Monday, February 12, 2018

నవనందులు సర్వ పాపహరణాలు

మన రాష్ట్రంలోని నవ నందులను దర్శిస్తే జన్మ జన్మల పాపాలు పోయి పుణ్యం సిద్ధిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. నందిని పూజిస్తే సాక్షాత్తూ శివుని అనుగ్రహం పొందవచ్చని చెబుతారు.

పురాణాల ప్రకారం చూసినట్లయితే, శివుని కుటుంబం లో ఒక్కొక్కరికి ఒక్కో వాహనం ఉంటుంది. పార్వతి దేవి కి పులి, వినాయకునికి మూషికం, కుమారస్వామి కి నెమలి మరియు శివునికి నంది వాహనంగా ఉంటుంది. అన్నింటిలోకీ నంది ప్రత్యేకమైనది. నందిని పూజిస్తే పిల్లలు పుడతారనేది భక్తుల నమ్మకం. అలాంటి నంది మన రాష్ట్రంలో నవ నందుల రూపంలో కర్నూలు జిల్లాలో కొలువై ఉన్నాడు.

ప్రథమ నంది
నందుల్లో మొదటిది ప్రథమ నంది. ఇది చామకాల్వ ఒడ్డున, నంద్యాల రైల్వే స్టేషన్ కు సమీపాన ఉంది. సూర్యాస్తమ సమయాల్లో(కార్తీక మాసంలో) నందీశ్వరుని మీద సూర్య కిరణాలు పడటం ఇక్కడ విశేషం.

నాగ నంది
నంద్యాల బస్ స్టాండ్ కు సమీపాన ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో నాగ నంది కొలువై ఉంటాడు. నాగులు గరుత్మంతుని ధాటికి తట్టుకోలేక ఇక్కడే శివుని కోసం తపస్సు చేశాడు.

సోమ నంది
సోమ నంది నంద్యాల కు తూర్పు వైపున (నంద్యాల పట్టణానికి లోపల) జగజ్జనని ఆలయానికి సమీపంలో ఉంది. చంద్రుడు (సోముడు) ఈశ్వరుని కోసం ఇక్కడే తప్పసు చేసాడు.

సూర్య నంది
సూర్య నంది నంద్యాల నుండి మహానందికి వెళ్లే మార్గంలో రోడ్డు పై ఉన్నది. సరిగ్గా చెప్పాలంటే నంద్యాల నుండి 4 కి. మీ. దూరం వెళితే యు. బొల్లవరం అనే గ్రామం వస్తుంది. అక్కడి నుంచి కుడి వైపు తిరిగి కిలోమీటరు దూరం వెళితే ఈ ఆలయానికి చేరుకోవచ్చు. రోజూ సూర్యకిరణాలు లింగం పై పడటం ఇక్కడి విశేషం.

శివ నంది
శివ నంది కూడా నంద్యాల నుండి మహానంది కి వెళ్లే మార్గంలో ఉంటుంది. నంద్యాల నుండి సుమారు 13 కి. మీ. దూరంలో తిమ్మవరం గ్రామం దాటినాక ఎడమవైపున ఉంటుంది. కడమల కాల్వా ల్యాండ్ మార్క్ గా చెప్పవచ్చు. ఇది మిగిలిన 8 నంది ఆలయాల కంటే పెద్దది. అరణ్యంలో ఉంటుంది కనుక ప్రశాంతంగా ఉంటుంది.

విష్ణు లేదా కృష్ణ నంది
మహానంది రోడ్డు మార్గంలో, మహానంది ఇంకా రాకమునుపే 2 మైళ్ళ ముందర ఎడమ వైపు తిరిగితే తెలుగు గంగ కెనాల్ కనిపిస్తుంది. ఆ కెనాల్ ను ఆనుకొని ఉన్న మట్టి రోడ్డు గుండా 4 కి. మీ. వెళితే విష్ణు ఆలయం కనిపిస్తుంది. ఇక్కడ శ్రీహరి శివుణ్ని ప్రార్ధించాడట. ఆలయంలోకి వచ్చి పోయే నీరు, పాలరాతి నంది విగ్రహం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.

గరుడ నంది
నంద్యాల నుండి మహానందికి వెళ్ళటప్పుడు, మహానంది గుడికి ముందర కొద్ది దూరంలో ... పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని దాటితే గరుడ నందిని దర్శించుకోవచ్చు. గరుత్మంతుని తల్లి వినతాదేవి తను వెళ్ళే పనిలో ఎటువంటి ఆటకం కలగకుండా ఉండేందుకై పరమేశ్వరుణ్ణి ప్రార్ధించిన ప్రదేశమిది.

మహానంది
మహానంది లోనిది స్వయంభూలింగం. ఆలయంలోకి ప్రవేశించేముందు భక్తులు ఇక్కడి పవిత్ర కొలనులలో మునిగి తేలుతారు. కొలను లోని నీరు 5 అడుగుల మేర లోతు ఉంటుంది. నీరు స్వచ్చంగా ఉండి, వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. సెలవు దినాల్లో, పండుగల సమయాల్లో జనం అధికంగా వస్తారు కాబట్టి మిగితా సమయాల్లో వెళితే బాగుటుంది.

