Friday, April 6, 2018

నీ భక్తి ఎంత?


     

*కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు.*

ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది.

*పూజారి బయటకు వచ్చి చూడగా.*

పెద్ద బంగారు పళ్లెం ఒకటి కనిపించింది.

*వెళ్లి చూడగా...*
*దానిపై*

‘నా భక్తుని కొరకు’
అని రాసి ఉంది.

*ఈ బంగారు పళ్లాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు.*

పళ్లాన్ని తీసుకుందామని ముట్టుకోగానే...

*అది మట్టిపాత్రగా మారిపోయింది.*

విడిచి పెట్టగానే మళ్లీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది.

ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది.

*ఆలయం కిక్కిరిసిపోయింది.*

ఒక్కో భక్తుడు రావడం...
పళ్లాన్ని ముట్టుకోవడం...
అది మట్టిపాత్రలా మారిపోవడం...
ఇదే తంతు!

*విషయం కాశీ రాజుకు తెలిసింది.*

రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్లాడు.

*జనులందరూ చూస్తుండగా బంగారు పళ్లాన్ని పట్టుకున్నాడు.*

అది మట్టిపాత్రగా మారిపోవడమే కాదు... నలుపు రంగులో కనిపించింది.

*తానెంత అధముడనో రాజుకు అర్థమైంది.*

అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు.

*ఇంతలో ఓ పెద్దాయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు.*

మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చలించిపోయాడు.

కళ్లు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడు.

*‘విశ్వనాథా !*
*ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు తండ్రి’*
*అని మొరపెట్టుకున్నాడు.*

మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సాయం చేశాడు.

ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలనూ ఇచ్చేశాడు.

*చివరగా ఆలయంలోకి వచ్చాడు.*

స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు.

ఇంతలో పళ్లెం సంగతి తెలిసింది.

*ఈ వింతేమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్లాడు.*

దూరంగా నిల్చుని చూస్తున్నాడు.

తిరిగి వెళ్లిపోబోతోంటే.. ఆలయ పూజారి..

*‘ఓ పెద్దాయన... నువ్వూ వచ్చి ముట్టుకో... రోజూ* *గుడికొస్తావ్‌గా, నీ భక్తి*
*ఏ పాటిదో తెలిసిపోతుంది’*
అని హేళనగా అన్నాడు.

పెద్దాయన వెళ్లి పళ్లెం పట్టుకున్నాడు.

అది మరింత బంగారు వన్నెల్లో మెరిసిపోతూ కనిపించింది.

*అందరూ ఆశ్చర్యపోయారు.*

అర్చనలు, అభిషేకాల భక్తికి నిదర్శనాలు కాదు.

*ఆపన్నులను ఆదుకునే తత్త్వం ఉండటమే నిజమైన భక్తి.*

అలాంటివారే నిజమైన ఆధ్యాత్మికవాదులు.

*నా జీవితం లోనివి*
*కష్టాలు కాదు,*
*భగవంతుని వరాలు!*

నేను శక్తిని అడిగాను --
*భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.*

నేను సంపదను అడిగాను--
*భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.*

నేను ధైర్యాన్ని అడిగాను --
*భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.*

నేను వరాలు అడిగాను --
*భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.*

నేను ఆయన ప్రేమను అడిగాను-
*భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.*

నేను జ్ఞానాన్ని అడిగాను -
*భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.*

నేను పురోగతి అడిగాను -
*భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.*

నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను -
*భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.*

నేను ఆయన్ను మరువకూడదు
అని అడిగాను --
*భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.*

నేను పాపాలు క్షమించమని అడిగాను --
*భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.*

అలా జీవితంలో నేను కోరుకున్నదేదీ పొందలేదు -
*నాకు కావలసిందే నేను పొందాను.*

ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు *అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.*

*చివరకు ఏది జరిగినా నా మంచికే అని అర్ధం చేసుకున్నాను.
మీరు కూడాఅర్ధం చేసుకోండి.*

జరిగేది అంతా మన మంచికే.

లోకా సమస్తా సుఖినోభవ౦తు

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ......

దేవుడి ఉంగరాన్ని ఏ స్థితిలో ధరించాలో తెలుసా?

