Wednesday, March 21, 2018

భక్తి లక్షణం

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ మార్గాలు ఆదికాలం నుంచీ భారతీయుల జీవన ధ్యేయాలయ్యాయి. మొదటి మూడూ (త్రిపుటి) ఉత్కృష్టమైన మోక్షసాధనకు సాధనాలు. జ్ఞాన భక్తి కర్మయోగాలనేవి భగవద్గీత ఆరంభ కాలం నుంచే జీవనమార్గాలయ్యాయి. మానవుడు తన అభిరుచిని అనుసరించి, ఈ మూడు మార్గాల్లో దేనినైనా స్వీకరించి లక్ష్యాన్ని సాధించవచ్చు. 

బుద్ధిజీవులకు జ్ఞానమార్గం, భావనాశీలురకు భక్తిమార్గం, క్రియాశీలురకు కర్మమార్గం స్వీకారయోగ్యమవుతాయి. మానవ జీవనవిధానంలో భక్తి వినూత్న చైతన్యాన్ని సృష్టించింది. 

ఇష్టదైవం పట్ల ప్రేమను ‘భక్తి’గా నిర్వచిస్తారు. ఆ మార్గంలో మొదటి మెట్టు ప్రతీకోపాసన. అంటే, విగ్రహారాధన. విగ్రహాన్ని సాక్షాత్తు దేవతగా భావిస్తారు. ఆ బాహ్య పూజావిధానానికి పైమెట్టు- మానసిక ప్రయత్నం. భక్తుడు తన హృదయపీఠం పైకి ఇష్టదైవాన్ని ఆహ్వానించి, ప్రతిష్ఠించి, పూజిస్తాడు. ‘అనన్య భక్తితో నన్ను ఎవరు ఆరాధిస్తారో, ఏ ఇతర భావాలూ లేక నన్నే ఎవరు ధ్యానిస్తారో, సదా అనుసరిస్తారో- వారి బాధ్యతలన్నీ నేనే నిర్వర్తిస్తాను’ అంటాడు గీతాకారుడు. భగవంతుడి పట్ల ప్రేమానుబంధం ఎక్కువయ్యేకొద్దీ, మిగిలిన వాటిపై భక్తుడి విముఖత పెరుగుతుంటుంది. దాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ‘వైరాగ్య భావన’గా పరిగణిస్తారు. 

భక్తికి సంబంధించి, రెండు దృక్పథాలున్నాయి. ఒకటి- భక్తుడు స్వప్రయత్నంతో ఈశ్వరానుగ్రహం సంపాదించడం, లేదా దైవం మీదే భారమంతా మోపి ‘సర్వాత్మ’గా ఆరాధించడం.రెండోది ప్రపత్తి. అంటే, బంధవిముక్తికి ప్రభు పాదాల్ని ఆశ్రయించడం. వీటిలో- మొదటిది మర్కట కిశోర న్యాయం. రెండోది మార్జాల కిశోర న్యాయం. మర్కటం (కోతిపిల్ల) ఎప్పుడూ తల్లి పొట్టను పట్టుకొనే ఉంటుంది. ఆ తల్లి చెట్లపై ఎంతగా గెంతుతున్నా, దాన్ని పిల్ల వదలదు. మార్జాలం (పిల్లి) తన పిల్లను నోట కరచుకొని తీసుకుపోతుంటుంది. పిల్లిపిల్ల తన రక్షణ కోసం ఏమీ చేయదు. మొదటి మార్గంలో దైవానుగ్రహాన్ని భక్తుడు సంపాదించుకుంటాడు. రెండో మార్గంలో, దైవమే అనుగ్రహిస్తాడు. ప్రపత్తి అంటే ఇదే! ఈ రెండూ పూర్తి విరుద్ధమైన మార్గాలు కావు. ఇవి అన్యోన్యమైనవి. సహానుభూతిని కలిగించేవి. 

‘అంతర్యామివి నీవు, ఆడేటి బొమ్మను నేను, చెంత గాచుట నీ పని, సేవించుట నా పని...’ అంటాడు అన్నమయ్య. ఏ ప్రాణి పట్లా ద్వేషభావం లేనివాడు; సర్వ ప్రాణుల మీద అవ్యాజమైన ప్రేమ, కరుణ గలవాడు భక్తుడు. అతడు విపరీతమైన మమత, అహంకారం- రెండూ లేనివాడు. సుఖం ప్రాప్తించినా, దుఃఖం కలిగినా సమభావం కలిగి ఉండేవాడు. క్షమాగుణం కలిగినవాడు. మనసు, శరీరం, ఇంద్రియాల్ని వశంలో ఉంచగలవాడు. సర్వకాల సర్వావస్థల్లోనూ సంతుష్టుడైనవాడే అసలైన భక్తుడు. అతడు భగవంతుడికే తన మనసును, బుద్ధిని అర్పణ చేసేంత గొప్పవాడు. 

భక్తుడు అందరితోనూ సమభావంతో మెలగాలి. నిందాస్తుతులకు చలించకూడదు. ఈర్ష్య, భయం వంటి మనోవికారాలకు లొంగకూడదు. 

