Thursday, October 11, 2018

శరన్నవరాత్రులు


మనుషులతోపాటు సకల జీవరాశులు, ఔషధీ సంపదలు నెలకొనిఉన్న ఈ భూమండలాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్నవాడు చంద్రుడు. ఆ చంద్రుడి కాంతి స్వచ్ఛంగా, స్పష్టంగా ప్రసరించే కాలం శరదృతువు. చంద్రుడి దినదినాభివృద్ధిని సూచించేది శుక్లపక్షం, చంద్రుడి దినదిన క్షీణతను తెలిపేది కృష్ణపక్షం. మనిషి దినదినాభివృద్ధిని కోరుకుంటూ శుక్లపక్షాన్ని ఇష్టపడతాడు. అందుకే శరదృతువులోని శుక్లపక్ష పాడ్యమి నుంచి మహానవమి వరకు మనిషి చేసే శక్తి ఉపాసనలే శరన్నవరాత్రోత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి.
భూమండలంతో కలుపుకొని ఈ విశ్వాన్ని నడుపుతున్నది ఒక మహాశక్తి. ఆ శక్తి ప్రభావం వల్లనే సృష్టి, స్థితి, లయాలు జరుగుతున్నాయి. శక్తి లేనిదే ఈ విశ్వం మనుగడ సాగించలేదు.
ఏ దివ్యరూపం సకల ప్రాణికోటిలోనూ పంచభూతాలలోనూ శక్తిగా పరిణమించి ఈ విశ్వాన్ని నడుపుతున్నదో ఆ శక్తికి కృతజ్ఞతగా నమస్కరించాలని సంప్రదాయం చెబుతున్నది. అలా ప్రారంభమైనవే శరన్నవరాత్రోత్సవాలు. ఈ ఉత్సవాల్లో ఆ దివ్యశక్తిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే మూడు రూపాలతో కొలవడం ఆచారంగా మారింది. మహాకాళి కాలానికి ప్రతిరూపం. మహాలక్ష్మి సకల సంపదలకూ పర్యాయపదం. మహాసరస్వతి జ్ఞానానికి నెలవు. మనిషి తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే ఈ మూడు శక్తులనూ ప్రసన్నం చేసుకోవడం అనివార్యమని మహర్షుల ఉపదేశం. శరన్నవరాత్రోత్సవాల్లో ఈ మూడు శక్తుల ఆరాధన ప్రధానంగా కనబడుతుంది.
మానవ శరీరంలో కిందినుంచి పైదాక ఆరు చక్రాలుంటాయని యోగశాస్త్రం చెబుతోంది. వాటినే షట్‌ చక్రాలని పిలుస్తారు. మూలాధారం, స్వాధిష్ఠానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ అనేవి ఆరు చక్రాలు. ఒక్కొక్క చక్రంలో ఒక్కో పద్మం ఉంటుందని శాస్త్రం చెబుతోంది. మనిషి యోగ సాధన ద్వారా ఒక్కొక్క చక్రంలో ఉన్న పద్మాన్ని వికసింపజేస్తూ శిరస్సులో ఉండే సహస్రారకమలం (వేయి   రేకుల పద్మం) దాకా చేరుకుంటే అది విచ్చుకొంటుందని, ఆ కమలం నుంచి మకరందామృతం ధారలా శరీరమంతా ప్రవహిస్తుందని, అప్పుడు మనిషి అజరామరుడు (ముసలితనంలేని నిత్య యౌవనంతో, మరణం లేనివాడుగా) అవుతాడని శాస్త్రం చెబుతోంది. ఇలా నేలపై నుంచి నింగిదాకా వ్యాపించిన ఆరుచక్రాలతో కూడిందే శ్రీచక్రం. శ్రీచక్రం దివ్యశక్తికి ప్రతీక. ఈ చక్రంలోని ఉన్నతస్థానంలోని బైందవస్థానం (బిందువు వంటి పీఠం)పై పరమేశ్వరి (ఈ ప్రపంచాన్ని నడుపుతున్న దివ్యశక్తి) ఉంటుందని శాక్తతంత్రాలు చెబుతున్నాయి. ఆ శక్తిని శరదృతువు ఆరంభంలోని పాడ్యమి మొదలుకొని తొమ్మిదిరాత్రులు పూర్తి అయ్యేంతవరకు అర్చించడమే శరన్నవరాత్రోత్సవాల ప్రత్యేకత. అందుకే ఆ శక్తిని చంద్ర కళారూపిణిగా కొలవడం పరిపాటిగా మారింది. రోజుకొక్క కళగా వర్ధిల్లే ఈ చంద్రకళ మహానవమినాడు ఉజ్జ్వలంగా ప్రకాశిస్తుంది. నవశబ్దం నిత్యనూతనత్వాన్ని సూచిస్తుంది. కనుక మనిషి తాను ఆజీవనపర్యంతం నిత్యనూతనంగా ఉండాలనే ఆశయంతో నవరాత్రోత్సవాలను ఆచరిస్తాడు. ఇలా నిత్య నూతనోత్సాహంతో తొమ్మిది రాత్రులు చేసే అర్చనకు ఫలంగా పదోరోజు విజయదశమి ఆవిర్భవిస్తుంది. ఈ పర్వదినాన ఏ నూతన ప్రయత్నం చేసినా అది శుభదాయకం అవుతుందని, లాభాలను ప్రసాదిస్తుందని జనుల నమ్మకం. విజయ దశమి నాడు ‘అపరాజిత’ అనే దివ్యశక్తి ఆవహించి ఉంటుందని, ఆ శక్తి మనిషికి అపజయాలులేని పురోగతిని ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
మనిషి తన జీవితాన్ని దినదినాభ్యుదయంగా రూపొందించుకోవడానికి ఇష్టపడతాడు. శుక్లపక్షంలోని పాడ్యమినుంచి పూర్ణిమదాకా రోజుకొక్క కళ ఎలా వృద్ధిచెందుతుందో అలాగే తన జీవితం వికసించి, మూడు పూవులు, ఆరుకాయలు కావాలనుకోవడమే శరన్నవరాత్రోత్సవ పూజా పరమార్థం. అందుకే ఇవి నవరాత్రులు కావు... నవరత్నాలే!

