Wednesday, May 9, 2018

పర్యావరణమే పరమేశ్వరుడు

ధర్మో రక్షితి  రక్షితః

*వృక్షేబ్యో హరికేశేభ్యశ్చ పశునమ్ పతయే  నమో నమః*

చెట్లునాటండీ అంటూ ఇప్పుడు పర్యావరణ శాస్త్రవేత్తలు గగ్గోలుపెడుతున్నారు. కానీ ఆనాడే మన మహర్షులు ఎంత ముందుజాగ్రత్తతో చెట్లునాటకపోతే నరకానికిపోతావూ అని హెచ్చరించారంటే వృక్షాలకు మన హైందవమిచ్చే విలువేంటో తెలుస్తోంది...
మానవున్ని నరకం నుండి తప్పించేవి వృక్షాలు
మానవుణ్ణి నరకం నుండి తప్పించేవి కూడా వృక్షాలే అని “శ్రీ వరాహా పురాణం“ (172వ అధ్యాయం, 36 వ శ్లోకం) పేర్కొంది...
*శ్లోకం :- అశ్వత్ధ మేకం, పిచుమంధ మేకం, స్య గ్రోధమేకం, దశ పుష్ప జాతీం ı*
*ద్వే ద్వే తధా దాడిమ మాతులింగే పంచామ్ర వాపీ నరకం న యాతీ ıı*
ఒక రావి చెట్టు, ఒక నిమ్మ చెట్టు, ఒక మఱ్ఱి చెట్టు, రెండు దానిమ్మ చెట్లు, రెండు మాధీ ఫలపు చెట్లు, అయిదు మామిడి చెట్లు, పది పూల చెట్లు వేసినవాడు నరకానికి వెళ్ళడు...
*పెంచిన మొక్కలే పుట్టే బిడ్డలు*
మనం మొక్కలు నాటి, ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచి పోషిస్తే అవే పునర్జన్మలో మనకు సంతానంగా మారతాయని హిందూ దర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి...
*అలాగే వృక్షాలను దానం చేయటం కూడా పుణ్యాన్ని అందించే దానాల్లో ఒకటి.*
*వృక్షాల గురించి ఋగ్వేదంలో ఇలా ఉంది.*
*శ్లోకం :- మా కాకమ్బీరముద్ వృహో వనస్పతి మశస్తీర్వి హి నీనశః ı*
*మోత సూరో ఆహా ఏదాచన గ్రీవ ఆదధతే వేః ıı*
*ఇతర పక్షులు పీకలు పట్టుకొని, వాటిని చంపివేసే డేగ జాతి పక్షిలాగా ఉండకండి. వృక్షాలను బాధించకండి.*
మొక్కలను పెకలించటం కాని, వాటిని నరికి వేయటం కాని చేయకండి, జంతువులకు, పక్షులకు ఇతర జీవరాసులకు అవి రక్షణ కల్పిస్తాయి అని పేర్కొనటం జరిగింది.
వృక్షాలకు సైతం సంతోషం, దుఃఖం లాంటి మానవ సహజమైన లక్షణాలు ఉంటాయి. గతజన్మలో చేసిన పాప పుణ్యాల తాలూకు ఫలితాలనే ఈ జన్మలో వృక్షాలు అనుభవిస్తుంటాయని “మనుస్మృతి” పేర్కొంటుంది...
మానవాళి సంతోషం కోసమే దేవుడు వృక్షాలను సృష్టించాడు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండే ఈ వృక్షాలు మనుషులను మాత్రం ఈ ఎండ, వానల నుండి కాపాడతాయి...
*మహర్షులు సైతం వృక్షాల నీడనే గాఢమైన ద్యానంలో మునిగి తపమాచరించారని పురాణాల్లో చదివాం. నరకప్రాయాన్ని తప్పించుకోవటం కోసం, జీవితంలో దుఃఖాన్ని పోగొట్టి, ఆశాభావాన్ని రేకెత్తించటం కోసం వృక్షాలను నాటి, పెంచి పోషిద్దాం...

లోకా సమస్తా సుఖినో భవంతు:

తిరుమలలో మీరు వాలంటీర్ గా చేస్తారా..?


*అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా..?*
*వివరాలు తెలీక బాధ పడుతున్నారా..?*

ఐతే ఈ సమాచారం అందరికి షేర్ చేయండి...!!

తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని ఎంతోమంది దర్శించుకుని తరిస్తారు. అయితే ఆ స్వామి వారి సన్నిధిలో వారం రోజులపాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ. శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వలంటీర్లను ఎంపిక చేస్తుంది. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి?, మార్గదర్శకాలు ఏమిటో?

తెలుసుకోండి మరి...!

నెల రోజుల ముందే సమాచారమివ్వాలి..!

ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను నెలరోజుల ముందుగానే టీటీడీకి పంపాలి.

*ఏ కులం వారైనా హిందువులందరూ శ్రీవారి సేవకు అర్హులే.*

హిందువుగా గుర్తించేందుకు తిరుమల నామం, తిలకం లేదా కుంకుమ లేదా చందనం బొట్టు ధరించాలి.

శ్రీవారి సేవకు వచ్చే గ్రూపు లీడరు లేదా కోఆర్డినేటర్ వలంటీర్ల పూర్తి వివరాలు తిరుమల సేవా సదన్‌లో అందించాలి.

*వారి వయసు 18 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలి.*

*ఆరోగ్య ధ్రువీకరణ పత్రాన్ని (మెడికల్ సర్టిఫికెట్) గుర్తింపు పొందిన వైద్యునిచేత అటెస్ట్ చేయించి సమర్పించాలి.*
కేటాయించి తేదీల్లో ఉ. 10 నుంచి సా.5 వరకు సేవాసదన్‌లోని సహాయ ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి.