వినాయక నంది
వినాయక నంది చిన్న ఆలయం. ఇది మహానంది ఆలయానికి వాయువ్య దిక్కున ఉంటుంది. ఆలయ గోపురం దాటి బయటకు వచ్చిన తరువాత ఎడమ పక్కన, కోనేటి గట్టున ఉంటుంది. పూర్వం వినాయకుడు ఇక్కడ తపస్సు చేసినాడని వినికిడి.

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

భర్త ఆయుష్షును కోరే స్త్రీ

హరిద్రాం కుంకుమం చైవ సింధూరం కజ్జలంతదా ।
కూర్పాసకం చ తాంబూలం మాంగల్యాభరణం శుభమ్‌ ।

కేశ సంస్కార కబరీ కరకర్ణాది భూషణం ।
భర్తురాయుష్య మిచ్ఛన్తీ దూషయేన్న పతివ్రత్ణా।। (వ్యాసవచనం)

భర్త ఆయుష్షును కోరే స్త్రీ-పసుపు, కుంకుమ, సింధూరం, కాటుక, రవిక, తాంబూలం, మంగల్యాభరణం, సంస్కరింప బడినకురుల ముడి,చేతులు, చెవులు మొదలగు వానికి ఆభరణాలను విడువరాదు. దూషింపరాదు.

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

మార్గశిర సుబ్రహ్మణ్య షష్టి

ప్రతి సంవత్సరం మార్గశిర మాసం శుక్లపక్ష షష్టినాడు శ్రీ సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారం. కృత్తిక నక్షత్రాన జన్మించినందువల్ల, కార్తికేయుడని, రెల్లుపొదలలో పుట్టినందువల్ల శరవణభవుడని, ఆరుముఖాలుండటం వల్ల షణ్ముఖుడని... ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీవల్లి, దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి.ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధషష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.

జాతకంలో కాలసర్పదోషం ఉన్న వారు,కుజ,రాహు,కేతు దశలు నడుస్తున్నవారు,కుజ దోషం ఉన్నవారు,సంతానంలేని వారు,వివాహం కానివారు,దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉన్నవారు ఉపవాస వ్రతాన్ని పాటిస్తూ షోడశోపచారములతో అర్చించడంవల్ల సత్ఫలితాలు పొందుతారని సంతాన భాగ్యానికి నోచుకోని స్త్రీ, పురుషులు ఈ రోజున సర్పపూజలు చేసి,సంతానం కోసం, శత్రు విజయాల కోసం ఈ స్వామిని మార్గశిర శుద్ధ షష్ఠినాడు ప్రత్యేకంగా పూజిస్తుంటారు. సర్ప పూజలు ,తాంత్రిక పూజలు చేసే వారు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పూజలు చేస్తే అపారమైన శక్తి సామార్ద్యాలు కలిగి ఉంటారు.

సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఉదయాన్నే స్నానం చేసి, ఏ ఆహారమూ తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మ ణ్యస్వామి ఆలయానికి వెళ్ళి పువ్వులు, పండ్లు, పడగల రూపాలలాంటివి అక్కడ సమర్పిస్తారు. బ్రహ్మచారియైన బ్రాహ్మణుడిని ఇంటికి పిలిచి సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి భోజనం పెట్టి పంచెల జతను తాంబూలంతో ఉంచి ఇవ్వడం ఉత్తమం.తనను భక్తితో కొలిచిన వారికి నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధినివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు. "శరవణభవ" అనే ఆరు అక్షరాల నామమంత్రాన్ని పఠించడం, జపించడం కూడా మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది.

శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం...

దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుటధ్వజం

స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం...

కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం

ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లయినా మనస్ఫూ

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

అన్నప్రాశన

అన్నప్రాశన ఆరో నెల ఆరవ రోజున చేయటం ఆచారం. ఆ రోజు చేసేప్పుడు ముహూర్తం అన్వేషణతో పని లేదు అని ఒక పెద్ద వాదన సంఘంలో ఉంది. అది చాలా తప్పు. ఆరవ నెల ఆరవ రోజు, అమావాస్య కానీ, మంగళవారం కానీ గ్రహణం కానీ వస్తే అన్నప్రాశన చేస్తామా? కేవలం మూఢమి పట్టింపు లేదు అన్నారు కానీ ముహూర్త పట్టింపు లేదు అనే వాదన చాలా దోష వాదన.

అన్నప్రాశన ముహూర్త ప్రభావం పిల్లవాడి జీవిత ఆరోగ్య విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అందువలన తప్పకుండా మంచి ముహూర్తానికే అన్నప్రాశన చేయాలి.

మగ పిల్లలకు ఆరు లేక ఎనిమిది లేక పది నెలలు నిండిన తర్వాత గానీ, సంవత్సరం నిండిన తర్వాత గానీ శుక్లపక్షమునందు శుక్రుడు ఆకాశమందు పరిశుద్ధుడై ప్రకాశించుచున్నపుడు అన్నప్రాసనము చేయవలెనని ఋషులచే చెప్పబడినది.(ముహూర్త దర్పణం).

