Thursday, November 29, 2018

మీలో ఎంత మందికి తెలుసు? "ఆడిదము సూరకవి"

మన తెలుగు సాహితీ చరిత్రలో చెప్పుకో దగిన కవులలో “అడిదము సూరకవి” ఒకరు. ఈయన 18వ శతాబ్ధమునకు చెందిన వారు. కవితా వృత్తిచే ఆంధ్రదేశమంతటా పేరు పొందిన  బ్రాహ్మణులు శివ శ్యామలా దేవతోపాసకులు. ఈ వంశీయులు 23 తరాలనుండి కవితా వృత్తిచే జీవించారు. వీరికి 14 తరాల నుండి రాజాస్థానం లభించింది. వీరు కళింగ దేశంలోని విద్వత్కవి వంశములోని వారు.

అసలు అడిదము వారి వంశం మొదట మోదుకూరు పిమ్మట గంధవారణం, అనే ఇంటి పేర్లు ఉండేవట. తదుపరి వీరి పూర్వీకులైన నీలాద్రి కవి రణరంగ వీరుడై ఒక అడిదాన్ని(కత్తిని) కానుకగా పొందారట. అప్పడినుండి “అడిదం” వారని ప్రసిద్ధి వచ్చిందట.

చినవిజయరామరాజు భోజుడని చెప్పుకోడానకి ముందు సూరన ఆర్థికంగా చాలా బాధలు పడ్డారు. ఆయన తండ్రి భాస్కరయ్య లక్షణసారం రాసేడని చెప్పుకోడమే కాని ఇప్పుడు అందుబాటులో లేదు.

ఇతడు లోకంలో తిట్టు కవిగాను, లోకజ్ఞుడు గాను, విఖ్యాతుడైనప్పటికీ “రామలింగేశ శతకం” వంటి పదహారణాల చాటుత్వం గల చక్కని శతకం రచించారు. ఆయన నీలాద్రి కవికి 9వ తరం వాడు. ఆయన సంభాషణాత్మక చాటువును ఇలా వ్రాసారు.

“ఊరెయ్యది చీపురు పలి
పేరో సూర కవి ఇంటి పేరడిదము వార్
మీ రాజు విజయ రామ మ
హా రాజతడేమి సరసుడా ? భోజుడయా ?”

ఇలా ఈ పద్యాన్ని బట్టి తనకి తనే స్వయం గా చాటువులో చెప్పుకున్నారన్న సంగతి విదితమౌతోంది. అంతే కాదు ఈయన విజయనగర ప్రభువు పూసపాటి విజయ రామరాజు ఆస్థాన కవి గా ఉన్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ప్రభువును స్తుతిస్తూనే పెద్దాపుర ఆస్థానంలో ఈ కవి గారు చెప్పిన సుప్రసిద్ధ చాటువు ఇది.

అంతే కాదు మన సూర కవికి కనకాభిషేకం చేయించిన విలువైన చాటువు కుడా ఇదే .

“రాజు కళంక మూర్తి,రతిరాజు శరీర విహీను,డంబికా
రాజు దిగంబరుడు,మృగరాజు గుహాంతర సీమవర్తి,వి
బ్రాజిత పూసపాడ్విజియ రామ నృపాలుడు రాజు కాక ఈ
రాజులు రాజులా పెను తరాజులు కాక ధరాతలంబునన్ !”

ఈ పద్యం వినగానే సభలో ఉన్న రాజులందరు తమని తరాజులంటున్నాడని రోష పడ్డారట. అప్పుడు “తాను పేర్కొన్న రాజు చంద్రుడు, వానికి మచ్చ రతిరాజు అనగా మన్మధుడు, అతగాడికి శరీరమే లేదు, ఇక శివుడికి కట్టు బట్టల్లేవు, సింహం గుహల్లొ నివాసం, వీళ్ళు రాజు లేమిటి?” అని వారినే తాను రాజులు గా చెప్పినట్టు చమత్కరించారట.

ఈ పద్యాన్ని ఆశువుగా చెప్పినందుకు ఆయన విద్వత్తుకు మెచ్చి విజయ రామరాజు కనకాభిషేకం చేయించాడట. ఐతే ఆనాటి ఆనవాయితీ గా తనకు అభిషేకించబడిన ఆ బంగారు నాణాలను ఆ కవి తీసుకోవాలని రాజాజ్ఞ. కానీ సూరన మాత్రం తనకి జరిగిన సత్కారానికి మిక్కిలి సంతసించి “తమ దయవలన ఇంత వరకు స్నానం చేసిన ఉదకమును పానము చేయ లేదు. తమరి ఆజ్ఞని సిరసావహించనందుకు మన్నించమని తీసుకోవడనికి సమ్మతించలేను” అన్ని ఆ నాణాలు తీసుకోలేదట. అందుకు ముగ్ధుడైన రాజు తగు రీతిన సత్కరించాడట. బహుశ అప్పడి నుంచే “డబ్బు నీళ్ళలా వాడటం” అనే నానుడి వచ్చిందని ప్రతీతి. అంటే దీని బట్టి మన సూర కవి దారిద్ర్యానికి అధికారానికీ తల వొగ్గలేదన్న మాట.

