Wednesday, May 16, 2018

బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మసాక్షాత్కారమునకు యోగ్యత


అందరును తమ జీవితములో బ్రహ్మమును జూడలేరు. దానికి కొంత యోగ్యత యవసరము.

1. ముముక్షుత లేదా స్వేచ్ఛ నందుటకు తీవ్రమయిన కోరిక ఎవడయితే తాను బద్దుడనని గ్రహించి బంధనములనుండి విడిపడుటకు కృతనిశ్చయుడై శ్రమపడి ఇతరసుఖఃములను లక్ష్యపెట్టక దానిని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితమున కర్హుడు.

2. విరక్తి లేదా ఇహపరసౌఖ్యములందు విసుగు చెందుట
ఇహపరలోకములందు గల గౌరవములకు విషయములకు విసుగు జెందినగాని పారమార్థిక రంగములో ప్రవేశించుటకు అర్హత లేదు.

3. అంతర్ముఖత (లోనకు జూచుట) మన యింద్రియములు బాహ్యమును జూచుటకే భగవంతుడు సృజించియున్నాడు. కనుక మనుష్యు డెప్పుడును బయట నున్న వానిని చూచును. కాని, ఆత్మసాక్షాత్కారము లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న యాత్మ నేకధ్యానముతో జూడ వలయును.

4. పాపవిమోచన పొందుట మనుష్యుడు దుర్మార్గ మార్గమునుండి బుధ్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయుట మాననప్పుడు, మనస్సును చలింపకుండ నిలబెట్ట లేనప్పుడు జ్ఞానముద్వార కూడ ఆత్మసాక్షాత్కారమును పొందలేడు.

5. సరియయిన నడవడి ఎల్లప్పుడు సత్యము పలుకుచు, తపస్సు చేయుచు, లోన జూచుచు, బ్రహ్మచారిగ నుండినగాని ఆత్మసాక్షాత్కారము లభించదు.

6. ప్రియమైనవానికంటె శ్రేయస్కరమైనవానిని కోరుట
లోకములో రెండు తీరుల వస్తువులున్నవి. ఒకటి మంచిది; రెండవది సంతోషకరమయినది. మొదటిది వేదాంతవిషయములకు సంబంధించినది. రెండవది ప్రాపంచిక విషయములకు సంబంధించినది. ఈ రెండును మానవుని చేరును. వీనిలో నొకదానిని అత డెంచుకొనవలెను. తెలివి గలవాడు, మొదటిదానిని అనగా శుభమైన దానిని కోరును. బుద్ధి తక్కువవాడు రెండవదానిని కోరును.

7. మనస్సును ఇంద్రియములను స్వాధీనమందుంచుకొనుట
శరీరము రథము; ఆత్మ దాని యజమాని; బుద్ధి ఆ రథమును నడుపు సారథి; మనస్సు కళ్ళెము; ఇంద్రియములు గుఱ్ఱములు; ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమయినదో, ఎవరి యింద్రియములు అస్వాధీనములో (బండి తోలువాని దుర్మార్గపు గుఱ్ఱములవలె) వాడు గమ్యస్థానమును చేరడు. చావుపుట్టుకల చక్రములో పడిపోవును. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి యింద్రియములు స్వాధీనమందుండునో (బండి నడుపువాని మంచి గుఱ్ఱమువలె) వాడు గమ్యస్థానము చేరును. ఎవరు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానమును చేర గలడు; విష్ణుపదమును చేరగలడు.

8. మనస్సును పావనము చేయుట మానవుడు ప్రపంచములో తన విధులను తృప్తిగా, ఫలాపేక్ష లేకుండ నిర్వర్తించనియెడల నతని మనస్సు పావనము కాదు. మనస్సు పావనము కానిదే యతడు యాత్మసాక్షాత్కారము పొందలేడు. పావనమైన మనస్సులోనే వివేకము (అనగా సత్యమైనదానిని యసత్యమైనదానిని కనుగొనుట), వైరాగ్యము (అసత్యమైనదానియం దభిమానము లేకుండుట) మొలకలెత్తి క్రమముగా ఆత్మసాక్షాత్కారమునకు దారి తీయును. అహంకారము రాలిపోనిదే, లోభము నశించనిదే, మనస్సు కోరికలను విడచిపెట్టనిదే, ఆత్మసాక్షాత్కారమున కవకాశము లేదు. నేను శరీరమనుకొనుట గొప్ప భ్రమ. ఈ యభిప్రాయమం దభిమాన ముండుటయే బంధమునకు కారణము. నీ వాత్మసాక్షాత్కారమును కాంక్షించినచో నీ యభిమానమును విడువవలెను.

