Thursday, March 8, 2018

హనుమంతుడి శరీరానికి సింధూరం ఉంటుందేం?

🕉🕉🕉🕉🕉🕉

ఒంటి మీద సింధూర వర్ణం లేని హనుమంతుని విగ్రహం అరుదు. ఇంతకీ ఆంజనేయుడు అలా సింధూరపు రంగులో ఎందుకు ఉంటాడు! అనే సందేహం వెనుక అందరికీ ఆదర్శవంతమైన ఓ కథ ఉంది. అదేమిటంటే...

ఒక రోజు హనుమంతులవారు శ్రీరాముని అంతఃపురంలోకి ప్రవేశించారు. అలా ప్రవేశించే సమయంలో సీతమ్మ తన పాపిట సింధూరాన్ని అద్దుకోవడం గమనించాడు ఆంజనేయుడు. సీతమ్మవారు అలా పాపిట సింధూరాన్ని అలముకోవడం చూసి ఆయనకి భలే ఆశ్చర్యం వేసింది.

సీతమ్మ చెంతకి అడుగులో అడుగు వేసుకుంటూ ‘అమ్మా! మీరు నుదుటిన ఆ సింధూరాన్ని ఎందుకు ధరిస్తున్నారు’ అని అడిగాడు. ‘హనుమా! నా స్వామికి సంతోషాన్ని కలిగించేందుకు ఇలా రోజూ సింధూరాన్ని ధరిస్తాను. పైగా ఇలా పాపిట సింధూరాన్ని ధరించడం వల్ల ఆయన దీర్ఘాయుష్షులుగా ఉంటారన్నది నా నమ్మకం!’ అంటూ చిరునవ్వుతో సెలవిచ్చింది జానకి.

సీతమ్మ మాటలు విన్న హనుమంతుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సీతమ్మ పాపిట సింధూరం వెనుక తన స్వామి శ్రేయస్సు, సంతోషం ఉన్నాయా? అనుకుని మురిసిపోయాడు. వెంటనే ఆయన మనసులో ఒక ఉపాయం మెదిలింది. ఈ కాస్త సింధూరాన్ని ధరిస్తేనే స్వామివారి ఆయుష్షు పెరుగుతుందంటే... మరి ఒంటినిండా సింధూరాన్ని ధరిస్తే తిరుగేముంది అనుకున్నాడు. అనుకున్నదే ఆలస్యం, తన ఒంటినిండా నూనె కలిపిన సింధూరాన్ని దట్టించాడు.

శిరసు నుంచి పాదాల దాకా సింధూర వర్ణంలో మెరిసిపోతున్న ఆంజనేయుడు... నేరుగా రాముని దర్బారులో ప్రవేశించాడు. ఆ స్థితిలో హనుమంతుని చూసిన రాముడు ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. ‘ఏమిటి హనుమా! ఒంటి నిండా ఏమిటా రంగు’ అని చిరునవ్వుతో అడిగాడు.

‘స్వామీ! సీతమ్మ తన పాపిట సింధూరం ధరిస్తే మీకు సంతోషమూ, ఆయుష్షూ వృద్ధి చెందుతాయని సెలవిచ్చారు... మరి నేను ఒంటి నిండా సింధూరాన్ని అలముకుంటే మరెంత శ్రేయస్సు కలుగుతుందో కదా! అందుకనే ఇలా...’ అంటూ చెప్పుకొచ్చాడు.

మనుమంతుని మనసులో తన పట్ల ఉన్న ఆరాధనని గమనించిన రాముని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ‘హనుమా! నువ్వు నా భక్తులందరికీ మరోసారి ఆదర్శంగా నిలిచావు. ఇక మీదట ఎవరైతే నీ సింధూరాన్ని ధరిస్తారో... వాళ్లు నీ అనుగ్రహానికే కాదు, నా అనుగ్రహానికి కూడా పాత్రులవుతారు’ అంటూ ఆశీర్వదించారు.

అదిగో అప్పటి నుంచీ హనుమంతుల వారు నిత్యం సింధూరవర్ణంలో మెరిసిపోవడం, ఆయన సింధూరాన్ని మనమూ కాస్త నుదుటిన అద్దుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆయన అనుగ్రహమూ భక్తులకు లభిస్తోంది.