మనలో చాలామంది ఉంగరాల్లో చైన్‌లలో దేవుడి ప్రతిమలు ఉంచుకుంటారు. ఉదయాన్నే లేచి కళ్ళకు అద్దుకోవడం, దండం  పెట్టుకోవడం లాంటివి చేస్తారు. ఆ ప్రతిమలలో దైవత్వం ఆపాదించుకుంటాం. అసలు దేవుడి ఉంగరాలు ఎలా ధరించాలి? ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

ఉంగరాలు కాని, గొలుసులుగాని దేవుడి ప్రతిమలు ఉంటే వాటికి దేవాలయాల్లో తగిన పూజలు, అభిషేకాలు చేయించి జాతక రీత్యా ధారణ చేయాలి. అలా చేస్తేనే ఆ ప్రతిమలకు శక్తి వస్తుంది. అప్పుడు సాక్షాత్తు భగవంతుడు మనవెంటే ఉన్నట్లు. అయితే ఇక్కడ ఉంగరం ధరించిన తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేకం ఉంటాయి.

ఉంగరంలో ఉన్న దేవుడి ప్రతిమ శిరస్సు మణికట్టు వైపు కాళ్ళు గోర్లవైపు ఉండాలి. ఎందుకంటే మానవ శరీరం చేతివేళ్ళు, గోర్లు భూమిని చూస్తూ ఉంటాయి. కళ్ళకు అద్దుకునేటప్పుడు గుప్పిట ముడిచి కళ్ళకు అద్దుకోవాలి. అంతేకాదు భోజనం చేసేటప్పుడు ఎంగిలి అంటకూడదు. మాంసాహారం భుజించకూడదు. ఎందుకంటే మాంసాహారం తినేటప్పుడు ఆ మాంసం దేవుడి ప్రతిమకు తగులుతుంటే ఒక్కసారి ఊహించుకోండి, మనం ఎంత తప్పు చేస్తున్నామో?

ఇక మగవారు ధూమపానం చేసేటప్పుడు ఆ పొగ మనం ధరించిన దేవుడి ప్రతిమకు తగులకూడదు. తెలిసి తెలిసి చేసే తప్పును ఆ భగవంతుడు క్షమించడు. అంతేకాదు మద్యపానం కూడా అంతే. ఇన్ని జాగ్రత్తలు పాటిస్తేనే దేవుడి ప్రతిమ గల ఉంగారాన్ని ధరించాలి. లేకపోతే మంచి కంటే చెడే ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది. ఉదాహరణకు ఏదైనా ప్రమాదం జరిగితే అయ్యో ఆయన ఎంతో మంచి వాడండి, భగవంతుడు ఇలాంటి వారికే ఎందుకు శిక్షిస్తాడు అని జాలిపడతాం. ఆయన మనసు మంచిది కావచ్చు. ఇలాంటి చిన్నచిన్న పొరపాట్లు ప్రాణాల మీదకు తెస్తాయి. అందుకే భగవంతుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ....

పితృకర్మలు కర్మలు ఎందుకు చేయాలి ?


వేదబోధిత కర్మలలో పితృకర్మలు అత్యంత ప్రధానమైనవి . నవమాసాలు కడుపులో పెట్టుకొని , రక్తమాంసాలు పంచి ఇచ్చిన తల్లికి , పాతికేళ్ళవరకు కంటికి రెప్పలా కాపాడి పోషణభారము వహించిన తండ్రికి క్రుతజ్ఞత చూపడము మానవత్వము.విశ్వాసము ఉన్నట్లయితే వారికి ఉత్తరగతులు కల్పించడం విధి .

శ్లోకం :

“దేవకార్యదపి సదా పితృకార్యం విశిష్యతే ”

దేవ కార్యాలు కంటే పితృకార్యాలు చాలా ముఖ్యమైనవి. పితృకర్మలు, పితృతర్పణలు చేసిన వారికి దేవతలు కూడా గొప్ప ఫలాలనిస్తారు అనగా దేవ కార్యాలను వదిలి వేయాలని చెప్పడం కాదు.

