Tuesday, October 9, 2018

జాతకకర్మ

శిశువు జన్మించిన వార్త వినగానే జాతక కర్మ చేయాలని ధర్మ శాస్త్ర వచనాలు చెబుతున్నాయి. అదికూడ నాభిచ్చేదనానికి ముందే జరగవలెనట. నాభిచ్చేధం తరువాత తండ్రికి జాతాశౌచం ప్రారంభమవుతుంది. కనుక అంతకుముందే  జాతకకర్మ తండ్రి నిర్వహించాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఆడ శిశువుకైన మగశిశువుకైన జన్మించిన వెంటనే జాతకకర్మ చేసే ఈ పద్ధతిలో తిధి వార నక్షత్రాలతో గాని ముహూర్త బలంతో గాని సంబంధం లేదన్న మాట. ఏ కారణం చేతనైన అప్పుడు జాతకర్మ కుదరకపోతే ఆ తరువాత చేయవలసినప్పుడు మాత్రం తిధి వార నక్షత్రాదులను చూసి ముహూర్తం నిర్ణయించవలెను.

“స్నాతోలంకృతః పితా అకృత నాలచ్ఛేదం అపీతస్తన్యం అన్త్యెరస్పృష్టం ప్రక్షాళితం కుమారం మాతురుత్సాం  గేకారాయిత్వా..... అస్యకుమారస్య గర్భాంబు పాతజనిత దోష నిబర్హణాయుర్మేధాభివృద్ధి బీజ గర్భ సముద్భావైనో నిబర్హణ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం జాతకకర్మ కరిష్యే “ అని ధర్మ సింధువు జాతకకర్మ  సంకల్ప విధానాన్ని నిర్దేశిస్తున్నది. దీన్నిబట్టి జాతకకర్మ ప్రయోజనం మాత్రమే కాక అది ఎప్పుడు చేయవలసిందో కూడా స్పష్టమవుతుంది. అయితే ఈ విధానంలో కొంత ఇబ్బంది లేకపోలేదు.

ముహూర్త దర్పణం నందు
“తస్మిన్ జన్మముహూర్తే పి సూతకామ్టే ధవా శిశోః కుర్యాద్వైజాతకర్మాఖ్యం పితృపూజని తత్పరః” శిశువు జన్మించిన వెంటనే గాని పురుడు తొలగిన తరువాత గాని జాతకకర్మ చేయవలెనని నిర్దేశిస్తున్నది. ఈ విధంగా చేయబడుతున్నదే ఈనాటి బారసాల. ముహూర్త చింతామణిలో “తజ్జాతకర్మాది శిశోర్విధేయం పర్వఖ్యరిక్తోన తిధే శుభే హ్ని ఏకాదశ ద్వాదశకే పి ఘస్రేంమృధ్రువ క్షీప్రచారోడుశుస్యాత్” అని 11 వరోజుగాని, 12 వ రోజు గాని జాతకకర్మ చేయవలెనని చెప్పినది. పర్వతిధులు, రిక్త తిధులు, జాతకకర్మకు పనికిరావు. మృధు,ధృవ,క్షిప్ర, చర నక్షత్రాలలో ఏవైనా జాతకకర్మ చేయవచ్చును. చవితి, నవమి, చతుర్ధశి రిక్త తిధులు, ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, అమావాస్య ఇవి పర్వతిధులు, మృగశిర, రేవతి, చిత్త, అనురాధా మృధు నక్షత్రాలు, ఉత్తరా త్రయం, రోహిణి ధృవ నక్షత్రాలు, హస్త, అశ్వని, పుష్యమి, అభిజిత్ క్షిప్ర నక్షత్రాలు, స్వాతి, పునర్వసు, శ్రవణం, ధనిష్ఠ, శతభిష చర నక్షత్రాలు, మంగళ, శనివారాలు జాతక కర్మకు పనికి రావని ధర్మ సింధువు వచనం.

ప్రస్తుతం బారసాలకు తిధులు నక్షత్రాలు చూడటం ఆచారంగా లేదు. పైగా అది వైదిక జాతకర్మ సంస్కారంగా నిర్వహించబడటం కానరాదు. అంతేకాదు జాతకర్మాదులను ప్రాయశ్చిత్త పూర్వకంగా ఉపనయనానికొక రోజు ముందుగా (ఒకొక్కప్పుడు ఆదేరోజు కూడా) జరిపించేయటం ఆచారంగా మారిపోయింది.

