Wednesday, December 12, 2018

హనుమాన్ వ్రత విధానం

మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు భయ, పీడా, నివారణార్థం హనుమద్వతం త్రయోదశీ వ్రతం జరుపుతారు.

మార్గశీర్షే త్రయోదశ్యాం - శుక్లాయాం జనకాత్మజా |
దృష్ట్యా దేవీ జగన్మాతా - మహావీరేణ ధీమతా ||

మృగశిరానక్షత్రం హనుమంతునికి ఇష్టమైనది. భక్త సులభుడైన హనుమంతుని అనుగ్రహం పొందటానికి దివ్యమైన మార్గం, మార్గశిర త్రయోదశినాడు హనుమంతుని పూజించి, హనుమంతుని ఆయన శక్తిస్వరూపమైన సువర్చలాదేవిని పంపానదిని కలశంలోకి ఆవాహనచేసి పూజించి, హనుమత్ కథలను శ్రవణం చేసి హనుమత్ ప్రసాదం తీసుకుని వ్రతం పూర్తిచేసుకుంటారు. పదమూడు ముళ్ల తోరాన్ని ధరిస్తారు . ఈవిధంగా పదమూడుసంవత్సరాలు వరుసగా చేస్తే హనుమంతుని సంపూర్ణ అనుగ్రహం వ్రతమాచరించిన వారికి కలుగుతుంది అని శాస్త్రవచనం. హనుమంతుడు పంపాతీరంలో విహరించేవాడు కాబట్టి ఈ వ్రతాన్ని పంపానదీతీరంలోనే చేసుకోవాలి. ఇది అందరికీ అసాధ్యం కనుక పంపాతీరానికి బదులు పంపాకలశం ఏర్పాటు చేసి దాని పక్కనే శ్రీ హనుమద్ర్వతం ఆచరిస్తే హనుమంతుడు పంపాతీరంలో వ్రతం ఆచరించినట్లు సంతోషించి అనుగ్రహిస్తాడు.

వ్రత కధ

శౌనకాది మహర్షులు సూత మహర్షిని శ్రీ హనుమ ఉద్భవాన్ని వివరించమని కోరారు. అప్పుడు ఆయన కధ చెప్పాడు. వ్యాస మహర్షి ఒకసారి ద్వైతవనంలో వున్న పాండవుల దగ్గరకు వచ్చాడు. ధర్మరాజు, భార్య ద్రౌపదితో, సోదరులు సహా ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి లోపలికి ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు యిచ్చి భక్తిశ్రద్ధలతో సేవించాడు. వ్యాసుడు సంతోషించి ద్రౌపది పాతివ్రత్యాన్ని మెచ్చాడు. అందరు భక్తీ శ్రద్ధలతో చేయవలసిన వ్రతం వుందని దాన్ని వివరించాడు. అది కార్య సిద్ధిని కలిగిస్తుందనీ, వెంటనే ఫలితం లభిస్తుందని చెప్పాడు. అదే శ్రీ హనుమద్ వ్రతం. దుష్ట గ్రహాల్ని, వ్యాధుల్ని పోగొట్టి సకల శుభాలు, శ్రేయస్సు ఇస్తుందని దాన్ని ఆచరించి మళ్ళీ రాజ్యాన్ని పొందమని ఉపదేశించాడు. పూర్వం ఈ వ్రతాన్ని శ్రీ కృష్ణుడు ద్రౌపదికి బోధించి, దగ్గర వుండి వ్రతం చేయించాడని దాని ప్రభావం వల్లనే పాండవులకు అఖిల సంపదలు లభించాయని చెప్పాడు.

