Monday, March 26, 2018

సుందరకాండ పారాయణంతో సకల దోషాల విముక్తి

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

సుందరకాండ పారాయణ వల్ల సకల దోషాలు తొలగి పోతాయి. శని,రాహు,కుజ, కేతు దోషాల వల్ల మనుషులు ఎన్నో కష్ట నష్టాలకు గురి అవుతూ ఉన్నారు.అటువంటి బాధల నుంచి విముక్తిపొందేందుకు సుందరకాండ పారాయణను చేయడం అత్యంత శ్రేష్ఠమని సాక్షాత్తు పరమశివుడు పార్వతి దేవితో ఓ సందర్భంలో అంటాడు. 'ఓ పార్వతీ! సకల దేవతల్లో శ్రీరాముడు ఎంతగొప్పవాడో, ఉన్నతుడో,వృక్షజాతుల్లో కల్ప వృక్షం ఎంత మంగళకరమైనదో, అంతటి గొప్పది అయిన ఆది కావ్యమైన శ్రీమద్రామాయణంలో అత్యంత కీలకమైనది సుందరకాండ. సుందరకాండ పారాయణ తులసివనంలో చేస్తే ఎంతో మేలు జరుగుతుంది. బిల్లవృక్షం వద్ద చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది.నదీ తీరాల్లో సుందరకాండ పారాయణ ఎంతో శుభప్రదం. ఇంట్లో పారాయణ చేసేవారు శుచి, శుభ్రత లను పాటించాలి. సుందరకాండ పారాయణం వల్ల మనిషిలో ఉదాత్త గుణాలు కలుగుతాయి.ఎవరితోనూ తగవులు లేకుండా ప్రశాంతంగా జీవనం సాగించేందుకు అవసరమైన బుద్ధిని ఆంజనేయుడు ప్రసాదిస్తాడు. సుగ్రీవుని మంత్రిగా ఆంజనే యుడు రామలక్ష్మణులను చూసిన నాటి నుంచి శ్రీరామ పట్టాభిషేకం వరకూ వహించిన పాత్ర ఆయనలోని బుద్ధి బలాన్నీ, యశోధైర్యాన్ని సుబోధకం చేస్తుంది.

ఆంజనయుణ్ణి కేవలం వానరంగా కాకుండా, ఈశ్వరాంశ సంభూతు నిగా, శ్రీరామచంద్రు నికి నమ్మిన బంటుగా ఆరాధిస్తే ఎంతో మేలు జరుగుతుంది. నవగ్రహ పీడలు తొలగి పోతాయి. మనిషిలో నిదానం వృద్ధి చెందుతుంది.ఏ కార్యాన్ని చేపట్టినా ఆలోచ నకు పదును పెట్టగలుగుతారు. ఆలోచన లేకుండా ఏ పని చేపట్టినా అది సక్రమమైన రీతిలో పూర్తి కాదు. అంతెకాక,అహంకార, మమకారాలకు ప్రభావితం కాకుండా మనిషి సంయమనాన్ని అలవర్చుకోగలుగుతాడు. ప్రలోభా లాకు, బెదిరింపులకు చలించకుండా తన పనిని సక్రమంగా నిర్వహించుకోగలుగు తాడు. బృహద్ధర్మపురాణంలో సుందర కాండ పారాయణ పాశస్త్యాన్ని గురించి వివరించ బడింది. మనిషికి ఐశ్వర్యం ఎంత ముఖ్యమో, ఆరోగ్యం అంతకంటే ఎక్కువ.

ఆరోగ్యమే మహాభాగ్యమనే సామెత అందుకే పుట్టింది. మనిషిలో నైరాశ్యాన్ని పోగొట్టి, ధైర్యాన్నీ,ఉత్సాహాన్ని కలిగిం చేది సుందర కాండ. కుటుంబ పరమైన క్లేశాల్లో ఉన్నవారు సుందరకాండ పారాయణ చేస్తే వీలైనంత త్వరలోనే వాటి నుంచి విముక్తి పొందుతారు. మనిషిలోఏకాగ్రతను పెంచు తుంది.చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది.
సుందరకాండ పారాయణకు మన పెద్దలు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.ఆంజనేయుడు సీతామాత కోసం లంకా నగరంలో అన్వేషించిన సమయంలో అడుగడుగునా ఎదురైన అడ్డంకి లను ఏ విధంగాతొలగించుకుంటూ ముందుకు సాగుతాడో మనిషి కూడా తాను చేపట్టిన పనికి ఎదురైన అవరోధాలను తొల గించుకోవడానికి సుందరకాండ పారాయణ ఎంతో ఉపయోగ పడుతుంది.

