Friday, November 30, 2018

తురగా రామకవి


రామకవి బొబ్బ పెద్ద ఫిరంగి దెబ్బ అని ప్రసిద్ధి. ఆయన 1720 ప్రాంతం వారు.
ఆడిదం సూరకవి సమకాలికుడు.
చాటు కవిత్వానికి ప్రసిద్ధులు.

జీవిత విశేషాలు:

భగవదనుగ్రహం వలన  ఆగ్రహానుగ్రహ శక్తిని పొందిన పొందిన కవులు కొందరుండేవారు. వారిలో అందరికీ తెలిసి తిట్టు కవిగా  ప్రఖ్యాతి పొందిన వారు  వేములాడ భీమకవి కాగా,  అంతగా కాకపోయినా అటువంటి శక్తి కలిగిన వాడుగా పేరుపొందిన మరొక కవి శ్రేష్టుడు తురగా రామకవి. ఈయన స్వగ్రామం  తూర్పు గోదావరి జిల్లా లోని తుని లేక ఆ దగ్గర లోని ఏదో గ్రామం. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తరచుగా దేశాటనం వెళ్లి వస్తూ ఉండేవారు. అయనకి అక్కడి చాలా ఆస్థానాల్లో వార్షికాశనాలు ఉండేవి. వార్షికాశనాలంటే  యేడాదికొక్కసారి  ఆ సంస్థానానికి వెళ్లి  అయిదో పదో రోజులు ఆ రాజు గారి ఆతిథ్యాన్ని స్వీకరించి వారిచ్చిన ధనాదికములను స్వీకరించి దీవించి వెళ్లడమన్నమాట.

ఈ కవి గారొక సారి పిఠాపురాన్ని ఏలుతున్న వత్సవాయి తిమ్మరాజు గారి దర్శనం కోరి వారి కోటకు వచ్చారట. అంతకుముందే ఆయన వచ్చి తన వార్షికాన్ని స్వీకరించి వెళ్లి ఉండడం చేత, మళ్ళీ ఏం కోరి వచ్చాడోనని, రాజు గారు దర్శనమివ్వక అనాదరించారట.

 అందుకు కోపగించిన కవిగారు రాజు గారి కోట గోడమీదో తలుపు మీదో  మసి బొగ్గుతో “ పెద్దమ్మ నాట్యమాడును దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని ఇంటన్..” అని వ్రాసేడట. పెద్దమ్మంటే జ్యేష్టా దేవి కదా? చిన్నమ్మి లక్ష్మీ దేవి  అదృష్ట దేవతైతే,  ఆమె అక్కగారు పెద్దమ్మ దురదృష్ట దేవత. అంటే దురదృష్టం రాజు గారి ఇంట నాట్యమాడాలని శపించినట్లన్నమాట.

 కవిగారు అగ్రహించి చేసిన ఈ పని గురించి తెలుసు కున్న రాజుగారు, కవిగారి ఆగ్రహానుగ్రహ శక్తి  ఎరిగిన వాడు కనుక  స్నానం చేస్తున్న వాడు కాస్తా ఆ తడి బట్టలతోనే వచ్చి కవిగారిని శాంతింపజేసి, వారు వచ్చిన కార్యం కనుక్కున్నారట. కవిగారి కోరిక సమంజసమైనది కాక పోయినప్పటికీ రాజుగారు ఎంతో కొంత సంతృప్తి పరచడంతో మొహమాటం చెందిన కవిగారు తన పద్యం లో ముందు భాగాన్ని ఇలా పూరించారట.
“ అద్దిర, శ్రీ , భూ, నీళలు
ముద్దియలా హరికి గలరు, ముగురమ్మలలో
పెద్దమ్మ నాట్యమాడెను
దిద్దిమ్మని వత్సవాయి తిమ్మని యింటన్ ”
చూడండి కవి గారి చాతుర్యం. శ్రీ హరికి, శ్రీదేవి అంటే లక్ష్మీ దేవి, భూదేవి, నీలా దేవి అని ముగ్గురు భార్యలున్నారట. అందులో పెద్దమ్మ అంటే లక్ష్మీ దేవి వత్సవాయి తిమ్మరాజు గారింట నాట్యమాడుతుందనీ అంటే సకల సంపదలతో అతడు తులతూగుతాడనీ దీవించినట్లయ్యింది కదా? అయితే మొదట కవిగారికి జరిగిన నిరాదరణ వల్ల కవి వాక్కు పూర్తిగా వృథా పోలేదనీ  తిమ్మరాజు గారి కాలంలో కాకపోయినా ఆయన మనుమల కాలంలో జమీందారీ కష్టాలపాలై నశించిందన్నదీ ఐతిహ్యం.

