Friday, October 25, 2013

దీపావళి

సంబరాల దీపావళి

"చీకటి వెలుగుల రంగేళీ జీవితమే ఒక దీపావళి... " అని తెలుగు సినిమా కవి రాసింది ఎంత నిజం

ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి, సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి.

దీపావళినాడు నూనెలో ( ముఖ్యంగా నువ్వులనూనె) లక్ష్మీదేవి, నదులు, బావులు, చెరువులు మొదలైన నీటి వనరులలో గంగాదేవి సూక్ష్మ రూపంలో నిండి వుంటారు. కనుక ఆ రోజు నువ్వుల నూనెతో తలంటుకుని సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియలు అరుణోదయ కాలంలో అభ్యంగన స్నానం తప్పకుండా చేయాలి. ఇలా చేయుడం వల్ల దారిద్ర్యం తొలగుతుంది, గంగానదీ స్నాన ఫలం లభిస్తుంది, నరక భయం ఉండదనేది పురాణాలు చెపుతున్నాయి.

అమావాస్యనాడు స్వర్గస్థులైన పితరులకు తర్పణం విడవడం విధి కనుక దీపావళినాడు తైలాభ్యంగన స్నానం తరువాత పురుషులు జలతర్పణం చేస్తారు. 'యమాయ తర్పయామి, తర్పయామి తర్పయామి' అంటూ మూడుసార్లు దోసెట్లో నీరు విడిచిపెట్టడం వల్ల పితృదేవతలు సంతుష్టి చెంది ఆశీర్వదిస్తారు.

స్త్రీలు అభ్యంగన స్నానానంతరం కొత్త బట్టలు కట్టుకుని ఇళ్ళ ముందు రంగురంగుల ముగ్గులు తీర్చి గుమ్మాలకు పసుపు , కుంకుమలు రాసి మామిడాకు తోరణాలు కట్టి, సాయంత్రం లక్ష్మీపూజకు సన్నాహాలు చేసుకొంటారు. రకరకాలైన, రుచికరమైన భక్ష్యభోగ్యాలతో నైవేద్యానికి పిండివంటలు సిద్దం చేయడం, మట్టి ప్రమిదలలో నువ్వుల నూనె పోసి పూజాగృహంలో, ఇంటి బయట దీప తోరణాలు అమర్చడం, ఆ రోజంతా ఎక్కడలేని హడావుడి, ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాంటాయి.

దిబ్బు దిబ్బు దీపావళి

దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి...

అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయంగా కొన్ని ప్రాంతాలల్లో చూస్తూంటాం. సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించి, ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు. ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ దీపం వెలిగించిన తరువాత, కాళ్ళు కడుక్కుని, ఇంటిలోపలకు వచ్చి, తీపి పదార్థం తింటారు. అటు తరువాత పూజాగృహంలో నువ్వులనూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని అవాహన చేసి విధివిధానంగా పూజిస్తారు. పూజానంతరం అందరూ ఉత్సాహంగా బాణాసంచా కాల్చడానికి సంసిద్దులౌతారు. చిచ్చుబుడ్లు, విష్ణుచక్రాలు, భూచక్రాలు, మతాబులు, కాకరపువ్వొత్తులు, కళ్ళు మిరుమిట్లు గొలుపుతుంటే మరో ప్రక్క సీమటపాకాయల ఢమఢమ ధ్వనులతో మ్రోగుతుంటాయి పరిసరాలన్నీ. ఈ విధంగా బాణాసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం చెప్పబడింది పురాణాలలో, ఆ వెలుగులో, శబ్దతరంగాలలో దారిద్ర్య దు:ఖాలు దూరంగా తరిమి వేయుబడి లక్ష్మీకటాక్షం సిద్దిస్తుందని, అంతేకాక వర్షఋతువులో ఏర్పడిన తేమవల్ల పుట్టుకువచ్చే క్రిమి కీటకాలు బాణాసంచా పొగలకి నశిస్తాయి.

అసుర నాశనానికి, ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్యనాడు జరుపుకునే దీపావళి పండుగనాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజిమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వశుభాలు ప్రసాదిస్తుంది.

పర్యావరణానికి హాని కలగకుండా దీపావళి :

