Saturday, October 6, 2018

చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ

“ధనం పెరిగిన కొద్దీ దానం పెరగాలి. విలాసాలు,డాబు పెంచుకున్నారంటే, ఏ నాటికైనా పతనం తప్పదు.”

వరిపంటకు నీరు లేకపోతే ఎండిపోతుంది, సమంగా ఉంటే బంగారం పండుతుంది, అధికమైతే, ఆ నీటనే మునిగి, కుళ్ళి, నశిస్తుంది. ఇక్కడ నీటినే ధనం అనుకుంటే...  తగినంత లేకుంటే కరువు, సరిపడా ఉంటే సమృద్ధి, ఎక్కువైతే... తనను తానే నశింపచేసుకునే రాచమార్గం ! అదే అధికంగా ఉన్న ధనాన్ని(నీటిని తీసివేస్తే) దానం చేస్తే తిరిగి దైవానుగ్రహమనే దివ్య ఫలాన్ని పొందవచ్చు.

ఇప్పుడు లోకం తీరు మారింది. ఉన్నది తినేకంటే, తింటూ ఎదుటివాడికి చూపి, గొప్పలు కొట్టుకునే పధ్ధతి పెరిగింది. తమకున్న డబ్బు, కార్లు, బంగళాలు, విలాస వస్తువులు, తిరిగిన ప్రాంతాలు అన్నీ వెంటనే ఇతరులకు సోషల్ మీడియా ద్వారా చూపాలి. చీరలు, నగలు ధరించి, షోకేసు లో బొమ్మల్లా , ఇతరులకు ప్రదర్శించాలి. నిజానికి ఇటువంటి వారి చూపు, నవ్వు, ప్రదర్శన అంతా పటాటోపమే, వీరికి అంతర్గత శాంతి ఉండదు. వీరిని చూసి, ఇతరులు అనుకరించరాదు. మరి అంతర్గత శాంతి, ధర్మచక్రం యొక్క బలం ఎలా ఉంటుంది, అని అడిగేవారు, చక్వవేణ మహారాజు కధను, తప్పక చదివి తెలుసుకోవాలి !!

పూర్వం చక్వవేణుడు అనే ధర్మాత్ముడు, సదాచారపరాయణుడు, సత్యవాది, దయామయుడు, మహాజ్ఞాని, అయిన మహారాజు ఉండేవాడు. అతను రాజద్రవ్యాన్ని తనకోసం వాడుకోవడం దోషంగా భావించి, భార్యతో తన పొలంలో వ్యవసాయం చేసుకునేవాడు. రాణి నాగలి లాగితే, రాజు విత్తనాలు చల్లేవాడు. తమ పొలంలో పండిన ప్రత్తితో బట్టలు చేసుకు ధరించేవాడు. తమ పొలంలో పండిన ఆహారమే తినేవారు. రాణికి ఖరీదైన ఆభరణాలు ఉండేవి కావు, వారి కష్టార్జితం వారి జీవనానికే సరిపోయేది.

ఒకనాడు ఆ రాజ్యంలో జరిగిన తీర్ధానికి వచ్చిన ధనికులైన వ్యాపారుల భార్యలు, ఆడంబరంగా రాణిని దర్శించి, ఆమె కూడా మహారాజును అడిగి, అటువంటివి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వారి మాటలు విన్న రాణి, చక్వవేణుడిని, తనకూ విలువైన వస్త్రాభరణాలు కావాలని కోరింది. రాజు బాగా ఆలోచించాడు- తాను రాజద్రవ్యాన్ని ముట్టడు, కాని తను సామ్రాట్టు కనుక, దుష్టులు, బలవంతులు, అత్యాచారులు అయిన రాజుల నుంచి పన్నును వసూలు చెయ్యవచ్చు, అనుకున్నాడు. తన మంత్రిని రప్పించి, “రాక్షస రాజైన రావణుడి వద్దకు వెళ్లి, నేను 1.25 మణుగుల బరువైన బంగారాన్ని పన్నుగా చెల్లించమని, ఆజ్ఞాపించాను అని చెప్పి, తీసుకురమ్మని “ అనుజ్ఞ ఇచ్చాడు.

