Sunday, December 9, 2018

పుట్టినిల్లు- మెట్టినిల్లు కులదైవములు

పుట్టినిల్లు మెట్టినిల్లు అని రెండు కులదైవములను కొలుచుకోవడం స్త్రీలకు మట్టుకే చెల్లును. మనము కులదైవములను కొలుచుకోకపోతే మనం చేసే పనులలో చిక్కులు ఉద్యోగ వ్యాపారరీత్యా మందము, ఎదురుచూడని నష్టం, ఇలా ఎన్నో కష్టనష్టములకు గురికావలసి వచ్చును. కులదైవ దోషం ఉండేటప్పుడు మనం వేరే ఏ దైవమును కొలుచుకున్నా సరైన ఫలితములు లభించదు. అందువల్ల ఏడాదికి ఒక మాటైన మీ కులదైవ కోవెలకు వెళ్లి పూజాదులు చేసుకోండి.
మనలను కాపాడే దైవములు
ఇంటి దైవము. మనతో కూడా వుండి చనిపోయిన మన పూర్వీకులు. కన్యగానో సుమంగళిగానో చనిపోయిన వారు, మన ఇష్ట దైవము. దీనినే ఇంటి దేవత కుటుంబ దేవత కన్యా దైవం సుమంగళి ప్రార్థన అని కొలుచుకుంటాము.
కులదైవము : ఒక వంశములో పరంపరాను సారముగా జీవించే వారికి కులము అని పేరు. వీరు అనేకముగా పురుష సంతానము దాయాదులు జ్ఞాతులు మట్టుకే ఇలాంటి కులానికే ప్రత్యేకమైన దైవము కోవెల ఉండును. ఈ కులదైవములను కొలుచుకొన్న కోటి పర్యాయములు ఫలితము లబించును. గురువును మరచిన కులదైవమును మరవవద్దు అనేది మన పెద్దల వాక్కు. ఇంటిలో ఏ ప్రయోజనము అంటే వివాహము, ఉపనయనము , సీమంతము లాంటి ఈ శుభ కార్యములు చేసినా పత్రికలో కులదైవం పేరు వేయడం పరిపాటి.
జాతి దైవము : పైన చెప్పిన కులాల సమూహమే ఒక జాతి. ఈ జాతులకు వుండే దైవమె అని పరిగణింప బడును. వీటిలో అనేకముగా స్త్రీ దైవములే ఎక్కువగా ఉండును. ఉదాహరణకు వెంకటేశ్వర స్వామీ సాయి బాబా లాంటివి .
గ్రామ దేవతలు: కుల జాతి సమూహమును కాపాడేది గ్రామ దేవత: వూరి ప్రజలందరూ జాతి మత భేదము లేకుండా కొలుచుకొనే దేవత. అనేకముకా గ్రామ దేవతలు కాళి మహమ్మారి లేక వీరభద్రుడు మునీశ్వరుడు లాంటివి వుంటుంది.
ఒక కులము అవిచ్ఛిన్నముగా వృద్ధి కావాలంటే కుల దైవ పూజ చాలా అవసరము. కులదైవ దోషము వుంటే మిగతా దైవముల అనుగ్రహము లభిచందు. కులదైవ అనుగ్రహం వల్ల పుత్రపౌత్ర అభివృద్ధి జరుగును. కుటుంబం సుఖ సంతోషములతో ఓలలాడును. అందరు కలిసి కులదైవ పూజలు (అన్న తమ్ములు ) చేసుకుంటే కులదైవమే కాకుండా మన పితరులు కూడా చాల సంతసించి ఆశీర్వదిస్తారు
కులదైవ పూజ వల్ల ఇంటిలో పెండ్లి కాని వారికి వివాహ బంధము ఏర్పడడం, సంతానము లేని వారికి పుత్రులు కలగడం,, సఖ్యత లేకుండా పోట్లాడుకునే దంపతుల మధ్య అన్యోన్య భావము ఏర్పడడం, జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లడం నేటికి మనకు లభించే నిదర్శనము.
ఏ వంశములోను పదమూడు తరాలకు అనంతరం ఒకే దైవం వుండదు. దానికి నిదర్శనం మన గృహములో ఒకటి పిల్లలు లేకుండా పోవడం, వున్నా కేవలం స్త్రీ సంతానం మట్టుకే వుండడం దీనిని మనం నేరుగా చూస్తున్నాము కదా! ఏ కులదైవమని ఒక వంశములో ౧౩ తరాలకు మించదు అంటే అంతతో ఆగి పోవును వృద్ది లేకుండా. ఇది నేటి విజ్ఞానము కూడా ఒప్పుకుంటుంది
Written by_ గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ...

పాపకార్యం అంటే ఏమిటి?



 ఏ క్రియ అయితే కేవలం స్వార్ధం/అసూయల కారణంగా చేస్తామో, దానిని శాస్త్రం పాపంగా పరిగణిస్తుంది. ఒక్క స్వార్ధం వల్లనే, ఒక వ్యక్తికి కలిగే కోరికలను నెరవేర్చుకోవడానికి, సకల విధములైన అధర్మ మార్గములలో పయనించడం మొదలు పెడతాడు. ఇలా చేయడంలో భయము, విరోధము, బాధ మొదలైన దుర్గుణములతో మనసు కలుషితమైపోతుంది. 

స్వార్ధం ప్రాతిపదికగా కాకుండా, వేదము చెప్పిన కార్యములను, విధివిధానములను మనం ఆచరించడం మొదలు పెడితే, అత్యాశ, అనారోగ్యకరమైన పోటీ తత్త్వము, స్వార్ధం, అసూయ తగ్గిపోతాయి. 
వేదవిహిత కర్మాచరణ ఎవరికి నిర్దేశింపబడినవి వారు, చేస్తూ ఉంటే, అది మొత్తం సమాజానికి క్షేమాన్ని చేకూరుస్తుంది. అంతే కాక, అటువంటి వేదవిహిత కర్మాచరణ వ్యక్తుల యొక్క పాపములను కూడా పరిహరించి, పునీతులను చేస్తుంది. ఇలా పుణ్యకార్యములు చేస్తూ ఉండడం వల్ల, పాపవిముక్తులమై, మన మనసు పవిత్రమవుతుంది.
Written by_గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ....

ఆదిత్య హృదయం సోత్రం ... తాత్పర్యం

ఆనాటి యుద్ధానంతరము అలసి విశ్రాంతిలో ఉన్న రాముడు మరల రావణుని పై యుద్ధము గురించి ఆలోచనలు కలిగి చింతలో యుండగా, ఇతర దేవతలతో కలసి యుద్ధము తిలకిస్తున్న అగస్త్య మహాముని రాముని ఇలా సంబోధించెను.
ఓ దశరథ కుమారా! గొప్ప బాహువుల కల రామా! ఈ రహస్యమును వినుము. దీని వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును గాక!
ఈ ఆదిత్య హృదయము వలన పుణ్యము, శత్రు నాశనము కలుగును. దీనిని పఠించుట వలన జయము, శుభము, శాశ్వత పరము కలుగును.
ఈ ఆదిత్య హృదయము అత్యంత శుభకరమైనది, సంపూర్ణమైన సౌభాగ్యమును కలిగించునది. అన్ని పాపములను నాశనము చేయునది. చింత, శోకము, ఒత్తిడి మొదలగు వాటిని తొలగించి ఆయుర్వృద్ధి కలిగించునది.
పూర్తిగా ఉదయించి ప్రకాశాకుడైన, దేవతలు, రాక్షసులచే పూజించ బడిన, తన ప్రకాశాముచే లోకాన్ని ప్రకాశింప చేసే ఆ భువనేశ్వరుని పూజించుము.
సూర్య భగవానుడు సర్వ దేవతల యందు కలవాడు, తేజస్వి, తన కిరణములచే లోకాన్ని ముందుకు నడిపే వాడు. తన శక్తితో దేవతలను అసురులను, సమస్త లోక జీవరాశికి జీవము కలిగించి కాల చక్రాన్ని ముందుకు నడిపే వాడు.
ఆ సూర్య భగవానుడే బ్రహ్మ, విష్ణువు, శంకరుడు, సుబ్రహ్మణ్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, కాలుడు, యముడు, సోముడు, వరుణుడు.
ఆయనే పితరుడు, వసువు, సాధ్యుడు, అశ్విని దేవతలు, మరుత్తులు, మనువు, వాయువు, అగ్ని, ప్రాణము, ప్రభాకరుడు, ఆరు ఋతువులను కలిగించే వాడు.
సూర్య భగవానుడు అదితి పుత్రుడు, విశ్వకర్త, కార్యములకు ప్రేరణ కలిగించే వాడు, ఆకాశము, వివిధ లోకముల యానము చేసేవాడు, స్థితికారకుడు, బంగారు కాంతితో ప్రకాశించే వాడు, దినకరుడు.
సూర్య భగవానుడు తన కిరణములతో ప్రకాశిస్తూ సర్వ వ్యపకుడైన వాడు. ఆయన సప్తేంద్రియములకు మూల శక్తి, అంధకారమును పోగొట్టేవాడు, ఆనందాన్ని, శుభాన్ని కలిగించే వాడు, సర్వ క్లేశములు తొలగించి జీవ చైతన్యము నింపేవాడు.
సూర్య భగవానుడు త్రిమూర్తుల రూపములో వ్యక్తమైన సనాతనుడు, దినమునకు కారకుడు, బ్రహ్మకు గురువు, అగ్ని గర్భుడు, అదితి పుత్రుడు, శంఖమును ధరించిన వాడు, నీరసమును తొలగించి మానసిక ఉత్తేజమును కలిగించే వాడు .