‘షష్ఠేష్టమేవా దశమే చ మాసి సంవత్సరేవా దివసే ప్రవృద్దే’ శిశువు జననం మొదలుగా ఆరు, ఎనిమిది, పది, పన్నెండు మాసాలలో మంచి రోజులు అన్నప్రాశన చేయమని చెప్పారు.

ఆడ పిల్లకు "స్త్రీణాంతు పంచమాది విషమే మాసే పంచమ సప్తమ నవమైకాదశేషు విషమేషు శుభదం” అని కాలామృతం నందు వున్నది. స్త్రీలకు బేసి మాసములో అనగా ఐదు,ఏడు,తొమ్మిది మాసములలో అన్నప్రాసన చేయవలెను.

వృషభ,కర్కాటక,మిధున,కన్య,దనస్సు,మీనములనెడి,శుభలగ్నమందు,పాడ్యమి,చవితి,షష్థి,అష్టమి,నవమి,ఏకాదశి,ద్వాదశి,అమావాస్య,పున్నమి ఈ దినములు నిషేదించి మిగిలిన తిధులయందు అన్నప్రాశన మంచిది.పునర్వసు, మృగశిర, ధనిష్ఠ, పుష్యమి, హస్త, స్వాతి, అశ్వినీ, అనురాధ, శ్రవణం, శతభిషం, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, చిత్త నక్షత్రములు వున్న సమయంలో ‘వారాశ్శుభాశ్చ గురు చంద్ర సితేందు జానాం’ శుభ గ్రహ వారములయిన సోమ, బుధ, గురు, శుక్ర వారములు, తప్పనిసరి అయితే శని ఆదివారములలో చెయ్యవచ్చు.

‘దశమే శుద్ధి సంయుక్తే శుభ లగ్నే శుభాంశనే’ లగ్నాత్ దశమ స్థానం శుద్ధి, అష్టమ స్థానం శుద్ధి చూడాలి .శుద్ది అంటే దశమంలో,అష్టమంలో గ్రహాలు లేకుండుట.కొంతమంది దశమం,అష్టమంలో పాపగ్రహలు ఉండరాదు.శుభగ్రహాలు ఉండచ్చు అని అంటారు. . లగ్నాత్ నవమంలో బుధుడు, అష్టమంలో కుజుడు సప్తమంలో శుక్రుడు లేకుండా ముహూర్తం చూడమన్నారు .

అన్నప్రాశ లగ్నంలో రవి ఉన్న యెడల కుష్ఠు రోగి గాను,క్షీణ చంద్రుడు ఉన్న దరిద్రుడి గాను,పూర్ణ చంద్రుడు ఉన్న అన్నదాత గాను,కుజుడున్న పైత్యా రోగి గాను,బుద్ధుడున్న విశేష జ్ఞాన వంతుడిగాను,గురువున్న భోగ మంతుడుగాను,శుక్రుడున్న దీర్ఘాయువు గలవాడు గాను,శని ఉన్న వాత రోగము కల వాడు గాను,రాహు కేతువులు ఉన్న దరిద్రుడు అగును అని కాలామృత గ్రంధం నందు వివరించబడినది.

ముహూర్త సమయానికి వున్న లగ్నానికి పాపగ్రహ సంబంధం లేకుండా చూసి ముహూర్తం చేయమని, అన్నప్రాశన చేయమని జ్యోతిశ్శాస్తవ్రేత్తలు అందరూ చెబుతారు.

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

వాస్తు పూజ తప్పక ఆచరించవలసిన విధి

భూమి కొనేటప్పుడు, ఇల్లు కట్టించేటప్పుడు వాస్తు చూడటమనేది చాలామంది చేస్తుంటారు. అసలీ వాస్తు అంటే ఏమిటి? ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది.. అనే విషయాలను గురించి చెబుతుంది మత్స్య పురాణం రెండువందల యాభై ఒకటో అధ్యాయం పూర్వం సూతుడు రుషులకు భవన నిర్మాణానికి సంబంధించిన విషయాలను వివరిస్తూ వాస్తు పురుష ఉత్పత్తి, వాస్తు శబ్ధ అర్ధం, భూమి పరీక్ష లాంటివి వివరించాడు.

పూర్వం అంధకాసుర వధ సమయంలో శివుడి నుదిటి భాగం నుంచి ఒక చెమట బిందువు రాలి పడింది. క్షణాల్లో ఆ బిందువు భయంకరమైన భూతంలా మారింది. పుట్టీ పుట్టగానే ఆ భూతం తన ఎదురుగా ఉన్న అంధకాసురుడికి చెందిన అంధకులు అందరినీ తినేసింది. అయినా ఆ భూతానికి ఆకలి తీరలేదు. వెంటనే అది తన ఆకలి తీర్చమని శివుడిని గురించి భీకరమైన తపస్సు చేసింది. చాలాకాలం పాటు ఆ తపస్సు సాగాక శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ భూతం తనకు మూడు లోకాలను మింగేసి ఆకలి తీర్చుకోవాలని ఉందని అంది. శివుడు అలాగే కానిమ్మన్నాడు. 

