Thursday, August 30, 2018

దేవాలయంను దర్శించుకునే పద్ధతి


(నాకు తెలిసినవి తప్పులుంటే క్షమించండి)

దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం. పరమ పవిత్రమైన క్షేత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టములు తీర్చడానికి కొలువైఉన్న పరమపావన నివాసం. అలాంటి దేవాలయమునకు దర్శనమునకు వెళ్ళునపుడు కొన్ని ధర్మములను / పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహమునకు పాత్రులము అవుతాము.

1) ప్రతి భక్తుడు ( స్త్రీలు , పురుషులు ) గుడికి వెళ్ళే ముందు శుచిగా స్నానం చేసి, విధిగా నుదుట విభూతి,గంధం,కుంకుమ ధరించాలి.

2) సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి-ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడీదార్ ధరించాలి. ( చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీ షర్టులు- మగపిల్లలు షార్టులు ధరించి వెళుతున్నారు.ఇలా ధరించినవారిని ఆలయ ప్రవేశమునకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లి తండ్రులు ప్రొత్సహించరాదు .

3) కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేతితో వెల్లరాదు. గీతలో పరమాత్ముడు ” పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి” …ఎవరైతే నాకు భక్తితో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారో వాటిని ప్రీతితో నేను స్వీకరిస్తాను” అన్నాడు.

4) గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళూ, చేతులు, ముఖం, నోరు, శుభ్రంగా కడుక్కోవాలి.

5) ఆలయం ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి.

6) లోనికి ప్రవేశించినప్పటినుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి.

7) నామ జపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడి వైపు, స్త్రీలు ఎడమ వైపు నిల్చోవాలి.

8) మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి.తరువాత స్వామి కళ్ళలోకి చూస్తూ లీనం కావాలి.

9) అర్చన చేసుకునేవారు తమ గోత్రము ఇంటిపేరు నక్షత్రము చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గో కర్ణాకృతిలో ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని ” అకాల మృత్యు హరణం …” అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడురాకుండా తీసుకోవాలి, తలకు రాసుకోకూడదు.

10) దర్శనం అయిన తరువాత కాసేపు కూర్చొని దైవ నామ జపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి.

11) ప్రసాదం భక్తులందరికీ పంచకుండా స్వీకరించరాదు.

12) తిరిగి వెళ్ళే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి.

13) ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగం కూడదు.

14) అనవసరంగా మాట్లాడటం.. పౌరుషపదజాలం ఉపయోగించకూడదు

15) ఆవలింతలు, జుట్టు పీక్కోవడం, తల గోక్కోవడం, తమలపాకులు(కిళ్లీలు) వేయకూడదు.

16) జననం, మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడకూడదు.

17) టోపీలు, తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయకూడదు.

18) ధ్వజస్తంభం, బలిపీఠం, గోపుర స్థలాలను గడపలను తొక్కకూడదు.

19) ఆకర్షణీయ (మెరుపు) దుస్తులను ధరించకూడదు.

20) పానవట్టo దాటరాదు.

21) దర్శనం పూర్తయ్యాక వెనకవైపు కాస్త దూరం నడిచి, తర్వాత తిరగాలి.

22) ఒక చేత్తో దర్శనం చేయకూడదు.

23) భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం చేయలి.

24) ఆలయ ఆస్తులను అపహరించకూడదు.

25) అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి, మాస ప్రారంభం, సోమవారం, ప్రదోషం, చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచకూడదు.

26) ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించకూడదు.

27) మూల విరాట్ వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు.

28) ఆలయానికి వెళ్లొచ్చిన వెంటే కాళ్లను కడగకూడదు. కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చేయాలి.

29) ఆలయంలోకి ప్రవేశించి, తిరిగి వచ్చేంతవరకు నిదానమే ప్రధానంగా ఉండాలి.

30) గోపుర దర్శనం తప్పక చేయాలి.

31) ఆలయంలోని మర్రి చెట్టుకు, రావి చెట్టుకు, సాయంత్రం 6గంటల తర్వాత ప్రదక్షిణలు చేయకూడదు, అసలు వాటి క్రింద కూర్చోరాదు, నిదుర) ఆలయంలోపల గట్టిగా మాట్లాడకూడదు.

32) మన మాటలు, చేష్ఠలు ఇతరులకు ఆటంకంగా ఉండకూడదు.
33) ప్రధానాలయo వెనుకభాగం(అసుర భాగం) ను తాకరాదు.
34) ఘంటలు ఆడవారు మ్రోగిన్చరాదు.
35) హారతి తీసుకునేటపుడు మొదట కళ్ళకు, రెండు బ్రహ్మరన్ద్రoకు అద్ది , మూడు వాసన చూడాలి, పై విధoగా 3సార్లు హారతిని తీసుకోవాలి.
36) ప్రధాన గర్భాలయo లోకి అర్చకుడు తప్ప అవకాశం వున్నా ప్రవేశిoచరాదు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

Friday, August 24, 2018

జంధ్యాల పౌర్ణమి

శ్రావణపౌర్ణమిని ‘జంధ్యాలపౌర్ణమి’ అని కూడా అంటారు. జంధ్యాల పౌర్ణమిగా పిలుచుకునే శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతములు ధరించి వేదాధ్యయనానికి శ్రీకారం చుడతారు. యఙ్ఞోపవీధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణపౌర్ఱమినాడు, విధిగా నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే, యఙ్ఞోపవీతంగల ప్రతివారు, నిత్యకర్మానుష్ఠాన యోగ్యతకోసం, ప్రతినిత్యం సంధ్యావందనం చేసితీరాలి. కానీ, ఏదోఒక కారణంగా, ఏదోఒక సందర్భంలో తెలిసో తెలియకో, ఈ నియమానికి భంగం జరిగే అవకాశం వుంది. ఒకవేళ అదే జరిగితే, ధరించిన యఙ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితిలో నూతన యఙ్ఞోపవీతిన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లనుసరిదిద్దడానికే ‘శ్రావణపౌర్ణమి’ నాడు నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని మన పూర్వులు ఓ ఆచారంగా ఏర్పాటుచేసారు. పూర్వకాలంలో కొత్తగా వేదం నేర్చుకునే వారు కూడా ఇదే రోజున విద్యాభ్యాసం ఆరంభించేవారు.ముహూర్తంతో పనిలేకుండా ఈ రోజు ఉపనయనాలు చేసే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది.

