Friday, August 24, 2018

జంధ్యాల పౌర్ణమి

శ్రావణపౌర్ణమిని ‘జంధ్యాలపౌర్ణమి’ అని కూడా అంటారు. జంధ్యాల పౌర్ణమిగా పిలుచుకునే శ్రావణ పౌర్ణమి రోజున నూతన యజ్ఞోపవీతములు ధరించి వేదాధ్యయనానికి శ్రీకారం చుడతారు. యఙ్ఞోపవీధారణకు యోగ్యత గల ప్రతివారు శ్రావణపౌర్ఱమినాడు, విధిగా నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలి. ఎందుకంటే, యఙ్ఞోపవీతంగల ప్రతివారు, నిత్యకర్మానుష్ఠాన యోగ్యతకోసం, ప్రతినిత్యం సంధ్యావందనం చేసితీరాలి. కానీ, ఏదోఒక కారణంగా, ఏదోఒక సందర్భంలో తెలిసో తెలియకో, ఈ నియమానికి భంగం జరిగే అవకాశం వుంది. ఒకవేళ అదే జరిగితే, ధరించిన యఙ్ఞోపవీతం శక్తిహీనమైపోతుంది. అటువంటి పరిస్థితిలో నూతన యఙ్ఞోపవీతిన్ని ధరించాలి. ఇలాంటి పొరపాట్లనుసరిదిద్దడానికే ‘శ్రావణపౌర్ణమి’ నాడు నూతన యఙ్ఞోపవీతాన్ని ధరించాలనే నియమాన్ని మన పూర్వులు ఓ ఆచారంగా ఏర్పాటుచేసారు. పూర్వకాలంలో కొత్తగా వేదం నేర్చుకునే వారు కూడా ఇదే రోజున విద్యాభ్యాసం ఆరంభించేవారు.ముహూర్తంతో పనిలేకుండా ఈ రోజు ఉపనయనాలు చేసే సంప్రదాయం కొన్ని ప్రాంతాల్లో ఉంది.

య జ్ఞో ప వీ త ము

యజ్ఞధృతం ఉపవీతం - యజ్ఞోపవీతం లేక యజ్ఞసూత్రమనియు నందురు. బౌధాయనః|| కౌషంసౌత్రం, త్రిస్తివ్రృతం, యఘ్నోపవీతమానామేః| మనుః - కార్పాసముపవీతంస్యాత్‌.

కార్పాసముపవీతం, షట్తస్తుత్రివృతం, బ్రాహ్మణస్య అను థర్మశాస్త్రకారుల వచనముల ననుసరించి, ప్రత్తితో వడికిన దారములు మూడు పొరలతో చేర్చి నొక్కపోగువలె మూడు పోగులుకు మూడు మూడులతొమ్మిది పోగులుండులాగున యజ్ఞోపవీతము ధరింపదగినది.

యజ్ఞోపవీతం కుర్వీతసూత్రాణినవతన్తవః ఏ కేనగ్రంధినాతన్తుస్తిగ్రుణోధనా.

యనురీతిని తొమ్మిది పోగులతో చేర్చిన మూడుపోగులను "బ్రహ్మముడి' యనుపేర నొకముడి వేయదగినది. ""ఏకోగ్రంధిరీతి, నానాత్వ నిషేధార్థం'' యనురీతిని యొ కేముడి యుండదగినది. ఇట్టి నవతన్తు నామకయజ్ఞోపవీతథారణార్థమై గర్భాష్ఠమేబ్దే బ్రాహ్మణస్యోపనయనంశస్తం'' అను ధర్మాన్ని పురష్కరించుకొని యేడవ వర్షముననే యుపనయనము బ్రాహ్మణ బాలునకు చేయుట యుత్తమము.

షోడశవర్షాణాం ఉపనయనాంగయప్రతీయతే
పతితా యస్యసావిత్రీదశవర్షాణింపంచచా,

అనురీతిని పదు నేడు సంవత్సరములు కాగానే సావిత్రీ పతితుడగును, గాన పదునారు సంవత్సరములలోపుగనే బ్రాహ్మణ బాలున కుపనయనము చేయుట ముఖ్యము.

""బ్రాహ్మణో యజ్ఞోపవీత్యధీతే'' యను తైత్తిరీయారణ్యకమున యజ్ఞొవీతము బ్రాహ్మణునకు ముఖ్యాతిముఖ్యమని వచింపబడియున్నది,

నవతన్తు యజ్ఞోపవీతమునకు అధిపతులు

ఓంకారః ప్రథమస్తన్తుః
ద్వితీయోగ్నిస్తధైవచ
తృతీయోభగదైవత్యః
చతుర్థస్సోమదైవతః
పంచమః పితృదైవత్యః
షష్ఠశ్చెవప్రజాపతి ః
సప్త మోవిష్ణుదైవత్యః
దర్మశ్చాష్టమఏవచ
నవమః సర్వదైవత్యః

ఇత్యే తేనవతన్తవః.

"వినాయచ్ఛిఖయాకర్మ, వినాయజ్ఞోపరీతతః|
రాక్షసం తద్ధి విజ్ఞేయం, సమస్తాన్నిష్నలాఃక్రియాః

అను ధర్మము ప్రకారము, శిఖ లేకపోయిననూ, యజ్ఞోపవీతము లేకున్ననూ, వైదికకార్యము లాచరించినచో నిష్పలములే గాన, శిఖా యజ్ఞొపవీతములు సంధ్యావందనమునకుగూడ ముఖ్యమనియే గ్రహింపదగినది.