పురుషాకృతిలో ఉన్న ఆ భూతం మూడు లోకాలకు విస్తరించింది. అందిన వారిని అందినట్లు నమిలేసింది. అయితే ఇంతలో లోకాలన్నిటా ఉన్న మానవులు, దేవతలు, రాక్షసులు అంతా ఆ భూతం మీదకు ఎక్కి కుర్చొని దాన్ని అణిచి వేసారు. అంతమంది ఎక్కి కదలనివ్వక పోవటంతో అది మళ్ళీ దీనంగా దేవతలను ఉద్దేశించి ఇలా సర్వలోకవాసులు తనను అణిచి వేస్తున్నారని, తాను బతకటానికి ఆహారం కావాలి కనుక ఏదైనా ప్రసాదించమని వేడుకొంది. ఆ భూతం మీద అందరూ వాసం ఏర్పరచుకున్నారు. కనుక అది అందరికీ వాస స్థానం అయింది. ఆనాటి నుంచి దానికి "వాస్తు" అని పేరొచ్చింది. అప్పుడు బ్రహ్మాది దేవతలు దాన్ని అనుగ్రహిస్తూ ఇలా అన్నారు.

గృహస్తుడు తన ఇంట్లో అగ్ని కార్యం చేసి ఇంటి మధ్యలో వేసే బలి (అన్నం లాంటి పదార్ధాలు), అలాగే వాస్తు ఉపశమనం కోసం చేసే యజ్ఞంలో లభించే హవిస్సులు యజ్ఞ, ఉత్సవాల వంటి సమయాలలో వేసే వాస్తు బలి (అన్నం), వాస్తు పూజ ఆచరించని వాడు, అజ్ఞానంతో చేయాల్సిన పద్ధతిలో కాక తప్పు పద్ధతిలో యజ్ఞాలు చేసే వాడు వాస్తు పురుషుడికి ఆహారం అవుతారని బ్రహ్మాది దేవతలు పలికారు. అప్పుడు ఆ వాస్తు పురుషుడు ఆనందించాడు. నాటి నుంచి ఎక్కడ శాంతి పూజలు జరిగినా వాస్తు పూజ, హోమం లాంటివి చేయడం ఆచారంగా వస్తోంది. ఈనాటికీ సంప్రదాయబద్ధంగా చేసే ఉత్సవాలు, బ్రహోత్సవాల వంటి వాటిలో చేసే యజ్ఞయాగాలు ఇలా అనేక సందర్భాలలో వాస్తు పూజ, బలి ఇవ్వడం లాంటివి జరుగుతుంటాయి. గృహ నిర్మాణ, గృహ ప్రవేశాది విషయాలలో దీన్ని నిర్వహించటం కనిపిస్తుంది.

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

దేహమే దేవాలయం

     మన దేహమే ఒక దేవాలయం. మన దేహమనే దేవాలయాన్ని చూసే భౌతిక ప్రపంచంలో దేవాలయాల నిర్మాణం జరిగింది. సుప్రభేద ఆగమం మంటపాల నిర్మాణాన్ని మన శరీరంతో పోల్చింది. దీని ప్రకారం మన శిరస్సే గర్భగృహం. శిఖయే గర్భాలయ శిఖరం. చేతులే ప్రాకారం. తొడలే సౌభాగ్య మంటపం. మోకాళ్లే మహాద్వారం. మన నాడులే స్తంభాలు. జిహ్వయే మహాఘంట. బ్రహ్మరంధ్రమే గర్భగృహ ద్వారం. ఇలా చూసుకుంటూ పోతే మన శరీరంలోని ప్రతి అవయవానికీ దేవాలయంలో ఏదో ఒక విభాగంతో పోలిక కనిపిస్తుంది. జ్ఞానులకు, యోగులకు వారివారి దేహాలే దేవాలయాలు. వారి హృదయాలలో భగవంతుడిని ఆరాధించడమే మానస పూజ.

దేవాలయాల్లో చేసేది కేవలం బాహ్యపూజే. మానస పూజ చేసే సాధకుడు తన దేహమనే దేవాలయంలోని ద్వారాలను దాటి గర్భాలయంలో ఉన్న పరమాత్మను తన ఆత్మగా గుర్తించగలుగుతాడు. అయితే ప్రతి దేవాలయంలోనూ మంటపాలు ఉండవు. తిరుపతి, కాళహస్తి, కంచి వంటి గొప్పగొప్ప దేవాలయాల్లో ఈ మంటపాలు ఉంటాయి. వాటినే పూర్ణదేవాలయాలు అని పిలుస్తారు. అరుణంలోని ‘అష్టాచక్రా నవద్వారా’ అనే మంత్రంలో అష్టచక్రాల గురించి ప్రస్తావన ఉంటుంది. ఇదే విధంగా యోగోపనిషత్తులలోను, శివసంహితలోను, భాగవతాది పురాణాల్లోనూ ఈ చక్రాల ప్రస్తావన ఉంటుంది. మన శరీరంలో ఒక్కో చక్రం దేవాలయంలో ఒక్కో మంటపం. మూలాధార చక్రమే మహాద్వారం. స్వాధిష్ఠాన చక్రమే సౌభాగ్య మంటపం. మణిపూరక చక్రమే యోగమంటపం. అనాహత చక్రమే నవరంగ మంటపం. విశుద్ధి చక్రమే అంతరాళ మంటపం. మన శరీరంలోని చక్రాలను, వాటి విధులను పరిశీలిస్తే దేవాలయాల్లోని మంటపాలతో సారూప్యత కనిపిస్తుంది. ఇటువంటి సారూప్యతలున్నాయి కాబట్టే మన పూర్వీకులు దేవాలయాలకు వెళ్లాల్సిందిగా అందరినీ ప్రోత్సహించేవారు. ఆ నిర్మాణాలను చూస్తే ఆత్మ చైతన్యం కలుగుతుందని భావించేవారు.స్వామి సరూపానందేంద్ర సరస్వతి