రాముణ్ణి సేవించి ఆంజనేయుడు తాను తరించి తనను నమ్ముకున్నవారిని తరింపజేస్తున్నాడు. శ్రీరామదూతం శిరసానమామి అని ఎవరైతే నిరంతరం జపిస్తూ ఉంటారో వారి జోలికి భూత,ప్రేత పిశాచాలు రావు. శత్రువులు వారిని ఏమీ చేయలేరు. వాల్మీకి,తులసీదాసు ప్రభృతులు చెప్పిన పరమ రహస్యం ఇదే.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

తలిస్తే... అనుగ్రహిస్తాడు

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

మనిషిని సంస్కరించి, కుటుంబ వ్యవస్థను చక్కదిద్ది, ఇంటిని ప్రశాంత నిలయంగా మార్చి తద్వారా యావత్‌ మానవ సమాజాన్నీ స్వర్గ ధామంగా, కలియుగ వైకుంఠంగా, ఆనంద నిలయంగా మార్చుకోవడానికి మార్గదర్శకమైనది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించటం కోసమే దత్తప్రభువు వివిధ కాలాల్లో వివిధ గురు స్వరూపాలుగా వెలుస్తూ, లోకులకు జ్ఞానబోధ కావిస్తూనే ఉన్నారు. శ్రీపాద శ్రీవల్లభుడు, శ్రీనృసింహసరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, అక్కలకోట మహరాజు, షిరిడి సాయిబాబాలను దత్త పంచకమంటారు. నేడు మార్గశిర పౌర్ణమి... దత్తులవారి అవతరణ దినోత్సవం సందర్భంగా...

అత్రి, అనసూయల తపస్సునకు మెచ్చి దత్తాత్రేయుడు త్రిమూర్తుల అంశతో రూపుదిద్దుకున్నాడు. అత్రి వరదునిది దైవ, గురు స్వరూపాల కలయిక. అందుకే దత్తాత్రేయుడు ఆదిగురువయ్యాడు.  మాయా ప్రభావంతో దారితప్పుతున్న మానవులకు జ్ఞానబోధలకు, ఆచార వ్యవహారాల అనుసరణకు, ధర్మాధర్మ విచక్షణకు, శిష్టరక్షణతోబాటు, మానవాళి విధ్యుక్త ధర్మాల ప్రబోధకే ప్రాధాన్యతనిచ్చాడు. ఇదే ఆయన గురుతత్త్వం.

జ్ఞానజ్యోతులు వెలిగించి, ప్రజల అజ్ఞానపు చీకట్లు తొలగించేందుకు వెలసిన దత్తస్వామి రూపం నయన మనోహరం, భద్రపదం, భవ బంధ నాశనం, భవసాగరతారకం. సర్వసృష్టినీ ప్రేమించే ఆ కరుణామూర్తి అనేక విశిష్టతలకు కాణాచి. దత్తావతార ముఖ్యోద్దేశం భిన్నత్వంలో ఏకత్వసాధన. అన్ని సాధనలను ఏకం చేసి, తనలో కలుపుకోవడమే ఈ అవతార తత్త్వం. కర్మ, భక్తి, జ్ఞానాలను ఒక్కొక్క దానిని ఒక్కొక్క యోగంగా మలచి, వాటినన్నింటినీ జ్ఞానంతో సంలీనం చేసి, సాధకులను బ్రహ్మజ్ఞాన విధులుగా పరిగణింపజేయడం... సాధనలో పరిపూర్ణ స్థితిని అందుకునేటట్లు అనుగ్రహించడం దత్తాత్రేయుడి తత్వం. సంసారంలో ఉంటూనే, స్వధర్మపాలన చేసుకుంటూ తరించవచ్చని, ముక్తిని సాధించవచ్చన్నదే దత్తసాంప్రదాయం.

దత్తాత్రేయుని స్వభావంలో మూడు ముఖ్య లక్షణాలు గోచరిస్తాయి. మెుదటిది ఆయన తమ నామ స్మరణతో సంతుష్ఠులై స్మరించగానే కదలి వస్తారు. అందుకే ఆయనను స్మర్తృగామిగా కీర్తిస్తారు. రెండవది వారు భక్తులకు ఇహ పర సౌఖ్యాలను ఇస్తూ, యోగశక్తిని ప్రసాదించి, జీవన్ముక్తులుగా చేస్తారు. మూడవ లక్షణం... భక్తుల వెన్నంటే ఉంటూ, వారి మంచి చెడ్డలు చూస్తూ, వారికి దత్తమౌతాడు. ఈ మూడు లక్షణాలు వారిలోని దైవ, గురు లక్షణాలను సూచిస్తాయి. ఈ స్వభావం ఆధారంగానే లక్షణాలను, లక్ష్యాలను గుర్తించవచ్చు.