18వ శాతాబ్దం తొలి పాదంలో సుమారు 1720 లలో జన్మించిన సూరన తండ్రిదగ్గరే ఛందస్సూ, అలంకారశాస్త్రం, సంస్కృతవ్యాకరణం చదువుకుని, తండ్రికి మించిన తనయుడు అనిపించుకున్నారు. ఏదో చిన్న మడిచెక్క వున్నా పంటలు లేక, ఆయన వూరూరా తిరిగి ఆశువుగా కవిత్వం చెప్పి ఆనాటి భత్యం సంపాదించుకునేవారు. గడియకి (24 నిముషాలు) వంద పద్యాలు ఆశువుగా చెప్పగలదిట్టనని తనే చెప్పుకున్నారు.

 సూరన దినవెచ్చాలకి పద్యాలు చెప్పడం “ఇచ్చినవాడిని ఇంద్రుడనీ చంద్రుడనీ మెచ్చుకోడం, ఇవ్వనివాడిని చెడామడా తిట్టడం” చేసేవాడని సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆరుద్ర గారు రాశారు. అట్టే భాషాజ్ఞానంలేని పామరులకోసం రాయడంచేత తేలికభాషలో చాటువులు రాసేడు అన్నారు. అయితే చందోబద్ధంగా కవిత్వంలో వింతపోకడలు పోతూ చమత్కారం, ఎత్తిపొడుపూ మేళవించి రాయడంవల్ల ఈ చాటువులు పామరజనరంజకమే కాక పండితుల ఆదరణకి కూడా అంతగానూ నోచుకున్నాయి.

సంస్థానాలు తిరుగుతూ, జీవనభృతి సంపాదించుకునే రోజులలో విజయనగరం వచ్చినప్పుడు పెదసీతారామరాజు ఆయనని ఆదరించలేదు. ఆసమయంలో సూరకవి చెప్పిన పద్యం –

గీ. మెత్తనై యున్న యరటాకు మీదఁ గాక
మంటమీఁదనుఁ జెల్లునే ముంటివాడి
బీదలైయున్న మాబోంట్ల మీదఁ గాక
కలదె క్రొవ్వాడి బాదుల్లాఖాను మీఁద.

చేవ వుంటే బాధుల్లాఖాను మీద చూపించు నీప్రతాపం, అంతే కాని కూటికి గతిలేని నామీద ఏమిటి అంటూ ఎత్తిపొడిచారు.

సూరన ఎంత దారిద్ర్యం అనుభవించినా, ఆత్మగౌరవం కాపాడుకుంటూనే వచ్చేడు కానీ అధికారులకి తల ఒగ్గలేదు.

చినవిజయరామరాజు సూరనని ఆదరించిన తరవాత, రాజుగారి సవతి అన్నగారు అధికారం వహించి, సూరనని ఉప్పూ, పప్పూకోసం కోమటులని పొగడడం మానుకోమని ఆంక్ష పెట్టారు కానీ సూరన ఆఆజ్ఞని తలకెత్తుకోక, తన అభీష్టంప్రకారమే జీవనసరళి సాగించుకున్నారు..

మామూలుగా మనఇళ్లలో నిత్యం అనుభవమే, భార్య, భర్తని వూళ్లో అందరికీ చేస్తారూ, అందరినీ పొగుడుతారు, మనవాడిని కూడా ఓమంచిమాట అనొచ్చు కదా అని.

అలాటిదే ఈ చాటువు. సూరన సతి సీతమ్మ ఒకసారి “అందరిమీదా పద్యాలు రాస్తారు, మన అబ్బాయి బాచన్న మీద రాయరేం” అని అడిగిందిట. అందుకు సూరకవి తన సహజ ధోరణిలో

క. బాచా బూచుల లోపల
బాచన్నే పెద్ద బూచి పళ్లుం దానున్

బూచంటే రాత్రి వెఱతురు
బాచన్నంటే పట్ట పగలే వెఱతుర్
అని చదివాడట, తన కుమారుడు రూపసి కాడని స్పష్టం చేస్తూ.

