Sunday, October 14, 2018

పద్మ ప్రశస్తి

సృష్టిలో తొలి పుష్పంగా పద్మాన్ని భావిస్తారు. పద్మం నుంచి పుట్టిన బ్రహ్మ పద్మసంభవుడయ్యాడు. బ్రహ్మ ఆయుర్దాయంలో మొదటి సగాన్ని పద్మకల్పంగా పురాణాలు చెబుతున్నాయి. ‘పద్మం’ అనే పదానికి పారమార్థిక, యౌగిక, వాస్తుపరమైన అర్థాలున్నాయి. పద్మం దేహంలోని ఒక నాడీచక్రం. కుబేరుడి నవనిధుల్లో ఒకటి. వాస్తురీత్యా నాలుగు దిక్కుల్లోనూ ద్వారాలు ఉన్న ఇంటిని కూడా పద్మమంటారు.
పద్మం ముందు పుట్టి ఆ తరవాత సృష్టి పుట్టిందని పురాణోక్తి. శేషతల్పంపై మహావిష్ణువు శయనించి ఉన్న సమయాన స్వామి నాభి నుంచి బ్రహ్మదేవుడు అవతరించాడని పురాణ కథనం. పద్మం పేరున ఓ పురాణమే వెలసింది. అదే పద్మపురాణం. అష్టాదశ పురాణాల్లో అది రెండోది. 50వేల శ్లోకాలు కలిగి విస్తృతిలో స్కాందపురాణం తరవాత రెండో బృహత్‌ పురాణం. విష్ణువు మహత్వాన్ని తెలిపే పురాణం. పద్మాలు సరస్సులో, చెరువుల్లో, జలం సమృద్ధిగా ఉండేచోట వికసిస్తుంటాయి. తామర, కమలం, నలిని, పంకజం మొదలైన పేర్లతో వ్యవహరిస్తారు.

ఎందరో దేవతలకు పద్మం ఆసనం. లక్ష్మీదేవి ఎల్లప్పుడూ పద్మంపై కూర్చుని హస్తాల్లో పద్మాన్ని ధరించి ఉంటుంది. ‘కమల’ శబ్దానికి లక్ష్మీదేవి అనికూడా అర్థం ఉంది. ఆ దేవిని ‘కమలాత్మిక’ అంటారు. కమలం ఆత్మగా కలిగిన దేవత అని అర్థం.

పంకమంటే బురద. అక్కడ పుట్టిన పద్మం పంకజమైంది. పంకంలో పుట్టినా స్వచ్ఛంగా అందంగా కనిపిస్తుంది. మనం కూడా బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ అంతర్గతమైన పవిత్రత, సౌందర్యం చెదరకుండా చూసుకోవాలని, నిర్మలంగా ఉండటానికి ప్రయత్నించాలని గుర్తుచేస్తుంది పద్మం. ఎప్పుడూ నీళ్లలోనే ఉన్నా తామరాకుకు తడి అంటుకోదు. ‘తామరాకు మీది నీటిబొట్టులా’ ఉండాలంటారు. జ్ఞాని దుఃఖంలో, విపరీత పరిస్థితుల్లో సైతం చలించకుండా ఆత్మానందంలో లీనమై ఉంటాడనడానికి ప్రతీకగా ఈ విషయం నిలుస్తుంది.
శుభసూచకమైన ‘స్వస్తిక్‌’ చిహ్నం తామర పువ్వు నుంచే ఉత్పన్నమైందని భావిస్తున్నారు. సూర్యుడు పద్మినీప్రియుడు. సూర్యభగవానుడికి ప్రీతికరమైన పద్మానికి సాహిత్యంలోనూ విశేషమైన స్థానం ఉంది.

యోగశాస్త్రం ప్రకారం మన దేహాలు శక్తి కేంద్రాలైన కొన్ని చక్రాలను కలిగిఉన్నాయి. ప్రతిచక్రం నియమిత దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ధ్యానానికి కూర్చోవడానికి పద్మాసనం ఆమోదయోగ్యమవుతుంది.

శరీరంలోని చైతన్య కేంద్రాల్ని చక్రాలంటారు. మూలాధార చక్రం భౌతిక చైతన్యానికి కేంద్రం. నాభివద్ద చైతన్యకేంద్రం నీలం వర్ణంలో, ఉదరం వద్ద చైతన్యకేంద్రం ఎరుపు వర్ణంలో పదిరేకుల పద్మంలా ఉంటాయి. దానికి పైన హృదయం వద్ద చైతన్యకేంద్రం గులాబి, బంగారు రంగులు కలిసిన ఛాయలో పన్నెండు రేకుల పద్మంలా ఉంటుంది. కంఠం వద్ద చైతన్యకేంద్రం బూడిద రంగులో పదహారు రేకుల పద్మంలా ఉంటుంది. కనుబొమల మధ్య చైతన్యకేంద్రం తెలుపు వర్ణంలో రెండు రేకుల పద్మంలా ఉంటుంది. తలపై భాగంలో చక్రం స్వర్ణకాంతుల మధ్య నీలిరంగులో వెయ్యిరేకుల పద్మంలా ఉంటుంది.