సూర్య భగవానుడు ఆకాశానికి అధిపతి, అంధకారాన్ని తొలగించే వాడు, సకల వేద పారంగుడు, కుబేరునికి, వరుణునికి మిత్రుడు, వర్ష కారకుడు. ఆయన వింధ్య పర్వతములను దాటి బ్రహ్మ నాడిలో క్రీడిస్తున్నాడు.
సూర్య భగవానుడు వృత్తాకారములో, పచ్చని కాంతితో, తీక్షణమైన కిరణములతో తాపమును కలిగించే వాడు. లయకారకుడు, విశ్వమంతా వ్యాపించి యున్నవాడు, మహాతేజము కలవాడు, రక్త వర్ణుడు, సమస్త చరాచర సృష్టి స్థితి లయకారకుడు.
సూర్య భగవానుడు నక్షత్రములు, వాటి సమూహములకు, గ్రహములకు అధిపతి. విశ్వములో ప్రతి వస్తువుకు మూలము, తేజస్సు కల్గిన వారికి కూడా తేజస్సును కలిగించే వాడు. ద్వాదశాదిత్య రూపములలో కనిపించే ఆ సూర్యునికి నమస్కరించుము.
తూర్పున, పడమరన ఉన్న పర్వతములకు నమస్కారములు (వాటిపై నుంచి సూర్య భగవానుడు ఉదయించి అస్తమిస్తాడు కాబట్టి). తారా గణములకు, దినమునకు అధిపతి అయిన సూర్య భగవానునికి నమస్కారములు.
జయమును కలిగించే, దాని వలన కలిగే సంపదను, శుభంను కాపాడే సూర్య భగవానునికి నమస్కారములు. వేయి (అనంతమైన) కిరణములు కలిగిన ఆదిత్యునికి నమస్కారములు.
ఉగ్రుడు, వీరుడు, అమిత వేగముగా ప్రయాణించే సూర్య భగవానునికి నమస్కారములు. తన ఉదయముతో పద్మములను వికసింప చేసే వాడు, మార్తాండుడు (తీక్షణమైన తేజము కలవాడు) అయిన ఆదిత్యునికి నమస్కారములు.
బ్రహ్మ, విష్ణు మహేశ్వరులకు అధిపతి, వర్చస్సు కలవాడు అయిన ఆ సూర్యునికి నమస్కారములు. ప్రకాశించేవాడు, శక్తిమంతుడు, అన్నిటినీ దాహించేవాడు, తీక్షణమైన రుద్ర రూపము కల ఆదిత్యునికి నమస్కారములు.
సూర్య భగవానుడు అంధకారాన్ని తొలగించే వాడు, భయమును తొలగించే వాడు, శత్రు నాశనము చేసేవాడు, సర్వ వ్యాప్తమైన ఆత్మ స్వరూపుడు. క్రుతఘ్నులను నాశనము చేసేవాడు, దేవుడు, నక్షత్ర గ్రహ కూటమికి అధిపతి అయిన ఆ సూర్యునికి నమస్కారములు.
కరిగించిన బంగారము కాంతి కలవాడు, అగ్ని రూపుడు, సర్వ జ్ఞాన ప్రకాశకుడు, విశ్వ కర్మ, అంధకారమును తొలగించేవాడు, రుచి, లోకానికి సాక్షి అయిన సూర్యునికి నమస్కారములు.
సమస్త సృష్టిని నాశనము చేసి మరల సృష్టించేవాడు, నీటిని ఆవిరి చేసి, మరల వర్షరూపములో మనకు ఇచ్చే ఆ గగన మండల అధిపతి అయిన సూర్యునికి నమస్కారములు.
సూర్య భగవానుడు సుషుప్తావస్థలో (నిద్రా సమయములో) యున్న జీవరాశి హృదయములో జాగ్రదావస్థలో ఉండేవాడు, అగ్నిహోత్రములోని అగ్ని మరియు ఆ అగ్నిహోత్ర ఫలము తానే యైన వాడు.
సూర్య భగవానుడు వేద సారుడు, క్రతువులు, వాటి ఫలము తానెయైన వాడు, ఈ సమస్త జగత్తులో అన్ని క్రియలకు కారణభూతుడు, ప్రభువు.

ఫల శృతి: 

రాఘవా! ఈ స్తోత్రమును ఆపద సమయములలో, బాధలు, కష్టములు కలిగిన సమయములో, దిక్కుతోచక యున్నప్పుడు, భీతితో యున్నప్పుడు పఠించుట వలన ధైర్యము, స్థైర్యము కలుగును.
రాఘవా! దేవ దేవుడు, జగత్పతి యైన సూర్య భగవానుని ఏకాగ్ర చిత్తముతో పూజించుము. ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించుట వలన నీకు ఈ యుద్ధములో విజయము కలుగును.
ఓ మహా బాహువులు కల రామా! నీకు ఈ క్షణము నుండి విజయమే. రావణుని వధించుము. అని చెప్పి అగస్త్యుడు తన యథా స్థానమునకు వెళ్ళెను.
ఇది విన్న రాముడు శోకమును, విచారమును వీడి, ప్రీతుడై, ధైర్యం పొందెను.
రాముడు సూర్యుని వైపు ఏకాగ్రతతో చూస్తూ ఈ స్తోత్రమును మూడు మార్లు పఠించి సచ్చిదానందు డయ్యెను. మూడు మార్లు ఆచమనము చేసి శుద్దుడై ధనుర్బాణములు ధరించెను.
రావణుడు యుద్ధమునకు వచ్చుట చూచి, ధైర్యముతో రాముడు రావణుని సంహరించుటకు సమస్త శక్తులు ఒడ్డుటకు కృత నిశ్చయము చేసుకొనెను.
అప్పుడు, దేవతా సమూహముతో యుద్ధము తిలకించుచున్న సూర్యుడు, రావణుని మరణ సమయము ఆసన్నమైనదని గ్రహించి, తనవైపు చూస్తున్న రామునిపై సంతుష్టుడై, ప్రసన్నమైన వదనముతో, రామా! ముందుకు సాగుము! అని పలికెను.
Written by_ Mr.Sharma

ఆచమన విధానము

ప్రతి కార్యమునందు ఒక్కొక్క ఆచమనవిధానము చెప్పబడినది. ఆచమనము ద్వారా కేవలము మనలను మనమే శుధ్ధి చేసుకొనుటయేగాక బ్రహ్మఆచమన విధానము నుండి మొదలుకొని సమస్తమును పరితృప్తి చేయుచున్నాము ఆచమనము చేయకు౦డా చేసెడు కర్మలన్నియుని వ్యర్ధములైపోవును. కావున శౌచాన౦తరము కూడా శాస్త్రమున౦దు ఆచమనక్రియ నిర్దేశి౦పబడినది. శుభ్రమైన మడి వస్త్రమును మూడు, ఐదు గోచులుగా ధరి౦చి, శిఖ ముడివేసుకొని వుపవీతియై ఉ౦గరపు వ్రేలునకు దేవపవిత్రమును ధరి౦చి, ఆసనముపై సావధాన చిత్తముతో కూర్చొని, పాదములను నేలమీద ఉ౦చి ఆచమనము చేయవలయును. ఉత్తరము, ఈశాన్యము, తూర్పు నకు ముఖము చేసి మాత్రమే ఆచమనము చేయవలెను.


ఆచమనము చేయు నీరు బుడగలు, నురుగు లేనిదిగ స్వచ్చముగ ను౦డవలెను. ఆచమి౦చునపుడు నోటిను౦డి ఎటువ౦టి శబ్దము రాకూడదు.

ఆచమనము చేయు జలము బ్రాహ్మణునకు హృదయము వరకు, క్షత్రియులకు క౦ఠమువరకు, వైశ్యులకు తాలువు(దౌడ)వరకు, శూద్రులకు మరియు స్త్రీలకు నాలుక వరకు చేరునట్లుగా తీసుకొనవలెను.

గోకర్ణాకృతిగా పట్టిన హస్తములో మినుపగి౦జ మునుగున౦తటి జలమును మాత్రమే తీసికొని అరచేతితో ఆచమనము చేయవలెను. గోకర్ణాకృతి మూడు విధములుగా చెప్పబడినది.

౧. బొటనవ్రేలి మధ్య వ్రేలి మూలమునకు వ౦చిపెట్టి, చూపుడువ్రేలును దానిమీదకి వ౦చిపెట్టి, తక్కిన వ్రేళ్ళను చక్కగా చాచిపెట్టినచో హస్తము గోకర్ణాకృతికి(గోకర్ణము-ఆవు చెవి ఆకారమునకు) వచ్చును లేదా

౨. చూపుడు వ్రేలును వ౦చి బొటన వ్రేలి మూలమునకు చేర్చిపెట్టి, బొటనవ్రేలి మధ్యవ్రేలి మధ్య గణుపునకు చేర్చి తక్కిన వ్రేళ్ళను చక్కగా చాచినచో హస్తము గోకర్ణాకృతిగా ఏర్పడును. లేదా

౩. అరచేతిని అర్ధచ౦ద్రాకారముగా మడచి ఆవుచెవి వలె చేయవలెను, కనిష్ఠిక(చిటికెనవ్రేలు)ను మరియు అ౦గుష్ఠమును దూరముగ - వేరుగా చేసి తక్కిన మూడు వ్రేళ్ళను దగ్గరగా చేర్చి పట్టినచో హస్తము గోకర్ణాకృతిగా ఏర్పడును.

ఆచమనము చేయునప్పుడు ఎడమచేతి చూపుడువ్రేలుతో కుడిచేతిలోగల జలమును స్పృశి౦చుటవలన సోమపానము యొక్క ఫలము లభి౦చును.

తుమ్మినప్పుడు, ఉమ్మినతర్వాత, నిద్రి౦చిలేచిన పిమ్మట, వస్త్రములను ధరి౦చిన మీదట, ఆవిలి౦త వచ్చిన పిదప, అశృవులు - కనులను౦డి నీరు జారిన తదుపరి ఆచమనము చేయవలెను లేదా కుడిచెవిని స్పృశి౦చుట చేత ఆచమనవిధి పూర్తియగును.

మోకాళ్ళకు పైగా జలమున౦దు నిలబడి కూడా ఆచమి౦చవచ్చును. నీరు మోకాటిలోతుక౦టే తక్కువగా ఉ౦డినచో ఈమాట చెల్లనేరదు. అప్పుడు కూర్చు౦డియే ఆచమనము చేయవలెను.
Written by_ Mr.Sharman

భగవంతుని అనుగ్రహమే అసలు సాధనం


మనిషి పతనానికి ఎన్నో విషయాలు ఉంటాయి, అందుకే మనిషి ఒక స్థాయిని చేరడానికి ఒక సాధన కావాలి, ఆసాధన దైవంతో సంబంధం ఏర్పర్చగలగాలి అప్పుడు దివ్యుడు కాలగడు. దైవానుగ్రహం అనేది సూర్యుడైతే మనం చేసే సాధన ఒక చిన్న మిణుగురు పురుగంత లెక్కకు రాదు. అందుకు విశ్వామిత్రుడు తను సాధించినదానికి దైవ అనుగ్రహం మూలం అని భావించాడు. ఇది గుర్తించి శ్రీరామచంద్రుడిని తన వెంటతెచ్చి తను సాధించిన బల అతిబల విధ్యలని రామచంద్రునికి అర్పించాడు. ఆరు రాత్రుల యాగం చేసాడు. ఆతర్వాత విశ్వామిత్రుడు సీతమ్మతో రామచంద్రుడిని చేర్చి తను సిద్దిని పొందాడు. ఇదే కథ బాలకాండలో ఉంటుంది.