*సేవకులకు ఉచిత బస కల్పిస్తారు.* పురుషులకు పీఏసీ-3లో, మహిళలకు సేవాసదన్‌లో వసతి కల్పిస్తారు. సేవకులు తమ లాకర్ కోసం తాళం చెవిలు తెచ్చుకోవాలి.

శ్రీవారి సేవాసదన్‌లో రోజూ సాయంత్రం 4గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. రోజుకు కనీసం ఆరుగంటలు విధులు నిర్వహిం చాల్సి ఉంటుంది.

సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి.

గోవిందుడిని స్మరిస్తూ, భక్తులను గోవిందా గోవిందా అని సంభోదించాలి.

శ్రీవారి సేవ పూర్తిగా యాత్రికుల సహా యం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ మాత్రమే. సేవ కోసం గ్రూపు కోఆర్డినేటర్‌కు కానీ సిబ్బందికి కానీ ధన, వస్తురూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు.

కేటాయించిన ప్రదేశంలోనే సేవ చేయాలి. గర్భాలయ సేవ నిర్బంధ సేవ కాదు. గర్భాలయం సేవ కోసం ఒత్తిడి చేయకూడదు.

*" సేవా సదన్‌లో ఉండే మహిళా సేవకులు రాత్రి వేళల్లో నైటీలు ధరించరాదు."*

నియమ, నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల వరకు సేవకు అనుమతించరు.

తిరుమల ఆస్థాన మండపంలో ప్రతి శుక్రవారం ఉదయం 9నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు శ్రీవారి సేవకులు హాజరుకావాల్సి ఉంటుంది.

సేవకులు తమ చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకు రాకూడదు.

*డ్రెస్ కోడ్ :*
సేవకు వచ్చే మహిళలు మెరూన్ బార్డర్ కలర్‌తో కూడిన ఆరెంజ్ కలర్ చీర, రవిక ధరించాలి. పురుషులు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి.

*వివరాలు పంపాల్సిన చిరునామా*

పౌరసంబంధాల అధికారి,
తిరుమల తిరుపతి దేవస్థానము,
కపిలతీర్థం రోడ్డు, తిరుపతి,
పిన్ కోడ్ 517501.

మరిన్ని వివరాలకు
0877-2263544,
0877-2264392,
0877-2277777 నంబర్లలో సంప్రదించవచ్చు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❄ *ఓం నమో వేంకటేశాయ* ❄

*టెలిగ్రాం ఛానెల్ లింక్*
https://t.me/joinchat/HSeXJRAyBwq_yPUD3pHEYA
*ఓం  నమో వేంకటేశాయ*
*రెడ్డేరి ఆదం శేఖర్ రెడ్డి* - తిరుమల.

మన మహర్షులు అగస్త్య మహర్షి


అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప మహర్షి. అగస్త్యుడు నర్మదా నది ఒడ్డున ఉన్న గరుడేశ్వర అనే ప్రదేశం వద్ద తపస్సు ఆచరించినట్లుగా చెబుతారు. భారతీయ సంప్రదాయం ప్రకారం అగస్త్యుడు చాలా భారతీయ భాషల్లో గొప్ప పండితుడు.

అగస్త్యుడు ఎన్నో ఇతిహాసాలు, పురాణాలలో కనిపిస్తాడు. ముఖ్యంగా రామాయణ, మహాభారతాలలో అతని ప్రస్తావన ఉంది. అగస్త్యుడు సప్తర్షులలో ఒకడు. తమిళ శైవ సాహిత్యంలో అగస్త్యుని శైవ సిద్ధునిగా వర్ణించారు. శాక్తేయం, వైష్ణవాలకు చెందిన పురాణాలలోనూ అగస్త్యుని ప్రస్తావన వస్తుంది.

వరాహ పురాణంలోని అగస్త్య గీత, ద్వైద నిర్యాణ తంత్రం, స్కంద పురాణంలోని అగస్త్య సంహితలను అగస్త్యుడే  రచించాడు.  అగస్త్యుణ్ణి  కలశజ, కుంభజ, కుంభసంభవ, మైత్రావరుణి అని కూడా అంటారు.

అగస్త్యుని మూలాలు పౌరాణికమైనవి. మిగిలిన ఋషులులాగా అగస్త్యుడు తల్లీ, తండ్రులకు పుట్టలేదు. వరుణుడు, మిత్రుడు యజ్ఞం చేస్తుండగా, ఊర్వశి ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూసి మోహం పొందిన వారిద్దరి వీర్యాలు అక్కడే ఉన్న ఒక కుండలో పడ్డాయి. ఆ కుండ గర్భస్థానం. ఈ కుండలోనే ఆగస్త్యుడు, తన కవల అయిన వశిష్ఠునితో కలసి పెరుగుతాడు.  అలా అగస్త్యునికి *కుంభసంభవుడు* అనే పేరు వచ్చింది.  అంటే కుండలో నుంచి పుట్టినవాడు అని అర్ధం.
( ఈ మట్టి కుండలో పుట్టడం ఏమిటి ? అనే సందేహం రావడం సహజం. భౌతికంగా స్త్రీ పురుష సంయోగం లేకుండా ప్రయోగశాలలో పురుష బీజాన్ని స్త్రీ అండంలో ప్రవేశపెట్టి కొత్త జీవిని సృష్టించడం  అనేది నేడు మనం చూస్తున్నాం. దాన్నే *టెస్ట్ ట్యూబ్ బేబీ* అంటున్నాం.   పురాణంలో  చెప్పబడిన ఈ మట్టి కుండలో జననం అనేది టెస్ట్ ట్యూబ్   బేబీ    ని మించిన వైజ్ఞానిక చర్య.  పురాణాలు ఏవీ సైన్సు కు అంతు చిక్కనివి. అందువల్లే    నేటి  ఆధునికులు పురాణాలను నమ్మకపోవడం లేదా కొట్టి పారేయడం చేస్తుంటారు. పార్వతి నందునుడు గణేశునికి ఏనుగుతల చేర్చబడింది. తల నరక బడిన దక్షునికి మేకతల అతికించబడింది. అలాగే మృగ శీర్షంతో సహజంగా అవతరించిన దేవతలున్నారు. వారిలో నరశింహుని ముందుగా చెప్పుకోవాలి.  గుఱ్ఱం ముఖులు మనకు ఇద్దరు కన్పిస్తారు. ఒకరు గాన గంధర్వుడు తుంబురుడు, రెండవది సాక్షాత్తూ నారాయణావతారమైన హయగ్రీవుడు. ఇంకా భైరవుడు కుక్క మొఖం కలిగిన వాడు. వీటి వెనుక నేటి ఆధునిక వైద్యులకు శాస్త్రవేత్తలకు అంతుచిక్కనంత మహత్తరమైన సైన్సు దాగి ఉంది.మన వాంగ్మయం మన వైదికం *Beyond Science* . సూర్య కిరణంలో దాగున్న D విటమిన్ ఎలా అయితే కంటికి  కనబడదో మన ధార్మిక అంశాలూ అంతే  *త్వరలోనే మన వెబ్ సైట్ లో దీనిగురించి ఆధారాలతో రాస్తాను* )