శుక్రవారం మహాలక్ష్మిని పద్మాలతో సేవిస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం. తామరాకు, దుంప, కాడ, పువ్వు వైద్యానికి ఉపయోగం. పద్మకాష్ఠం ఔషధీ విశేషం. తామర తూళ్లు హంసలకు ఆహారం. పద్మకోశం నాట్యంలో ఒక అభినయ హస్తవిశేషం. మహాభారత యుద్ధంలో ‘పద్మవ్యూహం’ ఉంది. పద్మరాగం జాతిరత్నం. పద్మ నాయకులు మధ్యయుగాల్లో తెలుగుగడ్డపై కొన్ని ప్రాంతాలను పాలించిన ప్రభువులు. పద్మం జ్ఞానవికాసానికి, చైతన్యానికి ప్రతీక. పద్మం మన జాతీయ పుష్పం.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......✍

విలువైన కాలం

మనిషిగా జన్మనెత్తాం. బతుకుతున్నాం. కేవలం కాలం గడపటమే జీవితం కాదని మనకు తెలిసిఉండాలి. కాలం చాలా విలువైనది. పోగొట్టుకుంటే పొందలేనిది. కాలం విలువ గుర్తించినవారే విజయసోపానాలు అధిరోహించగలిగేది!
ఇద్దరు ఒకే రోజున, ఒకే సమయంలో పుట్టి ఉండవచ్చు. అయినా ఆ ఇద్దరికీ ఒకే విధమైన జీవితం, సమయం, అవకాశం లభించవు. కాలగమనంలో మేధావులు, మూర్ఖులు భూమి మీదకు వస్తారు. ఒకరు కాలంతో సంబంధం లేకుండా బతికితే, ఇంకొకరు కాలాన్ని దైవంగా భావించి విశ్వకల్యాణం కోసం అహర్నిశలూ తపిస్తారు.
https://twitter.com/bobbygutti12345/status/1051485345043234817?s=19
నిత్యం మనం కాలంతో ప్రయాణం చేస్తూనే ఉంటాం. కాలంతో పోటీ పడుతుంటాం. కాలం తొందరగా జరిగిపోతుందని కొందరు బాధపడిపోతూ ఉంటారు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉండే కాలాన్ని చక్కగా విభజించుకుంటే నిద్ర లేకుండా పనిచేయవలసిన అవసరం ఉండదు.
https://twitter.com/bobbygutti12345/status/1051485345043234817?s=19
కాలమే దైవం. జీవితాంతం కాలాన్ని సక్రమంగా వినియోగించుకోవడం తెలిస్తే ఎన్నో సాధించగలం. కాలాన్ని అర్థం చేసుకుంటే ఏ ఒక్క క్షణమూ వృథా చేసుకోం. ఎవరి సమయం వారికి మంచి మంచి అవకాశాలు ఇస్తుంది. భూమ్మీదకు ఒక మనిషి వచ్చినప్పుడే అతడి కాలనిర్ణయం జరుగుతుంది. ఆ కాలంలో ఉన్న ప్రకృతి సహా సర్వజీవులూ ఆ సమయానుగుణంగానే ప్రవర్తిస్తాయి. ఆయుష్షు గురించి ఆలోచన అనవసరం. అయితే గియితే కాలం నిరుపయోగం అవుతుందని బాధపడాలి.
https://twitter.com/bobbygutti12345/status/1051485345043234817?s=19
కాలానుగుణంగా ప్రతి యుగంలో మార్పులుంటాయి. ధర్మం మారుతుంది. సంఘం మారుతుంది. మనిషి మారతాడు. విలువైన కాలగమనం మాత్రం మారదు. ఏ కాలానికి తగినట్లు ఆ కాలంలో వ్యవస్థ నడుస్తుంది.

కాలం చాలా గొప్పది. కాని దానికంటే ఆ కాలంలో జన్మించిన అవతార పురుషులు ఇంకా గొప్పవారు. అందుకే శ్రీరాముడి కాలంలో, శ్రీకృష్ణుడి కాలంలో అంటుంటారు. వారు కాలాన్ని ప్రభావితం చేశారు. కాలాన్ని దివ్యం చేశారు. కాలానికి ఒక చరిత్రను సృష్టించారు. వారి అవతార లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు.

ఒక్కోసారి కాలాన్ని మనం నడిపిస్తున్నామా, లేదా కాలమే మనల్ని నడిపిస్తుందా అనే మీమాంసకు గురి అవుతుంటాం. కాలాన్ని ఎవరూ నడిపించలేరు. కాలమే మన జీవితాలను మార్చిపారేస్తుంది. కాలమే పెను మార్పులకు గురిచేస్తుంది. కాలమే అనూహ్యమైన స్థితిలోకి మనల్ని నెట్టేసి చోద్యం చూస్తుంది. మనమొక లక్ష్యాన్ని గట్టిగా పట్టుకుని, జారిపోకుండా వెనకడుగు వేయకుండా ముందుకు ప్రయాణిస్తుంటే కాలం చేసిన సహాయానికి జోహార్లు అర్పించకుండా ఉండలేం.
https://twitter.com/bobbygutti12345/status/1051485345043234817?s=19
దెబ్బ తగిలింది... మందు వేస్తాం. వెంటనే ఆ క్షణంలోనే నొప్పి మాయమైపోదు. దెబ్బ కనపడకుండా పోదు. చికిత్స చేస్తున్నా కొంత సమయం మనం ఆగాలి. అదే కాలం చేసే విచిత్రం. వైద్యశాస్త్రంలో కాలానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఆయుర్వేదంలో కాలమూ చికిత్సలో భాగమే.

