Thursday, May 31, 2018

సూర్య నమస్కారాలు

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి.

ఆసనానికో ప్రయోజనం :-

సూర్య నమస్కారం అనే పేరు ఒక్కటే అయినా... అందులో 12 రకాల ఆసనాలు ఉంటాయి. ఈ పన్నెండు చేస్తే ఒక వృత్తం పూర్తయినట్లు! వీటిలో ఒకటి నుంచి ఐదు... ఎనిమిది నుంచి పన్నెండు ఆసనాలు ఒకేలా ఉంటాయి. కుడి, ఎడమల తేడా మాత్రమే ఉంటుంది. ఏ ఆసనంతో ఎలాంటి లబ్ధి చేకూరుతుందో చూద్దాం...

ఒకటి, పన్నెండు :- శరీర సమతుల్యత సాధించవచ్చు. శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. వెన్నెముక, మెడ, భుజాల దగ్గర ఉన్న కండరాలు బలోపేతం అవుతాయి.

రెండు, పదకొండు :- జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వెన్నెముక, పిరుదులు బలోపేతమవుతాయి.

మూడు, పది :- రక్త ప్రసరణ పెంచుతాయి. కాలి కండరాలను బలోపేతం చేస్తాయి. గ్రంధులపై కూడా ప్రభావం చూపుతాయి.

నాలుగు, తొమ్మిది :- వెన్నెముక, చేతి మణికట్టు కండరాలను బలోపేతం చేస్తాయి.
ఐదు, ఎనిమిది: గుండెను బలోపేతం చేస్తాయి. మెడ, భుజాల దగ్గర ఉండే ఒత్తిడిని తగ్గిస్తాయి.

ఆరో ఆసనం :- మెడ, భుజాలలో ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఏడో ఆసనం :- జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వెన్నెముక బలంగా మారడానికి ఉపకరిస్తుంది.

మరెన్నో లాభాలు :-

సూర్య నమస్కారాలతో ఎముకలు, కండరాలు బలోపేతమై ఆరోగ్యంగా ఉండటమే కాదు... మధుమేహం, బీపీ, గుండె జబ్బుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. "సూర్య నమస్కారాలలో 12 రకాల భంగిమలు ఉంటాయి. వీటిలో కొన్నింటిని నెమ్మదిగా చేయాలి. మరి కొన్నింటిని వేగంగా చేయాలి. వేగంగా చేసే భంగిమల్లో కండరాలకు మేలు జరుగుతుంది. ఏరోబిక్స్‌తో సమానమైన ఫలితాలు సాధించవచ్చు. నెమ్మదిగా చేసే సూర్య నమస్కారాలు శ్వాస నియంత్రణకు ఉపయోగపడతాయి.
ఎక్కువ గాలిని పీల్చి, వదలడం ద్వారా ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది'' అని ఆనంద బాలయోగి వివరించారు. అధిక బరువు తగ్గడం, జీర్ణ ప్రక్రియ మెరుగవడంతోపాటు... సూర్య నమస్కారాలతో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. సూర్య నమస్కారాలు శరీర భాగాలపైనే కాకుండా గ్రంధులపైనా పని చేస్తాయి. థైరాయిడ్, పార్థరాయిడ్, పిట్యూటరీ వంటి గ్రంధులు సాధారణ స్థాయిలో పని చేయడానికి ఇవి ఎంతో ఉపకరిస్తాయి.

1.నమస్కారాసనం ( ఓం మిత్రాయ నమ ):-
సూర్యునికి ఎదురుగా నమస్కారం చేస్తున్నట్లు నిలబడి సూర్యుని నామాన్ని ఉచ్ఛరించాలి.

2.హస్త ఉత్తానాసనం ( ఓం రవయే నమః) :-
కొద్దిగా శ్వాస పీల్చి రెండు చేతులను పైకెత్తి, తలను, నడుమును వెనుకకు వంచాలి. కాళ్ళు వంచకూడదు.

3.పాదహస్తాసనం ( ఓం సూర్యాయ నమః) :-
శ్వాస వదలి రెండు చేతులను కాళ్ళకు దగ్గరగా భూమిమీద ఆనించి, తలను మోకాలుకు ఆనించాలి.

4.ఆంజనేయాసనం ( ఓం భానవే నమ ) :-
ఎడమ మోకాలును వంచి పాదాన్ని నేలపై ఉంచి, కుడి పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను పైకి చాపి, నడుము పైభాగాన్నంతా వెనుకకు వంచాలి. ఈ స్థితిలో శ్వాసను పీల్చి లోపలే ఆపాలి.

