Sunday, November 25, 2018


శ్రీ దేవీ ఖడ్గమాలా పుష్పార్చన ---- అమ్మా! శుద్ధ సత్త్వ రూపిణియై దశ సంస్కార రహితయైన విమలాదేవీ మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! బాలభాస్కరసమమగు అరుణవర్ణం కలిగి, అరుణ వస్రాన్ని ధరించి, మందారాది అరుణపుష్పాలయందు ప్రీతి కల దేవీ మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! జయమే స్వరూపంగా గలిగి భక్తులకు జయాలను ప్రసాదించు తల్లీ మీకు నమస్కరించుచున్నాను . అమ్మా! చరాచర విశ్వానికీ, సృష్టిస్థితి సంహారాలు చేయునట్టి త్రిమూర్తులకూ సైతం ఈశ్వరి అయిన సర్వేశ్వరీ దేవీ మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపుడగు శివుడు -జగత్కారణ స్వరూపిణియగు సగుణ బ్రహ్మశక్తియే మాత. ఇట్టి శివశక్త్యాత్మక సామరస్య సూచక కౌళినీ స్వరూపిణియగు దేవీ మీకు నమస్కరించుచున్నాను.అమ్మా! శ్రీ చక్రాధిష్టాత్రియై తేజరిల్లుతూ తన ఉపాసకులకు రోగములు రాకుండ కాపాడు నట్టియు, జన్మాంతర ఆదివ్యాధులను కూడా రూపుమాపునట్టిదియు అయిన మహేశ్వరీ మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! శ్రీ చక్రాంతర్గత నవావరణ దేవతలలో గల రహస్యయోగినీ బృందానికి అధిష్టాత్రియైన మాతా మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! బాణములను దాల్చి భక్తులను రక్షించు మాతా మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! చాపాయుధధారిణీ మీకు నమస్కరించుచున్నాను. అమ్మా! మహాకామేశ్వరి,మహావజ్రేశ్వరి,మహాభగమాలిని,సర్వసిద్దిప్రద చక్రస్వామిని అతి రహాస్యయోగిని,శ్రీ శ్రీ మహాభట్టరకే,సర్వనందామయి చక్రస్వాభిని,పరఅపర రహాస్య యోగిని,దేవీ మీరు మా పుష్పాలంకరణ స్వీకరించండి తల్లీ! ఈ గులాబీ మొక్క చూడమ్మా! నీ కోసం ఎన్ని పువ్వులు పూచిందో! ఈ రోజు ఈ పువ్వులను మీకు సమర్పించాలని మొక్కతల్లి తన బిడ్డలను అందముగా తయారుచేసి, అమ్మ దగ్గర వినయ విదేయతలు, భక్తితో మెలగమని, అమ్మకు తలలు వంచి నమస్కరించమని, తమ బిడ్డలకు బుద్ధులు చెబుతుంది ఈ మొక్క తల్లి. తల్లి మాట జవదాటని ఆ చిన్ని గులాబీలు తలలు వంచి వినయవిదేయలతో మీకు నమస్కరించుచున్నాయి. కొన్ని గులాబీలు లేత ఎరుపురంగులో, కొన్ని గులాబీలు కుంకుమరంగులో శోభిస్తున్నాయి అమ్మ. తమ బిడ్డలు దూరం అవుతున్నాయి అని తెలిసినా, ''అమ్మ దగ్గరికే కదా వెళ్ళేది'' అని ధైర్యంతో వున్నదమ్మా ఆ మొక్క తల్లి. తను కన్నీరు పెట్టుకుంటే ఆ చిన్ని చిన్ని గులాబీలు ఎక్కడ తల్లడిల్లి పోతాయోనని, తన కన్నీటిని తనలోకే పంపుకుని, ఆ చిన్ని చిన్ని గులాబీలను తన ఒడిలో చేర్చుకుని, వాయు స్పర్సతో, తను ఊగుతూ, బిడ్డలని ఊపుతూ, జోల పాట పాడుతుంది ఆ తల్లి. అమ్మా! ప్రేమలు మాకేనేమో అనుకున్నాను. ఈ మొక్కలకు కూడా ఉంటాయని అర్ధం అయ్యిందమ్మా! ఆ మొక్కతల్లి త్యాగానికి, ధైర్యానికి, శాంతికి యేమని కృతజ్ఞతలు చెప్పుకోవాలో మాటలు రావడంలేదు తల్లి. నా భావాన్ని ఆ మొక్కతల్లి దగ్గర నివేదించుకున్నాను అమ్మ. అప్పుడు నాకేమి అనిపించిందంటే! ఆనందముతో వాయుదేవుడు ఎంత వేగముగా వచ్చినా, తను మాత్రం చిన్నగానే ఊగుతుంది. తామర పువ్వు రాలిపడిపోతాయో నని భయంతో, ఆ తల్లి భూమాతకు ఎన్నోసార్లు ఆ తామరపువ్వులను నివేదన చేసింది. ఇప్పుడు ఈ నవరాత్రులలో ఈ చిన్ని చిన్ని తామర పువ్వులను నేలరాలకముందే మీ సన్నిధికి చేర్చాలని తన భావనని తెలియచేసింది మొక్కతల్లి. అమ్మా! ఆ మొక్కతల్లికి నమస్కరించి, ఇప్పుడు సంతోషముతో మీ నామజపం చేస్తూ మీకు ఈ పువ్వులను మీకు సమర్పించాలని అనిపించింది అమ్మ. ఇప్పుడే పువ్వులు కోసుకుని తీసుకుని వస్తాను అమ్మా. ఆలస్యం అయ్యిందని ఆగ్రహించకు తల్లి. ఇప్పుడు సంతోషముతో ఈ పువ్వులను మీకు సమర్పిస్తాను, తల్లికి దూరం అయిన ఆ బిడ్డలను అక్కున చేర్చుకోని ఓదార్చి నీలో కలుపుకో అమ్మ. బిడ్డలకు దూరం అయిన ఆ తల్లికి మనోధైర్యాన్ని ఆ తల్లికి ఇచ్చి తన కర్తవ్యాన్ని తను చేసేటట్లుగా ఉత్సాహాన్నిచ్చి చివరికి నీలో కలుపుకునే భాగ్యాన్ని ప్రసాదించు తల్లి. అమ్మా ! ఇంకేమి చెప్పను మాటలు రాని మౌనంతో పువ్వులు సమర్పిస్తూ పూజ చేస్తున్నాను. ఇంతకు మించి నాకు ఏమి కావాలి అమ్మ. ధన్యురాలిని అమ్మ. మీకు నమస్కరించుచున్నాను. మా నమస్కారాన్ని స్వీకరించు అమ్మా!శ్రీ జోగుళాంబాదేవి
అలంపుర క్షేత్రే!!!!!!
*సేకరణ: నా మిత్రబృందం *
నమ్మకం

శ్రీరాముడు రావణునితో
యుద్ధం చేసి అతనిని సంహరించాడు
యుద్ధం ముగిసింది ఆ రాత్రి రామలక్ష్మణులు
కపి సైన్యంతో సముద్ర తీరంలో విశ్రమించారు

అర్థరాత్రి అయింది .......
రాముడు లేచి సముద్రం దగ్గరకు వెళ్ళాడు
ఒక్కొక్క రాయి తీసికొని సముద్రం నీటిలో వేస్తున్నాడు
ప్రతి రాయి మునిగిపోతుంది .........