అయితే ఒకసారి అర్జునుడు ద్రౌపది చేతికి వున్న హనుమత్ తోరణాన్ని చూసి దాని వివరం అడిగాడు. ఆమె అన్నీ వివరంగా చెప్పగా, అతడికి గర్వం కలగటంతో కోతిని గూర్చిన వ్రతం ఏమిటని ఈసడి౦చాడు. తన జెండాపై కట్టబడ్డ వాడు, ఒక వానరుడు అయిన హనుమకు వ్రతం చేయటమేమిటని దుర్భాషలాడాడు. ఆమె ఏడుస్తూ తన అన్న శ్రీ కృష్ణుడు చెప్పి చేయించిన వ్రతం ఇది అని చెప్పింది. అయినా అర్జునుడి కోపం తగ్గలేదు. ఆమె చేతికున్న తోరాన్ని బలవంతంగా లాగి పారవేశాడు. అప్పటినుంచి పాండవులకు కష్టాలు ప్రారంభమైనాయనీ ఈ అరణ్య, అజ్ఞాత వాసాలు దాని ఫలితమేనని వ్యాసుడు ధర్మరాజుకు చెప్పాడు. పదమూడు ముడులు గల హనుమత్ తోరాన్ని తీసివేయటం వల్లే పదమూడు ఏళ్ళ అరణ్య, అజ్ఞాతవాసం అని వివరించాడు. కనుక వెంటనే హనుమత్ వ్రతం చేయమని హితవు చెప్పాడు. ధర్మరాజుకు సందేహం కలిగింది. పూర్వం ఎవరైనా ఈ వ్రతం చేసి ఫలితం పొందారా అని అడిగాడు.దానికి సమాధానంగా వ్యాసుడు ఒక కధ చెప్పాడు.

పూర్వం శ్రీ రాముడు సీతను వెదుకుతూ, తమ్ముడు లక్ష్మణునితో ఋష్యమూక పర్వతం చేరాడు. సుగ్రీవ, హనుమలతో సఖ్యం చేశాడు. అప్పుడు హనుమ రామునితో తన వృత్తాంతం అంతా చెబుతూ, దేవతలంతా తనకు ఎలాంటి వరాలు ప్రదానం చేశారో వివరించాడు. బ్రహ్మాదిదేవతలు హనుమతో ''హనుమా ! నువ్వు హనుమద్వ్రతానికి నాయకుడిగా ఉంటావు. నిన్ను ఎవరు భక్తీశ్రద్ధలతో పూజించి వ్రతం చేస్తారో వారి కోరికలన్నీ నువ్వు తీరుస్తావు'' అని బ్రహ్మ చెప్పిన మాటను రాముడికి చెప్పి నేను నీ బంటునని తేలిగ్గా చూడక నా వ్రతం చేసి ఫలితం పొందు. త్వరలో సీతాదర్శనం కలిగి రావణ సంహారం చేసి అయోధ్యాపతివి అవుతావు అని విన్నవించాడు హనుమ. అప్పుడు ఆకాశవాణి ''హనుమ చెప్పినదంతా సత్యమైనదే'' అని పలికింది. వ్రత విధానం చెప్పమని హనుమను రాముడు కోరాగా, మార్గశిర శుక్ల త్రయోదశి నాడు హనుమత్ వ్రతం చేయాలని హనుమ చెప్పాడు. పంపా నదీతీరంలో శ్రీరాముడు సుగ్రీవాదులతో వ్రతం చేశాడు. పదమూడు ముళ్ళ తోరంను పూజించి కట్టుకొన్నాడు. కాబట్టి సందేహం లేకుండా ధర్మరాజాదులను ఈ వ్రతం వెంటనే చేయమన్నాడు వ్యాసుడు. వ్యాసమహర్షి మాటలకు సంతృప్తులై ధర్మరాజు, భార్య, సోదరులతో వ్రతాన్ని విధివిధానంగా చేసి అంతా తోరాలు భక్తీ శ్రద్ధలతో కట్టుకొన్నారు.

గింజలు తినండొహో..!

‘మీ గుండె ఆరోగ్యంగా కొట్టుకోవాలనుకుంటున్నారా? అయితే రోజూ గుప్పెడు గింజలు తినండి అంటున్నారు వైద్యులూ పోషకనిపుణులు. గింజల్లోని అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండెకు ఎంతో మేలు చేస్తాయట. అందుకే ఒకప్పుడు అక్కడక్కడా మాత్రమే కనిపించే డ్రైనట్స్‌, ఈ మధ్య అన్ని దుకాణాల్లోనూ సందడిచేస్తూ, ఇంటింటా స్నాక్‌ఫుడ్‌గా మారుతున్నాయి.