🕉🕉🕉🕉🕉🕉

ముహూర్త భేదాలు

🕉🕉🕉🕉🕉🕉

కార్యసాధకుడికి మనోనిశ్చయమే ప్రధానం. శుభాశుభ ముహూర్తాల విచారణ అవసరం లేదు. ఈ దేహం పతనమవుతున్నా సరే, మనోనిశ్చయంతో కార్యాన్ని సాధించాలన్నది తైత్తరీయోపనిషత్‌ సందేశం.

కార్యం పవిత్రమైనదే అయితే ఆ కార్యసాధకుడు ముహూర్తబలం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుతో అంటాడు.

రాయబారానికి వెళుతున్న శ్రీకృష్ణునితో ప్రయాణానికి ముహూర్తం బాగాలేదని పాండవులు సూచిస్తే... 'అయిననూ పోయి రావలె హస్తినకు' అంటాడు కృష్ణుడు. మనం తలపెట్టిన కార్యం స్వప్రయోజనానికి కాకుండా సమాజానికి అవసరమైనదైతే చాలు- అలాంటి కార్యాన్ని ఎప్పుడు ప్రారంభించినా అదే సుముహూర్తమవుతుంది.

కాలం అనేది ప్రాపంచికమైనది. కాలానుగుణంగా తిథి వార నక్షత్రాలు మారుతుంటాయి. పరంలో కాలమనేదే లేదు. ఇహ పరాల్లోని అన్నీ బ్రహ్మమేనని ఉపనిషత్తులు చెబుతున్నాయి. కాలం సైతం బ్రహ్మమే కనుక సుముహూర్తమనీ, దుర్ముహూర్తమనీ భేదాలు లేవు. యద్భావం తద్భవతి అన్నట్లుగా భావాన్ని అనుసరించి మాత్రమే కాలం మనకు గోచరమవుతుంది.

కర్రతో గుర్రం వంటి ఆకారాన్ని తయారుచేసి ఉంచారనుకుందాం. కొంతదూరం నుంచి గమనించినవారికి అది నిజమైన గుర్రంగానే కనిపిస్తుంది. ఆ సమయంలో మన దృష్టికి కర్ర కనబడదు. కర్ర అనే పదార్థం గుర్రం ఆకారంలో లీనమై ఉంటుంది. మనం దగ్గరకు వెళ్లి చూశామనుకోండి. అప్పుడు ఆ ఆకారం మొత్తం కర్రమయమై కనిపిస్తుంది. అంతవరకు కనిపించిన గుర్రం ఆ కర్రలో లీనమైపోతుంది. అదేవిధంగా ఈ భూమిపైన కాలంలో సుముహూర్తం దుర్ముహూర్తంగా కనపడినా, నిశితంగా గమనిస్తే కాలం యావత్తు బ్రహ్మమయమై ఉంటుంది. అలాంటప్పుడు చెడు, మంచి ముహూర్తాలెక్కడివి?

కాల గమనాలన్నీ కాల్పనికాలేనని యముడు నచికేతుడికి చెప్పినట్లుగా కఠోపనిషత్తులో ఉంది. అటువంటి వాక్కుల నేపథ్యంలో తిథి, వార, నక్షత్రాల్లో మంచివి కొన్ని, చెడువి కొన్ని ఉంటాయని ఎలా చెప్పగలం?

జరాసంధుడి వధను లక్షించి శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు బ్రాహ్మణుల వేషంలో మగధకు బయలుదేరతారు. మగధలో అడుగు పెట్టేటప్పుడు అర్జునుడు శ్రీకృష్ణునితో అంటాడు- 'బావా! శత్రువును జయించేందుకు ముగ్గురం బ్రాహ్మణ వేషంలో బయలుదేరాం... బ్రాహ్మణత్రయం శుభం కాదు కదా' అని ప్రశ్నిస్తాడు. శ్రీకృష్ణుడు 'బావా! మూఢ నమ్మకాలు మంచివి కావు. శత్రు సంహారంవల్ల దుష్ట శిక్షణ జరుగుతుంది. జరాసంధుడి మరణ సమయమే మనకు సుముహూర్తం' అంటాడు. జరాసంధుడి వధ నిరాటంకంగా సాగుతుంది.