మంత్రి తెచ్చిన వార్తను విన్న రావణుడు అతన్ని పరిహాసం చేసి, పంపాడు. ఇదే విషయాన్ని మండోదరికి చెప్పగా, ఆమె ‘స్వామి ! పొరపాటు చేసారు. వారడిగిన బంగారం ఇవ్వాల్సింది. చక్వవేణుడి మహిమను రేపు ఉదయం మీకు చూపుతాను, ‘ అంది. ఉదయం ఆమె  పావురాలకు గింజలు వేసి, అవి తింటూ ఉండగా, ‘రావణుడి మీద ఆన, గింజలు ముట్టకండి, ‘ అంది, అవి లెక్కచెయ్యక, తినసాగాయి. వెంటనే ఆమె, ‘చక్వవేణుడిపై ఆన, ఇక గింజలు ముట్టకండి,’ అంది, వెంటనే పావురాలు అన్నీ ఎగిరిపోయాయి. ఒక చెవిటి పావురం వినబడక, గింజ తినగానే, తల తెగి, క్రింద పడింది. తర్వాత రాణి, ‘చక్వవేణ మహారాజుపై ఆనను ఉపసంహరిస్తున్నాను, గింజలు తినండి,’ అనగానే, పక్షులు మళ్ళీ గింజలు తినసాగాయి. ‘చూసారా స్వామి ! ఇదీ చక్వవేణుడి ధర్మ చక్ర మహిమ,’ అంది, మండోదరి. ‘పిచ్చి పక్షులకు ఏమి తెలుస్తుంది ?’ అంటూ కొట్టి పారేసాడు రావణుడు.

చక్వవేణుడి మంత్రి సముద్ర తీరానికి చేరి, ఇసుక, మట్టితో లంకా నగర నమూనాను సరిగ్గా అలాగే చేసి, ‘ఒక వినోదం చూపుతాను,’ అంటూ, రావణుడిని పిలుచుకువచ్చాడు. ‘చక్వవేణ మహారాజుపై ఆన’, అంటూ నమూనాలో తూర్పువైపు ఉన్న బురుజులు, ప్రాకారాలను పడగొట్టగానే, లంకలో నిజంగా అమరిఉన్న నిజమైన తూర్పు వైపు బురుజు, ప్రాకారం కూలిపోయాయి. హతాశుడయ్యాడు రావణుడు. అలాగే మంత్రి, నమూనాలో ఉన్న తూర్పువైపు స్థూపాలు, ‘చక్వవేణ మహారాజుపై ఆన’ అంటూ, పడగొట్టగానే నిజ లంకాపుర స్థూపాలు కూలిపోయాయి. ఇది చూసి, బెదిరిన రావణుడు, మంత్రి కోరిన బంగారాన్ని అతడికి ఇచ్చి, పంపేశాడు.

మంత్రి చక్వవేణుడికి బంగారం ఇవ్వగా, అతడు అది ఎలా తెచ్చావో చెప్పమని, మంత్రిని అడిగాడు. మంత్రి చెప్పింది విన్న రాణి ఆశ్చర్యచకితురాలు అయ్యింది. ఆమె పవిత్రవర్తనం యొక్క మహిమ తెలుసుకుని, బంగారం వద్దంది. ఆ బంగారం తిరిగి, రావణుడికి పంపివెయ్యబడింది. అన్ని లోకాలను ప్రభావితం చెయ్యగల చక్వవేణుడి త్యాగబుద్ధిని తెలుసుకుని, రావణుడి హృదయం కూడా పరివర్తన చెంది, మంత్రిని ఆదరించి, పంపివేసాడు.
నీతి : క్షణకాల దుస్సంగాత్యం కూడా అనర్ధాన్ని కలిగిస్తుంది. అందుకే దురభ్యాసాలు, మత్తుపదార్దాలు, క్రీడావినోదాలు, ఖరీదైన ఆడంబరాలతో గడిపేవారి సాంగత్యం వదలాలి. మోసంతో ఆర్జించిన మృష్టాన్నం కూడా విషతుల్యమే అవుతుంది. పవిత్ర ద్రవ్యం వల్ల ప్రాప్తించిన పిడికెడు అన్నమైనా అమృతతుల్యం అవుతుంది. దానం, దయ, ప్రేమతో, అన్ని ప్రాణుల పట్ల సమభావంతో ప్రవర్తిస్తే, ప్రపంచమే పాదాక్రాంతం అవుతుంది ! ఇది సత్యం !

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......✍

గొప్ప సందేశం


బిచ్చగాడు అడుక్కునేటప్పుడు 'దానం చెయ్యండి' అనేబదులు "ధర్మం చెయ్యండి" అని ఎందుకు అడుగుతాడు? ఆలోచించండి.
పూర్వకాలపు భారతీయ ధర్మం ఏమిటంటే: సంపాదించిన దాన్ని నాలుగు భాగాలు చెయ్యాలి.