ఈ 'ఆరు రాత్రుల యాగం' అని చెప్పడంలో ఒక రహస్యం ఉంది. మనిషిలో కలిగే అంతర్-వ్యాదులు ఒక ఆరు అని చెబుతారు. మొదటి వ్యాధి దేహాసక్తాత్మబుద్ధి, అంటే దేహమే నేను అనుకొనే అజ్ఞానం. రెండోది స్వాతంత్ర్య అందత, నేను నా అంతట బ్రతక గలను, ఎవరిపై ఆధారపడి లేను అనే అజ్ఞానం. మూడోది ఇతర శేషత్వ బుద్ధి, మనం వల్ల కాదు మనం బ్రతికేది అని జ్ఞానం కల్గి, అది మన చుట్టూ ఉండేవారి వల్ల అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక వ్యాధి. నాలుగోది ఆత్మత్రాణ ఉన్ముఖత, నన్ను నేనే ఉద్దరించుకోగలను, నాకు కావల్సినదేమో నేనే నిర్ణయించుకోగలను అనే జబ్బు. అయిదోది ఆభాస బంధు ప్రీతి, మన చుట్టూ ఉన్నవారే సర్వస్వం అని అనిపించేది, వారితోనే నిరంతరం ఉంటాను అనే బ్రాంతి. ఆరోది విషయ లౌల్యము, ఏది కనిపించినా నాకే అనిపిస్తుంది. రకరాకాల వస్తువులు ఉంటాయి, వాటిని నేనే పూర్తిగా అనుభవించాలి అనే భావన, ఇది అన్నింటికన్నా ప్రమాధకరమైన వ్యాధి. ఈ ఆరింటి వల్లనే ఎన్నో ఉప వ్యాధులు పుట్టుకొస్తాయి. అన్నింటికీ మూలం ఈ ఆరు వ్యాధులు అని చెబుతారు. అవన్నీ రాముడు తప్ప తొలగించేవాడు మరొకడు లేడు అని రాముడిని తెచ్చుకున్నాడు.
ఆ వ్యాధులకు కారణం గడిచిన కర్మలు, ఇప్పుడు అనుభవించే కర్మలు, ఇప్పుడు తయారు చేసుకొని కొంతకాలం అయ్యాక అనుభవించే కర్మలు. గడచిన కర్మలను సంచితములు అని అంటారు. ఇప్పుడు అనుభవించే వాటిని ప్రారబ్దం అని అంటారు. ఇప్పుడు ఆచరించే వాటి వల్ల కొంతకాలం అయ్యాక వచ్చేవి ఆగామి అని అంటారు.

భగవంతుడిని ఆశ్రయిస్తే మన ప్రాచీన కర్మలని తుడిచి వేస్తాడు, ఇప్పుడు ఉండే కర్మలని అంటకుండా చేస్తాడు, రాబోయే కర్మలను దూరం చేస్తాడు. అట్లాంటివే గడిచిన కర్మలే సుభాహు అంటే, రాబోయే కర్మలే మారీచ, ఇప్పుడు మనం అనుభవించే కర్మలే మిగతా రాక్షసులు. జీవితమనే యాగాన్ని రక్షించగలిగేవాడు రాముడు. అట్లా రామచంద్రుడు మానవాస్త్రం వేసి మారీచుడిని తరిమివేసాడు. సుభాహు పైఅ అగ్ని అస్త్రం వేసి చంపివేసాడు. మిగతా వారిపై వాయువ్యాస్త్రం వేడి చెల్లా చెదురు చేసాడు. మనిషిగా మనం చేసే సాధనకు భగవంతుని అనుగ్రహం ఎంత అవసరమో విశ్వామిత్రుని కథ తెలుసుకుంటే అర్థం అవుతుంది.
Written by_
గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ.....

సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం

సర్పరూపుడైన సుబ్రహ్మణ్యేశ్వరుడు కుజునకు అధిష్టాన దైవం. రాహువునకు సుబ్రహ్మణ్యస్వామి, సర్పమంత్రాలు అధిష్టాన దైవాలు. కొందరు కేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్యస్వామి, సర్ప పూజలు చేయాలంటారు. సర్వశక్తిమంతుడైన సుబ్రహ్మణ్యేశ్వరస్వామి కరుణామయుడు. దయాహృదయుడు పిలిచిన వెంటనే పలికే దైవం.
మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తి, ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనచేస్తే అవన్నీ మానవులకు సమకూరుతాయి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపుడు కావడంవల్ల, సర్పగ్రహాలైన రాహుకేతువులు సుబ్రహ్మణ్య ఆధీనంలో ఉంటారని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం, సుబ్రహ్మణ్య పూజ సర్వ శుభాలనిచ్చి, రాహుకేతు దోషాలకు కూడా పరిహారంగా భావించబడుతోంది.
"శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః" 

మంగళవారం, శుద్ధ షష్టి, మృగశిర, చిత్త, ధనిష్ట ఏ నక్షత్రం కలిసిన రోజైనా కుజునికి, సుబ్రహ్మణ్యేశ్వరునికి ప్రీతికరం ఆరోజున సుబ్రహ్మణ్య మంత్రం, కుజమంత్రం జపించాలి. అనంతరం సుబ్రహ్మణ్య కుజులకు అష్టోత్తర, శత నామావళితో పూజచేయాలి. ఇలా తొమ్మిది రోజులు జపమూ, పూజ చేసి చంద్ర లేదా మోదుగ పుల్లలతో నెయ్యి తేనెలతో తొమ్మిది మార్లకు తగ్గకుండా హోమం చేసి దాని ఫలితాన్ని పగడానికి ధారపోసి ఆ పగడాన్ని ధరిస్తే మంచిదని చెబుతారు. దీనివల్ల కుజ గ్రహ దోష పరిహారం జరిగి సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కూడా కలుగుతుందంటారు. ఈ పూజా అనంతరం సర్ప సూక్తం లేదా సర్పమంత్రాలు చదవడంవల్ల ఇంకా మేలు జరుగుతుంది.
జాతకంలో కాలసర్పదోషం ఉన్నవారు, కేతు దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం అన్నివిధాల శ్రేయస్కరం. ఆ స్వామి జపం సర్వవిధాలా మేలు చేస్తుంది. అలాగే రాహు మంత్రం, సుబ్రహ్మణ్య మంత్రం సంపుటి చేసి జపించి సర్పమంత్రాలు చదువుతూ, పగడాన్ని ధరిస్తే మేలు జరుగుతుంది. ఈ పూజలవల్ల రాహుగ్రహం అనుగ్రహమూ కలుగుతుంది. అలాగే సంతాన ప్రాప్తికోసం మహిళలు ఎక్కువగా ఆరాధించే దైవం సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు బాలుడి రూపంలో దర్శనమిస్తాడు కాబట్టి, తన రూపంతో బిడ్డలను ప్రసాదిస్తాడని భక్తులు నమ్ముతారు. అందుకనే సుబ్రహ్మణ్య ఆలయాలలో సంతానం లేని మహిళలు పూజలుచేయడం తరచుగా మనం చూస్తూ వుంటాం.
సంతానప్రాప్తిని కోరే మహిళలు వెండి సర్పానికి సుబ్రహ్మణ్య, కేతు మంత్రాలతో 21మార్లు పాలతో అభిషేకించి ఆ పాలను సేవిస్తే సత్ సంతానం కలుగుతుందని మహిళా భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఏదైనా పుట్టకు నమస్కరించి పుట్ట చుట్టు 21 లేదా 108మార్లు మండలం పాటు (40రోజులు) ప్రదక్షిణలు చేస్తే సంతానం కలుగుతుందని అంటారు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధనం సర్వ క్లేశాలను దూరంచేసి, సర్వశక్తుల్ని ఇస్తుందని అంటారు.
Written by_గుట్టీ సుబ్రహ్మణ్యశర్మ 

ధృతి అంటే పట్టుదల


నేను చేసి తీరుతాను; పట్టుదల మౌఢ్యము కాకూడదు. భగవంతునియందు భక్తితో ఆయనచేతి ఉపకరణంగా చేయగలనన్న విశ్వాసం అయి ఉండాలి. ఆత్మగౌరవం అన్న పేరుతో అహంకారం కాకూడదు.
దృష్టి అన్నమాటకి అర్థం నైపుణ్యం. ఏ పని ఎలా చేయాలో అలా చేయడం నైపుణ్యం. ఎంతసేపూ దీపం పెట్టనాండీ? దీపంలో వత్తులు ఎన్ని వేయాలండీ? నూనె వేయనాండీ? నెయ్యి వేయనాండీ? తూర్పుకి పెట్టనాండీ? ఉత్తరానికి పెట్టనాండీ? ఎన్నాళ్ళు అడుగుతావు ఆ మాట? ఎన్నాళ్ళు దీపం దగ్గర ఆగిపోతావు జీవితంలో. ఏది ఎందుకు చేస్తున్నావో, అలా చేయడం వల్ల నీకేం కలుగుతోందో తెలుసుకున్న నాడు కర్మ అన్న నిచ్చెన మీద మెట్లు ఎక్కుతావు. ఆ నైపుణ్యం లేనినాడు ఏది చేసినా పుణ్యంకోసమే. సుందరకాండ వింటే నాకు అపారమైన పుణ్యం వచ్చి రాష్ట్రపతిని అయిపోవాలి. పుణ్యం, పుణ్యం, పుణ్యం - ఏం చేస్తావు దానితో? మళ్ళీ పుడుతూండాలి, అనుభవిస్తూండాలి. పరమేశ్వరుడు చాలా చమత్కారి. అనంతమైన పుణ్యం నువ్వు చేసేస్తే అనుభవించడానికి ఒక జన్మనిస్తాడు, చక్రవర్తిని చేస్తాడు. నువ్వు చేసిన పుణ్యాలివిగో అనుభవించేశావు చక్రవర్తిగా. "క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి" - ఇంత పుణ్యం చేసీ దేవతా పదవిని పొందిన వాడు క్రిందపడిపోతాడు మర్త్యలోకంలోకి. పుణ్యం చేయడం కాదు పుణ్యాన్ని చిత్తశుద్ధికి వాడుకోవడం నైపుణ్యం. ఆ నైపుణ్యం ఉండడం దృష్టి. దృష్టి ఒక కార్యం చేసేటప్పుడు తనకు కీర్తి వస్తే కీర్తికి కారణాన్ని దృష్టిలో పెట్టుకోవడం

Written by_
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

నదీస్నానం‬ ఎలా చేయాలి?