య జ్ఞో ప వీ త ము

యజ్ఞధృతం ఉపవీతం - యజ్ఞోపవీతం లేక యజ్ఞసూత్రమనియు నందురు. బౌధాయనః|| కౌషంసౌత్రం, త్రిస్తివ్రృతం, యఘ్నోపవీతమానామేః| మనుః - కార్పాసముపవీతంస్యాత్‌.

కార్పాసముపవీతం, షట్తస్తుత్రివృతం, బ్రాహ్మణస్య అను థర్మశాస్త్రకారుల వచనముల ననుసరించి, ప్రత్తితో వడికిన దారములు మూడు పొరలతో చేర్చి నొక్కపోగువలె మూడు పోగులుకు మూడు మూడులతొమ్మిది పోగులుండులాగున యజ్ఞోపవీతము ధరింపదగినది.

యజ్ఞోపవీతం కుర్వీతసూత్రాణినవతన్తవః ఏ కేనగ్రంధినాతన్తుస్తిగ్రుణోధనా.

యనురీతిని తొమ్మిది పోగులతో చేర్చిన మూడుపోగులను "బ్రహ్మముడి' యనుపేర నొకముడి వేయదగినది. ""ఏకోగ్రంధిరీతి, నానాత్వ నిషేధార్థం'' యనురీతిని యొ కేముడి యుండదగినది. ఇట్టి నవతన్తు నామకయజ్ఞోపవీతథారణార్థమై గర్భాష్ఠమేబ్దే బ్రాహ్మణస్యోపనయనంశస్తం'' అను ధర్మాన్ని పురష్కరించుకొని యేడవ వర్షముననే యుపనయనము బ్రాహ్మణ బాలునకు చేయుట యుత్తమము.

షోడశవర్షాణాం ఉపనయనాంగయప్రతీయతే
పతితా యస్యసావిత్రీదశవర్షాణింపంచచా,

అనురీతిని పదు నేడు సంవత్సరములు కాగానే సావిత్రీ పతితుడగును, గాన పదునారు సంవత్సరములలోపుగనే బ్రాహ్మణ బాలున కుపనయనము చేయుట ముఖ్యము.

""బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే'' యను తైత్తిరీయారణ్యకమున యజ్ఞొవీతము బ్రాహ్మణునకు ముఖ్యాతిముఖ్యమని వచింపబడియున్నది,

నవతన్తు యజ్ఞోపవీతమునకు అధిపతులు

ఓంకారః ప్రథమస్తన్తుః
ద్వితీయోగ్నిస్తధైవచ
తృతీయోభగదైవత్యః
చతుర్థస్సోమదైవతః
పంచమః పితృదైవత్యః
షష్ఠశ్చెవప్రజాపతి ః
సప్త మోవిష్ణుదైవత్యః
దర్మశ్చాష్టమఏవచ
నవమః సర్వదైవత్యః

ఇత్యే తేనవతన్తవః.

"వినాయచ్ఛిఖయాకర్మ, వినాయజ్ఞోపరీతతః|
రాక్షసం తద్ధి విజ్ఞేయం, సమస్తాన్నిష్నలాఃక్రియాః

అను ధర్మము ప్రకారము, శిఖ లేకపోయిననూ, యజ్ఞోపవీతము లేకున్ననూ, వైదికకార్యము లాచరించినచో నిష్పలములే గాన, శిఖా యజ్ఞొపవీతములు సంధ్యావందనమునకుగూడ ముఖ్యమనియే గ్రహింపదగినది.

నాభేరూర్థ్వ మనాయుష్యం| అధోనాభేస్త పక్షయః|
తస్మాన్నాభిసమం కుర్యాత్‌, ఉపవీతం విచక్షణఇతి.

యను రీతిని యజ్ఞొపవీతము నాభికి సమంగా పొడవుండదగినదిగాని, నాభి కూర్థముగానున్నచో ఆయుస్సు క్షీణించును, నాభికి క్రిందనుండినచో చేసిన జపాది తపస్సు నశించును గాన నాభి సమంగా యజ్ఞొపవీతమున్నది లేనిది గమనించి నాభి సమంగా నొనర్చుకొని సంధ్యావందనాది కర్మలాచరింపదగినది.

"స్తనాదూర్థ్వం, అథోనాభేఃనకర్తవ్యంకదాచనా'' అనురీతిని నాభికి పైకినుండరాదు, నాభికి క్రిందికి నుండరాదు. నాభి సమంగానుండుటయే శ్రేయము.

శిఖా యజ్ఞొపవీతము లెప్పటికి ధరించియే యుండవలయును గాని, అవసరమగుతరిని యుంచుకొని మిగతా సమయములలో తీసివేయరాదు. ఇందుకు ప్రమాణంగా ధర్మశాస్త్రకారిట్లు వచింతురు.

కాయస్థమేవతత్కార్యం, ఉత్థాప్యంనకదాచన|
సదోపవీతినాభావ్యం, సదాబద్ధశిఖేనచ||

ఎప్పటికి శరీరముననే థరించియుండదగిది. శిఖను ముడివేసియే నుంచదగినది. ఉతవీతిగనే యజ్ఞోపవీతము థరించియుండదగినది. ఈరీతిని శిఖా యజ్ఞోపవీతములు థరించి యుపనయన ప్రభృతి గాయత్రీ యనుష్ఠానమున కుపక్రమింపదగియున్నది.