👉మొదటి రెండు భాగాలు స్వంతానికి.
👉మూడోభాగం పన్నులు, తదితరాలు.
👉నాలుగో భాగం   కళాకారులు ,గురువులు,పురోహితులు, సన్యాసులు ఇలాంటి వారికి ఇవ్వాలి.

ఇది మన కనీస ధర్మం. దీనికి సంస్కారం అవసరం.  
వాళ్ళు అడుక్కోవాల్సిన అవసరం లేదు. దీన్ని ధర్మం పాటించడం అంటారు.మన ధర్మం మనకి రక్ష. లేదంటే మన అహంకారానికి మనమే బలికాకతప్పదు.
*దానగుణం*
ఒక బాటసారి సముద్రంతో ఇలా అన్నాడు. "నది ఎంత సన్నగా ఉన్నా దాని నీళ్ళ మాత్రం తియ్యగా
వుంటాయి. నీవు ఎంతో విశాలంగా ఉంటావు కానీ నీ నీళ్ళ మాత్రం చాలా ఉప్పగా వుంటాయి. దానికి కారణం ఏమిటి?" అని అడిగాడు.
అప్పుడు సముద్రం ఇలా అంది. "నది ఈ చేత్తో తీసుకొని ఆ చేత్తో ఇతరులకు దానం చేస్తుంది. అందుకే ఆ నదిలోని నీరు తియ్యగా ఉంటుంది. నేను మాత్రం తీసుకుంటానేగాని, ఎవరికీ ఇవ్వను. కాబట్టి నా నీరు ఉప్పగా వుంటుంది" అంది. అందుకే “ఆ చేత్తో తీసుకోని, ఈ చేత్తో ఇవ్వని వారు జీవితంలోని మాధుర్యాన్ని కోల్పోతారు" అని మన పెద్దలంటారు.

          గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....✍

DON'T MISS

తప్పదు లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని గమనించగలరు

1995 వరకూ మాకు *హీరో సైకిల్* ఉండేది.
ఏదో తెలియని *ఆనందం

ఆదివారం వచ్చిందంటే చాలు..  కిరసనాయిల్ తో రిమ్ములు తుడిచేసి కొబ్బరినూనె గుడ్డ తో తుడిచేసి చూస్తుంటే ఆ ఆనందమే వేరండీ.

ఆదివారం వచ్చిందంటే.. ఇంట్లో అన్ని పనులు చేసేవాళ్లం.

ఈ తరం పిల్లలు *బండి*  తుడవమంటే తుడవరు..!
*మేజోళ్ళు* అదేనండీ *సాక్సులు*  ఉతుక్కోమంటే ఉతకరు.! కనీసం *అండర్ వేర్* లు ఉతుక్కోమన్నా ఉతకడం లేదు..!
*లంచ్ బ్యాగ్* లు శుభ్రం చేసుకోవడం లేదు..!

ఎప్పుడైనా దాచుకోమని *డబ్బులు* ఇస్తే *నూడుల్స్ ప్యాకెట్లు, 5 స్టార్ లు, ఐస్ క్రీమ్ లు, కూల్ డ్రింక్ లు* కొనుగోలు చేస్తున్నారు..!

ఆడపిల్లలైతే తిన్న కంచం కూడా కడగటం లేదు..!
ఇల్లు ఊడ్చమంటే కోపాలు వచ్చేస్తున్నాయి..!
డిగ్రీ చదువుతున్న ఆడపిల్లలకు వంట కూడా చేయడం రావటం లేదు..!

*తల్లిదండ్రులు మారాలి*

భార్యకు వంట వండటం సరిగా రాదని *నేటి యువత* బిర్యానీలు, కర్రీ పాయింట్ ల వెంటపడుతూ  చిన్న వయసులోనే *గ్యాస్టిక్, అల్సర్, గాల్ బ్యాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్* ల బారిన పడుతున్నారు..!

మరొక *ఫ్యాషన్* ఏమిటంటే..
పెరుగు, మజ్జిగ తీసుకుంటే *వాంతులు* చేసుకోవడం..!
కాలేజీ పిల్లలైతే చిన్న టిఫెన్ బాక్సు రైస్..!