కాలాలు ముహూర్తాలు అనేవి అత్యంత ప్రభావం కలిగి ఉంటాయి. ముహూర్తాలు ఇలాంటివే! కాల స్వరూప స్వభావాలు ముహూర్త బలాలు ఇలా ఇంటాయని చెప్పడం కష్టమని రఘువంశంలో కాళిదాసు వివరిస్తాడు. సాధారణంగా అష్టమి నవములు మంచి తిథులు కావని భావిస్తారు. నవమి తరవాత దశమి వస్తుంది. దశమి తిథి అన్ని విధాలా మంచి రోజని చాలామంది విశ్వసిస్తారు. మరి శ్రీరామచంద్రుడు శుక్లపక్ష నవమి రోజు ఎందుకు జన్మించాడు? ఆ మరుసటి రోజు చాలా మంచిది కదా! ఇదే ప్రశ్నను దశరథుడు వశిష్ఠుని అడుగుతాడు. అందుకు ఆయన బదులిస్తూ 'రాజా! ఈ మహాపురుషుడు కారణజన్ముడు. కార్యసాఫల్యం కోసం అవతరించినవారికి జన్మించడమే ప్రధానం కాని తిథి, వార, నక్షత్రాలు కాదు. మనోనిశ్చయంతో ఉన్నవాడు కాలానికి సైతం ఎదురీదగలడు. ముహూర్తబలం కన్నా ఆత్మబలం గొప్పది కదా దశరథ మహారాజా!' అంటాడు.

జీవన్ముక్తులకు శుభాశుభ ఘడియలు ఉండవు. మూఢ నమ్మకాలు అవిద్యకు సంకేతమని రమణ మహర్షి బోధించేవారు. పూర్ణచంద్రుడు ఉదయించిన రాత్రినీ, అమావాస్య నిశినీ ఒకే రీతిలో ఆస్వాదిస్తానని ఆయన అనేవారు.

వశిష్ఠుడు శుభ ముహూర్తమని తలచిన రోజునే శ్రీరాముడు అరణ్యవాసం వెళ్లాడు. 'మంచి రోజని రేపు తలపెట్టిన కార్యాన్ని ఈ రోజే చేసెయ్‌. ఈ రోజు తలపెట్టిన కార్యాన్ని ఇప్పుడే ప్రారంభించు' అంటాడు కబీర్‌!

సూర్యుడు రోజూ ఉదయిస్తాడు. రాత్రి కాగానే అస్తమిస్తాడు. ఆదిత్యుడికి తిథి, వార, నక్షత్రాల పట్టింపులు లేవు. విధి నిర్వహణే ఆ ఆదిత్యుడికి ముఖ్యం. కార్యసాధకుడెప్పుడూ కాలం కోసం వేచి ఉండరాదు. కార్యం మంచిదైతే కాలం సైతం సహకరిస్తుంది. దుర్ముహూర్తం కూడా సుముహూర్తంగా మారుతుంది!

🕉🕉🕉🕉🕉🕉

నీ భక్తి ఎంత....?


      
*కాశీ విశ్వనాథుని ఆలయంలో అర్చకుడు లింగాభిషేకం చేస్తున్నాడు.*

ఇంతలో ఆలయం వెలుపల పెద్ద శబ్దమైంది.

*పూజారి బయటకు వచ్చి చూడగా.*

పెద్ద బంగారు పళ్లెం ఒకటి కనిపించింది.

*వెళ్లి చూడగా...*
*దానిపై*

‘నా భక్తుని కొరకు’
అని రాసి ఉంది.

*ఈ బంగారు పళ్లాన్ని విశ్వనాథుడు తన కోసమే పంపాడని పూజారి సంతోషించాడు.*

పళ్లాన్ని తీసుకుందామని ముట్టుకోగానే...

*అది మట్టిపాత్రగా మారిపోయింది.*

విడిచి పెట్టగానే మళ్లీ బంగారు రంగులో మెరిసిపోతూ కనిపించింది.

ఈ విషయం ప్రజలందరికీ తెలిసింది.

*ఆలయం కిక్కిరిసిపోయింది.*

ఒక్కో భక్తుడు రావడం...
పళ్లాన్ని ముట్టుకోవడం...
అది మట్టిపాత్రలా మారిపోవడం...
ఇదే తంతు!

*విషయం కాశీ రాజుకు తెలిసింది.*

రాజ్యంలో తనకన్నా గొప్ప భక్తుడు లేడంటూ ఆలయానికి వెళ్లాడు.