ప్రతి క్షణం మనం కాలంలోనే ఉంటూ కాలంతో సహజీవనం చేస్తూ ఉంటాం. చెడుకాలం, మంచి కాలమని మనిషి తనకు జరిగిన లాభనష్టాలను బట్టి విభజిస్తూ ఉంటాడు. నిజానికి కాలం నిమిత్తమాత్రం. మనం చేసే కృషిని బట్టే ఫలితాలు ఉంటాయి.
https://twitter.com/bobbygutti12345/status/1051485345043234817?s=19
దైవాంశ సంభూతులం కాని మనం ధనం కన్నా, బంగారం కన్నా, ప్రాణం కన్నా కాలం విలువైనదిగా గుర్తించాలి. ఈ కాలాన్ని ఇతరులకు సహాయంకోసం, మంచి జీవనం కోసం, మానవత్వం నిలబెట్టడం కోసం ఉపయోగించుకోవాలి. అక్కడే ఉంది మన వివేకం. అదే నిజమైన ప్రజ్ఞ!

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......✍

శరణాగతితోనే జన్మకు సద్గతి

‘అహం భక్త పరాధీనో, హ్య స్వతంత్ర ఇవ ద్విజ
సాధుభిర్‌ గ్రస్త హృదయో, భక్తైర్‌ భక్త జనప్రియ’’

అని భాగవతంలో చెప్పబడినట్లుగా, సుదర్శన చక్ర బాధితుడై దుర్వాస మహర్షి విష్ణువును శరణువేడినపుడు విష్ణువే స్వయంగా.. ‘నేను భక్తుల విషయంలో పరాధీనుడను. ఎంత స్వతంత్రుడనైనా, సాధువుల సందర్భం వచ్చేసరికి వారికి స్వాధీనుడనే, అస్వతంత్రుడనే. భక్తులైన సాధు పురుషులు నాహృదయాన్ని స్వాధీనపరచుకొని ఉంటారు. వారే నా ఆత్మీయులు. నేను భక్త జన ప్రియుడను’’ అన్నాడు. భక్తుని ప్రయత్నాలేవీ ఫలించనపుడు భగవంతునికి తన్ను తాను అర్పించుకుని, ఆయన సహాయాన్ని అర్థించడమే ‘శరణాగతి’.

‘‘త్వమేవ మాతాచ, పితా త్వమేవ
త్వమేవ బంధుశ్చ, సఖా త్వమేవ
త్వమేవ విద్యా, ద్రవిణం త్వమేవ

త్వమేవ సర్వం మమదేవదేవ’’ అనే విశ్వాసం కలిగి ఉంటే చాలు, ఆయన కృష్ణుడా, రాముడా, గౌరాంగుడా.. ఎవరైననేమి నమ్మిన వారికి, ‘త్వమేవ శరణం మమ, అన్యథా శరణం నాస్తి’.. అంటూ ఆశ్రయించిన వారికి ఆయన మిత్రుడు, హితుడు, బంధువు, ఆప్తుడు, మార్గదర్శి. భక్తుడు భగవంతుని శరణుజొచ్చినపుడు ఇక తాను ప్రత్యేకంగా ఉండడు. అందుకే శరణాగతి అద్వైతాన్ని ప్రకటిస్తుంది. ఇదే శరణాగతి తత్వం. భగవద్గీతలోని ‘మోక్ష సన్యాస యోగంలో’..

‘‘సర్వధర్మాన్‌ పరిత్యజ్య, మామేకం శరణం వ్రజశ్రీ
అహంత్వా సర్వపాపేభ్యో, మోక్షయిష్యామి మాశుచః’’శ్రీశ్రీ

‘‘ధర్మాలన్నింటినీ పరిత్యజించు- నన్నొక్కడినే శరణుకోరుకో. నిన్ను సమస్త పాపాల నుండి విముక్తుణ్ణి చేస్తాను. చింతించకు’’ అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన బోధించిన సమస్త సాధనాల సారాంశమూ అనన్యశరణాగతియే. భక్తుడు తన సమస్త భారమును భగవంతునికి సమర్పించుటే శరణాగతిలోని ముఖ్య రహస్యం....