దత్తునిది జ్ఞానతత్త్వం. ఆయన బ్రహ్మవిద్యను, శ్రీవిద్యను, యోగవిద్యను లోకానికి ప్రసాదించిన విశ్వగురువు. దత్తుడు బ్రహ్మకు వేదవిద్య, మంత్రవిద్య, బ్రహ్మవిద్యలను ఉపదేశించాడు. అలాగే ప్రహ్లాదునికి ఆథ్యాత్మిక విద్య, వశిష్టునికి యోగవిద్య, పరÔ]æురామునికి శ్రీవిద్య, కార్తవీర్యునికి ఆత్మవిద్య, అలర్కునికి యోగవిద్య... ఇలా ఎంతోమంది మహానుభావులకు జ్ఞానామృతాన్ని పంచాడు. ఇందులో సంతులు, సాధువులు, అవధూతలు ఎందరో వున్నారు.

దత్తాత్రేయునిది నిత్యం ఆసేతు హిమాచలం చుట్టివచ్చే తత్త్వం. ప్రతి ఉదయం కాశీలో గంగాస్నానం, గాణుగాపురంలో ధ్యానం, కొల్హాపురంలో భిక్ష, కురుక్షేత్రంలో ఆచమనం... ఇలా వివిధ ప్రాంతాలలో సంచరిస్తూ భక్త జనావళిని జాగృతపరుస్తూ ఉంటాడు. దత్త జయంతికి ఒక విశిష్టత ఉంది. ఆకాశంలోని నక్షత్ర మండలంలో దత్తుడు జన్మించిన మార్గశిర మాసంలో పూర్ణిమనాడు మానవులు నివసించే భూమి తిరుగుతూ, తిరుగుతూ, విశ్వాంతరాళంలో దత్తుని స్థానానికి అతి సమీపంగా వస్తుంది. ఆ సమయానికి సూర్యచంద్రులతో బాటు, మానవులు కూడా ఒõ  సరళరేఖలో దత్తునికి చేరువగా ఉంటారు. అందువల్ల దత్తజయంతినాడు అసంకల్పితంగా మానవులలోనికి దత్తశక్తి ప్రవేశిస్తుంది. ఆ రోజు దత్తుని విశేషంగా పూజించినవారు ఆయన అనుగ్రహానికి పాత్రులు కాగలరు.

దత్తాత్రేయునిది శివకేశవుల అభేద తత్త్వం. జ్ఞానం కోసం పరమేశ్వరుని, మోక్షం కోసం విష్ణువును ప్రార్థించి, పూజాపురస్కారాలు లేని బ్రహ్మతోకలసి, బ్రహ్మవిష్ణువుల రూపంతో వెరసి దత్తాత్రేయావతారం భువిపైకి వచ్చింది. శైవం, వైష్ణవం వేర్వేరు కాదని, రెండూ ఒకటేనని తెలిపేందుకే దత్తతత్త్వం ఉదయించింది. దత్తుని పూజిస్తే మోక్షం, జ్ఞానం ఒకేసారి పొందవచ్చు.
ఈ దత్తావతారాల విశిష్టత ఏమిటంటే, వీరి భౌతికదేహాలు అంతమైనా, వీరి ఉనికికి భంగం రాదు. దేహంతో ఉన్నప్పుడు కూడా వీరు ఆపదలో ఉన్నవారిని అనేక విధాలుగా కాపాడారు. వీరి భౌతిక శరీరాలు గుప్తమైనా వీరి లీలలు కొనసాగుతూనే వుంటాయన్నది వీరి వాగ్దానం. అందుకే శిరిడీసాయి ‘‘నా సమాధి అనంతరం నా మట్టే మీ కోర్కెలకు ప్రతిస్పందిస్తుంది’’ అని అన్నారు. వీరి చరిత్రల పారాయణల ద్వారా దత్తరూపాలన్నింటిని ఏదో విధంగా సేవించి, తరించే దారి దొరుకుతుంది. చింతనం, నామస్మరణం వీరి అనుగ్రహం సంపాదించేందుకు సులభమైన, శ్రేష్ఠమైన మార్గాలు.