*జనులందరూ చూస్తుండగా బంగారు పళ్లాన్ని పట్టుకున్నాడు.*

అది మట్టిపాత్రగా మారిపోవడమే కాదు... నలుపు రంగులో కనిపించింది.

*తానెంత అధముడనో రాజుకు అర్థమైంది.*

అవమాన భారంతో అక్కడి నుంచి నిష్క్రమించాడు.

*ఇంతలో ఓ పెద్దాయన ఆలయం మెట్లు ఎక్కుతూ లోనికి వస్తున్నాడు.*

మెట్ల మీద కూర్చున్న బిచ్చగాళ్లను చూసి చలించిపోయాడు.

కళ్లు లేని వాళ్లను చూసి కంటతడి పెట్టుకున్నాడు.

*‘విశ్వనాథా !*
*ఆ అభాగ్యుడికి చూపు ప్రసాదించు తండ్రి’*
*అని మొరపెట్టుకున్నాడు.*

మెట్లు ఎక్కడానికి ఇబ్బంది పడుతున్న ఒక కుంటివాడికి సాయం చేశాడు.

ఆకలితో అలమటిస్తున్న ఓ ఆడమనిషికి దేవుడి నివేదన కోసం తెచ్చిన రెండు ఫలాలనూ ఇచ్చేశాడు.

*చివరగా ఆలయంలోకి వచ్చాడు.*

స్వామివారిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు.

ఇంతలో పళ్లెం సంగతి తెలిసింది.

*ఈ వింతేమిటో తెలుసుకుందామని అటువైపు వెళ్లాడు.*

దూరంగా నిల్చుని చూస్తున్నాడు.

తిరిగి వెళ్లిపోబోతోంటే.. ఆలయ పూజారి..

*‘ఓ పెద్దాయన... నువ్వూ వచ్చి ముట్టుకో... రోజూ* *గుడికొస్తావ్‌గా, నీ భక్తి*
*ఏ పాటిదో తెలిసిపోతుంది’*
అని హేళనగా అన్నాడు.

పెద్దాయన వెళ్లి పళ్లెం పట్టుకున్నాడు.

అది మరింత బంగారు వన్నెల్లో మెరిసిపోతూ కనిపించింది.

*అందరూ ఆశ్చర్యపోయారు.*

అర్చనలు, అభిషేకాల భక్తికి నిదర్శనాలు కాదు.

*ఆపన్నులను ఆదుకునే తత్త్వం ఉండటమే నిజమైన భక్తి.*

అలాంటివారే నిజమైన ఆధ్యాత్మికవాదులు.

*నా జీవితం లోనివి*
*కష్టాలు కాదు,*
*భగవంతుని వరాలు!*

నేను శక్తిని అడిగాను --
*భగవంతుడు నాకు కష్టాన్ని ఇచ్చి శక్తిని పొందమన్నాడు.*

నేను సంపదను అడిగాను--
*భగవంతుడు నాకు మట్టిని ఇచ్చి బంగారం చేసుకోమన్నాడు.*

నేను ధైర్యాన్ని అడిగాను --
*భగవంతుడు నాకు ప్రమాదాలు ఇచ్చి ధైర్యం వహించమన్నాడు.*

నేను వరాలు అడిగాను --
*భగవంతుడు నాకు అవకాశాలు ఇచ్చాడు.*

నేను ఆయన ప్రేమను అడిగాను-
*భగవంతుడు ఆపదల్లో ఉన్నవారి చెంతకు నన్ను పంపించాడు.*

నేను జ్ఞానాన్ని అడిగాను -
*భగవంతుడు నాకు సమస్యల్ని ఇచ్చి పరిష్కరించమన్నాడు.*

నేను పురోగతి అడిగాను -
*భగవంతుడు నాకు అవరోధాలు కల్పించి సాధించమన్నాడు.*

నేను లోకానికి మంచి చెయ్యాలని అడిగాను -
*భగవంతుడు ఇబ్బందులు కల్పించి అధిగమించమన్నాడు.*

నేను ఆయన్ను మరువకూడదు
అని అడిగాను --
*భగవంతుడు భాధలు ఇచ్చి ఆయన్ను గుర్తుంచుకోమన్నాడు.*