బాదం... చాలా బలం..!
సూపర్‌ నట్స్‌గా చెప్పే బాదంలో సుగుణాలెన్నో. తల్లిపాలలోని ప్రొటీన్లు వీటిల్లో దొరుకుతాయి. బాదంలోని ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు కోలన్‌ క్యాన్సర్‌ను నివారిస్తాయనీ పిత్తాశయంలోని రాళ్లనూ తొలగిస్తాయన్నది సరికొత్త పరిశోధన. మిగిలినవాటితో పోలిస్తే బాదంలో శాచ్యురేటెడ్‌ కొవ్వుల శాతం తక్కువ. రోజూ కాసిని బాదంపప్పుల్ని ఆహారంలో భాగంగా చేసుకోవడంవల్ల బరువు తగ్గుతారు. వీటివల్ల పొట్టలో మంచి బ్యాక్టీరియా పెరిగి తద్వారా రోగనిరోధకశక్తీ పెరుగుతుంది. బాదంలో ఎక్కువగా ఉండే ఇ-విటమిన్‌ శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ చర్మ సౌందర్యాన్నీ పెంచుతుంది.

భల్లే భల్లే పల్లీ
లెగ్యూమ్‌ జాతికి చెందినప్పటికీ పోషకాల కారణంగా వీటినీ నట్స్‌ జాబితాలోకే చేర్చేశారు. శరీరభాగాలన్నీ సమన్వయంతో పనిచేయాలంటే శక్తితోపాటు ప్రొటీన్లు, ఫాస్ఫరస్‌, థైమీన్‌, నియాసిన్‌ పోషకాలు కీలకం. ఇవన్నీ పల్లీల్లో పుష్కలం. ఎ, బి, సి, ఇతో కలిపి మొత్తం 13 రకాల విటమిన్లూ; ఐరన్‌, కాల్షియం, జింక్‌, బోరాన్‌...వంటి 26 రకాల ఖనిజాలూ వీటిల్లో ఉన్నాయి. వంద గ్రా. పల్లీల్లో మెదడు ఆరోగ్యానికి అవసరమైన నియాసిన్‌ 85 శాతం లభ్యమవుతుంది. పల్లీల్లోని రెస్‌వెరాట్రల్‌ అనే పాలీఫినాలిక్‌ యాంటీఆక్సిడెంట్‌ క్యాన్సర్లనీ హృద్రోగాలనీ నరాల వ్యాధుల్నీ అల్జీమర్స్‌నీ వైరల్‌ ఇన్ఫె క్షన్లనీ నిరోధిస్తుంది. పోతే హీమోఫీలియా, రక్తహీనత ఉన్న రోగులకి పల్లీ చేసే మేలెంతో..!

కొవ్వును తగ్గించే పీకాన్స్‌
తియ్యని రుచితో ఉండే వీటిల్లో కూడా అక్రోట్లలో మాదిరిగానే అన్‌శాచ్యురేటెడ్‌ కొవ్వులు ఎక్కువ. ముఖ్యంగా ఒమేగా 6 ఫ్యాటీ ఆమ్లాలు చాలా ఎక్కువ. వీటిల్లో ఉండే స్టెరాల్స్‌కి కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉందన్నది జార్జియా యూనివర్సిటీ నిపుణుల కొత్త పరిశీలన. నాడీవ్యవస్థ పనితీరునీ మెరుగుపరుస్తాయీ గింజలు. వీటిల్లో ఎక్కువగా ఉండే ఎలాజిక్‌ ఆమ్లం క్యాన్సర్ల బారినపడకుండా కాపాడుతుంది.