సీతమ్మ చాల్లెండి మీవేళాకోళం అని ఆయన్ని మందలించిందిట.

అలాగే మరోసారి ఆయన చీపురుపల్లినుండి ఆదపాకకి వెళ్తుంటే, దారిలో ఒక సాలెవారి చిన్నది కనిపించింది. ఆయనే పలకరించేరు ఎక్కడికి అని. అదపాక అత్తవారింటికి వెళ్తున్నానని చెప్పి, బాబూ, నామీద ఒక పద్యం చెప్పండి అని అడిగింది. ఆయన వెంటనే తన సహజ ధోరణిలో ఆశువుగా చెప్పిన పద్యం.

క. అదపాక మామిడాకులు
పొదుపుగా నొక విస్తరంట బొడినవాఁడే
ముదమొప్ప విక్రమార్కుఁడు
అదపాకా అత్తవారు ఔనే పాపా.

ఇక్కడ కవిగారు మామిడాకుల ప్రసక్తి తేవడానికి కారణం అదపాకలో మామిడాకులు విస్తరాకులు కుట్టడానికి వెడల్పులేనివి, విస్తరాకులు కుట్టడానికి వీలుగా వుండవు అనిట.

ఎవరిని నువ్వు అనొచ్చు. ఎవరిని గౌరవపురస్సరంగా మీరు అనాలి అన్న వాదన ఈమధ్యనే వచ్చింది గాదు.

ఈకింది పద్యం, దానిమీద జరిగిన చిన్న చర్చ చూడండి. సూరన చినవిజయ రామరాజు శౌర్యపటిమని ప్రశంసిస్తూ చెప్పిన పద్యం.

ఉ. పంతమున నీకుఁజెల్లు నొకపాటి యమీరుఁడు నీకు లక్ష్మమా
కుంతము గేలు బూని నిను గొల్వనివాడు ధరిత్రిలోన భూ
కాంతుఁడొకండు లేడు కటకంబు మొదల్కొని గోల్కొండ ప
ర్యంతము నీవెకా విజయరామనరేంద్ర! సురేంద్రవైభవా.

కటకం నించీ గోల్కొండ వరకూ కత్తి చేత పట్టి నీకు సలాములు చెయ్యని రాజు ఒక్కడు కూడా లేడు, నీకు నీవే సాటి అన్నాడు సూరన. సభికులు భళీ అంటూ కరతాళధ్వనులు చేశారు. రాజు గారు కూడా మెచ్చుకున్నారు కానీ నొచ్చు కోకుండా వుండలేకపోయారు. తనంతటి ప్రభువుని నువ్వు అంటూ ఏకవచనంలో సంబోధించడం బాగులేదు అన్నారు.

సూరకవి వెంటనే,
క. చిన్నప్పుడు రతికేళిని
నున్నప్పుడు కవితలోనన్ యుద్ధములోనన్
వన్నెసుమీ ‘రా’ కొట్టుట
చెన్నగునో పూసపాటి సీతారామా!

పిల్లలవిషయంలో, పడగ్గదిలో, కవిత్వం చెప్పినప్పుడు, యుద్ధంచేసే అప్పుడూ ఏకవచనం వాడితే తప్పులేదు అంటూ రాజుగారిని సమాధాన పరిచారు. ఇంచుమించు ఇదే అర్థాన్నిచ్చే శ్లోకం ఒకటి సంస్కృతంలో వుందిట.

ఇక ఆయన “పొణుగుపాటి వేంకట మంత్రి” అనే మకుటంతో 39 కంద పద్యములు కళింగ దేశ ప్రాంతంలో వ్యాప్తి లో ఉన్నాయట. ఈయన శృంగవరపు కోట జమిందారు శ్రీముఖి కాశీపతిరావు గారి వద్ద దివానుగా ఉండేవాడట. అంతే కాదు మన సూర కవి గారు ఈ మంత్రి గారి ఇంట ప్రతి ఏటా మూడు నాలుగు మాసాలు గడుపుతూ ఉండేవాడట. మచ్చుకి ఒకటి రెండు కంద పద్యములు…

1. వెన్నెల వలె కర్పూరపు
దిన్నెల వలె నీదు కీర్తి దిగ్దేశములన్
మిన్నంది వన్నెకెక్కును
విన్నావా పొణుగు పాటి వేంకట మంత్రీ !

2. చుక్కలవలె కర్పూరపు
ముక్కలవలె నీదు కీర్తి ముల్లోకములన్
క్రిక్కిరిసి పిక్కటిల్లెను
వెక్కసముగ పొణుగు పాటి వేంకట మంత్రీ !