రాముడు లేచి కడలి చెంతకు వెళ్ళడం
గమనించిన హనుమంతుడు
తాను రాముని వెంట వెళ్ళాడు
రాముడు రాళ్ళను సముద్రంలో వేయడం గమనించారు
రాముని ముందుకు వెళ్ళి నమస్కరించి మహాప్రభూ
ఎందుకిలా రాళ్ళను అంబుధిలో వేస్తున్నారు
అని ప్రశ్నించాడు

హనుమా ! నువ్వు నాకు
అబద్ధం చెప్పావు అన్నాడు రాముడు
అదేమిటి స్వామి ! నేను మీకు అబద్ధం చెప్పానా ?
ఏమిటి స్వామి అది ?
ఆశ్చర్యంతో అడిగాడు ఆంజనేయుడు
వారధి కట్టేటప్పుడు నా పేరు
జపిస్తూ రాళ్ళను కడలిలో వేశామని
అవన్నీ తేలి వంతెనలాగా ఏర్పడ్డాయని చెప్పావు
నిజమేనా ? .. అన్నాడు రాముడు
అవును స్వామీ !..

నా పేరు జపింవి వేసిన రాళ్ళు తేలడం నిజమైతే
నేను స్వయంగా వేస్తున్న రాళ్ళు ఎందుకు
తేలడం లేదు ? మునగడానికి కారణమేమిటి ?..
నువ్వు చెప్పిన మాట అబద్ధం కాదా !..
అడిగాడు రాముడు

హనుమంతుడు వినయంగా
చేతులు కట్టుకుని ఇలా అన్నాడు
రామచంద్ర ప్రభూ ! ....
మేము మిమ్ము మీ శక్తిని నమ్మాము
మీ మీద నమ్మకంతో వేశాము
మా నమ్మకం వలన అవి తేలాయి
మీకు మీ శక్తి మీద నమ్మకం లేదు
అనుమానంతో అపనమ్మకంతో రాళ్ళను వేశారు
అందుకే అవి మునిగిపోయాయి
నమ్మకం విలువ అది .....

గుట్టీ సుబ్రహ్మణ్యశర్మ.....

నవ దుర్గా స్తోత్రం


హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ |
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ||

వందే వాఞ్ఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||

దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||

పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||

సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||

సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||

చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||

ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ||

వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||

శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||

సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||

బిల్వాష్టకం


త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం;
త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం. ||1||

త్రిసాఖైః బిల్వపత్రైశ్ఛ, అస్ఛిద్రై కోమలై శుభైః;
తవ పూజాం కరిష్యామి, ఏక బిల్వం శివార్పణం. ||2||

కోటి కన్యా మహా దానం, తిల పర్వత కోటయః;
కాంచనం శైలదానేన, ఏక బిల్వం శివార్పణం. ||3||

కాశీ క్షేత్ర నివాసంచ, కాల భైరవ దర్శనం;
ప్రయాగే మాధవం దృష్ట్వా, ఏక బిల్వం శివార్పణం. ||4||

ఇందు వారే వ్రతమస్థిత్వ, నిరాహారో మహేశ్వర;
నర్థం ఔష్యామి దేవేశ, ఏక బిల్వం శివార్పణం. ||5||

రామ లింగ ప్రతిష్ఠాచ, వైవాహిక కృతం తధా;
తటాకాచిద సంతానం, ఏక బిల్వం శివార్పణం. ||6||

అఖండ బిల్వ పత్రంచ, ఆయుతం శివ పూజనం;
కృతం నామ సహస్రేన, ఏక బిల్వం శివార్పణం. ||7||

ఉమయా సహదేవేశ, నంది వాహన మేవచ;
భస్మ లేపన సర్వాగం, ఏక బిల్వం శివార్పణం. ||8||

సాలగ్రామేషు విప్రాణాం, తటాకం దశ కూపయో;
యజ్ఞ కోటి సహస్రస్య, ఏక బిల్వం శివార్పణం. ||9||

దంతి కోటి సహశ్రేషు,అశ్వమేవ శతకృతౌ;
కోటి కన్యా మహా దానం,ఏక బిల్వం శివార్పణం. ||10||

బిల్వనాం దర్శనం పుణ్యం,స్పర్శనం పాప నాశనం;
అఘోర పాప సంహారం,ఏక బిల్వం శివార్పణం. ||11||

సహస్ర వేద పాఠేషు,బ్రహ్మ స్థాపన ముచ్చతే;
అనేక వ్రత కోటీనాం, ఏక బిల్వం శివార్పణం. ||12||

అన్నదాన సహశ్రేషు,సహస్రోప నయనంతాధా,
అనేక జన్మ పాపాని,ఏక బిల్వం శివార్పణం. ||13||

బిల్వాష్టక మిదం పుణ్యంయః, పఠేచ్ఛివ సన్నిధౌ;
శివలోక మవాప్నోతి, ఏక బిల్వం శివార్పణం. ||14||

శతానంద మహర్షి

శతానంద మహర్షి ఎవరో కాదు గౌతమ మహర్షి అహల్యలకు పుట్టిన నలుగురు కొడుకులలో పెద్దవాడు. గౌతమ మహర్షి అహల్యలు కొన్ని వేల సంవత్సరాలు దాంపత్య బ్రహ్మచర్యము గడుపుతూ లోకంలో కరువు కాటకాలు ప్రబలినపుడు తమ తపఃశక్తితో మూడులోకాల వాళ్లకి అన్నవస్త్రాలు ఇచ్చారు. ఇలా చాలా కాలం గడచిన తరువాత గౌతముడు అహల్యని ఏం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె స్త్రీకి సహజంగా ఉండే కోరిక అయిన మాతృత్వాన్ని కోరుకుంది.

అహల్య కోరిక మేర గౌతముడు ఆమెను వంద వనములలో తిప్పి, వందరకాలుగా ఆనందపడేలా చేసాడు. అలా శత రకాలుగా ఆనందపడి కొడుకుని కన్నారు కాబట్టి ఆ బాలుడికి శతానందుడు అని పేరు పెట్టారు. శతానందుడు తండ్రి గౌతముని దగ్గరే సమస్త వేదశాస్త్రాది విద్యలు నేర్చుకుని బ్రహ్మచర్యాశ్రమము పాటిస్తూ మహా తపశ్శాలి అయ్యాడు. అతని బుద్ధివైభవము, జ్ఞానసంపద, తపోనిరతి విని జనక మహారాజు తన ఆస్థాన పురోహితునిగా వుండుమని ప్రార్ధించాడు. ఇది విన్న గౌతమ మహర్షి ఆనందించి, మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసి ఇద్దరినీ మిథిలా నగరానికి పంపాడు. అక్కడ జనకుడు శతానండుడిని తమ కులగురువుని చేసుకున్నాడు.

తరువాతి కాలంలో గౌతముడు అహల్యను శపించటం, శ్రీరాముదు పుట్టటం, వనవాసము, యాగ రక్షణకోసం విశ్వామిత్రుని వెంట వెళ్ళటం, శతానందుని తల్లి అయిన అహల్య శాపవిమోచనము మొదలయినవి జరిగిపోయి, శ్రీరాముడు మిధిలకు వచ్చినప్పుడు, జనక మహారాజుతో శతానందుడు వారికి స్వాగతం పలుకుతాడు. శతానందుడు రామలక్ష్మణులకు విశ్వామిత్రుడి గొప్పతనం గురించి వివరంగా చెప్తాడు.