పితృకార్యాలు మాని ఎన్ని పూజలు, స్తోత్రాలు, జపాలు చేసినా ఫలం లేదు పితృకార్యాలు చేసిన వారికే దేవ కార్యాలు ఫలిస్తాయి. అబీష్టసిద్దికి, వంశ వృద్దికి, సంతాన క్షేమానికి పితృకార్యాలు ప్రధానం.
మనం తల్లితండ్రుల ఆస్తిపాస్తులనే కాక వారి ఆదర్శాలను పాటించుచు, సత్కీర్తిని పొందుతూ తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. వీటి కోసమే మాసికాలు, ఆబ్దీకాలు నిర్దేశించ బడ్డాయి. మాసికం అంటే మరణించిన సంవత్సరం లోపు ప్రతీ నెలా వారికి ఆ తిథి రోజున చేసే కార్యక్రమమే మాసికం. ఆబ్దీకం అంటే ప్రతి సంవత్సరం ఏ తిథి రోజున చనిపోతే ఆ తిథి నాడు జరిపించేదే ఆబ్దీకం.అంటే నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి కర్మలను శాస్త్రియంగా జరిపించి, మంత్రాలతో ఆవాహన చేసుకొని వివిధ దానాలు చేసి సత్కరించటం మన విధి. అంటే మనం ఆ తిథి నాడు అందించిన ఆహారాదులు మాసికం అయితే నెల వరకు, ఆబ్దీకం అయితే సంవత్సరం వరకు పితృదేవతలకు సరిపోతాయని మన నమ్మకం.
మనం శిశువులుగా ఉన్నప్పుడు మన తల్లితండ్రులు మన అవసరాలను అనుక్షణం ఏ విధంగా తీర్చారో ఆ విధంగానే మనం వారు ఈ లోకం వీడిన తర్వాత కూడా మనం అంతే భాద్యతతో మన కర్తవ్యం మనం నెరవేర్చి వారికి మాసికాలు ఆబ్దీకాలు పెట్టాలి.

పితృ దోషం:
పితృ దోషం అంటే ఒక శాపం. గత జన్మ లో ఎవరైనా వృద్దులకు కాని, తల్లితండ్రులకు కాని కష్టం కలిగించి ఉంటే , లేదా వ్యక్తి కి తీవ్రమైన అనారోగ్య సమస్యలు కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తీ యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవడం పితృ దోషాలకు గురికావడం జరుగుతుంది. జాతక చక్రం లో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి.
ఉదాహరణకి ముఖ్యమైన పనులు పూర్తీ కాక ముందే ఆటంకాలు , వైఫల్యాలు ఎదురుకోవడం, గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలగడం. కుటుంబం లో స్త్రీ కి చిన్న వయసు లో వైధవ్యం ప్రాప్తించడం, కుటుంబం లోని వ్యక్తికీ మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండడం, ముఖ్యం గా సంతాన భాగ్యం లేక పోవడం, పుట్టిన సంతానం జీవించకపోవడం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి. ప్రతి మనిషీ తన జీవితం లో పితృఋణం తీర్చాలి. దీనివలన పితరులు తృప్తి చెందుతారు. వారికి ముక్తి లభిస్తుంది.
మృత్యువు తరువాత సంతానము వారి తండ్రి గారికి శ్రార్ధము చేయని ఎడల లేదా వారి జీవితావస్థను అనాదరణ చేసిన ఎడల పునర్ జన్మలో వారి కుండలిలో పితృ దోషము కలుగును.సర్ప హత్య లేదా ఏదైనా నిరపరాధిని హత్య చేసినా కూడా పితృ దోషము కలుగును.
పితృ దోషమును నివారించుటకు నియమించ బడ్డ పితృ కార్యములు చేయవలెను పితృ పక్షములో శ్రార్దము చేయవలెను.నియమిత కాకులకు మరియు కుక్కలకు భోజనము పెట్టవలెను. వట వృక్షమునకు నీరు పోయవలెను. భ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. గోవును పూజించవలెను. విష్ణువును పూజించుట లాభదాయకము.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ......

దేవుడు ఉన్నాడా ??లేడా?

నీవు సిద్దమేనా?"
అని అడిగాడు. దానికా వ్యక్తి "
ఇప్పుడే మిమ్మల్ని గురువుగా స్వీకరిస్తున్నాను.
ఇక మీరు ప్రారంబించండి " అని వినయంగా చెప్పాడు.. వెంటనే గురువు వేరొక శిష్యుని పిలచి చెవిలో పంచదార కలిపిన నీరు ఒక గ్లాసుతో తెమ్మని చెప్పాడు శిష్యుడు తెచ్చాడు... ఇపుడు గురువు వచ్చిన వ్యక్తికి మద్య సంభాషన ఇలా...