ఎప్పుడూ ఏదో ఒక తీర్ధయాత్ర చేస్తుంటారు. అసలు నదిలో ఏట్లా స్నానం చేస్తే ఫలితం ఉంటుంది?
నీటికున్న అమోఘమైన శక్తి గురించి మొదట గుర్తించింది ఋషులే. ఋషులు ద్రష్టలు. మాములు వ్యక్తులకు ఇంద్రియగోచరం కానీ విషయాలు కూడా ఋషులకు కనిపిస్తాయి. అటువంటి ఋషుల కారణంగా మనకు ఈ సనాతనసంస్కృతి అందింది. ఈ విశ్వంలో మానవులు, జంతువులు, చెట్లు, పక్షి, క్రిమికీటకలే కాక, అనేకమంది ఇతరులు జీవిస్తున్నారు. వారి కర్మఫలాన్ని అనుసరించి వారి జన్మ ఉంటుంది, మన కంటికి కనపడేది ఈ ఒక్క లోకం మాత్రమే. కానీ ఇది కాక ఇంకా అనేకలోకాలు ఉన్నాయి. వాటిలో దివ్యశరీరాలతో అనేకమంది దేవతలు, యక్ష, కిన్నెర, కింపురుష, గంధర్వులు, సిద్ధులు నివసిస్తూ ఉంటారు. వారూ మానవులు పరస్పరం ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. వారిని ఉద్దేశించే మానవులు వివిధరకాల వైదిక కర్మలు ఆచరిస్తారు. అట్లాగే ప్రతినదికి ఒక అధిష్టానదేవత ఉంటుంది. ఆమె అందరికి త్రాగడానికి, పంటలు పండిచుకోవుటకు నీరు ఇస్తోంది. నేలను సస్యశ్యామలం చేస్తోంది, వనాలను రక్షిస్తోంది. అక్కడితో ఆగిపోకుండా ఒక్క మునకతోనే మునిగినవానికి అనుగ్రహం ప్రసరిస్తోంది, పుణ్యం ఇస్తోంది, రోగక్షయం చేస్తోంది. అందుకే నదీమతల్లిగా, అమ్మగా ఋషులు నదులను కీర్తించారు. కానీ ఆమె అనుగ్రహం పొందాలంటే నదిలో స్నానం చేయటానికి ఒక విధానం ఉంది.
నదిలో స్నానం చేసే ముందు నదీమతల్లికి మనస్పూర్తిగా నమస్కారం చేయాలి. పాపాలను, దోషాలను, రోగాలను తొలగించి శుభములను ఇస్తున్న అమ్మకు ప్రేమపూర్వక కృతజ్ఞతలు చెప్పుకోవాలి.
నదీస్నానం ఎప్పుడు చేసినా ముందు ‪#‎సంకల్పం‬ చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకోకుండా స్నానం చేస్తే పుణ్యస్నాన ఫలితం ఉండదు. అది ఇంట్లో చేసిన స్నానంతో సమానమే. నదీస్నానమే కాదు, తటాక, సముద్రస్నానమైన అంతే.
నదీస్నానం చేసేముందు ఒడ్డున ఉన్న కొంత మట్టి తీసుకుని నదిలో వేయాలి. చిటికెడైనా వేయాలి. అదే పుష్కరిణి, తటాకం, చెరువులో స్నానం చేస్తున్నట్లైతే చెరువులో ఉన్న మట్టి కొంచం తీసి ఒడ్డున వేయాలి. సముద్రస్నాన సమయంలో సముద్రంలోకి ఒక చిన్న రాయి విసరాలి. ఇది తప్పక చేయవలసిన విధి.
ఇది చేసే సమయంలో ఈ క్రింది శ్లోకం చెప్పాలి.
పిప్ప్లాదాత్ సముత్పన్నే కృత్యేలోకే భయంకరి |
పాషాణం తే మయాదత్తం అహారార్ధం ప్రకల్పయ ||
నదిలో స్నానం చేసేముందు ఇంట్లో తప్పనిసరిగా స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, అప్పుడు నదీతీరానికి వెళ్ళాలి. ముందు స్నానం చేయకుండా నేరుగా వెళ్ళి నదిలో మునగకూడదు. నదిలో ఒళ్ళు రుద్దుకోవటం, ఉమ్మివేయటం, మలమూత్ర విసర్జనలు చేయటం నిషిద్ధం. నదీస్నానం అంటే నదిలో కేవలం 3 సార్లు మునకవేయటం మాత్రమే. అంతకుమించి అక్కడ సబ్బు రుద్ధుకోవటం, షాంపూలు వాడటం చేయకూడదు. అలా చేయడం నదీమతల్లికి చేసే అపచారం, పుణ్యం రాకపోగా పాపం చుట్టుకుంటుంది.
నదిలో స్నానం చేయటానికి కూడా ఉతికిన వస్త్రాలే ధరించాలి. స్నానం కోసం ధరించే వస్త్రాలకు తప్పినిసరిగా అంచు ఉండాలి. మగవారైతే పంచకట్టుకుని చేయాలి. ప్యాంటు, షర్టు వేసుకుని చేయకూడదు. వస్త్రాన్ని అనేకమార్లు కత్తిరించి కుట్టగా ప్యాంటు, షర్టు తయారైతాయి. శాస్త్రం ప్రకారం అవి చినిగిన వస్త్రాలతో సమానం. చినిగిన వస్త్రాలు ధరిస్తే దరిద్రం పడుతుంది. శాస్త్రం ప్రకారం చినిగిన వస్త్రాలు ధరించి పూజచేయటం అపచారం, అది కూడదు. ఎప్పుడూ పంచెకట్టుకునే అవకాశం లేకపోయినా కనీసం శుభకార్యాలు, దేవలయసందర్శన, పుణ్యస్నానం, పూజ సమయంలోనైన సంప్రదాయ దుస్తులు ధరించాలి. స్త్రీలు కూడా సంప్రదాయ వస్త్రాలనే ధరించాలి. అలా ధరించేందుకు డబ్బు సరిపోని పేదవారైతే, వారికి ఉన్నదాంట్లో మంచి వస్త్రాలు కట్టుకుని స్నానం చేయాలి.
పురుషులు నదిప్రవాహానికి ఎదురుగాను, స్త్రీలు నదిప్రవాహం వెళుతున్న దిశగా నిల్చుని స్నానం చేయాలి. తల కూడా మునిగేట్లుగా 3 సార్లు మునకవేయాలి. ముందు ఊపిరి తీసుకుని, బొటను వేలుతో ముక్కురంధ్రాలను, మధ్యవేలుతో చెవి రంధ్రాలను మూసి, కన్నులు, నోరు మూసుకుని స్నానం చేయాలి. లేదంటే ముక్కు, చెవి రంధ్రాల ద్వారా నీరు లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది.
నది ఆభిర్భావప్రదేశం నుంచి సాగరసంగమం వరకు ప్రతి చోటా దేవలయాలు, దివ్యధామాలు, ఆశ్రమాలు నెలకొని ఉంటాయి. వాటి నుంచి వచ్చే ‪#‎వేదమంత్రఘోషను‬ నదీజలాలు గ్రహిస్తాయి. నదిలో పూర్తిగా మునిగి స్నానం చేస్తే, ఆ దివ్యమంత్రశక్తి శరీరానికి, మనసుకు పట్టుకుని, రక్షణకవచం వలె పనిచేస్తుంది. సూర్యుడికి అర్ఘ్యప్రధానం చేయాలి. నదిలో నిల్చుని ఏదైనా మంత్రజపం కూడా చేయవచ్చు, కానీ పుష్కరసమయంలో, రద్దీ ఉన్న సమయంలో కాకుండా నదీతీరం ఖాళీగా ఉన్న సమయంలో ఇలా చేయడం ఉత్తమం. లేకపోతే అందరిని ఆపి ఇబ్బంది పెట్టినందుకు పాపం వస్తుంది. సాధ్యమైనత త్వరగా పుష్కరస్నానం ముగించుకుని బయటకు రావడం ఉత్తమం.
స్నానం ముగించిన తర్వాత ఒడ్డుకు వచ్చి, ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. పుణ్యస్నానం చేశాక తడి బట్టలను నదిలో పిండకూడదు. అది కేవలం అశుభం జరిగినప్పుడు మాత్రమే చేస్తారు. అట్లాగే నదిలో బట్టలు ఉతకడం, జాడించడం లాంటి పనులు అసలే చేయరాదు. నది పవిత్రతకు భంగం కలిగించకుండా జాగ్రత్తపడాలి. వీలుంటే స్నానానంతరం గట్టు మీద, లేక ఒడ్డున కూర్చుని స్తోత్ర పారాయణ చేయడం, జపం చేయడం చేయాలి. నదీతీరాలు ఋషులు నడిచిన దివ్యప్రదేశాలు.
చాలామంది నదీతీరంలో దీపాలు వెలిగిస్తుంటారు, పూజలు చేస్తారు, దానాలు చేస్తారు. (నదిలో దీపాలు కార్తీకమాసంలోనే వదులుతారు.) అంతవరకు బాగానే ఉన్నా, వీటి కోసం తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు, ఇతర చెత్తంతా నదిలోకానీ, నదితీరంలో కానీ పడేస్తారు. అరరే! ఇప్పుడే స్నానం చేశాను కదా, ఈవిడ నదీమతల్లి కదా, నాకు ఆశీర్వాదం ఇచ్చింది కదా అనే ఆలోచన అస్సలు ఉండదు. అలా నదిలో చెత్త విసిరేస్తే స్నానఫలితం వస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? నదీతీరం పవిత్ర ప్రదేశం. అక్కడ చెత్త వేయరాదు. దగ్గరలో చెత్తబుట్ట ఉంటే, అందులో వేయండి, లేదా చెత్త మొత్తం ఒక కవర్లో పెట్టి, మీ దగ్గరే పెట్టుకోండి. ఇంటికి వచ్చాకో, లేదా ఇంకెక్కడైనా చెత్తబుట్ట కనిపిస్తే, అక్కడ పడేయండి. ఇష్టంవచ్చినట్లు నదిలో చెత్త వేస్తే, పుణ్యం రాదు, అసలు స్నానం ఫలితం కూడా రాదు, పాపం వస్తుందని గ్రహించండి.
అవకాశం ఉంటే పూలు, గాజులు, పసుపుకుంకుమలతో నదీమతల్లలకు తాబులం సమర్పించడం చాలా మంచిది, కానీ చీరలు, జాకెట్ పీసులు నదిలో వదలకుండా, అక్కడే స్నానం కోసం వచ్చిన సువాసినికి ఇస్తే, నదీమతల్లి ఆనందిస్తుంది. అలా చేస్తే జలగండాల నుంచి నదీమతల్లి రక్షిస్తుంది. అంటురోగాలు రాకుండా ఉంటాయి.
#నదీస్నానం శ్రద్ధను, మేధస్సును, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, పుణ్యాన్ని, శుభాలను, చిత్తశుద్ధిని కలిగిస్తుంది. కేవలం మునక చేతనే చర్మరోగాలు, ధీరకాలిక వ్యాధులు నయమైన వారు ఎందరో ఉన్నారు. నదులకు శక్తి ఉంది, అధిదేవతలూ ఉన్నారు. శాస్త్రం చెప్పిన రీతిలో నదీస్నానం చేసే ఫలితాలు అనుభవంలో తెలుస్తాయి. నదీమతల్లుల పవిత్రతను కాపాడండి. నదులను కలుషితం కానివ్వకండి. అన్నిటికంటే ముందు నదుల్లో కూడా ప్రాణం ఉందని గుర్తించండి.