దత్తాంశతో వారి అవతారాలుగా జన్మించిన వారందరి అవతారలక్ష్యం ప్రజలకు చేరువగా ఉంటూ, వారి సమస్యలకు పరిష్కారం తెలుపుతూ, నడిపించటమే. ప్రతి అవతారంలో సారూప్య, స్వభావాలు ఇంచుమించు ఒకేవిధంగా ఉండటం విశేషం. గురుపరంపరలో దత్తాత్రేయుడు ఒక అవతారం పరి సమాప్తి అయిన తరువాత మరొక నామధేయంతో వేరొక అంశావతారంతో కాలానుగుణంగా తన ప్రవర్తనను సమన్వయ పరుస్తూ జనులను ఉద్ధరించారు. అందుకే దత్త జయంతిని గురుప్రచార తత్త్వానికి అంకితం చేస్తూ, ఆ రోజు, జప, తపాలతో ధ్యానించి తరించాలి.

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

భక్తి లక్షణం


 ధర్మ అర్థ కామ మోక్షాలనే చతుర్విధ మార్గాలు ఆదికాలం నుంచీ భారతీయుల జీవన ధ్యేయాలయ్యాయి. మొదటి మూడూ (త్రిపుటి) ఉత్కృష్టమైన మోక్షసాధనకు సాధనాలు. జ్ఞాన భక్తి కర్మయోగాలనేవి భగవద్గీత ఆరంభ కాలం నుంచే జీవనమార్గాలయ్యాయి. మానవుడు తన అభిరుచిని అనుసరించి, ఈ మూడు మార్గాల్లో దేనినైనా స్వీకరించి లక్ష్యాన్ని సాధించవచ్చు. 

బుద్ధిజీవులకు జ్ఞానమార్గం, భావనాశీలురకు భక్తిమార్గం, క్రియాశీలురకు కర్మమార్గం స్వీకారయోగ్యమవుతాయి. మానవ జీవనవిధానంలో భక్తి వినూత్న చైతన్యాన్ని సృష్టించింది. 

ఇష్టదైవం పట్ల ప్రేమను ‘భక్తి’గా నిర్వచిస్తారు. ఆ మార్గంలో మొదటి మెట్టు ప్రతీకోపాసన. అంటే, విగ్రహారాధన. విగ్రహాన్ని సాక్షాత్తు దేవతగా భావిస్తారు. ఆ బాహ్య పూజావిధానానికి పైమెట్టు- మానసిక ప్రయత్నం. భక్తుడు తన హృదయపీఠం పైకి ఇష్టదైవాన్ని ఆహ్వానించి, ప్రతిష్ఠించి, పూజిస్తాడు. ‘అనన్య భక్తితో నన్ను ఎవరు ఆరాధిస్తారో, ఏ ఇతర భావాలూ లేక నన్నే ఎవరు ధ్యానిస్తారో, సదా అనుసరిస్తారో- వారి బాధ్యతలన్నీ నేనే నిర్వర్తిస్తాను’ అంటాడు గీతాకారుడు. భగవంతుడి పట్ల ప్రేమానుబంధం ఎక్కువయ్యేకొద్దీ, మిగిలిన వాటిపై భక్తుడి విముఖత పెరుగుతుంటుంది. దాన్ని ఆధ్యాత్మిక పరిభాషలో ‘వైరాగ్య భావన’గా పరిగణిస్తారు. 

భక్తికి సంబంధించి, రెండు దృక్పథాలున్నాయి. ఒకటి- భక్తుడు స్వప్రయత్నంతో ఈశ్వరానుగ్రహం సంపాదించడం, లేదా దైవం మీదే భారమంతా మోపి ‘సర్వాత్మ’గా ఆరాధించడం.రెండోది ప్రపత్తి. అంటే, బంధవిముక్తికి ప్రభు పాదాల్ని ఆశ్రయించడం. వీటిలో- మొదటిది మర్కట కిశోర న్యాయం. రెండోది మార్జాల కిశోర న్యాయం. మర్కటం (కోతిపిల్ల) ఎప్పుడూ తల్లి పొట్టను పట్టుకొనే ఉంటుంది. ఆ తల్లి చెట్లపై ఎంతగా గెంతుతున్నా, దాన్ని పిల్ల వదలదు. మార్జాలం (పిల్లి) తన పిల్లను నోట కరచుకొని తీసుకుపోతుంటుంది. పిల్లిపిల్ల తన రక్షణ కోసం ఏమీ చేయదు. మొదటి మార్గంలో దైవానుగ్రహాన్ని భక్తుడు సంపాదించుకుంటాడు. రెండో మార్గంలో, దైవమే అనుగ్రహిస్తాడు. ప్రపత్తి అంటే ఇదే! ఈ రెండూ పూర్తి విరుద్ధమైన మార్గాలు కావు. ఇవి అన్యోన్యమైనవి. సహానుభూతిని కలిగించేవి. 