9. గురువుయొక్క యావశ్యకత
ఆత్మజ్ఞానము మిక్కిలి సూక్ష్మము మరిము గూఢమైనది. ఎవ్వరైనను తమస్వశక్తిచే దానిని పొందుట కాశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారము పొందిన యింకొకరి (గురువు) సహాయము మిక్కిలి యవసరము. గొప్ప కృషి చేసి, శ్రమించి ఇతరు లివ్వలేనిదాని నతిసులభముగా గురువునుండి పొందవచ్చును. వారా మార్గమందు నడచియున్న వారు కావున శిష్యుని సులభముగా ఆధ్యాత్మిక ప్రగతి లో క్రమముగా ఒక మెట్టు మీదినుంచి యింకొక పై మెట్టునకు తీసికొని పోగలరు.

10. భగవంతుని కటాక్షము ఇది యన్నిటికంటె మిక్కిలి యవసరమైనది. భగవంతుడు తన కృపకు పాత్రులైనవారికి వివేకమును వైరాగ్యమును కలుగజేసి సురక్షితముగా భవసాగరమును తరింపజేయగలడు. వేదము లభ్యసించుట వల్లగాని మేధాశక్తివల్లగాని పుస్తకజ్ఞానము వల్ల గాని యాత్మానుభూతి పొందలేరు. ఆత్మ యెవరిని వరించునో వారే దానిని పొందగలరు". అట్టి వారికే యాత్మ తన స్వరూపమును తెలియజేయు" నని కఠోపనిషత్తు చెప్పుచున్నది.

అధిక మాసం


భగవద్గీత 15వ అధ్యాయంలో పురుషోత్తమ మాస వివరాలున్నాయి.

హిందూ కేలండర్‌ ప్రకారం సంవత్సరానికి 12 నెలలే కానీ ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి అధికమాసం, లేదా మల మాసమని,లేదా పురుషోత్తమ మాసం వస్తుంది.

కష్టాల్లో ఉన్నప్పుడు తరచుగా అందరూ వాడే మాటలు ''అసలే కరువు, అందులో అధిక మాసం' అని సాధారణంగా సంవత్సరానికి 12 మాసాలే కానీ ఈ అధిక మాసం ఏమిటని అంటూ అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు.

ఓసారి భగవాన్‌ నారాయణుడు ధ్యానంలో ఉండగా, నారదుడు వారి వద్దకు వేతెంచి అధికమాసానికి గల కారణాలను వివరించమన్నాడు. ప్రజల పాపాలతో బరువెక్కామని 12 నెలలు నారాయణుని ముందు వాపోయి పరిష్కారం సూచించమంటే నారయణుడు అధిక మాసాన్ని సృష్టిం చాడట. అయితే ఈ అధిక మాసంలో పూజలూ, పునస్కారాలు నిర్వహించటంలేదని అధిక మాసం కృష్ణునికి మొరపెట్టుకుంటే, పురుషోత్తం మాసాన్ని సృష్టించి, ఎవరైతే ఈ మాసంలో వ్రతాలు, పూజలు చేస్తారో వారికి సుఖ సంతోషాలు లభిస్తాయన్నారట.

1. సౌరమానం 2. చంద్రమానం. తెలుగువారు చాంద్రమానం ప్రకారం పండుగలను జరుపు కుంటారు. చాంద్రమానం అంటే శుక్లపక్ష పాఢ్యమి నుండి బహుళ అమావాస్య వరకు ఒక చాంద్ర మాసం అవుతుంది.

సౌరమాన సిద్ధాంతం ప్రకారం సూర్యుడు, ప్రతిమాసం ఒక్కొక్క రాశియందు సంచరిస్తూ పన్నెండు మాసాలలో పన్నెండు రాశులలో సంచరించడం వలన ఒక సంవత్సర కాలం పూర్తి అవుతుంది. భూమి సూర్యుని చుట్టూ తిరుగుటకు పట్టుకాలం 365.2622 రోజులు సౌరమానం ప్రకారం సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు వస్తుంటాయి. అంటే సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే అది ఆయన సంక్రాంతి అవుతుంది. ఉదాహరణకు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తే అది మకర సంక్రాంతి అవుతుంది.