మిథిలా నగరంలో ఏర్పాటు చేసిన సీతా స్వయంవరంలో రాముడు శివధనస్సును విరిచి సీతమ్మను పెల్లిచేసుకునే సందర్భంలోదశరథుడి వైపు వశిష్టుడు ఉంటే జనకుడి వైపు శతానందుడు ఉండి గోత్రప్రవరాలు చెప్పి సీతారామ కళ్యాణం చేయించారు.

కొంతకాలం తరువాత సతానండుడికి తన భార్య వల్ల సత్యధృతుడు అనే కొడుకు పుడతాడు. అతను పుడుతూనే చేతిలో బాణంతో పుట్టటం వల్ల అతనికి 'శరద్వంతుడు' అని పేరు వచ్చెను. అప్పటినుండే శరము అంటే బాణం వదలకుండా ఉండటం వల్ల అతని మనస్సు వేదశాస్త్రాది విద్యల వైపు కన్నా ధనుర్వేదం వైపే ఎక్కువగా మనసు పారేసుకునేవాడు. గొప్ప తపఃశక్తితో ఎన్నో అస్త్రాలు పొంది ఇంకా మరెన్నో అస్త్రాలని పొందటానికి తపస్సు చేస్తూనే ఉండేవాడు.

శతానందుని కొడుకైన శరద్వంతుడికి కృపుడు, కృప అని ఒక అమ్మాయి, ఒక అబ్బాయి పుట్టారు. వాళ్ళని ఎక్కువ కాలం శంతనమహారాజే పెంచుతాడు. కృపుడు కూడా ధనుర్విద్యలో గొప్పవాడయ్యి కృపాచార్యుడిగా పేరు పొంది కౌరవ - పాండవులకి గురువయ్యాడు.

ఈ విధంగా శతానంద మహర్షి తన తపఃశక్తి వల్ల మాత్రమే కాకుండా మంచి కొడుకు, మంచి మనవల్ని కూడా పొందటం వల్ల ఇంకా గొప్పవాడయ్యాడు.

నంది తిమ్మన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకరు


శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ఒకరు. ఆయన రాయల భార్య తిరుమల దేవికి అరణంగా విజయనగరం వచ్చిన కవి. ఈయన అనంతపురం పరిసర ప్రాంతానికి చెందిన వాడని భావిస్తున్నారు. ఈయన నివసించిన రాజ్యం, విజయనగర సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. ఆ సామంత రాజ్యపు యువరాణి తిరుమలాదేవి ఆ తరువాత కృష్ణదేవరాయల ధర్మపత్ని అయ్యింది.

వీరు నంది సింగన, తిమ్మాంబ దంపతులకు జన్మించారు.

ఈయన తాత నంది మల్లయ్య మరియు మేనమామ ఘంట సింగన్న (ఈయనకే మలయమారుత కవి అనికూడా మరోపేరు) కృష్ణదేవరాయల తండ్రి అయిన వీరనరసింహరాయల ఆస్థానంలో జంటకవులుగా ఉండేవారు. నంది తిమ్మనను ముక్కు తిమ్మన అని కూడా అంటారు. వీరి జీవిత కాలం 1475-1540.

తిమ్మన జన్మతః శైవుడు, అఘోర శివాచార్యుల శిష్యుడైనా, వైష్ణవ రాజాస్థానంలో ఉన్నందువలన, అప్పటి రాజకీయ-సామాజిక పరిస్థితుల వల్ల కొన్ని వైష్ణవ రచనలు కూడా చేశారు.. .

1521లో ముక్కు తిమ్మన రాయల తరఫున గయను సందర్శించి అక్కడ నావాడ నాయకులపై కృష్ణదేవరాయల విజయానికి ప్రతీకగా ఒక విజయశాసనం ప్రతిష్టించాడని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ప్రసిద్ధి చెందిన కృష్ణదేవరాయల గయ శాసనం క్రింద రాజప్రశస్తిని కీర్తిస్తూ చెక్కబడిన కంద పద్యం ముక్కు తిమ్మన వ్రాసిన పారిజాతాపహరణంలోనిది కావటం, కృష్ణదేవరాయలు గయను సందర్శించిన ఆధారం లేకపోవటం ఈ సంభావ్యతకు మద్దతునిస్తున్నాయి.

రచనా శైలి:
--------------
తిమ్మన రచన పారిజాతాపహరణం ప్రసిద్ధి చెందింది. ఇతను “వాణీ విలాసము” అనే మరొక కావ్యాన్ని రచించినట్లు తెలుస్తున్నా అది లభ్యం కావడం లేదు.

తన సమకాలికుడైన అల్లసాని పెద్దన వలే క్లిష్టమైన పదప్రయోగాలకు పోకుండా సున్నితమైన, సులువైన పద్దతిలోనే రచనలు చేశాడు. ఈయన రచనలు కేవలం పండితులకే కాక పామర జనులను సైతం విశేషంగా ఆకర్షించేవి. అందుకే ఆయన రచనలను ముక్కు తిమ్మన ముద్దు పలుకులు అని వ్యవహరిస్తారు. పారిజాతాపహరణం లో ఆయన రచించిన సుకుమారమైన శృంగార రసాత్మకమైన పద్యాలు ఇప్పటికీ పండితుల నోళ్ళలో నానుతూనే ఉంటాయి.

ముక్కు తిమ్మనాచార్యు ముద్దు పలుకు
ఈ నానుడి తిమ్మన పద్యరచనారీతిని బట్టి, శైలీశయ్యాది సౌభాగ్యాన్ని బట్టి ఏర్పడి ఉంటుంది.పాత్రనుబట్టి శైలిని మార్చడం, నాటకీయతను పొందుపరచడం, సామెతలు, సూక్తులు ప్రయోగించడం, సమయోచిత ఉపమానాలు ప్రయోగించడం, తెలుగు నుడికారాన్ని వాడడం, చమత్కారంగా చెప్పడం మొదలైన వాటివల్ల ఇవి “ముద్దు పలుకులు” అనిపిస్తాయి.

అనవిని వ్రేటుబడ్డ యురగాంగనయుంబలె నేయివోయ
 బగ్గున దరికొన్న భీషణ హుతాశన కీల యనంగ లేచి హె
 చ్చిన కనుదోయి కెంపు తన చెక్కుల కుంకుమ పత్రభంగ సం
 జనిత నవీన కాంతి వెద జల్లగ గద్గద ఖిన్న కంఠియై!

పద్యానవనం
 తెలుగునాట పద్యాన్ని ఎంతో రమ్యంగా నడిపిన వారిలో నంది తిమ్మన ఒకరు. సాహితీ సమరాంగణ  సార్వభౌముడని పేరు గడించిన కృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో ఆయనొకరు. అందమైన మహిళ ముక్కును సహజాతి సహజమైన సంపెంగ పూలతో పోలుస్తూ అత్యద్భుతంగా వర్ణించినందుకు ఆయన్ని ముక్కుతిమ్మన అని కూడా పిలిచేవారట. భాష మీద పట్టు, విలక్షణమైన శైలి కారణంగా విషయం అలవోకగా చదువరుల హృదయాలను తడుతూ, మెదళ్లను కదిలిస్తుంది.

