Tuesday, November 20, 2018

శివుడు అభిషేక ప్రియుడు



శివో అభిషేక ప్రియ: (అంటే శివుడు అభిషేక ప్రియుడు). "శివుడు అభిషేక ప్రియుడు" కాసిని నీళ్ళు లింగంపై పోస్తే సంతోషించి సర్వైశ్వర్యాలను ప్రసాదిస్తాడు పరమ శివుడు !!

"నీలకంఠుని శిరసుపై నీళ్ళు చల్లి
పత్తిరిసుమంత యెవ్వడు పారవైచు
గామధేనువు వానింట గాడి పసర
మల్ల సురశాఖి వానింటి మల్లెచెట్టు"

తా:- శివ లింగం పై నీళ్ళతో అభిషేకం చేసి, పూలు పత్రి(మారేడు) దళాలను ఆయన శిరస్సుపై వుంచే వాని ఇంటిలో దేవతల గోవు 'కామధేనువు' కాడి పశువుగా పడి వుంటుందట, 'కల్పవృక్షం' అనే దేవతా వృక్షం ఇంటి ఆవరణలో మల్లెచెట్టు లాగా వుంటాయట !!శివార్చన అభిషేకం చేస్తే అన్ని అభీష్టములు నెరవేరతాయి !! సకలైశ్వర్యములు సమకూరతాయి !!

నిశ్చల భక్తితో ఉద్ధరిణెడు జలం అభిషేకించినా ఆయన సుప్రసన్నుడు అవుతాడు. మన అభీష్టాలు నెరవేరుస్తాడు. అందుకే ఆయన భోళా శంకరుడు. హిందువుల అర్చనా విధానంలో ఎంతో ప్రాధాన్యం కలిగిన అభిషేకానికి ఎన్నో ద్రవ్యాలు వాడుతూ ఉంటాం. అలా మనం వినియోగించే ఒక్కో ద్రవ్యానికీ ఒక్కో విశిష్టత, ఒక్కో ప్రత్యేక పరమార్థం ఉన్నాయి. అవి తెలుసుకోవడం వల్ల నిత్యారాధకులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మన పెద్దలు ఎంతో విలువైన ఈ సమాచారాన్ని ప్రాచీన గ్రంథాలలో నిక్షిప్తం చేశారు. ఆ సమాచారం ఇదిగో మీ కోసం...
అభిషేక ద్రవ్యాలు... ఫలితాలు
----------------------------------------
ఆవు పాలతో..... సర్వ సౌఖ్యాలు
ఆవు పెరుగు... ఆరోగ్యం, బలం
ఆవు నెయ్యి.... ఐశ్వర్యాభివృద్ధి
చెరకు రసం (పంచదార) .... దుఃఖ నాశనం, ఆకర్షణ
తేనె .. తేజో వృద్ధి
భస్మ జలం.. మహా పాప హరణం
సుగంధోదకం ... పుత్ర లాభం
పుష్పోదకం... భూలాభం
బిల్వ జలం ... భోగ భాగ్యాలు
నువ్వుల నూనె... అపమృత్యు హరణం
రుద్రాక్షోదకం ... మహా ఐశ్వర్యం
సువర్ణ జలం ... దరిద్ర నాశనం
అన్నాభిషేకం .. సుఖ జీవనం
ద్రాక్ష రసం .... సకల కార్యాభివృద్ధి
నారికేళ జలం ... సర్వ సంపద వృద్ధి
ఖర్జూర రసం .... శత్రు నాశనం
దూర్వోదకం (గరిక జలం)... ద్రవ్య ప్రాప్తి
ధవళొదకమ్ ... శివ సాన్నిధ్యం
గంగోదకం ... సర్వ సమృద్ధి, సంపదల ప్రాప్తి
కస్తూరీ జలం .. చక్రవర్తిత్వం
నేరేడు పండ్ల రసం .. వైరాగ్య ప్రాప్తి
నవరత్న జలం... ధాన్య గృహ ప్రాప్తి
మామిడి పండు రసం... దీర్ఘ వ్యాధి నాశనం
పసుపు, కుంకుమ... మంగళ ప్రదం
వీబూది .... కోటి రెట్ల ఫలితం

విష్ణువు అలంకారప్రియుడైనట్లే శివుడు అభిషేక ప్రియుడయ్యాడు. శివుడు అభిషేకాన్ని చాలా ప్రియంగా భావిస్తాడు. కాబట్టి అభిషేకప్రియుడనబడుతున్నాడు. ఎడతెగని జలధారతో శివలింగాన్ని అభిషేకిస్తారు. శివుడు గంగాధరుడు.ఆయన శిరస్సు పై గంగ వుంటుంది. అందువల్ల శివార్చనలో అభిషేకం ముఖ్యమైనది. గంగ జలరూపమైనది. జలం పంచభూతాలలోను, శివుని అష్టమూర్తులలోను ఒకటి. " అప ఏవ ససర్జాదౌ " అన్న ప్రమాణాన్ని బట్టి బ్రహ్మ మొదట జలాగ్నే సృష్టించాడు. ప్రాణులన్నింటికీ ప్రాణాధారం నీరే.

