Sunday, February 17, 2019

థైరాయిడ్‌ మందగిస్తే..



కొద్దిపాటి పనికే అలసిపోవటం.. ఏకాగ్రత సరిగా కుదరకపోవటం.. చురుకుదనం తగ్గటం.. బరువు పెరగటం.. వయసు మీద పడుతున్నకొద్దీ ఇలాంటివి సహజమేనని చాలామంది భావిస్తుంటారు. కానీ థైరాయిడ్‌ గ్రంథి పనితీరు మందగించటమూ (హైపోథైరాయిడిజమ్‌) ఇలాంటి సమస్యలకు దారితీస్తుంది!మన మెడ ముందుభాగానికి కరచుకొని ఉంటుంది థైరాయిడ్‌ గ్రంథి. ఇది ‘జీవక్రియల’ను (మెటబాలిజమ్‌) నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల థైరాయిడ్‌ గ్రంథి సరిగా పనిచేయకపోతే రకరకాల సమస్యలు బయలుదేరతాయి. ఈ సమస్య పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువ. ముఖ్యంగా వయసు పెరుగుతున్నకొద్దీ ఇవి ఆరంభమవుతుంటాయి. వీటిపై అవగాహన కలిగుండటం అవసరం.

నిస్సత్తువ: ఇంతకుముందు తేలికగా చేసిన పనులే అయినా త్వరగా అలసట ముంచుకొస్తుంది. ఒంట్లో శక్తంతా హరించుకుపోయినట్టు అనిపిస్తుంటుంది.

చలి తట్టుకోలేకపోవటం: వాతావరణం కొద్దిగా చల్లగా ఉన్నా తట్టుకోలేకపోవటం మరో లక్షణం. చుట్టుపక్కల వాళ్లు మామూలుగానే ఉన్నా చలి చలిగా అనిపిస్తుంటుంది.

ఆకలి తగ్గటం, బరువు పెరగటం: జీవక్రియల వేగం తగ్గినపుడు కేలరీల అవసరమూ తగ్గుతుంది. దీంతో ఆకలి కూడా మందగిస్తుంది. మరోవైపు కేలరీల వినియోగం తగ్గటం వల్ల ఖర్చు కాకుండా మిగిలిన కేలరీలు కొవ్వు రూపంలో స్థిరపడతాయి. ఇది బరువు పెరగటానికి దారితీస్తుంది.

అధిక రక్తపోటు: థైరాయిడ్‌ హార్మోన్‌ స్థాయులు పడిపోతే అధిక రక్తపోటుకు దారితీయొచ్చు. కొలెస్ట్రాల్‌ స్థాయులూ పెరుగుతాయి. కొంతకాలానికి గుండె రక్తాన్ని పంప్‌ చేసే సామర్థ్యమూ తగ్గొచ్చు.

ఏకాగ్రత లోపించటం: జ్ఞాపకశక్తి సమస్యలు, ఏకాగ్రత లోపించటం వంటివీ మొదలవ్వచ్చు. ముఖ్యంగా ఇంతకుముందు ఇష్టమైన వ్యాపకాలు, అభిరుచుల వంటి వాటిపై ఆసక్తి సన్నగిల్లితే నిర్లక్ష్యం తగదు.

మలబద్ధకం: థైరాయిడ్‌ హార్మోన్ల స్థాయులు తగ్గితే మలబద్ధకం, కండరాల నొప్పులు, కీళ్ల నొప్పులు, చర్మం పొడిబారటం, గోళ్లు పలుచగా అవటం.. ఇలా రకరకాల సమస్యలూ బయలుదేరతాయి.

గర్భధారణకు ఏది మంచి వయసు?



కొందరు ఎలాంటి ప్రణాళికలూ లేకుండా పెళ్లయిన వెంటనే పిల్లలను కంటుంటే.. మరికొందరు ఉద్యోగంలో కుదురుకున్నాక, జీవితంలో స్థిరపడ్డాక కంటామంటూ ఏళ్లకేళ్లు వాయిదా వేసుకుంటున్నారు. కొందరైతే 35 ఏళ్లు దాటాక గానీ సంతానం గురించి ఆలోచించటం లేదు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. మహిళలు రజస్వల అయిన దగ్గర్నుంచీ ప్రతి నెలా అండాశయంలోని అండాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. 37 ఏళ్లు వచ్చేసరికి అండాల సంఖ్య బాగా పడిపోతుంది. ఇక మగవారిలోనూ వయసు మీద పడుతున్నకొద్దీ వీర్యం నాణ్యత తగ్గుతూ వస్తుంది. మగవారు 40 ఏళ్ల తర్వాత సంతానం కోసం ప్రయత్నిస్తే పుట్టబోయే పిల్లల్లో ఆటిజమ్‌ తలెత్తే అవకాశమున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి సంతానం కనటాన్ని మరీ త్వరగా లేదా మరీ ఆలస్యం కాకుండా చూసుకోవాలి. మహిళలు 21-29 ఏళ్ల మధ్య గర్భం ధరించేలా చూసుకోవటం మంచిది

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...