మౌంజీబంధదినే తిష్టేత్‌ సావిత్రీమభ్యసన్‌ గురోః
సూర్యేస్తశిఖరం ప్రాప్తే సాయం సంధ్యాం సమభ్యసేత్‌.

ఉపనయనమున వెంటనే నిలచియే సాయంకాలమువరకు సావిత్రీయుపాసనము (గాయత్రీజపము) చేయుచండవలయును. సూర్యాస్తమయమగుతరిని సాయంసంధ్యా వందనము చేయదగినది.

ఉపనయన వటువు సంధ్యావందనమువలెనే మరునాటినుంచి బ్రహ్మయజ్ఞముగూడా నాచరింపవలయును. వేదాద్యయనమే ప్రారంభించలేదు గాదా? బ్రహ్మయజ్ఞమెట్లు చేయడమను సందియముగలుగవచ్చును. అందులకు ధర్మకారుల సమాధానము పరికించునది.

ఆరభేత్‌ బ్రహ్మయజ్ఞన్తు, మధ్యాహ్నెతు పరేహని మరుదినము మథ్యాహ్నమునుంచి బ్రహ్మయజ్ఞముగూడా చేయవలయును.

అను పాకృత వేదస్య, బ్రహ్మయజ్ఞః కథంషవేత్‌|
వేదస్థానేతు గాయత్రీ గద్యతేన్యత్స మంభవేత్‌||

వేదము రాకపోయిననూ వేదస్ధానమున గాయత్రీ మంత్రమే పఠింపదగినది

వేద మథ్యాపయేత్‌ ఏనం, శౌచాచారాంశ్చ శిక్షయేత్‌ ||

ఉపనయనము చేసిన వటువునకు వేదము నేర్పించవలయును. శౌచాచారాదులలో బాగా శిక్ష యిప్పించవలయును.

దివా సంధ్యాసుకర్ణన్థః బ్రహ్మసూత్రః ఉదఙ్ముఖః
కుర్యా న్మూత్ర పురీషేవా రాత్రౌచేద్దక్షిణాముఖః||

ఉపనయన వటువు శౌ చా చా ర ము లు తప్పక పాటించడము నేర్వదగియున్నది గాన, పగలుగాని సంధ్యాకాలములలోగాని మూత్ర పురీషములు విడువదగినచో, యజ్ఞొపవీతము కుడి చెవునకు చుట్టుకొని ఉత్తరముఖముగ కూర్చొని మూత్ర పురీషాదులు వదలదగినది.

రాత్రికాలమున మూత్ర పురీషాదులు వదలవలసివచ్చినచో యజ్ఞోపవీతము చెవునకు (కుడిచెవుకు) చుట్టుకొని దక్షిణాభి ముఖముగకూర్చొని విడువదగినది,

మధు మాంసాం జనోచ్ఛిష్టశుక్తం, స్త్రీప్రాణిహింసనం,
భాస్కరాలోకనా శ్లీల పరివాదాది వర్జయేత్‌

మధు మాంసములు తినరాదు, ఎంగిలి తినరాదు. నిష్ఠురమైన మాటలు పలుక రాదు. (శుక్తం-నిష్ఠుర వాక్యం) స్త్రీలను తదితప్రాణి లోకమును బాధించరాదు, సూర్యుని చూడ రాదు. అశ్లీలమైన పలుకులు పలుక రాదు కొట్లాడరాదు. ఈ నియమములు బ్రహ్మచారి (ఉపనయనమైన బాలునకు బ్రహ్మచారి యని పేరు) తప్పక యాచరింపదగినది. ఈ నియమములు విధిగ పాటించుచు సంథ్యావందనము చేయుచు వేదాధ్యయనము చేయుట ముఖ్యము.

...ఇట్లు...
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

Wednesday, August 22, 2018

గాయత్రి ముద్రలు

ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః

ఓం భూర్బువ స్సువః 5
తత్స వితుర్వ రేణ్యం 7
భర్గో దేవస్య ధీమహి 8
ధియో యోనః (ప్రచోదయాత్) 4
24
గాయత్రి ముద్రలను గురు ముఖంగా సాధన చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చును.ముద్రా విజ్ఞానాన్ని తత్త్వయోగం అంటారు. కేవలం ఆధ్యాత్మికంగానే కాదు మన ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచడంలో కూడా తోడ్పడతాయని రుజువైంది. మన ప్రాచీనులు ఈ విశ్వంలో 24 నిర్ధారణ మూలకాలు ఉన్నాయని విశ్వసించారని, గాయత్రి మంత్రంలో 24 పదాలు ఉండడం, 24 మంది జైన తీర్ధాంకరులు, సనాతన ధర్మంలో 24 అవతారా లు ఉండడం యాధృచ్ఛికం కాదని పలువురు అంటుంటారు.

మన చేతుల్లో శక్తి ప్రవహిస్తూ ఉంటుందని, మన చేతికున్న ఐదు వేళ్ళూ ఐదు తత్వాలకు సంకేతమని అంటారు. బొటని వేలు అగ్నికి, చూ పుడు వేలు వాయువుకు, మధ్యవేలు ఆకా శం, ఉంగరం వేలు పృధ్వి, చిటికెనవేలు జలానికి సంకేతాలు గా చెప్తారు. ఈ ఐదు తత్వాల అసమతుల్యత వల్లనే వ్యాధులు వస్తాయని, వీటిని మందులు, ఆత్మశక్తి, ముద్రల సాయంతో సరిచేయవచ్చని అంటారు. గాయత్రి మంత్రం కూడా ముద్రలు ఎంత విలువైనవో తెలియజేస్తుంది.