" నానాసూనవితాన వాసనల నానందించు సారంగ మే లా న న్నొల్లదటంచు, గంధఫలి బల్కాకం తపంబంది యో షానాసాకృతి బూని సర్వసుమనస్సౌరభ్యసంవాస మై పూనెం బ్రేక్షణమాలికామధుకరీ పుంజంబునిర్వంకలన్”

అని ఆడవారి ముక్కు మీద రాసిన ఒక అందమైన పద్యం కారణంగా ‘ముక్కు తిమ్మన’ గా ప్రసిద్దికెక్కారు

తిమ్మన ప్రబంధ యుగంలో కాకుండా ప్రబోధ యుగంలో ఉండి ఉంటే,  తెలుగుజాతి మరింత ప్రయోజనం పొంది ఉండేదనిపిస్తుంది. కృష్ణ లీలల్లోని ఓ సందర్భాన్ని తీసుకొని ‘పారిజాతాపహరణం’ అనే రసవత్తర ప్రబంధ కావ్యాన్ని రాశారాయన. నారదుడిచ్చిన అరుదైన వేయిరెక్కల పారిజాత పుష్పాన్ని కృష్ణుడు పోయి పోయి రుక్మిణికిచ్చాడు. సత్యభామ లాంటి మరో భార్య ఉన్న భర్తగా కృష్ణుడు చేసే ఇంతకు మించిన తప్పిదమేముంటుంది వాతావరణం రచ్చ రచ్చ కావడానికి! అంతిమంగా అదే జరిగింది. ఇదీ సన్నివేశం.
 
 విషయం తెలియగానే దిగ్గున మంచం నుంచి లేచి సత్యభామ ఎలా స్పందించిందో చెబుతున్నాడీ పద్యంలో. మాటలు వినగానే, ఒంటిపై దెబ్బ పడగానే చర్రున లేచే ఆడపాములాగా సత్య లేచిందట! ఇంకొక పోలిక చూడండి, ఎంత పెద్ద పద సముచ్ఛయమో! ఇందులో ఇరవై అక్షరాలున్నాయి. ‘నేయివోయ భగ్గున దరికొన్న భీషణ హుతాశన కీల’ అన్నట్లు లేచిందట! అగ్నిలో నేయి పోస్తే మంటలెలా ఎగుస్తాయి? భగ్గుమని, అలా జ్వాలలా ఎగిసిందని! లేచి ఏం చేసింది? గద్గద స్వరంతో ఏదో మాట్లాడింది. అది తర్వాతి పద్యంతో అన్వయం. ఏవో మాటలు చెబితే (పూర్వపు పద్యంతో అన్వయం) విని, ఎలా స్పందించింది అన్నదే ఈ పద్యంలో పేర్కొన్నాడు.
 
 బాధ, కోపం, ఆవేశం ముప్పిరిగొనగానే కళ్లల్లో ఎర్రజీరలొస్తాయి, సహజం. ఆ ఎరుపునకు మరో ఎరుపు తోడయింది. అలంకరణలో భాగంగా కొన్ని పూల, పత్రాల లేపనాలను చెంపలపై రంగరించుకుంటారు. అటువంటి కుంకుమ పత్రపు అలంకరణ చెడిపోయి అదోరకమైన ఎరుపు కాంతి జనించిందట. ఈ రెండు ఎరుపులు కలగలిసి ఓ నూతన కాంతి ఆవిష్కృతమైంది, వెదజల్ల బడింది. అదుగో ఆ దృశ్యం గోచరమౌతున్నపుడు దుఃఖం పొంగుకొస్తుంటే, ఆమె గద్గద స్వరంతో...
 
 రమ్యమైన పదాల వాడుక ఒక్కటే భాషకు అందం తీసుకురాదు. అదొక అంశం అంతే! ఇంగ్లీషులో ఫ్రేజ్ అని చెప్పే పదసముచ్ఛయాలు, సంక్లిష్ట పదాలు తెలుగు పద్య సాహిత్యంలో చాలానే ఉంటాయి. నన్నయ లాంటి వాళ్లు ‘నిజోజ్వలత్కవచుడు’ ‘శశ్వత్కుండలోద్భాసితుడు’ ‘జగత్కర్ణపూర్ణాలోలద్గుణుడు’ వంటి పదసముచ్ఛయాల్ని ఒక్క కర్ణుడిని వర్ణించడానికే వాడారు. ఇవి ఒక రకంగా టంగ్‌ట్విస్టర్స్. ‘రిపుమర్ధనదోర్దాముడు భీముడు శపథనిబద్ద గదాయుధుడు’ (23 అక్షరాలు) అని, భీముడిని వర్ణిస్తూ ఓ సినీగీతంలో శ్రీశ్రీ వాడారు.

 ఇటువంటి పదాలు చక్కని శబ్దాలంకారాలౌతాయి. భాషను సుసంపన్నం చేయడానికి శబ్దాలంకారాలకు తోడు అర్థాలంకారాలూ ముఖ్యమే! శబ్దం-అర్థం శివపార్వతుల్లా అవిభాజ్యమైనవి. ఇదే విషయాన్ని ‘వాగార్థా వివసంప్రక్షౌ వాగర్త ప్రతిపత్తయే, జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ!’ అని కాళిదాసు అత్యద్భుతంగా చెప్పారు.

 పార్వతీపరమేశ్వరౌ అన్న పదాన్ని ఉమాశంకరులు గానే కాకుండా ‘పార్వతీప’(పార్వతి పతియైన శివా!) ‘రమేశ్వర’ (లక్ష్మీ పతివైన కేశవా!) అని కూడా విడదీయవచ్చని భాషా పరిశోధకుడు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు గొప్పగా విడమర్చారు. అలా ఇంపైన పద్యాలతో అర్థ-శబ్ద రమ్యతను సాధించిన నంది తిమ్మన కీర్తి తెలుగునాట అజరామరమైనది.

రాజుగారికి, రాణిగారికి వచ్చిన అపార్ధాన్ని సవరించడం కోసం పారిజాతాపహరణ కావ్యాన్ని రాసాడని అంటారు. ఏది ఏవైనా అయిదొందల ఏళ్ళనాటి ప్రాచీన సాహిత్యాన్ని మనం ఎందుకు చదవాలి? అంటే …

పాత వాళ్లైనా కొత్త వాళ్లైనా కవులు కవులే. ఆనాటి కవులు సృష్టించిన పాత్రలు వాటి గుణగణాలు, స్వభావాలు మనకి పరిచయం ఉన్నవే. వాళ్ళ భాషాప్రయోగాలు చూసి పెదవి విరిచిన సందర్భాల కంటే ‘ ఔరా’ అనుకున్న సందర్భాలే మోతాదులో కాస్త ఎక్కువని చెప్పాలి.

భాగవత దశమస్కంధంలో మూడు శ్లోకాలని తీసుకుని ఐదు ఆశ్వాసాల పారిజాతాపహరణాన్ని సృష్టించాడు నంది తిమ్మన. నిజానికి ఈ కావ్యం విషయంలో సృష్టి అనే పదం చక్కగా నప్పుతుంది. ఎందుకంటే మూల కథలో చిరుగీతల్లా ఉన్న పాత్రలని తీసుకుని, మరువలేని,మరపురాని సజీవశిల్పాలుగా తీర్చి దిద్దాడు తిమ్మన.