గు: ఈ గ్లాసులో ఏముంది?
శి: మంచి నీరు.
గు: సరిగా చూసి చెప్పు కేవలం మంచి నీరేనా?
శి : అవును గురువు గారు కేవలం మంచి నీరే.
గు : అయితే ఒకసారి త్రాగి చెప్పు..
శిష్యుడు నీటిని త్రాగాక..
గు:- ఇప్పుడు చెప్పు అది ఏ నీరు?
శి : -గురువు గారూ ఇది పంచదార కలిపిన నీరు..
గు: -మరి ఇందాక కేవలం మంచినీరే అని చెప్పావు. ఇప్పుడు పంచదార కలిపిన నీరని అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావ్?
శి : -ఎలా అంటే ఇంతకు మునుపు కేవలం నీటిని మాత్రమే చూసి అందులొే కరిగి ఉన్న పంచదార కానరాక అది కేవలం మంచినీరని పొరపడి చెప్పాను. కానీ ఇపుడు నీటిని త్రాగాను.నీటియందలి పంచదార రుచి  అనుభవించిన మూలంగా ఇది పంచదార నీరని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను.
గు: -అంటే అనుభవ పూర్వకంగా తప్పితే అది పంచదార నీరు అని నీవు తెలుసుకొేలేకపొేయావ్ అంతేనా?
శి: -అవును.
గు : -సరే ఇపుడు నువ్వు త్రాగినది పంచదార నీరని ఒప్పుకున్నావు.అయితే అ నీటీలొ పంచదార చూపించు..
శి : -అసాద్యం గురువు గారూ..
గు : -ఏం ఎందుకని?
శి:- పంచదార పూర్తిగా నీటితోకలసి పోయి ఉంది. దానిని వేరు చేసి చూపించలేం..
గు: -అయితే నీవొచ్చిన పని అయిపోయింది తిరిగి వెళ్లిపో...

శిష్యుడు సరైన సమాదానాలే ఇచ్చాడు కాని విషయం సరిగ్గా అవగాహన చేసుకోలేక పోయాడు. గురువుగారు ఏదో పరీక్ష పెడుతున్నారనుకుని సమాదానాలు చెప్తూపోయాడు.
విషయం వివరించాల్సిందిగా గురువుని కోరాడు....

అపుడు గురువు " చూడునాయనా.. నీవు నీటిని చూసి రుచి చూడకయే  ఏవిదంగానైతే కేవలం మంచినీరే అని పొర పాటు పడ్డవో అదేవిదంగా మనుష్యులు కేవలం భాహ్య ప్రపంచాన్ని చూస్తూ వాటి సుఖాల్లో పడి దేవుడు లేనిదానిగా సృష్టిని చూస్తున్నారు. కానీ నీవు నీటిని త్రాగి అందులోని తీపి రుచిని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నావు..

అంటే ఎవరైతే తమ ప్రయత్నం ద్వారా దేవుని ఉనికిని తమ అనుభవ పూర్వకంగా తెలుసుకుంటారోవారికి దైవం ఉన్నదనే సత్యం తెలుస్తుంది. పంచదార నీరు త్రాగేవారికి తప్ప మిగతా వారందరికీ అది మంచినీరే.. దానిని త్రాగిన వాడికే దాని రుచి తెలుస్తుంది...

అనుభవించిన వారికే దేవుడున్న సత్యం తెలుస్తుంది. మిగతా వారికి అనుభవం లేక దేవుడు లేడని పలు పుకార్లు పుట్టిస్తారు...

ఇంకా నీవు దేవుడుంటే చూపించమని ప్రశ్నిస్తే , నీవు ఏ విదంగానైతే నీరంతా కరిగి పోయి,నీటితో కలసి పోయి ఉన్న పంచదారను  నీటి నుండి వేరు చేసి చూపించలేవో, అదే విదాన ఈ సృష్టంతా నిండి పోయి, సూక్ష్మాతి సుక్ష్మరూపంలో అణువణువూ వ్యాపించియున్న భగవంతుని ప్రత్యేకంగా వేరుచేసి చూపంచలేం...