భక్తుల్ని మూడు విధాలుగా గుర్తిస్తారు. ‘భగవంతుడు అక్కడెక్కడో ఉన్నాడు. ఆయన వేరు, ఆ సృష్టి వేరు’ అని భావించేవాడిది అధమ భక్తి. ‘భగవంతుడు అంతర్యామి. లోపల నుంచి అందర్నీ నియంత్రిస్తాడు’ అని తలచేవాడు మధ్యముడు. ‘సర్వమూ భగవంతుడే’ అని తలపోస్తాడు ఉత్తమ భక్తుడు. ‘సకల తత్వాలూ భగవంతుడే... సృష్టి అంతటా ఆయనే నిండి ఉన్నాడు’ అనే భావనే ఉదాత్త భక్తి!

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.......
 
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

వైదికధర్మం" హిందూధర్మం

సనాతనమైన "వైదికధర్మం" హిందూధర్మం గా ప్రఖ్యాతమైంది. ధర్మానికి సరియైన పేరు అదే అవటం వలన "హిందూ ధర్మం" అనే పురాతన కాలంనుండి నేటి వరకూ ఆ పేరు స్థిరమై నిలచింది.

మన ధర్మం "హిందూ"శబ్ధంతో పిలవడానికి అనేక కారణాలు ఉన్నాయి.అతి ప్రాచీనమైన ఈ నామానికి మూలాధారం ఋగ్వేదమంత్రాలే అని కొందరు పరిశోద్గకులు నిరూపించారు. వేదంలో అనేక చోట్ల కనబడే " సప్తసింధు " శబ్ధంనుండి హిందూశబ్ధం పుట్టింది అని "రాహుల్ సాంకృత్యాయన్" అంటారు.,,,,ప్రాకృతజనులు, ఆర్యసన్నిహిత పారశీకులు 'స ' ను 'హ' గా అనడంలో "సప్తసింధు" అనేది "హప్తహిందు" అయి దాని సంక్షిప్త రూపం "హిందూ" అయిందని వివరించారు.

'స' కారం 'హ' కారంగా మారటానికెన్నో పదాలు ఉదాహరణలున్నాయి.

సప్త అనేది హప్తగా,కేసరి అనేది ప్రాచీన హిందీలో 'కేహరి' గా, సరస్వతి అనేది పర్షియాలో 'హరహ్వతి' గా, అసుర అనేది 'అహుర' గా అవుతుంది. పర్షియన్ల ప్రాచీన అవెస్తా గ్రంథంలో 'సప్తసింధువును' హప్తహిందువు' గానే చెప్పారు.పర్షియన్లు వైదికార్యుల్ని "హిందువులు" అనే పిలిచేవారు.

మీకు నిజంగా తెలివుంటే పరిశీలించండి.

హప్తహిందూ శబ్దానికి మూలమైన సప్తసింధువులు " ఇమం మే గంగే యమునే సరస్వతీ శుతుద్రీ స్తోమం సచతా పరుష్ణ్యా ఆశిక్న్యా మరుద్వృధే వితస్తయార్జీకీయే ఋణోహ్య సషోమయా " అనే ఋగ్వేదమంత్రంలో చెప్పబడ్డాయి.

గంగ,యమున,శుతుద్రీ,మరుద్వృధ,ఆర్జీకీయ,సుషోమ అనే ఏడునదులు సప్తసింధువులు.ఈ సప్తసింధూ శబ్ధం"అష్టౌవ్యఖ్యత్ కుకుభ: పృథివ్యా స్త్రీ ధన్వయోజనా సప్తసింధూన " (1-35-8) వంటి అనేక ఋగ్మంత్రాలలో కనబడుతుంది.ఆ సప్తసింధు వాసులు సింధువులై క్రమంగా హిందువులైనారు.

బహుళప్రచారంలో ఉన్న భాషలన్నిటా,, పైరీతి హిందూశబ్ధమే గ్రహింపబడుటవలన అదే స్థిరమైంది.అలా హిందూశబ్ధం "సప్తసింధు "ద్వారానే స్థిరపడినా,లేక స్వతంత్ర శబ్ధంగానే ఏర్పడినా అది అతి ప్రాచీనము,అతి పవిత్రమైన శబ్ధము.దానికెన్నో వివరణలు ఉన్నాయి.

క్రీ.పూ 4 వ శతాబ్ధం నాటి వృద్ధస్మృతిలో "హింసయా దూయతే యశ్చ - సదాచారతత్పర:; వేదగో ప్రతిమాసేవీ - స హిందూముఖ వర్ణభాక్ " అనిచెప్పబడింది. దీనినిబట్టి హింసనుగూర్చి
దు:ఖించేవాడు,సదాచార తత్పరుడు,వేదములు- గోవులు- దేవతాప్రతిమలనారాధించేవాడు "హిందువు " అని తెలుస్తుంది.అట్లే "హింసయా దూయతే చిత్తం - తేన హిందురితి స్మృత:" అని చెప్పడం వలన
శారీరక,మానసిక, వాచిక త్రివిధ హింసల విషయమునను మనస్సు పరితాపం పొందువాడు హిందువు.