ముక్కు తిమ్మనార్యు ముద్దు పలుకు అన్న నానుడే కాదు

“లోకమునం గల కవులకు
నీ కవనపు ఠీవి యబ్బునే కూపనట
ద్భేకములకు గగనధునీ
శీకరముల చెమ్మ నంది సింగయతిమ్మా! “

-నీకూ తక్కిన కవులకి హస్తిమశకాంతరభేదం ఉంది అంటూ నాటి పండిత కవులచే మెప్పులు పొందిన కవి యితడు. సరళ సుందరమైన శైలి, నాటకీయత, పాత్ర పోషణాచాతురి, అతిసుందరంగా ప్రయోగించిన అలంకారాలు, చక్కగా ఎంపిక చేసి తూచి తూచి చేసినట్టుండే పదప్రయోగం – ఇవన్నీ వాటంతట అవే పోటీలు పడి తోసుకుంటూ వచ్చి తిమ్మన కవితలో చోటు చేసుకున్నాయి

ముక్కు తిమ్మన తలనొప్పి :
---------------------------------------
'మాటలాడ గల్గు మర్మము లెరిగిన- పిన్న పెద్దతనము లెన్నవలదు - పిన్న చేతి దివ్వె పెద్దగా వెలుగదా' అంటాడు వేమన. చిన్నవాళ్లనీ, పెద్దవాళ్లననీ ఏమున్నది; పాండిత్యమే ప్రధానం. చిన్నవాడి చేతిలో ఉన్నా సరే, వెలిగే ప్రతి దీపమూ వెలుగునిస్తుంటుంది- కదూ?

అష్టదిగ్గజాలలో‌ ఒకడైన నంది తిమ్మన కవికి ఒకసారి విపరీతమైన తలనొప్పి పట్టుకున్నది.

రాయలవారు ఆయనను ఎంతో మంది వైద్యులకు చూపించారు; ఎన్నో మందులు వాడించారు. అయినా ఏమంత ప్రయోజనం లేదు. ఏ మందులు వాడినా కొద్దిపాటి ఉపశమనం; మళ్ళీ కొన్నాళ్ళకు రెట్టింపు తలనొప్పి!

'ఇలా కాదు- కాశీలో గొప్ప వైద్యులున్నారు. అక్కడికి వెళ్లి చూపించుకుంటాను' అని పరివారంతో సహా కాశీకి ప్రయాణం కట్టారు తిమ్మనగారు.

అలా వెళ్తూ వెళ్తూండగా మధ్యలో తలనొప్పి చాలా ఎక్కువైపోయింది. ఆ సరికి వాళ్ళు నెల్లూరు దగ్గర దర్శి మండలంలో ఉన్నారు. ఆ దగ్గర్లోనే 'బోదనం పాడు' అనే ఊరున్నది. వీళ్ళంతా ఆ ఊరి శివార్లలోనే డేరాలు వేసుకొని బస చేశారు.

తిమ్మన గారు తలనొప్పికి తట్టుకోలేక-పోతున్నారు. పెద్దగా అరుపులు, మూలుగులు. తిమ్మనతో పాటు వచ్చిన రాజవైద్యుడు ఏవేవో‌ మూలికలు నూరుతూనే ఉన్నాడింకా. ఆయన పరివారానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంతా గందరగోళ పడుతున్నారు.
సరిగ్గా ఆ సమయానికి అటుగా వచ్చారు, ఇద్దరు వైద్య సోదరులు. వాళ్ళిద్దరూ ఇంకా చిన్నవాళ్ళే. తండ్రి తాతలనుండి వచ్చిన వైద్యాన్ని కొనసాగించుకుంటూ బోదనం-పాడులో కాలం వెళ్ళబుచ్చుతున్నారు. వాళ్లకు వినిపించాయి ఈ అరుపులు.

వాళ్ళు ఆ డేరాల దగ్గరకు పోయి కాపలాగా వున్న సైనికులతో "అయ్యా! మేము ఈ ప్రాంతపు ఘన వైద్యులము. ఇక్కడ ఎవరో బాధతో మూలుగుతున్నారు. మేము లోపలి వెళ్లి చూస్తాము" అన్నారు.

ఒక కాపలావాడు వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి లోపలికి వెళ్లి దండనాయకుల వారితో "ఎవరో వైద్యులట, వచ్చారు- లోపలికి పంపమంటారా?" అని అడిగారు.

ఆ సరికే ఏం చేయాలో తెలీక తల పట్టుకొని కూర్చున్న దండనాయకుడు "సరే ప్రవేశ పెట్టు" అన్నాడు. ఇద్దరినీ లోపలి తీసుకొని వచ్చారు సైనికులు.

దండనాయకుడు వాళ్ళను కూర్చోబెట్టి "మీరెవరు? మీ పరిచయం?" అన్నాడు.

"అయ్యా! మేం యిద్దరం అన్నదమ్ములం. ఈ బోదనంపాడు గ్రామానికి చెందిన వాళ్ళం. మా పేర్లు పుల్లాపంతుల పుల్లన్న, సూరన్న. యిక్కడెవరో జబ్బు పడినట్టున్నారు- మూలుగులు బయటికి వినిపిస్తున్నాయి. మేం వారికి వైద్యం చేస్తాం" అన్నారు.

"ఆయన విజయనగర సామ్రాజ్యాధీశులు శ్రీ శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థాన అరణపు కవులు శ్రీ నంది తిమ్మనార్యుల వారు" చెప్పాడు దండనాయకుడు.

"ఏమీ! పారిజాతాపహరణ కర్త అయిన నంది తిమ్మనగారా?! ఏమైంది? వారికొచ్చిన జబ్బు ఏమిటి?!" అడిగారు వాళ్ళు. ముక్కు తిమ్మనగారు రచించిన 'పారిజాతాపహరణ కావ్యం' గురించి తెలీని పండితులే లేరు మరి, ఆ రోజుల్లో.

"లోపలికి రండి" అని పిలుచుకొని వెళ్ళాడు దండనాయకుడు.

తిమ్మనగారు అక్కడ పడక మీద పడుకొని దొర్లుతూ పెద్దగా అరుస్తున్నారు. పక్కన రాజవైద్యుడు కల్వంలో మందు నూరుతున్నాడు. లోపలికి వచ్చిన వాళ్ళని చూసి 'ఎవరు మీరు?' అని గద్దించాడు రాజ వైద్యుడు.

దండనాయకుడు వారి వివరాలు చెప్పగానే వైద్యుడు ముఖం చిట్లించాడు. "మహా మహా వైద్యులే ఏమీ చెయ్యలేక పోయారు. పిల్లలు- మీరేమి చేస్తారు? నాయనలారా, మీకు తెలుసో లేదో, వీరు నంది తిమ్మన గారు. వీరి తలనొప్పిని ఎలాగైనా తగ్గించాలని స్వయంగా రాయలవారే పూనుకొని, గొప్పగొప్ప వైద్యులకు చాలా మందికి చూపించి, 'ఇంక కుదరదు' అని ఆశ వదులుకున్నారు. ఈ మారుమూల గ్రామంలో చిన్న చిన్న వైద్యాలు చేస్తూ బ్రతుక్కునే మీ వల్ల తీరే సమస్య కాదు నాయనా ఇది!" అన్నాడు పెదవి విరుస్తూ.