‘అంతర్యామివి నీవు, ఆడేటి బొమ్మను నేను, చెంత గాచుట నీ పని, సేవించుట నా పని...’ అంటాడు అన్నమయ్య. ఏ ప్రాణి పట్లా ద్వేషభావం లేనివాడు; సర్వ ప్రాణుల మీద అవ్యాజమైన ప్రేమ, కరుణ గలవాడు భక్తుడు. అతడు విపరీతమైన మమత, అహంకారం- రెండూ లేనివాడు. సుఖం ప్రాప్తించినా, దుఃఖం కలిగినా సమభావం కలిగి ఉండేవాడు. క్షమాగుణం కలిగినవాడు. మనసు, శరీరం, ఇంద్రియాల్ని వశంలో ఉంచగలవాడు. సర్వకాల సర్వావస్థల్లోనూ సంతుష్టుడైనవాడే అసలైన భక్తుడు. అతడు భగవంతుడికే తన మనసును, బుద్ధిని అర్పణ చేసేంత గొప్పవాడు. 

భక్తుడు అందరితోనూ సమభావంతో మెలగాలి. నిందాస్తుతులకు చలించకూడదు. ఈర్ష్య, భయం వంటి మనోవికారాలకు లొంగకూడదు. 

భక్తుల్ని మూడు విధాలుగా గుర్తిస్తారు. ‘భగవంతుడు అక్కడెక్కడో ఉన్నాడు. ఆయన వేరు, ఆ సృష్టి వేరు’ అని భావించేవాడిది అధమ భక్తి. ‘భగవంతుడు అంతర్యామి. లోపల నుంచి అందర్నీ నియంత్రిస్తాడు’ అని తలచేవాడు మధ్యముడు. ‘సర్వమూ భగవంతుడే’ అని తలపోస్తాడు ఉత్తమ భక్తుడు. ‘సకల తత్వాలూ భగవంతుడే... సృష్టి అంతటా ఆయనే నిండి ఉన్నాడు’ అనే భావనే ఉదాత్త భక్తి! 

శ్రీరామ నవమిన పానకం-వడపప్పు తినడంలో పరమార్థం?

🕉🕉🕉🕉🕉🕉🕉🕉

శ్రీ మహా విష్ణువు అవతారం అయినటువంటి శ్రీరామచంద్రుని జననమును మనం శ్రీరామ నవమిగా జరుపుకుంటున్నాము. రామనామం రాముని కంటే శక్తివంతమైనది. రామనామం మనల్ని సకల సముద్రాలు దాటించగలదు.

రాముణ్ణి స్మరించే పెదాలకు వేరే పానకం ఎందుకు?రాముణ్ణి ప్రతిష్ఠించుకున్న హృదయానికి వేరే కోవెలెందుకు?రాముడి మార్గంలో నడిచేవారికి వేరే దారి ఎందుకు?రాముడి ధర్మాన్ని ఆచరించేవారికి వేరే ధర్మం ఎందుకు?శ్రీరామనవమికి తెలుగువారి లోగిళ్లు కళకళలాడతాయి.

తెలుగు వీధులకు చలువపందిళ్లు గొడుగు పడతాయి. హరికథలు... బుర్రకథలు... పాటలు... శ్రీరామ నీ నామమెంతో రుచిరా...పండగ పూట...ఈ వడపప్పు... పానకం... ఇంకొంత తీపి. ఈ శ్రీరామనవమి రోజు ముఖ్యంగా పానకం వడపప్పును ప్రసాదంగా తీసుకుంటారు.

_*పానకం - వడపప్పు ప్రాముఖ్యత ఏంటి?*_

శ్రీరామ నవమి రోజున అందరిల్లలోనూ పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది ఎండాకాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్యాభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద శాస్త్రజ్ఞుల అభివూపాయం. సీతారాముల కళ్యాణోత్సవం నాటి వివాహ మంగళాక్షతలు అతి పవిత్రం. వాటిని మన ఇంట్లో బియ్యంలో కలుపుకోవాలి. అలా అవి ఆ సంవత్సరమంతా మనింటనే ఉం టాయి. తత్ ఫలితంగా కోరిన కోర్కెలు నెరవేరుతాయన్నది వేదపండితుల భావన.

మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, దేహారోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు - పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని చెబుతారు.
పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.
        🍂🍄🍁🍂🍄🍁
🏵 రామచంద్రమూర్తి 🔯 శాస్త్రధర్మం🏵

తండ్రి మాట కోసం వనవాసానికి సీత, లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు. అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు. మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి, తండ్రి మరణవార్త తెలియజేశాడు. దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య. పెద్దకుమారుడినైనా తండ్రికి ఉత్తరక్రియలు చెయ్యలేకపోయానని బాధపడతాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తరక్రియలు చేసి, పిండితో పిండాలు చేసి, దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని, పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ, రాముడు ఇందుకు ఒప్పుకోడు. శాస్త్రప్రమాణాలు అనుసరించి, దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడవే అయితే, దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు. నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్నసమయంలో కూడా శాస్త్రధర్మాన్ని తు.చ తప్పకుండా పాటించిన శ్రీ రామచంద్రుడు ఓకడే.

భద్రాచలం గుడికి సంభందించిన 10 నమ్మలేని నిజాలు !

కోదండరాముడు, అయోధ్యరాముడు, జానకిరాముడు అంటూ ఆ శ్రీరామమూర్తిని భక్తులు ఆర్తితో పిలుచుకుంటారు. శ్రీ మహావిష్ణువు అవతారమయిన శ్రీ రాముడు మానవరూపంలో ఈ భూమి యందు నడయాడిన ఉత్తమ పురుషుడిగా మన వేదాలు చెబుతున్నాయి. మానవులు ధర్మంతో ఎలా మెలగాలో అనే విషయాన్ని తాను ఆచరించి చూపించిన మహా ధర్మమూర్తి. ఆయన అంత ధర్మమూర్తి కాబట్టే ఆయన పాలన కూడా అంత గొప్పగా వుండేది. అందువల్లే ఇప్పటికీ ఏ ప్రాంతంలోనైనా పాలన బాగా జరిగితే ఆ పాలన జరిగిన ప్రాంతాన్ని శ్రీరామరాజ్యంగా భావిస్తారంటే ఆయన పాలన ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం గుడి గురించి అక్కడి విశిష్టతల గురించి తెలుసుకుందాం.

కలియుగ అంతానికి కారణమయ్యే గుడి ! భద్రాచలం శ్రీరాముని యొక్క దివ్యక్షేత్రం. భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గోదావరినది తీరంలో వున్నది. ఖమ్మం పట్టణానికి 105 కి.మీ.ల దూరంలో వున్నది. పూర్వం భద్రుడు అను భక్తుడు శ్రీ రాముడి కోసం తపస్సు చేసి తను ఒక కొండగా మారి తనపై శ్రీ రాముడు వెలసే విధముగా వరము పొందాడు అంటారు. ఆ కొండకు భద్రుడు పేరు మీద భద్రగిరి అని తరువాత కాలంలో ఆ పట్టణానికి భద్రాచలం అని పేరు వచ్చింది. ఇతిహాసం గోల్కొండను నవాబు అబుల్ హసన్ తానీషా పరిపాలించేటప్పుడు భద్రాచల ప్రాంతానికి తహశీల్దారుగా కంచెర్ల గోపన్న ఉండేవాడు. ఇక్కడికి సమీపంలోని నేలకొండపల్లి గ్రామానికి చెందిన గోపన్న శ్రీరామ భక్తుడు. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్ను సొమ్మును ప్రభుత్వానికి జమ చెయ్యకుండా, భద్రగిరిపై శ్రీ రాముడు వెలసిన ప్రదేశమందు ఈ రామాలయాన్ని నిర్మించాడు.

1. సమీపంలోని పర్ణశాల రామావతారంలో సీతారాములు లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం చేసే సమయంలో ఈ భద్రాచలం సమీపంలోని పర్ణశాలలో వున్నట్లు చరిత్ర చెపుతుంది. అక్కడ ఉన్నప్పుడే రావణుడు సీతను అపహరించాడు. సరిగ్గా అదే సమయంలో భద్రుడనే ఋషి రాముడిని చూసి ఒక వరం అడిగాడు.

2. వరం ఆ వరం ఏంటంటే నేను తిరిగే ఈ కొండల్లో నీవు కొలువై వుండాలి. దానికి రాముడు నేను ఇప్పుడు సీతను వెతకటానికి వెళ్తున్నాను. తాను దొరికిన తర్వాత తిరిగి వచ్చినపుడు నీ కోరిక తీరుస్తాను అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడట.