ఈ కవి లేటవరపు పోతురాజ అనే క్షత్రియుని యింటికి వెళ్లగా అతడు కవి గారి కి ఏమైనా ఇయ్యాల్సి వస్తుందని, ఇంటిలో వుండి కూడా లేడని భార్య తో చెప్పించాడట. అప్పుడు రామకవి,

 కూటికి గాకులు వెడలెడు| నేటావల మూకచేరి యేడువ దొడగెన్
   గాటికి గట్టెలు చేరెను| లేటవరపు పోతరాజు లేడా లేడా?

అని ప్రశ్నించారట. వెంటనే పోతురాజు చనిపోయినాడట. దహన నిమిత్తం బంధువుల ఇంటి నుండి శవమును తీసుకుని పోతున్నప్పుడు అతని భార్య వచ్చి కవి గారి కాళ్ళమీద బడి పతిభిక్ష పెట్టుమని వేడుకోగా  రామకవి కరుణించి,

 మేటి రఘురాముతమ్ముడు| పాటిగ సంజీవిచేత బ్రతికినరీతిన్
   గాటికి బో నీ కేటికి| లేటవరపు పోతురాజ లెమ్మా రమ్మా.

అని కవి పిలువగానే మరల బ్రతికిలేచి పోతురాజు కాడి మీదనుండి దిగివచ్చాడట!

రామ్ కవి బావయైన తల్లాప్రగడ సూర్యప్రకాశరావు గారు వారి స్వగ్రామము ఉంగుటూరు లో  ఒక పెద్ద యిల్లు కట్టించి, దానిని చూపించటానికి కవి గారిని లోపలికి తీసుకుని వెళ్ళి ఒక గదిలో విడిచి బావమరిది ని ఆట పట్టించాలనుకుని తాను వేరొక గది లో దాక్కున్నారు. కవి గారు ఆ పెద్ద ఇల్లంతా తిరిగి తిరిగి దారి కనుగొనలేక విసిగి,

  అంగణము లెన్ని కేళీగృహంబు లెన్ని
   యోడుబిళ్ల లయిండ్లెన్ని మేడ లెన్ని
   కట్టె గాకేమి సూర్యప్రకాశరాయ
   డుంగుటూ రిండ్ల రాకాసు లుండవచ్చు.

అనగానే కావుకావని అరుస్తూ ఇంటికి నలుమూలల  పట్టపగలు పిశాచాలు సంచరించటానికి వచ్చాయట.

రామకవి ఇల్లు కట్టించుకొంటునప్పుడు దారిని పోయేవారిని అందరినీ పిలిచి తన గోడకు ఇటుకలు అందించమని చెప్పీవారు! ఒకనాడు ఆ దారిన అడిదము సూరకవి గారు పోతుండగా రామ కవి గారు వారిని పిలిచి తక్కినవారిని అడిగినట్లే వారి ని కూడా కొన్ని ఇటుకలు అందిచ్చి పొమ్మని అడుగగా  కోపింతో రామకవి అని తెలియక, సూరకవి

"సూరకవితిట్టు కంసాలిసుత్తెపెట్టు"
అని పలికి పో బోయెనట| రామకవి యామాట విని కన్ను లెఱ్ఱచేసి బిగ్గఱగా,
"రామకవిబొబ్బ పెద్దపిరంగిదెబ్బ"

అని కేకలు వేసారట. అంతట సూరకవి గారు అడిగింది  రామకవి గారు అని తెలిసికొని  వారి నోటి వాక్కు కు భయపడి, కొన్ని ఇటుకలు అందించి  మరీ వెళ్ళారట.!

ఇవి అన్ని కేవలం కల్పిత కథలనే వాళ్ళు ఉన్నారు..

ఇటువంటి మహా మహిమగల వాడన్న వేములవాడ భీమకవి కోమటి పేర కృతి చేసి స్తుతించినట్లే  ఈ రామకవి కూడా కంసాలి పేర కృతి చేసి స్తుతించారు..

