Tuesday, September 25, 2018

పితృదేవతలకు ప్రీతికరమైన పక్షం... మహాలయం

భాద్రపదమాసంలోని బహుళపక్షం పితృదేవతలకు ప్రీతిపాత్రమైన కాలం. అందుకే దీనిని పితృపక్షం అంటారు. భాద్రపద బహుళ పాడ్యమి మొదలు అమావాస్య వరకు మొత్తం పదిహేను రోజులూ పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధవిధులను నిర్వర్తించాలి. ఇలా చేయడం వల్ల పితృదేవతలకు ఆత్మశాంతి చేకూరుతుందని శాస్త్రవచనం.

ప్రతి సంవత్సరం నిర్వహించే తద్దినాల కన్నా అతిముఖ్యం ఈ పక్షం. ఈ పక్షమంతా తర్పణలు చేయలేనివారు కనీసం ఒక మహాలయమైనా చేసి తీరాలి. గతించిన తల్లిదండ్రులకు తద్దినాలు పెట్టే అలవాటు లేనివారు సైతం ఈ మహాలయపక్షాలలో తర్పణలు వదిలి, వారి పేరు మీదుగా అన్నదానం చేసినట్లయితే పితృదేవతలకు ఉత్తమగతులు కలిగి సంతుష్టి పొందుతారు. వారి ఆశీస్సులతో సకలశుభాలూ కలుగుతాయి. ఈ విధానాన్ని పాటించడానికి శక్తి లేదా స్థోమత లేనివారు ఏదైనా దేవాలయంలో బియ్యం, కూరగాయలు, పండ్లు, దక్షిణ తాంబూలాదులతో బ్రాహ్మణునికి స్వయంపాకం సమర్పించాలి. ఈ విధంగా చేయడం వల్ల పితృదేవతలకు ఆకలిదప్పులు తీరి తమ వంశస్థులను సుఖశాంతులతో వర్ధిల్లమని ఆశీర్వదిస్తారు. మన పితరుల ఆత్మకు శాంతి కలిగినప్పుడే ఇహలోకంలో మనకు శాంతిసౌఖ్యాలు లభిస్తాయనీ, వంశాభివృద్ధి కలుగుతుందని ప్రామాణిక శాస్త్రగ్రంథాలయిన ధర్మసింధు, నిర్ణయసింధు చెబుతున్నాయి.

ఎంతో దానశీలుడిగా పేరుపొందిన కర్ణుడు కోరినవారికి కాదనకుండా ధన, కనక, వస్తు, వాహన రూపేణా భూరిదానాలు చేశాడు. అయితే అన్నిదానాలలోనూ మిన్న అయిన అన్నదానం మాత్రం చేయలేదు. దాని ఫలితంగా మరణానంతరం ఆయన ఆత్మ ఆకలిదప్పులు తీరక ఆర్తితో అలమటించవలసి వచ్చింది. అప్పుడు దేవతలందరి అనుమతితో తిరిగి భూలోకానికి వచ్చి పక్షం రోజులపాటు ఉండి, కురుక్షేత్ర సంగ్రామంలో అసువులు బాసిన తన జ్ఞాతులకు అంటే దాయాదులకు, సైనికులకు తదితరులందరికీ తర్పణలు వదిలి తన రాజ్యంలోని పేదసాదలకు, పెద్దఎత్తున అన్నసంతర్పణలు చేసి, తిరిగి అమావాస్యనాడు స్వర్గానికి వెళ్లాడు. కర్ణుడు భూలోకంలో ఉన్న ఈ పక్షం రోజులకే మహాలయపక్షాలని పేరు. శాస్త్రరీత్యా ఈ పదిహేను రోజులూ ఎటువంటి శుభకార్యాలూ నిర్వర్తించకూడదు.

స్వర్గస్థులైన తల్లిదండ్రులకు, పితామహులకు, మాతామహులకు, (తల్లిదండ్రుల జననీ జనకులు) తల్లిదండ్రుల తోబుట్టువులకు, గురువులకు, జ్ఞాతులకు, తోడబుట్టినవారికి, అత్తమామలకు, స్నేహితులకు, గురుపత్నికి, స్నేహితునికి, అతని భార్యకు..... వీరిలో వారసులు లేకుండా మృతి చెందినవారికి ప్రాముఖ్యతనివ్వాలి. అదేవిధంగా వివిధ ప్రమాదాలలో అకాల మరణం చెందిన వారికోసం కూడా తర్పణ విడిస్తే మంచిది.