5.పర్వతాసనం ( ఓం ఖగాయ నమః) :-
కాళ్ళు, చేతులు నేలమీద ఆనించి నడుము పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

6.సాష్టాంగ నమస్కారం ( ఓం పూష్ణే నమః) :-
ఎనిమిది అంగాలు నేలకు ఆనటం వలన దీనికి 'అష్టాంగ నమస్కారం' అని కూడా అంటారు. రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, రెండు చేతులు, రొమ్ము మరియు గడ్డం - ఈ ఎనిమిది అంగాలు నేలమీద ఉంచి నడుమును కొద్దిగా పైకి లేపాలి. శ్వాసను పూర్తిగా బయటకు వదలి ఆపాలి.

7.సర్పాసనం ( ఓం హిరణ్యగర్భాయ నమః ) :-
శ్వాసను పీల్చి తలను వెనుకకు వంచాలి.

8.పర్వతాసనం ( ఓం మరీచయే నమః) :-
ఐదవ స్థితివలెనే కాళ్ళు చేతులు నేలమీద ఆనించి నడుమును పైకి ఎత్తి శ్వాస వదలి తిరిగి పీల్చాలి.

9.ఆంజనేయాసనం ( ఓం ఆదిత్యాయ నమః) :-
నాలుగవ స్థితివలెనే కుడి పదాన్ని నేలపై ఉంచి, మోకాలును మడచి, ఎడమ పాదాన్ని వెనుకగా వేళ్ళపై ఆనించి, రెండు చేతులను, తలను, నడుమును వెనుకకు వంచాలి

10.పాదహస్తాసనం ( ఓం సవిత్రే నమః) :-
మూడవ స్థితివలెనే రెండు చేతులను కాళ్ళ దగ్గరగా నేలపై ఆనించి తలను మోకాలుకు ఆనించాలి. శ్వాసను బయటకు వదలి ఆపాలి.

11.హస్త ఉత్తానాసనం ( ఓం అర్కాయ నమః) :-
రెండవ స్థితివలెనే రెండు చేతులను పైకెత్తి, తలతోపాటు రెండు చేతులను వెనుకకు వంచాలి.

12.నమస్కారాసనం ( ఓం భాస్కరాయ నమః) :-
నిటారుగా నిలబడి నమస్కారం చేయాలి. మి నవీన్ నడిమింటి

పంచసరోవరాలు దేవాలయాలు

మన సంసృతి సంప్రదాయాలలో తీర్థయాత్రలకు చాలా ప్రాముఖ్యత వుంది. ప్రస్తుతం తీర్థం అంటే ఓ క్షేత్రమనే అర్థాన్నే అన్వయించుకుంటున్నాము. అయితే వేదకాలంలో తీర్థమనే పదానికి సరస్సు అర్థం కూడ ఉండేది. అలా తీర్థాలకు చేసే యాత్రలనే తీర్థయాత్రలని పిలుచుకుంటున్నాం. దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు 'పంచ సరోవరాలు' గా ప్రసిద్ధికెక్కాయి. అవి:

1. మానస సరోవరం,
2. పంపా సరోవరం,
3. పుష్కర్‌ సరోవరం,
4. నారాయణ సరోవరం,
5. బిందు సరోవరం,