ఏత ముద్రన జానాతి గాయత్రి నష్ఫల భవత్‌ (ముద్రల గురించి తెలియనివారు గాయత్రీ మంత్ర ఫలాన్ని పొందలేరు).

గాయత్రి మంత్రం 24 ముద్రలను చెప్తుండగా, యోగాలోని అనేక రూపాలలో పలు ముద్రలను వివరిస్తుంది. కాగా, ఆధునిక వ్యాధులను నియంత్రించడం లో తోడ్పడే విధంగా అనేక ముద్రలకు కూడా రూపకల్పన చేయడం జరుగుతోంది. మన సంప్రదాయం లోనే అనేక ఆరోగ్య సూత్రాలు ఇమిడున్నాయి.

కాళ్ళు ఊపుతూ కూచున్నప్పుడో, వేళ్ళు ఊరుకే విరుచుకుంటుంటేనో ఇంట్లో పెద్దలు అరు స్తుంటారు. అలా చేయవద్దనడానికి కారణం ఆ చ ర్యల వల్ల ప్రాణశక్తి వృధా అవుతుందనే. అనవసరంగా ప్రాణశక్తి వృధా అవడమనేది మెద డుకు నష్టం జరుగుతుంది. ముద్రా విజ్ఞానం వ్యక్తికి ఉపశమనం కలిగించేందుకు ఈ శక్తిని తట్టి లేపుతుం దంటారు దీనిని సాధన చేసే వారు. మానవ సంక్షేమానికి యోగా ఇచ్చిన అద్భుతమైన బహుమతులలో ఈ ముద్రా విజ్ఞానమొకటని కూడా భావిస్తా రు. ఈ ముద్రలను రోజూ అరగంట సాధన చేస్తే చాలు. అయితే ఈ సాధన చేసే సమయంలో పద్మాసనం వేసుకోవడం మంచిది. అలాగే నడిచేటప్పుడు కూడా ముద్రలను సాధన చేయవచ్చు.

ముద్రలు అధిక శక్తిని పుట్టించవు, ప్రాణ శక్తిని సమతులం చేస్తాయి అంతే. ఆరోగ్యాన్ని, మేధస్సును పెంచడమే కాదు సిద్ధులు సాధించడం కోసం, మన చుట్టూ ఉండే ఆరాను ఆరోగ్యవంతం చేయడం, కుండలినినిలోని ప్రాణ కుండలిని, చిత్‌ కుండలిని, పరా కుండలినిని ఉత్తేజితం చేసి మరింత క్రియాశీలకమయ్యేందుకు దోహదం చేస్తాయి. ముద్రలను సాధన చేసేటప్పుడు చేతుల సున్ని తత్వాన్ని పెంచుకునేందుకు, వేళ్ళ చక్రాలను క్రియాశీలకం చేసేం దుకు మన చేతివేళ్ళ పై, అరచేతిపై దృష్టిని కేంద్రీకరించి ఉంచాలి.

ఈ వ్యా యామం చేతిలో ఉండే చక్రాలను పెద్దవి చేసే శక్తి అవసరమైనట్టుగా ఇరువైపులా ప్రవహించేలా చేస్తుంది. ఈ వ్యాయామం చేసేందుకు ముందుగా, ప్రతి వేలి చివరి మీద కనీసం ఒక నిమిషం పాటు దృష్టి కేంద్రీకరించాలి. వేలి చివర్లలో రక్తం ప్రవహించడం, స్పందనలు అనుభవంలోకి రావాలి. ముందుగా ఒక చేతితో ప్రారంభించి, తరువాత మరో చేతి వేళ్ళ మీద దృష్టి కేంద్రీకరించాలి. తరువాత దృష్టిని మూడు నిమిషాలపాటు అరచేతిపై కేంద్రీకరించాలి. అరచేతిలో పువ్వు వికసిస్తున్న అనుభూతిని పొందాలి. ఈ సాధనను కనీసం 40 రోజుల పాటు సాధన చేస్తే, మన చేతులలో ఉండే చక్రాలు శాశ్వతంగా పెద్దవై, మరింత సున్నితత్వం వస్తుంది. ఈ సమయంలో ముద్రలను సాధన చేయడం మంచిది.

ముద్రల సాధనను ప్రారంభించే ముందు వ్యక్తి మనస్సును, శరీరం కొంతమేరకు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ముద్రలను కొన్ని బీజ మంత్రాలను ఉచ్ఛరిస్తూ కూడా సాధన చేయవచ్చు. ఈ మంత్రాలు చక్రాలను ఉత్తేజి తం చేయడమే కాక సూక్ష్మ వాహకాలను విస్తరింపచేస్తాయి. అంటే మానసిక, భౌతిక ప్రబావాన్ని చూపిస్తాయి. బీజ మంత్రాన్ని ఉచ్ఛరించేటప్పుడు బలం గా ఉచ్ఛరించాలి. అప్పుడే ఆ మంత్ర బలం మనలోని వివిధ మానసిక కేంద్రాలకు అనుభవంలోకి వస్తుంది. మంత్రాన్ని బలంగా ఉచ్ఛరించడం అంటే బిగ్గరగా చదవడమని కాదు అందులోని అక్షరాలను ఉచ్ఛరించవలసినట్టుగా ఉచ్ఛరించడం. అందుకే బీజ మంత్రాలను ఎప్పుడూ గురు ముఖంగా పొందాలంటారు.