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

అహం

మానవుడిలో అంతశ్శత్రువులు ఆరు. వాటిలో మదం ఒకటి. ‘మదం’ అంటే అహం... దీన్ని విడిచిపెడితేనే మనకు ఆనందం లభ్యమవుతుంది. అహం మన చర్మచక్షువునే కాదు,అంతఃచక్షువులనూ మూసేస్తుంది. చిన్నా పెద్దా తారతమ్యాన్ని, వివేచన, విచక్షణలను హరిస్తుంది. మర్యాద రహితుల్ని చేస్తుంది. సత్యాన్ని చూడనీయదు, మాట్లాడనీయదు. అంతేకాదు- దాన్ని దరిదాపులకు చేరనీయక అడ్డుకుంటుంది. ధర్మాన్ని పాటింపనీయదు. మంచి, చెడుల్ని కాననీయదు. క్రోధాన్ని పెంచి ఆవేశపూరితంగా, ఆలోచనారహితంగా మాట్లాడేలా చేస్తుంది. మానవుడి సర్వభ్రష్టత్వానికి మూలమైనదీ శత్రువు.
అంతశ్శత్రువులను జయించి తాను ఆనందాన్ని పొంది అందరికీ దాన్ని పంచినవాడిగా వసిష్ఠుడు నిలుస్తాడు. ఆయన బ్రహ్మర్షిత్వానికే వన్నెతెచ్చి దానికి మరింత మహత్వాన్ని ఆపాదించినవాడు. అందుకు విరుద్ధంగా- అహాన్ని వీడక తపశ్శక్తులను, వివేచన, విచక్షణలను తన కోపాగ్ని కీలల్లో ఆహుతి చేసుకున్నవాడు విశ్వామిత్రుడు. అహం పుట్టించే మరిన్ని శత్రువుల్లో అత్యంత ప్రధానమైనది ‘క్రోధం’. కౌశికుడి వృత్తాంతం మనకు బోధపరచేదిదే.

అహాన్ని శరీరంలోని అణువునా పోషించి, పెద్ద చేసినవాడు దుర్యోధనుడు. అహం తెచ్చే దుర్గుణాల్లో మూర్ఖత్వమొకటి. పినతండ్రి తనయులకు రాజ్యభాగాన్ని ఇవ్వనన్నాడు. మూర్ఖత్వపు పొరలు కమ్మిన అతడి కళ్లు సత్యాన్ని, ధర్మాన్ని చూడనీయలేదు. వాటి గురించి ఆలోచించనీయలేదు. కడకు మహాసంగ్రామానికి హేతువై అపార జననష్టాన్ని కలిగించిన వాడయ్యాడు. ఎందరికో గర్భశోకం వాటిల్లజేశాడు.

అహాన్ని దరిదాపుల్లోకి రానివ్వకూడనివాడు గురువు. తనకున్న పాండిత్యం, బోధనా ప్రతిభ మరెవ్వరికీ లేదన్న ఆలోచన వచ్చిన ఉత్తర క్షణం- అతడు గురుపీఠానికి అనర్హుడు. తాను చెప్పిందే సరైనదనే గర్వంతో పాటు వినయ, విధేయతలకు దూరమవుతాడు. జ్ఞాన సముపార్జనలో వెనకంజ వేస్తాడు. కుశాగ్ర బుద్ధి, జ్ఞానపిపాస కలిగిన విద్యార్థి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఆలోచన చేయక అతడి ప్రశ్నలే అర్థరహితమంటాడు. అందువల్ల ఆ విద్యార్థి దృష్టిలో చులకనవుతాడు. పొందవలసినంత గౌరవాన్ని పొందలేడు. విద్య వల్ల మన సహజమైన వినయం మరింత శోభిల్లాలి. సుగంధాలను పరివ్యాప్తం చేయాలి.
సాధించిన విజయాలు మరింత ఉత్సాహాన్ని నింపాలి. ఆలోచన కొత్తపుంతలు తొక్కి మరిన్ని పనులను చేపట్టి, విజయం సాధించాలి. అలాగాక, అహం తలెత్తిందా తిరోగమనం మొదలైనట్లే. అది విద్యార్థికి, శాస్త్రవేత్తకు, ఆటగాడికి, ఒక లక్ష్యాన్ని చేరుకుని మరిన్ని లక్ష్యాలను చేరుకునే తపన
అహం విడిచిన వేళ అంతా ప్రేమమయమే. అది మనల్ని సత్యశోధకులను, ప్రేమికులను చేస్తుంది. మన అవగాహనశక్తిని పెంచి, ఆలోచనాపరులను చేస్తుంది. శత్రుభావనను వీడేటట్లు చేసి అందర్నీ సమభావంతో చూసే ‘చూపు’నిస్తుంది.
అహాన్ని వీడి జ్ఞానమనే మహాసముద్రంలో ఈదేవాడికే జీవితం లోతు తెలిసివస్తుంది. అది అతడికి ఒద్దికను నేర్పుతుంది. విధేయుణ్ని చేస్తుంది. జ్ఞాన పిపాసిగా ఉండనిస్తుంది. మోక్షసాధనా మార్గంలో పెద్ద ప్రతిబంధకం ఈ అహం.

అహాన్ని విడిచిన మనసు నిర్మలమవుతుంది. అప్పుడే అది భగవంతుడి సన్నిధిని చేరువ చేస్తుంది...