మెదడుకు మేత... అక్రోట్లు
ఆల్ఫా లినోలిక్‌ ఆమ్లం అధికంగా ఉన్న గింజలు ఇవొక్కటే. ఇది పురుషుల్లో సంతాన సామర్థ్యాన్ని పెంచుతుంది. అక్రోట్లలోని మెలటోనిన్‌ నిద్రపట్టేలా చేస్తుంది. ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు రోగనిరోధకశక్తినీ తెలివితేటల్నీ జ్ఞాపకశక్తినీ పెంపొందిస్తాయి. డిప్రెషన్‌నీ నిరోధిస్తాయి. అందుకే ఇవి మెదడు ఆరోగ్యానికి మేలుచేస్తాయనీ, గర్భిణులు రోజూ కాసిని అక్రోట్లను తినడంవల్ల పిల్లల మెదడు పనితీరు కూడా బాగుంటుందనీ హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన పోషక నిపుణుల పరిశీలనలో తేలింది. వీటిల్లోని బయోటిన్‌ (బి7) జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది. ఇంకా ఫైటోస్టెరాల్స్‌ ఒత్తిడినీ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదాన్నీ అడ్డుకుంటాయి.

పైన్‌... ఆకలిమందు
అందంకోసం పెంచుతారనుకునే పైన్‌ చెట్ల గింజలూ అద్భుత పోషకనిల్వలే. ఓలియాక్‌ ఆమ్లం వంటి మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండటంవల్ల ఇవి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. వీటిల్లోని పినోలెనిక్‌ ఆమ్లం ఆకలిని తగ్గించే ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుందన్నది కొత్త పరిశీలన. అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లకివి ఎంతో మేలు. కంటిచూపుని మెరుగుపరిచే విటమిన్‌ ఎ, ల్యూటెన్‌లు వీటిల్లో ఎక్కువ. విటమిన్‌ డి, ఐరన్‌ కూడా ఎక్కువే.

బ్రెజిల్‌ నట్‌... ఒక్కటి చాలు!
రోజుకి ఒక్కటి లేదా రెండు తిన్నా చాలు... శరీరానికి అవసరమయ్యే రోజువారీ సెలీనియం నూటికి నూరుశాతం దొరుకుతుంది. ఎముక, ప్రొస్టేట్‌, రొమ్ముక్యాన్సర్లు రాకుండా ఉండేందుకూ థైరాయిడ్‌ హార్మోన్‌ పనితీరుకీ హృద్రోగాలూ కాలేయ వ్యాధులు రాకుండా ఉండేందుకూ ఈ సెలీనియం ఎంతో అవసరం. పుండ్లు త్వరగా తగ్గేందుకూ ఇది సాయపడుతుంది. ఆహారం ద్వారా జింక్‌ తీసుకోలేనివాళ్లకు అది అందేలా చేస్తుంది. అయితే సెలీనియం ఎక్కువైనా కష్టమే కాబట్టి వీటిని అతిగా తినకూడదు. అమెజాన్‌ అడవుల్లో ఎక్కువగా పెరిగే బ్రెజిల్‌నట్స్‌ బీకాంప్లెక్స్‌కీ మంచి నిల్వలు. స్థానికులకు ఇవే శక్తి వనరులు.

కంటికి కాసిని పిస్తా...
పిస్తా పప్పుల్లేని కుల్ఫీని వూహించలేం. స్వీట్లూ ఐస్‌క్రీముల్లోనే కాకుండా రోజూ కాసిని పిస్తా గింజల్ని తినడంవల్ల చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది. బీపీ అదుపులో ఉంటుంది. వీటిల్లో అధికంగా ఉండే విటమిన్‌- ఇ, పాలీఫినాలిక్‌ యాంటీ ఆక్సిడెంట్లూ, కెరోటిన్లూ హానికారక ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి, క్యాన్సర్లూ ఇన్ఫెక్షన్లూ రాకుండా కాపాడతాయి. ఈ నట్స్‌లోని కొన్ని రకాల యాంటీఆక్సిడెంట్లు వృద్ధాప్యంలో వచ్చే కంటి కండరాల బలహీనతను అడ్డుకుంటాయి. కాపర్‌, మాంగనీస్‌... వంటి ఖనిజాలు సమృద్ధిగా ఉండటంవల్ల ఆర్థ్రైటిస్‌, పక్షవాతం, మతిమరుపు, అలర్జీలు, జీవక్రియా లోపాలూ తలెత్తకుండా ఉంటాయి.

