Sunday, February 10, 2019

ధర్మబద్ధ జీవనమే అతి పెద్ద పూజ



ఆయనకు వేదమే ప్రమాణం.. ఆయన మాట వేద సమానం.. అందుకే ఆ మాటలు.. ఇంటింటా వినిపిస్తున్నాయి.. మది మదినీ తడుతున్నాయి.. పురాణేతిహాసాలపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.. ఆయనే చాగంటి కోటేశ్వరరావు. తన వచనామృతంతో తెలుగునాట భక్తి ఉద్యమం సాగిస్తున్న ప్రవచన చక్రవర్తి అంతరంగం ‘హాయ్‌’కి ప్రత్యేకం..

యజ్ఞయాగాదులే చేసి మోక్షాన్ని పొందాలని ఎక్కడా లేదు! ‘కలౌ నామ సంకీర్తనః’ అంటారు. ఒక్క నామం చాలు. ఇష్టదైవం నామం పట్టుకున్నా తరించిపోతావు. ‘రామ’, ‘శివ’ నామాలు స్మరిస్తే చాలు. ‘కొడుక్కి భగవంతుడి పేరు పెట్టుకొని పిలిచినా, ఆడుకుంటూ అయినా, గేళి చేస్తూ అయినా, పద్యం చదువుతూనో, పాట పాడుతూనో, గద్యం చెబుతూనో అందులో భగవన్నామాన్ని తెలిసిగానీ, తెలియక గానీ ఉచ్ఛరిస్తే.. అది నీ పాపాలను తొలగిస్తుంది. తరింపజేస్తుంది’ అని భాగవతంలో అజామీళోపాఖ్యానం తెలియజేస్తోంది.
* మీరు భారత ఆహార సంస్థలో ఉద్యోగి. కానీ, ప్రవచనాలవైపు రావడానికి కారణం?
మా నాన్నగారి రక్తం నాలో ప్రవహించడం వల్ల ఇలా వచ్చానేమో. వారికి సనాతన ధర్మంపై, ఆర్ష వాఙ్మయంపై, భక్తితో కూడిన జీవనంపై చాలా అనురక్తి, నిబద్ధత ఉండేవి. అదే నాకు ప్రేరణ. అదే ప్రవచనాల వైపు నడిపించింది.
* చిన్నప్పటి నుంచే రామాయణం, భారతం వంటి పురాణ వాఙ్మయంపై మక్కువ కలిగి ఉండేవారా?
నేను ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న రోజుల నుంచి పురాణాలపై అనురక్తి ఉంది. తమ్మిరాజు గారని ఒక తెలుగు పండితుడు ఉండేవారు. ఆయన మా ఇంట్లో ముందు భాగంలో అద్దెకు ఉండేవారు. తరచుగా వీటి గురించి ప్రస్తావన చేస్తుండేవారు. అలా వాటి మీద నాకు అనురక్తి బాగా స్థిరపడింది.
* చదువుకునే రోజుల్లో సహచరులతో వీటిపై చర్చలు జరిపేవారా?
మాకు ఇలాంటి అంశాల మీద ప్రత్యేకమైన దృష్టి కోణంతో విద్యా బోధన ఉండేది. నేను ఏలూరులో చదువుకునే రోజుల్లో.. మాకు తెలుగు పాఠం చెప్పేవాళ్లు మంచి విద్వాంసులు. ఉపాధ్యాయుడు నరసింహాచార్యులు గారు, మా ప్రధానోపాధ్యాయుడు ఎస్వీఎల్‌ సూర్యనారాయణ గారు.. జీవితంలో క్రమశిక్షణతో నడవడానికి ఇవి ఉపయోగపడతాయని ధార్మిక విషయాలను బోధిస్తుండేవారు. ఈ కోణంలో వక్తృత్వ పోటీలు, వ్యాసరచన వంటి కార్యక్రమాలు నిర్వహించేవారు. నాకు సహజంగా ఉన్న అనురక్తికి ఇవి బాగా తోడయ్యాయి.
* సంక్లిష్టమైన విషయాలను అలతి పదాలతో చెప్పగలిగే ధారణ మీరెలా అలవర్చుకున్నారు?