సృష్టిలోఉండే ప్రతీదీ భగవత్సరూపమే. జీవుని రూపంలో ఉండేది ఆ భగవంతుడే. రూప నామాలు ఎన్నైనా దేవుడు ఒక్కడే. వాడొక్కడే ఈ చరాచర సృష్టినంతటిని భరించి పోషించుచున్నాడు. నీవు నేను ఈ చెట్టూ పుట్టా వాగూ వంకా అన్నీ భగవంతుని రూపాలే. కనుక దేవుని సర్వంతర్యామిగా తెలుసుకుని ప్రపంచ సుఖాల పట్ల వ్యామెహం విడచి దైవంపై ప్రేమ ,విశ్వాసాలు కలిగి ఉండు.వాడే నిన్ను ఉద్దరిస్తాడు." అని చెప్పగా శిష్యుడు ఆనందం అంబరాన్ని తాకింది. తన సందేహం పటాపంచలై పోయింది. గురువు గారికి ప్రణమిల్లి మీరు చెప్పిన విదంగానే నడచుకుంటానని మాటిచ్చి తన స్వస్థానానికి తిరుగు ప్రయాణమయ్యాడు.

ఇది కధలా భావించకండి. ఆత్మ పరిశీలన చేసుకొండి. దేని మూలంగా ఈ జగత్తంతా నడుస్తుందో ఆలోచించండి.సైన్స్  అనేది కూడా ఒక విదమైన దైవిక సిద్దాంతమే. శక్తిని సృష్టించలేం నశింప జేయలేం అని సైన్స్ చెప్తుంది.మరి సృష్టింపబడని ఆ శక్తి ఎక్కడిది? ఇంకా మీరు సందేహిస్తే మీ ఇష్టం

జ్ఞాని ఐనవాడు ఏ పని చేయకుండా రోజంతా సోమరిగా కూర్చొని ఉంటాడా ?

అంటే కాదనే సమాధానం
అతడు రోజంతా
ఎదో ఒక పని చేస్తూనే ఉంటాడు
కాని  అతడి భావన వేరుగా ఉంటుంది.

సామాన్యులమైన మనం
దేనినో పొందటానికి పని చేస్తాము  :

జ్ఞాని  తన అంతరంగంలో పెల్లుబికే
ఆనందాన్ని  సంతోషాన్ని  ప్రేమను
చుట్టూ ఉన్నవారితో పంచుకోవడానికై
పని చేస్తాడు.

మన పని ఏదో ఒక
అసంతృప్తితో మొదలయితే :

జ్ఞాని  తృప్తి నిండిన
హృదయంతో  పని  చేస్తాడు.

మనం పని చేయకపోతే భౌతికంగా
ఏదో పోగొట్టుకుంటాము  లేదా
ఒక విధమైన అపరాధ భావం
మనస్సులో నెలకొంటుంది  :

జ్ఞాని  పని చేయకపోయినా
అతడికి ఏ విధమైన నష్టము ఉండదు
మనస్సులో నేర భావన ఉండదు
అందువల్ల జ్ఞానిని ఎవ్వరూ కూడా
పని చేయమనికాని వద్దని కాని నిర్బంధించలేరు.

ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా
జ్ఞానికి  ఏ విధమైన ఉపదేశాలు
ఆదేశాలు  ఈయలేవు  *  అంటే  ••
జ్ఞాని  ఏదైనా తప్పు చేస్తాడని కాదు.

అతడు  సమాజానికి  సంఘానికి మానవాళికి
ఉపయోగకరమైన పని మాత్రమే చేస్తాడు
పని చేయాటానికీ  చేయకపోవటానికీ
కూడా  అతడికి పూర్తి స్వేచ్ఛ ఉంది.

అతడికి పనిలో స్వేచ్ఛ ఉంది
పని నుండి కాదు
ఇదే నిజమైన స్వేచ్చ.