మంత్రంపుష్పంలోని " యోపా మాయతనంవేద " ఇత్యాది మంత్రాలలో నీటి ప్రాముఖ్యం విశదీకరించబడివున్నది. అందుచేత శివపూజలలో జలాభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఏర్పడింది. భగవంతున్ని 16 ఉపచారాలతో పూజిస్తారు. అందులో ఇతర ఉపచారాలకంటే జలాభిషేక రూపమైన స్నానమనే ఉపచారమే ప్రధానమైనది.

"ప్రజపాన్ శతరుద్రీయం అభిషేకం సమాచరేత్" అన్న ప్రమాణాన్ని అనుసరించి శతరుద్రీయం పటిస్తూ అభిషేకం చేయాలి." పూజాయా అభికోహోమో హోమాత్తర్పణ ముత్తమం తర్పణాచ్చ జపః శ్రేష్టో హ్యభిహేకః పరో జపాత్ " పూజకంటే హోమము, హోమము కంటే తర్పణము, తర్పణం కంటే జపమూ, జపం కంటే అభిషేకము ఉత్తరోత్తరం, శ్రేష్టాలని పేర్కొనబడ్డాయి అని పెద్దలు చెపుతారు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

కార్తీక చలిమిళ్ల నోము



స్త్రీలు సంపద ... సంతానం ... సౌభాగ్యానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. ఈ మూడింటిని ప్రసాదించే నోముగా 'కార్తీక చలిమిళ్ల నోము' చెప్పబడుతోంది. కార్తీకమాసమంతా ఉదయాన్నే స్నానం చేసి, ఈ నోముకు ఆధారమైన కథ చెప్పుకుని తలపై అక్షింతలు ధరించాలి. మొదటి సంవత్సరం కార్తిక పౌర్ణమి రోజున 'అయిదు మానికల బియ్యం చలిమిడి'ని అయిదుగురు ముత్తయిదువులకు నదీ తీరంలో వాయనమివ్వాలి. రెండవ సంవత్సరం కార్తీక పౌర్ణమికి 'పది మానికల బియ్యం చలిమిడి'ని ఉసిరి చెట్టుకింద పదిమంది ముత్తయిదువులకు వాయనమివ్వాలి.

ఇక మూడవ సంవత్సరం కార్తీక మాసం చివరి రోజున ఉదయాన్నే దేవాలయానికి వెళ్లి 'గౌరీ పూజ'చేయాలి. ఆ తరువాత 'పదిహేను మానికల బియ్యం చలిమిడి'ని పదిహేను మంది ముత్తయిదువులకు వాయనమివ్వాలి. ప్రతి ఏడాది కార్తీక మాసం నెలంతా కథ చదువుకుని అక్షింతలు తలపై వేసుకున్న తరువాతే ఇలా చేయాలి. ఇక ఈ నోముకు సంబంధించిన కథ గురించి తెలుసుకుందాం.

పూర్వం ఒక రాజు గారికి ... మంత్రి గారికి ఒకే ఈడు ఆడ పిల్లలు వుండేవారు. వాళ్లిద్దరూ కూడా మూడేళ్లపాటు 'కార్తీక చలిమిళ్ల నోము'నోచారు. అయితే మంత్రిగారి కూతురికి ప్రతి ఏడాది మంచి ఫలితాలు కనిపిస్తూ వచ్చాయి. ఆమెకి చక్కని సంతానం ... సౌభాగ్యం ... సంపదలు ప్రాప్తించాయి. ఇక రాజుగారి కూతురు విషయంలో ఇందుకు పూర్తి భిన్నంగా జరిగింది. దాంతో ఆమె తీవ్రమైన అసహనానికి ... అసంతృప్తికి లోనైంది.

నోము విషయంలో కూడా తాను రాజు కూతురిననే అహంకారాన్ని చూపడం వల్లనే ఆమెకి అలాంటి ఫలితాలు వచ్చాయని పార్వతీ దేవి గ్రహించింది. ఆ రాత్రే అమ్మవారు రాజుగారి కూతురు కలలో కనిపించి ఆ విషయాన్ని చెప్పింది. ఆ వెంటనే ఆమె తన పద్ధతిని మార్చుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ నోమునోచి ఆశించిన ఫలితాలను అందుకుంది.

ఈ నోమును నోచుకొనేవారు అయిదు మానికల (పది కిలోల) బియ్యంతో చలిమిడి చేసి మొదటి సంవత్సరం అయిదుగురు ముత్తయిదువలకు, ఆపై సంవత్సరం పదిమందికి, తరవాతి సంవత్సరం పదిహేను మందికి వాయనాలనిస్తారు. ఇదే ఈ నోముకు ఉద్యాపన.

క్షీరాబ్ది ద్వాదశి

 చిలుకు ద్వాదశి - పావన ద్వాదశి - యోగీశ్వర ద్వాదశి

        మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీక మాసం. అందులోనూ అతి విశిష్టమైన తిధి క్షీరాబ్ది ద్వాదశి. 