ఒక అమావాస్య నుండి తిరిగి అమావాస్య ఏర్పడుటకు 29.53 రోజులు పట్టును. చాంద్రమానం ప్రకారం సంవత్సరానికి 354 రోజులు. సౌరమానానికి సంవత్సరానికి 365.24రోజులు. ఈ రెండు మాసాల మధ్య గల వ్యత్యాసాన్ని భర్తీ చేయుటకు భారతీయ కాల గణనలో ప్రతిరెండున్నర సంవత్స రాల తర్వాత ఒక అధిక మాసముగా ఏర్పాటు చేశారు. అంటే రెండు అమావాస్యల మధ్య ఎప్పుడయితే సంక్రమణం ఉండదో అదే అధిక మాసం ఇది సుమారు 32 మాసాల పదహారు రోజులకు ఒకసారి వస్తుంది.

పంచమే పంచమే వర్షే ద్వౌమాసే ఉదజాయత: అని శాస్త్రవచనం, అనగా ప్రతి ఐదు సంవత్సర ములలో రెండు అధిక మాసములు వచ్చునని అర్థం.

సూర్య సంక్రమణం లేని చాంద్రమాసమునే అధిక మాసంగా పరిగణిస్తున్నాం.
ఒక్కోసారి రెండు రోజులకు ఒకేతిధి, మరోసారి ఆరోజుతర్వాత తిధికి జారుకుంటుంది. అంటే ఆ తిది సూర్యోదయాన్ని వదలుకుంది. ఒక్కోసారి సూర్యుడు ఏరాశిలోకి ప్రవేశించకపోతే దానిని అధిక మాసంగా పరిణిస్తారు. ఇలా ప్రతిమూడు సంవత్సరాలకూ జరుగుతుంది.

సూర్యుడు ఏదైనా నెలలో రెండు రాశులమధ్య ప్రయాణిస్తే, దీనినే క్షయం అంటారు. క్షయ మాసానికి ముందు, తర్వాత కూడా రెండు అధిక మాసాలు వస్తాయి. అధిక మాసంలో పూజలు పునస్కారాలు లేకపోయినా దానాలు చేస్తే సత్ఫలితాలుంటాయి. రాగి పాత్రలో 33 తీపిపదార్థాలు వుంచి, ఆ పాత్రకు ఏడు దారపు తొడుగులను వేసి అల్లుడికి గానీ, గౌరవనీయవ్యక్తికి దానం చేయాలి. నారాయణుడిని స్మరించాలి. ఇలా చేస్తే అధికమాసం దుప్ఫలితాలుండవు.

అధిక మాసంలో చేసిన జప, దానాదులకు అధిక ఫలం వస్తుందని శాస్త్రవచనం పురుషోత్తమ మాసంలో చేసే పురాణ పారాయణ మునకు, శ్రవణమునకు, విష్ణుపూజకు అధిక ఫలం లభిస్తుంది.

ధర్మ సింధువు ననుసరించి అధిక మాసంలో ఉపాకర్మ, చూడకర్మ, ఉపనయనము, వివాహం, వాస్తుకర్మ గృహప్రవేశం, దేవతా ప్రతిష్ట, యజ్ఞం, సన్న్యాసం, రాజాభిషేకం, అన్న ప్రాశనం, నామకర్మాది సంస్కారములు, మొదలైనవి చేయరాదు. ముహూర్తాలతో ప్రమేయం లేని నిత్యం చేసే పూజ పునస్కారాలు, యధావిధిగా చేసుకోవచ్చు. ఈ అధిక మాసంలో పుణ్యకార్యాలు తప్పని సరిగాచేయాలి. శాస్త్ర ప్రకారం మరణించిన పితరులను తలచుకొని కనీసం అన్నదానం చేయాలి.

మన మతానికి లక్ష్యం

మన దేశంలో ఏన్నో మతాలున్నవి. శైవసిద్ధాతమొకటి. వైష్ణవుల పాంచరాత్ర మొకటి. మాధ్వసిద్ధాంతమొకటి. ఇట్లు పరస్పర వైరుధ్యం ఉన్నట్లుకన్పించే సిద్ధాంతాలూ మతాలూ ఏన్నో ఉన్నవి. మరి చూడబోతే ఇవన్నీ హిందూ మతానికి చెందినవే. వీనిలో ఏది గొప్ప, ఏది చిన్న అన్న విషయం కాదు ప్రస్తుతం. పోగా హిందూమతమంటే ఏమి? ఇన్నిసిద్ధాంతాలకున్నూ ఉమ్మడియైన విషయమేమిటి? అన్నది మనం తెలుసుకోవాలి. ఎవరిని అడిగినా, సరియైన జవాబు రావడం కష్టం. చక్కనిపాండిత్యమున్న వారుకూడా సిద్ధాంతాలలోని వ్యత్యాసాలనే మరింత ఎక్కువచేస్తున్నారు. వీని కన్నిటికీ సామాన్యమైన ఒకే లక్ష్యం ఉంటేకాని, హైందవాన్ని ఒక్క మతం అని చెప్పలేము. మరి ఆ లక్ష్యం ఏమిటి?

