Wednesday, April 3, 2019

మన పంచాంగం ప్రాముఖ్యత

పండగలొస్తాయి వెళ్లిపోతాయి సాదాసీదా కేలండర్ లో. తేదీల పేజీని కొందరూ, నెలల పేజీలను ఇంకొందరూ చింపి అవతల పడేస్తారు కదా! అలాగే పంచాంగాలు మార్చి, కొత్త పంచాంగం తెస్తాం! ఇవేవీ ఈ కాలం పిల్లలకి చెప్పడానికి చాలామందికి తెలియదు. తెలుగు కేలండర్ ని పంచాంగం అంటారు. తిథి,వారం, నక్షత్రం, యోగం, కరణం అనే అయిదు అంగాలు(విషయాలు) పంచాంగంలో ఉంటాయి.

మనకి తెలసిన కేలండర్ కీ, పంచాంగానికీ దోమకీ, ఏనుగుకీ ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. అవి డేట్స్ మాత్రమే చెప్పి చిరిగిపోతాయి. పంచాంగం అలా కాదు. సూర్య చంద్రాది గ్రహ గతులు అపార వైదిక గణిత శాస్త్రంతో విడమర్చి చెప్తాయి. పున్నమి చంద్రుడు ఎప్పుడొస్తాడు? ఆ చంద్రుడ్ని రాహువో, కేతువో ఎప్పుడు మింగేద్దామని చూస్తాడు? (అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అన్నమాట). ఇలాంటి మహత్తరమైన కాలపు లెక్కలు మన పంచాంగంలో ఉంటాయి. ఇవన్నీ మనం ఈ రోజు చూస్తున్న కేలండర్ కి చాలాచాలా వేల సంవత్సరాలకి ముందే మన భారతీయులు సాధించిన ఖగోళ గణిత విజ్ఞానం. అదే పంచాంగంగా రూపొందించే జ్ఞానం అన్నమాట.

సూర్యుడు, చంద్రుడు, రాహువు, కేతువు అనేవే కాకుండా మిగిలిన గ్రహాలూ మన జీవితంలో  ఎంతో ప్రభావం చూపిస్తాయి. అవును కదా! సూర్యుడొస్తే పగలు, వెళ్లిపోతే రాత్రి. అలా ఏదో రూపంలో చీకటి వెలుగులనిచ్చే శక్తి మిగిలిన గ్రహాలకి ఎందుకుండదు? ఏదైనా మంచి జరిగితే మనం…  ‘టైమ్ బావుందనీ’, ‘లక్కీ’ అని, ‘కలిసి వచ్చిందనీ’ అంటాం కదా! అలాగే టైమ్ బాగోకపోవడం, బ్యాడ్ లక్ ల గురించి కూడా అనుకుంటూ ఉంటాం కదా! ఉదాహరణకు కష్టపడి పరీక్షలకి చదివి మనం అనుకున్న ప్రశ్నలు రాకపోతే, మనకి గుర్తున్న జవాబులు తట్టకపోతే పరీక్ష గోవిందా! అయితే ఇందుక్కారణం  ఉంది- అని  పంచాంగం రాసిన పెద్దలు చెబుతుంటారు.

మనం పుట్టిన వేళని బట్టి, అప్పుడున్న గ్రహగతుల్ని బట్టి ఎప్పుడు మంచి జరుగుతుందో, ఎప్పుడు బాధలోస్తాయో లెక్కలు గట్టి…. దానికి రెమెడీలు చెబుతారు. అంటే, చీకటి పడుతుంటే మనం అలా చీకట్లో బాధపడకుండా కొవ్వొత్తో, లాంతరో, లైటో వాడతాం! అంటే సూర్యగ్రహానికి రెమెడీని మనం వాడుతున్నామన్నమాట. అలా అన్ని గ్రహాలకీ రెమెడీను మన పెద్దవాళ్లు కనిపెట్టారు. ఫలానా పూజలు చెయ్యి, ఫలానా జపాలు చెయ్యి, ఫలానా దానాలు చెయ్యి-అని కొవ్వొత్తులూ, లాంతర్లూ వాడడం లాగా –పరిహారాలను చెప్పే పుస్తకమే పంచాంగం.