దేవర్షి పితృ ఋణాలు మూడింటిలో పిత్ర జననం వలన పితృ ఋణాలు విముక్తి కలుగుతుందని భారతీయుల పవిత్ర భావన. జాతకకర్మ, నామకరణం, డోలారోహణాలతో పాటుగా బాలింతరాలి చేత మొట్టమొదటగా నూతిలో చేద వేయించి నీరు తోడించే కార్యక్రమాన్ని కూడా కలిపి లౌకికాచారంగా ఇరవై ఒకటో నాడు నిర్వహించే సంప్రదాయం కొన్ని ప్రాంతాలలో కానవస్తుంది. ఆ సమయంలో వర్జ్యం, దుర్ముహూర్తం లేకుండా మాత్రం చూస్తున్నారు..

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

వేదం విధించిన కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి


నవమాసాలు కడుపులో పెట్టుకొని, రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి, పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి క్రుతజ్ఞత చూపడము మానవత్వము ... విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి.

మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం.అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని మన నమ్మకం.

మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.

కాని ప్రస్తుత కాలంలో వివిధ కారణాలతో చాలా మంది ఈ కార్యక్రమాలు చేయలేకపోతున్నందుకు వారిలో వారు భాధపడుతున్నారు అనేక మంది వివిధ కారణాల వల్ల ఈ కార్యక్రమాలు చేయలేకపోతున్నారు.

కొంత మంది స్వదేశం వచ్చినప్పుడో లేక స్వగ్రామం వచ్చినప్పుడో, ఏ కాశీలోనో ఏ గయలోనో పితృ తర్పణాలు ఒక్కసారి చేస్తే సరిపోతుందని అనుకుంటారు. అది పొరపాటు. ఎందుకంటే పుణ్య నదులలో పుణ్యక్షేత్రాలలో చేసిన కర్మలు పవిత్రమైనవే కాని అవి పూర్తిగా సమాప్తం కావు. కాబట్టి పుత్రులు తామున్నంత వరకు పితృకార్యాలు (మాసికం, ఆబ్దీకం) చేయాలి అలా చేయలేని పరిస్థితులలో ఆ కార్యాన్ని నిర్వర్తించే వారిపై నమ్మకం ఉంచి చేయించిన కూడా ఫలితం లభిస్తుంది.

మాసికాలు, ఆబ్దీకాలు ఒక్క మన తల్లి తండ్రులకు మాత్రమే గాక మగ పిల్లలు లేని బంధువులకు మనం కర్తగా ఉండి ఈ కర్మలను నిర్వర్తించవచ్చును.

ఉదా : మావయ్య, అత్తయ్య, తాత, బామ్మ, అమ్మమ్మ, అన్న, వదిన, తమ్ముడు, భార్య, కొడుకు, పిన్ని, బాబయ్య, పెద్దమ్మ, పెద్దనాన్న మొదలగు వారికి కర్మలను నిర్వహించినచో వారు మోక్షమార్గం పొందగలరు.

తీర్థయాత్రలకి వెళ్ళలేని వారు కనీసం తీర్థయాత్రలు చేసిన వారిని చూసిన, సేవించినా కూడా పుణ్యం కలుగుతుందని పురాణాలలో చెప్పబదింది. అలాగే మాసికాలు, ఆబ్దీకాలు స్వయంగా పెట్టలేని వారు తగు వ్యక్తుల సహాయ సహకారాలతో పెట్టించటం కూడా స్వయంగా పెట్టినంత ఫలితానిస్తుంది. ఇది మన భారతీయతలోని సనాతన ధర్మం, సంప్రదాయం తద్వారా వారి వంశాభివృద్దిని ఆయుక్షేమాన్ని, సుఖ శాంతులను పొందగల్గుతారు.

ఒకసారి భీష్ముడు తన తండ్రికి పితృకర్మ తలపెట్టాడు. పరమనిష్ఠతో పితృకర్మలు సమర్పిస్తున్న కుమారుడి శాస్త్రబద్ధతకు మురిసిన ఆయన తండ్రి శంతనుడు స్వయంగా పిండాన్ని అందుకోవడానికి దిగివచ్చాడు. పిండాన్ని తనకు ఇవ్వమని కుమారుడిని అడిగాడు. ‘శాస్త్రాలు ఒప్పుకోనందున నేను పిండాన్ని నీ చేతుల్లో పెట్టలేను’ అని భీష్ముడు అన్నాడు. పిండాలను భూమిమీదనే పెట్టాలని శాస్త్రాలు నియమాన్ని విధించాయి.

పితృ కర్మలు అనగా ఆబ్దీకములు(శ్రాద్ధ కర్మలు, తద్దినములు) వదిలిపెట్టడము అంటే చేయకపోవడం వలన మన యొక్క వంశాన్ని, మన పిల్లల్ని, మనల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది.