1. మానస_సరోవరం
సమస్త లోకాలలో మానస సరోవరం వంటి పవిత్ర సరోవరం మరొకటి లేదన్నది వాస్తవం. ఈ సరోవరం బ్రహ్మదేవుని మనస్సు నుంచి ఉద్భవించింది. అందుకే దీనిని గతంలో 'బ్రహ్మసరం' అని పిలిచేవారు. ఇది ఎన్నో పవిత్రనదులకు పుట్టినిల్లు. ఈ సరోవరం చెంతనే గంగను దివి నుంచి భువికి తెప్పించడానికి భగీరథుడు తీవ్రమైన తపస్సు చేశాడు. మన పురాణాలలో మానస సరోవర ప్రస్తావన అక్కడక్కడా కనిపిస్తూంటుంది. ఈ సరోవరాన్ని బ్రహ్మదేవుడు ఆదిదంపతుల కోసం సృష్టించాడని పురాణ కథనం.
ఒకసారి బ్రహ్మమానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు పన్నెండుమంది పరమశివుని ప్రశన్నం చేసుకోవడానికి ఘోరమైన తపస్సు చేశారు. వారి తపస్సు సుమారు పన్నెండు సంవత్సరాల పాటు సాగింది. అదే సమయంలో ఆ పెన్నెండేళ్ళపాటు ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో తీవ్రమైన దుర్బిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. దగ్గరదాపుల్లోని జలవనరులన్నీ ఎండి పోవడంతో మునులందరూ నిత్యం స్నానాదికాల కోసం మందాకినీ నదిదాకా వెళ్లాల్సి వచ్చేది. పన్నెండు సంవత్సరాలు ముగుస్తున్న సమయంలో బ్రహ్మమానస పుత్రులకు ఆది దంపతుల సాక్షాత్కారం లభించింది. అప్పుడు ఆది దంపతులను పూజించడానికి ఆ దరిదాపుల్లో నీరు లేకపోవడంతో, మునులందరూ తమ తండ్రియైన బ్రహ్మదేవుని నీటికోసం ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన సంకల్పంతో ఒకసరస్సు సృష్టించాడు. హంసరూపంలో తానే స్వయంగా సరస్సులో ప్రవేశించాడు. అలా ఆ సరస్సు ఏర్పడుతున్నప్పుడే అందులోంచి ఒక బ్రహ్మాండమైన శివలింగం ఉద్భవించిందట. అలాగే మనం పూజలు చేస్తూ సంకల్పం చెప్పుకుంటున్నప్పుడు, 'జంబు ద్వీపే, భరతవర్షే, భరతఖండే, అని సంక్పలం చెబుతూంటాం. ఈ జంబూ ద్వీపం అఖండ భారతావనిని సూచిస్తుంటుందని చెబుతున్నారు.
ఈ పేరు రావడానికి వెనుక కూడ ఓ కథ వుంది. పూర్వం ఈ సరోవరం మధ్యలో ఓ చెట్టు ఉండేదట. ఆ చెట్టులో ముగ్గిన పండ్లు నీటిలో పడుతున్నప్పుడు 'జం' అనే శబ్దం వస్తుండేదట. అందుకే ఈ సరోవరం చుట్టు ప్రక్కల ప్రాంతాలను జంబూలింగప్రదేశమని పిలువసాగారట. అలా మన ప్రాంతానికి జంబూద్వీపమనే పేరు ఏర్పడిందట. కాబట్టి, జంబూద్వీపమనే పేరు రావడానికి కూడా కారణం మానస సరోవరమేనని తెలుస్తోంది. మానస సరోవరం గురించి భారతావనిలో పుట్టిన ప్రతి మతం ఓ కథను చెబుతూవుండడం విశేషం. ఉదాహరణకు జైనమతం కథనం ప్రకారం, ఇక్కడ జైనుల ప్రథమ తీర్థంకరుడైన ఆదినాథ ఋషభదేవుడు ఈ సరోవర పరిసరాలలో నిర్వాణం చెందాడని చెప్పబడుతోంది. ఇక, బౌద్ధ గ్రంథాలు మానస సరోవరాన్ని అనోత్తత అని పేర్కొంటున్నాయి. ఈ పదానికి వేడి, బాధ లేని సరస్సు అని అర్థం. ఈ సరస్సు మధ్యలో ఉన్న చెట్టున పూచే పువ్వులూ, కాయలు చాలారకాల వ్యాధులను నయంచేస్తాయని బౌద్ధుల నమ్మకం. అలాగే మానస సరోవరంలో చాలా పెద్ద తామరపువ్వులు పూస్తాయనీ, బుద్ధుడు, బోధిసత్త్వలు ఆ పువ్వులపై కూర్చునేవారని కథనం. బుద్ధుని జన్మవృత్తాంత కథలో కూడ ఈ సరస్సు ప్రస్తావన కనిపిస్తుంది.
మరో కథనం ప్రకారం, మానస సరోవరం చుట్టూ ఏడు వరుసల్లొ చెట్లు, దాని మధ్యలో ఓ పెద్దభవనం ఉండేదట. సరోవర మధ్యలో కల్పవృక్షం ఉండేదట. నాగులు ఆ చెట్టుకు కాసే కాయలను తింటుండేవారట. నాగులు తినకుండా వదిలేసిన కాయలు, సరస్సు అడుగుభాగానికి చేరుకుని బంగారంగా మారాయని చెబుతూంటారు.
ఈ మానస సరోవరం శక్తిపీఠాలలో ఒకటని కూడ చెప్పబడుతోంది. 51శక్తి పీఠాలలో మానస సరోవరం కూడా ఒకటి. దక్షయజ్ఞం సమయంలో తండ్రి చేసిన అవమానాన్ని భరించలేకపోయిన సతీదేవి ప్రాణత్యాగం చేస్తుంది. ఆ ఉదంతాన్ని విన్న పరమశివుడు అగ్రహోదగ్రుడై శివగణాలను పంపి, దక్షయజ్ఞ వాటికను ధ్వంసం చేస్తాడు. సతీదేవి వియోగాన్ని భరించలేకపోయిన ఆ స్వామి, అ తల్లి కళేబరాన్నిభుజంపై ఉంచుకుని ఆవేశంతో తిరగసాగాడు. ఫలితంగా లోకాలన్నీ కల్లోలంలో కూరుకుపోయాయి. అప్పుడు దేవతలంతా విష్ణుమూర్తితో మొరపెట్టుకోగా, విష్ణుదేవుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి సతీదేవి కళేబరాన్ని ముక్కలుముక్కలుగా చేస్తాడు. అప్పుడు ముక్కలైన సతీదేవి శరీరభాగాలు ఒక్కొక్కచోట పడతాయి. అలా సతీదేవి శరీరభాగాలు పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ప్రసిద్ధిచెందాయి. ఇక్కడ సతీదేవి కుడిహస్తం పడిందని పురాణ గ్రంథాలు పేర్కొంటున్నాయి.
మానస సరోవరాన్ని తాకినా, స్నానమాచరించినా బ్రహ్మలోకం చేరుకుంటారనీ, ఆ సరోవర జలాన్ని తాగిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణ వచనం. మానస సరోవర పరిక్రమ మరో గొప్ప సాధన. మానస సరోవరంలో స్నానమాచరించి, పితృదేవతలకు తర్పణాలు వదలడం, సరోవరతీరంలో హోమం చేయడం వల్ల పితృదేవతలకు ఉత్తమగతులు సంప్రాప్తిస్తాయి. ఈ సరస్సులోని నీటికి అద్భుత చికిత్సా గుణాలున్నాయని పెద్దలు చెబుతారు. అదేవిధంగా మానస సరోవరం దగ్గర దొరికే కొన్ని రాళ్ళు 'ఓం' ఆకారంలో ఉంటుండటం విశేషం.
ఇంతటి మహిమాన్వితమైన మానస సరోవరం సముద్ర మట్టానికి సుమారు 14, 900 అడుగుల ఎత్తులో ఉంది. ఈ సరోవరం చుట్టుకొలత దాదాపు 54 మైళ్ళు అని అంటారు. 200 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో పరుచుకుని ఉన్న ఈ సరోవరం సుమారు 300 అడుగుల లోతు ఉంటుంది.
చాలామంది మానస సరోవర పరిక్రమను చేయడానికి ఉత్సుకతను చూపిస్తుంటారు. మానస సరోవర తీరంలోని ఎనిమిది బౌద్ధ మఠాలు మీదుగా పరిక్రమనం చేయాలంటే, దాదాపు 110 కి.మీ దూరం నడవాల్సి ఉంటుంది. సరోవర తీరం వెంబడి నడిస్తే 90 కి.మీ దూరం మాత్రమే ఉంటుంది. ఈ పరిక్రమను చేయడానికి దాదాపు రెండు రోజుల సమయం పడుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఈ పరిక్రమకు దాదాపు నాలుగైదు రోజులు సమయం కూడా తీసుకుంటుంది. ప్రదక్షిణా మార్గం దుర్గమంగా ఉంటుంది. మార్గమధ్యంలో అనేక సెలయేర్లను, నదులను దాటాల్ని ఉంటుంది. సాధారణంగా పరిక్రమణ కార్యక్రమాన్ని వేసవికాలంలోనే పెట్టుకుంటుంటారు. గతంలో నడుస్తూనే పరిక్రమ చేసేవారు. ప్రస్తుతం రహదారుల సౌకర్యం ఏర్పడతంతో వాహనాల ద్వారానే పరిక్ర్తమ చేస్తున్నారు.
ఈ యాత్ర అత్యంత కష్టంతో కూడుకున్నది. పరమశివుని అనుగ్రహానికి ఆ మాత్రం కష్టపడక తప్పదుగా. మానస సరోవరం ఒకప్పుడు భారతావనిలో భాగాలే అయినప్పటికీ, ప్రస్తుతం టిబెట్టులో ఉన్నాయి. ప్రస్తుతం టిబెట్‌ చైనా అధీనంలో ఉన్నది కనుక, మానస సరోవర యాత్ర ఓ విధంగా విదేశీయాత్రను చేసినట్లే అవుతోంది. ఆవిధంగా ఆ యాత్ర చేయడానికి అయ్యే ఖర్చు కూడా అధికంగానే ఉంటోంది. శ్రమ కూడా అధికం.
ఈ యాత్రకు సంబంధించి భారతప్రభుత్వం ప్రచార సాధానాలలో ప్రకటనలు ఇస్తారు. ఇలా భారత ప్రభుత్వం ద్వారా యాత్ర చేస్తోంటే, ఆ యాత్ర రక్షణ బాధ్యత అంతా ప్రభుత్వమే వహిస్తుంటుంది. ఈ యాత్రను చేయదలచుకున్నవారు 'అండర్‌ సెక్రెటరీ (చైనా), విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వశాఖవారిని సంప్రదించాల్సి ఉంటుంది. ముందుగా వచ్చినవాళ్లకు ముందు అన్న ప్రాతిపదికన ఆ కార్యాలయం దరఖాస్తులను స్వీకరిస్తుంది. మరికొంత మంది నేపాల్‌ రాజధాని ఖాట్మంటు మార్గం ద్వారా యాత్రను చేస్తుంటారు. అయితే ఆ యాత్రలో అంతగా సౌకర్యాలు ఉండవన్నది యాత్రలు చేసి వచ్చిన యాత్రీకులు చెబుతున్న విషయాలు. శ్రమదమాదులను ఓర్చుకుంటూ ముందుకు సాగే మానససరోవర యాత్ర ద్వారా సహనం, కృతనిశ్చయం, మౌనం వంటి గుణాలు అలవడతాయి.