కార్తీకమాసంలో వచ్చే శుద్ధ ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. క్షీరసాగరాన్ని మధించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. 

పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అనీ, యోగులు, మునులు తమ ఉపవాస దీక్షను విరమించే పవిత్ర తిధి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ క్షీరాబ్ది ద్వాదశి భారతావనిలో ప్రాచుర్యం పొందింది. 
ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు పవళించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు నిద్ర మేల్కొంటాడు. 

దాని తర్వాత వచ్చేక్షీరాబ్ది ద్వాదశి ఎంతో పుణ్యదినంగా సమస్త హైందవ జాతి భావిస్తుంది. 

ఈ రోజున పుణ్యనదిలో స్నానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈ రోజు అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో, కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణప్రోక్తంగా చెప్పబడింది. 

క్షీరాబ్ధి ద్వాదశి శ్రీ మహావిష్ణువు తేజోభరితంగా అమృతకలశాహస్తయై సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని పరిణయమాడిన శుభతిధి.

 ఈ కారణం చేతనేక్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తయిదువలు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి, శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసీదేవిని శ్రీలక్ష్మీదేవిగానూ, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను తలచడం వల్ల తులసి చెట్టుకు, ఉసిరి కొమ్మకను కలిపి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని సభక్తికంగా పూజించి, వారిద్దరికీ వివాహం జరిపించినట్లుగా భావించి పునీతుల వుతారు.
      
  క్షీరాబ్ది ద్వాదశి పరమ పవిత్రమైన తిధియై భూలోకంలో జనులను పునీతులను చేస్తోంది. కార్తీక మాసంలో శని త్రయోదశి సోమవారం కంటే ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది.

 ఆ శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి వందరెట్లు ఫలితాన్ని సమకూరుస్తుంది. ఆ కార్తీక పౌర్ణమి కంటే బహుళ ఏకాదశి కోటి రెట్లు అధిక ఫలాన్నిస్తుందనేది ఆర్యోక్తి. బహుళ ఏకాదశి కంటే క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన ఫలాన్ని, పుణ్యాన్ని ఇస్తుందనేది భాగవత వచనం. మాసాలలో అగ్రగణ్యమైన కార్తీక మాసం అతులిత మహిమల వారాశి! కార్తీక మాసాన వచ్చే పవిత్ర తిధులలో అగణిత పుణ్యరాశి క్షీరాబ్ది ద్వాదశి!

శ్రీమహా విష్ణువు తులసి వుండే బృందావనములోకి ఈరోజే ప్రవేశించారుట. అందువలన, ఈ రోజు తులసి మొక్క దగ్గర మహావిష్ణు ప్రతి లేదా ఉసిరి మొక్కను ఉంచి తులసి కళ్యాణం జరిపిస్తారు.

నమస్తులసి కళ్యాణి, నమో విష్ణుప్రియే శుభే !
నమో మోక్షప్రదే దేవి, నమ సంపత్ప్రదాయికే !!

యన్మూలే సర్వ తీర్ధాని- యన్మధ్యే సర్వ దేవతాః !
యదగ్రే సర్వ వేదాశ్చ – తులసీం త్వాం నమామ్యహం !!

ఈరోజే బృందా దేవి శాపము వల్ల లోకానికి మహోపకారం జరిగింది. మహా విష్ణువు ” సాలగ్రామం”(నారాయణ పర్వతం) గా మారి లోక కళ్యాణం జరిగింది.

కార్తీకమాసం ద్వాదశి రోజున తులసి సన్నిధిలో దీపప్రజ్వలనం చేసి,
    
 నమస్తే తులసి హరి సర్వజ్ఞే పురుషోత్తమ వల్లభే పాహిమాం సర్వపాపేభ్యస్సద్వ సంపత్ప్రదాయినీ”అంటూ ధ్యానం చేస్తూ, శ్రద్ధతో తులసిదేవిని పూజించాలి.

“ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరీ విద్యాం, పుత్ర పౌత్రాం, ఆయురారోగ్యం, సర్వసంపదాం మమదేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే -ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యంవిష్ణు భక్తించ శాశ్వతీమ్‌ నీరోగం కురుమాం నిత్యం నిష్పాపంకురుసర్వదా” 

అనే స్త్రోత్రం చేస్తూ ఉసిరి (ధాత్రీ) చెట్టు క్రింద శ్రీమహావిష్ణువును పూజించి దీపారాధన చేసి, ఉసిరికాయలు నివేదన చేసి, పదకొండు ప్రదక్షిణులు చేస్తే, అఖండమైన అష్టైశ్వర్యప్రాప్తి.

ఈ పర్వదినాన, తులసి మొక్క వద్ద ఒక్క దీపం వెలిగించినా చాలు అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి అని అంటారు.

కావున అందరు ఈరోజు   నారాయణ హి త తులసి మాత కు తప్పక దీపారాధన చేసి అనంతమైన పుణ్యాన్ని పొందండి….
           ఓం నమో నారాయణాయ నమః
                         గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...