నిత్య, నైమిత్తిక, కామ్య కర్మలను ఆచరించే మనవులు తమ పితృ దేవతలను ఉద్దేసించి చేసే కర్మ శ్రాద్ధ కర్మ. శ్రాద్ధ కర్మ అంటే శ్రద్ధతో ఆచరించ వలసినది. మృతులైన పిత్రాదులను ఉద్దేసించి శాస్త్రోక్తమైన కాలమందును, దేశమందును పక్వాన్నము గాని(భొక్తలకు భోజనము ), యామాన్నము గాని(బియ్యము, పచ్చి కూరలు, పప్పు దినుసులు మొదలగునవి), హిరణ్యము(బంగారము) గాని విధి ప్రకారము బ్రాహ్మణులకు దానము చేయుట శ్రాద్ధమనబడును.

అశ్రద్ధ అనగా నాస్తికత్వ బుద్ధి చే పితృదేవతలు లేరని, అనేవారి పితరులు రక్తము త్రాగుదురు(భోజనము అందక) పితృ దేవతలను ఉద్దేసించి మంత్ర పూర్వకముగా ఇచ్చే వస్తువులు ఏ రూపముగా ఇచ్చినను వారికి చేరును.

మనము శ్రాద్ధ కర్మ చేయునపుడు పితృ దేవతలు వాయురూపమున అతి త్వరగా వచ్చి భోజనము భుజింతురు అందుచే శ్రీ రామ చంద్రుడు శ్రాద్ధము చేయునపుడు సీతా దేవి బ్రాహ్మణుల యందు దశరధాదులను చూసెనని కధ ఉన్నది.

మనం పెట్టే ఈ శ్రాద్ధ కర్మలు మన తండ్రి, తాత, ముత్తాత, తల్లి, నానమ్మ మొదలైన వారికే కాకుండా మన రక్త సంబంధీకులు, స్నేహితులలో అగ్ని ప్రమాదము, వాహన ప్రమాదము ఇలా అనేక ప్రమాదములలో మరణించిన వారికి ఉపనయనము అవ్వకముందే మరణించిన వారిని కూడా ఈ సంధర్భముగా మనము త్రుప్తి పరుస్తాము అంతే కాక మన ఇంట్లో పని చేసి మరణించిన వారికి కూడా మనము ఈ శ్రాద్ధ కర్మలు ద్వారా తృప్తిపరుస్తాము.

అపుత్రస్యగతిర్నాస్తి: అంటే వారసులు లేని వారికి ఉత్తమగతులు సంప్రాప్తించబోవని సాధారణంగా నిస్సంతువులు నిరంతరం దుఖిఃస్తుంటారు. సంతానం లేకపోతే ఉత్తమ గతులు సంప్రాప్తించవని భావించడం, ఆ క్రమంలో నిరంతరం దుఖిఃంచడం వ్యర్థం. సృష్టికి పునరుత్పత్తి అనేది అవసరం కాబట్టి దానిని కొనసాగించడం కోసం తన తదనం తరం వారసులు ఉండాలని అందరూ భావిస్తుంటారు. వాస్తవానికి వారసులు అంటే సంతానం అని మాత్రమే కాదు. చేసే పని ఏదైనప్పటికీ దానిని అందుకొని కొనసాగించే వారసుడిని పొందాలనేది అపుత్రస్యగతిర్నాస్తిః యొక్క వాస్తవిక అర్థం.

పితరులను ఉద్దేశించి, వారి ఆత్మను తృప్తి పరచటానికి శ్రద్ద తో అర్పించేదే శ్రాద్ధం. ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళాక దాని సూక్ష్మాతి సూక్ష అంశం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. వారి వారి కర్మానుసార ఫలం లభిస్తుంది. పితృ ఋణం నుండి ముక్తి పొందటం చాలా కష్టం. తల్లిదండ్రులు సంతానం కోసం ఎంత తపిస్తారో వెల కట్టడం సాధ్యం కాదు. పితృ గణాల శ్రాద్ధ కర్మ గౌరవప్రదం గా చేయటం సంతానం తప్పని సరి విధి. శ్రాద్ధకాలం ప్రారంభమైందని తెలియగానే పితృదేవతలు తమ తమ వారిని స్మరించుకుంటూ మనోమయ రూపం లో శ్రాద్ధ స్థలం చేరుకుంటారు. వారు బ్రాహ్మణులతో కూడా వాయురూపం లో భోజనం స్వీకరిస్తారు.