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....✍

చూడు చూడు.. ‘తోడు

తోడు కావాలని కోరుకోవడం లోక సహజం. వివాహంలోనూ పెళ్లికొడుకుకు, పెళ్లికూతురికి ‘తోడు’ ఉంచడం సంప్రదాయం. ఈ తోడుపెళ్లికొడుకు, తోడుపెళ్లికూతురు చేసేదేమీ ఉండదు. వీరిద్దరూ అలంకారప్రాయమైనప్పటికీ అలంకారాల్లో మాత్రం లోటు ఉండదు. మంగళస్నానాలు చేస్తారు. కొత్తబట్టలూ, ఆభరణాలు ధరిస్తారు.
‘తోడు’ సంప్రదాయం ఎలా పుట్టిందన్నది ఆసక్తికరమైన ప్రశ్న. ఇందుకు రకరకాల జవాబులున్నాయి.
నిండు నూరేళ్లు నిలవవలసిన దాంపత్యం కోసం వివాహానికి సుముహూర్తాన్ని దైవజ్ఞులు నిర్ణయిస్తారు. ముహూర్తబలానికి తిరుగు ఉండదని అందరూ నమ్ముతారు. కాబట్టి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాల్సిందే. బాజా భజంత్రీలు మోగాల్సిందే. పెళ్లివిందు కనువిందుగా ఉండాల్సిందే. పెళ్లికి వచ్చే అతిథులకు దూరాభారాలుంటాయి. వ్యయప్రయాసలుంటాయి. ఆశలు, ఆశయాలు ఉంటాయి.  అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి ఆగడానికి వీల్లేదు. కనీసం వాయిదా పడకూడదు. వాగులు వంకలు దాటి వచ్చిన అతిథులకు నిరాశ కలగకూడదు. వాళ్లు బాధతో వెనుతిరగకూడదు. అసలు వివాహానికి అంతరాయం కలిగే పరిస్థితి ఎందుకు వస్తుంది? అవాంతరానికి కారణమేమిటి? కొన్ని పరిస్థితులు జీవుడి చేతిలో ఉండవు. దేవుడి చేతిలో ఉంటాయనేది అసంఖ్యాకుల విశ్వాసం. వెనకటి రోజుల్లో అనారోగ్యకారణాలు ఎక్కువగా ఉండేవి. ముహూర్తాన్ని ఎంతో ముందుగా నిర్ణయిస్తారు కదా! అనివార్యకారణాలవల్ల వధువుగానీ, వరుడుగానీ పెళ్లిరోజునాటికి హాజరు కాకుంటే ఎలా? అందుకే తోడుపెళ్లికొడుకు, తోడు పెళ్లికూతురు ఏర్పాటు చేశారు. ఏ కారణం వల్లనయినా పెళ్లికొడుకు అందుబాటులో లేకపోతే తోడుపెళ్లికొడుకు పెళ్లికొడుకవుతాడు. పెళ్లికూతురు అందుబాటులో లేకపోతే తోడుపెళ్లికూతురు పెళ్లికూతురవుతుంది. అంటే వధూవరులకు ప్రత్యామ్నాయం అన్నమాట.
ఏదయినా ఆచారం మొదలయితే ఆగదు. సంప్రదాయం మానరు. అయితే అంతరార్థాన్ని ఆలోచించక పోవడం విచిత్రం. ఈ రోజుల్లో పెళ్లిళ్లలో అయిదారేళ్ల బాలుడ్ని తోడుపెళ్లికొడుకుగా కూర్చోపెడుతున్నారు. బాల్యవివాహాల కాలంలో ఇది సరిపోయింది గాని ఇప్పుడు ఎలా కుదురుతుంది? అనుకోని పరిస్థితులు వస్తే పాతిక ముప్పయ్యేళ్ల వరుడికి అయిదారేళ్ల తోడుపెళ్లికొడుకు ప్రత్యామ్నాయం ఎలా అవుతాడు? పాతికేళ్ల వధువుకు నాలుగయిదేళ్ల తోడుపెళ్లికూతురు ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? ప్రయోజనం లేని ప్రత్యామ్నాయం కదా! అందుకే ఏదైనా ఆచారం మొదలైతే ఆగదు అన్నది.