ఈ హిందూ నిర్వచనాన్ని స్పష్టపరుస్తూనే ఆదికవి వాల్మీకి నుండి ఆదికావ్యం రామాయణం వెలువడింది.ఆ రామాయణమే "రామో విగ్రహవాన్ ధర్మ:"అనిపించుకున్న ధర్మస్వరూపుడైన రామునిచరిత్ర తెలియజేసింది.బోయవాడు క్రౌంచపక్షిని బాధించుటచే బాధపడ్డ వాల్మీకి హృదయం నిజమైన హిందూ హృదయం.అందుండి అప్రయత్నంగా వెలువడిన "మానిషాద" అనే శ్లోకమే హిందూ హృదయానికి అద్దంపట్టే రామాయణ మూలకారణం.

క్రీ.శ 4 వ శతాబ్దినాటిదే అయిన బార్హస్పత్య శాస్త్రంలో"హిమాలయం సమారభ్య - యావదిందుసరోవరం; తద్దేవ నిర్మితం దేశం - హిందుస్థానం ప్రచక్షతే " ఇక్కడ హిమాలయం నుండి హిందూమహాసముద్రం వరకు వ్యాపించినది హిందూభూమిగా చెప్పబడింది.

ఈ హిందూభూమియందు నివసించువారు హిందువులనికూడా దీని ద్వారా గ్రహించవచ్చు.ఈ దేశం పరమాత్ముని సృష్టికి నాభివంటిది.అందువలన దీనికి "అజనాభ" అనికూడా పేరు వచ్చింది.

వృద్ధస్మృతిలో చెప్పినట్లే మేరుతంత్రంలోకూడా "హీనం చ దూషయత్యేవ హిందురిత్యుచ్యతే ప్రియే " అని హీనతను దూషించేవాడే హిందువని పార్వతీదేవికి పరమశివుడు వివరిస్తాడు.కార్తవీర్యార్జునుడు సిద్ధిపొందిన మంత్రాలే ఈ "మేరుతంత్ర "గ్రంథం.

క్రీ.శ 11 వ శతాబ్దినాటి పారిజాతాపహరణ నాటకంలో "హినస్తి తపసా పాపాన్ దైహికాన్ దుష్ట మానసాన్ ; హేతిభి: శతృవర్గశ్చ స హిందురభిదీయతే " అని ఎవరు తన దేహ మనస్సంబంధమైన పాపాలను తపస్సుద్వారా నాశనం చేసుకొంటారో,శతృవులను ఖడ్గంతో అంతంచేస్తారో వారు హిందువులు అని చెప్పబడింది.

హిందూ శబ్ద విశిష్టతను చాటే నిర్వచనాలలో క్రీ.శ 14వ శతాబ్దినాటి మాధవ దిగ్విజయంలో "ఓంకార మూలమంత్రాఢ్య: - పునర్జన్మ దృఢాశయ: ; గోభక్తో భారతగరు: - హిందుర్హింసక దూషక:" అని చెప్పబడినది. ఓంకారాన్ని మూలమంత్రంగా భావించేవాడు, పునర్జన్మయందు విశ్వాసం కలవాడు,గో భక్తుడు, భారతమే గురుస్తానమైనవాడు,హింసను దూషించేవాడు "హిందువు " అని చెప్పబడింది.
హిందూశబ్దం అనేక నిఘంటువులలో వివరింపబడినది.

శబ్దకల్పదృమంలో " హీనం దూషయతి ఇతి హిందు:" జాతివిశేష: అని చెప్పుటవలన చెడును దూషించేవాడు హిందువని,
హిందూ అనేది ఒక జాతి అని తెలుస్తుంది.అదే మన హిందూజాతి." పృషోదరాదిత్వాత్సాధు:" అని రూపసాధన కూడా వివరింపబడింది.
" హిందు: - హిందూ - హిందవ:" అని శంభుశబ్దమువలే ఉకారాంతంగా గ్రహించాలి అని మేదినీకోశం చెబుతుంది.
"హిందుర్హిందుశ్చ సంసిద్ధౌ దుష్టానాం చ విధర్షణే " అని హిందువు దుష్టులను, చెడును,అంతం చేయడానికే ఏర్పడినాడని అద్భుతరూపకోశం చెబుతోంది.
దీనినిబట్టి "హిదు " , "హిందూ " రెండు శబ్దాలుగా స్వీకరించవచ్చునని, రెండూ సాధుశబ్దాలే అని గ్రహించగలం.

వీనికి దైత్యారి అనే అర్థం కూడా చెప్పబడింది. అంటే హిందూ ధర్మాన్ని వ్యతిరేకించడం రాక్షసత్వమే అని గ్రాహ్యం.హిందువనగా విష్ణువని, యోగి అనికూడా అర్థం. " హిందుర్హి నారాయణాది దేవతారక్త: " శ్రీమన్నారాయణాది దేవతలయందు భక్తి కలవాడు హిందువని హేమంత కవికోశం చెబుతున్నది.
హిందూ శబ్ద విశిష్టతను చాటే నిర్వచనాలలో 14వ శతాబ్ది నాటి #మాధవ_దిగ్విజయంలో "ఓంకార మూల మంత్రాఢ్య: - పునర్జన్మ దృఢాశయ: ; గోభక్తో భారతగరు: హిందుర్హింసక దూషక:" అని చెప్పబడినది. ఓం కారాన్ని మూలమంత్రంగా భావించేవాడు, పునర్జన్మయందు విశ్వాసం కలవాడు,గో భక్తుడు, భారతమే గురుస్తానమైన వాడు, హింసను దూషించేవాడు "హిందువు " అని చెప్పబడింది.
హిందూ శబ్దం అనేక నిఘంటువులలో వివరింపబడినది.