ఈ పండుగ సంబరాలు మన సంస్కృతిలో ఒక భాగం. కాబట్టి పండుగను ఎలా జరుపుకోవాలనేది వారి వారి వ్యక్తిగత యిష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుత తరుణంలో ఇలాగే జరుపుకోవాలి అని చెప్పాల్సి వస్తోంది. ఒకప్పుడు పర్యావరణ సమస్యలు తీవ్రంగా లేనప్పుడు పండుగ ఎలా జరుపుకున్నా జరిగిపోయేది. అసలు అప్పట్లో ఇప్పటిలా టపాసులు పెద్ద ఎత్తున కాల్చేవారం కాదు. కొత్తబట్టలు వేసుకొని, పిండివంటలు చేసుకొని ఆటలు పాటలతో, మట్టిదీపాలతో అలంకరించుకుని, దివిటీలు తిప్పుతూ పండుగను జరుపుకునేవారు. ఇవి ప్రకృతికి పెద్దగా నష్టం కలిగించేవి కావు. కానీ, నేటి మన జీవన విధానం, పండుగలు చేసుకునే తీరు ప్రకృతి వనరులపై ఎనలేని భారాలను మోపుతున్నాయి. పర్యావరణ కాలుష్యాన్ని పెంచుతున్నాయి. భూగోళాన్ని వేడెక్కిస్తున్నాయి. ఫలితంగా వాతావరణంలో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి. తీవ్ర వర్షాభావం, అదే తీవ్ర స్థాయిలో వరదలు ఒకే సంవత్సరం చూడగలుగుతున్నారు. అందువల్ల కొనసాగు తున్న మన జీవన విధానాన్ని, పండుగలు చేసుకునే తీరును ప్రకృతికి నష్టం కలిగించని రీతిలో మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పండుగ చేసుకునే సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రకృతిపరంగా ఎక్కువ నష్టం జరగకుండా చూద్దాం. ఆటపాటలతో, దీపాలు వెలిగించి, పిండివంటలు చేసుకొని బంధుమిత్రులతో ఆనందంగా గడుపు కుందాం. ఇదే మనం ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షిస్తూ దీపావళి పండుగను చేసుకోవడం. 

దీపావళి విశిష్టత దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నూతన వస్త్రాల సోయగాలు, పిండివంటల ఘుమఘుమలు, దీపాల తళుకులు, బాణ సంచా కోలాహలాలు, అంతా కలిపితే దీపావళి సంబరాలు.

 // దీపం జ్యోతి పరబ్రహ్మమ్
దీపం సర్వతమోహరమ్
దీపేన సాధ్యతే సర్వమ్
సంధ్యా దీపం నమామ్యహమ్ // 

 ఈ నాలుగు రోజుల పండుగ, ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు మొదలయి కార్తిక శుద్ధ విదియ నాడు ముగుస్తుంది. మొదటి రోజు - నరక చతుర్దశి: ఆశ్వయుజ బహుళ చతుర్దశి - నరక చతుర్దశి. కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు. అతడు లోక కంటకుడైనా, మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి. నరకాసురుడు చెలరేగి సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు. అప్పటికి నరకాసురుడు లోకకంటకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా తరలి వెళ్తాడు శ్రీకృష్ణుడు. వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో నరకుడి శరాఘాతాలకు కృష్ణుడు సొమ్మసిల్లినట్లు నటిస్తాడు. అప్పుడు భూదేవి అంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు. తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు. రెండవ రోజు – దీపావళి: నరకుని మరణానికి సంతోషంతో మర్నాడు అమావాస్య చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి పండుగ జరుపుకోవడం, అదే దీపావళి పండుగగా ప్రసిద్ది చెందడం జరిగాయి. దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీపలక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పాలద్రోలి జగత్తును తేజోవంతం చేస్తుంది. ఆ వేళ సర్వశుభాలు, సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. దివ్వెల పండుగ దీపావళినాడు లక్ష్మీదేవిని పూజించడానికి కారణం శాస్త్రాలలో క్రింది విధంగా చెప్పబడింది. 

తైలే లక్ష్మీర్జలే గంగా దీపావళి తిథౌవసేత్!
అలక్ష్మీ పరిహారార్థం తైలాభ్యంగో విధీయతే!.

 దీపావళి చుట్టూ అనేకానేక కథలు ఉన్నాయి. క్షీర సాగర మధనంలో నుండి లక్ష్మి దేవి ఈ రోజున ఉద్భవించింది అని ఒక నమ్మకం ఉంది. ఇంకొక కధనం ప్రకారం, శ్రీ మహా విష్ణువు వామనావతారం ధరించి, బలి చకవర్తిని మూడు అడుగుల భూమి అడిగినప్పుడు, రెండు అడుగులలో అతడు భూమి, ఆకాశములను ఆక్రమిస్తాడు. మూడవ అడుగుకు బలి తన శిరస్సును చూపించగా, వామనుడు త్రివిక్రముడై, అతడిని పాతాళానికి తొక్కేస్తాడు. కాని బలి దాతృత్వానికి మెచ్చి పాతాళంలో అతని కోటకు రక్షకుడుగా నిలుస్తాడు, పతి వియోగంలో ఉన్న లక్ష్మిని స్వాంతన పరచుటకు, బ్రహ్మ, మహేశ్వరులు తాము రక్షకులుగా ఉండి, విష్ణువును విడుదల చేస్తారు. ఆ విధంగా అమావాస్య నాడు స్వామి శ్రీదేవిని చేరడంతో ఆమె సంతోషంతో అందరికి కోరిన వరాలు ప్రసాదిస్తుంది అని నమ్మకం. మూడవ రోజు - బలి పాడ్యమి: విష్ణుమూర్తి ఇచ్చిన వరంతో ఈ రోజు బలి చక్రవర్తి పాతాళలోకం వదలి భూలోకాన్ని పాలిస్తాడు.

 నాలుగవ రోజు - యమ ద్వితీయ: ఈ దినం యమధర్మరాజు తన సోదరి యమి ఇంటికి వెళ్ళడం విశేషంగా యమద్వితీయ చెప్తారు.

ఇట్లు 
మీ సుబ్రహ్మణ్యం శర్మ
 

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...