిన కవిసార్వభౌముడు. కష్టాల్ని కూడా సరసంగా స్వీకరించడం తెలిసినవాడు. శ్రీనాథుడు జన్మించింది 1370లో కాల్పట్టణంలో. నేటి కృష్ణాజిల్లా మచిలీపట్నం దగ్గరి ఊరు అది. నాటి కొండవీటి రెడ్డి రాజ్యంలోని ప్రాంతమది. తండ్రి మారయ్య. తల్లి భీమాంబిక.

శ్రీనాథుడి చిన్ననాటి మిత్రుడు ఆవచి తిప్పయ్యశెట్టి. ఇతడు సుగంధ ద్రవ్యాల వ్యాపారి కొడుకు. అతనిది తమిళనాడు లోని కాంచీపురం. తండ్రితో పాటు తెలుగు ప్రాంతాలకు వస్తూండేవాడు. అప్పటికి శ్రీనాఽథుడి వయసు సుమారు 14 ఏళ్లు. ఆ చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే ‘మరుత్తరాట్చరిత్ర’ రచించాడు. ఆ పద్యాల్ని సెట్టికి వినిపిస్తూ ఉండేవాడు. ఇలాంటి బాలసరస్వతిని సంపన్నులకు పరిచయం చేస్తే ఫలం ఉంటుందనుకొన్నాడు సెట్టి. అలా శ్రీనాథుడికి ప్రెగ్గడయ్యను, సింగననూ పరిచయం చేశాడు.

స్నేహాన్ని బంధంగా మలుచుకోవడమెలాగో శ్రీనాథుడికి తెలుసు . అందుకే ‘మరుత్తరాట్చరిత్ర’ని వేమనకి అంకితమిచ్చాడు. కొన్నాళ్లకి ‘పండితారాధ్య చరిత్ర’ రచించి ప్రెగ్గడయ్యకి అంకితమిచ్చాడు.

రోజులు గడిచాయి. శ్రీనాథుడికి నూనుగు మీసాల నూత్న యవ్వనం వచ్చింది. ‘శాలివాహన సప్తశతి’ అనే శృంగార శతకాన్ని రచించి పెదకోమటి వేమారెడ్డికి అంకితమిచ్చాడు. అంతలో కొండవీటికి- వేమారెడ్డి రాజయ్యాడు. మామిడి సింగన మంత్రి అయ్యాడు. నిండు యవ్వనంలో శ్రీనాథుడు ‘శృంగార నైషధం’ రచించి సింగనకి అంకితమిచ్చాడు.

అంతలో ఓ రాచకార్యం శ్రీనాథుడిపై పడింది. రాజమహేంద్రవరం రెడ్డిరాజులతో కొండవీటి ప్రభువులకు యుద్ధ పరిస్థితి నెలకొంది. రాజమండ్రి రాజులకు విజయనగర చక్రవర్తుల అండ ఉండేది. ‘దీన్ని నివారించాలి’- అన్నది కొండవీటి రాజు ఆలోచన. అది అవచి తిప్పయ్యశెట్టికే సాధ్యం. ఎందుకంటే అప్పటికి సుగంధ ద్రవ్యాల వ్యాపారంతో చక్రవర్తులందరికీ దగ్గరయ్యాడు. మరి తిప్పయ్యను ఒప్పించేదెవరు? - శ్రీనాథుడే!

అలా శ్రీనాథుడు కంచి వెళ్లాడు. అవసరమై వచ్చానంటే చిన్నప్పటి స్నేహితుడు చిన్నబుచ్చుకుంటాడు. అందుకే చూసిపోదామని వచ్చానన్నాడు. ఆనందించాడు సెట్టి. ‘‘అందరికీ అన్నీ అంకితమిచ్చావు. మరి నాకు’’ అని అడిగాడు సెట్టి. నిజానికి కవితలు, కాకరకాయలు రాయడానికి రాలేదు శ్రీనాథుడు. కార్యభారంతో వచ్చాడు. అయినా త్వరత్వరగా ‘హరవిలాసం’ అనే శైవప్రబంధం రచించి సెట్టి చేతుల్లో పెట్టాడు. ఇందుకు బదులుగా రాచకార్యం పూర్తి చేశాడు సెట్టి. విజయగర్వంతో కొండవీడు చేరాడు శ్రీనాథుడు. కృతజ్ఞతగా శ్రీనాథుడికి విద్యాధికార పదవి కట్టబెట్టాడు వేమారెడ్డి. ఈ మహోన్నత పదవిలో శ్రీనాథుడు 18 ఏళ్ల పాటు మహారాజ భోగాలు అనుభవించాడు. రాజుతో వెళ్లని ఊరు లేదు. పొందని అనుభవం లేదు. వర్ణించని అందం లేదు.

అంతలో 1420లో పెదకోమటి వేమారెడ్డి మరణించాడు. శ్రీనాథుడి పరిస్థితి తారుమారైంది. కొన్నేళ్లుగా ఒకే వంశాన్ని నమ్ముకొని, ప్రభువులకు తలలో నాలుకై, కొండవీటి శత్రువులకు తానూ శత్రువై, ఆపై అష్టైశ్వర్యాలు అనుభవించి. కవిరాజై వర్ధిల్లి, కవిపుంగవులకు సింహస్వప్నమై- ఇప్పుడు రాజాశ్రయం కోల్పోయాడు.

పైగా వయసేమో 50 ఏళ్లు. చేసేదిలేక కొండవీడు విడిచి పలనాడుకి పయనమయ్యాడు. పేదరికం తాండవించే ప్రాంతమది. వరి అన్నం లేదు. మంచినీళ్లు లేవు. విలాసాలు లేవు. చెప్పలేనన్ని బాధలు. అయినా ‘పలనాటి వీరచరిత్ర’ అనే అచ్చమైన దేశీకావ్యం రచించాడు.

