Friday, May 19, 2023

బలిపీఠం

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!!

ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది.

గర్భగుడి, విమానం, విగ్రహం (మూలమూర్తి), బలిపీఠం ఇవి నాలుగూ ఉంటేనే దాన్ని దేవాలయం అంటారు.

కనుక ఆలయంలో బలిపీఠం ప్రముఖమైనది. ఆలయంలోని మూలమూర్తికి, ఇతర పరివార దేవతలకు నైవేద్యం సమర్పించాక చివరగా అష్టదిక్పాలకులకు బలిపీఠంపై బలి సమర్పిస్తారు.

గర్భగుడిలో ఆంతరంగికంగా శాంతి మంత్రాలతో జరిగేది నైవేద్యం. ఆరుబయట బహిరంగంగా ఆవరణ దేవతలకు సమర్పించేది బలి.

బలిప్రదానం వలన దేవతలకు పుష్టి కలుగుతుంది. ప్రాచీన దేవాలయాలలోని బలిపీఠాలు ఇంత కళాత్మకంగా ఉండవు. మొరటు రాతిస్తంభం వలె ఉండేవి.
శిల్పరత్నం మట్టితో, కొయ్యతో కూడా బలిపీఠాలు నిర్మించవచ్చని చెప్పింది.

విష్ణుతిలక సంహిత, మానసార శిల్పశాస్త్రం గ్రంథాలు గోపురం బయట, లేక మొదటి ప్రాకారానికి బయట బలిపీఠాన్ని నిర్మించాలని చెప్పాయి.

తిరుమల, దారాసురం వంటి ఆలయాలలో బలిపీఠం ప్రాకారానికి బయటే ఉంటుంది.గర్భగుడిపై ఉన్న విమానం, గుడికి ముందు ఉన్న బలిపీఠం రెండూ ఒకటే అని నారాయణ సంహిత చెప్పింది.

విమానం ముకుళితపద్మం (ముడుచుకుని ఉన్న తామర) వలె ఉంటే బలిపీఠం వికసితపద్మం (విరిసిన కమలం) వలె ఉంటుంది.

దేవాలయంలో కేంద్రీకృతమైన శక్తి చైతన్యం విమానం ద్వారా పైకి ప్రవహిస్తే, బలిపీఠం ద్వారా అడ్డంగా ప్రవహిస్తుంది.

ఆలయపురుషుని నాభి ప్రదేశంలో బలిపీఠం ఉంటుంది. కనుక ఆలయానికి ఇది కేంద్రస్థానం అని భావించాలి.

ఆలయానికి ముందు తూర్పున పెద్దగా ఉండే బలిపీఠాన్ని ప్రధాన బలిపీఠం అంటారు.

ఇవి కాక ఆలయం చుట్టూ ఎనిమిది దిక్కులలోనూ చిన్న చిన్న బలిపీఠాలను ఏర్పరచి ఇంద్రాది దేవతలకు బలివేస్తారు.

తిరుమల ఆలయం చుట్టూ వీటిని మనం చూడవచ్చు. శివాలయంలో బలిపీఠాన్ని భద్రలింగంగా పిలుస్తారు.

ఇందులో శివుడు సదా ఉంటాడని, బలిపీఠాన్ని దర్శించినా శివదర్శనం అయినట్లే అని శైవాగమాలు చెబుతున్నాయి.

ముఖమండపం చేరే ముందు భక్తులు బలిపీఠానికి ప్రదక్షిణ చేసుకుని సాష్టాంగ నమస్కారం చేసి తనలోని అహంకారాన్ని బలిగా అక్కడ విడిచి బలిపీఠం నుండి వచ్చే దైవీకశక్తిని తనలో నింపుకుని దైవదర్శనానికి వెళ్లాలి.

బలిపీఠానికి ప్రదక్షిణ చేసే వీలు లేకపోయినా తాకి నమస్కరించవచ్చు. బలి వేసిన అన్నం ఆయా దేవతలకు మాత్రమే.

మానవులు దాన్ని భుజించకూడదు.బలిపీఠ దర్శనంతో మానవులలోని సమస్త దుర్గుణాలు తొలగిపోతాయి.
written_by 
G.S.S.S సోమయాజులు శర్మ గారు.