మనకీ నెల్లో బాగుందనీ, మనకీ నెల్లో నష్టం జరగవచ్చుననీ కేలండర్లు చెప్పలేవు. కానీ పంచాంగం ఆ బాధ్యత తీసుకుని, (చలేస్తుంది! స్వెట్టర్ వేసుకెళ్లు! బండి మీద వెళ్తున్నావు కదా! హెల్మెట్ పెట్టుకుని వెళ్లు! అని అమ్మ హెచ్చరించినట్టుగానే) మనకి కాషన్స్, రెమెడీస్ చెబుతుంది. అలాంటి మంచి మాటలూ, మంచి రోజులూ చెబుతుంది. గనుకనే పంచాంగాన్ని ఇన్ని వందల వేల సంవత్సరాల నుంచి మనం ప్రేమించి, గౌరవిస్తున్నాం.

భవిష్యత్తును సైతం అంచనా వేయగల మేధావులు మన పంచాంగకర్తలు .
ప్రపంచంలో ఏజాతికి లేని ఖగోళ పరిజ్ఞానం....అతి ప్రాచీన కాలంలోనే మన హైందవజాతికి ఉంది. శాస్ర్తీయమైన యతార్థ విజ్ఞానాన్ని తెలుసుకోకుండా, పాశ్చాత్య సాంప్రదాయాలపై నేడు మన హిందూ యువత మోజు చూపుతోంది. పరమ ఆరోగ్యదాయకమైన మన హిందూ సంవత్సరాదిని ఓ ప్రక్కకు నెడూతూ...విష్ యూ హేపీ న్యూ ఇయర్ అంటూ పరుగులు తీస్తోంది.

హేపీ న్యూఇయర్ అనే మాట వినగానే ఇవాళ చాలా మందికి మనసులో మెదిలేది జనవరి ఫస్ట్..! జనవరి ఫస్ట్ సంవత్సరారంభం అయితే....మరి ఉగాది నుంచి ప్రారంభమయ్యే కొత్త సంవత్సరం మాటేమిటి...?  ఉగాది అంటే కేవలం వేపపువ్వు పచ్చడి తినే పండుగేనా...? ఇంతకీ ఏది కొత్త సంవత్సరం. జనవరి ఫస్టా...లేకా ఉగాదా...! ఏది శాస్త్రీయమైన సంవత్సరాంభం...? నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకోవాల్సింది ఎప్పుడు?  విజ్ఞులు అనుసరించిన, అనుసరించవలసిన అసలు కాలమానం ఏది? ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఇంగ్లీష్ కాలమానంలో లోపాలు ఉన్నాయా? అసలు నిజం ఏమిటీ?

ఏ కాలంలోనైనా ప్రపంచంలోని ఏ ప్రాంతానికైనా కాలమానానికి "ఖగోళమే" ఆధారం. ఇది ఎవరూ కాదనలేని సత్యం. కాలమానంలోని అంశాలన్నింటిని పూర్తిగా ఖగోళ శాస్ర్త రీత్యా ఏర్పాటు చేసుకున్న ఏకైక జాతి హిందూ జాతి. కాలమాన అంశాలైన రోజు, వారం, పక్షం, మాసం, ఋతువు, అయనం, సంవత్సరం. పుష్కరం, శకం, యుగం కల్పకం మొదలైన అన్నింటినీ ప్రాచీన కాలం నుంచి హిందువులు ఖగోళ శాస్ర్త ఆధారంగానే ఏర్పాటు చేసుకున్నారు.

వేషభాషలు, ప్రవర్తన, ఆహార విహారాలూ అన్నింటిలోనూ విదేశీ అనుకరణనే ఇష్టపడుతున్నారు మనవాళ్లు. అయితే అదే సమయంలో మన ప్రాచీన హైందవ సంస్కృతీ సాంప్రదాయాలకు విదేశాల్లో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉందనే మాటను మనవాళ్లు మరచిపోతున్నారు. పండుగలను అనుసరించే పద్దతులలో కూడా విదేశీ అలవాట్లకు బానిసలౌతున్నారు. మన పండుగల నిర్వాహణా విధనాల్లో ఉన్న విజ్ఞాన అంశాల్ని గ్రహించలేక మూర్ఖపు ధోరణులకు, అసభ్య నడవడికలకు బలి అవుతున్నారు.