2. పంపా_సరోవరం
పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలో హంపిలో ఉంది. ఆ సరోవరం రామాయణకాలం నాటిదని ప్రతీతి. ఇక్కడ భక్త శబరి ఉండేదట.
ఆ కథ ప్రకారం, ఒక బోయకాంత అయిన శబరి, పంపానదీతీరంలో మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తూండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాక కోసం ఎదురు చూస్తూండేది.
సీతాన్వేషణలో కబంధుని సూచనను అనుసరించి రామలక్ష్మణులు పంపాసరోవర తీరానికి చేరుకున్నారు. రామలక్ష్మణులను చూసిన వెంటనే సంతోష పులకాంకితురాలైన శబరి ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ అన్నదమ్ములకు అర్ఘ్యపాద్యాదులతో మర్యాదలు చేసింది. వారి కోసం తాను సేకరించిన ఫలాలను అందించింది. "శ్రీ రామచంద్రమూర్తి! మీ దర్శనం వలన నా జన్మ ధన్యమైంది. నా తపస్సు ఫలించింది. నాకు ఇప్పటికి తపః సిద్ధి కలిగింది. నా గురుసేవ సఫలీకృతమైంది. ఓ పురుషోత్తమా! నీవు దేవతలందరిలోను శ్రేష్ఠుడవు. నాకిప్పుడు నిన్ను పూజించే భాగ్యం కలిగింది. నాకు ఇక స్వర్గం సిద్ధించినట్లే. ఓ రామా! నీ చల్లని చూపుల వల్ల నేను పరిశుద్దురాలినయ్యాను. నీ అనుగ్రహం వలన దివ్యలోకాలకు చేరుకుంటాను. స్వామీ, మతంగముని శిష్యులకు సేవ చేస్తూండేదానిని. అప్పుడు వారు, మీరు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పట్నుంచీ మీకోసం ఎదురుచూస్తూ, పండ్లు ఫలాలు సేకరించి పెడుతున్నాను. కాబట్టి నువ్వు నీ తమ్ముడు నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి" అని అభ్యర్థించగా, శ్రీరాముడు "శబరీ! కబంధుడు నీ గురించి, నీ గురువుల గురించి చెప్పారు. నాకు ఇక్కడి వనాల మహిమలను గురించి తెలుపవలసింది" అని శ్రీరాముడు అడగడం ఆలస్యమన్నట్లుగా, శబరి ఆ విశేషాలను చెప్పసాగింది.
"ఓ రామా! మేఘ సమూహాల వంటి వృక్షాలతో, నానావిధ పక్షిగణాలతో ఈ మతంగ వనం అత్యంత ప్రసిద్ధి చెందింది. ఇక్కడే మునులు తమ ఆశ్రమాలను ఏర్పాటు చేసుకుని తపస్సులను చేసేవారు. వారి తపః ప్రభావం వలన ఈ ప్రాంతమంతా దివ్యమైన తేజస్సుతో వెలిగిపోతోంది. ఆ మహర్షులు తమ శక్తి వలన సప్తసాగరాలను ఇక్కడున్న పంపా సరస్సులోనికి వచ్చేట్లుగా చేశారు. ఈ నేల అత్యంత మహిమాన్వితమైనది. అందుకే ఇక్కడి పుష్పాలు ఎప్పటికీ వాడవు" అని చెప్పి, తాను సేకరించిన ఫలాలను అందించింది.
రామలక్ష్మణులు ఫలాలను ఆరగించగానే, భక్తితో పులకాంకితురాలైన శబరి, ఆస్వామి అనుగ్రహంతో సమాధియోగ బలం వల్ల మోక్షపథాన్ని చేరుకుంది.
హంపికి వెళ్ళాలనుకునేవారు గుంతకల్లు - హుబ్లీ రైలు మార్గంలోనున్న హోస్పెటలో దిగి హంపి చేరుకోవచ్చు. హోస్పేట నుంచి హంపికి బస్సు సౌకర్యం ఉంది.