Written by_
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

డబ్బుతో కొనలేని సంతోషం



ఓ మానసిక శాస్తవ్రేత్తని స్థితిమంతురాలు అయిన ఓ అందమైన యువతి కలిసి తన జీవితం చాలా వృధాగా మారిపోయిందని, తన జీవితంలో ఏమీ లేదని చెప్పింది. ఎలాంటి సంతోషం కూడా లేదని చెప్పింది. సంతోషం పొందే మార్గాలు చెప్పాలని అతన్ని కోరింది.

వెంటనే అతను తన ఆఫీసుని ఊడ్చి శుభ్రపరిచే ఒక స్ర్తిని పిలిచాడు. సంతోషం ఎలా సంపాదించాలో ఈవిడ మీకు చెబుతుందని ఆ అందమైన యువతికి చెబుతాడు. మీరు ఆమె చెప్పే విషయాలని చాలా జాగ్రత్తగా వినాలి. అదే మిమ్మల్ని నేను కోరుతున్నానని కూడా ఆమెకు చెబుతాడు.
తన చేతిలో చీపురుని ఓ మూలన పడేసి ఆ స్ర్తి ఆ యువతి ముందు వున్న కుర్చీలో కూర్చుని ఈ విధంగా చెప్పింది.

‘‘నా భర్త మలేరియా వల్ల చనిపోయాడు. ఆ తర్వాత మూడు నెలలకి నా ఒక్కగా నొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. నాకు ఏమీ మిగల్లేదు. నిద్రపోలేకపోయాను. అంతా దుఃఖం. ఏమీ తినలేకపోయాను. ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. ఎవరు పలకరించినా చిన్న చిరునవ్వుతో వారిని పలకరించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో వున్నప్పుడు ఓరోజు మా ఇంటి ముందు చిన్న కుక్కపిల్లను గమనించాను. చాలా చలిగా ఉంది. ఆ కుక్కపిల్లని నా ఇంటిలోకి రానిచ్చాను. కొన్ని వేడిపాలని ఓ గినె్నలో పోసి దాని ముందుపెట్టాను. అది ఆ పాలను తాగింది. ఆ గినె్నను కూడా నాకేసింది. ఆ తరువాత నా దగ్గరికి వచ్చింది. నా కాళ్లని చాలా ప్రేమతో నాకింది. తన ఒంటి మీద వున్న బూరుతో రుద్దింది. అది వ్యక్తపరిచిన ఆనందాన్ని చూసి అనుకోకుండా నాకు చిరునవ్వు వచ్చింది. కొన్ని నెలల తరువాత నేను నవ్విన చిరునవ్వు అది.

నేను ఆలోచనల్లో పడ్డాను. ఓ చిన్న సహాయం ఆ కుక్కపిల్లకి చేయడంవల్ల నాకు సంతోషం కలిగిందే, మరి ఇంకాస్త సహాయం తోటి వాళ్లకి చేస్తే ఇంకా కాస్త సంతోషం కలుగుతుంది కదా అని అన్పించింది.
ఆ తెల్లవారి మా పక్కింట్లో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి రొట్టెలు చేసి ఇచ్చాను. ఆరోజునుంచి ప్రతిరోజు ఎవరికో ఒకరికి ఏదో సహాయం చేస్తూ వచ్చాను. వాళ్లు పొందిన సంతోషాన్ని చూసి నాకు సంతోషం వేసేది. ఈ రోజు నాకన్నా ఆనందంగా ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారా అని అన్పిస్తుంది. ఆనందంగా తింటున్నాను. ఇంకా ఆనందంగా నిద్రపోతున్నాను. ఎదుటి వాళ్లకి ఇవ్వడంలో నాకు ఆనందం కన్పిస్తుంది.

డబ్బుతో ఏదైనా మీరు కొనుక్కోగలరు. కాని సంతోషాన్ని కొనుక్కోలేరు. అది మనకి మనం పొందాల్సి ఉంటుంది.’’ఆ అందమైన యువతికి సంతోషం అంటే ఏమిటో ఆనందం అంటే ఏమిటో బోధపడింది.
నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావన్న దాన్ని బట్టి జీవితంలో అందం వుంటుంది.
నీవల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు అన్నది ఇంకా ముఖ్యమైంది.
సంతోషం అనేది గమ్యం కాదు అది ఒక ప్రయాణం.సంతోషం మరో రోజులో లేదు.ఇప్పుడే ఉంది
సంతోషం పరాధీనత కాదు అది ఓ నిర్ణయం.

సరస్వతీస్తోత్రం

యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా
యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |
యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా
సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || ౧ ||
దోర్భిర్యుక్తా చతుర్భిః స్ఫటికమణినిభై రక్షమాలాందధానా
హస్తేనైకేన పద్మం సితమపిచ శుకం పుస్తకం చాపరేణ |
భాసా కుందేందుశంఖస్ఫటికమణినిభా భాసమానాఽసమానా
సా మే వాగ్దేవతేయం నివసతు వదనే సర్వదా సుప్రసన్నా || ౨ ||
సురాసురైస్సేవితపాదపంకజా కరే విరాజత్కమనీయపుస్తకా |
విరించిపత్నీ కమలాసనస్థితా సరస్వతీ నృత్యతు వాచి మే సదా || ౩ ||
సరస్వతీ సరసిజకేసరప్రభా తపస్వినీ సితకమలాసనప్రియా |
ఘనస్తనీ కమలవిలోలలోచనా మనస్వినీ భవతు వరప్రసాదినీ || ౪ ||
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా || ౫ ||
సరస్వతి నమస్తుభ్యం సర్వదేవి నమో నమః |
శాంతరూపే శశిధరే సర్వయోగే నమో నమః || ౬ ||
నిత్యానందే నిరాధారే నిష్కళాయై నమో నమః |
విద్యాధరే విశాలాక్షి శుద్ధజ్ఞానే నమో నమః || ౭ ||
శుద్ధస్ఫటికరూపాయై సూక్ష్మరూపే నమో నమః |
శబ్దబ్రహ్మి చతుర్హస్తే సర్వసిద్ధ్యై నమో నమః || ౮ ||
ముక్తాలంకృత సర్వాంగ్యై మూలాధారే నమో నమః |
మూలమంత్రస్వరూపాయై మూలశక్త్యై నమో నమః || ౯ ||
మనోన్మని మహాభోగే వాగీశ్వరి నమో నమః |
వాగ్మ్యై వరదహస్తాయై వరదాయై నమో నమః || ౧౦ ||
వేదాయై వేదరూపాయై వేదాంతాయై నమో నమః |
గుణదోషవివర్జిన్యై గుణదీప్త్యై నమో నమః || ౧౧ ||
సర్వజ్ఞానే సదానందే సర్వరూపే నమో నమః |
సంపన్నాయై కుమార్యై చ సర్వజ్ఞే తే నమో నమః || ౧౨ ||
యోగానార్య ఉమాదేవ్యై యోగానందే నమో నమః |
దివ్యజ్ఞాన త్రినేత్రాయై దివ్యమూర్త్యై నమో నమః || ౧౩ ||
అర్ధచంద్రజటాధారి చంద్రబింబే నమో నమః |
చంద్రాదిత్యజటాధారి చంద్రబింబే నమో నమః || ౧౪ ||
అణురూపే మహారూపే విశ్వరూపే నమో నమః |
అణిమాద్యష్టసిద్ధాయై ఆనందాయై నమో నమః || ౧౫ ||
జ్ఞాన విజ్ఞాన రూపాయై జ్ఞానమూర్తే నమో నమః |
నానాశాస్త్ర స్వరూపాయై నానారూపే నమో నమః || ౧౬ ||
పద్మజా పద్మవంశా చ పద్మరూపే నమో నమః |
పరమేష్ఠ్యై పరామూర్త్యై నమస్తే పాపనాశినీ || ౧౭ ||
మహాదేవ్యై మహాకాళ్యై మహాలక్ష్మ్యై నమో నమః |
బ్రహ్మవిష్ణుశివాయై చ బ్రహ్మనార్యై నమో నమః || ౧౮ ||
కమలాకరపుష్పా చ కామరూపే నమో నమః |
కపాలికర్మదీప్తాయై కర్మదాయై నమో నమః || ౧౯ ||
సాయం ప్రాతః పఠేన్నిత్యం షణ్మాసాత్సిద్ధిరుచ్యతే |
చోరవ్యాఘ్రభయం నాస్తి పఠతాం శృణ్వతామపి || ౨౦ ||
ఇత్థం సరస్వతీస్తోత్రమగస్త్యమునివాచకమ్ |
సర్వసిద్ధికరం నౄణాం సర్వపాపప్రణాశనమ్ || ౨౧ ||

అనుకూల నక్షత్రాలు......!!

