Wednesday, March 28, 2018

బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి

శ్లో|| అర్థా గృహే నివర్తంతే శ్మశానే మిత్రబాంధవాః
       సుకృతం దుష్కృతం చైవ గచ్ఛంతమనుగచ్ఛతి

                                                                         --సూక్తి ముక్తావళి. 112

సంపాదించిన డబ్బు ఇంట్లో ఉంటుంది. బంధు మిత్రాదులు స్మశానం వఱకు వస్తారు. చేసుకున్న మంచి చెడుల ఫలితాలు మాత్రమే మనల్ని అనుసరిస్తాయి.

నదీ ప్రవాహంలో రెండు పుల్లలు కొట్టుకొని వస్తుంటాయి. ఒక కెరటం, ఆ పుల్లలను కలుపుతుంది. కొంత దూరం కలిసి ప్రయాణం చేస్తాయి. ఇంకొక కెరటం వాటిని విడదీస్తుంది. ఈ లోకంలో భార్యాభర్తల అనుబంధం ఇంతే. ఎంతటి ప్రాణ సమానురాలైన భార్య అయినా సరే, నువ్వు మరణిస్తే, నీతో పాటు మరణించ లేదు, సరికదా! శవం దగ్గరకు రావడానికి కూడా భయపడుతుంది.

ఒకప్పుడు ఆడవాళ్లను స్మశానం వఱకు అనుమతించే వారు కాదు. కాలం మారి, ఇప్పుడు రాగలుగుతున్నారు. మామూలుగా అయితే, శవయాత్రలో కూడా పాల్గొననీయక, కేవలం ఇంటి గడప వఱకే ఉంచుతారు. కుమారుడు, మిత్రులు, బంధువులు స్మశానం వఱకు వస్తారు. అదీ స్మశానంలో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేయుటకు మాత్రమే. శరీరం మాత్రం, చితి పైకి చేరి కాలిపోతుంది. తర్వాత, నీతో గూడా వచ్చిన వారు ఒక్కసారి నీటిలో మునిగి, తమ దారిన తాము వెళ్లిపోతారు.

నువ్వు దాచుకున్న డబ్బు, మహా అయితే, నీ అంత్యక్రియలకు ఉపయోగపడవచ్చు. అది కూడా ఎవరో ఖర్చు పెడతారు. నువు చూడ బోవు. అలాంటప్పుడు, చంచలమైన ధనం కోసం తపన ఎందుకు? ఆలోచిస్తే, ఆనందమనేది ధనంలో లేదు. ధనం సుఖాన్ని ఇచ్చేటట్టయితే, ధనమున్న వారంతా సుఖపడాలి. అలా వారు లేరని, చూస్తున్న మనందరికీ తెలుస్తున్నది. అలాగే, ధనం లేని పేదవారు, గుడిసెలలోనే ఆనందంగా జీవిస్తూ కాలం గడిపేస్తున్నారు.

జీవితమంతా నిన్నే (ఆత్మను) అంటిపెట్టుకొన్న శరీరం కూడా, నిన్నొదిలేసి చితి మంటలలో కాలి, బూడిదైపోతుంది. ఇక శరీరమనబడేది ఉండదు. ప్రతిదీ కాలంలో హరించుకుపోతుంది, ఒక్క చైతన్యాన్ని మాత్రం స్ప్రుశించలేదు. ఆ చైతన్యాన్ని సదా దర్శించేవాడే తత్వజ్ఙుడు. ఆ (తత్+త్వం) తత్వమే బ్రహ్మపదార్థం. బ్రహ్మమొక్కటే సత్యం. ఆ బ్రహ్మను తెలుసుకుంటే, "బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి". ఇదే అసలు జ్ఙానం.

సజ్జన సాంగత్యం వలన పునీతులమవుతాం. ఇది కేవలం, దైవానుగ్రహం వలన మాత్రమే లభిస్తుంది. పరలోక యాత్రలో నీతో కూడా, నీకు తోడుగా వచ్చేవి, నువ్వు చేసుకొన్న మంచి, చెడు కర్మ ఫలితాలు మాత్రమే, అనుసరించి వస్తుంటాయి. అవి మంచి కర్మలైతే మంచిదే! అవే చెడ్డవైతే, దుష్ఫలితాలు అనుభవించాలి. అప్పుడు, నిన్నెవ్వరూ రక్షించలేరు. అందువలన, ఇప్పటి నుండే, నువ్వు మంచినే ఉంచు, మంచినే పెంచు, మంచినే అందరికీ పంచు.

దయచేసి రోజూ ఒక శ్లోకం నేర్చుకోండి. పిల్లలకు, ఇతరులకు నేర్పించండి.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ........

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...