Wednesday, November 7, 2018

కార్తీక పురాణము అధ్యాయము- 1



కార్తీక మాహాత్త్యమును గురించి జనకుడు ప్రశ్నించుట

శ్రీ మదఖిలాండకోటి బ్రహ్మండమండలి ఆర్యావర్తమందు నైమిశారణ్యములో శౌనకాది మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకుని పురాణాలు, పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలం గడుపుచుండెను.
ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యుడగు సూతుని గాంచి, "ఆర్యా! తమవలన అనేక పురాణేతిహాసములు, వేదవేదాంగముల రహస్యములు సంగ్రహముగ గ్రహించినారము. కార్తీకమాస మాహాత్త్యమును కూడా వివరించి, దాని ఫలమును తెలుపగోరు చుంటిమి గాన తమరా వ్రతమును వివరించవలసినది" అని కోరిరి.
అంత నా సూతమహర్షి "ఓ మునిపుంగవులారా! ఒకప్పుడు యిదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి - విష్ణుమూర్తి లక్ష్మీదేవికీ, సాంబశివుడు పార్వతీదేవికీ తెలియజేసిన విధముగా నా గాథను వినిపించెను. అట్టి పురాణ కథను మీకు తెలియజేయుదును. ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కలుగుటయే గాక, యిహమందును, పరమందును, సకలైశ్వర్యములతో తులతూగుదురు. కావున శ్రద్ధగా నాలకింపు" డని యిట్లు చెప్పెను.
పుర్వమొకానొక దినంబున పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహరించు చుండగా పార్వతీదేవి " ప్రాణేశ్వరా సలలైశ్వర్యములు కలుగచేయునట్టిదీ, సకల మానవులూ వర్ణబేధములు లేక అచరించదగినదీ, శాస్త్ర సమ్మతమైనదీ, సూర్యచంద్రులున్నంత వరకూ నాచరింపబడెడిదీ యగు వ్రతమును వివరింపు" డని కోరెను. అంతట మహేశుడు మందహాస మొనరించి "దేవీ! నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడియున్నది. దాని నిప్పుడు వశిష్ఠ మహాముని మిథిలాధీశుడగు జనక మహారాజునకు వివరింపబోవుచున్నాడు. చూడు మా మిథిలానగరమువైపు" అని మిథిలానగరపు దెసగా చూపించెను.
అట, మిథిలా నగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆర్ఘ్యపాద్యములతో సత్కరించి, కాళ్లు కడిగి, ఆ జలమును శిరస్సుపై జల్లుకొని 'మహాయోగీ! మునివర్యా! తమరాకవల్ల నేనూ, నా శరీరమూ, నా దేశమూ, నా ప్రజలూ పవిత్రులమైతిమి. తమ పాదధూళిచే నాదేహము పవిత్రమైనది. తమ రిటకేల వచ్చితిరో సెలవొసంగుడని వేడుకొనెను.
అందులకు వశిష్ఠుడు - జనక మహారాజా! నేనొక మహాయజ్ఞము చేయతలపెట్టితిని. దానికి కావలసిన అర్థబలము, అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభింతమని నిశ్చయించి యిటు వచ్చితిని - అని పలుకగా జనకుడు "మునిచంద్రమా! అటులనే యిత్తును. స్వీకరింపుడు. కాని, చిరకాలమునుండీ నాకొక సందేహము గలదు. తమబోటి దైవజ్ఞులనడిగి సంశయము తీర్చుకోదలచితిని. నా యదృష్టము కొలదీ యీ యవకాశము దొరికినది. గురురత్నా! సంవత్సరములో గల మాసములలో కార్తీకమాసమే యేల నంత పవిత్రమైనది? ఆ కార్తీకమాసము గొప్పతనమేమిటి? అను సంశయము నాకు చాలా కాలము నుండి యున్నది. కావున తాము కర్తీక మాహాత్త్యమును గురించి వివరించవలసినది" యని ప్రార్థించెను.
వశిష్ఠమహాముని చిరునవ్వు నవ్వి, "రాజా! తప్పక నీ సంశయమును దీర్చగలను. నే చెప్పబోవు వ్రత కథ సకల మానవులునూ ఆచరించదగినది సకల పాపహరమైనదీ అయి ఉన్నది. ఈ కార్తీకమాసము హరిహర స్వరూపము. ఈ మానమునందాచరించు వ్రతముయొక్క ఫలమింతని చెప్పనలవి గాదు. వినుటకు గూడా నానందదాయకమైనది. అంతియే గాక వినినంతమాత్రముననే యెట్టి నరకబాధలను లేక యిహమందునూ, పరమందునూ సౌఖ్యమును పొందగలరు. నీబోటి సజ్జనులు యీ కథను గురించి అడిగి తెలుసుకొనుట ఉత్తమమైనది. శ్రద్ధగా ఆలకింపు" మని యిట్లు చెప్పసాగెను.
వశిష్ఠుడు కార్తీక వ్రతవిధానము తెలుపుట:
ఓ మిథిలాధీశ్వరా! జనక మహారాజా! ఏ మానవుడైనను యే వయస్సువాడైనను 'ఉచ్చ - నీచ' అనే భేదములేక కార్తీక మాసములో, సూర్యభగవానుడు తులారాశియందుండగా, వేకువ జామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని, స్నానమాచరించి, దానధర్మములును, దేవతాపూజలునూ చేసినచో - దాని వలన అగణిత పుణ్యఫలము లభించును. కర్తీకమాస ప్రారంభమునుండియు యిట్లు చేయుచూ, విష్ణు సహస్ర నామార్చన, శివలింగార్చన ఆచరించుచుండవలెను. ముందుగా కార్తీక మాసమునకు అధిదేవత యగు దామోదరునికి నమస్కరించి "ఓ దామోదరా! నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము" అని ధ్యానించి, వ్రతమును ప్రారంభించవలయును.