*వివాహం -  సంతానం*

అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర. అగస్త్యునితో ఈమె వివాహం గురించిన కథ ఒకటి ఉంది.
    ఈవిధంగా జన్మించిన అగస్త్యుడు ఒకసారి ఒక అడవిలో వెడుతుండగా, ఆయనకు తన వంశంలోని పితృదేవతలు చెట్లకొమ్మల మీదనుంచి దిగువకు తలకిందులుగా వేళ్లాడుతూ కానవస్తారు.వారిని చూసి, వారి దురదృష్టానికి చాలా చింతిస్తాడు. వంశం కొనసాగని కారణంగా,  ధర్మనియమాల ప్రకారం తమకు ఉత్తమ లోకాలకు వెళ్లగల అవకాశం లేకపోతోందని వారు అగస్త్యునికి తెలియజేస్తారు. తమ పూర్వికులైన పితృదేవతలకు ఉత్తమగతుల ప్రాప్తి కలిగించటం తన బాధ్యత గనుక,   తాను మనుధర్మ నియమానుసారం వివాహం చేసుకుని, తండ్రి కావాలనే కోరికతో అగస్త్య మహర్షి, తన తపోశక్తితో, సకల గుణ సంపన్న కాగల ఆడపిల్ల అయ్యే విధంగా ఒక ఫలాన్ని రూపొందిస్తాడు. అప్పట్లో విదర్భ మహారాజు బిడ్డలకోసం పరితపిస్తూ ఉంటాడు. ఆ విషయం తెలిసిన అగస్త్యుడు, తను సృష్టించిన ఫలాన్ని విదర్భ రాజదంపతులకు ఇచ్చి, ఆమె విదర్భరాకుమార్తెగా పుట్టే ఏర్పాటు చేస్తాడు. ఆ బిడ్డ విదర్భ రాజుకు కుమార్తెగా లోపాముద్రగా జన్మిస్తుంది. తర్వాత, ఆమెకు యుక్తవయస్సు వచ్చాక, ఆమెనే అగస్త్య మహర్షి వివాహమాడుతాడు. అగస్త్య మహర్షి అంటే ఇష్టపడే లోపాముద్ర, తన రాజభోగాలను వదులుకుని, భర్తతో అడవికి వచ్చేస్తుంది. ఈ దంపతులకు భృంగి, అచ్యుత అని ఇద్దరు కుమారులు జన్మిస్తారు. 

    అయితే, అగస్త్య లోపాముద్ర దంపతులకు ఒక్కడే కుమారుడు జన్మించాడనే కథ వేరొకటి ఉంది. ఒకసారి, లోపాముద్ర తన భర్త అయిన అగస్త్యుని చేరి, తనకు కుమారుడు కావాలని కోరుతుంది. దానికి అగస్త్యుడు 'నీకు వెయ్యిమంది కొడుకులు కావాలా? లేదా వెయ్యిమంది శక్తితో వంద మంది కుమారులు కావాలా? లేదా వందమంది శక్తితో పదిమంది కుమారులు కావాలా? లేక పదిమంది శక్తితో ఒక్క కుమారుడే కావాలా?' అని అడుగుతాడు. దీనికి జవాబుగా తనకు ఒక్క కుమారుడు చాలని లోపాముద్ర జవాబు ఇస్తుంది. ఆయన ఆవిధంగానే అనుగ్రహిస్తాడు. దానితో, వారికి 'దృహదశ్యుడు' అనే కుమారుడు జన్మించాడనేది ఈ కథ. ఈ కుమారునికే 'ఇద్మావహుడు' అని మరొక పేరుందని అంటారు.

అగస్త్యుడు రచించి మనకు అందించిన సోత్రాలు  ఎన్నో ఉన్నాయి. 
జయ పద్మపలాశాక్షి జయ త్వం శ్రీపతిప్రియే I. జయ మాతర్మహాలక్ష్మి సంసారార్ణవ తారిణి II 1 II. మహాలక్ష్మీ నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి I. హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే II 2 II. అనే మహాలక్ష్మి స్తోత్రం,  అలాగే...

రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి *ఆదిత్య హృదయం* అనే  మంత్రాన్ని ఉపదేశిస్తారు. ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ శ్లోకాలు వస్తాయి.