‘పెళ్లికూతురిని చేయడానికి అమ్మాయిచేత మంగళస్నానం చేయిస్తారు. అప్పుడు పెళ్లికూతురులోకి పార్వతీదేవి ప్రవేశిస్తుంది. పెళ్లికొడుకును చేయడానికి అబ్బాయిచేత మంగళస్నానం చేయించినప్పుడు అతనిలోకి పరమేశ్వరుడు ప్రవేశిస్తాడు. అయితే దీన్ని అడ్డుకోవడానికి ఉగ్రభూతాలు ప్రయత్నిస్తుంటాయి. ఈ కారణంగా ఆ సమస్యని నివారించడానికి పెళ్లికొడుకుల పక్కన తోడు పెడతారు’ అని ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు అంటారు. తోడు పెళ్లికొడుకు, తోడు పెళ్లి కూతురుకు సంబంధించి ఇదొక అభిప్రాయం
సర్వాలంకార భూషితులైన వధూవరులకు దిష్టితగలకుండా చూడడమే ఈ ఏర్పాటు లక్ష్యమని కొందరంటారు. పెళ్లికొడుకు చేసే పనులను తోడుపెళ్లికొడుకు, పెళ్లి కూతురు చేసే పనులను తోడుపెళ్లికూతురు మౌనంగా చూస్తూ ఉండాలి. పెళ్లి ఆత్మజ్ఞానానికి సంబంధించినది కాబట్టి ‘తోడు’ వ్యవహారం కూడా అందులో భాగమేనన్నది కొందరు పండితుల ఉవాచ. పెళ్లికొడుకు జీవాత్మ అయితే తోడు పెళ్లికొడుకు ఆత్మ అంటున్నారు. పెళ్లి అనే ధర్మకార్యాన్ని పెళ్లికొడుకు చేసినప్పటికీ, దానివెనక ఆత్మ ఉందని చెప్పడానికే ఈ తంతు అని చెబుతారు. జీవాత్మ, ఆత్మ రెండూ దేవుని కుమారులేనంటారు వీరు
మానవ పరిణామ సిద్ధాంతంలాగా తోడుపెళ్లికొడుకు పరిణామ సిద్ధాంతం కూడా ఒకటుంది. అరవంలో మా పిళెతోళన్‌ అని అంటారు. అన్ని పెళ్ళిళ్లలోను ఈ వ్యక్తి ముఖ్యంగా వుండాలి. అంతేకాదు. అతడిని పెళ్లికొడుకు కంటే ఎక్కువగా చూడాలి. కొన్నిస్థలాల్లో ఈ తోడుపెళ్లికొడుకే అసలు పెళ్లికొడుకుని అలంకరిస్తారు. ఈ తోడుపెళ్లికొడుకునే పంక్తి భోజనాలలో మొట్టమొదట కూర్చోపెడతారు. ఇతడే పల్లకీ మొదట ఎక్కుతాడు. కొత్తబట్టలూ, కట్నాలు చదివించినప్పుడు మొదటి కట్నం ఈ తోడుపెళ్లికొడుకుదే. ఆ తర్వాత నుంచీ అసలు పెళ్లికొడుకుదే అధికారం అంటారు ‘పెళ్లిదాని పుట్టుపూర్వోత్తరాలు’ అనే గ్రంథంలో తాపీ ధర్మారావు గారు. ఏదేమయినా కల్యాణమంటపంలో తోడుపెళ్లికొడుకు, తోడుపెళ్లికూతురు దర్శనమిస్తూనే ఉన్నారు కేవలం ప్రదర్శన కోసం.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......✍

దేవి నవరాత్రులంటే ఏమిటి.?

ఈ నవరాత్రులకి
మీరంతా..ఈ సరి క్రొత్త అష్టోత్ర శత నామావళితో.. అమ్మవారిని..పూజించి..ఎన్నో..విజయాలను అందుకోవాలని..ఆశిస్తున్నాను..

'నవం నూతనం రాత్రం జ్ఞానం యస్మాత్తం నవ రాత్ర:'
అని పండితుల వాక్కు.

రాత్రి అనే పదానికి జ్ఞానమనే అర్థాన్ని సూచిస్తున్నాయి. నవరాత్రులంటే తొమ్మిది రాత్రులు.
రాత్రిని తిథిగా స్వీకరించాలి.

'నవాహోవై సంవత్సర ప్రతిమా' అనే వాక్యం వలన నవరాత్ర కర్మ సంవత్సర కాలానికి ప్రతిరూపమని తెలుస్తోంది.

ఆశ్వయుజ శుక్ల పాడ్యమినాడు నవరాత్ర ఆరాధనలు మొదలవుతాయి.

ఈ నవరాత్రులలో నవదుర్గల ఆరాధన వల్ల సమస్త పాపాలు, బాధలు తొలగిపోయి సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పురాణాల ద్వారా విదితమవుతుంది.

''యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా| నమస్తస్యై, నమస్తస్యై, నమస్తస్యై నమో నమ:''

అని సమస్త ప్రాణికోటిలోనూ శక్తి రూపంలో ఉండేదేవికి నమస్కరించింది మార్కండేయ పురాణం.
శివుడు సైతం శక్తి సంపన్నుడైనప్పుడే ఆయనకు పరమేశ్వరత్వం సిద్ధిస్తుంది.
శక్తి లేకుంటే ఏ ప్రాణీ కదలలేదు.
దుష్టరాక్షసులను సంహరించడానికి ఆ పరాశక్తి పలురూపాల్లో అవతరిస్తు ఉంటుంది.

ఆ జగన్మాతను దుర్గభవాని, రుద్రాణి వంటి అనేక నామాలతో భక్తులు కీర్తిస్తుంటారు.

ఈ నవ రాత్రుల పూజ వలన ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్దిధ పురుషార్థ ఫలాలు ప్రాప్తి స్తాయి.