నేను పాపాలు క్షమించమని అడిగాను --
*భగవంతుడు ధ్యాన సాధన చేసుకోమన్నాడు.*

అలా జీవితంలో నేను కోరుకున్నదేదీ పొందలేదు -
*నాకు కావలసిందే నేను పొందాను.*

ఈ విధంగా జీవితంలో జరిగే ప్రతీ సంఘటననుండి నాకు *అవసరమైనది పొందటం నేను నేర్చుకున్నాను.*

సుభాషితాలు

🌹 *అరక్షితం తిష్ఠతి దైవ రక్షితం*
*సురక్షితం దైవ హతం వినశ్యతి*
*జీవత్య నాధోపి వనే విసర్జితః*
*కృత ప్రయత్నో పి గృహే న జీవతి* 🌹

దైవానుగ్రహమున్నచో యితర రక్షణలు లేకున్నను జీవించును.దేవుని దయ లేకపోతే
యెంత సురక్షిత ప్రదేశమందు వున్నను ప్రాణి నశించును అడవిలో దిక్కులేకుండా 
పారవైచిన వాడు బ్రతికి బాగుంటున్నాడు. గృహమున సురక్షితముగ నున్నవాడు  యెంత
ప్రయత్నించిననూ దక్కకుండా పోతున్నాడు.కదా! దీనికి కారణము మనకు తెలియని ఒక మా శక్తి అని చెప్పక తప్పదు..
మొన్న వార్తలలో రైల్లో ని మరుగు దొడ్లో ఒక స్త్రీ ప్రసవించి బిడ్డ జారి కింద పట్టాల దగ్గర
పడినాడు. ఆ స్త్రీని బంధువులు ఆసుపత్రి లో చేర్పించినారు.పట్టాల దగ్గర ఏడుస్తున్న పసివాడిని ఒకతను తీసుకొని వెళ్లి అదే ఆసుపత్రి లో అప్పగించినాడు.అది ఆమె బిడ్దేనని నిర్ధారించి ఆమెకు అప్ప జెప్పినారు.తల్లీ బిడ్డలు క్షేమమ మని ప్రకటించారు..యిది దైవానుగ్రహ మే కదా!
దైవానుగ్రహం లేనివాడికి ఆపదలెలావస్తాయో భర్తృహరి తన సుభాహితాలలో ఈ
పద్యం చెప్పారు.

🌹 *ధర ఖర్వాటు డొకండు సూర్య కర సంతప్త ప్రధానాంగుడై*
*త్వర తోడన్ బరువెత్తి చేరి నిలచెన్ దాళద్రుమ ఛాయ,ద*
*చ్చిరముం దత్ఫలపాత* *వేగమున విచ్చెన్ శబ్ద యోగంబుగా*
*బొరి దైవోపహతుండు పోవుకడకున్ పొవుగదా యాపదల్* 🌹

💐 *అర్థము:-* 💐

ఒక బట్టతలవాడు మధ్యాహ్నకాలములో దారివెంట వెడుతూ ఎండ వేడికి
తట్టుకోలేక అక్కడ ఈ చెట్టూ లేకపోవుట చే తాటి చెట్టు క్రింద నిలుచున్నాడు.
.అంతలో ఒక కాకి వచ్చి ఆ చెట్టుమీద వాలి తనముక్కుతో తాటి పండును పొడిచింది.ఆ పండు తెగి పోయి వేగముగా వచ్చి ఆ బట్టతలవాడి తల మీద పడింది.దానితో అతని తల పెద్ద శబ్దముతో చీలింది.దైవానుగ్రహము లేనివాడి వెంటనే ఆపదలు వెళతాయి."అందుకే కాకతాళీయము'అనే మాట పుట్టింది.ఏదైనా అనుకోకుండా జరిగితే ఈ మాట లోకములో వాడుతుంటారు.

🌹 *వృశ్చికస్య విషం పుచ్ఛం  మక్షికస్య విషం శిరః*
*తక్షకస్య విషం దంష్ట్రౌ సర్వా౦గం  దుర్జనే విషం* 🌹

తేలుకు తోకలో విషముంటుంది, ఈగకు తలలో విషముంటుంది, పాముకు కోరల్లో విషముంటుంది. కానీ దుర్మార్గునికి నిలువెల్లా విషమే నిండి ఉంటుంది. వాడితో జాగ్రత్తగా ఉండవలయును.