🔥 *పురాణ కథలలో అగస్త్యుని ప్రస్తావన* 🔥

వాతాపి, ఇల్వలుల కథ
ఒకానొకప్పుడు వాతాపి, మరియు ఇల్వలుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వీరు అడవిలో నివసిస్తూ దారిన పోయే బాటసారులను ఒక విచిత్రమైన రీతిలో చంపి తినేవారు. వాతాపికి సులభంగా తను కోరుకున్న జీవి రూపంలోకి మారే విద్య తెలుసు. ఇల్వలుడికి చనిపోయినవారిని బ్రతికించే సంజీవనీ విద్య తెలుసు. ఎవరైనా బాటసారి వచ్చినపుడు వాతాపి ఒక మేక రూపంలోకి మారిపోయేవాడు. ఇల్వలుడు ఒక బ్రహ్మచారి వేషం వేసుకుని అతిథులను భోజనానికి ఆహ్వానించేవాడు. మేక రూపంలో ఉన్న వాతాపిని చంపి వారి మేకమాంసానని పెట్టేవాడు. మేక మాంసాన్ని ఆరగించగానే ఇల్వలుడు వాతాపిని బ్రతికించడానికి సంజీవినీ మంత్రం పఠించేవాడు. అప్పుడు వాతాపి ఆ బాటసారి పొట్టను ఛేదించుకొని బయటకు వచ్చేవాడు.
ఒక సారి అగస్త్యుడు ఆ అరణ్యం గుండా ప్రయాణిస్తుండగా ఈ రాక్షసులు గమనించి ఆయన్ను విందుకు ఆహ్వానించి మేక మాంసం వడ్డించాడు ఇల్వలుడు. ఆయన భోంచేసిన తరువాత ఇల్వలుడు యథావిధిగా వాతాపిని బయటకు రప్పించడానికి సంజీవనీ మంత్రం జపిస్తాడు. కానీ వాతాపి మాత్రం ఎంతకీ తిరిగి రాడు. ఎందుకంటే వీరి విషయం ముందుగా తెలుసుకున్న అగస్త్యుడు జీర్ణం జీర్ణం, వాతాపి జీర్ణం అనగానే వాతాపి జీర్ణమైపోయాడని ఇల్వలుడికి తెలియజేస్తాడు.
కాలకేయ గణాలు అనే రాక్షసులు పగలంతా కన బడకుండా సముద్రంలో దాక్కొని, రాత్రి వేళల్లో తపస్వుల మీద పడి చంపేస్తూ ఉండేవాళ్లు. దేవతలు అగస్త్యుడిని ప్రార్థిస్తే, ఆయన సముద్రాన్నంతా ఆపోశన పట్టి చుక్క మిగలకుండా తాగేశాడు. కాలకేయ గణాలకు దాక్కొనేందుకు చోటు మిగలలేదు. దాంతో దేవతలు వాళ్లను సంహరించగలిగారని పురాణ గాథ.
వనవాసం చేస్తున్న శ్రీరాముడు అగస్త్యాశ్రమం దర్శించి మహర్షిని సేవించాడు. అగస్త్యుడు రాముడికి వైష్ణవ ధనుస్సు, అక్షయ తూణీరం, దివ్య ఖడ్గాలు బహూకరించి, సమీపంలో ఉన్న పంచవటిలో కుటీరం కట్టుకొని నివాసం చేయమని సూచన చేశాడు. అనంతరం, రామరావణ యుద్ధంలో అగస్త్యుడు రణరంగానికి వెళ్లి రాముడికి శుభదాయకమైన ఆదిత్య హృదయాన్ని బోధించి ఉత్సాహపరిచాడు. ఇంద్ర పదవి పొంది కళ్లు నెత్తికెక్కి సప్తర్షులను పల్లకీ బోయీలుగా నియమించిన నహుషుడిని క్షణకాలంలో కొండచిలువగా మార్చి కళ్లు తెరిపించింది అగస్త్యుడే.

🔥 వింధ్యుని గర్వ మణచుట 🔥

మేరు పర్వతం అన్నింటికన్నా ఎత్తైన పర్వతం. దాని ఎత్తును చూసి భరించలేక ఈర్ష్యతో వింధ్యపర్వతం కూడా దానికంటే ఎత్తుగా ఎదిగి సూర్యుని గమనాన్ని కూడా అడ్డగించసాగింది. దీంతో రాత్రింబవళ్ళూ సక్రమంగా రాక వేద విధులకు ఆటంకం కలగసాగింది. అప్పుడు దేవతలందరూ కలిసి అగస్త్యమునిని ఏదో ఒకటి చేయమని ప్రార్థించారు. వారి ప్రార్థనను మన్నించిన అగస్త్యుడు తన భార్యతో కలిసి ఆ పర్వతం వద్దకు వచ్చాడు. తాము దక్షిణ దిశగా వెళుతున్నామనీ, అంత పెద్ద పర్వతాన్ని ఎక్కి దిగలేమనీ దాని ఎత్తుని తగ్గించుకోమన్నారు. మహర్షులంటే భక్తి ప్రపత్తులు గల వింధ్యుడు తక్షణమే తన ఎత్తుని ఉపసంహరించుకుని వెంటనే వారు నడచి వెళ్ళడానికి వీలుగా దారి ఇచ్చాడు. తర్వాత అగస్త్యుడు తాము మరలా తిరిగి ఉత్తర దిశగా తిరిగి వస్తామని అప్పటిదాకా అలాగే ఉండమని చెప్పాడు. కానీ మళ్ళీ తిరిగి రానేలేదు. అప్పటి నుంచీ ఇప్పటిదాకా ఆ పర్వతం అలాగే ఉంది. 'అగస్త్య' అనే మాటకు పర్వతాలను పడదోయగలిగినవాడు అని అర్థం. 'అగ' అంటే కదలలేనిది, పర్వతం అని అర్థం కాగా, 'అస్తి' అంటే ఉండుట అర్థం, 'న' అంటే లేదు, అని అర్థం. మొత్తంమీద పర్వతాలను ఉండనీయకుండా చేయుట లేదా పడగొట్టడం అని అర్థం. వింధ్యపర్వతగర్వభంగం చేసిన కారణంగా ఈయనకు ఈ పేరు వచ్చిఉండవచ్చు.

