Friday, October 25, 2013

కుమార షష్ఠి విశిష్టత

పార్వతీ పరమేశ్వరుల మంగళకరమైన ప్రేమకు, అనుగ్రహానికి ఐక్యరూపం-సుబ్రహ్మణ్య స్వామి. స్వామి అనే నామధేయం కేవలం సుబ్రహ్మణ్యానికే సొంతం. దేవసేనాధిపతిగా, సకల దేవగణాల చేత పూజలందుకునే దైవం కుమార స్వామి అని పురాణాలు చెబుతున్నాయి. అలాంటి షణ్ముఖుని అనుగ్రహం పొందగలిగితే స్కంద పంచమి, కుమార షష్ఠి (5,6 తేదీల్లో) రోజుల్లో స్వామిని పూజించాలి. కుమార స్వామిని పూజిస్తే గౌరీశంకరుల కటాక్షం మనకు లభించినట్లే.
శివపార్వతుల తనయుడైన కుమార స్వామి గంగాదేవి గర్భంలో పెరిగాడు. ఆమె భరించలేకపోవడంతో, ఆ శిశువు రెల్లు పొదల్లో జారిపడింది. ఆ శిశువును కృత్తికా దేవతలు ఆరుగురు స్తన్యమిచ్చి పెంచారు. జారిపడినందున ఆ శిశువును స్కందుడని, రెల్లు గడ్డిలో ఆవిర్భవించడంతో శరవణుడని, కృత్తికా దేవతలు పెంచడంతో కార్తీకేయుడని కుమార స్వామిని పిలుస్తారు.
ఇక సుబ్రహ్మణ్యునికి ఉన్న ఆరు ముఖాలకు ప్రత్యేకతలున్నాయి. మయూర వాహనాన్ని అధిరోహించి కేళీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం, పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం, శూరుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం, శరుణు కోరిన వారిని సంరక్షించే ముఖం, శూలాయుధ పాణియై వీరుడిగా ప్రస్పుటమయ్యే ముఖం, లౌకిక సంపదల్ని అందించే ముఖం... ఇలా ఆరు ముఖాల స్వామిగా ఆనంద దాయకుడిగా స్వామి కరుణామయుడిగా భక్తులచే నీరాజనాలు అందుకుంటున్నాడు.
అందుచేత ఆషాఢ మాస శుక్ల పక్ష పంచమి, షష్ఠి పుణ్య దినాల్లో భక్తులు స్వామిని విశేషంగా సేవిస్తారు. వీటిని స్కంద పంచమి, కుమార షష్ఠి పర్వదినాలుగు జరుపుకుంటారు. స్కంద పంచమినాడు కౌమారికీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.
ఇంకా పంచమి నాడు ఉపవాసం ఉండి, షష్ఠి నాడు కుమార స్వామిని పూజించడం ఓ సంప్రదాయంగా వస్తుంది. నాగ దోషాలకు, సంతాన లేమి, జ్ఞాన వృద్ధికీ, కుజ దోష నివారణకు సుబ్రహ్మణ్య ఆరాధనమే తరుణోపాయ. స్కంద పంచమి, షష్ఠి రోజుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే సకల సంపదలు, సుఖవంతమైన జీవితం చేకూరుతుందని పురోహితులు చెబుతున్నారు.
పూజామందిరంలోని సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని పసుపు కుంకుమలతో, పుష్పాలతో అలంకరించుకుని సుబ్రహ్మణ్యాష్టకంతో స్వామిని ప్రార్థించే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. 


కుజుడు - సుబ్రహ్మణ్య స్వామి
కుజుడు కోపానికి కారకుడు. సుబ్రహ్మణ్య స్వామి కేవలం ఒక మామిడి పండు విషయంలోనే తల్లితండ్రుల పై అలిగి కోపగించి పళని కి ఏగిన విషయం విదితమే. ఇక కుజుడు అగ్నికి కారకుడు. సుబ్రహ్మణ్య స్వామి తొలూత శివుని మూడవ కంటనుండి 6 నిప్పు రవ్వలుగా బయటపడ్డాడన్నది పురాణం. కుజుడు క్రిమి కీటకాదులకు వ్యతిరేకంగా పోరాడే తెల్ల కణాలకు అధిపతి. సుబ్రహ్మణ్య స్వామి ఏకంగా దేవుళ్లకే సైన్యాధిపతి. కుజుడు ఆయుధాలకు కారకుడు. గుహుడు తన పండ్రెండు చేతుల్లోను ఆయుధాలు కలిగి ఉంటాడుగా. ఇలా కుజ గ్రహానికి ,గుహబ్రహ్మ అయిన సుబ్రహ్మణ్యస్వామికి ఎన్నో సంబంధాలున్నాయి. అందుకే కుజ దోషం వలన కలిగే రుగ్మతలకు ఉపశమనం కోరువారు సుబ్రహ్మణ్యస్వామిని పూజించాలని సూచించియున్నాం.
మూలమంత్రం:
ఓం సౌం శరహణ భవ శ్రీం హ్రీం క్లీం క్లౌం సౌం నమహ
భీజం:
సౌం.
స్వామి !
సుబ్రహ్మణ్యస్వామి ని పూజిస్తే కుజ దోషం కారణంగా ఎదురయ్యే సమస్యలు పరిష్కారమవుతాయని శాస్త్రంలో చెప్పబడి ఉంది.