3. పొగ త్రాగ నట్టి నోరును
పొగడం గా బడయ నట్టి భూపతి బ్రతుకున్
మగడొల్లని సతి బ్రతుకును
వెగటు సు మీ పొణుగు పాటి వేంకట మంత్రీ !

కంద పద్యానికి చౌడప్ప అలవరించిన తేట దనానికి మెరుగులు దిద్దడం సూరకవి కందములో అందముగా అగుపిస్తుందట. ఇక పోతే చుక్కలవలె అన్న పద్యం “కన్యాశుల్కం”లో గిరీశం ఉపన్యాసాలలో చోటు చేసుకునేంత ప్రసిద్ధమైనదట. ఈయన చాటువులు సమకాలీన కవితా రంగం పై గంట పట్టిన ప్రతి వాడూ వ్రాయడాన్ని గురించి ఇలా విమర్శించాడట.

“దేవునాన మున్ను దేశాని కొక కవి
ఇప్పుడూర నూర నింట నింట
నేవు రార్గు రేడ్గు రెనమండ్రు తొమ్మండ్రు
పదుగురేసి కవులు పద్మ నాభా !” అని ఎత్తి చూపారట.

సూర కవి “తిట్టు కంసాలి సుత్తి పట్టు” అన్నట్టు గా సూర కవి చాటువులు విజయనగర సమీపంలోని రామచంద్రాపురంలో మిక్కిలి ప్రాచుర్యాన్ని పొందాయట.

ఆయన రామలింగేశ శతకం సమకాలీన సాంఘిక జీవనానికి దర్పణం వంటిది.

అంతే కాదు, ధన ధాన్యాలను దోచుకునే రాజులను
“పదుగురు కోతి వెంబడి సంచ రింపరే-వాహకుల్లేరె శవంబునకును
గంగి రెద్దుకులేని ఘన తూర్య రావముల్-కలిమి గల్గదె వారి కామినులకు
న్యాయ పద్ధతి నడువని యవనిపతికి నెన్ని చిన్నెలు గలిగిన నెందు కొరకు”

-అంటూ ఈ శతకము నుంచి ఉదహరింప బడినవి. వీరి రచనల్లో నింద దూషణ అధిక్షేపముతో బాటు హాస్యం మేళవించిన రచనలే ఎక్కువ.

శివుడద్రిని శయనించుట
రవిచంద్రులు మింట నుంట,
రాజీవాక్షుండు అవిరళముగ శేషుని పై పవళించుట
నల్లి బాధ పడలేక సుమీ
-అన్న పద్యంలో చాటువు హాస్యం కుడా మిళిత మై ఉండటం గమనార్హం.

 ఈయన తిట్టు పటిమను గురించి తిట్టు కవిగా

“గంటకు నూరు పద్యములు గంటము లేక రచింతు తిట్ట గా
దొడ గితినా పఠీలుమని తూలి పడన్ కుల రాజముల్
విడువ కనుగ్రహించి నిరుపేద ధనాధిపు లార్యు చేతునే
నడిదము వాడ సూరన సమాఖ్యుడ నాకొకరుండు సాటియే”
-అంటూ ఆయన రాజాస్థానాలను సందర్శించి విజయాన్ని చేపట్టి నట్టు తెలుస్తోంది

సాహిత్యం సిరిగలవారిళ్ల రసజ్ఞులకోసం మాత్రమే అనుకునే రోజుల్లో సామాన్యులని తనకవితా మాధురితో చమత్కారంతో అలరించిన కవి అడిదము సూరకవి.

వీరి రచనల్లో నింద దూషణ అధిక్షేపముతో బాటు హాస్యం మేళవించిన రచనలే ఎక్కువ.

ఈయనకు శాపానుగ్రహ సమర్థుడు అనే బిరుదు కలదు. దేశం లో అనేక ప్రాంతాల్లో సందర్శించారు. సంవత్సరం లో ఆరు మాసాలు దేశ సంచారము చేసేవారట. సూరకవి తన సమకాలీన పండితులనెందరితోనో, వాగ్వివాదాలు చేసి, గెలిచారట.

సూరకవి బహు గ్రంధకర్త. ఆయన రచనలు.

కవిజనరంజనము

కవిసంశయ విచ్ఛేధ

చంద్రలోకం

ఆంధ్ర నామ శేషము

రామలింగేశ శతకము

పొణుగుపాటి వేంకట మంత్రి శతకము

రామదండకము

 ఈయన 1785 లో పరమపదించారు.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...