03. పుష్కర_సరోవరం
పద్మపురాణంలో ఈ తీర్థాన్ని గురించి విపులంగా వివరించబడింది. ఒకసారి బ్రహ్మదేవుడు ఇక్కడకు రాగా, ఇక్కడున్న చెట్లన్నీ ఘనస్వాగతం పలికాయట. అవి పలికిన స్వాగత వచనాలకు ముగ్ధుడైన బ్రహ్మదేవుడు ఆ వృక్షాలను ఏదైనా వరం కోరుకొమ్మనగా, బ్రహ్మదేవుని ఇక్కడే ఉండాల్సిందంటూ ఆ వృక్షాలు అభ్యర్థించాయట. ఫలితంగా బ్రహ్మదేవుడు అక్కడ తామర పువ్వును నేలపై వదిలాడు. అప్పుడు పెద్ద శబ్దం ఏర్పడి, ఆ నాద ప్రభావానికి చిన్నపిల్లలను చంపే వజ్రనాభుడు అనే రాక్షసుడు అంతమైయ్యాడట.
ఈ సరస్సు రాజస్థాన్‌లోని అజ్మీరుకు ఏడు మైళ్ళ దూరంలో ఉంది. అక్కడే బ్రహ్మదేవుని ఆలయం కూడ ఉంది. పుష్కర సరస్సులోని నీటికి రోగాలను నయం చేసే శక్తి ఉందని నమ్ముతుంటారు. ఇందుకు ఉదాహరణగా 9 వ శతాబ్దంలో ఓ రాజు ఈ నీటిని స్పృశించగా, చేతిపై ఉన్న మచ్చలు మాయమైయ్యాయని చెబుతూంటారు. అత్యంత పవిత్రమైన ఈ సరోవరంలో యాత్రీకులు పితృ తర్పాణాలను చేస్తుంటారు.