#శబ్దకల్పదృమంలో " హీనం దూషయతి ఇతి హిందు:" జాతివిశేష: అని చెప్పుటవలన

చెడును దూషించేవాడు హిందువని, హిందూ అనేది ఒక జాతి అని తెలుస్తుంది.అదే మన హిందూజాతి."
పృషోదరాదిత్వాత్సాధు:" అని రూపసాధన కూడా వివరింపబడింది.
" హిందు: - హిందూ - హిందవ:" అని శంభుశబ్దమువలే ఉకారాంతంగా గ్రహించాలి అని #మేదినీకోశం చెబుతుంది.

"హిందుర్హిందుశ్చ సంసిద్ధౌ దుష్టానాం చ విధర్షణే " అని హిందువు దుష్టులను, చెడును,అంతం చేయడానికే ఏర్పడినాడని #అద్భుతరూపకోశం చెబుతోంది.

హిందువనగా విష్ణువని, యోగి అనికూడా అర్థం. " హిందుర్హి నారాయణాది దేవతారక్త: " శ్రీ మన్నారాయణాది దేవతలయందు భక్తి కలవాడు హిందువని #హేమంతకవికోశం చెబుతున్నది.

!! హిందుర్దుష్టనృహాప్రోక్తా నార్యనీతి విదూషక: ;
సద్ధర్మపాలకో విద్వాన్ - శ్రౌతధర్మపరాయణ: !!
అనగా దుష్టులను అంతమొందించు వాడు, దుష్టనీతిని నిరసించువాడు, ధర్మమును పాలించువాడు, విజ్ఞుడు, వేద ధర్మములను ఆచరించేవాడే

హిందువని #రామకోశం చెబుతుంది.
మరి హిందూ శబ్దం సంస్కృతంలో లేదంటారా...?
ఇలా ఎన్నో సందర్భాలలో హిందూ అనే పదం చర్చించబడింది గమనించగలరు
నేను హిందువుని....
నాధర్మం గొప్పదని నాకు తెలుసు...
నాకు ఎవరినీ విమర్శించాల్సిన అవసరం లేదు (నా ధర్మం జోలికి రానంతవరకు) .....
నా ధర్మాన్ని విమర్శించేవారు అజ్ఞానులనే నా అభిప్రాయం....
నరాలుతెగి రక్తం చిందుతున్నా...
నా గుండెచప్పుడు ఆగేవరకు గర్వంగా చెప్పగలను నేను "హిందువు"నని

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

తిధులు , మంచి, చెడు, - వాటి దేవతలు


🔔 *పాడ్యమి*
శుద్ధ పాడ్యమి ఉదయం నుండి పనులకు మంచిది కాదు, తిది అర్ధ భాగం తరువాత మంచిది, బహుళ పాడ్యమి అన్నిటికీ శుభప్రదమే.
*ఈ తిథికి అధిదేవత అశ్వినీ దేవతలు*

🕉 *విదియ* : 
ఉభయ  పక్షములలో ఈ తిథిలో  ఏ పని తలపెట్టినా  శుభకరము 
*ఈ తిథికి అధిదేవత బృహస్పతి*

✡ *తదియ* : 
ఉభయ పక్షములలో ఈ తిథిలో పనులలో విజయం, ఆనందం కలిగించును.
*ఈ తిథికి అధిదేవత గౌరీ దేవీ*

☸ *చవితి* : 
శుక్ల పక్షంలో మద్యాహ్నం 1 గం ॥ వరకు గణపతి కి మంచిది, తరువాత మనకు మంచిది, బహుళ చవితి అన్నిటికీ శుభకరం. *ఈ తిథికి అధిదేవత గణపతి*
 
🐍 *పంచమి* : 
అభయ పక్షములలో ఈ తిథికి శుభానికి చిహ్నం, ఈ తిది లో చేసిన పని లాభం చేకూరును.
*ఈ తిథికి అధిదేవత సర్పము*
నాగ దోషం ఉన్నవారు ప్రతి పంచమికి సర్ప ఆరాధన చేయడం మంచిది.
  
🌟 *షష్ఠి*
పగలు సుబ్రమణ్య స్వామికి  కేటాయించి నందున, రాత్రి మనకు మంచిది. ఉభయ పక్షములలో వివాహ -ఉపనయనములకు ఎల్లప్పుడూ మంచిది. 
*ఈ తిథికి అధిదేవత కుమారస్వామి*  

🌞 సప్తమి : 
ఉభయ పక్షములలో అన్ని పనులకు మంచిది.  
*ఈ తిథికి అధిదేవత సూర్యుడు*

🔺 *అష్టమి* : 
దుర్గా  దేవి పూజకి మాత్రమే కలిసి వచ్చే రోజు, మనకు కలిసి రాదు, కాకపొతే వివాహ ఉపనయనములకు మంచిది.                                        *ఈ తిథికి అధిదేవత అష్ట మాతృకలు*