విశ్వం....లోని అంశాలైన నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహశకలాలు మొదలైన వాటి స్థితి గతుల్ని వివరించే శాస్ర్తమే ఖగోళశాస్ర్తం. శాస్ర్తాలన్నింటిలో ప్రముఖమైన శాస్ర్తంగా దీన్ని చెప్పుకోవచ్చు. కాలమాన విజ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఖగోళ శాస్ర్త పరిజ్ఞానం అత్యంత ముఖ్యం. భూమి వాతావరణానికి అవతల వ్యాపించి ఉన్న అనంత విశ్వాన్ని అంతరిక్షం అంటారు. గ్రహతారకాదులతో కూడి ఉన్న ఈ అంతరిక్ష పరిధినే ఖగోళం అని వ్యవహరిస్తారు. భూమి ఒక ఆత్మ ప్రదక్షిణం చేస్తే 1 రోజు అనీ, చంద్రుడు ఒక భూ ప్రదక్షిణ చేస్తే 1 నెల అని, భూమి ఒక సూర్య ప్రదక్షిణం చేస్తే 1 సంవత్సరం అనీ...ఇలా కాలమానాన్ని ఖగోళ విషయ ఆధారంగానే ఉండి తీరాలనేది ఈ నియమాల సారం.

సంవత్సరం అనేది కాలమానంలో ఒక అంశం. నక్షత్రాల, గ్రహాల ఉనికీ సంవత్సర ఆరంభానికి ఖచ్చితంగా ఒక ఖగోళ ప్రత్యేకత అంటూ ఉండి తీరాలి. ఏ ఖగోళ పత్ర్యేకతా , ఆధారమూ లేకుండా ఎవరికో తోచిన జనవరి ఫస్ట్ ను సంవత్సరారంభంగా అంగీకరించి అనుసరించడం సరికాదు. యదార్థ సంవత్సరారంభం ఉగాదిని మరిచి, పాశ్చాత్య పోకడల వెర్రి వ్యామోహంలో పడి జనవరి ఫస్ట్ కు దాసోహమంటున్నాం.

క్రీస్తు శకం అంటూ కాలమానాన్ని లెక్కించడం చూసి హిందువులు చాలా మంది అపోహలకు లోనౌతున్నారు. మరి హిందువుల చరిత్ర అత్యంత ప్రాచీనమైనదైతే... క్రీస్తు శకాన్ని ఉపయోగిస్తూ కాలాన్ని లెక్కిచండం ఎందుకొచ్చిందనేది అనేకమందికి సందేహం...! ప్రపంచమంతా కూడా ఈ క్రీస్తు శకాన్నే వాడడంలో ఏమైనా ప్రముఖ విశేషం ఉందా..? ఈ క్రీస్తు శకాన్ని విదేశీయులతోపాటు, మన దేశంలోని  నాస్తికవాదులు సైతం చాలా గొప్పగా భావిస్తుంటారు...! ఇంతకీ ఈ క్రీస్తుశకం అనేది ఎందుకొచ్చింది. ? ఈ శకం వెనుక దాగివున్న యధార్ధం ఏమిటీ?

చరిత్రలో ఎప్పుడు ఏ సంఘటన జరిగిందో ఖచ్చితంగా తెలుసుకోవడానికి సంవత్సరాలను వరుసగా లెక్కించుకుంటూ రావడం అవసరమైంది. అయితే ఈ లెక్కకు ఎక్కడ నుంచి మొదలైందని చెప్పడం కష్టమే. పురాణ పురుషుల కాలం నుంచో.. మహా ప్రతిభావంతులైన చక్రవర్తుల కాలం నుంచో, ప్రవక్తల కాలం నుంచో... ఏదైనా గొప్ప సంఘటన జరిగిన నాటి నుంచో- సంవత్సరాలను  లెక్క పెట్టడం చరిత్రలో ఒక రివాజు. దీనినే శకం లెక్కింపు అంటారు.