జ్ఞానం - పాండిత్యం

అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్లో అందరూ శాంతి సౌఖ్యాలతో, సమ భావంతో, కలిసి మెలిసి జీవించేవాళ్లు. ఆ ఊరికి ఒక సాంప్రదాయం ఉండేది: మంచి పండితుల్ని , తత్త్వవేత్తలను అప్పుడప్పుడు వాళ్ళ ఊరికి ఆహ్వానించేవాళ్ళు; వాళ్ల చేత ఉపదేశాలు, ఉపన్యాసాలు ఇప్పించుకునేవాళ్లు. వాటి ద్వారా ఊళ్ళోవాళ్లంతా మంచి విలువలను పెంపొందించుకొనే వాళ్ళు. దీని వెనక ఉన్నది, ఆ ఊరి పెద్ద త్యాగయ్య. ఆయన బాగా చదువుకున్నవాడు, శాంత స్వభావి, మంచి తెలివైనవాడు కూడా.
ఒకసారి ఆయన మంచి పేరు గడించిన పండితులు ఇద్దరిని తమ ఊళ్ళో ప్రసంగించేందుకుగాను ఆహ్వానించారు. ఊళ్ళోవాళ్ళు ఉపన్యాస వేదికను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ఆరోజు ఉదయం పండితులిద్దరూ ఊరు చేరారు. త్యాగయ్యగారి ఇంట్లోనే వారికి విడిది ఏర్పాటు చేశారు. ఆ పండితుల రాకతో తన ఇల్లు పావనమైందని అనుకున్నారు త్యాగయ్యగారు. కొద్ది సేపు అవీ-ఇవీ మాట్లాడిన తర్వాత వాళ్ళలో మొదటి పండితుడు స్నానాల గదిలోకి వెళ్ళాడు, స్నానం చేసేందుకు.

అంతలో రెండవ పండితుడు రహస్యం చెబుతున్నట్లు గొంతు తగ్గించి త్యాగయ్యతో ఇలా అన్నాడు: "ఇప్పుడు స్నానానికి వెళ్ళాడు చూశారా, పైకి పండితుడు! కానీ నిజానికి వీడు ఒక దున్నపోతు. ఆధ్యాత్మిక జ్ఞానం ఏమాత్రం లేదు వీడికి. వట్టి అహంకారి. ఉపన్యాసాలు ఇవ్వటం తప్ప, జ్ఞానం అంటే ఏంటో తెలీదు వీడికి. నా సరసన వీడు ప్రసంగించడం కూడా ఇష్టం లేదు నాకు!" అని.
అంతలో మొదటి పండితుడు స్నానం ముగించుకొని వచ్చాడు. రెండోపండితుడు లేచి స్నానం చేసేందుకు వెళ్లాడు. ఇప్పుడు మొదటి పండితుడి వంతు వచ్చింది. అతను త్యాగయ్యతో గుసగుసగా అన్నాడు: "ఈ గాడిదను ఎందుకు పిలిపించారు? వీడికి ఏ జ్ఞానం ఉందని మీరు భావించారు? వీడికి "అహం జాస్తి, సంస్కారం నాస్తి". ఎన్ని జన్మలు ఎత్తినా నాతో వీడు సమం కాజాలడు" అని.
ఇద్దరి మాటల్నీ మౌనంగా విన్నారు త్యాగయ్యగారు. కొంతసేపటికి పండితులిద్దర్నీ భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరికీ ఎత్తైన పీటలు వేసి, ప్రత్యేకంగా తెప్పించిన మంచి అరటి ఆకులు వేసి కూర్చోబెట్టారు. ఇద్దరూ భోజన ప్రియులు కావటంతో ఎట్లాంటి వంటకాలు రానున్నాయో అని ఊహించుకుంటూ‌ కూర్చున్నారు. అంతలో వడ్డించేవాళ్ళు వచ్చి హడావిడి చేస్తూ ఇద్దరి అరిటాకులలోనూ గడ్డి, చిత్తు కాగితాలు, ఆకులు, అలములు వడ్డించారు. "మీకు ఇష్టమైనవేవో కనుక్కొని మరీ ప్రత్యేకంగా చేయించాను. తినండి తినండి" అన్నారు త్యాగయ్యగారు దగ్గర కూర్చొని. పండితులిద్దరు ఆశ్చర్యపోయారు. ఆగ్రహించారు. చటుక్కున లేచి నిల్చున్నారు- "ఏంటిది?! మమ్మల్ని ఇలా అవమానించడానికా, మీ ఊరికి పిలిపించింది?" అని గట్టిగా అరిచారు.
త్యాగయ్యగారు చిరునవ్వు నవ్వుతూ అన్నారు: "అయ్యా! తమరు ఇద్దరూ ఒకరికొకరు మిత్రులని లోక ప్రసిద్ధం. వారు మాతో ముచ్చటిస్తూ తమరిని 'దున్నపోతు' అన్నారు. తమరేమో 'వారు గాడిద' అని శలవిచ్చారు. 'సర్వజ్ఞులైన పండితులు కదా, తమరు; తమరి నిజ స్వభావాలకు తగిన భోజనమే చేస్తారేమో, మనుష్యులు తినే ఆహారం పెడితే తినరేమో' అనుకొని, ఎవరేది తింటారో కనుక్కొని, ఎంతో శ్రమపడి మరీ తెప్పించాను. తినండి తినండి" అని.
పండితులిద్దరూ సిగ్గుతో తలవంచుకున్నారు. తమలోని అహంకారాన్ని గుర్తించి ఇద్దరూ త్యాగయ్యగారికి క్షమాపణలు చెప్పారు. త్యాగయ్యగారు వారిని మన్నిస్తూ "విజ్ఞులు, పెద్దలు- తమరే నన్ను మన్నించాలి. చిన్నతనంకొద్దీ చొరవ తీసుకున్నాను తప్ప, మరోలా అనుకోకండి" అని వాళ్లను తగిన విధంగా సత్కరించి పంపారు.
ఆరోజు సాయంత్రం పండితులిద్దరూ ఔదార్యం గురించీ, జ్ఞానం గురించీ జనరంజకంగా ఉపన్యసించారు!