*కార్తీక స్నానవిధానము*

ఓ రాజా! ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి, కాలకృత్యములు తీర్చుకుని, నదికిబోయి స్నానమాచరించి గంగకు, శ్రీమన్నారాయణునకు, పరమేశ్వరునకు, భైరవునకు నమస్కరించి, సంకల్పము చెప్పుకుని, మరల నీటమునిగి సూర్య భగవానునకు అర్ఘ్యప్రదాన మొసంగి, పితృ దేవతలకు క్రమప్రకారముగా తర్పణములొనర్చి, గట్టుపై మూడు దోసిళ్ల నీళ్లు పోయవలెను. ఈ కార్తీక మాసములో పుణ్యనదులైన గంగ, గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర, యమున మున్నగు నదులలో యే ఒక్క నదిలోనైననూ స్నానమాచరించిన యెడల గొప్ప ఫలము కలుగును. తడిబట్టలు వీడి, మడిబట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయముగా కోసి తెచ్చి నిత్యధూప, దీప, నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకుని,గంధము తీసి భగవంతునికి సమర్పించి, తాను బొట్టు పెట్టుకుని పిమ్మట అతిధి ఆభ్యాగతులను పూజించి వారికి ప్రసాదమిడి, తనయింటి వద్దగాని, దేవాలయములలో గాని, లేక రావి చెట్టు మొదటగాని కూర్చుండి కార్తీక పురాణము చదువవలయును. ఆ సాయంకాలము సంధ్యావందనమాచరించి, శివాలయమందుగాని, విష్ణ్యాలయమందుగాని, లేక తులసికోటవద్దగాని, దీపారాధన చేసి శక్తినిబట్టి నైవేద్యము తయారుచేయించి, స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజించవలెను. మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలయును. ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును, ప్రస్తుత జన్మమందును చేసిన పాపము పోయి మోక్షమున కర్హులగుదురు. ఈ వ్రతము చేయుటకు అవకాశము లేనివారలు వ్రతము చేసినవారలను జూచి, వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహాత్మ్యమందలి మొదటి యధ్యాయము

మొదటి రోజు పారాయణము సమాప్తము.

అందరం ఓం నమః శివాయ అని వ్రాసి ఆ మహా దేవుని అనుగ్రహం పొందుదాం ...