*అగస్త్యుడి ద్వాదశ వర్ష యజ్ఞం* 

    అగస్త్యుడు ఒకసారి ద్వాదశ వార్షిక (12 సంవత్సరాలపాటు జరిగే) యజ్ఞం చేయాలని సంకల్పిస్తాడు. అయితే, ఈ యజ్ఞానికి వచ్చే వారికి అన్నపానాదులు సమకూర్చటం అంటే మాటలు కాదు. పైగా అప్పట్లో వర్షాభావంచేత తీవ్రమైన కరువు ఉండేది. ఈ సందేహాన్నే అనేకమంది మునులు, అగస్త్యుని ముందుంచారు. ఆయన నవ్వి, 'సకాలంలో వానలు కురిపించటం ఇంద్రుని పని. ఆయన ఆ పనిని సరిగ్గా చేయని పక్షంలో నేనే ఇంద్రపదవిని గ్రహించి, వానల్ని కురిపిస్తాను' అని అన్నాడు. ఈ సంగతి విన్న దేవగురువు బృహస్పతి వెంటనే, అగస్త్యుడిని చేరి, క్షమించమని కోరి, ఇంద్రుని పిలిపించి వర్షాలను కురిపించాడు. ఫలితంగా, అగస్త్యుడు, తాను అనుకున్నట్లుగా ద్వాదశ వార్షిక యజ్ఞాన్ని ఏ ఆటంకం లేకుండా పూర్తి చేయగలిగాడని మహాభారతంలోనిదే మరొక కథ.

🔥 *మానవాళికి అగస్త్యుని వరాలు* 🔥

    అగస్త్య మహాముని మానవాళికి ప్రసాదించిన అపురూప వరాలు ఎన్నో ఉన్నాయి.

    మహాభారతంలోని శాంతి పర్వంలో అగస్త్య బోధ ఉంది. దీన్నే 'అగస్త్య గీత' అనీ అంటారు.

    'సంస్కృత వాచస్పత్యము' అనే గ్రంధం ప్రకారం, అగస్త్యుడు 'రామచంద్ర విష్ణునామాద్యవతార పూజా విధానము'ను కూడా శాస్త్రోక్తంగా తెలియజేశాడు. దీన్నే మనం 'అగస్త్య సంహిత' అని వ్యవహరిస్తున్నాం.
ఇక, శ్రీరామచంద్రుల వారికి అగస్త్యుడు బోధించిన 'ఆదిత్య హృదయం' సుప్రసిద్ధం. ఇది

    'రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్‌,
    పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్‌...'
అనే శ్లోకంతో ప్రారంభం అవుతుంది. అంతవరకూ యుద్ధం చేసినా, రావణుని తాను వధించలేకపోయానని బాధపడుతూ, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న శ్రీరామచంద్రుని కర్తవ్యపరాయణుని చేసిన మహా మంత్రమిది. ఈ 'ఆదిత్యహృదయం' పఠనంతో శ్రీరాముడు తిరిగి, సముజ్జ్వల శక్తితో యుద్ధరంగానికి చేరి రావణుని వధించాడు.

    అలాగే, అగస్త్యుడు, మానవాళిని అనుగ్రహిస్తూ అందించిన 'ఆదిత్య కవచము' కూడా మహామహిమాన్వితం. ఇది

    'జపాకుసుమ సంకాశం ద్విభుజం పద్మహస్తకం
    సిందూరాంబర మాల్యం చ రక్తగంధానులేపనమ్‌' 
అనే శ్లోకంతో ఆరంభం అవుతుంది.

    అలాగే, ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్యనారాయణుని స్తుతిస్తూ, అగస్త్యుడు 'ఆదిత్య స్తోత్రము'ను కూడా మానవాళికి ప్రసాదించాడు. 'ఆదిత్య స్తోత్రము' దిగువ పేర్కొన్న శ్లోకంతో ఆరంభం అవుతుంది:

    'ధ్యాయేత్సూర్యమనంతకోటి కిరణం తేజోమయం భాస్కరం
    భక్తానా మభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్‌'.

*అగస్త్యునికి అర్ఘప్రదానం*

భాద్రపద మాసంలో ఆకాశవీధిలో అగస్త్య నక్షత్రం మనకు ఎంతో తేజోమయమై కానవస్తుంది. ఈ అగస్త్య నక్షత్రం కానవచ్చిన తర్వాత, ఆగస్త్యుని ప్రతిమకు కాశపుష్పాలతో పూజ చేసి, ఆ రాత్రి జాగరణ చేయటం సంప్రదాయం. ఇలా చేయటం మోక్షదాయకమని భక్తుల విశ్వాసం. ఇది ఇప్పటికీ అనేక ప్రాంతాలలో మనకు కానవస్తున్న పూజావిధానం.

    అగస్త్యాయ సమస్తేస్తు అగస్త్యేస్మిన్‌ ఘటేస్థితః
    అగస్త్యో ద్విజరూపేణ ప్రతిగృహ్ణాతు సత్కృతః
    అగస్త్యస్సప్తజన్మాఘం నాశయిత్వా వయోరయం
    అపత్యం విమలం సౌఖ్యం ప్రయచ్ఛతు మహామునిః 

                                    గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ.....