ఇక రాజమహేంద్రవరం రెడ్డి రాజుల్ని ఆశ్రయించక తప్పలేదు. తాను వెళ్తున్నది శత్రురాజ్యానికి. అక్కడి వారంతా కొత్త. తనను చూస్తే కత్తులు దూస్తారు- కవులైనా, భటులైనా. ఫలించే పరిచయాలు ఉంటే తప్ప రాజదర్శనం జరగదు. అలాంటి హితుడు ఎవరున్నారా అని ఆలోచించాడు. ద్రాక్షారామలోని బెండపూడి అన్నయ అనే సఖుడు గుర్తొచ్చాడు. వెంటనే వెళ్లాడు. కబుర్లాడారు. తనకూ ఓ కావ్యం అంకితమివ్వమని కోరాడు అన్నయ. కాదనలేదు శ్రీనాథుడు. ‘భీమఖండం’ రచించి అన్నయకి అంకితమిచ్చాడు. తెలుగువారి పండగల్ని, పంటల్ని, వంటల్ని, పిండివంటల్ని, తత్త్వాన్ని, మనస్తత్వాల్ని, ఆచారాల్ని, కట్టుబాట్లని పిండారబోశాడు ఈ శైవ కావ్యంలో శ్రీనాథుడు.

ఇందుకు కృతజ్ఞతగా బెండపూడి అన్నయ శ్రీనాథుణ్ణి రాజమండ్రికి తీసుకెళ్లాడు ప్రభుదర్శనం కోసం. కానీ అక్కడి కవులు, శ్రీనాథుణ్ణి అడ్డుకొన్నారు. కాకుల్లా పొడిచారు. చివరకు ఇదే భూమికి అసమాన కీర్తిప్రతిష్ఠలతో తిరిగివస్తానని శపథం చేసి మరీ గోదావరి తీరాన్ని విడిచిపెట్టాడు.

ఇక మిగిలింది విజయనగర చక్రవర్తులు. వారి ప్రాపకం పొందాలంటే మరో చెలికాడు దొరకాలి. దొరికాడు. అతగానే వినుకొండ వల్లభరాయుడు. ఇతడు కడప జిల్లా పులివెందుల తాలూకా మోపూరు అధికారి. శ్రీనాథుడు వచ్చేసరికి ఇతడు ‘క్రీడాభిరామం’ రచిస్తూ ఉన్నాడు. కానీ రససమంచిత కవికాడు వల్లభుడు. అందుకే ఈ రచనని శ్రీనాథుడే చేపట్టి కవిగా వల్లభరాయుడి పేరే పెట్టాడు. ఉబ్బితబ్బిబ్బయ్యాడు వల్లభుడు. ఆ రుణం తీర్చుకొనేందుకు తానే స్వయంగా శ్రీనాథుణ్ణి విజయనగరానికి తీసుకెళ్లాడు.

అయినా విజయనగర ప్రౌఢదేవరాయల దర్శనం త్వరగా లభించలేదు. మళ్లీ కష్టాలు. రాచవీధుల్లో కాళ్లరిగేలా తిరిగాడు. నువ్వులపిండి తిన్నాడు. చల్ల అంబలి తాగాడు. చివరకు రాజు ఎదుట కవితాప్రదర్శనకి అవకాశం దక్కింది. డిండిమభట్టు కంచుఢక్కని పగలగొట్టించి, ‘కవిసార్వభౌమ’ బిరుదు పొందాడు. ప్రౌఢదేవరాయలు- తన ముత్యాలశాలలో సభా మధ్యమున ఉన్నతపీఠంపై శ్రీనాథుణ్ణి కూర్చోబెట్టి, శిరస్సుమీంచి జలధారగా దీనారటంకాల్ని గుమ్మరించి అలా నేలపై పడిన వాటిని కవి,పండితులకు పంచిపెట్టి- కనకాభిషేకం చేశాడు. అలాంటి సత్కారాల మోజుతో అక్కడే ఉండిపోలేదు శ్రీనాథుడు. రాయలసీమ నుంచి తన చూపు తెలంగాణపై వేశాడు. నల్గొండ దగ్గరి రాచకొండ రాజ్యానికి వెళ్లాడు. ఒకప్పుడు పెదకోమటి వేమారెడ్డిని రాచకొండ ప్రభువులు ఓడించి రెడ్డిరాజులు గర్వంగా భావించే కఠారిని తీసుకుపోయారు. ఇప్పుడు శ్రీనాథుడు దాన్ని తిరిగి దక్కించుకొన్నాడు తన పాండిత్య పాటవంతో!

తెలంగాణ నుంచి తిరిగి తన స్వస్థలాలకు బయలుదేరాదు. అసమాన కీర్తిప్రతిష్టలతో ఒకనాడు అవమానించిన రాజమండ్రిలో అడుగుపెట్టాడు. అక్కడి రాజు వీరభద్రారెడ్డి అక్కున చేర్చుకొన్నాడు శ్రీనాధుణ్ణి. ‘కాశీఖండం’ రచించి వీరభద్రారెడ్డికి అంకితమిచ్చాడు శ్రీనాథుడు. ఆ తర్వాత కొన్నాళ్లకి ‘శివరాత్రీమాహాత్మ్యం’ రచించాడు.

అవసానదశలో అష్టకష్టాలు పడ్డాడు శ్రీనాఽథుడు. కావ్యం రాసే ఓపిక లేదు. అంకితం తీసుకొనే రాజులేడు. ఆదరించే నాథుడు లేడు. భోగాలందించే ప్రభువు లేడు. పూటగడిచే పరిస్థితి లేదు. అయినా మరణిస్తూ శ్రీనాథుడు పలికిన మాటలు -‘‘ అదిగో స్వర్గంలోని కవులు కంగారుపడిపోతున్నారు- శ్రీనాధుడు వచ్చేస్తున్నాడని’’.
అదీ సంగతి!

వినుకొండ వల్లభామాత్యుడు, సర్వజ్ఞ సింగభూపాలుడు, ప్రౌడ దేవరాయలు, సాంపరాయని మైలారురెడ్డి, తెలుగు రాయలు మొదలైన వారి ఆస్థానాలను సందర్శించి తన పాండిత్య ప్రదర్శనతో గౌరవం పొందిన వారు శ్రీనాథుడు.