"ఇలాంటి శిరోవేదనకు మంచి వైద్య ప్రక్రియ ఉంది మా దగ్గర- మాకు ఒక్క అవకాశం యిచ్చి చూడండి. మా అన్నగారు నాడీ పరీక్షలో ఘనులు" అన్నాడు సూరన్న, అన్నను ముందుకు నెడుతూ.

ఇంతలో "ఏమిటి, ఈ అల్లరి? నన్ను అసలు విశ్రాంతి తీసుకోనిచ్చేట్లు లేరే?!" అంటూ కోపంగా పాన్పు మీదినుండి దిగి వచ్చారు తిమ్మన గారు.

వైద్య సోదరులు ఇద్దరూ లేచి నిలబడి ఆయనకు నమస్కరించారు. "కవివర్యా! మేం ఈ గ్రామ వైద్యులం. మిమ్మల్ని దర్శించి మీ ఆరోగ్యం గురించి పరామర్శించి వెళ్ళడం మా ధర్మం కదా! అందుకే వచ్చాం" అన్నారు.

"సరే, కూర్చోండి" అని సైగ చేస్తూ చెప్పారు తిమ్మనగారు- "నాకు ఈ తలనొప్పి బాధ చాలా ఏళ్ళుగా వుంది. ఈ మధ్య మరీ ఎక్కువయింది. తలలో ఏదో తోలుస్తున్నట్టు బాధ. ఒక్కోసారి తలని గోడకు గ్రుద్ది బద్దలు కొట్టుకోవాలనిపిస్తుంది" అన్నారు తిమ్మన-గారు, తలను నొక్కుకుంటూ.

"తమరి సెలవైతే మేము ఓసారి మిమ్మల్ని పరీక్షిస్తాం. మాకున్న పరిజ్ఞానంతో, మా పూర్వీకుల ఆశీస్సులతో మీకు మంచి వైద్యం అందించగలమని మా నమ్మకం" అన్నాడు పుల్లన్న.

"ఏమి చేస్తారో?! నాకైతే ఈ వైద్యం మీద నమ్మకం పోయింది. రాయలవారు నాకోసం చెయ్యని ప్రయత్నం లేదు. ఎందుకు వచ్చిందో ఏమో గానీ నా ప్రాణాలు తోడేస్తోంది, ఈ మహమ్మారి. ఇట్లా బాధ పడుతూ ఉండటం కంటే 'చావే మేలు' అనిపించింది. అందుకే ఇట్లా కాశీ ప్రయాణం పెట్టుకున్నాను. అయితే భగవంతుడి కరుణ ఇలా ఉంది- మధ్యలోనే శిరోవేదన ఎక్కువై ఇలా యిక్కడ బస చెయ్యాల్సి వచ్చింది" అన్నాడు తిమ్మన.

"అయ్యా! అర్థమైంది. మీ బాధ నిజంగానే వర్ణనాతీతం. ఏనుగు కుంభస్థలంలోకి పాము ప్రవేశించినప్పుడు అది ఎంతగా విలవిలలాడి పోతుందో, ఎన్నెన్ని కొండల్ని ఢీకొంటుందో మీరు వర్ణించి ఉన్నారు గతంలో. మీ ఈ శిరోవేదన అంతకు వెయ్యి రెట్లు వుంటుంది. భరించడం ఎవరికైనా కష్టమే. ఒకసారి చెయ్యి యివ్వండి- నాడి పరీక్షిస్తాం" అంటూ తిమ్మనగారి చేతిని అందుకొని శ్రద్ధగా నాడిని పరీక్షించాడు సూరన్న.

అటుపైన "అవునవును. అర్థమైంది" అంటూ పుల్లన్నకు ఏదో వివరించాడు వైద్య పరిభాషలో. పుల్లన్న చిరునవ్వు నవ్వి, తిమ్మనగారి వైపు తిరిగి "అయ్యా! ఏమీ‌ పరవాలేదు. మీ సమస్య తీరిపోతుంది. మీకు ఇక్కడే శాంతి లభించనున్నది. భయంలేదు" అన్నాడు.

అతని నవ్వును చూడగానే తిమ్మన్నగారికి కోపం వచ్చేసింది. "విషయాన్ని మీరు యింత తేలికగా తీసుకోవడం విడ్డూరంగా ఉంది. ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ప్రయత్నించి, 'మా చేత కాద'ని చేతులెత్తారు. అల్లాంటిది మీరు విముక్తి కలిగించడమా? మీ వైద్యమూ వద్దు, మీ మందూ వద్దు, మీ పథ్యాలూ వద్దు! మీకో నమస్కారం! యిలాగే కాశీ దాకా వెళ్ళ నివ్వండి. తర్వాత ఆ కాశీనాథుడే చూసుకుంటాడు" అన్నారు మూలుగుతూ.

"అయ్యా మా మాట నమ్మండి. మావి వ్యర్థపు మాటలు కావు. ఈ రోగానికి మందులూ, మాకులూ, పథ్యాలు ఏమీ లేవు. దీనికి జరగాల్సిన వైద్య ప్రక్రియ వేరే ఉన్నది. ఒక్క రోజులోనే నయమైపోతుంది. ఓపిక పట్టాలి- అంతే" అన్నాడు పుల్లన్న ధీమాగా.

"ఔనౌను- ఓపిక పట్టాల్సిందే! మందూ-మాకూ-పథ్యమూ లేని వైద్యం కదా!! లోకంలో ఎక్కడా లేని వైద్యాన్ని చెప్తున్నారు" అంటూ శిరోభారంతో కూలబడి తల పట్టుకున్నారు తిమ్మన గారు.

"అయ్యా! మీ మూలుగు వినగానే మీ సమస్య ఏమిటో, అది ఎలా తగ్గుతుందో మాకు అర్థమై పోయింది. మీరు మాకు ఒక్క అవకాశం యిచ్చి చూడండి- తప్పులేదు కదా!" అన్నారు వైద్య సోదరులు బ్రతి మాలుతూ.

దాంతో తిమ్మన రాజ వైద్యుడి వైపు చూస్తూ "ఆర్యా! ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు? వీరికి ఒక అవకాశం యిచ్చి చూద్దామా?" అన్నాడు.

"కవి వర్యా! యిదంతా పనికిరాని వ్యవహారమే. ఎంతో మంది గొప్ప గొప్ప వైద్యులకు లొంగని జబ్బు ఈ మారు మూల పల్లెల్లో కప్పల్లాగా నివసించే వారికి సాధ్యం కాదు. మనం కాలాన్ని వ్యర్థం చేయకుండా త్వరగా కాశీనగరం చేరుకుంటే మంచిది" అన్నాడు రాజవైద్యుడు.

తిమ్మన కొంచెం సేపు ఆలోచించి, నిట్టూర్పు విడుస్తూ "నేను ఇప్పుడు మళ్ళీ వెంటనే ప్రయాణం ఆరంభించే స్థితిలో లేను. ఊరికే ఇక్కడ ఆగినా, వీరు చెప్పే ఉపచారం ఏదో అది చేసినా నావరకూ ఒకటే- వీరి మాటా విని చూద్దాంలెండి. తప్పులేదు" అన్నాడు.

"ఇదిగో అబ్బాయిలూ! మీ వైద్యానికి ఒప్పుకుంటున్నాం. అయితే ఒక షరతు. మీరు నయం చేయలేని పక్షంలో రాజ దండనకు గురికావల్సి వస్తుంది. తెలుసా?" గద్దించాడు రాజవైద్యుడు.