నాలుగు  సంకల్పాలు

                    ఓం శ్రీమాత్రేనమః
               
                 అద్వైత చైతన్యజాగృతి
 
దివ్య జనని శారదా మాత ఒక విలువైన మాటను ఎల్లపుడూ చెప్పేవారు. మనిషిఅత్యంత జాగ్రత్తగా జీవించాలి. అతని ప్రతిసంకల్పమూ, చర్యా చాలా జాగ్రత్తగాఉండాలి.

ఎందుకంటే ఈ సంకల్పాలు చర్యలు అనేవాటివల్లె మనిషి మనస్సులో వాసనలు కలుగుతాయి. ఈ వాసనా బలమే తరువాత అతడు మంచి లోకాలలో జన్మిస్తాడా లేక అధమ లోకాలలో జన్మిస్తాడా, మంచి పుట్టుక కలుగుతుందా లేక నీచమైన పుట్టుక కలుగుతుందా అనే విషయాన్ని నిర్ణయిస్తాయి.

ప్రతి వానికి తానూ మంచి కుటుంబంలో పుట్టాలి తనకు అంతా మంచే జరగాలి అనే ఉంటుంది. కానీ అలా జరగదు. కారణం? తన పూర్వ కర్మలు తన ఆలోచనలు సంకల్పాలు చర్యలు ఇవే కారణం.అంతిమంగా మన భావనలే మన మిత్రులు అవే మన శత్రువులు.యోగ వేదాంత శాస్త్రముల ప్రకారం మనిషి యొక్క భావనలకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. 

ఈ పూర్వ రంగంలో, భగవాన్ బుద్ధుని అత్యంత ప్రధాన బోధనలలో ముఖ్యమైనవి అయిన నాలుగు బ్రహ్మ విహారాలను గురించి చూద్దాం.

అవే మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష. తన శిష్యు లందరికీ ఈ నాలుగు గుణాలను పరిపూర్ణంగా, అనంతంగా, వారువీరనక, శత్రువులు మిత్రులు ఎల్లరి యందూ చూపించేలా అభ్యాసం చెయ్యమని బుద్దుడు ఆదేశించాడు.

ధ్యాన అభ్యాసి ఈ నాలుగు గుణాలనూ ప్రతిరోజూ లోతైన ధ్యానం చెయ్యటం ద్వారా తనవిగా చేసుకొనడం ద్వారా అతడు ఉన్నత లోకాలను పొందగలడు. మరణానంతరం వ్యధా భరితములైన తక్కువ లోకాలలో జన్మించటం జరుగదు. జీవించినంత కాలం చెదరని మనో నిశ్చలత తో అతడు జీవించగలడు. మరణం తరువాత బ్రహ్మ లోకాన్ని అతడు చేరుకుంటాడు.

ఈ నాలుగు బ్రహ్మ విహారాలు బ్రహ్మ లోకంలో ఉండే ఉన్నత తరగతికి చెందిన జీవులకు సహజంగా ఉండే లక్షణాలు . బ్రహ్మ లోకం అంటే ఊర్ధ్వ లోకాలలో చాలా పైది అని తలచవచ్చు. జంతులోకానికి మన లోకానికి చాలా భేదం ఉంది. ఆ సంగతి మనకు తెలుసు. అలాగే మనకు దేవతా లోకాలకు భావనలలో, అనుభవాలలో, పరిస్తితులలో చాలా తేడా ఉంటుంది. ఈ లోకాలలో ఉండే జీవులను దేవతలు అని మనం తలచ వచ్చు. ఈ గుణాలు పరిపూర్ణం గా అభ్యాసం చెయ్యటం వలన మానవుడు దేవతా స్థానాన్ని పొందగలడు. వారి గుణాలను తనవిగా చేసుకోవటం వల్ల వారి లోకాన్ని అతడు పొంద గలడు .

>మైత్రి:

సాధారణంగా మానవులకు ఉండే సహజ గుణం ఓర్వలేనితనం మరియు ద్వేషం. మైత్రీ గుణాన్ని ఎల్లలులేకుండా అభ్యాసం చెయ్యటం ద్వారా మనిషి లో మైత్రీ భావన నిండుతుంది. అతనికి ఈ భూమ్మీదే కాదు ఇతర ఏ లోకంలోనూ శత్రువులు అంటూ ఉండరు. క్రూర జంతువులు సైతం అతని సమక్షంలో తమ సహజ స్వభావాన్ని వదలి సాదుజంతువులుగా మారతాయి. ఇక మనుషుల మాట చెప్పేదేమి?

మనసులో మైత్రీ భావనతో ఉన్న మనిషిఎల్లప్పుడూ ప్రశాంత వదనంతో ఉండగలడు. ప్రసన్న చిత్తం కలిగి ఉండటం ద్వారా ముందు సాధకునికే ఎంతో మంచి జరుగుతుంది. అనవసర ఆదుర్దాలు ఆందోళనలు లేకపోవటం వల్ల శారీరిక మానసిక ఆరోగ్యం బాగుంటుంది.

ఈ భావనా అభ్యాసం వల్ల సాధకుడు మనో ప్రశాంతతను పొందగలడు. ద్వేష భావం నుంచి విముక్తుడు కావటంతో అతనికి మనసు ఎల్లప్పుడూ తేలికగా సంతోషంగా ఉంటుంది. ఎవరిని చూచినా అతనికి ద్వేష భావం కలుగదు. మైత్రీ భావం తో నిండి ఉండటంతో ముల్లోకాలలో ఎవ్వరితోనూ అతనికి శత్రుత్వం ఉండదు.