🔷 *నవమి* :                                                                                                                                                                                                           ఉభయ పక్షములలో వివాహ ఉపనయనాలకు మాత్రమే శుభప్రదం. రాత్రి గృహ ప్రవేశాలకు మంచిది.                                               *ఈ తిథికి అధిదేవత దుర్గాదేవి*    

🔔 *దశమి* : 
ఉభయ పక్షములలో సమస్త కార్యములకు విజయము .                                                                                                                                               *ఈ తిథికి అధిదేవత దిక్పాలకులు*

🔥 *ఏకాదశి* : 
కొన్నిటికి మాత్రమే శుభం. పది పనులలో ఒకటి జరుగును.                                                                                                                                   *ఈ తిథికి అధిదేవత కుబేరుడు*

🔥 *ద్వాదశి* :  
ఉభయ పక్షములలో అన్ని శుభకార్యాలకు మంచిది.         
ప్రయాణములకు ఆహారం తిని వెళ్ళిన మంచిది, శుభప్రదం, లాభం కలుగును.                                                                                                      ఏమి తినకుండా వెళ్ళిన చొ పనులు నేర వేరక తిరిగి వచ్చెదరు.                                                                                                                                        *ఈ తిథికి అధిదేవత విష్ణువు*

🕉 *త్రయోదశి*: 
శుక్ల పక్షంలో అన్ని పనులకు విజయము. బహుళ పక్షంలో వర్జితము. 
*ఈ  తిథికి అధిదేవత ధర్మదేవత*

🔥 *చతుర్దశి* :                                                                                                                                                                                                     శుక్లపక్షంలో అన్ని పనులకు విజయము. బహుళ పక్షంలో వర్జితము.
 *ఈ తిథికి అధిదేవత  రుద్రుడు*

🌝 *పౌర్ణమి* : 
అన్ని శుభాలే. కాకపొతే  పౌర్ణమి  రాత్రి 8-22, 8-24, 8-26, 8-28, 8-42, 8-44, 8-46, 8-48.  ఈ సమయములలో వర్జం లేకుండా ఉంటే , మాత్రమే మరింత   మంచిది .

🌚 *అమావాస్య* శుభకార్యాలకు వర్జితము. ప్రయాణాలు చేయకూడదు అనేది అపోహ. ఈరోజున పితృ దేవతలను ఆరాధించడం మంచిది.
*ఈ తిథికి అధిదేవత పితృదేవతలు*

⭕ *గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసమే ఇవ్వడం జరిగింది. తిథితో బాటు ఆరోజున శుభ నక్షత్రము యోగ కరణాలు కూడా బాగుండాలి. పై సమాచారం బట్టి స్వయంగా   నిర్ణయం చేసుకోవడం మంచిదికాదు*

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.........

హిందూసనాతనం

✨☀✨పంచగంగలు✨☀✨
1. గంగ
2. కృష్ణ
3. గోదావరి
4. తుంగభద్ర
5. కావేరి

✨☀✨షడ్గుణాలు✨☀✨

హిందూ సాంప్రదాయం ప్రకారం మనలోని 6 గుణాలుంటాయి.
అవి.
1. కామం
2. క్రోధం
3. లోభం
4. మోహం
5. మదం
6. మత్సరం

✨☀✨షట్చక్రాలు✨☀✨

మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు
1. మూలాధార చక్రము
2. స్వాధిష్ఠాన చక్రము
3. మణిపూరక చక్రము
4. అనాహత చక్రము
5. విశుద్ధ చక్రము
6. ఆజ్ఞా చక్రము

✨☀✨షడ్విధ రసములు☀✨
షడ్విధ రసములు
1. ఉప్పు
2. పులుపు
3. కారం
4. తీపి
5. చేదు
6. వగరు

✨☀✨షడృతువులు✨☀✨

షడృతువులు - ఋతువులు 6
అవి
1. వసంత ఋతువు
2. గ్రీష్మ ఋతువు
3. వర్ష ఋతువు
4. శరదృతువు
5. హేమంత ఋతువు
6. శిశిర ఋతువు

✨☀✨సప్త గిరులు✨☀✨

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు.వీటినే సప్త గిరులు అని అంటారు.
అవి.

1 శేషాద్రి
2 నీలాద్రి
3 గరుడాద్రి
4 అంజనాద్రి
5 వృషభాద్రి
6 నారాయణాద్రి
7 వేంకటాద్రి

✨☀✨సప్త స్వరాలు✨☀✨

మన భారతీయ సంగీతంలో 7 స్వరాలు కలవు.వీటినే సప్త స్వరాలు అని పిలుస్తారు.
అవి.

1. స = షడ్జమం (నెమలి క్రేంకారం)
2. రి = రిషభం (ఎద్దు రంకె)
3. గ = గాంధర్వం (మేక అరుపు)
4. మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)
5. ప = పంచమం (కోయిల కూత)
6. ధ = ధైవతం (గుర్రం సకిలింత)
7. ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)

✨☀✨సప్త ద్వీపాలు✨☀✨

బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ప్రస్తావన ఉంది.
అవి .
1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు
2. ప్లక్షద్వీపం - మేధాతిథి
3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు
4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు
5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు
6. శాకద్వీపం - హవ్యుడు
7. పుష్కరద్వీపం - సేవనుడు.