జీడిపప్పూ తినొచ్చు...
‘అమ్మో జీడిపప్పే, కొలెస్ట్రాల్‌’ అనేస్తుంటారంతా. కానీ ప్రకృతి ఇచ్చిన గొప్ప విటమిన్‌ మాత్రలివి. ఐరన్‌, జింక్‌లకు మంచి నిల్వలు. రక్తహీనతని తగ్గిస్తాయి. పుష్కలంగా ఉండే మెగ్నీషియం జ్ఞాపకశక్తిని పెంపొందించడంతోబాటు వయసుతోపాటు వచ్చే మతిమరుపునీ తగ్గిస్తుంది. ఎముకలూ చిగుళ్ల వ్యాధుల్నీ నివారిస్తుంది. ముఖ్యంగా మెగ్నీషియం నాడీకణాలూ రక్తనాళాలూ కండరాలూ కుంచించుకుపోకుండా చూస్తుంది. అదే లోపిస్తే కాల్షియం ఆయా కణాల్లోకి చొచ్చుకుపోయి బీపీ, తలనొప్పి, మైగ్రెయిన్‌... వంటివి రావడానికి ఆస్కారం ఉంటుంది. మెనోపాజ్‌ తరవాత నిద్రలేమితో బాధపడేవాళ్లు రోజూ కాసిని జీడిపప్పు తింటే సమస్య తగ్గుతుంది. ఇందులోని ప్రొయాంథోసైనడిన్స్‌ కోలన్‌ క్యాన్సర్‌నూ నిరోధిస్తాయి. వీటిల్లో కొద్దిపాళ్లలో ఉండే జియాజాంథిన్‌ రెటీనా కండరాల్లోకి చేరి కళ్లను హానికరమైన అతినీలలోహితకిరణాల నుంచి రక్షిస్తుంది.

ఔషధాల తల్లి... వెల్లుల్లి..!

ఘాటైన వాసన దాని సహజ లక్షణం. అందుకే దాన్ని చూడగానే చాలామంది ముక్కు చిట్లిస్తారు.కానీ అది లేని వంటిల్లు సాధారణంగా ఉండదు. ఎందుకంటే ఆ ఘాటే నోరూరించే రుచికి కారణం. ఆ ఘాటే ఆరోగ్యానికి అద్భుతమైన ఔషధం. అందుకే పప్పు నుంచి చికెన్‌ దాకా ఏది వండాలన్నా వెల్లుల్లి ఉండాల్సిందే. జలుబు చేసినా జ్వరం వచ్చినా వెల్లుల్లి తినాల్సిందే..!

‘‘వెల్లుల్లి బెట్టి పొగిచిన పుల్లగోంగూర రుచిని బొగడక వశమా’’
... అని జానపద సాహిత్యకారుడైన గువ్వల చెన్నడు చెప్పినట్లు గోంగూరకి అంతటి రుచి రావడానికి కారణం వెల్లుల్లే మరి. ఒక్క గోంగూర అనేముందీ... వంకాయ, దోసకాయ, టొమాటో... ఏ రోటి పచ్చడి చేయాలన్నా; ఆవకాయ, మాగాయ, దబ్బకాయ... ఏ ఊరగాయ పట్టాలన్నా వెల్లుల్లి ఘాటు తగలాల్సిందే.