భక్తుల రోగ, శోక, సంతాప, భయాలను ఈ దుర్గాదేవి నశింప చేస్తుంది.
ఈ నవరాత్రులలో నవదుర్గా రూపాల్లోని
మహాలక్ష్మి,
మహాసరస్వతీ,
మహాకాళికలను ఆరాధించడం వల్ల..
మహాలక్ష్మి అష్టైశ్యరాలు ప్రసాదిస్తే,
మహాసరస్వతిగా విద్యాబుద్దులను అనుగ్రహిస్తుంది.

మహాకాళిగా దుర్గగా పూజించడం వల్ల శతృభయం తొలగి విజయం సిద్ధిస్తుంది.

'ప్రథమా శైలపుత్రీ,
ద్వితీయా బ్రహ్మచారిణీ,
తృతీయ చంద్రఘంటేతి
కుష్మాండేతి చతుర్థకే,
పంచమా స్కందమాతేతి,
షష్టాకాత్యాయనీ తచ
సప్తమా కాలరాత్రీతి
మహాగౌరీతి చాష్టమీ
నవమాసిద్ది దాత్రీతి
నవదుర్గా: ప్రకీర్తతా:''
అని మార్కండేయ పురాణం పేర్కొన్నది.

సకల దేవతా శక్తులకు మూలధారిణి,
సకల మంత్ర అధిదేవత,
ఓంకార స్వరూపిణి,
సృష్టిలోని పలు ప్రాణులకు మాతృమూర్తియైన శక్తికి
ప్రతి రూపంగా దుర్గాదేవిని ఆరాధించడం
అనాదిగా మన ఆచారం.

ఈ రూపాలకే 'నవ దుర్గలు' అని పేరు.
దుర్గాదేవి తొలి స్వరూపంలో శైలపుత్రిగా,
మలి రోజు బ్రహ్మ చారిణి స్వరూపంగా,
తృతీయ స్వరూపంగా చంద్ర ఘంటాదేవి,
చతుర్థ స్వరూపంగా కుష్మాండా దేవిగా,
పంచమ రూపం స్కందమాత,
షష్టి స్వరూపం కాత్యాయనిదేవి,
సప్తమ రూపం కాళరాత్రీ,
అష్టమ రూపంగా మహాగౌరి,
దుర్గాదేవి నవమ స్వరూపంలో ప్రసిద్ది చెందింది.

''ఏతస్యా దపరం కించిత్‌ వ్రతం నాన్తి ధరాతలే
నవరాత్రాభిరం వైశ్య పావనం సుఖదం తధా
ఆనందం మోక్షదం చైవ సుఖ సంతాన వర్థనమ్‌
శత్రు నాశకరం కామం నవ రాత్ర వ్రతం సదా''

ఈ నవ రాత్రులలో ఒక్కొక్క నాడు ఒక్కొక్క శక్తిని పూజించడం వలన,
నవ శక్తులతో, నవదుర్గులతో కూడియుండటం వలన నవరాత్రుల య్యాయని శివుడు పార్వతి దేవితో చెప్పినట్లు శక్తి సంగమ తంత్రం ద్వారా తెలుస్తోంది.
                   గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....✍
                  ఓం దుం దుర్గాయై నమః..!!

               లోకా సమస్తా సుఖినోభవంతు..!