4.నారాయణ_వనసరోవరం
ఈ సరోవరం గుజరాత్‌ రాష్ట్రంలో కచ్‌ ప్రాంతంలో ఉంది. గుజరాత్‌లోని భుజ్‌ పట్టణం నుంచి సుమారు 150 కి.మీ దూరంలో ఈ నారాయణ వన సరోవరం ఉంది. ఈ నారాయణ వన పరిసరప్రాంతాలన్నీ శివకేశవుల పాద స్పర్శతో పునీతమయ్యాయని స్థలపురాణాల ద్వారా మనకు తెలుస్తోంది. ఈ సరస్సుకు కాస్త దూరంలో శివుడు కోటేశ్వరునిగా కొలవబడుతున్నాడు. ఆయన ఇక్కడ కొలువై ఉండటం వెనుక ఓ కథ చెప్పబడుతోంది. ఒకసారి పరమశివుని వేడుకుంటూ ఘోరమైన తపస్సు చేసిన రావణునికి శివుడు ప్రత్యక్షమై ఓ విగ్రహాన్ని బహుకరిస్తాడు. స్వామి నుంచి లింగాన్ని అందుకున్న రావణుడు, ఆశ్రద్ధతో ఆ లింగాన్ని నేలపై పడవేస్తాడు. దాంతో కోపగించుకున్న శివపరమాత్మ అనేక లక్షల కోట్ల లింగాలుగా మారిపోతాడు. రావణునికి అన్ని కోట్ల లింగాలలో ఏది అసలైన లింగం అనే విషయం తెలియదు. చివరకు అసలు లింగాన్ని అక్కడే వదిలేసి, చేతికి అందిన లింగంతో రావణుడు వెళ్లిపోయాడని కథనం. ఇలా శివుడు నారాయణ వన సరోవర ప్రాంతాలలో కొలువై ఉండగా, విష్ణురూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ మధుర నుంచి ద్వారకకు వెళ్తున్నప్పుడు, ఇక్కడున్న సరోవరంలో పాదాలను కడుకున్నాడనీ, అందుకే ఇది నారాయణవన సరోవరమని పిలువబడుతోందని మరో కథనాన్ని భక్తులు చెబుతున్నారు.
భుజ్‌ పట్టణం నుంచి ఈ నారాయణవన సరోవరం రెండుగంటల ప్రయాణమే కాబట్టి, ప్రయాణానికి పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు. నారాయణవన సరోవర ప్రాంతంలో భక్తులకు బస సౌకర్యాలు బాగానే ఉన్నాయి.

5. బిందు_సరోవరం
గుజరాత్‌లోని సిద్ధపూర్‌లో ఉన్న బిందు సరోవరం కపిలముని తపస్సు చేసి తరించిన ప్రాంతమని చెబుతారు. బిందు సరోవరం పరమశివుని కృప వలన ఏర్పడిన సరోవరమనీ, కపిలముని తపస్సు చేసిన ప్రాంతమంటూ బిందుసరోవరానికి అనేక ప్రత్యేకతలున్నాయి.
ఓ పురాణ కథనం ప్రకారం,స్వాయంభువు మనువు - శతరూప దంపతులకు ఆకూతి, ప్రకూతి, దేవహూతి అంటూ ముగ్గురు కుమార్తెలు. యుక్తవయస్కురాలైన దేవహుతికి తగిన వరుని కోసం వెదికే ప్ర