ఇక, బిర్యానీలూ మసాలా కూరకైతే అల్లం తోడుగా వెల్లుల్లి ఉంటేనే వాటికా రుచి. పచ్చళ్లూ మసాలా వంటలే కాదు, పప్పుకూరలైనా కాసిని వెల్లుల్లి రెబ్బలు పడితే ఆ సువాసనే వేరు. మొత్తమ్మీద ఆధునిక గృహిణికయినా సంప్రదాయ బామ్మకయినా పోపులపెట్టెలో వెల్లుల్లిపాయ లేకపోతే వంట రుచించనట్లే. అంతగా ఆహారంలో భాగంగా మారిన వెల్లుల్లిని కేవలం మనదగ్గర మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగానూ ఇష్టంగా తింటున్నారు. ఐరోపా, అమెరికాల్లో ప్రాచుర్యం పొందిన బేకరీ పదార్థాల్లో గార్లిక్‌ బ్రెడ్‌ ఒకటి. అక్కడ వెల్లుల్లిని ఇతర నూనెల్లోనూ కలిపి వాడుతుంటారు. సాస్‌లా చేసుకుని మాంసాహారంతో కలిపి తింటుంటారు. మధ్యతూర్పు దేశాల్లో అయితే వినెగర్‌లో నిల్వచేసిన వెల్లుల్లి వాడకం ఎక్కువ. దీన్నే గార్లిక్‌ పికిల్‌ అంటారు. కొన్ని రోజులకి ఇవి నీలం రంగులోకి మారతాయే తప్ప పాడవవు. వీటినే బ్లూ గార్లిక్‌ పేరుతో వంటల్లో
వాడతారు. ఇంకా వెల్లుల్లిని చేప, మాంసం... వంటి వాటిని నిల్వచేసేందుకు కూడా ఉపయోగిస్తారు. మొత్తమ్మీద ఏదో ఒక రూపంలో వెల్లుల్లి వాడని ప్రాంతం ప్రపంచంలో లేదంటే అతిశయోక్తి కాదు.

మనది రెండో స్థానం..!
వెల్లుల్లిని పండించే దేశాల్లో అగ్రరాజ్యానిదే అగ్రస్థానం. రెండో స్థానం మనదే. ఆగ్నేయాసియా దేశాల్లో ఉల్లికాడల మాదిరిగానే వెల్లుల్లి కాడల్ని వంటల్లోనూ సూపుల్లోనూ వాడతారు. వీటినే గ్రీన్‌ గార్లిక్‌ అంటారు. సాధారణంగా వెల్లుల్లికోసం పండించేవాళ్లు మొక్కలకు పూత రాకుండా పూలొచ్చే కాడల్ని తుంచేస్తారు. లేదంటే నేలలో పాయ ఊరడానికి చాలా సంవత్సరాలు పడుతుంది.

మనకు తెలిసి వెల్లుల్లి... తెల్లగానే ఉంటుంది. ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒకటో రెండో పాయలు మాత్రం తెలుపూగులాబీ మిశ్రితమై కనిపిస్తుంటాయి. కానీ దాన్ని పండించే ప్రాంతాన్ని బట్టి వెల్లుల్లిలో ఎరుపూ, గులాబీ, ఊదా, గోధుమ... ఇలా ఎన్నో రంగులూ మరెన్నో ఛాయలూ. మన దగ్గర తెలుపురకం వెల్లుల్లిని ఎక్కువగా పండించినట్లే, సిసిలీలో ఎరుపూ, ఫ్రాన్స్‌లో గులాబీ, ఇటలీలో గోధుమరంగు రకాల్ని ఎక్కువగా పండిస్తుంటారు. భారీ సైజులో ఉండే గజ వెల్లుల్లి రకాన్ని  చైనీయులు పండిస్తుంటారు. అలాగే పూలకోసం పెంచే వెల్లుల్లి రకాలూ ఉన్నాయి.

ఎంత మంచిదో..!
ఓ పండో, కూరగాయో తిన్నట్లుగా వెల్లుల్లిని ఆహారంలో భాగంగా తినలేం. కాబట్టే పోషకాహారంగా కన్నా మాంఛి మసాలాద్రవ్యం, అద్భుత ఔషధంగానే వాడకం ఎక్కువ. అలాగని వెల్లుల్లిలో పోషకాలకేమీ లోటు లేదు. ఖనిజాలతోబాటు బి-విటమిన్‌ రకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులోని అలిసిన్‌ అనే కర్బన పదార్థం, అనేక వ్యాధుల్ని నివారించే ఔషధంగా పనిచేస్తుంది. అందుకే ఇది ఓ మల్టీవిటమిన్‌ ట్యాబ్లెట్‌లా పనిచేస్తుంది అంటారు నిపుణులు.