✨☀✨సప్త నదులు✨☀✨

సప్త నదులు
1. గంగ
2. యమున
3. సరస్వతి
4. గోదావరి
5. సింధు
6. నర్మద
7. కావేరి

✨☀✨సప్త అధొలోకములు✨☀✨

1. అతలము
2. వితలము
3. సుతలము
4. తలాతలము
5. రసాతలము
6. మహాతలము
7. పాతాళము

✨☀✨సప్త ఋషులు✨☀✨

1.వశిష్టుడ
2.ఆత్రి
3.గౌతముడు
4.కశ్యపుడు
5.భరద్వాజుడు
6.జమదగ్ని
7.విశ్వామిత్రుడు

✨☀✨పురాణాలలో అష్టదిగ్గజాలు✨☀✨

1. ఐరావతం
2. పుండరీకం
3. వామనం
4. కుముదం
5. అంజనం
6. పుష్పదంతం
7. సార్వభౌమం
8. సుప్రతీకం

✨☀✨అష్ట జన్మలు✨☀✨

1.దేవ జన్మ
2. మనుష్య జన్మ
3. రాక్షస జన్మ
4. పిచాచ జన్మ
5. పశు జన్మ
6. పక్షి జన్మ
7. జలజీవ జన్మ
8. కీటక జన్మ

✨☀✨ అష్ట భార్యలు✨☀✨

శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలును అష్ట భార్యలు లేదా అష్టమహిషులు అని అంటారు.
వారు
1. రుక్మిణి
2. సత్యభామ
3. జాంబవతి
4. మిత్రవింద
5. భద్ర
6. సుదంత
7. కాళింది
8. లక్షణ

✨☀✨అష్ట కష్టములు✨☀✨

అష్ట కష్టములు
1. ఋణము
2. యాచన
3. ముసలితనము
4. వ్యభిచారము
5. దొంగతనము
6. దారిద్ర్యము
7. రోగము
8. ఎంగిలి తిని బ్రతుకుట

✨☀✨అష్ట కర్మలు✨☀✨

1. స్నానము
2. సంధ్య
3. జపము
4. హూమము
5. స్వాధ్యాయము
6. దేవ పూజ
7. ఆతిధ్యము
8. వైశ్యదేవము

✨☀✨అష్టభాషలు.✨☀✨

1. సంస్కృతము
2. ప్రాకృతము
3. శౌరసేని
4. మాగధి
5. పైశాచి
6. సూళికోక్తి
7. అపభ్రంశము
8. ఆంధ్రము

✨☀✨నవధాన్యాలు✨☀✨

మన నిత్య జీవితంలో ఉపయోగించే 9 రకాల ధాన్యాలను నవ దాన్యాలు అని పిలుస్తారు అవి -

గోధుమలు ,వడ్లు ,పెసలు,

శనగలు , కందులు , అలసందలు,

నువ్వులు, మినుములు ,ఉలవలు

✨☀✨నవ రత్నాలు✨☀✨

నవ రత్నాలు
1.మౌక్తికం = ముత్యము
2.మాణిక్యం = కెంపు
3.వైఢూర్యం = రత్నం
4.గోమేదికం = పసుపురంగులోని ఒక రత్నం
5.వజ్రం
6.విద్రుమం = పగడం
7.పుష్యరాగం = తెల్లటి మణి
8.మరకతం = పచ్చ
9.నీలమణి

✨☀✨నవధాతువులు✨☀✨

నవధాతువులు
1. బంగారం
2. వెండి
3.ఇత్తడి
4.సీసం
5.రాగి
6.తగరం
7.ఇనుము
8.కంచు
9.కాంతలోహం

✨☀✨నవబ్రహ్మలు✨☀✨

1.మరీచి
2.భరద్వాజుడు
3.అంగీరసుడు
4.పులస్త్యుడు
5.పులహుడు
6.క్రతువు
7.దక్షుడు
8.వసిష్టుడు
9.వామదేవుడు

✨☀✨నవ చక్రములు✨☀✨

మానవ శరీరంలో గల చక్రస్థానాలు.
1. మూలాధార చక్రము
2.స్వాధిష్టాన చక్రము
3.నాభి చక్రము
4.హృదయచక్రము
5.కంఠ చక్రము
6.ఘంటికాచక్రము
7.భ్రూవుచక్రము
8.బ్రహ్మరంధ్రము
9. గగన చక్రము

✨☀✨నవదుర్గలు✨☀✨

నవదుర్గలు
1 శైలపుత్రి దుర్గ
2 బ్రహ్మచారిణి దుర్గ
3 చంద్రఘంట దుర్గ
4 కూష్మాండ దుర్గ
5 స్కందమాత దుర్గ
6 కాత్యాయని దుర్గ
7 కాళరాత్రి దుర్గ
8 మహాగౌరి దుర్గ
9 సిద్ధిధాత్రి దుర్గ

✨☀✨దశ దిశలు✨☀✨

1. తూర్పు
2. ఆగ్నేయం
3. దక్షిణం
4. నైఋతి
5. పడమర
6. వాయువ్యం
7. ఉత్తరం
8. ఈశాన్యం
9.భూమి (క్రింది ప్రక్క)
10.ఆకాశం (పైకి)