Tuesday, August 21, 2018

జ్వరాది వ్యాధుల్ని పోగొట్టే ’శీతలాదేవి’

విశ్వచక్రంలోనున్న దేవతాశక్తుల్ని దివ్య మంత్ర,, నామ స్తోత్రాదులతో స్పందింపజేసి అభీష్టసిద్ధుల్ని సాధించే ’శబ్దచికిత్సా’ విధానాలను మన ఋషులు ఏర్పాటు చేశారు.
వ్యాధుల్ని నివారింపజేసి, జ్వరాలను తొలగించే శక్తి ఉన్న శీతలాదేవిని ఉత్తరాది, వంగదేశం, ఉత్కళ రాష్ట్రాలలో ఎక్కువగా ఆరాధిస్తారు. సుమారు ప్రతి దేవాలయంలో శీతలాదేవికి చిన్న ఆలయముండడమే కాక, ప్రత్యేకించి శీతలా మందిరాలు సైతం కనిపిస్తుంటాయి. శీతలా స్తోత్రాలు నిత్యపారాయణాలుగా ఉండడమే కాక, అతి సామాన్యులు సైతం ఈ తల్లిని ఆరాధిస్తుంటారు.

ఒకసారి రామకృష్ణ పరమహంస శిష్యునికి అనారోగ్యం కలిగింది. అప్పుడతను మాత శారదాదేవితో రైల్లో ప్రయాణిస్తున్నాడు. అనారోగ్యం కారణంగా ఆ శిష్యుడు మూసిన కళ్లు తెరవలేక పోతున్నాడు.

అది నిద్రో, లేవలేని నిస్సహాయతో గానీ ఆ అస్పష్ట కలత నిద్రలోనే అతనికొక భయంకరమైన ఆకారం ఒకటి కనిపించి 'ఇప్పటికే నేను నిన్ను మృత్యువుకు అప్పచెప్పి ఉండేదాన్ని. కానీ, నీ గురువాజ్ఞ మేరకు వదిలి పెడుతున్నాను. అయితే, ఇందుకు కృతజ్ఞతగా నేనుచూపించే ఈ దేవతామూర్తికి నువ్వు బాగా తియ్యగా ఉండే రసగుల్లాలను నైవేద్యం పెట్టాలి' అని ఆదేశించి అదృశ్యమైంది. ఆ ఆకారం చూపించిన దేవతా మూర్తి ఎర్రని పట్టు వస్త్రాన్ని ధరించి ఉంది.

ఆ తరువాత చిత్రంగా అతని అనారోగ్యం నయమైంది.ఎంత తీవ్రమైన జ్వరంగానీ, ఎంతో కాలంనుండి తగ్గకుండా పీడి స్తున్న వ్యాథులు పీడిస్తుంటే ఈ తల్లికి భక్తిశ్రద్ధలతో మొక్కుకుంటే తప్ప కుండా అవి నివారణ మవుతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.

అనంతశక్తి స్వరూపిణియైన జగదంబ తన అనంత అనుగ్రహాన్ని వివిధ విధాలుగా అందించడానికి అనంత రూపాలను ధరించింది. అలాంటి రూపాలలో ఈ శీతలాదేవి ఒకటి, జ్వరహరణ శక్తులలో ఒకటి. గాడిద వాహనంపై కూర్చుని చేట, చీపురు, కలశంవంటి వాటితో ప్రకాశించే ఈ తల్లిరూపం రోగనాశక శక్తులకు సంకేతం.

జంతువులలో కూడా అనేక రహస్య శక్తులుంటాయి. ఆ శక్తుల్ని గమనిస్తే - కొన్ని జంతువుల ఇంద్రియాలలో సూక్ష్మశక్తులున్న విషయం స్పష్టమౌతుంది. ఆ ప్రత్యేకతలన్నీ విశ్వశక్తిలోని అంశాలే.
శక్తులకు సూక్ష్మ జగత్తులో ఉన్న ఆకృతులను మంత్రద్రష్టలు దర్శించి, వాటిద్వారా మనం తగిన ప్రయోజనాలను పొందాలని వివిధ స్తోత్రాలనందించారు.

గాడిద, చేట, చీపురు, కలశం - ఈపరికరాలు రోగకారక క్రిమినాశన, జ్వరహరణ శక్తులకు సంకేతాలు.
స్ఫోటకము, ఉష్ణతలు, తీవ్రజ్వరాలు నశించడానికి, పిల్లలకు వచ్చే ఆటలమ్మవంటి ’మారీ’ వేదనలు తొలగడానికి, శీతలాదేవిని తలంచి ఈ స్తోత్రం చదివితే చాలు - తప్పక ఆ వ్యాధులు నివారణ అవుతాయని శాస్త్రోక్తి. "శీతలా" నామస్మరణమే జ్వరతాపాలను పోగొడుతుందని పురాణవచనం.

అస్యశ్రీ శీతలాస్తోత్రస్య మహాదేవ ఋషిః - అనుష్టుప్ ఛన్దః - శీతలా దేవలా దేవతా - లక్ష్మీర్బీజం - భవానీశక్తిః -సర్వ విస్ఫోటక నివృత్తయే జపే వినియోగః

హస్తామలక స్తోత్రం

ఆదిశంకరుల జీవితానికి సంబంధించిందే హస్తామలక స్తోత్రం.అందులోనూ ఆయన శిష్యులలో ఒకరైన హస్తామలకాచార్యుల వృత్తాంతం ఇది. ఎంతో విస్మయాత్మకంగానూ, ఆత్మజ్ఞాన ప్రబోధకంగానూ ఈ కథ కనిపిస్తుంది. అలాగే మహనీయులు, సిద్ధపురుషులు, తపశ్శక్తి సంపన్నుల స్పర్శ మూగవారిని మాట్లాడేలా చేస్తుందని, అంధులకు చూపు తెప్పిస్తాయని, వికలాంగులకు పరుగెత్తే శక్తిని ఇస్తాయని, చెవిటి వారికి వినికిడి శక్తిని సమకూరుస్తాయని రామాయణాది ఇతిహాసాలలోనూ, పురాణాలలోనూ తరచూ కనిపిస్తుంటుంది. అహల్య శాప విమోచనం ఇందుకొక ఉదాహరణ. అలాంటి విస్మయాత్మక సంఘటన ఈ కథలో ఉంది. రామాయణం, పురాణాలు ఏనాటివో అనుకున్నా.. ఈ ఇతివృత్తం దాదాపు క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్దానికి చెందినదే. దీనివల్ల మన భారతీయ సనాతన సంప్రదాయంలో ఉన్న ఆచార్య పరంపర శక్తి ఎంతటిదో సులభంగా అవగతమవుతుంది.