అశ్విని : నామకరణ, అన్నప్రాసన, గృహరంబ,గృహప్రవేశ,వివాహములకు.
భరణి : గయాది ప్రదేశాల్లో శ్రాద్ధాలకు, మంత్ర శాస్త్ర అధ్యాయానికి.
కృతిక : విత్తనాలు చల్లడానికి,మొక్కలు నాటడానికి.
రోహిణి : పెళ్ళిళ్ళు,ఇంటి పనులు, ఇతర అన్ని పనులకు.
మృగశిర : అన్ని పనులకు మంచిది
ఆర్ధ : నూతులు త్రవ్వడానికి,మంత్ర ప్రయోగాలకు, శివ పూజకు.
పునర్వసు : అన్నప్రాసన,చౌలది సర్వ కార్యాలకు శుబం. పెళ్లిళ్లకు మాధ్యమం.
పుష్యమి : పెళ్లిళ్లకు,గృహ ప్రవేశాలకు
ఆశ్లేష : యంత్ర పనిముట్ల ప్రారంబానికి
మఖ : ప్రయాణ శుబకార్యలకు
పుబ్బ : నూతులు త్రవ్వడానికి, విత్తనాలు చల్లడానికి.
ఉత్తర : పెళ్ళిళ్ళు,ఇతర అన్ని పనులకు.
హస్త : గృహ ప్రవేశాలకు తప్ప అన్ని ఇతర పనులకు
చిత్త : వివాహాలు,విద్య ప్రారంబం,గృహ ప్రవేశం వంటికి మంచిది
స్వాతి : పెళ్ళిళ్ళు వంటి అన్ని పనులకు.
విశాక : నూతులు త్రవ్వడానికి,మంత్ర ప్రయోగాలకు.
అనురాధ : పెళ్ళిళ్ళు,ఉపనయనాలకు,ఇతర అన్ని శుబకార్యలకు
జేష్ఠ : నూతులు త్రవ్వడానికి,ప్రయాణాలకు
మూల : పెళ్ళిళ్ళు,ఉపనయనాలకు,ప్రయాణాలు
పూర్వాషాడ : నూతులు త్రవ్వడానికి
ఉత్తరాషాడ : అన్ని పనులకు మంచిది
శ్రవణం : గృహ ప్రవేశాలకు తప్ప అన్ని ఇతర పనులకు
ధనిష్ఠ : వ్యాపార పనులకు,యంత్రాలకు, పెళ్లిళ్లకు
శతబీశ : నూతులు త్రవ్వడానికి, అన్ని పనులకు
పూర్వాభాద్ర : విద్య ఆరంబనికి , నూతులు త్రవ్వడానికి
ఉత్తరాభాద్ర : అన్ని పనులకు
రేవతి : పెళ్ళిళ్ళు,ఉపనయనములు,యాత్రలు.

గాయత్రి మంత్రములు



-: బ్రహ్మ గాయత్రి :-
1. వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
2. తత్పురుషాయ విద్మహే చతుర్ముఖాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్.//
3. సురారాధ్యాయ విద్మహే వేదాత్మనాయ ధీమహి తన్నో బ్రహ్మః ప్రచోదయాత్. //

-: విష్ణు గాయత్రి :-
4. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //
5. లక్ష్మీనాధాయ విద్మహే చక్రధరాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్//
6. దామోదరాయ విద్మహే చతుర్భుజాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ //

-: శివ గాయత్రి :-
7. శివోత్తమాయ విద్మహే మహోత్తమాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
8. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్.//
9. సదాశివాయ విద్మహే జటాధరాయ ధీమహి తన్నోరుద్రః ప్రచోదయాత్//
10. పంచవక్త్రాయ విద్మహే అతిశుద్ధాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ //
11. గౌరీనాధాయ విద్మహే సదాశివాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //
12. తన్మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నశ్శివః ప్రచోదయాత్ //

-: వృషభ గాయత్రి :-
13. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
14. తీష్ణశృంగా విద్మహే వేదపాదాయ ధీమహి తన్నో నందిః ప్రచోదయాత్.//
-: చండీశ్వర గాయత్రి :-
15. ద్వారస్థితాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//
16. చండీశ్వరాయ విద్మహే శివభక్తాయ ధీమహి తన్నశ్చండః ప్రచోదయాత్.//

-: భృంగేశ్వర గాయత్రి :-
17. భృంగేశ్వరాయ విద్మహే శుష్కదేహాయ ధీమహి తన్నోభృంగి ప్రచోదయాత్.//
-: వీరభద్ర గాయత్రి :-
18. కాలవర్ణాయ విద్మహే మహాకోపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
19. చండకోపాయ విద్మహే వీరభద్రాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//
20. ఈశపుత్రాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నోభద్రః ప్రచోదయాత్.//

-: శిఖరగాయత్రి :-
21. శీర్ష్యరూపాయ విద్మహే శిఖరేశాయ ధీమహి తన్న స్థూపః ప్రచోదయాత్.//
-: ధ్వజగాయత్రి :-
22. ప్రాణరూపాయ విద్మహే త్రిమేఖలాయ ధీమహి తన్నోధ్వజః ప్రచోదయాత్.//

-: దత్త గాయత్రి :-
23. దిగంబరాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్.//
-: శాస్త [అయ్యప్ప] గాయత్రి :-
24.భూతనాధాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నశ్శాస్తా ప్రచోదయాత్.//

-: సుదర్శన గాయత్రి :-
25. సుదర్శనాయ విద్మహే జ్వాలాచక్రాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//
26. సుదర్శనాయ విద్మహే యతిరాజాయ ధీమహి తన్నశ్చక్రఃప్రచోదయాత్.//

-: మత్స్య గాయత్రి :-
27. జలచరాయ విద్మహే మహామీనాయ ధీమహి తన్నోమత్స్యః ప్రచోదయాత్.//

-: కూర్మ గాయత్రి :-
28. కచ్చపేశాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నోకూర్మ: ప్రచోదయాత్.//

-: వాస్తుపురుష గాయత్రి :-
29. వాస్తునాధాయ విద్మహే చతుర్బుజాయ ధీమహి తన్నో వాస్తుః ప్రచోదయాత్.//

-: శ్రీ గణపతి గాయత్రి :-
30. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//
31. ఆఖుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో విఘ్నః ప్రచోదయాత్.//

-: శ్రీ కృష్ణ గాయత్రి :-
32. దామోదరాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
33. గోపాలకాయ విద్మహే గోపీ ప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//
34. వాసుదేవాయ విద్మహే రాధాప్రియాయ ధీమహి తన్నో కృష్ణః ప్రచోదయాత్.//

-: శ్రీ రామ గాయత్రి :-
35. దాశరధాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//
36. ధర్మ రూపాయ విద్మహే సత్యవ్రతాయ ధీమహి తన్నో రామః ప్రచోదయాత్.//

-: శ్రీ ఆంజనేయ గాయత్రి :-
37. ఆంజనేయాయ విద్మహే మహాబలాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//
38. పవనాత్మజాయ విద్మహే రామభక్తాయ ధీమహి తన్నో కపిః ప్రచోదయాత్.//

-: శ్రీ హయగ్రీవ గాయత్రి :-
39. వాగీశ్వరాయ విద్మహే హయగ్రీవాయ ధీమహి తన్నో హగ్ం సహః ప్రచోదయాత్.//

-: శ్రీ స్కంద గాయత్రి :-
40. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
41. తత్పురుషాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//
42. షడాననాయ విద్మహే శక్తిహస్తాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్.//

-: శ్రీ సుబ్రహ్మణ్య గాయత్రి :-
43. భుజగేశాయ విద్మహే ఉరగేశాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//
44. కార్తికేయాయ విద్మహే వల్లీనాధాయ ధీమహి తన్నో నాగః ప్రచోదయాత్.//

-: శ్రీ గరుడ గాయత్రి :-
45. తత్పురుషాయ విద్మహే సువర్ణపక్షాయ ధీమహి తన్నో గరుడః ప్రచోదయాత్.//

-: శ్రీ అనంత గాయత్రి :-
46. అనంతేశాయ విద్మహే మహాభోగాయ ధీమహి తన్నో నంతః ప్రచోదయాత్.//

-: శ్రీ ఇంద్రాద్యష్టదిక్పాలక గాయత్రి :-
47. దేవరాజాయ విద్మహే వజ్రహస్తాయ ధీమహి తన్నో ఇంద్రః ప్రచోదయాత్.//
48. వైశ్వానరాయ విద్మహే లాలీలాయ ధీమహి తన్నో అగ్నిః ప్రచోదయాత్.//
49. కాలరూపాయ విద్మహే దండధరాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్.//
50. ఖడ్గాయుధాయ విద్మహే కోణ స్థితాయ ధీమహి తన్నో నిఋతిః ప్రచోదయాత్.//
51. జలాధిపాయ విద్మహే తీర్థరాజాయ ధీమహి తన్నో పాశిన్ ప్రచోదయాత్.//
52. ధ్వజహస్తయ విద్మహే ప్రాణాధిపాయ ధీమహి తన్నో వాయుః ప్రచోదయాత్.//
53. శంఖ హస్తయ విద్మహే నిధీశ్వరాయ ధీమహి తన్నో సోమః ప్రచోదయాత్.//
54. శూలహస్తయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో ఈశః ప్రచోదయాత్.//

-: శ్రీ ఆదిత్యాది నవగ్రహ గాయత్రి :-
55. భాస్కరాయ విద్మహే మహా ద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్యః ప్రచోదయాత్.//
56. అమృతేశాయ విద్మహే రాత్రించరాయ ధీమహి తన్న శ్చంద్రః ప్రచోదయాత్.//
57. అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో కుజః ప్రచోదయాత్.//
58. చంద్రసుతాయ విద్మహే సౌమ్యగ్రహాయ ధీమహి తన్నో బుధః ప్రచోదయాత్.//
59. సురాచార్యాయ విద్మహే దేవ పూజ్యాయ ధీమహి తన్నో గురుః ప్రచోదయాత్.//
60. భార్గవాయ విద్మహే దైత్యాచార్యాయ ధీమహి తన్నో శుక్రః ప్రచోదయాత్.//
61. రవిసుతాయ విద్మహే మందగ్రహాయ ధీమహి తన్నో శనిః ప్రచోదయాత్.//
62. శీర్ష్యరూపాయ విద్మహే వక్రఃపంథాయ ధీమహి తన్నో రాహుః ప్రచోదయాత్.//
63. తమోగ్రహాయ విద్మహే ధ్వజస్థితాయ ధీమహి తన్నో కేతుః ప్రచోదయాత్.//

-: శ్రీ సాయినాథ గాయత్రి :-
64. జ్ఞాన రూపాయ విద్మహే అవధూతాయ ధీమహి తన్నస్సాయీ ప్రచోదయాత్.//

-: శ్రీ వేంకటేశ్వర గాయత్రి :-
65. శ్రీ నిలయాయ విద్మహే వేంకటేశాయ ధీమహి తన్నోహరిః ప్రచోదయాత్.//

-: శ్రీ నృసింహ గాయత్రి :-
66. వజ్రనఖాయ విద్మహే తీష్ణదగ్ ష్ట్రాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్.//

-: శ్రీ లక్ష్మణ గాయత్రి :-
67. రామానుజాయ విద్మహే దాశరధాయ ధీమహి తన్నః శేషః ప్రచోదయాత్.//

-: శ్రీ క్షేత్రపాల గాయత్రి :-
68. క్షేత్రపాలాయ విద్మహే క్షేత్రస్థితాయ ధీమహి తన్నః క్షేత్రః ప్రచోదయాత్.//

-: యంత్ర గాయత్రి :-
69. యంత్రరాజాయ విద్మహే మహాయంత్రాయ ధీమహి తన్నోః యంత్రః ప్రచోదయాత్.//

-: మంత్ర గాయత్రి :-
70. మంత్రరాజాయ విద్మహే మహా మంత్రాయ ధీమహి తన్నోః మంత్రః ప్రచోదయాత్.//