వాళ్ళు ఇద్దరూ జడుసుకోలేదు. "అయ్యా! ఇది మా వైద్యానికి పరీక్షా సమయం.. కానివ్వండి" అన్నారు.

"అబ్బో మంచి పట్టున్న వైద్యులే!" అంటూ ముక్కున వేలేసుకుని, నవ్వలేక, తలపట్టుకున్నారు తిమ్మనవారు.

ఆ రోజునుంచీ వరుసగా మూడు రోజుల పాటు వైద్య సోదరులు ఇద్దరూ తిమ్మన ముక్కులో చుక్కల పసరు పిండుతూ వచ్చారు. నాలుగోరోజు వైద్యానికి కావలిసిన పదార్థాలన్నీ ఒక జాబితాగా తయారు చేసి యిచ్చారు. చూస్తే అందులో విశేషంగా వైద్యానికి కావలిసిన వస్తువులేమీ లేవు: పుట్టెడు బియ్యం మాత్రం కావాలన్నారు.

"పుట్టెడు బియ్యమా? ఊరందరికీ సమారాధన చేస్తారా, ఏమి?!" అన్నాడు రాజవైద్యుడు వెటకారంగా.

"కాదు- అవసరం ఉంది తెప్పించండి. అలాగే ఇరవై మంది వంటవాళ్లు, నిర్మాణపు పని తెలిసిన పదిమంది కూలీలు కూడా కావాలి" అన్నారు వైద్య సోదరులు.

"ఉప్పు, పప్పు కూరగాయలు కూడా తెప్పించండి. వండి, ఊళ్ళో పోలేరమ్మ జాతర జరిపించండి- సరిపోతుంది" దెప్పి పొడిచాడు రాజవైద్యుడు.

"కాదు కాదు- మా వైద్యానికి ఇది చాలా అవసరం" అన్నాడు పుల్లన్న.

"ఏమి అవసరమో ఏమో! మా తిమ్మన గారితో ముక్కు పట్టించి మూడు చెరువుల నీళ్ళు త్రాగిస్తున్నారు. వారి యాత్ర యిక్కడే పూర్తి అవుతుందేమో!" అన్నాడు రాజవైద్యుడు.

"శివ శివా! మీకా సందేహం అక్కరలేదు. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతులై రాయలవారిని దర్శిస్తారు- తన కవిత్వం తో మెప్పిస్తారు" అన్నాడు సూరన్న ధైర్యంగా.

"ఎవరి గతి ఎలా వుందో ఆ విరూపాక్షుడికే ఎరుక" అంటూ దండనాయకుడికి పట్టీ యిచ్చి అన్నీ తెప్పించమన్నాడు రాజవైద్యుడు.

ఐదవనాటికల్లా గాలి కూడా చొరనంత దట్టంగా, బాగా ఎత్తుగా ఉన్న గుడిసె ఒకటి తయారైంది.

గుడిసె బయట వంటవాళ్ళు పుట్టెడు బియ్యాన్ని వండటం మొదలు పెట్టారు. ఊళ్ళో వాళ్లంతా వచ్చి నిలబడి 'ఏం జరుగుతున్నది' అని ఆశ్చర్యంగా చూస్తున్నారు.

వైద్యులిద్దరూ వచ్చి తిమ్మనను గుడిసెలోకి పిలుచుకొని వెళ్ళారు.

"మిమ్మల్ని ఈ గుడిసెలో తలక్రిందులుగా వేలాడదీయాల్సి వుంటుంది" అన్నారు.

తిమ్మనకు దిక్కు తోచలేదు. ఎలా పారిపోవాలో అర్థం కాలేదు. ఏమనేందుకూ‌ నోరురాక విలవిలలాడాడు.

"భయపడకండి- ఇది వైద్య ప్రక్రియలో భాగమే" అన్నారు వైద్య సోదరులు ఇద్దరూ ఏక కంఠంతో.
"సరే- ఒకసారి మీ వైద్యానికి ఒప్పుకున్నాక తప్పుతుందా, ఏదైతే అది అవుతుంది- కానివ్వండి" అన్నారు తిమ్మన. వెంటనే వైద్యులు ఆయన శరీరం అంతటా లావు పాటి కంబళ్ళు చుట్టారు. తల, ముక్కు మాత్రం బయటకు ఉండేలా ఒక దట్టమైన తొడుగు తగిలించారు. గుడిసెకు ఒక మూలగా ఆయన్ని తలక్రిందులుగా వేలాడ దీశారు.

మరుక్షణం అప్పుడే వండి వార్చిన అన్నపు హండాలు గుడిసెలోని తేబడ్డాయి. ఆ అన్నం అంతా గుడిసెలో కుమ్మరించబడింది. తలక్రిందులుగా వ్రేలాడుతున్న తిమ్మనగారి క్రిందంతా ఆవిర్లు క్రక్కుతున్న అన్నం నిండింది. గుడిసె మొత్తం‌ ఒక్కసారిగా ఆవిర్లు క్రమ్ముకున్నాయి.

తన శరీరానికి ఏమైందో అసలు అర్థం కాలేదు తిమ్మనకు. ఆయన ముక్కు పుటాల ద్వారా లోనికి ప్రవేశించిన వేడి వేడి అన్నపు ఆవిరి సెగలు ఒక్క పెట్టున ఆయన నషాళానికి అంటాయి.

రెండు క్షణాలు గడిచాయో లేదో- ఆయన ముక్కు పుటాల నుంచి విష క్రిములు రెండు- గిజ గిజ లాడుతూ వెలువడి, ఆ అన్నపు రాశి పై పడ్డాయి. అదే క్షణంలో తిమ్మన స్మృతి తప్పాడు!

వైద్యులిద్దరూ వెంటనే ఆయనను క్రిందికి దింపి, బయటకు తీసుకొని వచ్చి, శీతలోపచారాలు చేశారు. క్రమంగా ఆయనను తెలివిలోకి తెచ్చారు. తిమ్మన తలనొప్పి మాయమైంది! అయితే ఆయన పూర్తిగా కోలుకునేందుకు మరో రెండు వారాలు పట్టింది.
కవిగారి శిరోభారం తగ్గిందనీ, రోగం నయమైందనీ వెంటనే రాయలవారికి కబురు అందింది. పుల్లాపంతుల వైద్య సోదరుల ఖ్యాతి వెనువెంటనే విజయనగర సామ్రాజ్యపు నలుమూలలకూ పాకింది. వారిని దర్శించుకునేందుకు ప్రజలు తండోప-తండాలుగా రాసాగారు.
నాలుగైదు రోజుల్లో కృష్ణదేవరాయల వారే నేరుగా బోదనంపాడు విచ్చేసారు.

వైద్యులిద్దరూ రాయలవారిని ప్రస్తుతించారు:

శ్రీ వేంకటగిరి వల్లభ-
సేవా పరతంత్ర హృదయ! చిన్నమదేవీ
జీవితనాయక!కవితా
ప్రావీణ్య ఫణీశ కృష్ణరాయ మహీశా!
ప్రభూ మేము వైద్యులమేగానీ కవులం కాదు. అందుకే ముక్కు తిమ్మన గారి పద్యాన్నే ఒప్పజెప్పాం. అందుకు మమ్మల్ని మన్నించండి. మా పెద్దలు దయతో మాకు నేర్పించిన వైద్యాన్ని సేవాదృష్టితో మా బోదనంపాడులోనే పదిమందికీ అందిస్తూ వస్తున్నాం. నంది తిమ్మనగారంతటి వారికి వైద్యం చేసే మహద్భాగ్యం కలగడం కేవలం మా పుణ్య విశేషమే. వారి ఆశీస్సులు మాకు సదా వుండగలవని విశ్వసిస్తూ, తమరి అనుగ్రహంతో మా ఈ వైద్యవిద్య యిలాగే పది కాలాలపాటు శాశ్వత కీర్తి పొందగలదని భావిస్తున్నాము" అన్నారు పుల్లాపంతుల సోదరులు.