నేను ప్రవచనానికి వెళ్లినప్పుడు నా అంతిమ లక్ష్యం ఒకటే! ప్రవచనానికి ఆర్తితో వచ్చి రెండు గంటల సమయం వెచ్చిస్తున్న వ్యక్తికి నా వల్ల ఏదో ప్రయోజనం కలగాలి. అది కొంతమందికే అందితే.. ఎంతో ఆర్తితో వచ్చిన వారు నిరుత్సాహ పడతారు. అలా జరగకూడదని నేను ఎంత కిందివరకు వెళ్లి అర్థమయ్యేట్టు మాట్లాడొచ్చో.. అంత వరకూ వెళ్లాలనుకుంటా. ఆ తపనే ఎక్కువ మంది ఆదరణకు నోచుకోవడానికి కారణం అయి ఉండవచ్చు.
* ‘మనిషి శిథిల వస్త్రాన్ని విసర్జించి నూతన వస్త్రాన్ని ధరించినట్టే.. ఆత్మ శిథిల దేహాన్ని వదిలి నూతన దేహాన్ని అవిష్కరిస్తుందని గీతలో చెప్పారు. ఆత్మకు చావు లేద’న్నారు. అంటే పునర్జన్మ ఉంటుందనేనా?
సనాతన ధర్మం పునాదులన్నీ పునర్జన్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉన్నాయి. ఎంత మంది రక్షకభటులు, ఎన్ని చట్టాలు మనిషిని నియంత్రించగలవు? నేను చేసింది నేనే అనుభవించాలి అనే స్పృహ పాపం చేయకుండా నియంత్రిస్తుంది. ఇతరులను బాధించకుండా, శాంతియుతంగా ఉండడానికి పునర్జన్మ సిద్ధాంతం ఉపకరణమే కదా!
* మన పురాణాల్లో, శాస్త్రాల్లో స్త్రీ-పురుష వివక్ష చూపలేదు.  వీరిద్దరి సంగమమే ఈ సృష్టి అని చెప్పాయి. కానీ, కొన్ని దశలు దాటిన తర్వాత ఎందుకు వివక్ష వచ్చింది? స్త్రీ అనేక విషయాల్లో వివక్ష ఎదుర్కొంటోంది.. ఇదెలా పోవాలి?
మనసులో ఏదో పెట్టుకొని మహిళలను దూరం పెట్టినప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలి. వారికి ఇవ్వాల్సిన స్థానం వారికి ఇచ్చి గౌరవించాలి. వారిని కాపాడటం కోసమో, భౌతికంగానో, ఇతరత్రా కారణాల చేతనో వారి రక్షణ కోసం ఏర్పాటు చేసిందయితే.. దానిని సక్రమంగా వివరించి కొనసాగించాల్సి ఉంటుంది.  చటుక్కున వాటిని తీసేయడం కూడా ప్రమాదమే! ఇది రక్షణ కోసం ఏర్పాటు చేసిందని వివరణ ఇవ్వాలి. అది అపోహ అయినప్పుడు, అది మౌఢ్యం అయినప్పుడు దానిని తొలగించి వారి స్థానాన్ని వారికివ్వడమే మర్యాద.
* రామాయణంలో రాముడి ద్వారా సమాజాన్ని చూపించారు వాల్మీకి. అటువంటి రామాయణంలోనూ ఎవరో ఏదో అన్నారనో సీతమ్మను అరణ్యవాసానికి పంపించడంలో ఎటువంటి ధర్మం ఉంది?