సాధన సప్తకం

 పుట్టుక, ముసలితనం, మరణం.. ఇవేవీ లేని ఆనందస్వరూపుడైన పరమాత్మను పొందడం ఎలా? ఉపాసనాత్మకమైన జ్ఞానం ద్వారా పొందవచ్చని ముండకోపనిషత్తు చెబుతోంది. వివేక, విమోక, అభ్యాస, క్రియా, కల్యాణ, అనవసాద, అనుద్ధర్షాలనే సాధన సప్తకాలతో ఇది సాధ్యం. అవేంటంటే..

వివేకం: మంచి చెడులను గుర్తించ గల వివేక సంపన్నుడు మానవుడు. అంతఃకరణ శుద్ధికి అవసరమైన, దోషరహితమైన ఆహారం స్వీకరించడం వల్లనే మనిషి వివేకవంతుడు అవుతాడు.

విమోకం: భోగ వస్తువులయందు, విషయముల యందు వ్యామోహము ఏర్పడకుండా జాగ్రత్తపడటమే విమోకం. భోగలాలసునికి ఉపాసన దశలో స్థిరచిత్తం ఏర్పడదు. కాబట్టి భోగలాలసను వదలాలి.

అభ్యాసం: బయటి ప్రపంచంలోని వ్యక్తులపై అనురాగం ఏర్పడకుండా నిత్యం, నిరంతరం.. సమస్త శుభాలకు కేంద్రమైన ఆ భగవంతుని స్మరించడాన్నే అభ్యాసం అంటారు.
క్రియ: తమ శక్తి మేరకు రోజూ పంచమహాయజ్ఞాలను నిర్వహించడమే క్రియ. అవి..

దేవ యజ్ఞం: జపం, హోమం, స్తుతి, అర్చనతో దేవతారాధన చేయడం.
బ్రహ్మ యజ్ఞం: విజ్ఞాన సర్వస్వాలు, విశ్వశ్రేయస్కరాలు అయిన వేదాలను అధ్యయనం చేయడం.
పితృ యజ్ఞం: తల్లిదండ్రులను ఆదరించడం, వారి యోగక్షేమాలను శ్రద్ధగా పట్టించుకోవడం.. వారు స్వర్గస్థులయ్యాక శ్రద్ధతో వారికి పిండతర్పణాదులను సమర్పించడం.
మనుష్య యజ్ఞం: అతిథి, అభ్యాగతులను, బంధు మిత్రులను ఆదరించడం. వారికి తగిన సేవలను అందించడం. మాటలతో చేష్టలతో నొప్పించకపోవడం.
భూతయజ్ఞము: సాధుజంతువులైన గోవులకు ఇతర ప్రాణులకు ఆహారాన్ని అందించడం. ఈ ఐదు యజ్ఞాలను నిర్వర్తించడమే క్రియ.

కల్యాణం: సమస్త ప్రాణులకూ మేలు కలిగేలా త్రికరణ శుద్ధితో వ్యవహరించడం. మాటలతో చేష్టలతో ఎవరినీ హింసించకుండా ఇతరులకు ఉపయోగపడే మాటలనే పలకడం, పనులనే చేయడం.

అనవసాదం: ఎలాంటి సందర్భంలోనూ మనసులో నిరుత్సాహం ఏర్పడకుండా మనసును, శరీరాన్ని శక్తిమంతంగా ఉంచుకోవడం.

అనుద్ధర్షం: సంపదలు పెరిగాయనో, మహోన్నత పదవి లభించిందనో, జ్ఞానమో రూపమో గుణములో తమలో ఎక్కువగా ఉన్నాయనే భావనలతో అతిగా సంతోషమును పొందక పోవడం. ఈ సాధన సప్తకం ఉపాసకులకు అత్యావశ్యకము.    