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

దీపావళి - ప్రాముఖ్యము

        

ఆశ్వయుజ  బహుళ చతుర్దశిని  నరక చతుర్దశి అని , ఆ మరుచటి రోజు అమావాస్యను దీపావళి అని , మహా ప్రముఖమయిన   పండుగలుగా మహాలక్ష్మి అసీస్స్సుల కోరకు, అనుగ్రహము కొరకు  భారత దేశమే కాదు, విదేశాలలో కూడా    భారతీయులు నివసించు నేపాలు, శ్రీలంక, మలేషియా,  యూరప్, అమెరికా మొ. దేశాలలో వేడుక గా జరుపుకొను పండగ ఈ దీపావళి..దీనిని కొన్ని ప్రాంతములలో,.ఐదు రోజులు, నాలుగు రోజులుల, మూడు,రోజులు, రెండు రోజుల పండుగ గా జరుపుకొను అచారమున్నది.  ప్రాంతాల వారిగా దేశకాల ఆచారము బట్టి  జరుపుచున్నారు. త్రయోదశినాడు, అక్షయతృతీయ అని ,తరువాత నరక చతుర్దశి అని  తరువాత అమావాస్యనాడు దీపావళి గా  తరువాత కార్తిక మాసం మొదటి రోజు పాడ్యమి నాడు బలి  పాడ్యమని  విదియనాడు యమ విదియ గాను, ఈ పండుగను భారత దేశంలో అనాదిగా ఆచరించుచున్న ఆచారం .దీపావళి అనగా దీపముల వరుస. దీపముల సమూహము అని కుడా అర్ధము  చెప్పవచ్చును . ఈ పదము సంస్కృత సమము, .ఏకవచనము.,నామవాచకము.

                               శుభం కరోతి కల్యాణం  ఆరోగ్యం ధనసంపదం
                               శత్రు వృద్ది వినాశాయ  దీపం జ్యోతి నమోస్తుతే
                               దీపం జ్యోతి పర బ్రహ్మ దిపంజ్యోతి జనార్దనః 
                               దిపోహరతి పాపాని సంద్యా దీప నమోస్తుతే !

సకల కళ్యాణ ప్రదము,ఆరోగ్యము,ధనము,శత్రువులపై  విజయము ప్రసాదించు దీపమునకు నమస్కరించు చున్నాను,
ఈ దీపము ,పర బ్రహ్మ మహావిష్ణు స్వరూపము , సకల పాపములు. హరించు సంద్యా దీపమునకు  నమస్కారము. అని ఈ శ్లోకమున దీప ప్రాసత్యమును  చెప్పుచున్నారు. సంధ్య అనగా మూడు సంద్యలు అని అర్ధము.చెప్పుకోవాలి . .

ఈ దీప ఆరంభము  విశేషము గూర్చి తెలుసుకొందాము.  ఒకనాడు  ఇంద్రుడు  దుర్వాస మహా మునికి ఆతిధ్య మిచ్చి సకల సత్కారములు చేసి ఆసీస్సులర్ధించెను. దానికి ఆముని సంతోషించి మహా మహిమాన్విత మయిన ఒక పూలహారమును  బహుకరించెను.  ఇంద్రునకు అది అంత గొప్పదిగా కనిపించలేదు. ఆ హారమును తన ఐరావతము మేడలోకి విసిరెను.  ఆ ఏనుగు ఆ హారమును  క్రింద పడవేసి కాళ్లతో త్రోక్కేను . దానికి ఆ తాపసి ఆగ్రహించి , ఇంద్రుని తన ఐశ్వర్యము,పదవి పోయి బ్రష్టుడవు కమ్మని శపించి  వెడలిపోయేను..మహేంద్రుడు చేసిన అపరాధము గ్రహించి మహావిష్ణువు ఆశ్రయించి ,విషయము వివరించి , దానికి నివారణ, తరుణోపాయము అనుగ్రహించమని వేడుకొనెను.  ఆ పరమాత్మ ఇంద్రునకు మహాలక్ష్మి స్వరూపమయిన  దీప  మహత్యమును చెప్పి దీపారాధన ,జ్యోతి నమస్కారము , ,ఆవశ్యకత , ఫలము వివరించెను.  ఇంద్రుడు ఆ విధముగా  వివిధ దీపములతో  మహాలక్ష్మిని  ఆరాధించి  ఆమె అనుగ్రహము సంపాదించి  మరల పూర్వ  వైభవమును  సంతరించుకోనేను..  ఇది దీప మహాత్యము తెలుపు పురాణ గాధ . ఈ దీపము అజ్ఞానమును తొలగించి  సన్మార్గము చూపుచు మానవాళికి మహోపకారి యగు  మహలక్షియె నని హిందువుల  విశ్వాసము..