శ్రాద్ధ మహిమను శాస్త్రాలు విస్తృతం గా పేర్కొన్నాయి. శ్రాద్ధం చేయటం వల్ల సంతానం ప్రాప్తిస్తుందని స్కాంద పురాణం లో చెప్పబడింది. ఆదర్శ పూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపెడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య ధనం, సంతానం, సమస్తం కలిగి ఉండేట్టు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మలో నువ్వులు, గూడమిశ్రిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాలలోను అన్న దానం ప్రధానమైనది, అన్నదానం ఎప్పుడు చేసిన మంచి ఫలితాన్నే ఇస్తుంది. అలాగే మఖ నక్షత్రం పితరులకు సంబందించింది కనుక ఆ రోజు చేసిన శ్రాద్ధ కర్మ అక్షయఫలన్నిస్తుంది.

కొంత మంది వివిధ కారణాలతో తద్దినాలు పెట్టడము మానేస్తున్నారు. ఈ మధ్యన చాలా మంది. బ్రాహ్మణులు దొరకడము లేదు అని, ఎక్కువ దక్షిణ అడుగుతున్నారు అని, సమయము లేదు అని, మడి తో చేసే వాళ్ళు లేరు అని, వంట వాళ్ళు దొరకడము లేదు అని, ఖర్చు ఎక్కువ అవుతుందని…. ఇలా రకరకాల కారణములతో తద్దినములు పెట్టడము మానేస్తున్నారు. ఇది తప్పు. వంశాభివృద్ధి జరగదు. ఇది నిజము.

పితృదేవతలు అంటే గతించిన మన పితరులు కాదు. మనందరి (జీవుల) రాకపోకలను, వారి గతులను సమర్థవంతంగా నిర్వహించే దేవతా వ్యవస్థ పితృదేవతా వ్యవస్థ. వసువులు, రుద్రులు, ఆదిత్యులు.. మొదలుగా గల దేవతలను పితృదేవతలు అంటారు.

కర్మ క్షయం కాని జీవుడు మరణించిన తరువాత పుడతాడు అనేది నిజం. కానీ వెంటనే అని ఖచ్చితంగా చెప్పలేము. ఒక లెక్క ప్రకారం పునర్జన్మకు 300 సంవత్సరాలు పడుతుంది. వెంటనే పుట్టిన సందర్భాలు కూడా లేకపొలేదు. అది ఆ జీవుని యొక్క సంకల్ప బలం, తనకి గల ప్రారబ్ధ, ఆగామి, సంచితం అనే కర్మలపైన ఆధార పడి ఉంటుంది.

ఒకవేళ వెంటనే పుట్టినా సరే మనం చేసే పితృకర్మల ఫలితం వారికి అందుతుంది. వారు ఏ రూపంలో పుట్టినా సరే మనం పెట్టినది వారికి ఏది ఆహారమో ఆ రూపంలో అందుతుంది. ఇలా చేయడానికి ఒక వ్యవస్థని పితృదేవతలు ఏర్పాటు చేసేరు. ఉదాహరణకు..ఆ జీవుడు ఆవుగా పుడితే గడ్డి మొదలైన రూపంగా మారి మనం పెట్టిన ఆహారం అందుతుంది. వారిని ఉద్దేశించి అలా చేసినందుకు పితృదేవతలు కూడా సంతోషించి మనకి మంచి కలుగజేస్తారు. ఒకవేళ గతించిన వారు ముక్తిని పొంది లేదా ఉత్తమ గతులలో ఉండి మనం చేసినవి అవసరం లేని స్థితిలో ఉంటే మనం చేసిన పితృకర్మల ఫలితం మనకే మన కోరికలు తీరే విధంగా వస్తుంది.  కానీ గతించిన వారి స్థితి మనకు తెలియదు కనుక మనం జీవించి ఉన్నంత కాలం పితృకర్మలు చేయవలసినదే.

ఈ జన్మతో బంధం తెంచుకున్న జీవన్ముక్తులకి తప్ప మిగతావారికి గతించిన తరువాత కూడా తన పూర్వీకులతోనూ, తన తరువాతి తరం వారితోనూ సంబంధం ఉంటుంది. మనం పెట్టే ఆహారం స్వీకరిస్తారు. పితృ దేవతలకు తద్దినాలుపెట్టండి, మానకండి, మన వంశాన్ని కాపాడేది వాళ్ళే.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ...✍

పితృ దేవతా స్తుతి

శ్రాద్ధాదులలో, మహాలయ పక్షాలలో దీనిని పఠించితే పితరుల కృప లభిస్తుంది. పితృదేవతా విజ్ఞానంతో కూడిన ఈ స్తుతి ఇంట్లో ఉంటే చాలు – పితృకృప చేత ఆ యిల్లు ఆనందైశ్వర్య నిలయమవుతుంది. పుష్టికారకమైన ఈ స్తుతి శ్రాద్ధంలో భోక్తల ముందు చదవడం కూడా శ్రేష్ఠం. ఇది ’గరుడ మహాపురాణం’లో చెప్పబడుతున్నది. ఇందులో అన్ని పితృగణాలు, వాటి విశేష రహస్యాలు చెప్పబడి ఉన్నాయి. దేవతల చేత కూడా ఆరాధింపబడే మహిమాన్వితులు పితృదేవతలు. వారి అనుగ్రహం వలన వంశవృద్ధి, ఐశ్వర్య క్షేమాలు సమకూరుతాయి.