అనుదినం కొందరు రామాయణ పారాయణ చేస్తుంటారు. పారాయణ ప్రారంభమందూ అవసానమందూ ఈక్రింది శ్లోకం పఠిస్తారు.

స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
న్యాయ్యేన మార్గేణ మహింమహీశాః,
గోబ్రాహ్మణేభ్యః శుభ మస్తు నిత్యం
లోకాః సమస్తాః సుఖినో భవంతు||

జనులు సౌఖ్యంగా ఉందురుగాక. రాజులు భూమిని న్యాయమార్గంలో పరిపాలింతురుగాక. పశువులకూ, బ్రాహ్మణులకూ మంగళమగునుగాక. సమస్తలోకాలూ సుఖంగాఉండునుగాక అని దీని అర్థం.

ఈశ్లోకంలో జనులనూ రాజులనూ గూర్చి ఉమ్మడిగా చెప్పి. తర్వాత ప్రత్యేకంగా గోబ్రాహ్మణులనుగూర్చి చెప్పబడినది. ఈ బ్రాహ్మాణప్రశంస ప్రత్యేకంగా దేనికి వచ్చింది? వీళ్ళు లోకంలోవారే కాదా? మరి వీరి విశిష్టత ఏమిటి? బ్రాహ్మణులకు మంగళమగుగాక అనటం బ్రాహ్మణపక్షపాతంకాదా? ఇట్లు చెప్పవలసిన అవసర మేమిటి.

మధురానగరం ఒకప్పుడు కూన్ పాండ్యన్ అన్న రాజు పాలించేవాడు. అతడు శ్రమణుల మతంలో కలసిపోయాడు. శ్రమణమతం స్వీకరించి అతడు 'ఎవ్వరూ విభూతి పూయరాదు. రుద్రాక్షలు వేసుకోరాదు' అన్న కట్టడిచేశాడు. రాజుగారి భార్య, రాజుగారిమంత్రీ పరమశివ-ఏకాంతభక్తులు. ఐనప్పటికిన్నీ రాజాజ్ఞ ఏవిధంగా అతిక్రమించడం? రాజు మళ్ళా బుద్ధిమారి శైవమార్గంలోకి ఎప్పుడు వస్తాడా అని బాధపడేవారు. ఇతడు మళ్ళా శివారాధన ఎప్పుడు చేయబోతాడా అని కలవరపడేవారు. ఇట్లా ఉన్నప్పుడు ఆ రాజ్యానికి జ్ఞానసంబంధులు విజయంచేశారు. వారు శైవాచార్యులు అనబడే నలువురిలో ఒక్కరు. సుబ్రహ్మణ్యస్వామి అపరావతారం. తమ భక్తకోటితో ఒక్కొక్క క్షేత్రమే దర్శిస్తూ మధురానగరానికి వచ్చారు. ఇట్టి శుభసమయానికి ప్రతీక్షిస్తూ కూచున్న రాజమంత్రీ, రాజపత్నీ ఈ అవకాశాన్ని జారవిడుచుకోలేదు. వారు సంబంధులకు వార్తపంపి, ఎట్లాగైనా రాజుగారి బుద్ధినిమార్చవలెనని ప్రాధేయపడ్డారు.

సంబంధులు మధురలో ఒకచోట విడిదిచేశారు. వారి రాక ఇష్టపడని శ్రమణులు, వారి విడిదికి అగ్గిపెట్టారు. దీనిని గమనించి సంబంధులు 'ఈ మంట ఇచ్చటనుండి, రాజుగారి దేహంలో ప్రవేశించనీ' అని ఈశ్వరుణ్ణి ప్రార్థించగా, ఈశ్వర సంకల్పం మేరకు రాజుకు ఉగ్రమైన జ్వరంవచ్చింది. శ్రమణులు ఎంత శ్రమించినా రాజుగారి జ్వరం తగ్గలేదు. అప్పుడు మంత్రి రాజుగారికి సంబంధుల గొప్పతనం వర్ణించి, వారిని పిలిపిస్తే జ్వరం ఆగిపోతుందని నచ్చజెప్పారు. లోకంలో ఎంత పిడివాదం చేసేవాడయినా, వ్యాధి పరాక్రమం భరించలేని సమయంలో, తన పిడివాదాన్ని కొంతకొంత మార్చుకోవడం వాడుకే. అట్లే వ్యాధి తీవ్రత తాళుకోలేని కూన్ పాండ్యుడుకూడా, రుద్రాక్షలవారినీ బూడిద బుస్సన్నలనూ చూడనన్న తన పట్టును కొంత సడలించి సంబంధులను చూడడానికి సమ్మతించాడు. మంత్రి పరమానందం పొంది సంబంధులను మహా గొప్పగా ఆహ్వానించాడు.