>కరుణ: 

మోహ గ్రస్తులై చరిస్తున్న మానవులను ఇతర జీవకోటిని తలచి ఈ కరుణా భావనను అభ్యాసం చెయ్యాలి. గొప్ప దైన దైవీ సంపదను పొందగలిగే అవకాశాన్ని కలిగి ఉండి కూడా మానవులు ఇంద్రియ వ్యామోహ పరులై తాను రాజునన్న సంగతి మరచి చిల్లరకోసంపరిగెత్తే మూర్ఖుని వలె ప్రవర్తిస్తూ ఉన్నారు. అజ్ఞాన పీడితులై జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ అనేక బాధలు పడుతూ ఉన్నారు. తమ కర్మలు తమను పట్టి బంధించే పాశాలన్న సంగతి తెలియక క్షణిక లాభాలకోసం ఆరాట పడుతూ చెయ్య రాని పనులు చేస్తూ దుస్సంస్కారాలను పోగేసుకొని తమ అధోగతికి మెట్లను తామే నిర్మించుకుంటున్నారు.సమస్త ప్రపంచాన్నీ కట్టి నడిపిస్తున్న అజ్ఞాన భ్రాంతి ఎంత గొప్పది? ఈ అజ్ఞాన సీమ ఆవల ఎంతటి తేజోమయ లోకాలున్నాయి. వాటి సంగతి తెలియక మానవులు భ్రాంతిలో మునిగి ఇదే సర్వస్వం అనుకొని పంచేంద్రియ భోగాల కోసం తుచ్చమైన కర్మలు చేస్తూ క్షణ క్షణానికి ఊబిలో కూరుకొని పోతున్న వాని వలె తమ వినాశాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు. సమస్త లోకాలూ వాటిలోని జీవులు ఇదే తీరులో ఉన్నాయి.

ఈ ధ్యానాన్ని చక్కగా అభ్యాసం చేసి కరుణ అనేభావనను ఎల్లలు లేకుండా ధారణ చెయ్యటం వల్ల మనిషి కరుణా పూరితుడు అవుతాడు. తప్పులు చేసిన వారిమీద అతనికి కోపం రాదు. కరుణ పెల్లుబుకుతుంది. ఇది కూడా ఒక దైవ గుణం. బోధిసత్వులందరూ ఈ కరుణా భావనతో పరిపూర్ణు లైనవారే. ఈ భావనా బలం వల్ల ఇతరుల చెడు కర్మను, రోగాలను పోగొట్టగల సంకల్ప బలం దైవీ శక్తిసాధకునికి కలుగుతాయి.

>ముదిత:

అంటే సంతోషం అని అర్థం. మంచి సంస్కార వంతులను, సంపన్నులను, ధార్మిక పరులను , ఉన్నతులను, సాధనా మార్గంలో పురోగమించిన వారిని చూచినపుడు వారి మంచి కర్మకు, పుణ్య బలానికి తానూ కూడా సంతోషం పొందటాన్ని ముదిత అని పిలవాలి. ఇదిచక్కని దైవీ గుణం.

అసూయ, ద్వేషం, ఈర్ష్య మొదలైన చీకటి గుణాలు ఈ ముదితా భావన తో పారదోల బడతాయి. ఎవరైతే సుఖంగా ఉన్నారో వారిని చూచి వారి సంతోషాన్ని తన సంతోషం గా భావించి అంతకంటే ఆనందాన్ని సంతోషాన్నిసాధకుడు ఈ భావనా బలంతో పొందగలడు. తన వద్ద ఏమీ లేకున్నాఇతరులను వారి పుణ్య బలాన్ని చూచి సంతోషంగా ఆనందం గా ఉండ గలగ టాన్ని ఈ భావనా ధ్యానం ఇస్తుంది. ఇది కూడా దేవతా లక్షణమే.

>ఉపేక్ష:ఇక దుర్మార్గులను, తనను ఎగతాళి చేసేవారిని, హాని చేసేవారిని ఈ ఉపేక్షా భావనతో విస్మరించి ఊరుకోవాలి. దీని సాధన వల్ల మనసులో ఉక్రోషం, ఏడుపు, నిస్సహాయత, కుంగిపోవటం, కోపం, కసి వంటి నిమ్న స్తాయికి చెందిన భావనలు మాయం అవుతాయి. మనసు ఆకాశం వలె నిర్మలంగా ఉండగలుగుతుంది. అన్నిటి కంటే ఈ ఉపేక్షా భావన అభ్యాసం కష్టం.

కారణం ఏమనగా ఉపేక్షా భావనలో ప్రతిష్టితుడు కావడానికి అహంకారం చాలా వరకూ తగ్గిపోవాలి. అది బలం గా ఉంటేప్రతీకారం వంటి భావాలు పొంగి మనిషిని ఉన్మత్తున్ని చేస్తాయి. అహంకార మాలిన్యాన్ని కడిగి వెయ్యాలంటే ద్వంద్వములను సాక్షి గా చూస్తూ ఉండగల ఉపేక్షా భావనా ధ్యానంలో నిష్ణాతుడు కావాలి.

శ్రీ రామకృష్ణుని ప్రత్యక్ష శిష్యులలో ఒకరు ( రాఖాల్) స్వామి బ్రహ్మానంద. ఆయన పరివ్రాజకుడుగా దేశమంతా తిరుగుతూ ఉన్న రోజులలో హిమాలయ ప్రాంతాలలో ఉన్నపుడు ఒక సంఘటన జరిగింది. అక్కడ చలి విపరీతంగా ఉంది. స్వామి ఒక నదీ తీరం లో కూర్చొని ప్రశాంత భావం తో ఉన్నాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చి ఒక కంబళిని స్వామి వద్ద ఉంచి వెళ్ళి పోయాడు. స్వామి చూస్తూ ఉన్నాడు. ఇంతలో ఇంకొక వ్యక్తి వచ్చి ఆ కంబళిని తీసుకొని వెళ్ళిపోయాడు. స్వామి అదే ప్రశాంత చిత్తంతో చూస్తూ ఉన్నాడు. మనసులో ఇది నాది అన్న భావన కు అతీతమైన సాక్షీ స్థితి ఈ ఉపేక్షా భావనా ధ్యానం ఇస్తుంది. దీనివల్ల సాధకుని మనస్సు ఆటు పోట్లకు చెదరని ప్రశాంత సరస్సు లాగా నిర్మలంగా ఉండగలుగుతుంది.