నమస్యేహం పితౄన్ భక్త్యా యే వసన్త్యధిదైవతమ్!
దేవైరపి హి తర్ప్యన్తే యే శ్రాద్ధేయు స్వధోత్తరైః!!
నమస్యేహం పితౄన్ స్వర్గే యే తర్ప్యన్తే మహర్షిభిః!
శ్రాద్ధైర్మనోమయైర్భక్త్యా భుక్తిముక్తి మభీప్సుభిః!!
నమస్యేహం పితౄన్ సర్గే సిధాః సంతర్పయన్తియాన్!
శ్రాద్ధేషు దివ్యైః సకలైరుపహారైరనుత్తమైః!!
నమస్యేహం పితౄన్ భక్త్యా యోర్చ్యన్తే గుహ్యకైర్దివి!
తన్మయత్వేన వాంఛద్భి యుద్ధిమాత్యన్తికీం పరామ్!!
నమస్యేహం పితౄన్ మర్త్యై రర్చ్యన్తే భువియే సదా!
శ్రాద్ధేయు శ్రద్ధయాభీష్టలోక పుష్టి ప్రదాయినః!!
నమస్యేహం పితౄన్ యే వై తర్ప్యన్తేరణ్యవాసిభిః!
వన్యైః శ్రాద్ధైర్యతాహారైస్తపో నిర్ధూతకల్మషైః!!
నమస్యేహం పితౄన్ విప్రైర్నైష్ఠికైర్ధర్మచారిభిః!
యే సంయతాత్మభిర్నిత్యం సంతర్పన్తే సమాధిభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః రాజన్యాస్తర్చయన్తియాన్!
కవ్యై రశేషైర్విధివల్లోకద్వయ ఫలప్రదమ్!!
నమస్యేహం పితౄన్ వైశ్యైరర్చ్యన్తే భువియే సదా!
స్వకర్మభి రతైర్నిత్యం పుష్పధూపాన్న వారిభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధే శూద్రైరపి చ భక్తితః!
సంతర్ప్యన్తే జగత్కృత్స్నం నామ్నాఖ్యాతాః సుకాలినః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధే పాతాళే యే మహాసురైః!
సంతర్ప్యన్తే సుధాహారా స్త్యక్త దర్పమదైః సదా!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః అర్చ్యన్తే యే రసాతలేః!
భోగైరశేషైర్విధివన్నాగైః కామానభీప్సుభిః!!
నమస్యేహం పితౄన్ శ్రాద్ధైః సర్పైః సంతర్పితాన్ సదా!
తత్రైవ విధివన్మహా భోగ సంపత్సమన్వితైః!!