ఒక్కొక్క జాతి ఒక్కొక్క కాలంలో తమ శకాలను ప్రారంభించుకుంది. మన హిందూజాతికి అతి పురాతన కాలం నుంచీ అనేక శకాలున్నాయి. కలిశకం, విక్రమశకం, శాలివాహన శకం మొదలైనవి ఉన్నాయి. ప్రస్తుతం కలిశకం లెక్క ఆచరణలో ఉంది. ఆంగ్లేయుల పరిపాలనా కాలంలో  అలవాటు చేయబడిన క్రీస్తు శకం కాలమానాన్ని ప్రపంచరీతి కోసం నేటికీ మనం అనుసరిస్తున్నాం. నేడు ప్రపంచంలో క్రైస్తవాన్ని ఆదరించే దేశాల ప్రాబల్యంతో ఏసు క్రీస్తు శకాన్ని ఉమ్మడి శకంగా తీసుకోవాల్సివచ్చింది. అంతేగానీ ఈ శకాల కంటే క్రీస్తు శకానికి ఏదో ప్రత్యేకత ఉందని మాత్రం కాదు.

వివిధ దేశాల ప్రజలు వివిధ కాలమానాలతో జీవనాలు సాగించేవారు. ఎవరి లెక్కలు వారికుండేవి. తమకు తెలియని విషయాన్ని, మరో జాతి నుంచి నేర్చుకునేవారు. అయితే కాలం గడిచేకొలదీ...ప్రపంచమంతా ఒకే కాలమాన పద్ధతిని అనుసరిస్తే బావుంటుందనే భావన మొదలయ్యింది. అయితే ఎవరి కాలమానాన్ని...ఈ ప్రపంచ కాలమానంగా తీసుకోవాలనే సమస్య వచ్చింది. ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు ప్రపంచంలో అనేక ప్రాంతాలు బ్రిటీష్ వారి ఆక్రమణలో ఉన్నాయి. దీంతో బ్రిటీష్ వారు తాము స్వీకరించిన క్రీస్తు శకం అనే కాలమానాన్ని బలాతిశయంతో ప్రముఖంగా ముందుకు తీసుకువచ్చారు. తమ ఆధీనంలోని అన్ని దేశాలలో ఈ శకాన్ని అమలుపర్చడం మొదలు పెట్టారు. ఈ విధంగా ప్రపంచలోని అనేక దేశాల్లో క్రీస్తు శకం వాడకం మొదలైంది. ఆ తర్వాత మిగిలిన దేశాలు తమ సౌలభ్యం కోసం క్రీస్తు శక కాలమానాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చింది.

అయితే క్రీస్తు శకంలో ఓ తిరకాసు ఉంది. ఏసు క్రీస్తు ఎప్పుడు పుట్టాడనే విషయాన్ని చరిత్రకారులెవరు కూడా ఒక నిర్థారణగా ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. క్రీస్తు జీవితానికి సంబంధించిన ఏ చారిత్రక ఆధారమూ కన్పించడం లేదని విదేశీ చరిత్రకారులు తెలిపారు. ప్రముఖ చరిత్రకారులు హెచ్. జివెల్స్ తన ప్రపంచ చరిత్ర గ్రంథంలో క్రీస్తు జీవితానికి సంబంధించిన ఆధారాలు లభించడం లేదని తెలిపారు. బైబిల్ కూడా క్రీస్తు అనంతరం రాయబడింది.