* వెల్లుల్లిలోని అలిసిన్‌ రక్తనాళాల్లోని ఒత్తిడిని తగ్గించి, బీపీని తగ్గిస్తుంది. రక్తంలో గడ్డలు ఏర్పడకుండానూ చేస్తుంది. తద్వారా హృద్రోగాలు వచ్చే అవకాశం తగ్గుతుంది. అంతేకాదు, రోజూ ఒకటి రెండు రెబ్బల్ని తినడంవల్ల బీపీ తగ్గడంతోబాటు రక్తంలో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరైడ్స్‌ శాతం తగ్గినట్లు పరిశోధనల్లో తేలింది.

* ఇది జీర్ణాశయ, పేగు క్యాన్సర్లనీ నిరోధిస్తుంది. మొత్తంగా వెల్లుల్లి 13 రకాల ఇన్ఫెక్షన్లనీ, 14 రకాల క్యాన్సర్లనీ నివారిస్తుందని ‘అమెరికన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ క్యాన్సర్‌ రిసెర్చ్‌’ సైతం పేర్కొంది.

* వెల్లుల్లిలో యాంటీబ్యాక్టీరియల్‌, యాంటీఫంగల్‌, యాంటీసెప్టిక్‌ గుణాలు అత్యధికం. అందుకే మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో గాయాలకు మందుగా వెల్లుల్లి రసాన్ని వాడారట. ఆ రసంలో కొన్ని చుక్కల నీళ్లు కలపాలి. లేదంటే మంట తట్టుకోలేరు. వెల్లుల్లిని తినడంవల్ల జీర్ణసంబంధ సమస్యలు తగ్గుతాయి.

* మధుమేహ రోగులకు మూత్రపిండాలు, గుండె, కంటికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి వాళ్లు వెల్లుల్లిని తినడంవల్ల ఆయా దుష్ఫలితాలు తలెత్తకుండా ఉంటాయి. వెల్లుల్లిలోని సెలీనియం, క్యుయెర్టిసిన్‌, విటమిన్‌-సి వంటి పోషకాలు ఇన్ఫెక్షన్లనీ వాపుల్నీ తగ్గించేందుకు తోడ్పడతాయి.

* చెవినొప్పికి రెండుమూడు చుక్కల వెల్లుల్లి రసం కలిపిన కొబ్బరి లేదా ఆలివ్‌ నూనె బాగా పనిచేస్తుంది. జలుబూ దగ్గులతో బాధపడేవాళ్లు రెండు పచ్చి రెబ్బలు నలగ్గొట్టి తింటే, తీవ్రత తగ్గుతుంది.

* శ్వాసకోశంలో ఇన్ఫెక్షన్లనీ, శ్లేష్మాన్నీ కూడా తగ్గిస్తుంది వెల్లుల్లి. అందుకే ఆస్తమా రోగులు నిద్రపోయే ముందు మూడు ఉడికించిన రెబ్బలు తిని, గోరువెచ్చని పాలు తాగితే మంచి నిద్ర పట్టి ఉపశమనం కలుగుతుంది. పొట్టలోని హానికర బ్యాక్టీరియానీ నాశనం చేస్తుంది. అందుకే డయేరియా, డీసెంట్రీలతో బాధపడేవాళ్లు వెల్లుల్లి రెబ్బల్ని రెండుమూడుచొప్పున రోజుకి మూడుసార్లు తింటే మేలు.

* శృంగారప్రేరిత ఔషధం కూడా. నరాల బలహీనతతో బాధపడేవాళ్లు ఆహారంలో భాగంగా వెల్లుల్లిని తింటే ఫలితం ఉంటుంది.