గుడికి ఎందుకు వెళ్ళాలి?

మనలో చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు ఉంటుంది. ఆడ-మగ, పెద్ద-చిన్న అనే తేడా లేకుండా మనలో చాలామంది గుళ్ళు గోపురాలను దర్శించుకుంటారు. అసలు గుడికి ఎందుకు వెళ్ళాలి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? కాసేపు కాలక్షేపం కోసం లేదా ఏమైనా దిగుళ్ళు ఉంటే మర్చిపోవడం కోసం అనుకుంటే పొరపాటు.

గుడికి వెళ్ళడం మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. అసలు గుడి ఎప్పుడు, ఎందుకు, ఎలా ఏర్పడింది? దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి, ఈ విషయమై వేదాలు ఏం చెప్తున్నాయి మొదలైన అంశాలు తెలుసుకోవడం చాలా అవసరం.
మనదేశంలో చిన్నా పెద్దా వేలాది దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ వైదిక దేవాలయాల పరిగణనలోకి రావు. నియమాలను పాటించి, నిర్దుష్టంగా నిర్మించిన ఆలయాలను మాత్రమే గురువులు పరిగణిస్తారు. అలాంటివే అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇతర దేవాలయాలు కూడా పవిత్ర ప్రదేశాలే అయినప్పటికీ కొన్ని ఆలయాలు మరింత పునీతమయ్యాయి. స్థలమహత్యాన్ని సంతరించుకున్నాయి.
భూమిలో మహత్తరమైన ఆకర్షణ శక్తి తరంగాలు ఎక్కడ ప్రసరిస్తూ ఉంటాయో అక్కడ ఆలయాన్ని నిర్మించాలి. ఇంకా అర్ధమయ్యేట్లు చెప్పాలంటే ఉత్తర దక్షిణ ధ్రువాల మధ్య ఎలా ఆకర్షణ శక్తి ఉంటుందో అలా భూమిలో పాజిటివ్ ఎనర్జీ పాసయ్యేచోట ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అందుకే అలాంటి గుళ్ళలో అడుగు పెట్టగానే తనువూ, మనసూ ప్రశాంతత పొందుతాయి.
దేవాలయ గర్భగృహంలో ఉత్క్రుష్టమైన ఆకర్షణా తరంగాలు కేంద్రీకృతమైన చోట మూలవిరాట్టును నిలిపిన ప్రదేశంలో వేదమంత్రాలు రాసిన తామ్ర పత్రాన్ని (రాగి రేకు) నిక్షిప్తం చేసి ఉంచుతారు. రాగి లోహానికి భూమిలో ఉండే శక్తి తరంగాలను గ్రహించే తత్వం ఉంది. ఆవిధంగా రాగి గ్రహించిన ఆకర్షణను ఆ పరిసర ప్రాంతాలకు విడుదల చేస్తుంది.
అందువల్ల రోజూ గుడికి వెళ్ళి మూల విరాట్టు ఉన్న గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ చేసే అలవాటు ఉన్నవారికి ఆ తరంగాలు సోకి అవి శరీరంలోకి ప్రవహిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఆలయానికి వెళ్ళేవారిలో ఆ శక్తి సోకినా గమనించదగ్గ తేడా తెలీదు. కానీ నిత్యం గుడికి వెళ్ళేవారిలో పాజిటివ్ ఎనర్జీ చేరడం స్పష్టంగా తెలుస్తుంది.
ఇకపోతే గర్భగుడి మూడువైపులా పూర్తిగా మూసి ఉండి, ఒక్కవైపు మాత్రమే తెరిచి ఉంటుంది. అందువల్ల గర్భాలయంలో, ముఖద్వారం దగ్గర పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతమై మరీ అధికంగా ఉంటుంది. గర్భగుడిలో వెలిగించే దీపం ఉత్పత్తి చేసే శక్తి కూడా చెప్పుకోదగ్గదే.