ఆది శంకరులు దేశాటనం చేస్తూ బలి అనే గ్రామానికి వచ్చారు. శిష్యసహితంగా బలి గ్రామంలో ప్రవేశించిన శంకరులకు ఓ విచిత్ర సన్నివేశం ఎదురైంది. ఆ గ్రామంలో ప్రభాకరుడు అనే ఓ వేద పండితుడు ఉన్నాడు. తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తూ ఎంతో ఉత్తముడుగా పేరు పొందాడు ప్రభాకరుడు. అయితే ఆయన జీవితానికి ఓ పెద్ద సమస్య వచ్చి పడింది. సంతానాన్ని కోరుకున్న ఆయనకు ఓ చక్కటి మగ శిశువు జన్మించాడు. చూపులకు ఎంతో అందంగా, ఆరోగ్యంగా ఉన్నా.. పుట్టినప్పటి నుంచి ఆ శిశువు ఎటూ కదలక, మెదలక ఉండేవాడు. అలా పెరుగుతూ పెరుగుతూ పదమూడు సంవత్సరాల వయస్సు దాకా వచ్చాడు. స్పృహలో లేక ఏది చెప్పినా వినక ఏమీ మాట్లాడక ఎటు చూస్తున్నాడో ఎదుటి వారికి తెలియకుండా అచేతనంగా పడి ఉన్న తన పిల్లవాడిని ఎందరెందరో వైద్యులకు, భూత వైద్యులకు కూడా చూపించాడు ఆ వేద పండితుడు. అయినా ఏమీ లాభం లేకపోయింది. చివరకు ఆదిశంకరులు తమ గ్రామానికి శిష్యసమేతంగా వచ్చాడని తెలుసుకుని పిల్లవాడిని వెంట తీసుకుని వెళ్ళి ఆయన పాదాల మీద పడవేసి తన సమస్యనంతా చెప్పాడు. ఎంతసేపటికీ తనకాళ్ళ మీద నుంచి లేవని ఆ జడుడిని ఆదిశంకరులు తన చేతులతో లేవనెత్తి కూర్చోపెట్టారు.

ఒక్కసారి అతడి వంక చూసి ఎవరు నీవు...? ఎక్కడి నుంచి వచ్చావు? నీ పేరేమిటి? అని అడిగారు. పదమూడేళ్ళ పాటు ఒక్కమాట కూడా మాట్లాడక జడుడిగా పడి ఉన్న ఆ బాలుడు శంకరులు ప్రశ్నలకు గడగడా అనర్గళంగా శ్లోక రూపంలో సమాధానాలు చెప్పాడు. తానెవరంటే సర్వవ్యాప్తమూ, సర్వోన్నతమూ, చైతన్యవంతమూ అయిన పరబ్రహ్మ (ఆత్మ) అని అన్నాడు. ఆకలిదప్పులు, శ్లోకమోహాలు, జరామరణాలు అనే షడూర్ములు వికారాలు.. జననం, స్థితి, పెరగటం, తరగటం, విరగటం అనే షడ్భావ వికారాలు.. ఇవేమీ లేని సుఖస్వరూపంగా ఉన్న పరమాత్మ స్థితే తాను.. అని అన్నాడు ఆ బాలుడు. ప్రతి జీవిలోనూ ఉండేవి ఆత్మ పరమాత్మ కనుక దేహాలు ఎప్పటికీ శాశ్వతాలు కావు కనుక ఆ దృష్టితో చూస్తే తాను పరమాత్మనేనని ఆ బాలుడు ఆత్మతత్వాన్ని అక్కడున్న వారందరికీ చాలా సులభంగా వివరించాడు.

అరచేతిలో ఉసిరికాయను సంస్కృతంలో హస్తామలకం అని అంటారు. అర చేతిలో ఉసిరి కాయను పెట్టుకొని ఎవరికి చూపించినా అదేమిటో వివరంగా చెప్పకుండానే అందరికీ అర్థమై పోతుంది. అంత సులువుగా దాదాపు పన్నెండు శ్లోకాలలో, ఉదాహరణలతో సహా ఆదిశంకరుల ముందు ఆ బాలుడు చెప్పినదంతా హస్తామలక స్తోత్రం అని ప్రసిద్ధి కెక్కింది. భగవత్పాదులు తనతో అంత చక్కగా మాట్లాడిన అతడి వంక మరోసారి చూసి అతడి శిరస్సున తన చేయి ఉంచి ఆశీర్వదించి దీక్షనిచ్చారు. ఆ బాలుడి తండ్రి అయిన ప్రభాకరుడికి తేరుకోలేని ఆశ్చర్యం కలిగించింది. ఇన్నాళ్ళు తాను కొట్టినా తిట్టినా ఏ రకమైన వైద్యాలు చేయించినా పలకని జడుడు అనుకున్న వాడు ఇంత పాండిత్యాన్ని ఎలా ప్రదర్శించ గలుగుతున్నాడు అని అనుకొంటూ కూర్చొన్నాడు. అప్పుడు భగవత్పాదులు అతడు అజ్ఞాని కాదు అని.. అజ్ఞాని అయిన వాడు ఎప్పుడూ అలా మాట్లాడలేడు అని అన్నారు.