లౌకికంగా కూడా... అసలు ఈ తర్పణలు, తిలోదకాలు ... వంటి వైదికపరమైన ఆచారాలు, సంప్రదాయాల మీద నమ్మకం లేనివారు కూడా కనీసం ఏడాదిలో ఒక్కసారైనా చనిపోయిన తల్లిదండ్రులను లేదా తాతముత్తాతలను తలచుకుని, మనం ఏ అన్నాన్నయితే తింటున్నామో, దానినే... అర్హులయిన పేదలను ఎంచుకుని వారికి సంతృప్తి కలిగేలా భోజనం పెడితే... వారికి కడుపు, మనకు గుండె నిండుతుంది. ఎందుకంటే ఎంత ఉన్నవారైనా, వస్త్రదానం, ధనదానం తదితర ఏ రకమైన దానాలు చేసినప్పటికీ, ఆయా దానాలు పుచ్చుకునేవారు మాత్రం మొహమాటానికి చాలని చెప్పినా, మనసులో మాత్రం ‘వీరికి అంత ఉంది కదా, మరికొంచెం ఇస్తే బాగుండును’ అనిపిస్తుంది. అదే అన్నదానంతో మాత్రం కడుపు నిండా తిన్న తరువాత తృప్తి పడి ‘ఇక చాలు’ అని అనాల్సిందే. అందుకే అన్ని దానాలలోకీ అన్నదానమే మిన్న అని శాస్త్రం చెప్పింది. ఈ పక్షంలో మిగిలిన కొద్దికాలాన్నైనా ఈ రీతిగా సద్వినియోగం చేసుకోవడం మంచిది.

మహాలయపక్ష తిథులలో శ్రాద్ధకర్మలు చేస్తే వాటి ఉపయోగాలు.

తిథి ఉపయోగాలు

పాడ్యమి ధన సంపద
విదియ రాజయోగం, సంపద
తదియ శతృవినాశనం
చతుర్థి ధర్మగుణం, ఇష్టకామ్య ప్రాప్తి
పంచమి ఉత్తమ లక్ష్మీ ప్రాప్తి
షష్టి శ్రేష్ఠ గౌరవం
సప్తమి యజ్ఞం చేసిన పుణ్యఫలం
అష్టమి సంపూర్ణ సమృద్ధి, బుద్ధి ప్రాప్తి
నవమి అంతులేని సంపద
దశమి ధాన్య , పశు సంపద వృద్ధి
ఏకాదశి సర్వశ్రేష్ఠదాన ఫలం
ద్వాదశి సమాజ అభివృద్ధి, ఆహార భద్రత
త్రయోదశి ఐశ్వర్యం, దీర్ఘాయువు, సంపూర్ణ ఆరోగ్యం
చతుర్థశి శతృభయం నుండి విముక్తి

అమావాస్య అన్ని కోరికలు నెరవేరుతాయి

శ్రాద్ధ కర్మలలో స్వధాదేవి నామాన్ని ఉచ్చరిస్తే సర్వపాపాల నుండి విముక్తి లభిస్తుంది

బ్రహ్మ దేవుని యొక్క పెద్దకుమారుడు అగ్ని అని విష్ణు పురాణం లో చెప్పబడి ఉన్నది . అగ్ని దేవుని భార్య పేరు స్వాహా . హోమాలు చేస్తూ లేదా పూజలు చేస్తూ మంత్రాలు చదివేటప్పుడు చివరి లో "స్వాహా " అనడం జరుగుతుంది . ఈ స్వాహా అన్న పదాన్ని ఉచ్చరించేటప్పుడు మనిషి చేసే పూజలు ప్రార్ధనలు, మంత్రాలు అన్ని దేవునికి చేరుతాయి .

అగ్ని దేవునికి 2 తలలు, తలపైన 2 +2 కొమ్ములు, 7 నాలుకలు, 7 చేతులు, 3 కాళ్ళు ఉంటాయి. ఈయనకి దక్షిణంలో భార్య స్వదా దేవి, ఎడమ వైపున స్వాహ దేవి ఉంటుంది. దైవ కార్యాల్లో ఈయనకు సమర్పించిన ఆజ్యం హవిస్సు అన్నిటిని స్వాహా దేవి స్వీకరించి ఏ దైవం నిమిత్తం మనం ఆ హోమ౦ చేస్తున్నామో వారికి అందిస్తుంది. అదే విధంగా పితృ కార్యాల్లో స్వదాదేవి తన పాత్ర పోషిస్తుంది.

స్వధాదేవి ధ్యానము, స్తోత్రము వేదములలో చెప్పబడినది.  శరదృతువులోని అశ్వయుజ కృష్ణ త్రయోదశినాడు, లేక మఖా నక్షత్రము నాడు, కానిచో శ్రాద్ద  దినమున స్వధాదేవిని పూజించి శ్రాద్దము నాచరింపవలెను. ఈవిధముగా స్వధాదేవిని రమ్యమైన కలశమున, లేక సాలగ్రామశిల యందు ఆవాహనము చేసికొని ధ్యానించి మూల మంత్రముతో పాద్యము మొదలగు ఉపచారములను సమర్పించవలెను. "ఓం హ్రీం శ్రీం క్లీం స్వధాదేవ్యైస్వాహా" అను మూలమంత్రముచే ఆమెను పూజించి స్తోత్రము చేసి నమస్కరింపవలెను.