Pregnant అయిన తరువాత వారి బాధలు వర్ణనా తీతం..!
టోటల్ మెడిసిన్ మీద డిపెండ్ అవడం.!!

ఈ రోజు ఒక స్కూలు అమ్మాయి స్కూల్ అవ్వగానే  500 రూపాయల కాగితం ఓ షాపు అతనికి ఇచ్చి ఏదో 30 రూపాయల ice cream కొనుగోలు చేసింది. షాపతను 470 ఇచ్చాడు.
ఆ అమ్మాయి చిల్లర ఎంత ఇచ్చారో కూడా లెక్క పెట్టుకోలేదు.
షాపతను *చిల్లర సరిపోయిందా.?*  అనడిగితే.. *సరిపోతాయిలే అంకుల్..!* అంది.

*రేపటి సమాజానికి ఏమి నేర్పుతున్నాం.?*

*ఒక్కసారి ఆలోచించండి*

*బాధ్యత* 👈        
*బరువు* 👈
*కష్టం* 👈
*నష్టం* 👈
*ఓర్పు*👈
*నేర్పు*👈
*దాతృత్వం*👈
*మానవత్వం*👈
*ప్రేమ*👈             
*అనురాగం*👈
*సహయం*👈
*సహకారం*👈
*నాయకత్వం*👈
*మానసిక ద్రృఢత్వం* 👈
*బంధాలు* 👈
*అనుబంధాలు* 👈 అంటే ఏమిటో..
*పిల్లలకు అలవాటు చేద్దాం*

*మనం కూడా మమేకమవుదాం*

భావి తరాలకు ఒక మానవీయ విలువలతో కూడిన,  సత్సాంప్రదాయ కుటుంబాలను కలిగిన సమాజానికై  బాటలు వేద్దాం.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......✍

సత్య అన్వేషణ


ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం కలిగినపుడు ఎవరు తప్పు, ఎవరు రైటు అన్న ప్రశ్న ఒక్కటే తప్పు, మిగిలినదంతా రైటే.

"ఒకడి మీద ఒకడు చిరాకు పడడం, ఎవరికి వారు వేరుగా పని చేసుకోవడం అనేవి ఏర్పడతాయి. ఈ విడిపోవడం సామాన్యంగా కొన్ని సంవత్సరాలు గాని, ఒక్కొక్కడికి ఆజన్మాంతం గాని ఏర్పడుతూ ఉంటాయి.

చిరాకు పడటంలో విషయం ఏమీ ఉండదు. చిరాకు పడడానికి ఎప్పుడూ పాయింటు ఉండదు. చిరాకుకు కారణం పనిలేని చిత్త వృత్తి. కనుక అది ఒక విధమైన వ్యాధి వంటిది.

దానిని‌ నివారణ చేసుకొన్న వాడికి తప్ప మిగిలిన వారికి తన నిత్య జీవితం కూడా ఇబ్బందులతో నడుస్తుంది. ఇక మహాకార్యాలు సాధించడం అనేది ఉండదు.

" నీకు గిట్టని వాళ్ళు, గిట్టని సిద్ధాంతాలు నశించటం సత్యం కాదు. కనుక అది ఎన్నటికి జరుగదు. వాటికి నీకు ఉన్న సంబంధం తెలుసుకొని, ఉండవలసిన సంబంధం ఏర్పరుచుకుంటే నీవు వాళ్ళని, వాటిని మలచ గల్గుతావు.

నీ కన్నా తక్కువ తెలిసిన వాళ్ళు నీ వెంట నడవాలంటే, నీవు నీ కన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు అడుగుజాడలలో నడవాలి