ఆయన మరియు అయ్యంకి బాలసరస్వతి అనే మరొక కవి కలిసి రచించిన నాగరఖండము అనే 5 అశ్వాసముల గ్రంథం ఒకటి కనబడుచున్నది.

ఈ ఇద్దరు .కవులు తమ గ్రంథము యొక్క యాశ్వాసాంత గద్యము ను ఈ ప్రకారముగా వ్రాసుకొన్నారు-

"ఇది శ్రీమద్దుర్గాదక్షిణామూర్తివరప్రసాదాసాది సారస్వత తురగా రామకవి వరాయ్యంకి బాలసరస్వతినామధేయ ప్రణీతంబైన శ్రీస్కాందంబను మహాపురాణమునందు సనత్కుమారసంహితను నాగరఖండము"

ఈ నాగరఖండము ధవళేశ్వరపు మార్కండేయుడు అనే స్వర్ణకారుడి కి అంకితము ఇచ్చారు. అతను బెజవాడకు ప్రభువు గా ఉండినట్ల ,క్రింది పద్యము వల్ల తెలుస్తోంది.

రజతాగం బొకరాజమౌళికి వినిర్మాణంబు గావించి యి
    చ్చె జగంబెన్నగ విశ్వకర్మ మును దా జిత్రంబు గా దిప్పు డీ
    బెజవాడప్రభు డియ్య నెంతయును గల్పించున్ ధరిత్రిన్ మహా
    రజతస్వర్ణగృహంబు లెప్పుడు బుధవ్రాతంబు మోదింపగన్.

ఈ ధవళేశ్వరపు మార్కండుడు మహమ్మదు కుతుబ్ షాహి కాలములో ఉన్నట్లు నాగరఖండము యొక్క అవతారికలో ఈ క్రింది పద్యమున చెప్పబడింది.

క. అతడు ప్రసిద్ధి వహించెన్
   క్షితినగరజపతుల గెల్చి చెలగి జయశ్రీ
   సతి జేకొనిన మహమ్మదు
   కుతుపశ హాచంద్రునకును గుడుభుజమనగన్.

నాగరఖండము అను గ్రంథమున కవితా శైలి:

నాగరఖండమునందు గొన్ని వ్యాకరణ విరుద్ధములగు ప్రయోగములు ఉన్నా  మొత్తం మీద కవిత్వము హృద్యముగానే ఉన్నది. నాగరఖండము నుండి కొన్ని పద్యములు

ఉ. ప్రీతియొనర్ప నగ్గిరి నిరీక్షయొనర్ప దరీసరత్ప్రవం
   తీతటజాతరూపధరణీరమణీయమణీసమగ్రమై
   స్ఫీతసుధాంబుపూర సరసీరుహశీకరశీతలానిలా
   న్వీతవిహార దేవతరుణీహరిణీకరిణీసమూహమై.

 ఆదికి నాదికారణ మహర్సతికోటిసమానతేజు డు
   త్పాదితసర్వలోకుడును బ్రహ్మమునై తగు విశ్వకర్మ నా
   నాదినిజాళిలోన భువనంబుల నెల్లను హేతుకార్యక
   ర్త్రాదులు తానయై తగు యథార్థమునుమ్ము మయూరవాహనా.

 ఇచ్చిన నైదుసాధనము లింపుగ నైదుగురున్ ధరించి యు
   ద్యచ్చరిత ప్రశస్తయజనాదిరతుల్ శివతత్వబోధులై
   యచ్చెరు వంద జేసిరి సమస్తజగంబుల దత్క్షణంబునన్
   హెచ్చినయాత్మవర్తనల నెన్నికగాగ సరోజబాంధవా.

 కమలజుకంటె మున్ను శశిఖండశిఖామణికంటెమున్ను శ్రీ
   రమణునికంటెమున్నుగ విరాజిలు బోధకు డైనయట్టిబ్ర
   హ్మముగ మహానుభావుడని యాత్మవివేకముచే నెఱుంగుమా
   యమితపువిశ్వకర్మను మహాత్ముని లోకకృతిప్రవీణునిన్.

కడక గనుంగొనంగ దొలుకారుమెఱుంగులు గ్రుమ్మరింపగా
   నడుగిడ గల్లుగల్లు మను హంసకనాదము హంసరావమున్
   దడబడ బద్మరాగసముదాయముదాపున నేపు చూసి యె
   ల్లెడల బదాగ్రరాగరుచు లీనగ వచ్చెను గౌరి వేడుకన్.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...