తిమ్మనగారు లేచి "ప్రభూ! శతాధిక వందనాలు.'కాశ్యాం తు మరణానురక్తి:- కాశీకి పోయేది కాటికి పోయేందుకే" అని నిశ్చయించుకొన్న నేను, వీరి చలువతో పునర్జన్మ ఎత్తాను. వీళ్ళు నా పాలిట నిజంగా అశ్వినీ దేవతలే. మొదట నేను వీరిని శంకించాను- అది నా అవివేకం. వీరి హస్తం ఒక సంజీవ కరణి. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు గనక వీరు అక్కడ ఉండి ఉంటే హనుమంతుడికి ఆ సంజీవనీ పర్వతాన్ని ఎత్తి తేవలిసిన పని ఉండేది కాదేమో. కుగ్రామంలో నిస్వార్థంగా వైద్యసేవలనందిస్తూ గ్రామంలో వారిని అందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచుతున్న వీరి సేవకి ఎంత యిచ్చినా తక్కువే.

వీరి ఋణం ఎలా తీర్చుకోగలం? ప్రభువులవారు వీరిని తమ ఆస్థాన వైద్యులుగా నియమిస్తే సాహిత్యం తో బాటు వైద్యశాస్త్రాన్ని కూడా పోషించినట్లుంటుంది అని నా అభిప్రాయం. ఆ తర్వాత తమరి చిత్తం' అన్నారు.

"కవీశ్వరుల సూచన ఆమోదదాయకం. మరి పుల్లాపంతుల సోదరులు అందుకు సమ్మతిస్తారో? వారి సమ్మతం మాకు సంతోషదాయకం" అన్నారు రాయలవారు. కరతాళ ధ్వనులు మిన్ను ముట్టాయి.

"ప్రభూ! మీ ఆజ్ఞ శిరోధార్యమే- కానీ మా వంశీకుల నియమానుసారం మేము స్వస్థలంలోనే వైద్యం చెయ్యాలి తప్ప, మరో చోటుకు పోగూడదు. ధన సంపాదనకూ, స్వలాభాపేక్షకూ లోనుకాకూడదు. మా గ్రామం వైద్యానికి పెట్టింది పేరుగా శాశ్వత కీర్తిని ఆర్జించాలని మా పెద్దల ఆశయం. ప్రభువులు దీన్ని వేరుగా తలచరాదని ప్రార్థన" అన్నారు ఆ సోదరులు.

"భేష్ ! మీ పూర్వీకుల ఆశయం ఉదాత్తంగా ఉంది. వైద్యుడి కోసం రోగి అన్వేషించడమే ధర్మం. అప్పుడే వైద్యానికి విలువ. మీ గ్రామాన్ని వైద్య కేంద్రంగా పరిగణిస్తూ బోదనంపాడును అగ్రహారంగా మీకు దానశాసనంతో వ్రాయించి ఇస్తున్నాం! అమూల్యమైన మీ సేవను ప్రశంసిస్తూ మేమిచ్చే ఈ చిన్న బహుమతిని స్వీకరించండి" అన్నారు రాయలవారు గంభీరంగా. సభలో మరోసారి హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.

సాలగ్రామం_అంటే_ఏమిటి.?


           సాలగ్రామం అనేది ఒక రకమైన రాయి. అయితే, ఇది ఓ పురుగువల్ల.. అంటే ఓ జలచరం వల్ల తయారౌతుంది అంటే అతిశయోక్తి కాదు. సాలాగ్రామాలు చాలా చాలా అరుదైనవి. ఇవి గండకీనదిలో దొరుకుతాయి. అలాగే ఖాట్మండు నగరానికి ఉత్తరాన గండకీనదిలో దొరుకుతాయి. ఈ గండకీనది తీరంలో ”ముక్తినాథం” పేరుతో సాలగ్రామం ఉంది. ఈ ప్రాంతాల్లో మాత్రమే సాలగ్రామాలు దొరుకుతాయి. మరెక్కడా ఇవి లభ్యం కావు.

సంస్కృతంలో ”శిలగా మారిన శలభమే సాలగ్రామం” అంటూ నిర్వచనం చెప్తారు. సాలగ్రామం ఎంత ఎక్కువ సంవత్సరాలు గడిస్తే అంత మహత్తరమైంది. అలాగే, ఎంత చిన్నది అయితే అంత గొప్పది. కాలం గడిచిన తర్వాత సాలగ్రామానికి ఔషధ గుణాలు వచ్చి చేరతాయి.

ఒక విధమైన పురుగు సాలగ్రామంగా రూపొందుతుంది. అయితే కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మాత్రమే అది రాయిలా గట్టిపడుతుంది. రసాయనికంగా చూస్తే సాలగ్రామం సిలికాన్ డయాక్సైడ్. దీనికి చెకుముకి రాయి లక్షణాలు ఉంటాయి. గట్టిపడకముందు సాలగ్రామంలో సున్నపు లక్షణం ఉంటుంది.

సాలగ్రామం విశిష్ట శిలారూపం. ఇవి వేల, లక్షల సంవత్సరాలు యథాతథంగా ఉంటాయని రుజువైంది. నీళ్ళలో ఉండే ఒక జీవి సుదీర్ఘకాలం తర్వాత సాలగ్రామంగా రూపాంతరం చెందుతుంది. అంటే ఇది జరాసిక్ టెతీన్ కాలానికి చెందినది.

సాలగ్రామాన్ని సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పూజిస్తారు. సాలగ్రామాన్ని పూజించేచోట విష్ణుభగవాణుడి అనుగ్రహముంటుంది. సాలగ్రామం సంపాదించి, దేవుడి మందిరంలో ఉంచుకుంటే ఎంతో మంచిది. దీన్ని నియమనిష్టలతో పూజించాలి. ఏ మంత్రాలూ రానివారు మనసునే అర్పించుకుంటూ ప్రార్ధించాలి. సాలగ్రామం ఒకవేళ పగిలిపోయినా, దాని విలువ తగ్గదు. సాలగ్రామాలను ప్రతిరోజూ తులసీదళాలతో పూజిస్తే ఐశ్వర్యవంతులవుతారు. విశేషంగా శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది. సాలగ్రామాన్ని అభిషేకించిన నీటిని సేవించడం శ్రేష్టం.

*శ్లో౹౹సాలగ్రామ శిలా వారీ
        పాపహారీ విశేషతః
       ఆ జన్మ కృతపాపానామ్
        ప్రాయశ్చిత్తం దినేదినే.

సాలా గ్రామం అభిషేకించిన జలాన్ని స్వీకరించుట వలన అనేకజన్మల పాపాలు నశిస్తాయి. ప్రతి రోజు స్వీకరించుట వలన రోజూ చేసే పాప పరిహారం ప్రాయశ్చిత్తము జరుగుతుంది.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...