కవిత్వంలో వ్యకిత్వ వికాసం:
--------------------------------------
శ్రీనాథుడి నుంచి మనం నేర్చుకోవలసింది ఇంతా అంతా కాదు. బోలెడంత ఉంది. అతని వ్యక్తిత్వం, జీవితం నేర్పే గుణపాఠాలు ఎన్నో. బ్రతికితే శ్రీనాథుడిలా బతకాలి - మరణించినా శ్రీనాథుడిలాగే మరణించాలి.
"పనివడి నారికేళ ఫలపాకమునంజవియైన భట్టహ

ర్షుని కవితాను గుంభములు సోమరిపోతులు కొందఱయ్యకౌ

నని కొనియాడనేరదియట్టిద, వేజవరాలు చెక్కుగీ

టిన వసవల్చు బాలకుడు డెందమునంగలగంగ నేర్చునే?"

శ్రీనాథుడు శృంగారనైషధంలో ఈ పద్యం రాశాడు. సంస్కృతంలో భట్టుహర్షుడు నైషధ కావ్యం రాశాడు. అది విద్వదౌషధం వంటిది అన్నారు. 'నారికేళపాకంలా ఉందండి బాబూ' అన్నారు. కొరుకుడు పడదని ఈసడించారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని రాసిందే పై పద్యం. కవిత్వాన్ని అర్థం చేసుకోవడానికి కృషి అవసరం. ప్రయత్నం అవసరం. సోమరితనం పనికిరాదు. విశ్వనాథ మరొకసారి ఇలా అన్నారు - "కవిత్వం అర్థం కాదంటారు. అర్థం చేసుకోడానికి నువ్వేం ప్రయత్నం చేశావ్. జువాలజీ అర్థం చేసుకోవాలంటే జువాలజీకి సంబంధించినవన్నీ చదువుతావా? మేథమాటిక్స్ అర్థం చేసుకోవాలంటే ఎంత కృషి చేస్తావ్? మరి కవిత్వం అర్థం చేసుకోవటానికి కృషి అక్కరలేదా?". శ్రీనాథుడు "అర్థం కాదు - కొరకరాని కొయ్య " అనే వారిని చూసి చిరాకు పడిఉంటాడు. కాబట్టి మంచి ఉపమానంతో ఇలా అన్నాడు - "మాంచి వయసులో ఉన్న కన్య చిన్నపిల్లాడి చెక్కు గీటితే ఆ పిల్లాడిలో ఏ భావం ఉంటుంది?". అంటే సరసానికైనా విరసానికైనా ఒక స్థాయి ఉండాలి. లేకపోతే అపాత్రదానంలా, అరసికుని కవిత్వంలా వ్యర్థమై పోతుంది. కాబట్టి ఏమాత్రం అర్థం చేసుకోకుండా స్థాయి లేకుండా విమర్శించేవారు - అదిగో ఆ బాలుని వంటి వారే - అని భావం. ఇది కవిత్వానికే చెప్పినా అన్ని చోట్ల, అన్ని రంగాలకూ వర్తిస్తుది.

శ్రీనాథుడ్ని పండితులు - సంస్కృత పండితులు ఈసడించారు. 'డుమువుల కవి ' అని వెక్కిరించారు. "నీది ఏం భాషయ్యా బాబూ - సంస్కృతమా? తెలుగా?" అన్నారు.

"ఎవ్వరేమండ్రు గాక నాకేల కొఱత నా కవిత్వంబు నిజము కర్ణాట భాష"

అని ధైర్యంగా రాశాడు.

"కంటికి నిద్ర వచ్చునే? సుఖంబగునే రతికేళి? ... శత్రువుడొకడు దనంతటివాడు గల్గినన్" అని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించాడు.

"డంబు సూపి భూతలంబుపై తిరుగాడు

    కవిమీదగాని నాకవచమేయ

దుష్ప్రయోగంబుల దొరకని చెప్పెడు

    కవి శిరస్సున గాని కాలుచాప

సంగీత సాహిత్య సరస విద్యల నేర్చు

    కవుల రొమ్ముల గాని కాల్చివిడువ

చదివి చెప్పగ నేర్చి సభయందు విలసిల్లు

    కవినోరు గాని వ్రక్కలుగ తన్న"

అని ఎదిరించి నిలిచాడు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరుస్తాయి గదా అన్న భావం చెప్పక చెప్పాడు.

"బోధమల్పంబు గర్వమభ్యున్నతంబు

శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము"

అని భీమఖండంలో నూతిలో కప్పలవంటి వదరుబోతు పండితులపై కన్నెర్రజేశాడు.

అయినా ఎల్లవేళలా ఈ ఆత్మ ప్రత్యయం, ఈ ఠీవీ చెలామణి కాదు. సందర్భాన్ని బట్టి ప్రయత్నించాలి. అందుకే శ్రీనాథుడు ఒక్కొక్కసారి సహనం అవసరమేనంటూ చెప్పిన పద్యమిది -
"నికటముననుండి శ్రుతి నిష్ఠురముగ

నడరి కాకులు బిట్టు పెద్దఱచినప్పు

డుడిగి రాయంచ యూరక యుంట లెస్స

సైప రాకున్న నెందేని జనుట యొప్పు"

- కాకులు గోలపెడుతున్నప్పుడు ఓర్పుతో సహించాలి. లేదా వాటినుండి దూరంగా వెళ్ళాలి. అంటే ఆ కాకులతో మనమూ గోలచేస్తే మన స్థాయి పతనమైనట్టే గదా! ఇది మన జీవితంలో చాలా సందర్భాలకి ఉపకరిస్తుంది.

శ్రీనాథుడు భోగి. రసికుడు. ఎన్నో సుఖాలు అనుభవించాడు. అవకాశాలను అనుకూలంగా మలచుకోవడంలో తనకు తానే సాటి. అయినా రాజుల రోజులు ముగిసిన తర్వాత కష్టాల పాల్పడ్డాడు. బ్రాహ్మీదత్త వరప్రసాదుడు, ఈశ్వరార్చన కళాశీలుడూ, కవిసార్వభౌముడు, ఆగమ జ్ఞాననిధి అయిన శ్రీనాథుడు ఎన్నో బాధలు పడ్డాడు.