ఈ భావనలు అన్నీ మనస్సు పైపైన మాత్రమె కాక లోలోతులకు చొచ్చుకొని పోయి కలలో కూడా ఇతర భావనలు కలుగనంత ధ్యాన బలాన్ని సాధకుడు సంపాదించాలి. అప్పుడే వాటిలో సిద్ధత్వం కలిగినట్లు లెక్క.

మనిషి మనో మయుడు. మనస్సు వల్లనే మనిషి రాక్షసుడు అవుతున్నాడు, దేవతా అవుతున్నాడు. దీన్ని సమర్థించే అనేక శ్లోకాలు ధమ్మపదం లో మనకు కనిపిస్తాయి. భగవత్ గీత కూడా ఇదే చెబుతుంది. బంధ మోక్షాలకు మనస్సే కారణం అంటుంది. బాహ్య పరిస్తితులు ఎలా ఉన్నప్పటికీ మనస్సును అదుపులో ఉంచుకొన్న మనిషి చలించకుండా ఉండగలగటమే కాదు వాటికి సరిగా స్పందించగలడు. సరిగా స్పందించ గలిగిన శక్తి ధ్యాన బలం వల్లనే వస్తుంది.

బాహ్య పరిస్తితులకు మనం ఇచ్చే స్పందన వల్లనే మన మనస్సులో సంస్కారాలు ఏర్పడతాయి. అవే మన ఉత్తమగతికి గాని అధోగతికి గాని కారణాలు అవుతాయి. కనుక మన స్పందన వల్ల అంతిమంగా లాభపడేది లేదా నష్ట పోయేది మనమే గాని ఇతరులు గాదు.

ఈ విషయం అర్థమైతే బాహ్య పరిస్తితులకు మన స్పందన ఎలా ఉండాలి అనేదాని ప్రాముఖ్యత మనకు అర్థం అవుతుంది. ఇది అర్థం అయినప్పుడు ఈ నాలుగు బ్రహ్మ విహారాల ప్రాముఖ్యత మనకు చక్కగా తెలుస్తుంది.

ఈ నాలుగు భావనలు చాలా ముఖ్యమైనవి. కానీ వీటిని అనుసరించటం తేలికైన విషయం కాదు. దానికి ప్రతిరోజూ కనీసం ఉదయం సాయంత్రం చెరొక గంట ఈ భావనల పైన ధ్యానం అవసరం. తరువాత అనుక్షణం జీవితంలో ఎదురౌతున్న పరిస్తితులు వాటికి మన మనః స్పందనలు గమనించుకుంటూ ఉండాలి. ఇదొక సాధనా మార్గం. ఎప్పుడైతే ప్రతి పరిస్తితికీ ఈ నాలుగు స్పందనలు తప్ప ఇతర స్పందనలు మన మనస్సులో కలుగకుండా ఉంటాయో అప్పుడు మనం కొంతవరకూ ఈ సాధనలో ముందడుగు వేసినట్లు లెక్క.

ఈ భావనా ధ్యానం ఎలా చెయ్యాలి అనేదాన్ని భగవాన్ బుద్ధుడు అనేక సూత్రాలలో చక్కగా వివరంగా చెప్పాడు. కావలసిన వారు త్రిపిటకములలో ఒకటైన సూత్ర పిటకంలోని "దీర్ఘ నికాయం " లో ఒక్కొక్క భావనా ధ్యానం పైన ఇవ్వబడిన బుద్ధుని ప్రవచనాలు చూడండి. " తేవిజ్జ సూత్ర " అనే సూత్ర భాగం లో కూడా వసిష్టుడు భరద్వాజుడు అనబడే ఇద్దరు బ్రాహ్మణులకు (వీరు ఈ గోత్ర నామంతో ఉండే మూల ఋషులు కారు) బుద్దుడు ఇచ్చిన ఉపదేశంలో ఈ బ్రహ్మ విహార భావనా ధ్యానం గురించి బుద్ధుని వివరణాత్మక ఉపదేశం చూడవచ్చు. అలాగే బుద్ధఘోషుని " విశుద్ది మార్గం " లో కూడా ఈ నాలుగు బ్రహ్మ విహార భావనా ధ్యానము గురించి అత్యంత వివరంగా ఇవ్వబడింది.
ధ్యానా భ్యాసి ఈ భావనలను అనంతంగా విస్తరించుకుంటూ పోయి నక్షత్ర మండలాలను దాటి విశ్వం లోని నలుమూలలకూ తన నుండి ఈ భావనలను ప్రసరింప చేయగల ధ్యాన శక్తిని సంపాదించాలి. అప్పుడే బ్రహ్మ విహార ధ్యాన సాధనలో పరిపూర్ణత వస్తుంది. ఏ ఇతర సాధనలు చెయ్యక పోయినా ఈ ఒక్క సాధన వల్లనే మనిషి జీవితం ధన్యతను పొందగలుగుతుంది. ఇది బుద్దుని మౌలిక బోధనలలో ముఖ్యమైన సాధన.

గుట్టీ సుబ్రహ్మణ్య శర్మ.....

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...