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

పాదరస మేరు శ్రీయంత్రం

   ‘పాదరస మేరు శ్రీయంత్రం’ పురాతనమైన, అద్బుతమైన, అమూల్య మైన యంత్రాలలో ముఖ్యమైనది, శక్తివంతమైనది. ప్రపంచంలో దేన్నయినా సాదించగలమనే విశ్వాసాన్ని కలిగిస్తుంది. శ్రావణ శుక్రవారం లేదా వరలక్ష్మీ వ్రతం రోజు లేదా దీపావళి రోజు శ్రీయంత్రానికి పూజ చేస్తే లక్ష్మీదేవి మన ఇంట నిలచి ఉంటుంది అని చాలా మంది విశ్వసిస్తారు. ధనం చేతిలో నిలబడని వారు, ధనాభివృద్ధికి  పాదరస శ్రీయంత్రం కుంకుమార్చన చేస్తే మంచిది.

      కొన్ని వేల సంవత్సరాల క్రితమే శ్రీయంత్ర మేరువును పూజించి భవిష్యత్ కార్యక్రమాలపైన మంచి అవగాహన కలగి ఉండేవారు. అమూల్యమైన పాదరస శ్రీయంత్రాన్ని వ్యాపారసంస్ధల యందు,దేవాలయాలలో, పూజా మందిరాలలో, లాకర్స్ నందు ప్రతిష్టించవచ్చు. తమిళ సిద్ధయోగులు పాదరసాన్ని శివుని యొక్క ప్రతి రూపంగా భావిస్తూ, శివ స్వరూపమైన పాదరసాన్ని, అమ్మవారి స్వరూపమైన గంధకంతో ఘనీభవించిగా వచ్చిన అమ్మవారి శక్తి స్వరూపమైన పాదరసమేరు శ్రీయంత్రాన్ని పూజిస్తారు.

   అక్షయ తృతీయ రోజుగాని, దీపావళి రోజుగాని, లాభపంచమి రోజుగాని పాదరస శ్రీయంత్ర సాధన చెయ్యాలి. ప్రాతఃకాలంలో స్నానమాచరించి పాదరస శ్రీయంత్రాన్ని పూజామందిరం దగ్గర పసుపు వస్త్రం పరచి దానిపైన రాగి, ఇత్తడి ప్లేటును ఉంచి దానిలో పసుపు, కుంకుమ కలిపిన అక్షింతలను ఉంచి పాదరస శ్రీయంత్రాన్ని స్ధాపించాలి. 

     ధూపదీప నైవేద్యాలు సమర్పించి శ్రీసూక్తం పఠిస్తూ పూజ అనంతరం అక్షితలు శిరస్సున ధరించి తామరమాలతో గాని, వైజయంతి మాలను గాని ఉపయోగించి “ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌం ఓం హ్రీం శ్రీం క ఈ ల ఏ హ్రీం హసక హల హ్రీం సకల హ్రీం సౌః ఐం క్లీం హ్రీం శ్రీం ఓం నమః అను మహాత్రిపుర సుందరీదేవి మూల మంత్రమును యధావిధిగా జపించి  లలితాసహస్త్రనామంతో కుంకుమార్చన చేసిన సౌభాగ్యం, ధనధాన్యాభి వృద్ధి కలుగుతాయి. ఆఇల్లు సిరిసంపదలకు నిలయంగా మారుతుంది.

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

చంద్రకాంత మణి

     చంద్రుడు జల గ్రహం.నీటిపై ఎక్కువ ప్రభావం చూపుతాడు.సముద్రంలో ఆటుపోటులకు చంద్రుడే కారకుడు.అందుకే అమావాస్య, పౌర్ణమి రోజులలో సముద్రం ఆటుపోట్లకు లోనై ఒకొక్కసారి తుఫాన్ లకు దారి తీస్తుంది.చంద్రుడు మానవ శరీరం లోని రక్తంపై అధిక ప్రభావం కలిగి ఉంటాడు.మన శరీరం అధికభాగం రక్తంతో కూడుకొని ఉంటుంది.

     జాతక చక్రంలో చంద్రుడు నీచ లోవున్న,శత్రు క్షేత్రాలలో వున్న ,అమావాస్య, పౌర్ణమి రోజులలో జన్మించిన వ్యక్తులపై పెద్ద వాళ్ళ దృష్టి లేకపోతే చంచలమైన స్వభావంతో చెడ్డ పనులకు అలవాటు పడతారు .కాబట్టి అలాంటి వారిపై పెద్దవాళ్ళ దృష్టి ఉండటమే కాకుండా సరియైన వాతావరణంలో పెరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జాతకచక్రంలో చంద్రుడు అష్టమంలో వుంటే బాలారిష్ట దోషం ఉంటుంది.

    చంద్రుడు కేంద్ర స్ధానాలలో బలంగా ఉంటాడు. చతుర్ధంలో చంద్రుడు ఉంటే ఆలోచనాశక్తి కలిగి ఉంటాడు. మానసిక ద్రుడత్వాన్ని కలిగిస్తాడు. చంద్రుడు బలహీనపడితే అనవసర భయాలను కలిగిస్తాడు. చంద్రగ్రహ దోషం ఉన్నవారికి ఎడమకన్ను లోపం ఉంటుంది. చంద్రుడు బలహీనంగా ఉంటే తల్లి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు బాల్య దశలోనే చెడు ఫలితాలను ఇస్తాడు. చంచల స్వభావాలను కలిగిస్తాడు. అతిశీఘ్రగతికి కారకుడైన చంద్రుడు బలహీనంగా ఉంటే పనులలో ఆటంకాలు కలిగిస్తాడు. మతిమరుపు కలిగిస్తాడు.