"కుల్లాయుంచితి కోక చుట్టుతి మహాకూర్పాసముండొడ్లితిన్

వెల్లులిందిల పిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా

చల్లాయంబలి ద్రావితిన్ రుచులు దోసంబంచు పోనాడితిన్, తల్లీ

కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడిన్"

అని వాపోయాడు. గతకాలంలో ఎప్పుడూ చేయలేని, ఇష్టపడని పనులు చేశాడు. అలవాటు లేనివన్ని అనుభవించాడు. ఎంతటివాడికైనా కాలం  బాగుండకపోతే అష్టకష్టాలు తప్పవని అనుభవాలు చెప్తాయి.

జొన్నకూడు తిన్నాడు. సన్నన్నం దొరకలేదు. తన పంటపొలాలకు శిస్తు కట్టలేక పోయాడు. శిస్తు కట్టనందుకు కఠినమైన శిక్షలు అనుభవించాడు. వాటిని ఒక పద్యంలో వివరించి మనకి వ్యకిత్వ వికాస తరగతులు నిర్వహించాడు.

జీవితం "చక్రార పంక్తి రివ గచ్చతి భాగ్యపంక్తిః"కి నిదర్శనం. ఎప్పుడూ కష్టాలే ఉండవ్. ఎప్పుడూ సుఖాలే ఉండవ్. వెలుగునీడలు సహజాతి సహజం. సుఖాలకి పొంగిపోకూడదు. కష్టాలకు కుంగిపోకూడదు. అదే స్థిత ప్రజ్ఞత్వం. మనం మంచి జరిగితే విర్రవీగి పోతాం. కష్టం లేదా దుఃఖం వస్తే న్యూనతాభావంతో ఇతరులను తిట్టిపోస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. "బాధే సౌఖ్యమనే భావన " రావాలి. సుఖదుఃఖాల్ని స్వాగతించగలవాడే జీవితాన్ని ఆస్వాదించగలడు. మరొకరికి ఆదర్శప్రాయుడూ కాగలడు. శ్రీనాథుడు అటువంటి వ్యక్తిత్వం కలవాడు కాబట్టే ఈ పద్యం వెలువడింది -

"కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా

    పురవీధి నెదురెండ పొగడదండ

సార్వభౌముని భుజాస్తంభమెక్కెను గదా

    నగరి వాకిటనుండు నల్లగుండు

వీరభద్రారెడ్డి విద్వాంసు ముంజేత

    వియ్యమందెను గదా వెదురు గడియ

ఆంధ్ర నైషధకర్త యంఘ్రి యుగ్మంబున

    తగిలియుండెను గదా నిగళయుగము "

శ్రీనాథుడు ఏడువందల టంకాలా సుంకం చెల్లించక పోవటంవల్ల పై శిక్షలు అనుభవించాడు. కాని అంత కఠినమైన శిక్షలు అనుభవిస్తున్నప్పుడు కోపం రాలేదు - తిట్లు రాలేదు. కష్టాలను 'స్పోర్టివ్'గా తీసుకొనే తత్వం కనిపిస్తుంది. ముళ్ళకాయల దండ మెడలో గుచ్చుకొని బాధిస్తుంటే - "ఈ పొగడ దండ ఎంత అదృష్టవంతురాలు - కవిరాజు కంఠాన్ని కౌగిలించుకొంది. ఈ పెద్ద బండరాయి - ఊరు చివర పడి ఉండేది - ఇప్పుడో, కవిసార్వభౌముని భుజం మీద కులుకుతోంది. వీరభద్రారెడ్డి ఆస్థానకవి చేతిలో ఈ వెదురు గడియ (చేతికి వేసే శిక్ష) వియ్యం అందుకుంటోంది. ఈ సంకెళ్ళు శృంగారనైషధం రాసిన కాలిని అలంకరించాయి" - అంటూ ఒకపక్క బాధపడుతున్నా కవిత్వం చెప్పాడు. ఏడుస్తూ కూర్చోలేదు. 'అదీ వ్యకిత్వ వికాసం అంటే!'.

శ్రీనాథుడు గత భోగాల్ని తలచుకొని దిగులు చెందినా మరణానికి జంక లేదు. ఎంత 'ఖలేజా' ఉందో పరిశీలించండి:

"కాశికా విశ్వేశు కలిసే వీరారెడ్డి

    రత్నాంబరంబు లేరాయుడిచ్చు?

కైలాసగిరి పంట మైలారు విభుడండే

    దినవెచ్చ మేరాజు దీర్చగలడు?

రంభగూడే దెనుంగు రాయరాహత్తుండు

    కస్తూరికేరాజు ప్రస్తుతించు?

సర్వస్థుడయ్యె విస్సన్న మంత్రి మఱి హేమ

    పత్రన్న మెవ్వని పంక్తి గలదు?"

అంటూ గతవైభవాన్ని నెమరు వేసుకొన్నా - మరణం సమీపిస్తున్నా దిగులు చెందడం కన్న పరిస్థితిని ఎదుర్కొనే స్థైర్యం కలవాడు శ్రీనాథుడు. జీవితం ఒక సవాలు - దాన్ని స్వీకరించాలి అన్నదే శ్రీనాథుడు ఇచ్చే సందేశం. దీనికి ఈ రెండు పాదాలు నిలువెత్తు సాక్ష్యాలు:

"దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ

నరుగుచున్నాడు శ్రీనాథు డమరపురికి "

-స్వర్గలోకంలో తనకంటే ముందు వెళ్ళిన మహాకవులున్నారు. వాళ్ళ గుండెలు గుభేలుమనేలా - అమ్మో, శ్రీనాథ మహాకవి వస్తున్నాడు అని భయం కలిగేలా - నేను కూడా స్వర్గానికి వెళ్తున్నాను " అని ఠీవీగా పలికాడు. మరణాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు. దాన్ని స్వీకరించాలి - దానికి గుండె ధైర్యం కావాలి. ఈ విధంగా శ్రీనాథుడి జీవితం, పద్యాలు మనకి కావలిసినంత 'పెర్సనాలిటీ డెవలెప్ మెంట్' ను బోధిస్తాయి.