✨☀✨దశావతారాలు✨☀✨

1. మత్స్యావతారము
2. కూర్మావతారము
3. వరాహావతారము
4. నృసింహావతారము లేదా నరసింహావతారము
5. వామనావతారము
6. పరశురామావతారము
7. రామావతారము
8. కృష్ణావతారము
9. బుద్ధావతారము
10. కల

్క్యావతారము

✨☀✨దశవిధ సంస్కారములు✨☀✨

1. వివాహము
2. గర్బాదానము
3.పుంసవనము
4.సీమంతము
5.జాతక కర్మ
6.నామకరణము
7.అన్న ప్రాశనము
8.చూడకర్మ
9.ఉపనయనము
10.సమావర్తనము

✨☀✨దశవిధ బలములు✨☀✨

1. విద్యా బలము
2.కులినితా బలము
3.స్నేహ బలము
4.బుద్ది బలము
5.ధన బలము
6.పరివార బలము
7.సత్య బలము
8. సామర్ద్య బలము
9. జ్ఞాన బలము
10. దైవ బలము

చాగంటి కోటేశ్వర రావు గారి గూర్చి చాలామందికి తెలియని కొన్ని సంగతులు  

  🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉                  

ఇవాళ సినిమా హీరోలలో అగ్రహీరోలకు ఏమాత్రం తీసిపోని పేరుప్రఖ్యాతులు కలిగిన ప్రవచనకారుడు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు.  గత పదిహేనేళ్లలో ఆయన సాధించిన ప్రతిష్ట మరే ఇతర ఆధ్యాత్మికవేత్తలకు దక్కలేదు అనేది నిస్సందేహం.  అఖండ ప్రజ్ఞావంతుడు, పండితుడు, వేదమూర్తి చాగంటి వారు.  ఆయన ఎంతటి ఖ్యాతి గడించారో , కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు.  సునాయాసంగా బయటపడ్డారు.  

చాగంటివారు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో మేనేజర్ గా పనిచేస్తున్నారు.  ఆయన భార్య వ్యవసాయశాఖలో ఉన్నతాధికారిణి.  ఏ ఛానెల్లో చూసినా చాగంటి వారి ప్రవచనాలు కనిపిస్తుంటాయి.  అవి చూస్తే అసలు చాగంటి వారు ఏనాడైనా ఆఫీసుకు వెళ్తారా అనే సందేహం కలుగుతుంది ఎవరికైనా.  కానీ చాగంటివారు ఆఫీసుకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టరు.  ఒక్కసారి కూడా లేట్ పెర్మిషన్స్ తీసుకోరు.  ఆయన కేవలం శనివారం, ఆదివారం మాత్రమే ప్రవచనాలు ఇస్తారు.  అవి కూడా కాకినాడలోని ఒక దేవాలయంలో.  ఛానెల్స్ వారు అక్కడికి వెళ్లి రికార్డ్ చేసుకుని ప్రసారం చేస్తుంటారు.  

చాగంటి వారికి ఉన్న ప్రతిభాసంపత్తిని సొమ్ము చేసుకోదలచుకుంటే ఈపాటికి ఆయన వందల ఎకరాల భూములు, ఇల్లువాకిళ్ళు, మణిమాణిక్యాలు సంపాదించేవారు.  కానీ ప్రవచనాలను ఆయన నయాపైసా పారితోషికం తీసుకోరు.  ఎక్కడికైనా బయట నగరాలకు వెళ్లి ప్రవచనాలు ఇవ్వాల్సివస్తే ఆయన తన సొంత డబ్బుతో స్లీపర్ క్లాస్ టికెట్ కొనుక్కుని ప్రయాణం చేస్తారు తప్ప నిర్వాహకులనుంచి డబ్బు తీసుకోరు.  ఆయనకున్నది కేవలం రెండు పడకగదుల చిన్న ఇల్లు.  ఇంతవరకు ఆయనకు కారు లేదు.  ఆఫీసుకు కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తారు.  ఎఫ్ సి ఐ డైరెక్టర్ క్రైస్తవుడు.  చాగంటి వారు ఆఫీసుకు వెళ్ళగానే ఆయనే స్వయంగా వచ్చి బూట్లు విప్పి చాగంటి వారికి నమస్కారం చేస్తారు.  సెలవులను ఉపయోగించుకోమని, కావాలంటే లేట్ అనుమతులు తీసుకోమని చెప్పినా చాగంటివారు ఆ సౌకర్యాలను ఎన్నడూ వినియోగించుకోలేదు.  

చాగంటి వారికి ఆరేడేళ్ల వయసులో జనకులు గతించారు.  ఆయనకు ఒక అక్క, ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు.  తల్లిగారు కస్టపడి నలుగురు పిల్లలను పెంచారు.  వారికి ఆస్తిపాస్తులు లేవు.  నిరుపేద కుటుంబం.  సంసారానికి తాను మాత్రమే పెద్ద దిక్కు అన్న స్పృహ పొటమరించగా చాగంటి వారు అహోరాత్రాలు సరస్వతీ ఉపాసనే లక్ష్యంగా విద్యను అభ్యసించారు.  పాఠశాల స్థాయినుంచి ఆయన విద్యాబుద్ధులు వికసించాయి.  వేదాగ్రణి ఆయన రసన మీద తిష్టవేసుకుని కూర్చున్నది.  ఫలితంగా ఆయన యూనివర్సిటీ స్థాయివరకు గోల్డ్ మెడలిస్టుగా ఎదిగారు.  