     చంద్రునిపై శుక్రదృష్టి ఉన్న సంగీతం, కళలు, ఆనందం పెంపొందించే ఆటపాటల యందు అనురక్తి కలిగి ఉంటారు. అదే చంద్రుడు బలహీనంగా ఉన్నప్పుడు కళలలో రాణింపు ఉండదు. స్తీల జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే రుతుక్రమం సక్రమంగా ఉండదు. చంద్రుడు, శని కలయిక లేదా సమసప్తకాలలో ఉన్న ద్వికళత్ర యోగానికి దారిటీసే అవకాశాలు ఉన్నాయి.

   చంద్రుడు బలహీనంగా ఉన్న కొన్నాళ్ళు ధైర్యంగా, కొన్నాళ్ళు పిరికితనంగా ఉంటారు. చంద్రుడు బలహీనంగా ఉన్న చంద్రకాంత మణిశిలను ఉంగరంగా గాని, లాకెట్ గాని ధరించటం మంచిది.   

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

శంకుస్ధాపన చేయు విధానం

 

గృహ నిర్మాణానికి ప్రదానాధికారం శంకుస్ధాపనతో ఏర్పడుతుంది. శంకుస్ధాపన వలన గృహ యజమాని నూతన ఉత్తేజాన్ని, మానసిక సంకల్పాన్ని పొందుతాడు. ఆయురారోగ్యాలతో సుఖ శాంతులతో ఉండాలంటే ప్రకృతి సహకరించాలి. అటువంటి ప్రకృతిని మనకు అనుకూలంగా ఉండేటట్లు చేసే నివాసాలను తయారు చేసుకొని సుఖ జీవనం గడపటం కోసం శంకుస్ధాపన పద్ధతిని శాస్త్రరీత్యా అనుసరించి సుఖ జీవనం కలిగించే గృహ నిర్మాణాన్ని చేపట్టాలి. గృహారంభం చేయడానికి యజమాని స్ధల శుద్ధి చేసి ఇంటి నమూనా తయారు చేసి నిపుణుడైన స్ధపతి ద్వారా ఏయే ప్రదేశాలలో వాస్తుపూజ చేయాలో ఎక్కడ శంకుస్ధాపన చేయాలో నిర్ణయిస్తాడు. 

శంకువు నిర్మాణం 
శంకువులు పాల కర్రతోను, చండ్ర కర్రతోను నిర్మిస్తారు. ఈ శంకువులు గృహ నిర్మాణ సమయంలో తప్పనిసరిగా భూమిలో గర్భస్ధానంలో ప్రతిష్ఠించాలి. ఆ శంకువు భూమిలో ఉన్న శల్య దోషాలను, వాస్తు దోషాలను తొలగించి ఆగృహంలో నివసించే వారికి అన్ని విధాల రక్షణ కవచంలా సహాయ పడుతుంది. శంకువు సూచీ ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఏదైనా గుండ్రని వస్తువును సూర్యునికి అభిముఖంగా ఉంచినట్లయితే దాని ఛాయ ఒక నియమిత ప్రదేశం వరకు శంకు ఆకారంలో ప్రయాణం చేస్తుంది. ఈ శంకువునకు శక్తిని ఆకర్షించే లక్షణం ఉంది. అందు చేతనే శ్రీచక్రం  కూడా శంకు ఆకారంలోనే ఉంటుంది. మన దేవాలయాలపై ఉంచే పసిడి కలశాలు చివరలు కూడా శంకు ఆకారంలోనే ఉంటాయి.

        సూర్యుని సహస్త్ర కిరణాల ప్రభావాన్ని ఈ శంకువు తనలోకి ఆహ్వానిస్తుంది. దాని ద్వారా ఆ ఇల్లు శక్తి వంతమైన ప్రాణ శక్తిని ఆ ఇంట్లో ఉండే వాళ్లందరికి పంచుతుంది. తద్వారా గృహంలో ఉన్నవారు ఆయురారోగ్యాలతో సుఖ శాంతులతో వర్ధిల్లుతారు. శంకువును వాస్తు పురుషుని నాభి స్ధానంలో ఉంచటం వలన మానవ శరీరానికి పరిపూరకంగా కావలసిన శక్తిని నాభి ద్వారా అందిస్తుంది. శరీరానికి నాభి ద్వారా మాతృ గర్భంలో ఉన్న శిశువుకు తల్లి ఆహారాన్ని ఎలా అందిస్తుందో అదే విధంగా ప్రకృతి మాట వాస్తు పురుషుని నాబి నుండి ఆ స్ధలానికంతటికి శంకు అనే యంత్రం ద్వారా అందిస్తుంది. 