పెదకోమటి వేముడి ఆస్థానంలో విద్యాధికారిగా పద్దెనిమిది సంవత్సరాలు రాజభోగాలను అనుభవిస్తూ కాలం గడిపాడు శ్రీనాధుడు. అతడు మరణించాకా, శ్రీనాధుడు 1424 ప్రాంతాల్లో పల్నాటి సీమకు రాజాశ్రయం కోసం వెళ్ళాడు. పల్నాడు వెనుకబడిన రాజ్యం. కొండవీటిలో రాజభోగాలు అనుభవించిన శ్రీనాధుడికి ఈ ప్రాంతం రుచించలేదు.

అది ఈ పద్యం వల్ల తెలుస్తుంది.

చిన్న చిన్న రాళ్ళు చిల్లరదేవుళ్ళు- నాగులేటి నీళ్ళు నాపరాళ్ళు

సజ్జజోన్న కూళ్ళు సర్పంబులును దేళ్ళు- పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు.

తక్కువ తెలిసి ఉండి, గర్వంతో ఎక్కువ మాట్లాడే కుకవుల గురించి శ్రీనాథుడు వ్రాసిన పద్యం...

బోధ మల్పంబు గర్వ మభ్యున్నతంబు
శాంతి నిప్పుచ్చరంబు మచ్చరము ఘనము
కూపమండూకములుబోలె గొంచె మెరిగి
పండితంమన్యులైన వైతండికులకు. (భీమ ఖండం -1 -13 )

తనకు భిక్ష దొరకలేదని కాశీ నగరాన్ని శపించబోతాడు వ్యాసుడు. అతడిని శర్వాణి వారించే పద్యాలు...

భిక్ష లేదని ఇంత కోపింతురయ్య
కాశికాపట్టణముమీద గాని నేయ !
నీమనశ్శుద్ది తెలియంగ నీలకంఠు
డింత చేసేనుగాక కూడేమి బ్రాతి? (భీమ ఖండం 2-114 )

శివుడు నిన్ను శోధించడానికి భిక్ష పుట్టకుండా చేసాడని చెప్పేసింది.

తెలుగు భాష గొప్పతనాన్ని మొదట చాటిన వాడు శ్రీనాధుడే ! క్రీడాభిరామం లోని ఈ పద్యం చూడండి...

జనని సంస్కృతంబు సకల భాషలకును - దేశభాషలందు దెనుగులెస్స
జగతి తల్లికంటె సౌభాగ్యసంపద - మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే ?

కంజీవరం వెళ్ళినప్పుడు అక్కడి తమిళుల విందులో శ్రీనాధుడి తిప్పలు అంతా ఇంతా కావు.

తొలుతనే వడ్డింత్రు దొడ్డ మిరియపు జారు
చెవులలొ బొగవెళ్ళి చిమ్మిరేగ
బలు తెరంగుల తోడ బచ్చళ్ళు చవి గొన్న
బ్రహ్మ రంధ్రము దాక బారు నావ
యవిసాకు వేచిన నార్నెల్లు పసి లేదు
పరిమళ మెంచిన బండ్లు సొగచు
వేపాకు నెండించి వేసిన పొళ్ళను
గంచాన గాంచిన గ్రక్కువచ్చు
నఱవ వారింటి విందెల్ల నాగడంబు
చెప్పవత్తురు తమ తీరు సిగ్గు లేక
చూడవలసిన ద్రావిళ్ళ కీడు మేళ్ళు...

అసలే భోజన ప్రియుడైన శ్రీనాధుడు అలవాటు లేని తమిళుల భోజనముతో ఎలాటి అవస్థలు పడ్డాడో కదా. ఆంధ్రుల భోజనములో పప్పు ప్రధానము. తమిళులకు చారు ముఖ్యం. అలవాటు లేని చారు అదీగాక మిరియపు చారు మొదటనే వడ్డించేసరికి కవి సార్వభౌముడికి చిర్రెత్తింది.

బుడతకీచువారు(పోర్చుగీసువారు) మన దేశానికి రాకముందు మనకు మిరపకాయలు లేవు. కారానికి మిరియాలే వాడేవారు. మనకు పోర్చుగీసు వారివల్లనే మిరపకాయలు లభించాయి. మిరియాలకు బదులుగా కారానికి వాడేవి కాబట్టి వీటిని(మిర్యపుకాయలు) మిరపకాయలు అని పిలుస్తారు.

సన్నన్నం తినే అతనికి ఆ ప్రాంతం లోని జొన్న కూడు రుచించలేదు. దానికి తోడు, చింత కూర, బచ్చలి కూర కలిపి వండిన ఉడుకు పులుసు ఒకటి! ఆ చేదు శ్రీనాధుడు భరించలేకపోయాడు. తానేమిటి, తనను పుట్టించిన జేజమ్మ కూడా తినలేడు...శ్రీనాధుడు శ్రీకృష్ణుడిని ఇలా సవాలు చేసాడు.

" ఫుల్లసరోజనేత్ర యల పూతన చన్నుల చేదు ద్రావినా

నల్ల దావాగ్ని మ్రింగితి నటంచును నిక్కేదవేల?

పల్లవయుక్తమౌ నుడుకు బచ్చలిశాకము జోన్నకూటితో

మెల్లన నొక్క ముద్ద దిగమ్రింగుము నీపస గానవాచ్చేడిన్ "

భావము: చిన్న నాడు పూతన ఇచ్చిన విషపు చేదు పాలు తాగానని గర్వంగా చెప్పు కుంటావే ... కృష్ణా, బచ్చలి ఆకులతో చేసిన ఈ జొన్న కూడు ఒక్క ముద్ద దిగ మింగి చూడు, నీ సత్తా తెలుస్తుంది.