స్కందుని జననము, వృత్తాంతము:
కుమార, కార్తికేయ, సుబ్రహ్మణ్య, షణ్ముఖ మొదలైన నామములతో పిలవబడే స్కందుడు పరమశివుని రెండవ పుత్రుడు. కోడి పుంజు (కుక్కుటం) ఇతని ధ్వజము, నెమలి ఇతని వాహనము. ఈయన శక్తులు (పత్నులు) వల్లి మరియు దేవసేన. తన తపస్సు చేయుచుండగా భంగము చేయ వచ్చిన మన్మథుని శివుడు తన మూడో నేత్రముతో దగ్ధము చేస్తాడు. ఆ అగ్నిని అగ్నిదేవుడు, వాయుదేవుడు ఆకాశ మార్గమున గంగానదిలో పడవేస్తారు. దాని తేజోశక్తిని భరించలేక గంగాదేవి దానిని ఒడ్డున ఉన్న రెల్లుగడ్డిలోకి నెడుతుంది. ఆ విధముగా పంచ భూతముల శక్తితో శివుని దివ్య తేజము ఏకమై ఆరు ముఖములు గల స్కందునిగా జన్మిస్తాడు. జ్ఞాన రూపమైన శివుని మూడో నేత్రమునుండి జన్మించిన వాడు కాబట్టి కార్తికేయుడు జ్ఞానావతారునిగా పేరు పొందాడు. ఇతని ఆయుధము శూలము. కేవలము స్కందుడు మాత్రమే అసురులైన శూరపద్ముడు, సింహముఖుడు, తారకుడు సంహరించగలడని బ్రహ్మ తనను వేడుకో వచ్చిన దేవతలకు తెలుపుతాడు. అప్పుడు స్కందుడు దేవతల సేనకు అధిపతి అవుతాడు. అప్పటినుంచి అతను సేనాపతిగా కూడా పిలవబడ్డాడు. స్కందుడు అసురులను జయించే వృత్తాంతాన్ని స్కాందపురాణంలో వివరించ బడింది. ఈ అసురులను జయించే రోజునే స్కంద షష్టిగా పూజించబడుతున్నది.
పఈ సుబ్రహ్మణ్య లక్షణాలు అన్నీ సంపుటంగా ఈ ధ్యాన శ్లోకంలో వివరించ బడ్డాయి.
శ్రీ గాంగేయం వహ్నిగర్భం శరవణ జనితం జ్ఞానశక్తిం కుమారం ,
బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమల గుణం రుద్ర తేజస్వరూపం
సేనాన్యం తారకఘ్నం గురుమచలమతిం కార్తికేయం షడాన్యం
సుబ్రహ్మణ్యం మయూరధ్వజ రథ సహితం దేవదేవం నమామి
గంగాదేవి శివుని శక్తిని కొంత సేపు మోసి, శక్తిని భరించ లేక రెల్లు గడ్డిలోకి త్రోయటంవలన గాంగేయుడు అని, అగ్ని శివుని శక్తిని తన వద్ద ఉంచుకొని గంగలో విడుచుట వలన అగ్నిగర్భుడని, జ్ఞాన శక్తి పరబ్రహ్మమని, గుహుడని, అమలమైన గుణము కలవాడని, రుద్రుని తేజస్స్వరూపమని, దేవతల సేనాపతియని, తారకాసురిని చంపిన వాడని, జ్ఞానానికి నిధియై గురు స్వరూపమని, అచలమైన బుద్ధి కలవాడని, రెల్లు గడ్డి నందు పుట్టినందు వలన శరవణ భవుడని, ఆరుముఖములు ఉండుట వలన షడాననుడు అని, నెమలిని అధిరోహించినందు వలన మయూర ధ్వజుడని, రథముని అధిరోహించిన వాడు అని ఈ ధ్యాన శ్లోకము ద్వారా ప్రార్ధించ బడినాడు.

సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం :

హే స్వామినాథ కరుణాకర దీనబంధో
శ్రీ పార్వతీ సుముఖ పంకజపద్మబంధో
శ్రీశాది దేవగణ పూజిత పాదపద్మ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౧

దేవాధిదేవనుత దేవగణాధినాథ
దేవేంద్రవంద్య మృదుపంకజ మంజుపాద
దేవర్షి నారద మునీంద్ర సుగీతకీర్తే
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౨

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్
తస్మాత్ర్పదాన పరిపూరిత భక్తకామ
శ్రుత్యాగమ ప్రణవవాచ్య నిజస్వరూప
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౩

క్రౌంచామరేంద్ర మదఖండన శక్తిశూల
పాశాదిశస్త్ర పరిమండితదివ్యపాణే
శ్రీ కుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౪

దేవాధిదేవ రథమండల మధ్యవేద్య
దేవేంద్ర పీఠ నగరం దృఢ చాపహస్తం
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౫

హారాదిరత్న మణియుక్తత కిరీటహార
కేయూరకుండల లసత్కవచాభిరామ
హే వీర తారకజయామరబృందవంద్య
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౬

పంచాక్షరాది మనుమంత్రితగాంగతోయైః
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౭

శ్రీకార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా
కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తమ్
సిక్త్వా తు మా మవ కళాధరకాంతకంత్యా
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్. ౮

సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్యప్రసాదతః.
సుబ్రహ్మణ్యాష్టక మిదం ప్రాతరుత్థాయ యః పఠేత్
కోటిజన్మకృతం పాపం తత్క్షణా దేవ నశ్యతి. ౯

ఇతి సుబ్రహ్మణ్యాష్టకమ్

 

సుబ్రహ్మణ్య తత్వం
దక్షిణాదిన, ముఖ్యంగా, శివారాధన ప్రాబల్యంగా ఉన్న తమిళ నాట సుబ్రహ్మణ్య స్వామి ఒక ప్రధాన ఆరాధ్య దైవం. ఆరు పడి అని ఆరు పుణ్య క్షేత్రాలైన పళని, స్వామి మలై, తిరుచ్చెందూర్, త్రిపురకుంద్రం, పళముదిర్ చోలై, తిరుత్తణి క్షేత్రాలు మహా సుబ్రహ్మణ్య క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. పిల్లలు పుట్టని వారికి, నాగ దోషమున్న వారికి, కుజ దోషమున్న వారికి ఈ క్షేత్రాలు గొప్ప ఫలితాలు ఇస్తాయని గట్టి నమ్మకం. అలాగే, కర్ణాటకలోని కుక్కే లో సుబ్రహ్మణ్యస్వామి క్షేత్ర కూడా అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్పబడింది. ఈ క్షేత్రాలలో ఈ స్వామి సౌందర్యము, భోగము చెప్పనలవి కాదు. గుళ్ళ సంగతి పక్కకు పెట్టి, సుబ్రహ్మణ్య తత్త్వము గురించి కొంచెం చెప్పుకుందాం.
అవిద్య మరియు జ్ఞానము, దేవతలు మరియు అసురుల మధ్య జరిగే నిరంతర యుద్ధము, వాటి పరిణామమైన దైవిక శక్తుల విజయం - ఇదే సుబ్రహ్మణ్యుని లీలల సారము. స్కందుని జననం గురించి శ్రీమద్రామాయణం లో వాల్మీకి మహర్షి వివరంగా చెప్పారు. శివుని తేజస్సు (వీర్య రూపంలో) ఆయన ఆజ్ఞా చక్రమునుండి పెల్లుబుకి స్కందుని రూపము పొందినదట. అందుకనే స్కందుడు జ్ఞాన జ్యోతిగా ప్రతీక. శరవణమను సరస్సులో రెల్లు గడ్డి పెరిగే చోటనున్న ఆరు కమలముల నుండి పార్వతీ దేవి ఈ స్కందుని తీసుకున్నదట. సర్వోన్నత ఆధ్యాత్మిక అనుభూతి (అపరోక్షానుభూతి) అనేది యోగములో షడ్చక్రముల భేదన ద్వారా కలుగుతుంది. ఈ ఆరు చక్రముల భేదన ద్వారా జీవ శక్తి సహస్రార చక్రమున పూర్ణ యొక స్థితిని అనుభూతి పొందుతుంది. దీనికి సంకేతమైన ఆరు కమలములనుండి ఆవిర్భవించిన స్కందుడు సర్వోన్నత జ్ఞానమునకు, బుద్ధికి ప్రతీకగా నిలిచాడు. అందుకనే స్కందుడు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించే( ఈ ప్రపంచములో అజ్ఞాన రూపమైన అసురులను సంహరించే దైవిక శక్తి) పరిపూర్ణ జ్ఞాన స్వరూపముగా కొలవబడుతున్నాడు.

 



No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...