                           శ్రీ మాత్రే నమః

దేవీ నవరాత్రి మహోత్సవ వైభవం

అశ్వినీ నక్షత్రం మరియు పూర్ణిమ కల‌సివచ్చేమాసమే ఆశ్వియుజమాసం. ఈ మాసంలో శుద్ధపాడ్యమి తిథితో ప్రారంభించి తొమ్మిది రోజు దేవీనవరాత్రుల‌ను వైభవంగా నిర్వహిస్తారు. వీటినే శరన్నవరాత్రుల‌ని పిలుస్తారు. చివరి మూడు రోజుల‌కు అంటే దుర్గాష్ఠమి, మహర్నవమి, విజయదశమికి ప్రత్యేక విశిష్టత ఉంది.
పూర్వం మధుకైటభుల‌నే రాక్షసుల‌ను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై యోగనిద్రనుంచి మేల్కొన్న విష్ణువు, మధుకైటభుల‌తో ఐదువేల‌ సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేక పోయాడు. ఆ పరిస్థితిని గమనిస్తున్న మహామాయ ఆ మధుకైటభుల‌ను మోహపూరితుల్ని చేస్తుంది. దానితో వారు అంతకాలంగా తమతో పోరాడినందుకు శ్రీమహావిష్ణువును మెచ్చుకుని గర్వంతో నీకు ఏవరంకావాలి అని ప్రశ్నిస్తారు? దానితో శ్రీహరి వారి మరణాన్ని వరంగా ఈయమని కోరుకుంటాడు. తమకు ఇకమరణము తప్పదని నిర్ణయించుకుని తమను నీరులేనిచోట చంపమనికోరతారు రాక్ష‌సులు.  శ్రీహరి వారిని పైకెత్తి భూఅంతరాళంలో సంహరించు సమయాన మహామాయ పదితలల‌తో, పదికాళ్ళతో, నల్ల‌ని రూపంతో ‘‘మహకాళి’’ గా ఆవిర్భవించి శ్రీమహావిష్ణువునకు సహాయపడుతుంది.
అనంతరం ‘‘సింహవాహిని’యై మహిషాసురుని సంహరించింది.  ‘‘మహామాయా`మహాసరస్వతి’’ రూపంలో శుంభ, నిశుంభుల‌ను వధించింది. చండ, ముండుల‌ను సంహరించి ‘‘చాముండి’’ అని పేరు తెచ్చుకుంది. కంస సంహారమునకు సహాయపడుటకై ‘‘నంద’’ అను పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడింది. రాక్షసంహార సమయంలో ఆమె దంతాలు రక్తసిక్తమవడంవ‌ల్ల‌ ‘‘రక్తదంతి’’ అయినది. మునిజనులందరూ వందకన్నుల‌తో ఎదురుచూడగా వారి ప్రార్థన మేరకు ఆవిర్భవించిన తల్లి ‘‘శతాక్షి’’ అని పిలువబడింది. కరువు కాటకముల‌తో ప్రజలు పడుతున్న బాధను చూడలేక ‘‘శాకంబరి’’గా వారికి శాకాలు, ఫలాల‌ను ఇచ్చి ఆ తల్లి బిడ్డను అక్కున చేర్చుకుంది. దుర్గముడను రాక్షసుని సంహరించి ‘దుర్గ’’అను పేరుగాంచింది. ‘‘భీమాదేవిగా ఆవిర్భవించి తననువేడినవారి మనోభీష్టాల‌ను నెరవేర్చింది. తుమ్మెద రూపంతో అరుణుడను రాక్షసుని  హతమార్చి ‘‘భ్రామరి’’ అను పేరు తెచ్చుకుంది.
ఆ విధంగా క్రూరులై లోకాల‌ను భయభ్రాంతుకు గురిచేస్తున్న రాక్షసుల‌ను సంహరించి అందరికీ ఆనందాన్ని అందించింది. అందువ్ల ఈ దేవిని ఎవరికివారు తమకు తోచిన రూపంతో ఆరాధిస్తారు. అయితే వీటన్నింటిలో ‘‘నవవిధ రూపాలు’’ అత్యంత ప్రాముఖ్యతను పొందాయి. నవరాత్రు సందర్భంగా ఈ తొమ్మిదిరూపాతో దేవిని అంకరించి ఆనందాన్ని పొందుతారు భ‌క్తులు.
‘‘నవరాత్రులు’’ అంటే తొమ్మిది రాత్రుల‌ని అర్థం. తొమ్మిదిరాత్రుల‌పాటు దేవిని ఆరాధించడమే దీనిలోని అంతరార్థం. దేవీనవరాత్రులు జరిగే తొమ్మిదిరోజులూ ప్రత్యేకమైనవే అయినా చివరి మూడురోజుల‌కు ఎంతో విశిష్టత ఉన్నది. ఆ మూడురోజులే దుర్గాష్టమి, మహర్నవమి, దసరా. ఈమూడు రోజులూ భక్తులు విశేష ఆరాధనలు, ఉపవాసాన‌లు, చండీహోమాలు మొదలైన కార్యక్రమాల‌తో యథాశక్తిగా దేవికి తమ భక్తిని నివేదిస్తారు.
విజయానిచ్చే విజయదశమి
దసరాకు మరోపేరు ‘దశహరా’’. అంటే పది పాపాల‌ను హరించేది అని అర్థం. ఎంతో వైభవంగా నిర్వహించే పండుగలో ‘‘దసరా’’ ఒకటి. చరిత్ర ప్రకారం విజయదశమి రోజున రాముడు రావణుడిపై గెలిచిన సందర్భం. అంతేగాదు.... పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై నుంచి తమ ఆయుధాల‌ను తిరిగి తీసిన రోజు. అందుకే ఈనాడు రావణవధ, జమ్మి చెట్టుకు పూజా చేయటం ఏనాటినుంచో పాటిస్తున్న సంప్రదాయం. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు, అదే విజయదశమి.
జ్యోతిషశాస్త్ర ప్రకారం ఈ దశమిని విజయయాత్రకు అంటే సాఫ‌ల్యతకు ముహూర్తంగా నిర్ణయిస్తారు. ఈనాటి సంధ్యాసమయంలో నక్షత్రాలు కనబడిన సమయంలో ‘‘విజయ’’ అనే ముహూర్తం ప్రారంభమవుతుందని జ్యోతిష్యశాస్త్రం వివరిస్తోంది. కొన్ని ప్రాంతాల‌లో విజయదశమిని ‘‘అపరాజితాదశమి’’ అనికూడా వ్యవహరిస్తారు.
ఈ రోజున ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయని ‘‘ఆశ్వినస్య సితే పక్షే దశమ్యాం తారకోదయే సకాలో విజయోజ్ఞేయః సర్వకార్యార్థసిద్ధయే’’ అంటూ ఈ విషయాన్ని శంకరుడు పార్వతికి చెప్పినట్లు మన ప్రాచీన గ్రంథాలు తెలియజేస్తున్నాయి.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...