పితౄన్నమస్యే నివసన్తి సాక్షాద్యే దేవలోకేధమహాతలేవా!
తధాన్తరిక్షేచ సురారి పూజ్యాస్తే వై ప్రతీచ్ఛన్తు మయోపధీతమ్!!
పితౄన్నమస్యే పరమార్థభూతా యే దై విమానే నివసన్త్యమూర్తాః!
యజన్తి యానన్తమలైర్మనోభి ర్యోగీశ్వరాః క్లేశవిముక్తి హేతూన్!!
పితౄన్నమస్యేదివి యే చ మూర్తాః స్వధాభుజః కామ్య ఫలాభినన్దౌ!
ప్రదానశక్తాః సకలేప్సితానాం విముక్తిదా యేనభిసంహితేషు!!
తృప్యన్తు తేస్మిన్పితరః సమస్తా ఇచ్ఛావతాం యే ప్రదిశన్తి కామాన్!
సురత్వమిన్ద్ర త్వ మితోధికం వా గజాశ్వరత్నాని మహాగృహాణి!!
సోమస్య యే రశ్మిషు యోర్కబింబే శుక్లౌ విమానే చ సదావసన్తి!
తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైర్గన్ధాదినా పుష్టిమతో వ్రజన్తుః!!
యేషాం హుతేగ్నే హవిషాచ తృప్తిర్యే భుంజతే విప్రశరీరసంస్థాః!
యే పిండదానేన ముదం ప్రయాన్తి తృప్యన్తు తేస్మిన్పితరోన్నతోయైః!!
యే ఖడ్గ్మమాం సేన సురైరభీష్టైః కృష్ణైస్తిలైర్దివ్య మనోహరైశ్చ!
కాలేన శాకేన మహర్షివర్యైః సంప్రీణతాస్తే ముదమత్రయాస్తు!!
కన్యాన్య శేషాణి చ యాన్యభీష్టాన్యతీవ తేషాం మమ పూజితానాం!
తేషాం చ సాన్నిధ్య మిహాస్తు పుష్పగంధాంబు భ్యోజ్యేషు మయాకృతేషు!!
దినే దినే యే ప్రతిగృహ్ణతేర్చాం మాసాన్త పూజ్యా భువి యేష్టకాసు!
యే వత్సరాన్తేభ్యుదయే చ పూజ్యాః ప్రయాన్తు తేమే పితరోత్ర తుష్టిమ్!!
పూజ్యాద్విజానాం కుముదేన్దు భాసో యే క్షత్రియాణాం జ్వలనార్కవర్ణాః!|
తథా విశాం యే కనకావదాతా నీల ప్రభాః శూద్రజనస్య యేచ!!
తేస్మిన్సమస్తా మమ పుష్ప గంధధూపాంబు భోజ్యాది నివేదనేన!
తథాగ్ని హోమేన చయాన్తి తృప్తిం సదా పితృభ్యః ప్రణతోస్మి తేభ్యః!!
యే దేవ పూర్వాణ్యభితృప్తి హేతో రశ్నన్తి కవ్యాని శుభాహృతాని!
తృప్తాశ్చ యే భూతిసృజో భవన్తి తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మి తేభ్యః!!
రక్షాంసి భూతాన్యసురాంస్తథోగ్రాన్ నిర్ణాశయన్తు త్వశివం ప్రజానామ్!
ఆద్యాః సురాణామమరేశ పుజ్యాస్తృప్యన్తు తేస్మిన్ ప్రణతోస్మితేభ్యః!!

అగ్నిష్వాత్తా బర్హిషద ఆజ్యపాః సోమపాస్తథా!
వ్రజన్తు తృప్తిం శ్రాద్ధేస్మిన్పితర స్తర్పితా మయా!!
అగ్నిష్వాత్తాః పితృగణాః ప్రాచీం రక్షన్తు మేదిశం!
తథా బర్హిషదః పాన్తు యామ్యాం మే పితరః సదా!!
ప్రతీచీ మాజ్యపాన్త ద్వదుదీచీమపి సోమపాః!
రక్షో భూతపిశాచే భ్యస్తథైవాసురదోషతః!!
సర్వతః పితరో రక్షాం కుర్వన్తు మమ నిత్యశః!
విశ్వో విశ్వ భుగారాధ్యో ధర్మో ధన్యః శుభాననః!!
భూతిదో భూతికృత్ భూతిః పితౄణాం యే గణానవ!!
కళ్యాణః కల్యదః కర్తా కల్యః కల్యతరాశ్రయః!
కల్యతా హేతురనఘః షడిమే తే గణాః స్మృతాః!!
వరో వరేణ్యో వరదస్తుష్టిదః పుష్టిదస్తథా!
విశ్వపాతా తథా ధాతా సప్తైతే చగణాః స్మృతాః!!
మహాన్మహాత్మా మహితో మహిమావాన్మహాబలః!
గణాః పంచ తథైవైతే పితౄణాం పాపనాశనాః!!
సుఖదో ధనదశ్చాన్యే ధర్మదోన్యశ్చ భూతిదః!
పితౄణాం కథ్యతే చైవ తథా గణ చతుష్టయమ్!!
ఏకత్రింశత్పితృగణా యేర్వ్యాప్త మఖిలం జగత్!
త ఏవాత్ర పితృగణాస్తుష్యన్తు చ మదాహితాత్!!

మార్కండేయ ఉవాచ
ఏవంతు స్తువతస్తస్య తేజసో రాశిర్రుచ్ఛ్రి తః!
ప్రాదుర్బభూవ సహసా గగనవ్యాప్తి కారకః!!
తద్ దృష్ట్వా సుమహత్తేజః సమాచ్ఛాద్య స్థితం జగత్!
జానుభ్యామవనీం గత్వా రుచిః స్తోత్రమిదం జగౌ!!