చాలా మంది క్రీస్తు పుట్టుక నుంచే క్రీస్తు శకం మొదలైందని అనేకమంది భావిస్తారు. ఏసు క్రీస్తు జీవించాడానికి చెప్పబడుతున్న కాలానికి కొన్ని శతాబ్దాల తర్వాత క్రీ.శ. 532వ సంవత్సరంలో డయోనీషియన్ ఎక్సీగస్ అనే రోమన్ సన్యాసి, క్రీస్తు పేరుతో ఒక శకాన్ని ప్రారంభించాలంటూ ప్రచారం మొదలు పెట్టాడట..! క్రీస్తు పుట్టిన సంవత్సరం క్రీ.శ.1అని ఆయన ప్రతిపాదించాడు. అయితే చాలా కాలం వరకూ ఈ క్రీస్తు శకం అనే అంశాన్ని ఎవరూ అంగీకరించలేదు. క్రీ.శ.816లో చల్సా బిషప్ ల మహాసభ క్రీస్తు శకాన్ని వాడకంలోకి తీసుకురావాలంటూ పిలుపునిచ్చింది. అయినా కూడా చాలా సంవత్సరాలు ఎవరూ పట్టించుకోలేదు.  క్రీ.శ.879 లో జర్మనీ చక్రవర్తి 2వ ఛార్లెస్ మొట్టమొదటగా క్రీస్తు శకాన్ని అమలులో పెట్టాడట. అనంతర కాలక్రమంలో ఇతర చోట్ల మెల్లమెల్లగా క్రీస్తు శకం వాడకం మొదలైంది. ఇది క్రీస్తు శకం అసలు చరిత్ర.! అంటే క్రీస్తు జీవితానంతరం సుమారుగా 800 సంవత్సరాల తర్వాత, క్రీస్తు శకం అమలులోకి వచ్చిందన్నమాట. అయితే క్రీస్తు పుట్టింది. క్రీ.శ.1 లో కాదనీ , క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలో అయి ఉండవచ్చుననీ సుప్రసిద్ధ చరిత్రకారుడు సర్ జాన్ కెప్లర్ తేట్చాడని కొంతమంది చెబుతారు. అయినా కూడా క్రీస్తు శకం లెక్కను మాత్రం ఎవరూ మార్చలేదు. అలాగే వదిలేశారు. ఇది అలాగానే కొనసాగుతోంది.

అమెరికాకు చెందిన చరిత్రకారుడు విల్ డ్యూరాంట్...క్రీస్తు గత చరిత్రపై పరిశోధన చేశాడు. డిసెంబర్ 25న క్రిస్ మస్ పండుగపై కూడా ఆయన ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. క్రీ.స్తు పుట్టిన సంవత్సరాన్ని చరిత్రకారులు బయటపెట్టలేకపోయాడు. ఆయన పుట్టిన నెల, తేదీలను నిర్ణయించగల అవకాశాలు చరిత్రలో ఎక్కడ కనిపించలేదని...దీంతో ఆ కాలాన రోమ్ నగరంలో ప్రతియేటా డిసెంబర్ 25వ తేదీన శాటర్నేలియా అనే పండుగ వేలాది మందితో తిరునాళ్ల వలే జరుపుకునేవారు. ఇది క్రైస్తవ మత ప్రచారానికి అనుకులంగా ఉంటుందని భావించిన ఎక్సీగస్ ఇదే రోజును క్రీస్తు జన్మదినంగా ప్రచారం చేసేవాడట..! కాలక్రమేణ ఆ ప్రచారం ముదిరి క్రీ.శ.1020 నాటికి డిసెంబర్ 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా క్రీస్తు జన్మదినంగా అనేక చోట్ల స్థిరపడిందట..!

ఒక ఆధారమంటూ లేకుండా కొనసాగుతున్న ఆచారం...క్రీస్తు శకం వాడకం.! వసంత రువుతులో సంత్సరాదిని ఏర్పాటు చేసుకోవడం ఖగోళపరంగా ఖచ్చితమైన పద్ధతి. కాలమానంలో సుక్ష్మఘడియలు, పరఘడియలు, విఘడియలు, ఘడియలు, రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు...మొదలైనవి ఏర్పరచిన అతి ప్రాచీన కాలమానం మనది. ఇవన్నీ కూడా ఖగోళ ఆధారంగానే ఏర్పరచడం జరిగింది. విదేశీ కాల్యెండర్ లో జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 31 వరకూ తేదీల్ని అంకెల్లో లెక్కించుకోవడం తప్ప... ఏ తేదీన ఖగోళ పరిస్థితి ఎలా ఉన్నది తెలిపే విధానం ఏదీ లేదు. కానీ అదే మన హిందూ...పంచాంగంలో ఖగోళ పరిస్థితి తెలిపే విధానం ఉంది.