ఆలయాల్లో గంటలు మోగిస్తారు. వేద మంత్రాలు పఠిస్తారు. భక్తి గీతాలు ఆలపిస్తారు. ఈ మధుర ధ్వనులు శక్తిని సమకూరుస్తాయి.
గుడిలో దేవుడికి సమర్పించే పుష్పాలు, కర్పూర హారతి, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుంచి వచ్చే పరిమళాలు శరీరంలో రసాయన చర్య జరపడంవల్ల శక్తి విడుదల అవుతుంది.
మూల విరాట్టును ప్రతిష్ఠించిన ప్రదేశం నుండి విడుదలయ్యే మహత్తర శక్తి తరంగాలకు గుడిగంటలు, మంత్ర ఘోష, పూల పరిమళాలు, కర్పూరం, అగరొత్తులు, గంధం, పసుపు, కుంకుమల నుండి వచ్చే అపురూపమైన సుగంధం, తీర్థ ప్రసాదాల్లో ఉండే ఔషధ గుణాలు అన్నీ కలిసి ఎనలేని మేలు జరుగుతుంది.
గుడిలో దేవుడికి కొబ్బరికాయ , అరటిపళ్ళు నైవేద్యం పెడతారు. ఈ కొబ్బరిని, అరటిపళ్ళని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. వీటిని సేవించడం వల్ల శరీరానికి అవసరమైన అనేక ఔషధాలు అందుతాయి.
తీర్థంలో పచ్చ కర్పూరం (Cinnamomum camphora) యాలుకలు (Cardamom) సాంబ్రాణి (సంబరేను చెట్టునుండి వచ్చే ధూపద్రవ్యం లేదా సాంబ్రాణి తైలము - benzoin), తులసి పత్రాలు (holy basil), లవంగాలు (Clove) మొదలైనవి కలుపుతారు. ఆయా పదార్థాలు అన్నీ ఔషధగుణాలు కలిగినవే. అలా గుడికి వెళ్ళినవారు సేవించే తీర్థం ఎంతో మేలు చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. ఆయురారోగ్యాలను ఇస్తుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
💐ఇప్పుడు చాలామంది పాటించడంలేదు కానీ పూర్వం ఆలయానికి వెళ్ళేప్పుడు పురుషులు చొక్కా (షర్టు) లేకుండా వెళ్ళేవారు. దాంతో ఆలయ ప్రాంగణంలో ఉండే శక్తి తరంగాలు వేగంగా పురుషుల శరీరంలో ప్రవేశిస్తాయి. స్త్రీలు నిండుగా దుస్తులు వేసుకుని అనవసరమైన చూపులు తమపై పడకుండా జాగ్రత్త పడటం మన సంప్రదాయం కనుక అందుకు బదులుగా నగలు ధరించి వెళ్ళేవారు.
లోహానికి శక్తి తరంగాలను త్వరితంగా గ్రహించే శక్తి ఉంటుంది. ఆవిధంగా స్త్రీపురుషులిద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.
భక్తులు గుడికి వెళ్ళి దేవుని దర్శించుకుంటున్న సమయంలో గర్భగుడిలో దీపం వెలుగుతుంటుంది.
కర్పూరహారతి వెలిగిస్తారు. గంటలు మోగుతాయి.తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అలా అన్ని పాజిటివ్ ఎనర్జీలూ సమీకృతమై భక్తులకు ఆనందం, ఆరోగ్యం లభిస్తాయి. మనలో దివ్య శక్తి ప్రవేశించి, తేజస్సు అనుభూతికొస్తుంది. కనుక ఆలయానికి వెళ్ళడం కాలక్షేపం కోసం కాదు, ఎన్నో శక్తి తరంగాలు ప్రవేశిస్తాయని శాస్త్రాలు నిరూపిస్తున్నాయి.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ......

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...