Tuesday, January 24, 2023

రథసప్తమి వైశిష్ఠ్యం పఠించాల్సిన శ్లోకాలు..?

సూర్యుడే మనకు కనిపించే ప్రత్యక్ష దైవం. ఆయన వల్లనే నేలపై జీవరాశులు మనగలుగు తున్నాయి. భౌతిక దృష్టికి గోచరించని సూర్యుని విశిష్టతలను మన ధర్మం గుర్తించి కొనియాడింది. సూర్యారాధన అత్యంత ప్రాచీన సంప్రదాయం. లోకరక్షణ కోసం సూర్యుడు రథాన్ని అధిరోహించిన రోజు రథసప్తమి. ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు దేనిని కోరేవారైనా సూర్యుని ఆరాధించాలి.


సూర్యనారాయణ మూర్తి, లోకబాంధవుడు, ఆదిత్యుడు, ఆదిదేవుడు అంటూ సూర్యుడిని అనేక పేర్లతో పిలుస్తాం..ఇక హిందువులు మాఘ శుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగ జరుపుకుంటారు. ఇతర నెలల్లో వచ్చే సప్తమి తిథులకన్న మాఘమాసంలో వచ్చే సప్తమి అత్యంత విశిష్టమైంది.


రథసత్పమి అని పిలవడానికి కారణం..? ‘సప్తానాం పూరణీ సప్తమీ’ అంటే ఒకటి నుండి ఏడు వరకూ గల స్థానాలు పూరించేది సప్తమి, సూర్యరథ గమనానికి కారణమైంది కనుక ఈ పండుగకు రథసప్తమి అని పేరుపెట్టారు పెద్దలు. కొందరు రథ సప్తమినే సూర్యజయంతి అంటారు. కానీ నిజానికి సూర్యుడు పుట్టినరోజు కాదిది. సూర్యుడు తన ఉష్ణచైతాన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్నెక్కి విధులలో ప్రవేశించిన రోజు ఇది. అయితే లోకంలో సూర్య జయంతిగా పిలవబడుతూ ఉంది. ఇక్కడ రథారోహణమే ప్రధానకృత్యం. లోకబాంధవ ధర్మానికి సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది.


ఇక రామ రావణ యుద్ధ సమయంలో అలసిన శ్రీరాముడికి అగస్య మహాముని ఆదిత్య హృదయం ను 30 శ్లోకాలుగా ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది. ఈ శ్లోకాలను పఠించినవారికి శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు దరిచేరవని నమ్మకం. ఆదిత్యుని ఆరాదిస్తే.. తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయని పెద్దల నమ్మకం.


ఇక మాఘ శుద్ధ సప్తమి సూర్య గ్రహణముతో సమానమని.. అందుకనే ఆరోజు వేకువజామునే స్నాన, జప, అర్ఘ్యప్రదాన, తర్పణ, దానం వంటి కార్యాక్రమాలను నిర్వహిస్తే.. సప్త జన్మల పాపాలు నశించి.. ఆయురారోగ్య సంపదలను ఇస్తుందని నమ్మకం. అయితే రథ సప్తమి రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి .. జిల్లేడాకులు, రేగుపండు తలపై పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి “అర్కః” అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి.


రథసప్తమి రోజున స్నానం చేసే సమయంలో పఠించవల్సిన శ్లోకాలు : ..


నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః అరుణాయ నమస్తేస్తు హరివాస నమోస్తుతే!!


యద్యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు! తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ!!


ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్! మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!!


ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే! సప్త వ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమీ!!


రథసప్తమి రోజున నిర్వహించాల్సిన పూజా విధానం: గంధంతో అష్టదళ పద్మాన్ని లిఖించి, ఒక్కొక్క దళం చొప్పున రవి, భాను, వివస్వత, భాస్కర, సవిత, అర్క, సహస్రకిరణ, సర్వాత్మక – అనే నామాలు గల సూర్యుణ్ణి భావించి పూజించాలి. ఎర్ర చందనం, ఎర్రని పువ్వులతో సూర్యుని పూజించడం అత్యంత విశిష్టమైనది.