గత జన్మలో అతడొక సిద్ధ పురుషుడని, బ్రహ్మ జ్ఞాన సంపన్నుడని, తపోనిష్టలో ఉండి తనువును చాలించి జన్మించినందువల్ల ఆ నిర్వికల్ప సమాధి స్థితే ఈ జన్మలోనూ ప్రాప్తించిందన్నారు. అంతటి యోగ సిద్ధుడు సాంసారిక జీవితంలో ఉన్నందు వల్ల ప్రయోజనమేమీ ఉండదని అతడిని తన శిష్యుడిగా చేసుకుని తన వెంట తీసుకు వెళ్ళాలనుకొంటున్నట్లు జగద్గురువులు ప్రభాకరుడితో అన్నారు. ప్రభాకరుడు కూడా విషయజ్ఞాన సంపన్నుడు, శాస్త్ర కోవిదుడే కనుక శంకరుల మాటకు అడ్డు చెప్పలేదు. అప్పటి వరకూ ఏ పేరూ లేకపోయినా హస్తామలక స్తోత్రం చెప్పాడు కనుక అతడికి హస్తామలకుడు అని పేరు పెట్టి తన వెంట తీసుకువెళ్ళారు ఆది శంకరులు.

హస్తామలక స్తోత్రంలో హస్తామలకుడు దీనికొక చక్కటి ఉదాహరణ కూడా చెప్పాడు. ఆకాశంలో కనిపించే సూర్యచంద్రులు ఎప్పుడూ అక్కడ అలాగే కనిపిస్తారు. కానీ కదులుతున్న నీటి అలల మీద సూర్యచంద్రుల ప్రతిబింబాలను చూసినప్పుడు అవి కదులుతున్నట్లు అనిపిస్తాయి. ఇలాగే స్థిరమైన పరమాత్మ వివిధ రకాల జీవులలో ఉంటూ రకరకాల ప్రాణులనే భావన కలిగిస్తుంటున్నది ఇక్కడి పోలిక. సూక్ష్మంగా చెప్పాలంటే అన్ని జీవుల్లోనూ పరిపూర్ణ పరిశుద్ధమైన ఆ పరబ్రహ్మ ఉంటాడు కనుక సపర్వనామ భావనను అందరూ పాటిస్తూ శాంతిమార్గాన్ని అవలంభించాలన్నది ఇక్కడ కనిపించే సందేశం.

Monday, August 20, 2018

కర్కాటక లగ్నం, కర్కాటక రాశిలో జన్మించిన వారికి అదృష్ట రుద్రాక్ష కవచం

కర్కాటక లగ్నం, కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్షలు ద్విముఖి, త్రిముఖి, పంచముఖి రుద్రాక్షలు. కర్కాటక  లగ్నానికి లగ్నాధిపతి అయిన చంద్రుడికికి ద్విముఖి రుద్రాక్ష, పంచమాధిపతి అయిన కుజుడికి త్రిముఖి రుద్రాక్ష, నవమాధిపతి అయిన గురువుకి పంచముఖి రుద్రాక్ష అదృష్టాన్ని ఇచ్చే రుద్రాక్ష కవచం. కర్కాటక  లగ్నానికి లగ్నాధిపతి, పంచమాధిపతి, నవమాధిపతులు యోగ కారకులు. ఈ యోగకారకులు అస్వతంత్ర స్ధానాలలో ఉండి యోగాన్ని ఇచ్చే పరిస్ధితులు లేనప్పుడు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని మెడలో ధరించటం వలన యోగకారక గ్రహాలు శత్రు క్షేత్రాలలో ఉన్నా యోగ ఫలాన్ని పొందవచ్చును. మొదటిసారిగా ఈ రుద్రాక్షను ధరించేటప్పుడు సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయించుకొని ధరించిన ఉత్తమ ఫలితాలు పొందవచ్చును.

కర్కాటక రాశి ఎండ్రకాయ(పీత) పీతబుఱ్ఱ (అధిక ఆలోచన) కలిగి ఉంటారు. పురుగు స్వభావం, పట్టుదల, తప్పించుకొనే తెలివి తేటలు, స్వతంత్రత, అపకారం చేయుటకు వెనకాడక పోవటం, జల భూచరమైన ఆటుపోటులు, వృద్ధి క్షయాలు మొదలైన లక్షణ ద్వయం కలిగి ఉంటారు. కర్కాటరాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశి మేషాదిగా చతుర్ధరాశి కావటం వలన ఎప్పుడు మార్పులు కోరుకుంటారు. స్వాభిమానం కలవారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తారు. ప్రతి పనిని జాగ్రత్తగా అమలు పరుస్తారు. చురుకుదనంతో పనిచేస్తారు. ఊహాత్మకంగా ఆలోచిస్తారు. జ్ఞాపకశక్తి అధికం. తమ అభిప్రాయాలను పరిస్ధితులకు అనుగుణంగా మార్పులు చేసుకుంటూ ఉంటారు. కొంతకాలం సంతోషంగా, కొంతకాలం దుఃఖంగా ఉంటారు. వీరి ముఖ కవళికలలో మార్పులు గమనించవచ్చు. ఊహాత్మకమైన నిర్ణయాలు తీసుకోవటానికి, జ్ఞాపక శక్తికి, ఆలోచనా విధానంలో మార్పులకు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించాలి. 