యత్నంలో పడిన స్వాయంభువు దేశదేశాలకు తిరిగాడు. చివరకు ఇక్కడకు రాగానే కర్దముడు అతని కంటబడ్డాడు. అతడే తన కూతురికి తగిన వరుడని సంతోషిస్తున్న సమయంలో అతని కళ్ళ నుండి ఆనందభాష్పాలు వెలువడ్డాయట. ఆ భాష్పాల వెల్లువతో ఓ సరోవరం ఏర్పడిందనీ, అదే బిందు సరోవరమని కథనం.
కర్దమ - దేవహూతిల వివాహం అయిన తరువాత సంతానప్రాప్తి కోసం కర్దమ ముని ఓ విమానాన్ని సృష్టించి, తద్వారా లోకమంతా తీర్థయాత్రలు చేస్తూ పుణ్యస్నానాలు చేయసాగారు. అలా వారు సరస్వతీ నదిలో పుణ్యస్నానం చేయగా వారికి కళ, అనసూయ, శ్రద్ధ, హరిర్భువు, గతి, క్రియ, ఖ్యాతి, అరుంధతి, శాంతి అంటూ తొమ్మిదిమంది కుమార్తెలు కలిగారు. కూతుళ్లకు పెళ్లుళ్ళు చేసిన కర్దముని మనసులో తనకు ఓ కొడుకు కూడ ఉంటే బాగుంటుందనిపించింది. భార్యను పిలిచి శ్రీమన్నారాయణుని పూజచేయమన్నాడు. అలా దేవహుతి ప్రార్థనలతో ప్రసన్నుడైన విష్ణుదేవుడు ఆమెకు పుత్రభాగ్యాన్ని కలిగించాడు.
ఆ పుత్రుడే కపిలుడు.
ఈ బిందు సరోవరం ప్రక్కన కపిలముని, కర్దమ - దేవహూతిల సన్నిధులున్నాయి. ఈ బిందు సరోవరం ప్రక్కనున్న రావిచెట్టు క్రింద తర్పణాలు చేస్తుంటారు. ఇక్కడ మాతృదేవతలకు మాత్రమే తర్పణాలను చేయడం విశేషం. ఇలా మాతృదేవతలకు మాత్రం తర్పణాలు ఇవ్వడాన్ని దేశంలో మరెక్కడా చూడలేము.
బిందు సరోవరం గుజరాత్‌లోని పఠాన్‌జిల్లా, సిద్ధపూర్‌లో అహ్మదాబాద్‌ - డిల్లీ జాతీయ రహదారిలో ఉంది. సిద్ధపూర్‌ అహ్మదాబాద్‌ నుంచి సుమారు 115 కి.మీ దూరములో ఉంది. గుజరాత్‌లోని అన్నిముఖ్యపట్టనాల నుంచి సిద్ధపూర్‌కు బస్సు సౌకర్యాలున్నాయి. సిద్ధపూర్‌ చిన్న ఊరే అయినప్పటికీ ఇక్కడ యాత్రీకుల సౌకర్యార్థం అనేక ధర్మశాలలు ఉన్నాయి.
అహ్మదాబాద్‌ నుంచి సుమారు రెండు గంటల ప్రయాణమే కాబట్టి, అహ్మదాబాద్‌కు యాత్రార్థం వెళ్లిన యాత్రీకులు తప్పక బిందుసరోవరాన్ని దర్శించుకుని వస్తుంటారు.
ముఖ్యంగా పితృదేవతలకు తర్పణాలను అర్పించాలనుకున్నవారు ఈ పంచసరోవర యాత్రలను చేస్తుంటారు. మరికొంతమంది ఆయా ఆలయాలకు వెళ్ళినపుడు అక్కడున్న సరోవరాలను దర్శించుకుంటుంటారు. మొత్తం మీద పంచసరోవరాల దర్శనం ఉభయతారకం. ఎందుకంటే ఒకప్రక్క తీర్థయాత్రను చేసిన అనుభూతితో పాటు, మరో ప్రక్క పితృదేవతలకూ తర్పణాలను విడిచి, వారికి ఉత్తమలోక గతులను ఏర్పరచి, పితృదేవతల్ను తృప్తి పరిచినట్లు అవుతుంది. ఇలా తీర్థయాత్రలు చేయడం వల్ల మనలో మానసికతీర్థాలు కూడ నెలకొంటాయి. అవి: సత్యం, ఓర్పు, ఇంద్రియ నిగ్రహం, దయ, ఋజుత్వం, దానం, తృప్తి, బ్రహ్మచర్యం, మధురసంభాషణం, జ్ఞానం, తపశ్చర్యలు తదితరాలు మానసిక తీర్థాలు. ‌

లోకా సమస్త సృజనో భవంతు

Friday, May 25, 2018

స్వస్తి’ అంటే.....?