ఇక ఆవు పేడతో చేసిన పిడకలమీద క్షీరాన్నాన్ని వండి సూర్యుడికి నైవేద్యంగా పెట్టాలి. అలా క్షిరాన్నాన్ని చెరకు ముక్కతో కలుపుతూ తయారు చేయాలి. అలా వండిన దానిని నైవేద్యంగా సూర్యుడికి చిక్కుడు ఆకులలో వడ్డించి నివేదించాలి.


చిక్కుడు, జిల్లేడు, రేగు ఆకుల్లో సౌరశక్తి విశేషంగా నిక్షిప్తమై ఉంటుంది. జిల్లేడు, రేగు, దూర్వాలు, ఆక్షతలు, చందనాలు కలిపిన నీటితోగాని, పాలతో గాని, రాగిపాత్ర ద్వారా అర్ఘ్యమివ్వడం మంచిది.


ఇక హిందువులు చేసే పూజలు, వ్రతాలు అన్ని శివ కేశవులకొరకే.. ఆ ఇరువురికి ఇష్టమైన మాసం మాఘమాసం. అంతేకాదు రథసప్తమి నుంచి వేసవి కాలం ప్రారంభం అని భావిస్తారు. అందుకనే ఆరోగ్య ప్రదాతగా సూర్యుభగవానుణ్ణి పూజిస్తారు. ఈ మహా పర్వదినాన ఆ సూర్య భగవానుని భక్తీ శ్రద్ధ లతో పూజించి పూర్తి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందుదాం.


రథ సప్తమి రోజున చదవాల్సిన స్తోత్రాలు:- ఆదిత్యహృదయం, సూర్య స్తోత్రం, నవగ్రహ స్తోత్రం తప్పక పారాయణ చేయడం సకల శ్రేయోదయకమని గురు వాక్యం. సూర్యుడు మకరంలో ఉండగా వచ్చే ఈ దివ్య సప్తమి నాడు సూర్యుని నమస్కరించి పై శ్లోకాలు చదివి స్నానం చేస్తే సమస్త వ్యాధులు, ఇబ్బందులు తొలగుతాయని శాస్త్రవచనం. ఈ జన్మలో చేసిన .. గత జన్మలో చేసిన.. మనస్సుతో.. మాటతో. శరీరంతో.. తెలిసీ.. తెలియక చేసిన సప్తవిధాలైన పాపాలను పోగొట్టేశక్తి ఈ రథసప్తమికి ఉంది. ఈ రోజున తల్లిదండ్రులు లేని వారు వారికి తర్పణం విడవడం ఆచారంగా వస్తుంది.


ఇక రథ సప్తమి రోజున సంతాన ప్రాప్తి కోసం, రోగ నివారణ కోసం పెద్దలు ఒక వ్రతాన్ని చూచించారు.


స్నానానంతరం అష్టదల పద్మాన్ని బియ్యం పిండితో వేసి అందులో సూర్య నామాలు చెప్తూ 7 రంగులు నింపాలి. అష్ట దళ పద్మ మధ్యలో శివ పార్వతులను పెట్టి పక్కనే ఒక కొత్త తెల్లని వస్త్రం పరిచి దానిమీద సూర్యుడు రథాన్ని నడుపుతున్న (బంగారు ప్రతిమ) ఓ ప్రతిమని ఏర్పరచాలి. అనంతరం కుంకుమాదులు దీపములతో అలంకరించాలి. ఎర్రని రంగుగల పువ్వులతో సూర్యుడిని పూజించాలి., సంకల్పం చెప్పుకోవాలి. ఎవరి రోగ నివారణ కోసం చేస్తున్నామో లేదా ఎవరికీ సంతానం కలగాలని చేస్తున్నామో వారి పేరు గోత్రనామలు చెప్పుకొని పూజ చేసి అనంతరం ఆ సూర్యుడిని ప్రతిమను గురువునకు దానం ఇవ్వాలి.


ఇలా ప్రతి నెల సప్తమి రోజు సూర్య భగవానుడికి నమస్కరించి సంకల్పం చెప్పుకుని ఉపవాసం ఉండాలి. ఎలా ఏడాది పటు నియమ నిష్టలతో సూర్యుడిని పూజించాలి. సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇవ్వాలి.




నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...