చాలాకాలంగా రామాయణంపై జరుగుతున్న చర్చల్లో వస్తున్న ప్రశ్న ఇది. రాముడి మనసులో సీతమ్మ మీద అసలు అనుమానం లేనే లేదు. బాగా ప్రేమ ఎక్కడ ఉంటుందో.. అక్కడ వచ్చే ఆలోచన ఏంటంటే.. అవతల వారు మానసింగా ఎదుర్కొనేటువంటి సంఘర్షణ ఇవతలి వారు అనుభవిస్తారు. సీతమ్మ మీద అనుమానం ఉంటే రాముడు ఆమెను అయోధ్యకు తీసుకెళ్లే ప్రయత్నమే చేయడు. కానీ, లోకం సరైంది కాదు.. ఏది పడితే అది మాట్లాడేస్తుంది. అయోధ్యకు వెళ్లిన తర్వాత ఎవడో ఒకడు ఏదో అంటే.. సీతమ్మ చాలా బాధపడుతుంది. ఆమెను ఎవ్వరూ ఏమీ అనకూడదనీ, ఆమె అలా బాధపడకూడదనీ.. సీతమ్మను అగ్ని ప్రవేశం చేయించారు. అగ్నిహోత్రుడు ఆమెను మహాపతివ్రత అన్నారు. ఉత్తరకాండలో సీతమ్మను పరిత్యజించడానికి ముందు.. ఒక గూఢచారి వచ్చి సీతమ్మను ఇలా అంటున్నారని రామునితో చెప్పాడు. రాముడు వెంటనే నిర్ణయం తీసుకోలేదు. మిత్రులతో మీరేం అనుకుంటున్నారని అడిగాడు. మిత్రులు కూడా గూఢచారి చెప్పిన మాటకు అనుకూలంగానే మాట్లాడారు. ఇది ‘ఇవ్వాళ ఇక్కడి వరకు వచ్చింది. ఆమె గర్భవతి. ఈ మాట రేపు అంతఃపురానికి వస్తుంది. చెలికత్తెలు ఏం మాట్లాడుకుంటున్నా.. నా గురించేనేమో అని సీత అనుకొని బాధపడుతుంది. మానసికంగా కుంగిపోతే సంతానం తేజోవంతంగా ఎలా పొందగలుగుతుంద’ని ఆలోచించాడు రాముడు. ఆమె ప్రశాంతంగా ఉండి సంతానం కనాలని వనాలకు పంపించాడు. సీతారాములు రెండు కాదు ఒక్కటే అని సీతమ్మే చెప్పింది. రామాయణం సహృదయంతో అర్థం చేసుకుంటే.. రాముడెప్పుడూ సీతమ్మను వదిలిపెట్టేయలేదన్న విషయం మనకు దృఢంగా అర్థమవుతుంది. అందుకే సీతమ్మ భూమిలోకి వెళ్లిపోతే.. రాముడు సరయూలోకి వెళ్లిపోయాడు. ఇంక రాముడు సీతమ్మను వదిలేశాడన్న ప్రశ్నే రాదు. అదే నిజమైతే నేటికీ పెళ్లిపత్రికలపై సీతారాముల బొమ్మలు వేసి, వారి శ్లోకాలను ఎందుకు అచ్చు వేయిస్తా?.
* రామాయణం కంటే భారతం ముందు జరిగిందని కొందరంటారు. కానీ శాస్త్రం ప్రకారం రాముడు ముందు.. కృష్ణుడు తర్వాత అంటారు. మీరు దీన్నెలా వివరిస్తారు?
ఇతిహాసం అంటే... ఇది ఇట్లే జరిగిందని అర్థం. ఇక ఇందులో అనుమానాలేం లేవు. రామాయణ కర్త వాల్మీకీ రామాయణంలో భాగం. భారత కర్త వ్యాసుడు భారతంలో భాగం...  వాళ్లు రాసిన ఈ రచనల్లోనే రామాయణం త్రేతాయుగంలో జరిగిందని చెప్పారు. మహాభారతం ద్వాపర యుగంలో జరిగిందని రాశారు. అంటే రామా అవతారం తర్వాత... కృష్ణావతరం.
* చాతుర్‌వర్ణ వ్యవస్థలో చెప్పేందేమిటి? ఇప్పుడు కులాల పేరుతో జరుగుతోందేమిటి?
గుణాలతో ఎవరు ఏదైనా కావచ్చు. విశ్వామిత్రుడు రాజు. బ్రహ్మర్షి అయ్యాడు. రామాయణమే అంగీకరించిందిగా! ఇక సంకుచిత ప్రయోజనాలు, అధికారం ఆశించే వాళ్లు మనుషులను విభజించి లబ్ధి పొందడానికి చూస్తుంటారు. వారి గురించి వ్యాఖ్యానించను.
* ఎంతో ఆడంబరంగా, బాగా ఖర్చు పెట్టి కొందరు పూజలు చేస్తుంటారు. ఇలా చేస్తే దైవం మనల్ని కరుణిస్తాడని నమ్మకంతో ఉంటారు. ఇలా గొప్పగా చేస్తేనే  ఫలితం ఉంటుందంటారు కొందరు. వీరికి మీరిచ్చే సలహా?