కర్కాటక రాశి వారికి దేశాభిమానం ఎక్కువ. పరిసరాలకు అనుగుణంగా ఆత్మరక్షణ చేపడతారు. అమావాస్య, పౌర్ణమి, గ్రహణాల సమయంలో ఉద్రేకానికి లోనయ్యే అవకాశాలు ఎక్కువ. స్ధిరాస్ధుల విషయంలో మక్కువ కనబరుస్తారు. బంధుప్రీతి కలవారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వసతులను ఏర్పరుస్తారు. జనాధరణపై ఆసక్తి. ఆహారపానీయాలు, రసద్రవ్యాలు, నిత్యవసరాలు, జన సంబంధ విషయాలు ఈ రాశి కారకత్వాలకు చెంది ఉంటాయి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి మనో ధైర్యం అధికంగా ఉంటుంది. జల సంబంధమైన విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి. అవే జీవితంలో పురోభివృద్ధికి కారణం అవుతాయి. ప్రతి విషయంలో పోరాటం ఎక్కువగా ఉంటుంది. ప్రతి చిన్న పనికి ఒకటికి నాలుగు సార్లు కష్టపడాల్సి వస్తుంది. సన్నిహిత వర్గంలో నిజాయితీపరులు ఉన్నత కాలం వృత్తి, ఉద్యోగ, వ్యాపారులకు ఇబ్బంది ఉండదు. రాజకీయ రంగంలో రాణిస్తారు. లలిత కళలపై మంచి అవగాహన, ప్రవేశం ఉంటుంది. కళా సంబంధిత వ్యాపారాలలో కూడా రాణిస్తారు. లలితకళలో రాణించటానికి, స్దిరాస్ధులు సంపాదించుకోవటానికి, గృహ, వాహన యోగం కలగటానికి ఈ అద్భుత అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించాలి. 

కర్కాటక రాశి వారికి సంతాన పురోగతి బాగుంటుంది. ప్రారంబంలో కొన్ని సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. రాణించలేమని భావించిన రంగాల్లో రాణిస్తారు. హాస్యం పట్ల ప్రత్యేకమైన అవగాహన ఉంటుంది. కార్య నిర్వహణకు చక్కని ఉపాయాలు పధకాలు ఏర్పరచుకుంటారు. తొందరపాటు వలన నష్టపోయే అవకాశం ఉంది. మనల్ని దెబ్బకొట్టటానికి శత్రువర్గం ఎప్పుడు పొంచి ఉంటుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. బినామీ పేర్ల మీద చేసే వ్యాపారాల్లో ద్రోహం ఎదురవుతుంది. టెండర్లు, ప్రోమ్టేడ్ పనులు, చేతి వృత్తులకు సంబందించిన కాంట్రాక్టులు అధికంగా లాభిస్తాయి. ధనం స్ధిరం చేసుకోవటం సమస్య అవుతుంది. ఆస్ధుల సంరక్షణకు సంపాదించటానికి పడినంత శ్రమపడాల్సి వస్తుంది. ప్రజాకర్షణ బాగుంటుంది. నిందలు పుకార్లు ప్రజల్లో ఉంటాయి. కానీ ప్రభావం చూపలేవు. క్రీడలకు సంబందించిన వ్యవహారాలు లాభిస్తాయి. పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తారు. చిన్న చిన్న సంఘటనలు సరదాగా మాట్లాడిన మాటల వలన అధికంగా నష్టపోతారు.  సన్నిహిత వర్గాన్ని మితిమీరి ప్రోత్సహించటం వలన చివరకు వాళ్ళ వలనే అధిక పోటీ ఏర్పడుతుంది. వివాదాలు ముదరకుండా ఆదిలోనే పరిష్కరించుకోవటం మంచిది. పంతాలు, పట్టింపులు దీర్ఘకాలంలో లాభించవు. పట్టు విడుపు, లౌకిక ప్రవర్తన వలన చెప్పుకోదగిన ప్రయోజనం కలుగుతుంది. భవిష్యత్ గురించి ఒకటే ఆందోళన, ఏదో జరుగుతుందని ముందే ఊహించుకోవటం, ప్రతి విషయాన్ని నెగిటివ్ గా ఊహించుకోవటం, లేని వాటిని ఊహించుకొని భయపడటం, ఉద్రేకాలను తగ్గించటానికి ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించాలి.

బంధువులతో విభేదాలు చాలా కాలం కొనసాగుతాయి. అనుకున్న వివాహం ఒకటి చేసుకునే వివాహం ఒకటి అవుతుంది. శనిగ్రహం అనుకూలమైన స్ధానంలో ఉన్న వారికి అనుకున్న వివాహం అవుతుంది. వివాహ జీవితంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. బంధువులు, మిత్రులు కన్నా ఎటువంటి సంబంధ బాంధవ్యాలు లేనివారు చేరదీసి ఆశ్రయం ఇస్తారు. ప్రోత్సాహాన్ని ఇస్తారు. జీవితంలో ఇది పెద్ద మలుపుగా మారుతుంది. విదేశీయానాం, విదేశీ విద్య, ఉద్యోగం, సాంకేతిక విద్య మొదలైనవి లాభిస్తాయి. భాగస్వామ్య వ్యాపార వ్యవహారాల వలన నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. పూర్వీకుల ఆస్ధి మిగలకుండా పోతుంది. స్వార్జితమైన ఆస్ది మిగులుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బాధ్యతలు సక్రమంగా నెరవేరుస్తారు. ఏమాత్రం సంబంధంలేని విషయాల వలన ఇబ్బందులు పడటమే కాకుండా చట్టపరమైన సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. దైవానుగ్రహం, తెలివితేటలు అప్రతిష్ట రాకుండా కాపాడుతుంది. ఉన్నత స్ధానాన్ని నిలబెట్టుకోవటానికి చాలా కష్టపడతారు. భోగభాగ్యాలు  అనుభవిస్తున్నప్పటికి పూర్వకాలంలో తను గడిపిన జీవితాన్ని, ఇబ్బందులను మరచిపోరు. అహంభావం లేని వ్యక్తులుగా పేరు తెచ్చుకుంటారు. గ్రహణాల ఈ రాశి  వారిపై  అధికంగా ఉంటుంది.  సకాలంలో వివాహం జరగటానికి, వైవాహిక జీవితంలో అన్యోన్నతకు, సకల కార్యసిద్ధికి, బంధు, మిత్రుల అభినందనలు పొందటానికి, సంసార సౌఖ్యతకు ఈ అదృష్ట రుద్రాక్ష కవచాన్ని ధరించాలి.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...