30 వేల ఫలితాన్నిచ్చే ఒకే ఒక్క ప్రదక్షణం "చండ ప్రదక్షణం"

శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే, వెనక్కి రావాలి. శివలింగం, నందీశ్వ రుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.

లింగ పురాణంలో ఈ విధానం గురించి స్పష్టంగా పేర్కొనబడింది!!

ప్రదక్షిణా విధానాన్నివివరించే ఒక శ్లోకం!!

వృషంచండంవృషంచైవ సోమసూత్రం పునర్వృషం|
చండంచ సోమసూత్రంచ పునశ్చండం పునర్వృషం||
శివప్రదక్షిణేచైవ సోమసూత్రం నలంఘయేత్|
లంఘనాత్సోమసూత్రస్య నరకే పతనం ధృవం||

నందీశ్వరుని ప్రార్థించిన తర్వాతే శివ దర్శనానికి వేళ్ళాలి.నందీశ్వరుని అనుమతి లేనిదే శివపూజ చేయకూడదు. అలా చేస్తే ఫలితం శూన్యం. ‘‘నందీశ్వర సమస్తుభ్యం శాంతా నంద ప్రదాయకం! మహాదేవసేవార్థం అనుజ్ఞాందాతుమర్హసి’’ అని ప్రార్థించి ఆయన కొమ్ముల మధ్యనుండి శివలింగాన్ని చూస్తూ ‘‘ఓంహర, ఓంహర’’ అంటూ ప్రార్థిస్తే ఏడుకోట్ల మహామంత్రాలను జపించిన ఫలాన్ని పొందుతారు. యువతులు అపస వ్యంగా, బ్రహ్మచారులు సవ్యంగాను, గృహస్థులు సవ్యాపసవ్యములుగాను శివప్రదక్షిణం, ‘‘చండీ’’ ప్రదక్షిణం చేయాలి. శివునికి ప్రదక్షిణ చేసేటప్పుడు సోమసూత్రం దాటరాదు. చండి ప్రదక్షిణము ఒకసారి చేస్తే 30 వేల సార్లు ప్రదక్షణ చేసిన ఫలము వచ్చును.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....✍

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...