-: శ్రీ సరస్వతీ గాయత్రి :-
71. వాగ్దేవ్యైచ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నోవాణీః ప్రచోదయాత్.//

-: శ్రీ లక్ష్మీ గాయత్రి :-
72. మహాదేవ్యైచ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//
73. అమృతవాసిని విద్మహే పద్మలోచని ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్.//

-: శ్రీ గౌరి గాయత్రి :-
74. గణాంబికాయ విద్మహే మహాతపాయ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//
75. మహా దేవ్యైచ విద్మహే రుద్ర పత్న్యై చ ధీమహి తన్నో గౌరీః ప్రచోదయాత్.//

-: శ్యామలా గాయత్రి :-
76. శుకప్రియాయ విద్మహే క్లీం కామేశ్వరి ధీమహి తన్నః శ్యామలా ప్రచోదయాత్.//
77. మాతంగేశ్వరి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నః క్లిన్నే ప్రచోదయాత్.//

-: భైరవ గాయత్రి :-
78. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరీచ ధీమహి తన్నో భైరవీ ప్రచోదయాత్.//

-: శక్తి గాయత్రి :-
79. త్రిపురాదేవి విద్మహే సౌః శక్తీశ్వరి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//

-: శ్రీ కన్యకాపరమేశ్వరీ గాయత్రి :-
80. బాలారూపిణి విద్మహే పరమేశ్వరి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//
81. త్రిపురాదేవి విద్మహే కన్యారూపిణి ధీమహి తన్నః కన్యా ప్రచోదయాత్.//

-: శ్రీ బాలా గాయత్రి :-
82. త్రిపురాదేవి విద్మహే కామేశ్వరిచ ధీమహి తన్నో బాలా ప్రచోదయాత్.//

-: శ్రీ సీతా గాయత్రి :-
83. మహాదేవ్యైచ విద్మహే రామపత్న్యై చ ధీమహి తన్నః సీతా ప్రచోదయాత్.//

-: శ్రీ దుర్గా గాయత్రి :-
84. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గిః ప్రచోదయాత్.//

-: శ్రీ శూలినీ దుర్గా గాయత్రి :-
85. జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్.//

-: శ్రీ ధరా గాయత్రి :-
86. ధనుర్దరాయ విద్మహే సర్వసిద్దించ ధీమహి తన్నో ధరా ప్రచోదయాత్.//

-: శ్రీ హంస గాయత్రి :-
87. హంసహంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్.//

-: శ్రీ ముక్తీశ్వరీ గాయత్రి :-
88. త్రిపురాదేవి విద్మహే ముక్తీశ్వరీ ధీమహి తన్నో ముక్తిః ప్రచోదయాత్.//

-: శ్రీ గంగా దేవీ గాయత్రి :-
89. త్రిపధగామినీ విద్మహే రుద్రపత్న్యై చ ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//
90. రుద్రపత్న్యై చ విద్మహే సాగరగామిని ధీమహి తన్నో గంగా ప్రచోదయాత్.//

-: శ్రీ యమునా గాయత్రి :-
91. యమునా దేవ్యైచ విద్మహే తీర్థవాసిని ధీమహి తన్నో యమునా ప్రచోదయాత్.//

-: శ్రీ వారాహీ గాయత్రి :-
92. వరాహముఖి విద్మహే ఆంత్రాసనిచ ధీమహి తన్నో వారాహీ ప్రచోదయాత శ్రీ చాముండా గాయత్రి :-
93. చాముండేశ్వరి విద్మహే చక్రధారిణి ధీమహి తన్నః చాముండా ప్రచోదయాత్.//

శ్రీ వైష్ణవీ గాయత్రి :-
94. చక్రధారిణి విద్మహే వైష్ణవీ దేవి ధీమహి తన్నః శక్తిః ప్రచోదయాత్.//

శ్రీ నారసింహ గాయత్రి :-
95. కరాళిణిచ విద్మహే నారసింహ్యైచ ధీమహి తన్నః సింహేః ప్రచోదయాత్.//

శ్రీ బగాళా గాయత్రి :-
96. మహాదేవ్యైచ విద్మహే బగళాముఖి ధీమహి తన్నో అస్త్రః ప్రచోదయాత్.//

-: శ్రీ సాంబ సదాశివ గాయత్రి :-
97. సదాశివాయ విద్మహే సమాస్రాక్షాయ ధీమహి తన్నః సాంబః ప్రచోదయాత్.//

శ్రీ సంతోషీ గాయత్రి :-
98. రూపాదేవీచ విద్మహే శక్తిరూపిణి ధీమహి తన్నస్తోషి ప్రచోదయాత్.//

శ్రీ లక్ష్మీ గణపతి గాయత్రి :-
99. తత్పురుషాయ విద్మహే శక్తియుతాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//
100. దశభుజాయ విద్మహే వల్లభేశాయ ధీమహి తన్నో దన్తిః ప్రచోదయాత్.//

సర్వే జనాః స్సుఖినోభవంతు.

రాగి పాత్రలో ప్రత్యేకత

ప్రపంచంలో మనకు కనిపిస్తున్న లోహాలలో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. అవి దైవానికి ప్రతిరూపాలుగా కూడా చెబుతారు. సువర్ణం ఈశ్వర సంబంధమైనది. తామ్రం విష్ణు సంబంధమైనది. తామ్రం (రాగి) విష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. బంగారము, వెండి, కంచు లాంటి ఇతర లోహాలు ఎన్ని ఉన్నా రాగి అన్నా, రాగితో చేసిన పాత్రలన్నా శ్రీమహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైనవి అనే విషయాన్ని రుజువు చేస్తోంది వరాహపురాణం. ఈ పురాణంలోని నూట అరవై ఎనిమిదో అధ్యాయంలో సాక్షాత్తూ వరాహ రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువే భూదేవికి ఈ విషయాన్ని వివరించాడు.

భూదేవి ఓ రోజున శ్రీమహావిష్ణువును ఏ పాత్రలో నైవేద్యం పెడితే ఆయనకు ఇష్టమో చెప్పమని కోరింది. అప్పుడు ఆయన చాలామంది తనకు బంగారు, వెండి, కంచు పాత్రలలో నైవేద్యం పెడుతుంటారని, కానీ తనకు రాగి పాత్ర అంటేనే ఎంతో ఇష్టమని చెప్పాడు. దానికి ఓ కారణం ఉందని కూడా వివరించాడు.

పూర్వం రాక్షసులలో గూడాకేశుడు అనే ఓ రాక్షసుడుండేవాడు. అతడు రాక్షసుడైనా దుర్మార్గపు బుద్ధి లేకుండా దైవచింతనతో ప్రవర్తిస్తూ శ్రీమహావిష్ణువునే నిరంతరం ఆరాధిస్తూ ఉండేవాడు. అలా ధర్మకాముడై నిశ్చలబుద్ధితో పదహారు వేల సంవత్సరాలపాటు గూడాకేశుడు విష్ణువు గురించి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి విష్ణువు ప్రత్యక్షమై ఏమికావాలో కోరుకోమన్నాడు. అప్పుడా అసురుడు తనకు వేరే ఏమీ అక్కరలేదని వేల జన్మల పాటు విష్ణుభక్తి తనకు ఉండేలా అనుగ్రహించమన్నాడు. అంతేకాక శ్రీమహావిష్ణువు విడిచిన చక్రం వల్ల తనకు మరణం కలగాలని అప్పుడు తన శరీరమంతా రాగి లోహంగా మారిపోవాలని కోరుకున్నాడు. ఆ పరిశుద్ధమైన లోహంతో తయారైన పాత్రలో ప్రతినిత్యం శ్రీమహావిష్ణువుకు నైవేద్యం అందేలా వరమివ్వమని గూడాకేశుడు విష్ణువును ప్రార్థించాడు. గూడాకేశుడిని విష్ణువు అలాగేనని అనుగ్రహించి అంతర్థానమయ్యాడు. ఆ తరువాత కూడా ఆ రాక్షసుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు.

వైశాఖశుద్ధ ద్వాదశినాడు శ్రీమహావిష్ణువు ఆ అసురుడి కోరిక తీర్చాలనుకున్నాడు. గూడాకేశుడు కూడా తనకు అంతటి భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ఎదురుచూస్తూనే ఉన్నాడు. అతడిలోని నిర్మలభక్తికి మెచ్చిన విష్ణువు వైశాఖ శుద్ధ ద్వాదశినాడు సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తున్న సమయంలో విష్ణువు తన చక్రాన్ని ప్రయోగించాడు. వెంటనే అది అతడిని ఖండించింది. అతడి మాంసమంతా తామ్రం అయింది. అతడి శరీరంలోని అస్థులు వెండి అయ్యాయి. మలినాలు కంచులోహంగా అయ్యాయి. తనను జీవితాంతం అలా స్మరిస్తూ ఉన్న భక్తుడి కోరికను తీర్చాడు విష్ణువు. గూడాకేశుడి శరీరంనుంచి ఏర్పడిన తామ్ర లోహంతో ఒక పాత్ర తయారయింది. ఆ పాత్రలో పెట్టిన నైవేద్యమంటే విష్ణువుకు మహా ప్రీతికరమైంది. ఆ తరువాత తరువాత భక్తులెవరైనా రాగిపాత్రలో పెట్టిన నైవేద్యాన్ని మాత్రమే విష్ణువు ఆనందంతో స్వీకరించసాగాడు.

రాగి పాత్రలోని నైవేద్యంలో ఎన్ని మెతుకులు ఉంటాయో అన్ని వేల సంవత్సరాలపాటు ఆ నైవేద్యాన్ని పెట్టిన భక్తుడు తన లోకంలో ఉండగలడని శ్రీమహావిష్ణువు భూదేవితో చెప్పాడు. రాగి లోహాన్ని గురించి విశేషంగా చెప్పిన కథ ఇది. ఆరోగ్య శాస్త్ర రిత్యా పరిశీలించి చూసినా రాత్రి పూట రాగిపాత్రలో పోసివుంచిన నీటిని ఉదయాన్నే లేవగానే తాగిన వారికి రక్తశుద్ధి జరుగుతుందని, ఆరోగ్యకరంగా ఉంటుందని ఈనాడు కూడా అనుభవజ్ఞులెందరెందరో చెబుతున్నారు.