ప్రపంచంలో ప్రతీ ఒక్కటీ దేవుడు సృష్టించినవే కదా! మరి అన్నీ ఆయనవే అయినప్పుడు మనల్ని ఎందుకు అడుగుతాడు? ఫలానా ఉపకరణం సమర్పించి పూజ చేస్తేనే మిమ్మల్ని అనుగ్రహిస్తానని ఎందుకు చెబుతాడు. భగవంతుడు పూజలో మనసు అడిగాడు. ధర్మబద్ధంగా బతకడమే అతి గొప్ప పూజ. అరగంటో, గంటో పూజ చేస్తావు. మరి 23 గంటలు అధర్మంగా బతికితే భగవంతుడు అనుగ్రహిస్తాడా? దేవుడు చెప్పింది మనం ఆచరిస్తే ఆయన సంతోషిస్తాడు గానీ... ఏవేవో సమర్పించి పెద్దపెద్ద పూజలు చేస్తే అనుగ్రహించడు.
* పెళ్లి అంటే ఆడంబరాలేనా? కొందరు లక్షలు ఖర్చుపెట్టి ఆర్థికసంక్షోభంలో కూరుకుపోతున్నారు. పెళ్లి చేయటానికి ఏ రకమైన విధానం ఉండాలి?
పెళ్లిలో ఆడంబరం అనే పదానికి స్థానం లేదు. వివాహ క్రతువు దాన్ని కోరలేదు. పెళ్లిద్వారా గృహస్థాశ్రమంలోకి వచ్చి ధార్మికమైన సంతానాన్ని పొందాలి. తన కామాన్ని ధర్మంతో ముడివేయాలి. ధర్మపత్నిని స్వీకరించి సమాజానికి పనికొచ్చే పనులు చేయాలి. దంపతుల మధ్య ఉండవలసింది అవగాహన. ఇద్దరు సమాజంలో ఆదర్శవంతంగా బతకాలి.  ఇంత పవిత్రమైన వివాహ క్రతువుకు ఇన్నివేలమంది రావాలి.. యాభై వంటకాలుండాలి.. ఇన్ని పట్టుచీరలు, ఇంతబంగారం పెట్టాలి.. అని ఎక్కడా ఎవరూ ప్రస్తావించలేదు. మీదగ్గర చాలా డబ్బు ఉంటే మీ అమ్మాయి పెళ్లి చేసి.. మిగిలిన డబ్బుతో పేదమ్మాయి పెళ్లిచేసి ఆదర్శంగా ఉండమంటాను.
* ఈ మధ్య యువత ఆత్మహత్యలకు పాల్పడుతోంది. దీనికి కారణం వ్యక్తిత్వాన్ని నిర్మించుకోలేకపోవటమా? నైరాశ్యమా?
దీనికి పిల్లలను మాత్రమే అననక్కర్లేదు. తల్లిదండ్రులు, బంధువులు, సమాజం, విద్యాలయాలు, ప్రభుత్వం.. అన్నింటికీ సమాన భాగస్వామ్యం ఉందంటాను. సీతమ్మ జీవితంలో ఎన్ని కష్టాలు పడిందో.. పాండవులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో.. నెల్సన్‌ మండేలా ఎన్ని బాధలు పడ్డాడో.. అయినా వీరంతా బతికి చూపించారు కదా. కష్టాలు పడనివాడెవ్వడూ ఉండడు. పిల్లలకు అబ్దుల్‌కలాం జీవితం గురించి చెప్పరు. మహాత్ముల జీవితచరిత్రలు పిల్లలకు అందుబాటులో ఉండవు. పాఠ్యాంశాల్లోకి తీసుకురారు. ఓ పండుగొస్తే మేనమామగానీ, పెద్దనాన్నగానీ మంచి పుస్తకం తీసుకొచ్చి పిల్లలకు ఇవ్వరు. ఇంట్లోవాళ్లు మంచి పుస్తకాలు చదివి భోజనం చేసేప్పుడు పిల్లలకు చెప్పరు. ఎంతసేపు పిల్లలు ఇంటికొచ్చినప్పటి నుంచి 99.9 శాతం మార్కులు వచ్చాయా లేదా అనే ప్రశ్ననే ఉంటుంది. ఆ పిల్లవాడు చదువైతే చదువుకున్నాడు. అయితే జీవితంలో చిన్న ఎదురుదెబ్బ తగిలినా తట్టుకోవటానికి మార్గం తెలీదు. అంతలా కూరుకుపోతున్నాడు. ఈ వ్యవస్థ మార్పు చెందాలంటే.. రామాయణం, భారతం ఛాందసాలు అనటం మానాలి. నెల్సన్‌మండేలా, అబ్దుల్‌కలాం జీవితాలు ఇప్పుడు మా అబ్బాయికెందుకు?అని తల్లిదండ్రులు అన్నన్నాళ్లు ఈ నైరాశ్యం నుంచి పిల్లలు బయటపడే అవకాశం లేదు.