🌹 *కోటరా౦తర్భవో వహ్ని: తరమేకం దహిష్యతి*
*కుపుత్రస్తు కులే జాతః స్వకులం నాశయేత్పరం* 🌹

చెట్టుతొర్రలో పుట్టిన నిప్పు ఆ చెట్టును మాత్రమే కాలుస్తుంది. కానీ కుపుత్రుడు కలిగినచో యావత్తూ  వంశానికే చేటు కలుగుతుంది.

🕉🕉🕉🕉🕉🕉

ధ్యానయోగ సాధనకి విఘ్నలు ఏమిటి??? అతిగా భుజించువారికి,ఏ మాత్రము భుజించని వారికి అలానే అతిగా నిద్రించువారికి ఏ మాత్రము నిద్రిమ్పక మేల్కొని ఉండే వారికి ధ్యాన యోగము సిద్దించకుండా ఉండటానికి కారణం ఏమిటి??

🕉🕉🕉🕉🕉🕉

*శ్రీమద్భగవద్గీత*
*6:16*

నాత్యశ్నతస్తు యోగోస్తి
న చైకాంత మనశ్నతః,
న చాతిస్వప్నశీలస్య
జాగ్రతో నైవ చార్జున.

అర్జునా! ఈ ధ్యానయోగము అధికముగ భుజించువానికిని, బొత్తిగా భుజింపనివానికిని, అట్లే అధికముగ నిద్రించువానికిని, (బొత్తిగా నింద్రించక) ఎల్లప్పుడు మేలుకొని యుండువానికిని కలుగనే కలుగదు.

🌺 *పూర్తి వివరణ* 🌺

అతిగా భుజించుట వలన మత్తు వస్తుంది,సోమరితనము ఏర్పడుతుంది. జీర్ణ శక్తిని పట్టించుకోక అతిగా తిన్నచో వివిధ రోగములు ఉత్పన్నమగును. అట్లే ఆహారము పూర్తిగా త్యజించినచో వాని ఇంద్రియములు,ప్రాణములు,మనస్సు శక్తి హీనములు అవుతాయి. అప్పుడు అతను ఆసనముపై స్థిరంగా కూర్చోలేడు. పరమేశ్వరుడు యందు మనస్సు లగ్నము చెయ్యలేడు. ఈ విధముగా ధ్యాన సాధనకి విఘ్నము ఏర్పడుతుంది. కావున ధ్యాన యోగి అవసరముకి మించి భుజించరాదు. కటికి ఉపవాసములు చేయరాదు.

తగినంతగా నిద్రించుట వలన అలసట తొలగి,చురుకుదనం ఏర్పడుతుంది. ఆ నిద్ర అవసరం కంటే ఎక్కువ అధికమైనచో తమోగుణము హెచ్చును. దీని వలన సోమరితనం ఆవహింస్తుంది.స్థిరముగా కూర్చోవడం కష్టం అవుతుంది. దీనికి తోడు అతిగా నిద్రించుట వలన జీవితమును అమూల్యమైన కాలం వ్యర్థం ఐపోతుంది. అలానే ఏ మాత్రం నిద్రిమ్పక పూర్తిగా మేల్కొని ఉన్నా అలసట కలుగును. చురుకుదనం నశిస్తుంది.. శరీరము,ప్రాణము, ఇంద్రియాలు శక్తిహీనులై శిథిలమగును. క్రమక్రమంగా అనేక రోగాలు ఏర్పడతాయి. ఆ కారణముగా మబ్బుగా ఉండుట సోమరి అవ్వడం సంభవిస్తుంది. ఈ విధముగా ఎక్కువగా నిద్రించుట కానీ ఎల్లప్పుడూ మేల్కొని ఉండుట కస్ని ఈ రెండు ధ్యాన యోగ సాధనకి విఘ్న కారణాలే. కావున ధ్యాన యోగి తన ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకోవాలి. ధ్యానయోగ సాధనకి ఏ మాత్రము విఘ్నము కలుగ నీయరాదు. ఈ ఉద్దేశ్యం తోనే తన శరీర స్థితిని,ప్రకృతిని,ఆరోగ్యాన్ని గమనిస్తూ అవసరము కంటే ఎక్కువ మేల్కొనరాదు ఎక్కువ నిద్రింపరాదు.