మూలశంక, జ్వరము, రక్తపిత్తము, శోధ (వాపులు), కుష్టము, శరీరము లావెక్కుట మొదలగు రోగాలు రావు. వార్ధక్య లక్షణములు లేక మానవుడు 100 సంవత్సరములు ఆరోగ్యముగా జీవించును. అటులే ముక్కు రంధ్రములను 300 మీ.లీ. నీటిని పీల్చి శుభ్రము చెసుకొన వలయును. ఈ విధముగా చేయుట వలన పడిశం, తుమ్ములు, దగ్గు, ముక్కులో వచ్చే వ్యాధులు తగ్గును. ఈ క్రియను యోగ, ప్రకృతి చికిత్సల్లో నేటికినీ చేయుచున్నారు వారమునకు ఒకసారి నువ్వుల నూనెతో తైలమర్దన చేయుటవలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా తామ్రలోహం ఇతర లోహాల కన్నా ఎంతో విశిష్టమైనదని పురాణ వాజ్ఞ్మయం పేర్కొంటోంది.

Written by_ 
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ....

కర్ణవేధ' చెవులు కుట్టించుకోవడం..?


చెవులం అనగా 'కర్ణవేధ' అను విశేషార్థం కలదు. కర్ణవేధ అనగా చెవులను పోటుతో వేధించడం. చెడు మాటలు విన్నప్పుడల్లా ఆ పోటు గుర్తుకు రావాలి అని అంతరార్థం. కర్ణవేధ చేయించినపుడు పురోహితుడు 'మాశృణు పాప్నానం, మాశ్రావయ పాప్నానం మోచ్ఛారయ పాప్నానం మాచర పాప్నానం మాపశ్య పాప్నానాం' అని చెవిలో చెప్పి బంగారుతీగను ఈ మంత్రంతో ప్రోక్షించి మొదట దైవానికి పురోహితునికి అర్పించి కంసాలికి ఇచ్చి చెవులు కట్టించెదరు.

చెవులు కుట్టించుకోవడం ఆడవాళ్లకు చెందిన వ్యవహారం అని, ఇది అందం కోసం పుట్టిన సంప్రదాయం అని చాలా మంది అను కుంటారు. నిజానికి చెవులు కుట్టించుకోవడం అనేది ఆడవాళ్ళకు మాత్రమే చెందిన వ్యవహారం కాదు. అసలిది కేవలం అందం కోసం పుట్టిన సంప్రదాయం అంతకంటే కాదు.
చెవులు కుట్టించుకోవడం వల్ల చెవుడు రాదు. చెవికి, కంటికి సంబంధం ఉందని మనకు తెలుసు. చెవులు కుట్టించుకోవడం వల్ల కంటిచూపు బాగుపడుతుందని నిపుణులు తేల్చి చెప్పారు. మొదట కంటిచూపును మెరుగుపరచుకోవడం కోసమే చెవులు కుట్టించుకోవడం అనే సంప్రదాయం ఏర్పడింది. అలా చెవులకు రంధల్రు అయిన తర్వాత వాటికి ఆభరణాలను పెట్టుకోవడం అనే ఆచారం ఆరంభమయింది. అందువల్లనే పూర్వం స్త్రీలు మాత్రమే కాదు, పురుషులు కూడా చెవులు కుట్టిం చుకునేవారు. ఎక్కువ మంది చెవికి అడుగుభాగంలో కుట్టించుకుంటారు. మరికొందరు చెవికి క్రింది భాగంలోనే కాకుండా పైన, పక్కన అనేక భాగాల్లో కూడా కుట్టించుకుంటారు. ఇంకొందరు ముక్కుకు రంధం పెట్టించుకుంటారు. 'ఇవన్నీ కూడా ఆరోగ్య రీత్యా ఏర్పడిన సంప్రదాయాలే.
ఆయుర్వేదం, హౌమియోపతి, అలోపతి ల్లాగే ఆక్యుపంక్చర్ ఒక వైద్య విధానం. అయితే ఈ పేరుతో, ప్రస్తుత పద్ధతిలో కాకున్నా పూర్వం ఎప్పుడో ఈ రకమైన చికిత్స ఉండేది. అందులో భాగమే చెవులు, ముక్కు కుట్టించుకునే పద్ధతి. ఇంకా లోతుగా చెప్పాలంటే... చెవికి, కళ్ళు, ముక్కు, పళ్ళులాంటి ఇతర అవయవాలతోనూ సంబంధం వుంది. ముఖంలోని అనేక ఇతర అవయవాలకు చెవి ప్రాతినిధ్యం వహిస్తుంది. కనుకనే పన్ను పీకేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా వినికిడి శక్తి తగ్గుతుంది.
ఒక్కోసారి విషజ్వరం లాంటి అనారోగ్యాలు సోకినప్పుడు చెవికి ఇబ్బంది కలుగుతుంది. కొందరికి కొంత వినికిడి శక్తి తగ్గవచ్చు. ఇంకొందరికి బ్రహ్మచెవుడు వచ్చే ప్రమాదం కూడా ఉంది. చెవులు కుట్టించుకోవడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఉబ్బసం, మూర్చ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను చెవులు కుట్టడం ద్వారా నివారించవచ్చు. శరీరంలోని ఇతర అవయవాలకు, చెవికి ఇంత అవినా భావ సంబంధం ఉంది కనుకనే పూర్వం స్త్రీ,పురుషులందరూ చెవి కుట్టించుకునేవారు. అలా చెవి కుట్టించుకోవడం అనేది ఆరోగ్యం కోసం మొదలై, అందచందాలు తీసుకొ స్తోంది. ఆరోగ్యం కోసం చెవులు కుట్టించు కోవడం మొదలయ్యాక బంగారం, రాగి లాంటి లోహాలతో చెవి దుద్దులు, లోలకులు తయారు చేయించుకుని ధరిస్తున్నారు.
Written by_ 
గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....

మార్గశిర లక్ష్మీవార వ్రతం


‘మార్గశీర్ష’ మాసము ఒక విలక్షణమైన మాసము. ‘మార్గశీర్షము’ అంటేనే మార్గములందు శ్రేష్ఠమైనది. ఉపయోగకరమైనదని అర్థం. ఇది ఏ మార్గము అంటే భగవంతుని పొందు భక్తిమార్గము. శీర్షప్రాయమైన ఈ మార్గము మిగిలిన మార్గములన్నింటికన్నా ప్రధానమైనది, ప్రాముఖ్యతతోపాటు పవిత్రత కూడా ఏర్పడటంచే ఇది శ్రేష్టమైనది.

శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన మాసం మార్గశిరం.

‘‘బృహత్సామ తథాసామ్నాం- గాయత్రీ ఛందసా మహం- మాసానాం మార్గశీర్షోహ- ఋతూనాంకుసుమాకరం’

అనే శ్లోకంలో మార్గశీర్గాన్నీ నేనే, ఆరు ఋతువులలోనూ పుష్పసౌరభం నేనే, సామవేదానికి చెందిన గానాలలో బృహత్సామాన్ని నేనే, ఛందస్సులలో గాయత్రీ ఛందాన్ని, శోభ అధికంగా ఉండే వసంత కాలాన్ని నేను అని భగవద్గీతలోని విభూతి యోగంలో సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్ముడే పేర్కొన్నాడు. శ్రీకృష్ణుడు మార్గశిరం అంటే నేనేనని చెప్పుకున్న మాసమిది.

మార్గశిర మాసము శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీదేవికి, సూర్యభగవానుడికి కూడా ప్రీతికరమైన మాసము. పవిత్రమైన ‘భగవద్గీత’ జన్మించిన మాసం.
ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం, పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయవలెను. శ్రీ విష్ణువుతోపాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని, ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో ‘ఓం దామోదరాయనమః’ ఓ నమో నారాయణయనమః’ అనే మంత్రాన్ని పఠించాలని శాస్త్ర వచనం.

మార్గశిర మాసంలోని గురువారాల్లో శ్రీ మహాలక్ష్మీని పూజిస్తూ ‘‘మార్గశిర లక్ష్మీవార వ్రతం’’ చేయడం, ద్వాదశి అభిషేకంవల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. ఈ మాసంలో లవణం దానం చేయటం, ఈ మార్గశిర మాస విధులను పాటించడంవల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి.

చంద్రుడు మనః కారకుడు, ఆ చంద్రుడు అనుకూలం గా లేక పొతే, మంచి ఆలోచనలు కలగవు, మానసిక స్థితి సరైన మార్గం లో ఉండదు. అందుకని చంద్రుడు అనుకూలించే కాలం లో మన దైవపూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ద బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ది చెందుతుంది.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుని కి ఉచ్ఛ స్థానం వృషభ రాశి, మృగశిర నక్షత్రం వృషభరాశి కి చెందినది కావున, చంద్రుని సంపూర్ణ అనుగ్రహం ఉండి దైవ కార్యాలని చేసే కొద్దీ చేయలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి. శుద్ద పాడ్యమి నుండి ఈ మాసమంతా శ్రీ మహా విష్ణువు ని పూజిస్తారు.ప్రాతః కాలం ఆచరించే స్నానాన్ని మాఘ స్నానాలు అంటారు. శ్రీ మహా విష్ణువు కి ప్రీతికరమైన ఈ మాసం లో విష్ణు సహస్రనామ పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలనందిస్తుంది.

మాసానాం మార్గశీర్షోసాం (మాసాలలో మార్గశిర మాసాన్ని నేను) అని శ్రీకృష్ణుడు 'భగవద్గీత-విభూతియోగం'లో చెప్పాడు. మార్గశిరమాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజించే ఆచారం ఉంది.లక్ష్మీ ఆరాధనవల్లనే గురువారాన్ని లక్ష్మివారం అని అంటారు.జ్యోతిషార్థంలో సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసం అనీ, చాంద్రమానం ప్రకారం మార్గశిరమాసం అనీ అన్నారు.ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తే అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని శాస్త్ర ప్రవచనం. ఈ మాసంలో పసుపు, ఆవాలు, మెంతులు, మిరియాలు, చింతపండు, పెరుగు మొదలైనవి .ఈ కాలంలో క్షారగుణాన్ని హరించి ఆరోగ్యాన్ని రక్షిస్తాయి గనుక, ఆహారపదార్థాలలోను, దేవతా సంబంధమైన నైవేద్యాలలోను విరివిగా వాడతారు. ఇవన్నీ ఔషధ విలువలున్నవే! దేహానికి ఉష్ణశక్తిని కలిగించేవే!

మార్గశిర మాస పూజలో లక్ష్మీవారంనాడు తలకు నూనె పెట్టుకోరాదని, బియ్యం ఇచ్చి ఏమీ కొనరాదని నియమాలుంచారు.మృగ శిరతో కూడిన పూర్ణిమ (మార్గశీర్షమున) లవణదానం చేయాలి.ధనుర్మాసం పూర్తిగా ప్రతినిత్యం సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి మహావిష్ణువును విష్ణుసహస్రనామముతో ప్రార్థించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి రోజున ఉపవశించి మహావిష్ణువును ప్రార్థించినట్లైతే మోక్షము ప్రాప్తిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...