3. భద్రుని ఘోరతపస్సు కానీ తర్వాత రాముడు తాను ఇచ్చిన మాట మరచిపోయి తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అది తెలిసిన భద్రుడు ఘోరతపస్సు చేయటంతో శ్రీ మహావిష్ణువు రామావతారంలో సీతాలక్ష్మణ సమేతంగా వచ్చి ఆ కొండపై వెలిసాడు

4. విష్ణువు అయితే ఆయన వచ్చే కంగారులో రామావతారంలో ఉపయోగించిన బాణం,విల్లుతో పాటు విష్ణువు చేతిలో వుండే శంఖచక్రాలను కూడా తనతో తీసుకువచ్చేశాడని అక్కడ వెలిసే కంగారులో ఎప్పుడూ కుడివైపునే లక్ష్మణుడు ఎడమవైపున నిల్చొన్నట్లు పురాణాలను బట్టి తెలుస్తుంది.

5. మూల విగ్రహం అందుకే అక్కడ మూల విగ్రహం ఎక్కడా లేని విధంగా వుంటుంది. రాములవారి విగ్రహం నాలుగు చేతులతో వుండగా లక్ష్మణ స్వామి ఎడమవైపున వున్నట్లు కనపడుతుంది. ఆయన నాలుగు చేతులలో కుడివైపున వున్న రెండు చేతులలో శంఖము, బాణము వుండగా, ఎడమవైపున వున్న రెండు చేతులలో విల్లు, చక్రము కనిపిస్తుంది

6. వైకుంఠం రాముడు వైకుంఠం నుండి నేరుగా వచ్చి ఇక్కడ వెలిసాడుకాబట్టి వైకుంఠ రాముడయ్యాడని మరో కథనం వుంది. భద్రుడనే ఋషి తపస్సు వలన ఆయన తపస్సు చేసిన కొండ మీదే శ్రేరాముడు వెలశాడు. అందుకే ఆ ప్రాంతం భాద్రాద్రిగా పేరు గాంచింది.

7. రామరామరామ అయితే అక్కడి గర్భగుడి ప్రక్కనే భద్రుడి బండ అనే ఒక బండరాయి వుంది. ఆ రాయిపై చెవి పెట్టి వింటే రామరామరామ అనే శ్రీరామ జపం వినిపిస్తుందట. రామదాసు ఇప్పుడు వున్న రామాలయాన్ని కట్టించక మునుపు ఒక చిన్న ఆలయంగా అక్కడి బోయవారు కట్టి పూజించేవారు.

8. ఆదిశంకరాచార్యులు ఆలయ నిర్మాణానికి కొన్ని వందల సంవత్సరాలకి ముందు అక్కడికి వచ్చిన ఆదిశంకరాచార్యులు శ్రీరామదర్శనం చేసుకున్నప్పుడు సాక్షాత్తు వైకుంఠంలో వున్నట్లు ఆయనకు అనిపించిందట. అందుకనే భద్రాద్రి రాముడికి వైకుంఠరాముడు అని పేరు పెట్టారని ఒక కథనం వుంది.

9. రామదాసు చరిత్ర కథ కాదు ఆ పేరుని ఇప్పటికీ భక్తులు స్మరిస్తూనే వున్నారు. రామదాసు చరిత్ర కథ కాదని యదార్థ ఘటనని నిరూపించటానికి ప్రధమ సాక్ష్యం భద్రాద్రి ఆలయమయితే రెండవ సాక్ష్యం గోల్కొండలోని రామదాసు చెరశాల.

10. రాములవారి పూజలు రామదాసుని బంధించిన చెరశాలలో నిత్యం రాములవారి పూజలు చేసుకోవటానికి అక్కడ గోడలపై రామదాసు స్వయంగా తన చేతులతో సీతారాములు, ఆంజనేయస్వామి, లక్ష్మణస్వామి విగ్రహాలను చెక్కాడు. ఇప్పటికీ ఆ బొమ్మలు గోల్కొండ కోటలోని రామదాసు చెరశాలలో కనిపిస్తాయి.

11. గర్భగుడి రాములవారి గర్భగుడిపై వున్న చక్రాన్ని ఎవ్వరూ తయారుచేయలేదట. ఆ గుడి కడుతున్న సమయంలో భక్తరామదాసు అక్కడ గోదారిలో స్నానం ఆచరిస్తున్నప్పుడు ఆ నదీ ప్రవాహంలో కొట్టుకువచ్చి రామదాసు చేతిలో పడిందట ఆ చక్రం. అది రాములవారు ప్రసాదించారని భావించిన రామదాసు ఆ చక్రాన్ని తీసుకువచ్చి గర్భగుడి గోపురంపై ప్రతిష్టించాడు.