ఇక ఆయన ఇవాళ చెప్పే ప్రవచనాల వెనుక ఆయనేదో వేదవేదాంగాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆపోసన పట్టారని చాలామంది పొరపడతారు.  ఆయన కృషి పెద్దగా లేదు. అవన్నీ ఆయనకు పూర్వజన్మ సుకృతంగా లభించినవి అంటే మనం ఆశ్చర్యపోవాలి.  ఇది వారికి భగవంతుడు ఇచ్చిన వరం తప్ప ఈ జన్మకృషి కాదు.  అలా అని ఆయన వాటిని చదవలేదని కాదు.  ఎంతచదివినా ధారణాశక్తి అనేది ప్రధానం.  ఒకసారి శంకరుల సౌందర్యలహరి తిరగేస్తే అది మొత్తం ఆయన మదిలో నిలిచిపోతుంది.  ఎక్కడ ఏ పేజీలో ఏమున్నదో చెప్పగలరు.  వరప్రసాదితులకు మాత్రమే ఇది సాధ్యం.  

ఆయన ఉద్యోగంలో చేరాక తోబుట్టువుల బాధ్యతను స్వీకరించారు.  అక్క, చెల్లెలు, తమ్ముడుకు తానె  తన సంపాదనతో వివాహాలు చేశారు.  కుటుంబం కోసం తన కష్టార్జితాన్ని మొత్తం ధారపోశారు.  తనకంటూ ఈరోజు వరకు బ్యాంకు బాలన్స్ లేదంటే నమ్ముతారా?  

అప్పుడపుడు కాకినాడలో అయ్యప్ప దేవాలయంలో సాయంత్రం కూర్చుని భక్తులముందు భారతభాగవత ప్రవచనాలు ఇచ్చేవారు.  ఎన్నడూ పట్టణం దాటి ఎరుగరు.  ఏనాడూ డబ్బు పుచ్చుకునే వారు కారు.  ఆయన స్వరలాలిత్యం, ధారణ, విజ్ఞానం, విశదీకరణ భక్తులను ఆకర్షించాయి.  అభిమానులు పెరిగారు.  

పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో అనుకుంటాను.. ఎక్కడో ఒకచోట చాగంటి వారిని కలిశారు.  "మీ గురించి ఎంతో విన్నాను.  మీ ఆధ్యాత్మిక పరిజ్ఞానం అసాధారణం. మీ ప్రవచనాలు నాకు బాగా నచ్చాయి.  ముఖ్యంగా మీ పాండితీప్రకర్ష అమోఘం.  ఇప్పుడు నేను మంచి స్థితిలో ఉన్నాను.  ఏమైనా అడగండి.  చేసిపెడతాను"  అన్నారు పీవీ.  

చాగంటి వారు నవ్వేసి "మీకూ, నాకు ఇవ్వాల్సింది ఆ పరమాత్మే తప్ప మరెవరూ కారు.  మీ సహృదయానికి కృతజ్ఞతలు.  నాకేమీ ఆశలు లేవు." అని నమస్కరించి బయటకు వెళ్లిపోయారు.  

ఈనాటికి కూడా ఆయనకు ఉన్నది కేవలం రెండు మూడు ధోవతులు, నాలుగు పంచెలు, నాలుగు జతల ఆఫీస్ బట్టలు!!  

 
చాగంటివారిని చూసి ఆయన ఎన్నో ఏళ్ళనుంచి ప్రవచనాలు ఇస్తున్నారని, లక్షలు సంపాదించి ఉంటారని చాలామంది భావిస్తుంటారు.  ఆయన బయటప్రాంతాల్లో ప్రవచనాలు ఇవ్వడం వారి అమ్మగారు 1998  లో స్వర్గస్తులు అయ్యాక ప్రారంభించారు.  ఎందుకంటే చాగంటి వంశంలో గత ఆరు తరాలుగా ఆ సరస్వతి కటాక్షం ఎవరో ఒక్కరికే వస్తున్నది.  ఈ తరంలో ఆ శారదాకృప నలుగురు పిల్లలలో చాగంటి  కోటేశ్వర రావు గారిపై ప్రసరించింది.  ఆ మాత దయను తృణీకరించలేక తనకు తెలిసిన జ్ఞానాన్ని లోకానికి పంచుతున్నారు చాగంటి వారు

ధుర్మార్గులను ఖండించక పోవుట ఏంతటి తప్పో
ఇట్టువంటి మహాత్ములను ప్రశంసించక పోవడం గూడా అంతే తప్పు ఔతుంది
ఒక మహోన్నతమైన వ్యక్తిని కీర్తించడం పదుగురికీ తెలియజేస్తున్న మీ మహోన్నత వ్యక్తిత్వం ప్రశంసనీయం ధన్యవాదములు

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...