Tuesday, April 3, 2018

తస్మాత్ జాగ్రత! జాగ్రత


శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి,
నాస్తి బంధు సహోదర |
అర్థం నాస్తి, గృహం నాస్తి,
తస్మాత్ జాగ్రత  జాగ్రత||
*తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము*

శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
సంసార సాగరం దుఃఖం
తస్మాత్ జాగ్రత  జాగ్రత||
*తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా! సావధానుడవై ఉండుము*

శ్లో|| కామశ్చ, క్రోధశ్చ,
లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారాయ
తస్మాత్ జాగ్రత  జాగ్రత||
*తా : కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు.కావున ఓ మానవుడా! సావధానుడవై ఉండుము*

శ్లో|| ఆశయా బధ్యతే జంతుః
కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి
తస్మాత్ జాగ్రత  జాగ్రత||
*తా:ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు. కావున ఓ మానవుడా! సావధానుడవై ఉండుము*

శ్లో|| సంపదః స్వప్రసంకాశాః
యౌవనం కుసుమోపమ్|
విధుఛ్చచంచల ఆయుషం
తస్మాత్ జాగ్రత  జాగ్రత||
*తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా! సావధానుడవై ఉండుము*

శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం,
క్షణం జీవితమావయోః|
యమస్య కరుణా నాస్తి
తస్మాత్ జాగ్రత  జాగ్రత|
*తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు.
మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు.కావున ఓ మానవుడా! సావధానుడవై ఉండుము*

శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ
తావత్ తిష్ఠతి జంతవః|
తస్మిన్ క్షీణే వినశ్యంతి
తత్ర కా పరివేదన||
*తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?*

శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాలయః|
ఋణక్షయే క్షయం యాంతి
తత్ర కా పరివేదన||
   *తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర లాభము గల్గును.
ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?*

శ్లో|| పక్కాని తరుపర్ణాని
పతంతి క్రమశో యథా|
తథైవ జంతవః కాలే
తత్ర కా పరివేదన||
*తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?*

శ్లో|| ఏక వృక్ష సమారూఢ
నానాజాతి విహంగమాః|
ప్రభతే క్రమశో యాంతి
తత్ర కా పరివేదన||
*తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును.
ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును.
దానికై దుఃఖించుట ఎందులకు?*

శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం
నధ్యం వహతి సంగతః|
సంయోగాశ్చ వియోగాశ్చ
తత్ర కా పరివేదన||
*తా:ప్రవహించుచున్ననదిలో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును.
ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును.
దానికై దుఃఖించుట ఎందులకు?*

జంధ్యం ప్రాముఖ్యత

హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం బ్రాహ్మ‌ణులు జంధ్యం ధ‌రిస్తార‌నే విష‌యం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడంటే కేవ‌లం బ్రాహ్మ‌ణులు మాత్ర‌మే జంధ్యం ధ‌రిస్తున్నారు. కానీ ఒక‌ప్పుడు క్ష‌త్రియులు, వైశ్యులు కూడా జంధ్యం ధ‌రించేవారు. బ్రాహ్మ‌ణులైతే 8వ ఏట‌, క్ష‌త్రియుల‌కు 11వ ఏట‌, వైశ్యుల‌కు 12వ ఏట జంధ్యం ధ‌రింప‌జేస్తారు.

