Monday, March 12, 2018

దేహమే దేవాలయం


"దేహో దేవాలయః ప్రోక్తో జీవః ప్రోక్త స్సనాతనః' ,త్యజేదజ్ఞాన నైర్మాల్యం సోహం భావేన పూజయేత్..దేహమే దేవాలయం. జీవుడు ఈశ్వర స్వరూపం. అజ్ఞానమనే నైర్మాల్యాన్ని తీసివేసి..నీవే నీను,అనే భావం తో పూజించాలి.

ఆత్మకు దేహం ఆలయమైనట్లే, ఇంటికి పూజామందిరం, ఊరికి దేవాలయం అటువంటిది . జీవం లేని దేహం, పూజామందిరం లేని ఇల్లు, దేవాలయం లేని ఊరు సమానమే. అవి అపవిత్రములే. కాబట్టి పూజ చేయని ఇంటిలో అడుగు పెట్టరాదు. దేవాలయం లేని ఊరి దారిలో పయనించరాదని, ఆ ఇండ్లలో, ఆ ఊళ్ళల్లో భోజనం చేయరాదని, చివరకు పచ్చి గంగ కూడా తాగరాదని శాస్త్రవాక్యాలు కనిపిస్తున్నాయి.దీనికి నిదర్శనం కూడా ఉంది.

ఒక బాటసారి నడుస్తూ పోతూ కనుచూపు మేరలో కనబడిన ఒక ఊరిలోకి పోవాలనుకుని, దారిలో కనబడ్డ ఒక మనిషిని ఆ ఊర్లో దేవాలయం ఉందా? అని అడిగాడు. దేవాలయం గాని, చిన్న మందిరం గాని లేవన్నాడతడు. ఆ బాటసారి ‘శివ! శివా!’ అంటూ ఆ గ్రామాన్ని అపవిత్రంగా భావించి, వెనుదిరిగి మరో దారిలో వెళ్ళాడు.

ఇటువంటి ధార్మిక విషయాలను గుర్తించే వివేకవంతులు, త్యాగులు, భక్తులు పట్టణాల్లో, పల్లెల్లో, కొండల్లో, కోనల్లో దేవాలయాలు కట్టించి నిత్యపూజా కైంకర్యాలకు తగు ఏర్పాట్లు చేసారు. ఆచంద్రార్కం ఆలయాలు స్థిరంగా ఉండాలని, తిరువారాధనలు అవిచ్ఛిన్నంగా సాగుతూండాలని వారి ధృఢసంకల్పం. ఈ ధర్మకార్యానికి విఘాతం కలిగించేవారు కాశీలో గోవును చంపిన పాపాత్ములవుతారని కూడా వారు శాసనాలు చెక్కించారు. అప్పటి ప్రజల్లో అటువంటి భయం ఉండేది కాబట్టే ఎవరూ దేవాలయాల జోలికి పోయేవారు కాదు. దేవాలయాలు సనాతన కాలంనుండీ ఉండేవే. దేవాలయ నిర్మాణ సంప్రదాయం కొత్తగా ఏర్పడింది కాదు. వాస్తు శాస్త్ర బద్దంగా శిల్పకళామయంగా నిర్మించిన దేవాలయం సర్వారిష్టహారం. సర్వమంగళప్రదం.

దేవాలయ నిర్మాణ కాలం గురించి భిన్న వాదనలు వినబడతాయి. దేవాలయ నిర్మానం ప్రాచీనకాలంలో లేదని, ఆధునికుల సృష్టి అని చెప్పేవారు లేకపోలేదు. ఆలయాలు అశోకుని కాలానికి ముందే నిర్మించబడినట్లు చారిత్రక కథనం. నగరాల్లో పల్లెటూళ్ళల్లో శివకేశవ శక్తి గణేశాది దేవతలకు ఆలయాలు నిర్మించి తీరాలని కౌిల్యుని అర్థశాస్త్రంలో కనబడుతోంది. దీన్ని బట్టి చాణక్యునికి మునుపే దేవాలయమున్నట్లు తెలుస్తోంది. చంద్రగుప్తుని కాలంలో ఆలయ నిర్మాణం వ్యాప్తి చెందింది. శుంగుల కాలలో దేవాలయలు ఎక్కువగా నిర్మించబడినట్లు చరిత్ర చెబుతోంది. వారిని ఆదర్శంగా తీసుకొని బౌద్దులు చిహ్న శిఖరాలుండే బ్రాహ్మణ మందిరాలను నిర్మించారు.

కాలక్రమంగా ఆలయాలు విశ్వవ్యాప్తమైనాయి. ఆయా ప్రాంతాలలో భిన్న భిన్న సంప్రదాయాలను బట్టి ఆలయ నిర్మానం జరుగుతూ వచ్చింది. ఆలయ శిఖర నిర్మాణ విషయంలోనూ అనేక నియమాలు, సంప్రదాయాలు ఏర్పడ్డాయి. ఏయే దేవతల ఆలయాలపై ఎన్నెన్ని శిఖరాలుంచాలో తెలిపే గ్రంథాలు వచ్చాయి. కనీసం ఒక్క శిఖరమైనా లేని దేవాలయంలో అడుగు పెట్టరాదని, దానిలోని దేవతామూర్తికి మొక్కరాదని శాసించారు.

దేవాలయ ప్రాకారం, ప్రధాన ద్వారం, గోపురం, విమానం, ముఖమంటపం, అంతరాలయం, గర్భాలయం చూపరుల దృష్టిని ఆకర్షించేట్లు శిల్ప కళామయంగా చేసేవారు. జీవుని శరీర నిర్మాణం, పాంచ భౌతికమయ ప్రకృతి ఇటు వంటి వన్నీ ఆధ్యాత్మికతను సూచిస్తుంటాయి. ఆ తత్వాన్ని ప్రతిపాదించడంలో దేవాలయ నిర్మాణం జరిగింది. శరీరంలోని అవయవాల రూపాలకు ప్రతీకలే దేవాలయాంగములు. హృదయ గుహలోని పరమాత్మోపాసనే దేవాలయ గర్భాలయంలోని విగ్రహోపాసన.

యోగులు సాకార భగవంతుని సూర్యమండలంలోను, హృదయ గుహలోను కంటి పాపలోను దర్శిస్తు  దేవాలయం మానవ శరీరంతో పోల్చబడింది మహద్వారం పాదపీఠం. స్తంభాలు చేతులు. శిఖరం శిరస్సు, ధ్వజం లింగం, హృదయం నంది, ఆత్మ దీపం. దీపం లేని దేవాలయం జీవుడు లేని శరీరం వింది. కాని దేవాలయాల్లో దీపజ్యోతి అఖండంగా వెలిగే ఏర్పాటు చేసారు.

ఈ శరీరం దేవతలకు నిలయమైన ఆలయంగా వెలిసింది. దీని మూలంగా శరీరమే దేవాలయమనే భావనతో పరమాత్మను ఉపాసించి జీవబ్రహ్మైక్యం పొందడానికి దేవాలయాలు దోహదం చేస్తున్నాయి.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ .....

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...