🕉🕉🕉🕉🕉🕉

దేవుడు

*అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే నా అస్థిత్వాన్ని గుర్తిస్తూ, ఉహించినవాటికి వ్యతిరేకంగా జరిగితే నా అస్తిత్వాన్ని ప్రశించే వారు నా భక్తులెలా అవుతారు ?*

           మేలు జరిగినా ,
           విజయాలు చేకూరినా,
           ధనధాన్యాలు, సంపదలు
           చేకూరినా,
           భాగస్వామి లభించినా,
           బిడ్డలు పుట్టినా,
           సుఖ సంతోషాలు ,ఆనందాలు
           దరిచేరినా,
*"ఈశ్వరా నాకే ఎందుకు ఇలా ?"* అని ప్రశ్నించరు. కానీ -
        ఎమన్నా కీడు జరిగినా,
        అపజయాలు చేకూరినా,
        ధనధాన్యాలు సంపదలు
        కోల్పోయినా,
        భాగస్వామి బాధించినా,
        బిడ్డలు బాధ పెట్టినా,
        సుఖ సంతోషాలు , ఆనందాలు
        దూరమైనా -
*"ఈశ్వరా నాకే ఎందుకు ఇలా?"* అని ప్రశ్నిస్తారు. నా సృష్టి అంతా నా బిడ్డలే అయినపుడు -
     -  ఎవరి మీద "ప్రేమ",ఎవరి
         మీద "ద్వేషం"?
     -  ఎవరి మీద "అభిమానం" ,
         ఎవరి మీద "అనుమానం"?
     -   ఎవరి మీద "వాత్సల్యం",
         ఎవరి మీద "శత్రుత్వం" ?
     -   ఎవరు "అయిన"వారు,
         ఎవరు "కాని" వారు ?
*కేవలం ఎవరు చేసిన "కర్మ"ను అనుసరించి, వారికి ఫలితం లభిస్తుంది*
           *అయినప్పటికీ "కర్మ" ఫలితాన్ని మార్చగల , నిర్మూలన చేసుకోగల "శక్తి" - జీవుల*
    * "నిర్మలమైన భక్తి"కి ఉంటుంది;
    * "నిశ్చలమైన నమ్మకాని"కి
         ఉంటుంది;
    *  "నిరుపమానమైన సేవ"కి
         ఉంటుంది.
    *  "సర్వ సమర్పణా భావాని"కి
         ఉంటుంది.
             లేదా
     *  నా "అనుగ్రహాని"కి,
         "కరుణ"కి, "దయ"కు,
         "వాత్సల్యాని"కి ఉంటుంది.

*ఎన్ని జన్మలు ఎత్తినా జీవులు, తమ తమ "కర్మ ఫల" నిర్మూలనకే !*
         *నా నుంచి దూరమైనా, నా అస్థిత్వాన్ని స్థిరంగా నమ్మిన నాటి నుంచి నా వైపు పయనం మొదలవుతుంది.*
           *"నేనే సర్వం ,నేనే సకలం, నన్నే చేరుట పరమార్ధం !" అనుకున్న వారు నాకు చేరువవుతారు.*
          *నన్ను తనలోనే కాక, నా సృష్టిలో అన్ని జీవులందు దర్శించినవారు, నాలో భాగమై - "ముక్తి" పొందుతారు.*

-  దేవుడు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం....

“యత్ర నార్యస్తు పూజ్యన్తే రమతే తత్ర దేవతాః” ..యత్రైతాస్తు నపూజ్యంతే సర్వాః తత్రాఫలాః క్రియాః అని చెప్పింది మనుస్మృతి...అదే మనుస్మృతి “న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి” అంటూ స్త్రీలకు ఆంక్షలు విధించింది.

స్త్రీ ని దేవతగా కొలిచే భారతావనిలో ప్రతి స్త్రీ కి వందనం....

ఇంటి ఇల్లాలు సంతోషంగా లేనప్పుడు ఆ ఇంటి యజమాని దేవతార్చన అర్హతను కోల్పోతాడు.  దేవతలు ఆ ఇంటి మొహం గూడా చూడరు.

ముఖ్యో ధర్మః స్మ్రితిషు విహితో భర్త్రు శుశ్రుషాణం హి  :

స్త్రీకి ఆమె భర్త యొక్క సేవ ప్రాథమిక కర్తవ్యంగా విధించబడింది.

"ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి

              ఇల్లాలే ఈ జగతిగి జీవన జ్యోతి "అని

ఇంటా..బయటా అంతా నీవే...కుటుంబ భారాన్ని మోస్తూ... విశ్రాంతి లేక, నీ బాధ వినేవారు లేక భూమాతకు భారంగా మారుతున్నానని ఆవేదన చెందుతున్న ఓ మహిళా మేలుకో..