ధర్మం మారుతూ ఉంటుంది. సత్యం ఎప్పడూ ఒక్కలాగే ఉంటుంది. ధర్మాన్ని పట్టుకోగా..పట్టుకోగా చివరికి సత్యంలోకి వెళతాం. ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండటం ధర్మం. ఉదాహరణకు కొడుకు ముందు నిల్చుంటే తండ్రిలా ఉండాలి. భార్య వద్ద భర్తలా మెసలాలి. ఇది ధర్మం. ఇలా తండ్రిలా, భర్తలా మారుతూ...మారుతూ.. చివరకు ఆత్మగా ఈ మార్పులేకుండా ఉండిపోవడమే సత్యం. ధర్మం... అనుష్టించగా... అనుష్టించగా సత్యం అవుతుంది. ఆ సత్యమే భగవంతుడు.
మనకు దేవతామూర్తులు ఎక్కువ. పూజలు ఒక్కటే. భగవంతుడిని ఏ రూపంలో రమ్మని భక్తుడు అడుగుతాడో ఆ రూపంలోనే వెళ్తాడు. పరమహంస.. ఈ ప్రశ్నకే ఓ మాటంటాడు. ఓ వ్యక్తి చెట్టుమీద ఉండే పురుగు ఎర్రగా ఉందంటాడు. మరొకరు పసుపు అంటాడు. అక్కడ కూర్చున్న వ్యక్తి పకపకా నవ్వి.. ఆ పురుగు ఊదా రంగులో ఉందని చెప్పాడు. ఈశ్వరుడంతే. ఉన్నది ఒక్కడే. ఎవరికి ఎలా చూడాలనిపిస్తే అన్ని రూపాల్లో భగవంతుడు కనిపిస్తాడ
రామావతారంలో... రాముడు ఏం చేశాడో మనిషి దాన్ని చేయాలి. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా తట్టుకొని నిలబడ్డాడు రాముడు. మనిషీ అదే చేయాలి.
కృష్ణావతారంలో... కృష్ణుడు ఏం చెప్పాడో అలా చేయాలి. ఎందుకంటే కృష్ణావతారంలో కొన్ని అద్భుతాలుంటాయి. అవన్నీ మనిషి చేయలేడు. అందుకే కృష్ణుడి మాటలను  అనుసరించాలి.
జోతిష్యం.. వేదాలకు ఉపాంగం. నేత్ర స్థానంలో ఉంటుంది. భవిష్యత్తును దర్శించి... పరిహారం చెబుతుంది. అయితే జోతిష్యాన్ని సరిగ్గా అధ్యయనం చేయకుండా కొందరు చేసేది నాకు నచ్చదు. ఒక వైద్యుడు కుడికాలికి చేయాల్సిన శస్త్రచికిత్స ఎడమ కాలికి చేశాడనకో... అది వైద్యుడి తప్పు... అంతేగానీ వైద్యశాస్త్రం మొత్తంది కాదు. జోతిష్యంలో తప్పు లేదు. జోతిష్యం ఓ శాస్త్రం. దీన్ని ఉపయోగించి సమాజ సంరక్షణకు ఏదీ చెప్పాలో అది చెప్పాలి. తగినంత పరిజ్ఞానం లేకుండా వ్యాపారంగా మార్చడాన్ని నేను సహించను.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...