భోజన, నిద్రా, మైథునాల్లో ఎలాటి లోపం కలిగినా భరించలేడు శ్రీనాథుడు. ఈ పద్యం చూడండి -

గొంగడి మేలు పచ్చడము కుంపటి నల్లులు కుక్కిమంచమున్‌
జెంగట వాయుతైలము లజీర్ణపు మందులు నుల్లిపాయలున్‌
ముంగిట వంటకట్టియల మోపులు దోమలు చీముపోతులున్‌
రంగ వివేకి కీ మసర రాజ్యము కాపుర మెంత రోతయో
అంగడి యూర లేదు వరి యన్నము లేదు శుచిత్వ మేమి లే
దంగన లింపు లేరు ప్రియమైన వనంబులు లేవు నీటికై
భంగపడంగ బాల్పడు కృపాపరు లెవ్వరు లేరు దాత లె
న్నంగను సున్న గాన బలనాటికి మాటికి బోవ నేటికిన్‌
తేలాకాయెను బోనము
పాలాయెను మంచినీళ్ళు పడియుండుటకున్‌
నేలా కరవాయె నిసీ
కాలిన గురిజాల నిష్ట కామేశ శివా"

పల్నాట తనకు ప్రియమైనవి ఏమీ లేవంటూ వ్రాసిన ఈ పద్యం చూడండి...
" అంగడి యూరలేదు వరియన్నములేదు శుచిత్వమేమిలే

దంగన లిమ్పులేరు ప్రియమయిన వనంబులు లేవు, నీటికి

భంగాపడంగా బాల్పడు క్రుపావరు లేవ్వరులేరు దాతలె

న్నంగాను సున్నా, గాన బలనాటికి మాటికి బోవనేటికిన్?

రాసికుడుపోవాడు పాలనా- దేనగంగా రంభయైన నేకులేవడకున్

వసుధేసుడైన దున్నును- గుసుమాసృన్ డైన జొన్నకూడె కుడుచున్..."

ఇలా పల్నాటికి వీడ్కోలు పలికి, గోదావరీ తీరానికి వెళ్ళాడు.

ఆ ప్రాంతాన్ని ఇంత తేలిగ్గా చెప్పిన శ్రీనాథుడు.. చివరకు అక్కడి పల్నాటి వీరచరిత్రను గ్రంథంగా రాశారు. అదంతా ఆ చెన్నకేశవుడి మహిమే అని చెబుతారు. పల్నాటి మీద పలు మాటలు తూలినందుకు అక్కడి వీరుల చరిత్రను రాసి తన తప్పును దిద్దుకోమని చెన్నుడే... ఆ మహాకవికి చెప్పాడని నమ్మిక. నిజమే లేదంటే... ఆ ప్రాంతం మీద అంత హేళనగా పద్యాలు రాసిన మహాకవి... అక్కడి వీరుల చరిత్రను రాయడం విశేషమే మరి. పల్నాటి వీరచరిత్రను... మంజరీ ద్విపద కావ్యంగా రాశారు. ఇదే ఆయన చివరి రచన కూడా అని చెబుతారు.

శ్రీనాధ కవిసార్వభౌముడు అనగానే సంస్కృత పద భూయిష్టమైన శైలి మెదలక మానదు మన మనసులో.. కానీ తీయతీయని తెలుగుపదాలతోకరుణ రసం తొణికిసలాడే ఈ పద్యాన్ని చూద్దామా.. నైషధం లో తనని నలుడు పట్టుకున్నప్పుడు హంస నలుడితో ఇలాఅంటుంది

"తల్లిమదేకపుత్రక పెద్ద కన్నులు,
గానదిప్పుడు మూ(డుకాళ్ళముసలి
ఇల్లాలు గడు సాధ్వి ఏమియు నెరుగదు ,
పరమపాతివ్రత్యభవ్యచరిత
వెనకముందర లేరు నెనరైన చుట్టాలు ,
లేవడి యెంతేని జీవనంబు
గానక కన్న సంతానంబు శిశువులు
,జీవనస్థితి కేన తావలంబు
కృప దలంప(గదయ్య యో నృపవరేణ్య ,
యభయమీవయ్య యో తుహినాంశువంశ
కావగదవయ్య యర్దార్ది కల్పశాఖి
నిగ్రహింపకుమయ్య యోనిశధ రాజ!"

పద్యం చదువుతుండగానే మనకళ్ళెదుట చక్కని దృశ్యం రూపు కడుతుంది. ఒక్కడే కొడుకు మీద పంచప్రాణాలూ నిల్పుకున్న మూడుకాళ్ళ ముసలి తల్లి,వ్యవహార జ్ఞానం లేని అమాయకురాలు, ఉత్తమురాలు, పరమ పతివ్రత అయిన భార్య,లేక లేక కలిగిన పసిబిడ్దలు.. నిరాధారమైన ఒక సామాన్యుడి వ్యధ మెదులుతుంది.

రాయంచ యంచు (జీరకు జోక యగు(గాక
పచ్చియేనిక తోలుపచ్చడంబు
హరిచందనాస్పదంబగు హృదయము మీ(ద(
బట్టు ( జేకొను(గాక భసితధూళి
కమనీయ చరణలాక్షారాగలేఖచే
ముద్రితంబగు(గాక రుద్రభూమి
కలితముక్తాఫలగ్రైవేయకంబుతో (
దులదూ (గు(గాక పెంజిలువపేరు

శ్రీనాధుడి హరవిలాస కావ్యంలో కపట బ్రహ్మచారి రూపం లో వచ్చిన శివుడు శివుడ్ని వివాహమాడదలచింది అని విని పార్వతిని సందర్భం..." బాగుంది బాగుంది నీ రాజహంసలు ముద్రించబడిన పట్టుచీరకు దీటుగా వారి పచ్చిధనమైనా పోని యేనుగు తోలు వస్త్రం,ఘుమఘుమల గంధాన్ని అలదుకునే నీ హృదయం మీద విభూది కూడా ముద్రించబడుతుందిలే ... చక్కగా లత్తుక (పారాణి )పూయబడిన నీ పాదపద్మాలు శ్మశానం లోనా తల్లీ అడుగుబెట్టేది ?నువ్వేమో ముత్యాల హారాన్ని ధరించావు.. వారి మెడలో పెద్దపాము బాగుంది".. ... అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నాట్లున్నా "

"కస్తూరికా కుంకుమ చర్చితాయై ,
చితారజః పుంజ విచార్చితాయ "

ప్రదీప్త రత్నోజ్వల కుండలాయై
స్ఫురన్మహాపన్నగ భూశణాయ
శివాన్వితాయైచ శివాన్వితాయ "
అని ఆది శంకరుల వారిచేత స్తుతించబడిన అర్ధనారీశ్వర తత్వమే మనకి సాక్షాత్కరిస్తోంది కదా !--