మరియు  శ్రీ మహావిష్ణువు  ద్వాపరమున  నరకాసురుని సంహరించి  దేవ మునిగణ  సాదు సజ్జనులను వాని బారి నుంచి కాపాడిన రోజుగా నరక చతుర్దశిని  జరుపు కొనుట మన ఆచారము.ఆ తరువాతి అమావాస్యనాడు ఆ సంబరము జరుపుకొని మహాలక్ష్మిని  పూజించుట దీపావళి ప్రాముఖ్యము.   ఆ నరకాసుర సంహార ఘట్టమును ముందు వివరముగా మనవిచేసేదను.  మరియొక గాధ :  శ్రీరామచంద్రుడు రావణ సంహారం గావించి సీతా సమేతుడయి  అయోధ్యకు వచ్చిన రోజుగా కొందిరి భావము . జైనుల చివరి తీర్ధంకరునకు, మోక్షం  సిద్ధించిన రోజుగా వారి  ఆచారము ప్రకారము ఈ దీపావళి పండుగ జరుపు కొందురు.  బలిచక్రవర్తి  పాతాళము నుంచి తిరిగి వచ్చిన రోజని  మరి కొందరి నమ్మకము.. .  .

దక్షణ భారతమున మాత్రము నరక చతుర్దశి  దీపావళి పాడ్యమి  మూడు రోజలు అరుపుకోను ఆచారమున్నది. కార్ణాటక మహారాష్ట్రలలో, కార్తికమాస మొదటి దినము  పాడ్యమినాడు పశువులకు అలంకారము చేసి పూజించు సాంప్రదాయము కలదు. దీనిని బలిపాడ్యమి గా  వ్యవహరింతురు . ఆ తరువాతి రోజు , విదియనాడు యమ ధర్మ రాజు తన సోదరి ఇంటికి వెళ్లి ఆతిధ్యము స్వీకరించి ఆమెను ఆశిర్వదించేనని యమవిదియ నాడు  సోదరులు సోదరి గృహమునకు వెళ్లి ఆశీర్వదించి  బహుమతులు ఇచ్చుట మనము చూచుచున్నాము ...

ఈ పర్వదినమున  హిందువులు ఉదయమే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానము చేసి , గృహములను పువ్వులతోను తోరణములతోనూ  అలంకరించి ముగ్గులువేసి అలంకరించాలి . సాయంకాలమున , ప్రదోష  సమయమున, దీపము దక్షిణదిక్కుగా తిరిగి వెలిగించి,  పెద్దలకు నమస్కారము చేయవలెను..  ఇలా చేయుట వారికి ముక్తి మార్గము చూపునది  అని  భావిస్తారు. దీనినే ఉల్కాదాన మంటారు. దీనిని దీపావళి నాటి సాయంత్రము  ముందుగా చేయవలెను.  అనం తరము  భక్తి శ్రధలతో మహాలక్ష్మి ఆరాదించి ప్రార్ధించి  వేడుకగా బణసంచా వెలిగించి  ఆనందించు పండుగ ఈ దీపావళి .ఈ పండుగ ప్రాముఖ్యమంతయు మహాలక్ష్మిని  ఆరాధించుట ,కొలుచుట ,పూజించుట అని గ్రహించవలెను .

పంచ భూతములలో అగ్ని ప్రధానమయినది.  ఈ అగ్ని దీపమే, దీపస్వరూపమె . అగ్నిలో తేజస్సు, ఆహారం, విద్యా నిండి ఉంటాయి . అందుచే అగ్ని హోత్రమునకు మన సంప్రదాయమున మిక్కిలి ప్రాధాన్య మీయబదినది దీపములో మూడు రంగులు కలిసి ఉంటాయి  అవి నీలము ,పసుపు, తెలుపు. ఇవి సత్య ,తమో,  రజో గుణాలకు సంకేతములు మరియు లక్ష్మి ,సరస్వతి, దుర్గలకు కూడా ప్రతీకలు .ఈ దీపాన్ని ఆరాధించుట త్రిజగన్మాతలను  ఆరాధించుటయే.ఈ దీపారాధన తో ముగురమ్మలను పూజించి, ప్రసన్నం చేసుకోను తరుణోపాయం   ఈ దీపావళి  రోజుని , ఉత్తర భారత దేశమున నూతన సంవత్సరముగా  భావించి , క్రొత్త కాతాలు, పుస్తకాలు తెరచి  వ్యాపారారంభం చేయు ఆచారము మనకు తెలిసినదే. ఇట్టి మహా మహిమాన్వయితమయిన ఈ పండుగ హిందువులందరి  ముఖ్యమయినది .శుభ మయినది.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...