"ఉగాది" ఆచరణ విధానం:

ఉగాది పర్వాచరణ విధానాన్ని ‘దర్మసింధు’ కారుడు ’పంచవిధుల సమన్వితం’గా ఇలా సూచించియున్నాడు. తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, నింబకుసుమ భక్షణం (ఉగాది పచ్చడి సేవనం), ధ్వజారోహణం (పూర్ణకుంభదానం), పంచాంగ శ్రవణం...మున్నగు ‘పంచకృత్య నిర్వహణ’ గావించవలెనని వ్రతగంధ నిర్దేశితం.

(1) తైలాభ్యంగనం

తైలాభ్యంగనం అంటే నువ్వుల నూనెతో తలంటి పోసుకోవడం ప్రధమ విధి. ఉగాది వంటి శుభదినాలలో సూర్యోదయానికి పూర్వమే మహాలక్ష్మి నూనెలోను, గంగాదేవి నీటిలోను, ఆవహించి వుండునని ఆర్యోక్తి. కావున నూనెతో తలంటుకుని అభ్యంగన స్నానం చేసిన లక్ష్మి, గంగా దేవుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అభ్యంగంకారయోన్నిత్యం సర్వేష్వంగేషు పుష్ఠినం (అభ్యంగన స్నానం అన్ని అవయవాలౌ పుష్ట్టిదాయకం) అని ఆయుర్వేదోక్తి దృష్ట్యాఅభ్యంగనం ఆరోగ్యం కూడా. ఆరోగ్యరీత్యా ఆధ్యాత్మికరీత్యా తైలభ్యంగనానికీ రీతిగా విశేష ప్రాధాన్యమీయబడినది.

(2) నూతన సంవత్సర స్తోత్రం

అభ్యంగ స్నానానంతరం సూర్యునికి, ఆర్ఘ్యదీపధూపాధి,పుణ్యకాలానుష్టానం ఆచరించిన పిదప మామిడి ఆకులతోరణాలతో, పూలతోరణాలతో దేవుని గదిలో మంటపాన్ని నిర్మించి, అందు నూతన సంవత్సర పంచాంగాన్ని, సంవత్సరాది దేవతను, ఇష్టదేవతారాధనతో బాటు పూజించి ఉగాది ప్రసాదాన్ని (ఉగాది పచ్చడి) నివేదించవలెను.

(3) ఉగాడి పచ్చడి సేవనం

ఉగాది నాటి ఆచారాలలో ఉగాది పచ్చడి సేపనం అత్యంత ప్రధానమైనది. వేపపూత, కొత్త చింతపండు, బెల్లం లేక పంచదార లేక చెరకు ముక్కలు, నేయి, ఉప్పు, మిరియాలు, షడచులు మిళితమైన రసాయనాన్నే ఉగాడి పచ్చడి అంటాం!

అబ్దాదౌ నింబకుసుమం శర్కరామ్ల ఘృతైర్యుతమ్‌ భక్షితం పూర్వయామేతు తద్వర్షే సౌఖ్య దాయకమ్‌ అని ధర్మ సింధు గ్రంధం చెబుతున్నది. ఈ ఉగాడి పచ్చడిని ఇంట్లో అందరూ పరగడుపున సేవించవలెను. ఉగాడి నాడు ఉగాడి పచ్చడి సేవించడం వల్ల సంవత్సరమంతా సౌఖ్యదాయకమని ఈ శ్లోక భావం, పలురుచుల మేళవింపు అయిన ఉగాడి పచ్చడి కేవలం రుచికరమే కాదు ప్రభోదాత్మకం కూడా! తీపి వెనుక చేదు, పులుపు ఇలా పలురుచులకు జీవితాన కష్టాలు, తదితర అనుభూతులు, ప్రతీకలే అనే నగ్న సత్యాన్ని చాటుతూ సుఖాలకు పొంగకు, దు:ఖానికి క్రుంగకు, సుఖదు:ఖాలను సమభావంతో స్వీకరించు అనే ప్రగతిశీల సందేశాన్నిస్తుందీ ఉగాది పచ్చడి. అంతేగాక ఈ పచ్చడి సేవన ఫలంగా వివిధ అనారోగ్య స్థితులు పరిహరించబడి, రోగశాంతి, ఆరోగ్యపుష్టి చేకూరుట గమనార్హం.