సీ. వేదండ వదన శుండాదండ గండూష
కాండ సిక్తాప్సరో మండలములు
గంధర్వ కన్యకా కనక సౌగంధిక
మాలికా లగ్న షాణ్మాతురములు
నందీశ్వర క్షిప్త నారంగ ఫలపాక
తరళ విద్యాద్ధరీ స్తన భరములు
గరుడ లీలావతీ కస్తూరికా పంక
పిహిత నిశ్శేషాంగ భృంగిరిటులు

తే. వీరభద్ర వికీర్ణ కర్పూర చూర్ణ
ధవళితాకాశ చర వనితా ముఖములు
శాంభవీ శంభు మధుకేళి సంభ్రమములు
పొదలి వాసించుఁ గాత నా హృదయ వీధి

పై పద్యం కవిసార్వభౌముడైన శ్రీనాధుని హరవిలాస కావ్యం లోనిది. కావ్య ప్రారంభంలో, ఇష్ట దేవతా ప్రార్థన చేసే సందర్భంలో శివపార్వతులను సంభావిస్తూ రాసిన పద్యం. ఏ కవి అయినా దైవప్రార్థన చేసేటప్పుడు ఒక నమస్కారం పెట్టి ఊరుకోడు. ఆ దేవుడి ప్రభావాన్నీ, లీలలనూ ఉత్ప్రేక్షలతోనో, రూపకాలతోనో చమత్కారంగా వర్ణించి – అలాంటి దేవుడు నా కృతిభర్తనూ నన్నూ కాపాడుగాక అని వేడుకోవడం పరిపాటి. అలాంటిదే ఈ పద్యమున్నూ. ఇందులో కేవలం శివపార్వతులనే గాక శైవలోకం లోని ఇతర ప్రధాన పెత్తందార్లనూ, వారి చేష్ఠావిన్యాసాలనూ వివరిస్తూ పద్యాన్ని నడిపించాడు కవి. మొత్తం మీద ఒక సందర్భాన్నీ, సంఘటననూ ఈ దేవదేవులూ, వారి పరివారమూ ఎలా నిర్వహించుకున్నారో, ఆ సంబరాన్ని తెలిపేది ఈ పద్యం.

సందర్భం మధుకేళి. అంటే వసంతోత్సవం. హోలీ పండగన్నమాట. రంగులు పులుముకోవడం, పిచికారీలతో రంగునీళ్ళు చిలకరించుకోవడం ఈ పండగలోని ప్రధాన కార్యక్రమం. ఇలాంటి సందర్భాల్లో చిన్నా పెద్దా తేడాల్లేకుండా, ఉల్లాసంగా అందరూ కలిసిపోవడం ఆనవాయితీ. అంతే కాదు, మర్యాద కోసం మనసులోనే దాచి వుంచుకొని బైటికి తెలుపుకోలేని కోరికలనూ, ఆశలనూ కొంచెం బయట పెట్టుకునే అవకాశం లభించేది ఇలాంటి సందర్భాల్లోనే. ఈ ఉల్లాసాన్నంతా ఈ పద్యంలో చూపించాడు శ్రీనాధుడు.

హరచూడా హరిణాంక వక్రతయు, కాలాంతః స్ఫురచ్చండికా
పరుషోద్గాఢ పయోధరస్ఫుట తటీ పర్యంత కాఠిన్యమున్‌,
సరసత్వంబును, సంభవించెననగా సత్కావ్యముల్‌ దిక్కులన్‌
చిరకాలంబు నటించుచుండు, కవిరాజీగేహ రంగంబులన్‌! (భీమ 1-11)

(ఆహా! ఎంత అద్భుతమైన కల్పన! ఒక వంక హరచూడా హరిణాంకుడి వక్రత, మరో వంక ప్రళయకాల భీభత్సపు మహోత్సాహంతో బిగువెక్కిన చండికా పయోధరాల కాఠిన్యం ఎలా కలిపాడండీ ఈ రెండిటినీ!)

వక్రత కాఠిన్యం సరసత అనేవి తన కవితా గుణాలుగా శ్రీనాథుడు పేర్కొన్నాడు.

ఉ. కంటికి నిద్రవచ్చునె సుఖంబగునే రతికేళి జిహ్వకున్
వంటకమిందునే ఇతర వైభవముల్ పదివేలు మానసం
బంటునె మానుషంబు గలయట్టి మనుష్యున కెట్టివానికిన్
కంటకుడైన శాత్రవుడొకండు తనంతటివాడు గల్గినన్

చదువుతుండగనే అర్థమైపోతూ ఏ వివరణ అక్కర్లేని పై పద్యం శ్రీనాధుడిది. కాశీఖండం అనే కావ్యం లోనిది.

కం. ఒక వర్ష శతంబున నొం
డొక తీర్ధము నందు గల ప్రయోజన లాభము
బొక దివసంబున నానం
ద కాననము నందు సర్వదా సిద్ధించున్! (121)

తా. కాశీ కంటే వెరొక తీర్ధమునందు ఒక నూరు సంవత్సరములకు లభించెడి ప్రయోజనము ఆనందదాయకమైన కాశీ యందు ఒక్క దినమునందే యెల్లప్పుడూ సిద్ధించును.

కం. నేమంబున నొక ప్రాణా
యామంబున నరుడు పడయునట్టి ఫలశ్రీ
సామాగ్రి యొండెడ ముని
గ్రామణి ! సాష్టాంగయోగ గతి గనరు నరుల్! (122)

నేమంబున = నియమముతో; ఒండెడన్ = వెరొక తీర్ధమునందు.

తా.కాశీ క్షేత్రములో ఒక్క ప్రాణా యామము వలన మనుష్యుడు పొందెడి సమగ్ర ఫలసమృద్ధిని అన్య క్షేత్రమునందు అష్టాంగసహిత యోగ మార్గమున కూడా పొందజాలరు.

సీ! చక్రవాళ పరీత సర్వం సహా
పరమ తీర్ధములలో బెరువ కాశి
కాశికా పట్టణ క్రోశ పంచక తీర్ధ
సమితి లో సారంబు జహ్ను కన్య
జహ్ను కన్యా తీర్ధ సముదాయమున యందు
గడు బెద్ద మణికర్ణికా హ్రదంబు
మణికర్ణికా తీర్ధ మజ్జన ఫలము కం
టెను విశ్వనాధు దర్శన మధికము.