12. ఏకశిల ఆలయంలో రాముడు కొలువైవున్న గర్భగుడిపై వున్న శిఖరాన్ని ఏకశిలపై చెక్కారు. ఈ రాయి బరువు 36 టన్నులు, అంతటి బరువైన రాయిని ఎటువంటి ఆధునిక పరికరాలు లేని ఆకాలంలో అంత పైకి చేర్చిన అప్పటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంతటి ఉన్నతస్థానంలో ఉండేదో తెలుస్తుంది.

13. దేవుడికి ఆభరణాలు ఈ ప్రపంచంలోని ఏ ఆలయంలోనైనా దేవుడికి ఆభరణాలు భక్తులు చేయిస్తారు. కానీ ఒక్క భద్రాద్రిలో మాత్రం రాములవారి నగలకు ఆయనే మూల్యం చెల్లించాడు.రామదాసుప్రభుత్వ డబ్బుతో స్వామివారికి నగలు చేయించినందుకుగానూ, రామదాసుని చెరశాలలో బంధించారు.

14. శ్రీరామ టెంకలు తన భక్తుడిని విడిపించటానికి రాములవారు ఆయన కాలం నాటి శ్రీరామ టెంకలు అంటే నాణేల రూపంలో ఆరు లక్షల రూపాయలను చెల్లించాడు. దీన్నిబట్టి గుడి ఖర్చు, ఆభరణాల ఖర్చు రాములవారు స్వయంగా చెల్లించినట్లయింది. ఇప్పటికీ ఆ నాణేలు గుడి మ్యూజియంలో వున్నాయి.

15. ముత్యాల తలంబ్రాలు రాములవారి కల్యాణంలో ముత్యాల తలంబ్రాలకు ఒక ప్రత్యేక స్థానం వుందనే చెప్పాలి. భక్తరామదాసు వల్ల అప్పటి రాజు తానీషాకి కలలో రాముడు దర్శనం అవటం వల్ల ఆ మహాథ్భాగ్యానికి పొంగిపోయిన తానీషా ముత్యాల తలంబ్రాలను రాములవారి కల్యాణంలో సమర్పించి ఒక శాసనం కూడా చేసాడు.

16. పాలకుల చేతుల మీదుగా ఈ శాసనం ప్రకారం స్వామివారి కల్యాణంలో ఉపయోగించే ముత్యాల తలంబ్రాలు పాలకుల చేతుల మీదుగానే రావాలని వుంది. అందుకే ఇప్పటికీ ఆ సంప్రదాయాలని మన ప్రభుత్వాలు కూడా ఆచరిస్తున్నాయి.

17. మంగళ సూత్రాలు రాముల వారి కల్యాణంలో వాడే మంగళ సూత్రాలు 16 వ శతాబ్దంలో భక్త రామదాసు చేయించాడు. అప్పుడు ఆయన చేయించిన మంగళ సూత్రాలతో పాటు మిగిలినఆభరణాలన్నీ ఇప్పటికీ వాడుతున్నారు.

18. శ్రీరామనవమి వేడుకలు భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలలో శ్రీరామునిపై వేసే కోటి తలంబ్రాలను చేతితో తయారుచేస్తారు. అంటే తలంబ్రాలకు అవసరమయే బియ్యం కోసం వడ్లగింజలను దంచడమో,మిషిన్ ల మీద ఆడించడమో చేయకుండా ఒక్కొక్క వడ్లగింజ మీద పొత్తును చేతితో తీసి ఆ బియ్యాన్ని కోటితలంబ్రాలుగా చేస్తారు.

19. బస్సు సౌకర్యం భద్రాచలం ప్రముఖ యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా అనుసంధానమై వుంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి ఏటూరు నాగారం మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

20. రైలు సౌకర్యం భద్రాచలం రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుసౌకర్యం లేదు. ఇక్కడికి 35కి.మీ.ల దూరంలోని కొత్తగూడెంలో ఉన్న భద్రాచలం రోడ్ స్టేషను అతి దగ్గరలోని స్టేషను. ప్రతిరోజూ హైదరాబాదు నుండి రెండు, విజయవాడ నుండి ఒకటి, రామగుండం నుండి ఒక రైలు ఈ స్టేషనుకు వచ్చిపోతాయి.

21.లాంచీ సౌకర్యం గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి.

22. నడవలేని వారి కోసం వికలాంగుల కోసం భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం చేరటానికి వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారి కోసం లిఫ్ట్‌ సౌకర్యం కలదు.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...