శంకువు కొలతలు:- 
బ్రాహ్మణులకు  24'' పొడవు 6'' వెడల్పు 
క్షత్రియులకు 20'' పొడవు 6'' వెడల్పు
వైశ్యులకు 16'' పొడవు 6'' వెడల్పు

శూద్రులకు 12'' పొడవు 6'' వెడల్పు 

కాలామృతం, జ్యోతిర్నిబంధం మొదలగు గ్రంధాలు అందరికి 12 అంగుళాల పొడవుగల శంకువు శ్రేయస్కరమని తెలియజేసినాయి. దేవాలయాలకు రాతి శంకువును, మనుష్యాలయాలకు చెక్క శంకువును వాడటం శ్రేయస్కరం. రక్త చందనం, మోదుగ, ఎర్రటేకు, వేప, బిల్వ చెట్లు, వెదురు, తాడి చెట్లు వాడతారు. 

శంకువును 12'' అంగుళాల పొడవు కలిగినది తీసుకొనిన దానిని మూడు భాగాలుగా చేసి అనగా 4'' లుగా విభజించి, శంకువును ఊర్ధ్వముఖంగా ఉంచి కింద 4'' పరిమాణంలో 4 నిలువ గాట్లు, మధ్య 4'' పరిమాణంలో 8 నిలువ గాట్లు పెట్టి చివర 4'' పరిమాణాన్ని చివర కొనను పెన్సిల్ కొన మాదిరి చెక్కి శంకువును ఏర్పాటు చేసుకోవాలి. 

శంకుస్ధాపన 
ప్రస్తుత కాలంలో శంకుస్ధాపన ఇంటికి ఈశాన్యంలో గోయి తీసి దానిలో రాళ్ళు వేసి శంకుస్ధాపన చేస్తున్నారు. గ్రంధ ప్రమాణం ఆధారంగా శంకుస్ధాపన వాస్తుపురుషుని నాభి భాగంలో చేయాలని నిర్దేశించాయి. 

ఈశాన్యం నుండి నైరుతి వరకు గల గృహ నిర్మాణ ప్రదేశాన్ని 28 భాగాలుగా చేసి దానిలో వాస్తు పురుషున్ని లిఖించి ఈశాన్యం శిరస్సు నుండి పదిభాగాలు,  నైరుతి పుచ్ఛం నుండి 17 భాగాలు వదిలేసి మిగిలిన ఒక భాగాన్ని నాభిగా నిర్ణయించాలి. ఈ నాభికి మధ్యస్తంగా శంకుస్ధాపన చేయాలని నిర్దేశించబడింది. శంకువును ఈశాన్య కోణంలో గాని, ఇంద్రస్ధానంలో గాని ఉంచాలి. 

ఈశాన్యకోణంలో శంకువును ఉంచటం వలన పుత్రాభివృద్ధి ఉంటుంది. శంకువును ఈశాన్య కోణంలో వచ్చే పిల్లరు కింద కాకుండా తూర్పు ఈశాన్యంలోగాని, ఉత్తర ఈశాన్యంలోగాని, ఊర్ధ్వముఖంగా స్ధాపించాలి. 

ఈశాన్యంలో శంకువును స్ధాపించ్చేటప్పుడు ఇంకా రెండు ప్రక్రియలను చేయాలని మయుడు తెలియజేసినాడు. అవి 

1) గర్భన్యాసం
2) ప్రధామేష్టికాన్యాసం 

గర్భన్యాసం :- గృహ నిర్మాణ కార్యంలో ముందుగా గర్భన్యాసం చేయాలి. గర్భన్యాసం చేయనిచోట నాశనం కలుగుతుంది. గర్భంలో దాన్యముంచి ఆ పైన రాగిపాత్రను ఉంచాలి. ఆ తరువాత రాగిపాత్రలో సుగంధద్రవ్యాలు (పంచద్రవ్యాలు), పంచ మూలికలు, పంచలోహాలు, సప్త ధాతువులు, నవరత్నాలు, ఔషదులు రాగిపాత్రలో ఉంచి గర్భస్ధాపన చేయాలి. భార్య గర్భవతిగా ఉన్నప్పుడు గర్భస్ధాపన చేయరాదు. 

 ప్రధామేష్టికాన్యాసం:- ప్రధామేష్టికాన్యాసం అంటే ప్రధమ ఇటుకను స్ధాపించటం. మయుని వచనం ప్రకారం ముఖ ద్వారం గల గోడలో ప్రధామేష్టికాన్యాసం చేయాలి. అక్కడ ముఖద్వారం ఏ దిశలో ఉంటే ఆదిశలో గర్భస్ధాపన చేయాలి. ముఖద్వారం సాధారణంగా ఏకాశీతి పద వాస్తువును అనుసరించి తూర్పున మహేంద్రపదంలో, దక్షిణాన గృహక్షత పదంలోను, పడమర పుష్ప దంత పదంలోను, ఉత్తరమున భాల్లాట పదంలోను గర్భస్ధాపన చేయాలి. ఏ ముఖ ద్వారం కలిగిన ఇంటికైనా ఈశాన్య కోణంలో గర్భ గృహానికి తూర్పు ఉత్తర గోడలు కలియు మూల ప్రధామేష్టికాన్యాసం చేసే ఆచారం ప్రస్తుతం అమలులో ఉంది.

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...