ప్రతి మనిషికి తల్లిగా, చెల్లిగా, తోబుట్టువుగా, జీవిత భాగస్వామిగా నేటి మహిళలు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నా, వారి గౌరవం నానాటికి ప్రశ్నార్థకంగానే మారుతోంది. మహిళను పూజించే చోటే పవిత్రత ఉంటుందన్న నానుడ్ని ప్రపంచానికి చాటిచెబుతున్న మనదేశంలోనే మహిళల పట్ల వివక్ష, అత్యాచార ఘటనలు రోజురోజుకి పెరగటం దురదృష్టకరం.

మహిళలు పూజించబడే చోట దేవతలుంటారంటారు. పూజించడం మాట అటుంచి కనీస గౌరవానికి కూడా వారు నోచుకోవడం లేదు. వనితలకు దక్కాల్సిన గౌరవం దక్కగపోగా వారిపై వేధింపులు నానాటికి హెచ్చుతున్నాయి. సమాజం ఎంత ముందుకు వెళ్లినా స్త్రీలపై హింస విషయంలో మాత్రం రాతియుగమే నయమనిపించేలా ఉంది నేటి పరిస్థితి.

స్త్రీలకు గౌరవం ఇవ్వడం పై మన వేదాలు,స్మృతులు ఏమంటున్నాయి?

స్త్రీలపై దాడులు,చేయిచేసుకోవడాలు (ఇక అత్యాచారాల సంగతి సరేసరి) సర్వసాధారణం అయిపోయాయి.

1."యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతాః
యత్రైతాస్తునపూజ్యన్తే సర్వాస్తత్రా ఫలాఃక్రియాః" (మనుస్మృతి 3-56)

స్త్రీలు ఏ గృహమునందు పూజింపబడుచున్నారో ఆ గృహములందు దేవతలు క్రీడించుచున్నారు.అలా పూజింపబడనిచోట ఎన్ని మంచి పనులు చేసినా నిరుపయోగమే.

స్త్రీలు ఇంటిని ప్రకాశింపచేయు దీపములు,మరియు వారు సాక్షాత్ లక్ష్మీదేవుల స్వరూపమే. (మనుస్మృతి 9-26)

2."ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణాం శతం పితా,
సహస్రంతు పితౄన్ మాతా గౌరవేణాతిరిచ్యతే." (మనుస్మృతి 2-145)

10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి, 1000 మంది తండ్రుల కంటే తల్లిపూజ్యురాలు.

3."పతితఃపితా పరిత్యాజ్యోమాతాతు పుత్రే నపతతి "(వసిష్ఠ 13-15)
పతితుడైన తండ్రిని వదిలివేయచ్చు గాని తల్లి ఒకవేళ పతితురాలైనను వదిలివేయరాదు.

4."పతిర్జాయాం సంప్రవిశతి గర్భోభూత్వేహమాతరం
తస్యాం పునర్నవోభూత్వా నవమేమాసిజాయతె.
తజ్జాయా జాయాభవతియ దస్యాం జాయతే పునః" (ఐతరేయ బ్రాహ్మణం 7-3-13)

భర్త భార్యలో ప్రవేశించుచున్నాడు. భార్యనే తల్లిగా చేసుకొనుచున్నాడు. ఎలాగంటే తొమ్మిదిమాసముల పిదపభార్యయందు తిరిగి పుట్టుచున్నాడు. కాబట్టి భార్య కూడా తల్లిలా పూజ్యురాలే.

5."పత్నీ పారీణహ్యస్యేశే" (తైత్తిరీయ 6-2-1-1)
ఇంటిలోని ధనమునకు యజమాని స్త్రీయే.

మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ తల్లిదండ్రులకు వేదాలు దైవ స్థానాలను కల్పించినా, బ్రహ్మదేవుడు అంతటా తానేఉండాలన్న భావంతో తనకు బదులుగా తల్లిని సృష్టించాడని పురాణాలు చెబుతున్నా ఈనాటి మనుషులకు మాత్రంఇవేమీ పట్టవు. భార్యను తప్ప మిగతా స్త్రీలను అందరినీ తల్లిగా చూడాలని అన్నా ఎందరు పాటిస్తున్నారు చెప్పండి.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...