స్వస్తి’ అంటే ‘శుభం’ అని అర్థం. అందరం శుభాలను కోరుకుంటాం. కానీ ఆ శుభం కావాలంటే దానిని సంపాదించే మార్గం కూడా శుభమయం కావాలి. ధర్మమార్గమే శుభం. ఆ శుభానికి ఫలంగానే క్షేమం లభిస్తుంది. శుభమే శుభాన్నిస్తుంది.
చిత్రం ఏంటంటే – మనందరికీ ఆనందం కావాలి. కానీ తత్సాధనమైన, ‘సత్కర్మ’ చేయాలని ప్రయత్నించం. మనకి ‘దుఃఖం’ అక్కర్లేదు. కానీ దుఃఖానికి కారణమైన దుష్కర్మని మాత్రం వదలం. మనమనుకున్నది మనకు రాదు. మనం చేసేదాని, ఫలితమే మనం పొందుతాం.
‘స్వస్తిమార్గం’ అంటే – మనం చేసే పని, దానికి అవసరమైన పరికరాలు, వనరులు, ఆలోచనలు అన్నీ ‘స్వస్తి’మాయం కావాలి. అప్పుడే అది సరియైన శుభంకరమైన మార్గం అవుతుంది.
లక్ష్యమొక్కటే కాదు, మార్గం కూడా మంగళకరం కావాలి – అని వేదం ప్రబోధిస్తోంది. మన వాంఛితాలు, సంకల్పాలు మంగళకరంగా ఉండాలన్నదే మానసిక విజ్ఞానసారం. మంచి ఆలోచనలవల్ల, మంచి స్పందనలు, తద్వారా మంచి ప్రేరణలు, మంచి ఆచరణలు కలుగుతాయి. ఇదో చక్రనేమిక్రమం.
కాబట్టి వేదం శుభాన్ని సంకల్పించుకోవడం, శుభాన్ని ఆశిస్తూ దైవీశక్తులను ఉపాసించడం వంటి శుభాకాంక్షలెన్నింటినో పలికింది.
జీవిత పరమ లక్ష్యం ‘పరమశుభం’. దానినే ‘శివం’ అంటారు. అదే పరమ (Ultimate) స్వస్తి. అందువల్లనే ‘స్వస్తి’ అనే దానిని భగవన్నామంగా పేర్కొన్నారు(విష్ణుసహస్రనామం). ఆ అఖండమైన ‘స్వస్తి’ని సాధించడానికి, అవసరమైన జీవన విధానమే ‘స్వస్తిపంథా’.
ఏ లక్ష్యానికి ఏ బాట వేసి ఉందో, దానిని ఆశ్రయించినప్పుడే ఆ లక్ష్యాన్ని చేరుకోగలం. కాబట్టి ఆ ‘పరమస్వస్తి’కి వేసిన ౧. జ్ఞానమార్గం, ౨. భక్తిమార్గం, ౩. కర్మమార్గం, ౪.
యోగమార్గం...ఇవే స్వస్తిపథాలు. వీటిని వదలరాదు. ఈ నాలుగూ వేటికవి విభిన్నమూ కావు. విరోధమూ కావు. పరస్పర పరిపూరకాలు.
వేదవిహిత కర్మాచరణను జ్ఞాన, భక్తి, యోగనిష్ఠలతో ఆచరించడమే స్వస్తి పథం. ‘దారితప్పకపోవడ’మంటే ఇదే.

‘స్వస్తి’తో అనుసంధానించడానికి పథంలో మనం మాత్రమే ప్రయాణించడం సరిపోదు.

మన ఆచరణతో మరికొంతమందికి స్ఫూర్తి కలిగించి, కలసి ప్రయాణించి ఆ పరమలక్ష్యాన్ని అందుకోవాలి. ఈ ‘కలిసి’ అనే స్ఫూర్తి వైదిక సంస్కృతిలో స్ఫుటంగా లభిస్తుంది.

గొప్ప విషయాన్ని పదిమందితో పంచుకోవడం మన గొప్పతనాన్ని చాటుకోవడానికి కాదు. దానితో అనేకమందిని అనుసంధానింపజేయడమనేది ఒక లోకహితం. తనతో పాటు తన చుట్టూ ఉన్నవారికి కూడా స్వస్తి కలగాలని కోరుకోవడం ముఖ్యం. మనకి శుభం, మరొకరి ‘అశుభం’ వల్ల రాకూడదు. ఒకరి దుఃఖంవల్ల మనం ఆనందించకూడదు. అలా ఆనందించడం, క్రమంగా దుఃఖంగానే పరిణమిస్తుంది.
స్వస్తినీ, శాంతినీ ఆశించిన భారతీయ సంస్కృతే ‘స్వస్తిపంథా. ఆ పథానికి సదా స్వస్తియగుగాక!

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...