తే!గీ! విశ్వపతి కంటె గైవల్య విభుని కంటె
గాలకంఠుని కంటె ముక్కంటి కంటె
దీర్ధములు దైవములు లేవు త్రిభువనముల
సత్యమింకను సత్యంబు సంయ మీంద్ర! (123)

తా. లోకాలోక సర్వ భూమండలము నందలి పరమ తీర్ధములలో..కాశీ పెరువ. కాశికా నగర పంచ క్రోశ మధ్యమునందుగల తీర్ధ సముదాయములలో జహ్నవి సారభూతమైనది. జహ్నవీ తీర్ధ కదంబములలో మణికర్ణిక మిక్కిలి గొప్పది. మణికర్ణికా తీర్ధ స్నాన ఫలము కంటే, శ్రీ విశ్వనాధుని దర్శన ఫలము గొప్పది.కైవల్య నాధుడైన విశ్వనాధుని కంటే, కాల కంఠుని కంటే, ముక్కంటి కంటే అధికమైన తీర్ధములు,దైవములు భూర్భువస్సువర్లోకములు మూడింటి యందును లేవు. ఇది సత్యము. మరియూ సత్యము.

ఈ విధమైన కాశీ మహాత్మ్యములు "శ్రీనాధ మహాకవి" ప్రణీతంబైన "శ్రీ కాశీ ఖండం"లో సప్తమాశ్వాసమునందు చెప్పబడెను. ఈ పద్యములు విన్నా,చదివినా సకల ఐశ్వర్యములు సిద్ధించును.

కవి సార్వభౌముని చాటువు

కొందరు భైరవాశ్వములు కొందరు పార్థుని తేరి టెక్కెముల్
కొందరు ప్రాక్కిటీశ్వరులు కొందరు పార్థుని ఎక్కిరింతలున్
కొందరు కృష్ణ జన్మమున కూసినవారాలు ఈ సదస్సు లో
అందరు నందరే మరియు నందరు నందరు నందరే గనన్

భావము : భైరవుని రథానికి పూన్చేది కుక్కలను, అర్జనుని రథ పతాకము పై గల గుర్తు 'కపి రాజు' ఆంజనేయుడు,సముద్రములో మునుగు భూమిని లేవనెత్తినది వరాహాహావతారములో విష్ణువు అంటే ఇక్కడ అన్వయములో మాత్రము పందులు, కృష్ణ జన్మ సమయమున కూసినవి గాడ్దెలు,(వసుదేవుడు-గాడ్దె కాళ్ళు), సభలో కూర్చున్నవారంతా ఈ జంతువులతో సమానమని నర్మగర్భంగా వంగ్య పూరితమైన ఈ పద్యాన్ని, ఒక రాజు,సభలో గల తన ఆస్థాన కవులను గూర్చి గొప్పగా చెప్పంటూ ఈ సమస్య ఇస్తే,శ్రీనాధులవవారు పై విధంగా తెలిపినారు .

పరమకల్యాణి! యోభాగీరథీగంగ! వార్థిభామిని! పోయివత్తునమ్మ!
అమరేంద్రులార! లోలార్క కేశవులార! వనజసంభవ! పోయివత్తునయ్య!
శ్రీవిశాలాక్షి! దాక్షిణ్య పుణ్యకటాక్ష! వాసవార్చిత! పోయివత్తునమ్మ!
శ్రీపూర్ణభద్ర పారిషద నాయకులార! వటుకభైరవ! పోయివత్తునయ్య!

తీర్థ సంవాసులార! కృతార్థులార!
పాశుపతులార! భాగ్యసంపన్నులార!
మందిరోద్యాన వాటికా మఠములార!
పోయివచ్చెద మీకాశిపురము విడిచి||

కలహంసి! రారాదె కదలి నాతోఁగూడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి
కదళికాకాంతార! కదలి రాననుగూఁడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి
శ్రీవిశాలాక్షి! విచ్చేయు నాతోఁగూడి, నీవేల వత్తమ్మ నెమ్మినుండి
నాతోడఁ గూడి యంతర్గేహ! యేతెమ్ము, నీవేల వత్తమ్మ నెమ్మినుండి

రండు ననుఁగూడి యోపరివ్రాట్టులార!
వత్సలత గల్గి మీరేల వత్తురయ్య!
పరమ నిర్భాగ్యుఁడైన నాపజ్జఁబట్టి
కటకటా! సౌఖ్యజలరాశిఁ గాశిఁబాసి.

ఆగస్త్యముని కాశీనగరాన్నివదలి వెళ్ళేసందర్భంలో శ్రీనాధుని "కాశీఖండము" నుండి.

నీకతంబునఁ గాదె లోకభీకరులైన, త్రిపుర దానవుల మర్ధింపఁ గలిగె
నీకతంబునఁ గాదె కాకోల విషవహ్ని, యలవోకయును బోలె నార్ప గలిగె
నీకతంబునఁ గాదె నిరవగ్రహస్ఫూర్తి, నంధకాదుల గర్వ మడఁపఁగలిగె
నీకతంబునఁ గాదె నేఁడు వారాణసీ, సంగమోత్సవ కేళి సలుపఁ గలిగె

నాత్మజుఁడవన్న మిత్త్రుండ వన్న భటుఁడ
వన్న సచివుండవన్న నాకెన్న నీవ
నిన్ను నెబ్భంగి వర్ణింప నేరవచ్చు?
కంఠపీఠాగ్ర కరైరాజ! డుంఠిరాజ!

శ్రీనాథ మహాకవి "కాశీఖండము" నుండి.

కమలలోచన మనుజుఁ డొక్కటిఁదలంప
దైవమొక్కటిఁ దలఁచు టెంతయు నిజంబు
కాశిఁ బెడఁ బాయనని యేను గదలకుండఁ
గాశిఁ బెడఁబాపె దైవంబు కరుణలేక

శ్రీనాథ మహాకవి "కాశీఖండము" నుండి

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...