రాజసమక్షంలో శ్రమణులకున్నూ జ్ఞానసంబంధులకున్నూ వాగ్వాదం ఆరంభమైంది. సంబంధులవారు శ్రమణులను చూచి ''మీరు రాజుగారి కుడిభాగంలోని జ్వరం పోగొట్టండి. నేను ఎడమవైపు పోగొటతాను. కానివ్వండి, మీ మంత్రశక్తిని చూపండి అని అన్నారు. మీరు పోగొట్టలేకపోతే మీరోడిపోయినట్లు; నేను పోగొట్టలేకపోతే నేనోడిపోయినట్లు'' అని పన్నిదంచరచి సంబంధులవారు పదికంపాడి రాజుగారి ఎడమభాగానికి విభూతి పూశారు. అంతటితో అభాగములో జ్వరం నిలిచిపోయింది. కాని శ్రమణులు ఎంత శ్రమించినా పని జరగకపోయింది. అంతటితో శ్రమణులు 'మీరుకుడితట్టుబాగుచేయండి; మేము ఎడమతట్టు బాగుచేస్తాం' అనిమళ్ళా సంబంధులతో పందెం వేశారు. సంబంధులవారు సరే అనగా, కుదిరిన ఎడమభాగంలోనికి జ్వరం పునఃప్రవేశం చేసింది. కుడిభాగంలో జ్వరం పోయింది.

రాజుగారి జ్వరం సామాన్యమైనది కాదు. అది ఈశ్వర సంకల్పమూలంగా వచ్చిన జ్వరం. అందుచేతనే శ్రమణులకు చెందిన రాజుగారి శరీరభాగం మళ్ళా జ్వరగ్రస్తమైంది. శ్రమణుల చేతకానితనం రూఢి ఐనపిదప సంబంధులు రాజుగారిపై జాలితలచి జ్వరం పూర్తిగా నిమ్మళించేటట్టు చేశారు.

అప్పటికీ శ్రమణులు తమ వోటమిని ఒప్పుకోలేదు. రాజుగారికిన్నీ పూర్ణమైన నమ్మక మేర్పడలేదు. వాదం మళ్ళా ప్రారంభమయింది. సంబంధులు వాదాని కుపక్రమించేముందు శివాలయానికి వెళ్ళి 'ఈ వేదనిందనూ, యాగనిందనూ చేసే శ్రమణులను జయించి నీ ప్రతిభ సర్వవ్యాప్తమయ్యేటట్లు అనుగ్రహించు' అని ఈశ్వరుణ్ణి వేడుకొన్నారు.

వాదం మళ్ళా ప్రారంభమైంది. సంబంధులవారన్నారు; ''మీసిద్ధాంతాన్ని ఒక తాటాకుమీద వ్రాసి వైఘానదిలో వేయండి. నా సిద్ధాంతాన్ని వ్రాసి నేనూ వేస్తాను. ఇందులో ఏది ప్రవాహానికి ఎదురీత ఈదగలదో అదే సత్యమైనసిద్ధాంతం'' అని. ఇందులోనూ సంబంధులవారిదే జయం. ఐనప్పటికీ శ్రమణులు ఒప్పుకోలేదు. అదేరీతిని తాటాకులమీద తమతమ సిద్ధాంతాలు వ్రాసి పరీక్షార్థం అగ్నిలో వేశారు. శ్రమణుల తాళపత్రం అగ్నిలో దగ్ధమైపోయింది.  జ్ఞాన సంబంధులు ఈ క్రింది అర్థం కల తమ సిద్ధాంతాన్ని ఆ తాటాకుమీద వ్రాశారు.

''బ్రాహ్మణుల సౌఖ్యంగా వర్థిల్లాలి. దేవతలూ, పశువులూ సుఖంగా ఉండాలి చల్లగా ఉండాలి"               

అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

--- “జగద్గురు బోధలు” నుండి

#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...