నాభేరూర్థ్వ మనాయుష్యం| అధోనాభేస్త పక్షయః|
తస్మాన్నాభిసమం కుర్యాత్‌, ఉపవీతం విచక్షణఇతి.

యను రీతిని యజ్ఞొపవీతము నాభికి సమంగా పొడవుండదగినదిగాని, నాభి కూర్థముగానున్నచో ఆయుస్సు క్షీణించును, నాభికి క్రిందనుండినచో చేసిన జపాది తపస్సు నశించును గాన నాభి సమంగా యజ్ఞొపవీతమున్నది లేనిది గమనించి నాభి సమంగా నొనర్చుకొని సంధ్యావందనాది కర్మలాచరింపదగినది.

"స్తనాదూర్థ్వం, అథోనాభేఃనకర్తవ్యంకదాచనా'' అనురీతిని నాభికి పైకినుండరాదు, నాభికి క్రిందికి నుండరాదు. నాభి సమంగానుండుటయే శ్రేయము.

శిఖా యజ్ఞొపవీతము లెప్పటికి ధరించియే యుండవలయును గాని, అవసరమగుతరిని యుంచుకొని మిగతా సమయములలో తీసివేయరాదు. ఇందుకు ప్రమాణంగా ధర్మశాస్త్రకారిట్లు వచింతురు.

కాయస్థమేవతత్కార్యం, ఉత్థాప్యంనకదాచన|
సదోపవీతినాభావ్యం, సదాబద్ధశిఖేనచ||

ఎప్పటికి శరీరముననే థరించియుండదగిది. శిఖను ముడివేసియే నుంచదగినది. ఉతవీతిగనే యజ్ఞోపవీతము థరించియుండదగినది. ఈరీతిని శిఖా యజ్ఞోపవీతములు థరించి యుపనయన ప్రభృతి గాయత్రీ యనుష్ఠానమున కుపక్రమింపదగియున్నది.

మౌంజీబంధదినే తిష్టేత్‌ సావిత్రీమభ్యసన్‌ గురోః
సూర్యేస్తశిఖరం ప్రాప్తే సాయం సంధ్యాం సమభ్యసేత్‌.

ఉపనయనమున వెంటనే నిలచియే సాయంకాలమువరకు సావిత్రీయుపాసనము (గాయత్రీజపము) చేయుచండవలయును. సూర్యాస్తమయమగుతరిని సాయంసంధ్యా వందనము చేయదగినది.

ఉపనయన వటువు సంధ్యావందనమువలెనే మరునాటినుంచి బ్రహ్మయజ్ఞముగూడా నాచరింపవలయును. వేదాద్యయనమే ప్రారంభించలేదు గాదా? బ్రహ్మయజ్ఞమెట్లు చేయడమను సందియముగలుగవచ్చును. అందులకు ధర్మకారుల సమాధానము పరికించునది.

ఆరభేత్‌ బ్రహ్మయజ్ఞన్తు, మధ్యాహ్నెతు పరేహని మరుదినము మథ్యాహ్నమునుంచి బ్రహ్మయజ్ఞముగూడా చేయవలయును.

అను పాకృత వేదస్య, బ్రహ్మయజ్ఞః కథంషవేత్‌|
వేదస్థానేతు గాయత్రీ గద్యతేన్యత్స మంభవేత్‌||

వేదము రాకపోయిననూ వేదస్ధానమున గాయత్రీ మంత్రమే పఠింపదగినది

వేద మథ్యాపయేత్‌ ఏనం, శౌచాచారాంశ్చ శిక్షయేత్‌ ||

ఉపనయనము చేసిన వటువునకు వేదము నేర్పించవలయును. శౌచాచారాదులలో బాగా శిక్ష యిప్పించవలయును.

దివా సంధ్యాసుకర్ణన్థః బ్రహ్మసూత్రః ఉదఙ్ముఖః
కుర్యా న్మూత్ర పురీషేవా రాత్రౌచేద్దక్షిణాముఖః||

ఉపనయన వటువు శౌ చా చా ర ము లు తప్పక పాటించడము నేర్వదగియున్నది గాన, పగలుగాని సంధ్యాకాలములలోగాని మూత్ర పురీషములు విడువదగినచో, యజ్ఞొపవీతము కుడి చెవునకు చుట్టుకొని ఉత్తరముఖముగ కూర్చొని మూత్ర పురీషాదులు వదలదగినది.

రాత్రికాలమున మూత్ర పురీషాదులు వదలవలసివచ్చినచో యజ్ఞోపవీతము చెవునకు (కుడిచెవుకు) చుట్టుకొని దక్షిణాభి ముఖముగకూర్చొని విడువదగినది,

మధు మాంసాం జనోచ్ఛిష్టశుక్తం, స్త్రీప్రాణిహింసనం,
భాస్కరాలోకనా శ్లీల పరివాదాది వర్జయేత్‌

మధు మాంసములు తినరాదు, ఎంగిలి తినరాదు. నిష్ఠురమైన మాటలు పలుక రాదు. (శుక్తం-నిష్ఠుర వాక్యం) స్త్రీలను తదితప్రాణి లోకమును బాధించరాదు, సూర్యుని చూడ రాదు. అశ్లీలమైన పలుకులు పలుక రాదు కొట్లాడరాదు. ఈ నియమములు బ్రహ్మచారి (ఉపనయనమైన బాలునకు బ్రహ్మచారి యని పేరు) తప్పక యాచరింపదగినది. ఈ నియమములు విధిగ పాటించుచు సంథ్యావందనము చేయుచు వేదాధ్యయనము చేయుట ముఖ్యము.

...ఇట్లు...
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...