బ్రహ్మదేవుడు, పితృదేవతా గణాలకు శ్రాద్ధ కర్మలలో తర్పణ పూర్వకంగా సమర్పించే పదార్ధాన్ని ఆహారంగా నియమించాడు. బ్రాహ్మణులు తర్పణాలు ఇస్తున్నప్పటికీ పితృదేవతలకు సంతృప్తి కలుగలేదు. ఆ పితృగణాలు బ్రహ్మను ప్రార్ధించగా ఆయన ధ్యాన నిమగ్నుడై మానస పుత్రికను సృష్టించి, ఆమెను గుణవతిగా , విద్యావతిగా తీర్చిదిద్ది , ఆ కన్యకు "స్వధాదేవి" అని నామకరణం చేసాడు. పితృదేవతలకు పత్నిగా స్వధా దేవిని నియమించాడు. ఆనాటి నుండి పితృదేవతలు, మహర్షులు,విప్రులు ,మానవులు "స్వధాదేవి"ని పూజిస్తూ, ఆమె అనుగ్రహంతో పితృదేవతలను సంతృప్తి పరుస్తూ వచ్చారు.

"బ్రాహ్మణో మానసీం శశ్వత్సుస్థిర యౌవనాం |
పూజ్యానాం పితృ దేవానాం శ్రద్దానాం ఫలదాం భజే "||

అని స్వధాదేవిని ప్రార్ధిస్తూ ఉంటారు.

పరాశక్తి అంశావతారంగా స్వధాశక్తి ఆవిర్భవించి, పితృదేవతలకు సంతృప్తిని ప్రసాదించింది. శ్రాద్ధ కర్మలలో, బలితర్పణాల్లొ,తీర్ధస్నానాల్లో స్వధాదేవి నామాన్ని ఉచ్చరిస్తే సర్వపాపాల నుండి విముక్తి లభిస్తుందని వ్యాసమహర్షి వివరించాడు.

స్వధాదేవి స్తోత్రం

స్వధోచ్చారణమాత్రేణ తీర్ధస్నాయీభవేన్నరః ı
ముచ్యతే సర్వపాపేభ్యో వాజపేయ ఫలంలభేత్ ıı

స్వధా స్వధా స్వధేత్యేవం యది వారత్రయం స్మరేత్ ı
శ్రాద్దస్య ఫలమాప్నోతి తర్పణస్య  జిలైరపి ıı

శ్రాద్దకాలే స్వధా స్తోత్రం యః శృణోతి సమాహితః ı
సలభేట్ శ్రాద్ద శంభూతం ఫలమేవన సంశయః ıı

స్వధా స్వధా స్వధేత్యేవం త్రిసంధ్యం యః పఠేన్నరః ı
ప్రియాంవినీతాం సలభేత్ సాధ్వీం పుత్రగుణాన్వితామ్ ıı

పితౄణాం ప్రాణతుల్యాత్వం ద్విజజీవన రూపిణీ ı
శ్రాద్దాదిష్ఠాతృ దేవీచ శ్రాద్దాదీనాం ఫలప్రధా ıı

నిత్యాత్వం సత్యా రూపాసి పుణ్యరూపాసిసువ్రతే ı
ఆవిర్భావతిరోభావౌ సృష్టౌచ ప్రళయేతవ ıı

ఓం స్వస్తిశ్చ నమః స్వాహా స్వధా త్వం దక్షిణాతధా ı
నిరూపితాశ్చతుర్వేదైః ప్రశస్తాః కర్మిణాం పునః ıı

కర్మ పూర్త్యర్దమే వైతా ఈశ్వరేణ వినిర్మితాః ı 
ఇత్యేవ ముక్త్వా సబ్రహ్మా బ్రహ్మలోకే స్వసంసది ıı

తస్ధౌచ సహసాసద్యః స్వధాసా విర్బభూవహి ı
తధా పితృభ్యః ప్రదదౌ తామేవకమలాననామ్ ıı

తాం సంప్రాప్యయయుస్తేచ  పితరశ్చ ప్రహర్షితాః ı
స్వధా స్తోత్ర మిదంపుణ్యంయః శృణోతి సమాహితః ıı

సుస్నాతః సర్వతీర్ధేషు వాంఛితం ఫలమాప్నుయాత్ ıı

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...