ఆహారంలో ఎక్కువగా తీసుకోలేనివాళ్లు జ్యూస్‌లా చేసుకుని అందులో కాసిని నీళ్లు కలుపుకుని తాగినా మంచిదే. ఇది ఆరోగ్యానికే కాదు, చర్మ సౌందర్యానికీ జుట్టు పెరగడానికీ తోడ్పడుతుంది. దీనివల్ల జీవక్రియావేగం పెరిగి బరువు పెరగరు. అందుకే ‘అబ్బా వెల్లుల్లా...’ అంటూ ముక్కూ మొహం చిట్లించకుండా వీలైనంత ఎక్కువగా వెల్లుల్లిని తినండి.

ఏకపాయ వెల్లుల్లి..!

వెల్లుల్లిపాయ అంటేనే అనేక రెబ్బలు కలిసిన పాయ. కానీ ఒకటే పాయ ఉండే సోలో గార్లిక్‌ రకం కూడా ఉంది. దీన్నే సింగిల్‌ క్లోవ్‌ ఆర్య గార్లిక్‌ అనీ పిలుస్తారు. చైనాలో పుట్టిన ఈ రకాన్ని ఈ భూమ్మీద ఉన్న అత్యంత శక్తిమంతమైన ఔషధాల్లో ఒకటిగా చెబుతారు. ఔషధాలకి రాజు వెల్లుల్లి అయితే, సోలో వెల్లుల్లి రాజాధిరాజు. 17 రకాల అమైనో ఆమ్లాలూ, 33 సల్ఫ్యూరిక్‌ పదార్థాలూ, 200కి పైగా ఎంజైములూ ఉన్న ఏకైక ఔషధం ఇదే. శరీరంలోని అన్ని రకాల కణాల పెరుగుదలకీ తోడ్పడే ఒక రకమైన కిరణాలు దీన్నుంచి వెలువడతాయట. జెర్మానియం అనే శక్తిమంతమైన ఆక్సిడెంట్‌ ఇందులో దొరుకుతుంది. అందుకే ఇది సర్వరోగనివారిణి. వ్యాధుల నివారణలో వెల్లుల్లికన్నా ఇది ఏడురెట్లు దృఢమైనది. దీని రసాన్ని ఎలుకల్లో ఇంజెక్ట్‌ చేస్తే 72 శాతం కొలెస్ట్రాల్‌ తగ్గిందట.  బీపీకి కూడా అద్భుతమైన మందు.

నల్లని వెల్లుల్లి

తెలుపురంగు వెల్లుల్లినే కొన్ని వారాలపాటు ఎలాంటి తేమ లేని వాతావరణంలో సుమారు 60 - 77 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత మధ్య 60-90 రోజులపాటు ఉండేలా చేసి నల్ల వెల్లుల్లిని తయారుచేస్తారు కొరియన్లు. ఇదో రకమైన రసాయన చర్య. దీని కారణంగా వాటిల్లోని ఎంజైములన్నీ చర్యపొంది రంగు మారి, ఖర్జూరాల్లా మెత్తబడి తియ్యదనాన్ని సంతరించుకుంటాయి. వీటిని తినడం వల్ల అమరత్వం సిద్ధిస్తుందనేది వాళ్ల నమ్మకం. దాదాపు నాలుగువేల సంవత్సరాల నుంచీ దీన్ని అక్కడ వాడుతున్నారు. థాయ్‌లాండ్‌ వాసులు వీటిని ఆయుఃప్రమాణం పెరిగేందుకు
తింటారట. వీటితో చాకొలెట్లూ తయారుచేస్తారు. దాదాపుగా అక్కడ అన్ని  వంటల్లోనూ నల్ల వెల్లుల్లి కనిపిస్తుంది. ఈ రకమైన వెల్లుల్లిలో అలిసిన్‌ అనే శక్తిమంతమైన పదార్థం, సాధారణ వెల్లుల్లిలో కన్నా రెట్టింపు శాతం ఎక్కువ. విటమిన్‌-సి, విటమిన్‌బి6, మాంగనీస్‌తోపాటు, ఇతర యాంటీఆక్సిడెంట్ల శాతమూ ఎక్కువే. అందుకే సాదా వెల్లుల్లి కన్నా ఇది చెడు కొలెస్ట్రాల్‌నీ మధుమేహాన్నీ సమర్థంగా తగ్గిస్తుంది.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...