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ ...............✍

అంతర్యామి

భక్తి వల్లనే భగవంతుడు వశుడవుతాడంటారు. అటువంటి ‘భక్తి’ అని దేన్ని అంటారో ఎవరికీ స్పష్టంగా తెలియదు. భగవంతుడికి ప్రీతి కలిగించాలనే సంకల్పంతో భక్తులు నిత్యం పూజలు, జపాలు, ఇతర దైవకార్యాలన్నీ చేస్తుంటారు. అవన్నీ భక్తి పరిధిలోకే వస్తాయా అన్నది సందేహమే!
భక్తుణ్ని భగవంతుడు అనుగ్రహించాడని ఎలా తెలుస్తుంది? తన భక్తులైన ప్రహ్లాదుడికి, గజేంద్రుడికి, అలాగే మరికొందరికి కష్టాలు   వచ్చినప్పుడు ఆయన ఆదుకున్న కథలు అందరికీ తెలుసు. సర్వసహజంగా ఇతరులెవరికీ అంతటి కష్టాలన్నీ వచ్చే అవకాశం లేదు. వాటి నుంచి తమను తాము కాపాడుకునేందుకు వారు జాగ్రŸత్తలు తీసుకుంటారు. అడుగులు వేయడం తెలిసిన పసివాణ్ని ఆదుకునే అవసరం ఎవరికీ ఉండదు. నడవలేనివారికే సాయం కావాలి. మనిషి శక్తికి మించిన కష్టం కలిగినప్పుడే, దైవశక్తి అవసరం ఉంటుంది. శరీరంలో వ్యాధినిరోధక శక్తి కొరవడినప్పుడే ఔషధాలు కావాల్సి వస్తుంది. ఇదీ అలాంటిదే!
భక్తుడు పిలిచిన వెంటనే భగవంతుడు వచ్చి ఆదుకోడు. ఆ పిలుపు ఆర్తిగా వెలువడినప్పుడే, అది భగవంతుణ్ని చేరుతుంది. ప్రార్థన పెదవుల నుంచి, ఆర్తి మనసు నుంచి, పూజ బుద్ధి నుంచి వస్తున్నాయి. ఆత్మతో భక్తుడు ఎటువంటి అనుబంధమూ పెట్టుకోవడం లేదు. దైవం ఎక్కడో ఉన్నాడని భ్రమిస్తున్నాడు. ఆయన ‘అంతర్యామి’గా మదిలో కొలువై ఉన్నాడనే సత్యం భక్తుడికి ఒకపట్టాన అర్థం కావడంలేదు. ఆ లోపాన్ని అతడు తనకు తానే సరిదిద్దుకునే వరకు దైవానుగ్రహం లభించదు.
పూజ యాంత్రికం కారాదు. ప్రార్థన పూజగదికే పరిమితం కాకూడదు. మనిషి హృదయమే పూజా మందిరం. ముందుగానే అతడు అవలక్షణాల్ని తొలగించుకోవాలి. ఆ లక్షణాలేమిటో అతడికి ముందే తెలియాలి. అసూయ, అకారణ ద్వేషం, అంతరాలు, ఆధిక్య భావాలు... ఇవన్నీ తనలో ఉన్నాయని తెలిసినా, గుర్తించలేని స్థితికి చేరాడు. పరిపూర్ణుణ్ని, పరిశుద్ధుణ్ని- అనే భ్రమలు అతణ్ని వీడటం లేదు.    భగవంతుడు మానవుడికి అనేక ప్రజ్ఞలిస్తున్నాడు. అవన్నీ తనవేనని, అంతా తన ప్రజ్ఞేనని భావించి మనిషి అహంకరిస్తున్నాడు. అందరూ తనపై ప్రశంసలు కురిపించి, మహోన్నతుడిగా గౌరవించాలని అతడు ఆరాటపడుతున్నాడు.
అహంకారం, ఆధిపత్య ధోరణి అనేవి చెప్పుల జతలాంటివి. వాటికి ఎన్నడూ ఆలయ ప్రవేశం ఉండదు. వాటిని ధరించి వెళ్లినవారికి దైవదర్శనం ఎప్పటికీ లభించదు. సర్వసంగ పరిత్యాగం అంటే కేవలం కాషాయం ధరించడం కాదు. తలపుల్ని శూన్యం చేసుకోవాలి. మనసంతా దైవచింతనతో నిండాలి. వేషంతో కాదు, వ్యవహార సరళి ద్వారా వైరాగ్యం ప్రస్ఫుటమవుతుంది. అవధూతలకు ఎలాంటి ఆర్భాటాలూ ఉండవు.
భక్తి అంటే, భగవంతుణ్ని ప్రేమించడం ఒక్కటే కాదు. సమస్త సృష్టినీ సమభావంతో చూడటం, సర్వకాల సర్వావస్థల్లోనూ ఒకచోటే దృష్టి కేంద్రీకరించడం! అప్పుడే అది సంపూర్ణ భక్తి అవుతుంది. అలాంటి భక్తితత్పరతకే భగవంతుడు   వశుడవుతాడు.
సంపూర్ణభక్తి అంటే- సమస్తంలోనూ భగవంతుణ్ని స్థిరబుద్ధితో చూడటం, చూస్తూనే ఉండటం!
Written by_
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...