రుచిరువాచ
అర్చితానామమూర్తానాం పితౄణాం దీప్త తేజసామ్!
నమస్యామి సదా తేషాం ధ్యానినాం దివ్య చక్షుషామ్!!
ఇంద్రాదీనాం చ నేతారో దక్షమారీచ యోస్తథా!
సప్తర్షీణాం తథాన్యేషాం తాన్నమస్యామి కామదాన్!!
మన్వాదీనాం చ నేతారః సూర్యాచన్ద్ర మసోస్తధా!
తాన్నమస్యామ్యహం సర్వాన్ పితౄణప్యుదధావపి!!
నక్షత్రాణాం గ్రహాణాం చ వాయ్వగ్న్యోర్నభసస్తథా!
ద్యావాపృథివ్యోశ్చ తథా నమస్యామి కృతాంజలిః!!
ప్రజాపతేః కశ్యపాయ సోమాయ వరుణాయ చ!
యోగేశ్వరేభ్యశ్చ సదా నమస్యామి కృతాంజలిః!!
నమో గణేభ్యః సప్తభ్య స్తథాలోకేషు సప్తషు!
స్వాయంభువే నమస్యామి బ్రహ్మణే యోగ చక్షుషే!!
సోమాధారాన్ పితృగణాన్ యోగిమూర్తిధరాం స్తథా!
నమస్యామి తధా సోమం పితరం జగతా మహమ్!!
అగ్నిరూపాం స్తథైవాన్యాన్నమస్యామి పితౄనహమ్!
అగ్నీషోమమయం విశ్వం యత ఏతదశేషతః!!
యే చ తేజసి యే చైతే సోమసూర్యాగ్ని మూర్తయః!
జగత్స్వరూపిణశ్చైవ తథా బ్రహ్మ స్వరూపిణః!!
తేభ్యోఖిలేభ్యో యోగిభ్యః పితృభ్యో యతమానసః!
నమో నమో నమస్తేస్తు ప్రసీదస్తు స్వధాభుజః!!

మార్కండేయ వువాచ
ఏవం స్తుతాస్తతస్తేన తేజసోమునిసత్తమాః!
నిశ్చక్రముస్తే పితరో భాసయన్తో దిశోదిశ!!
నివేదనం చ యత్తేన పుష్పగంధానులేపనం!
తద్భూషితానథ స తాన్ దదృశే పురతః స్థితాన్!!
ప్రణిపత్య రుచిర్భక్త్యా పునరేవ కృతాంజలిః!
నమస్తుభ్యం నమస్తుభ్యమిత్యాహ పృధగాద్రుతః!!
స్తోత్రేణానేనచ నరో యోస్మాం స్తోష్యతి భక్తితః!
తస్య తుష్టావయం భోగానాత్మజం ధ్యానముత్తమమ్!!
ఆయురారోగ్యమర్ధం చ పుత్ర పౌత్రాదికం తధా!
వాంఛద్భిః సతతం స్తవ్యాః స్తోత్రేణానేన వైయతః!!
శ్రాద్ధేషు య ఇమం భక్త్యా త్వస్మత్ప్రీతి కరం స్తవమ్!
పఠిష్యతి ద్విజాన్మానాం భుంజతాం పురతః స్థితః!!
స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరే కృతే!
అస్మాభిరక్షయం శ్రాద్ధం తద్భవిష్యత్యసంశయమ్!!
యస్మిన్ గేహే లిఖిత మేతత్తిష్ఠతి నిత్యదా!
సన్నిధానం కృత్యౌ శ్రాద్ధౌత త్రాస్మాకం భవిష్యతి!!
తస్మాదేతత్త్వ యా శ్రాద్ధే విప్రాణాం భుంజతాం పురః!
శ్రవణీయం మహాభాగ అస్మాకం పుష్టికారకమ్!!
(రుచి ప్రజాపతి చేసిన ఈ స్తోత్రం నిత్యం పఠించవచ్చు)

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

నర్మదా బాణలింగం

పురాణాల ప్రకారం నర్మద శివాంశసంభూతురాలని, చంద్రవంశ రాజుకు భార్య అయి నందున ‘సోమోద్భవ’ అని, నాగులకు గంధర్వుల బాధ తొలగించి నందున "నాగకన్య" అని కొన్ని పేర్లతో పిలవబడుతుంది. నాగులకు ఉపకారం చేసినందులకు నర్మద యందలి లభించు బాణ లింగాలకు అభిషేకం చేసిన జలాలు సేవించిన వారికి కాలసర్ప విష భయం ఉండదని నాగులు వరమిచ్చారు. ఈనర్మదా బాణలింగ అభిషేక జలం త్రిదోషహరం, వీర్యవృద్ధి కరం, ఆరోగ్యకరం, రుచికరమని ఆయుర్వేద గ్రంథాలు వెల్లడిస్తున్నాయి. నర్మదా లింగాన్ని చూచినంత మాత్రముననే కాలసర్పదోషాలు, నాగదోషాలు, సమస్త పాపములు నశించునని పురాణములు ప్రకారం నాగదేవతలు వరం ప్రసాదిస్తున్నవి.