(4) పూర్ణ కుంభదానం

ఉగాదినాడు ఇంద్రధ్వజ, బ్రహ్మధ్వజ ప్రతిష్టపన ఆచారంగా ఉన్నది. ఒక పట్టు వస్త్రాన్ని ఒక వెదురు గడకు పతాకం వలె కట్టి దానిపై నారికేళముంచబడిన కలశాన్ని వుంచి, ఆ కర్రకు మామిడి ఆకులు, నింబ పత్రాలు, పూల తోరణాలు కట్టి ఇంటి ప్రాంగణంలో ప్రతిష్టించి ఆరాధించడం ధ్వజావరోహణం. ఇటీవల ఈ ఆచారం చాలావరకు కనుమరుగై దాని స్థానంలో కలశ స్థాపన, పూర్ణకుంభదానం ఆచరణలోకి వచ్చింది. యధాశక్తి రాగి, వెండి, పంచలోహం లేదా మట్టితో చేసిన కొత్తకుండను కలశంలా చేసి రంగులతో అలంకరించి అందులో పంచపల్లవాలు (మామిడి, అశోక, నేరేడు, మోదుగ మరియు వేప చిగుళ్ళు) సుగంధ చందనం కలిపి పుష్పాక్షతలు వేసి ఆవాహనం చేసి, పూజించి కలశానికి ఒక నూతన వస్త్రాన్ని చుట్టి కలశంపై పసుపు కుంకుమ చందనం, పసుపు దారాలతో అలంకరించిన కొబ్బరి బోండాం నుంచి పూజించి పురోహితునకుగాని, గురుతుల్యులకుగానీ, పూర్ణకుంభదానమిచ్చి వారి ఆశీస్సులు పొందడం వల్ల సంవత్సరం పొడవునా విశేష ఫలితం లభిస్తుందని ప్రతీతి.

(5) పంచాంగ శ్రవణం

తిధి, వార, నక్షత్ర, యోగ, కరణములనెడి పంచ అంగాల సమన్వితం పం చాంగం. ఉగాది నాడు దేవాల యంలోగాని, గ్రామ కూడలి ప్రదేశాల్లోగాని, పండితుల, సిద్థాం తుల సమ క్షంలో కందాయఫలాలు స్థూ లంగా తెలుసుకొని తదనుగుణంగా సంవత్సరం పొడవునా నడచుకొనుటకు నాడే అంకురార్పణం గావించవలెనని చెప్పబడియున్నది. ఉగాదినాటి పంచాంగ శ్రవణం వల్ల గంగానదిలో స్నానం చేస్తే అభించేటంత ఫలితం లభిస్తుంది.

ఉగాదినాడు పంచాంగ శ్రవణం చేసేవారికి సూర్యుడు శౌర్యాన్ని, చంద్రుడు ఇంద్రసమాన వైభవాన్ని, కుజుడు శుభాన్ని, శని ఐశ్వర్యాన్ని, రాహువు బాహుబలాన్ని, కేతువు కులాధిక్యతను కలుగచేస్తారని చెప్పబడినది.‘బ్రహ్మ ప్రళయం’ పూర్తి అయిన తరువాత తిరిగి సృష్టి ప్రారంభించుసమయాన్ని ‘బ్రహ్మ కల్పం’ అంటారు. ఇలా ప్రతికల్పంలోను మొదటవచ్చే యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయమును ఉగాది అని వ్యవహరిస్తూ ఉంటారు. అలాగునే ఈ ‘ఉగాది’ పర్వదినం మనకు చైత్రమాసంలో ప్రారంభమవడం వల్ల ఆరోజు నుండి మన తెలుగు సంవత్సర ఆరంభ దినంగా పరిగణించి, లెక్కించుటకు వీలుగా ఉండేందుకే ఉగాది పండుగను మనకు ఋషిపుంగవులు ఏర్పాటు చేశారు. లక్ష్మీప్రాప్తికి, విజయసాధనకు చైతన్యం కావాలి. జీవునకు చైతన్యం కలిగించేది కాలం. ముఖ్యంగా ఉగాది సమయం గంటలు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, ఋతువులు, ప్రాణులు కాలస్వరూపమైన సంవత్సరంలో నివసిస్తున్నాయి.

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...