బాణలింగ పూజ వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆధునిక కాలంలో నిర్మిస్తున్న శివాలయాలలో చాలావరకు బాణలింగాలనే ప్రతిష్ఠ చేస్తూ వస్తున్నారు. బాణ లింగాలు గుడ్డు ఆకారంలో ఎంతో నున్నగా వుంటాయి. ఎంత తేనే పోస్తే అంత ఎత్తుకునేంతగా బాణలింగాలు కనిపిస్తుంటాయి. ఏ విధమైన ఎగుడు దిగుడు లేకుండా ఒకే విధమైన కోణాలను కలిగి, ఆకర్షణీయంగా కనిపించడం బాణలింగం ప్రత్యేకత. ఇవి తెలుపు, నలుపు, నేరేడు పండు, తేనే, గచ్ఛ కాయ రంగుల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

బాణలింగాలు ఎక్కువగా నర్మదా నదీ ప్రాంతంలో మాత్రమే ఎక్కువగా లభిస్తూ వుంటాయి. నర్మదా బాణ లింగ రూపంలో ఉన్న శివుణ్ణి ఇంద్రాది దేవతలు, రావణాది రాక్షసులు పూజించారు. నర్మదా నదీతీరంలో కూర్చుని పూర్వం బాణాసురుడు తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షం కాగానే ఈ పర్వతంలో ఈ నదిలో నీవు నాకెప్పుడూ దర్శనం ఇవ్వాలని వరం కోరతాడు. బాణుడు కోర్కెను తీర్చడానికి భగవానుడు గుండ్రని లింగాకృతి గల రాళ్ళ రూపంలో మారిపోయాడు. అందుకే “నర్మదాకే శంకర్ సబ్ కే శంకర్” అనే సామెత వచ్చింది. బాణాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం శివుడు ఇక్కడ లింగ రూపాల్లో లభిస్తూ ఉంటాడనీ, ఈ కారణంగానే వీటికి బాణలింగం అనే పేరువచ్చిందని అంటారు.

మట్టి, స్పటికం, బంగారం, వెండి తదితర శివలింగాలను పూజించడం వలన కలిగే పుణ్యఫలం, ఒక్క నర్మదా బాణ లింగాన్ని పూజించడం వలన లభిస్తుందని చెప్పబడుతోంది. నర్మదా బాణలింగాన్ని ఆరాధించడం వలన సకల శుభాలు చేకూరతాయనీ, సుఖ సంతోషాలు కలుగుతాయని స్పష్టం చేయబడుతోంది. సాలగ్రామములు ఏ విధంగా పూజలు అందుకుంటున్నవో నర్మద యందలి శిలలు, త్రినేత్రముల, యజ్ఞోపవీతముల చిహ్నములతో నర్మదబాణములుగా ప్రసిద్ధి పొంది శిష్టుల పూజా పీఠములను శివ స్వరూపంతో అలంకరిస్తున్నాయి. "గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు" పై శ్లోకంలో ఉన్న ఏడు నదుల పేర్లు స్మరించుకోవాలని మన పెద్దలు చెబుతారు. బృహదీశ్వరాలయంలోని అతిపెద్ద బాణలింగం ఇక్కడ లభించిందే.

జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు నర్మదా తీరమందే సన్యాసదీక్ష తీసుకున్నారు. వారు రచించిన దివ్య స్తోత్రములలో 'నర్మదాష్టకం' ప్రసిద్ధమయినది. కార్త వీర్యార్జునుడు రాజధానిగా చేసుకొని నర్మదా నదీ ప్రాంతలను పరిపాలించినట్లు పురాణ గాథలు కలవు. నర్మదా బాణలింగాన్ని ప్రతి సోమవారం గాని, శివరాత్రి పర్వదినాలలో మరియు ప్రత్యేకమైన రోజులలో పూజా మందిరంలో ప్రతిష్టించటానికి ముందుగా నర్మదా బాణలింగాన్ని పవిత్ర నదీ జలాలతో గాని, పసుపు నీటితో గాని శుభ్రపరచి అమ్మవారి స్వరూపమైన పానపట్టం పైన ప్రతిష్ఠించాలి. ఆవాహనం, ఆసనం, అర్ఘ్యం, పాద్యం, ఆచమనం, అభ్యంగన స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, నీరాజనం, తాంబూలం, నమస్కారం, ఉద్వాసన అనే షోడశోపచారాలతో లింగార్చన చేసిన వారికి కుజ దోషాలు, నాగదోషాలు, బంధన యోగం, పితృదోషం, కాలసర్పదోషాల నుండి విముక్తి కలుగుతుంది.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...