సాధార‌ణంగా ఈ కార్య‌క్ర‌మాన్ని ఏడాదికి ఒకసారి శ్రావణ పూర్ణిమ నాడు నిర్వ‌హిస్తారు. ఈ తంతునే ఉప‌న‌య‌నం అని కూడా పిలుస్తారు. ఉప‌న‌య‌నంలో ధ‌రింప‌జేసే జంధ్యాన్ని జందెం, జందియం, య‌జ్ఞోప‌వీతం అని కూడా పిలుస్తారు. అయితే ఇలా జంధ్యం ధ‌రింప‌జేయ‌డం వెనుక మ‌న‌కు తెలియ‌ని ఎన్నో ఉప‌యోగ‌క‌ర ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందువులు పాటించాల్సిన 16 సంస్కారాల్లో 10వ సంస్కారంగా జంధ్యం ధ‌రించ‌డాన్ని చెబుతారు. జంధ్యం ధ‌రించిన వారిలో జ్ఞాప‌క‌శ‌క్తి పెరుగుతుంద‌ట‌. వారు అమిత‌మైన తెలివితేట‌ల‌ను ప్ర‌దర్శిస్తార‌ట‌. మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్ణం వంటి జీర్ణాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు ద‌రి చేర‌వ‌ట‌.

జంధ్యం ధరింప‌జేసే స‌మ‌యంలో నేల‌పై కాళ్ల‌ను మ‌డ‌త పెట్టి కూర్చుంటారు. ఇలా కూర్చోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయ‌ట‌.

జంధ్యంలో ఉండే మూడు దారాలు ముగ్గురు దేవ‌త‌ల స్వ‌రూపాల‌ని భావిస్తారు. ఒక‌రు శ‌క్తినిచ్చే పార్వ‌తి, మ‌రొక‌రు ధ‌నాన్నిచ్చే ల‌క్ష్మి, ఇంకొక‌రు చ‌దువునిచ్చే స‌ర‌స్వ‌తి. ఈ క్ర‌మంలో జంధ్యం ధ‌రించ‌డం వ‌ల్ల ఆ ముగ్గురు దేవ‌తల అనుగ్ర‌హం పొంద‌వ‌చ్చ‌ట‌. దీంతో జీవితం ఎంతో సుఖ‌మ‌యంగా ఉంటుంద‌ట‌.

జంధ్యం ధ‌రించిన వారికి నెగెటివ్ ఆలోచ‌న‌లు రావ‌ట‌. వారు ఎల్ల‌ప్పుడూ పాజిటివ్ దృక్ప‌థాన్నే క‌లిగి ఉంటార‌ట‌. దీనికి తోడు వారికి పాజిటివ్ శ‌క్తి కూడా అందుతుంద‌ట‌.
జంధ్యం ధ‌రించిన వారికి బీపీ వంటి స‌మ‌స్య‌లు రావ‌ట‌. అన్ని కార్య‌క్ర‌మాల్లోనూ వారు ముందుంటార‌ట‌. ఎల్ల‌ప్పుడూ విజ‌యాన్ని సాధిస్తార‌ట‌.

శుభకార్యాలలో, మామూలు సమయాల్లో జంధ్యాన్ని ఎడమ భుజం మీద నుండి వ్రేలాడుతూ కుడి వైపు నడుము చేరేటట్టు వేసుకుంటారు. అశుభ కర్మలప్పుడు కుడి భుజం మీదుగా ఎడమవైపు నడుమును తగిలేటట్టు వేసుకుంటారు. మలమూత్రం చేసేట‌ప్పుడు మెడలో దండ లాగా ఉండే విధంగా వేసుకుంటారు. అలా జంధ్యం వేసుకోకుంటే వారికి అరిష్టం క‌లుగుతుంద‌ని చెబుతారు.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......


నల్లటి విష్ణువు తెల్లటి శివుడు ఒకరేమిటి?

ఇటువంటి ప్రశ్నలు ఎవరు వేస్తారో మనం ప్రత్యేకంగా చెప్పుకోవక్కరలేదు. ఈ విషయంలో మన పెద్దవారు ఎన్నడో తమ తీర్పు, తర్కం చెప్పి వున్నారు. మరొక్కసారి మనం అవలోకనం చేసుకుందాము. వేదం “శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే !! శివస్య హృదయం విష్ణో: విష్ణుస్య హృదయం శివః !! యధాంతరం న పశ్యామి తధామే స్వస్తిరాయుషి !!”” అని ఘోషిస్తోంది. శివుడే విష్ణువు విష్ణువే శివుడు, ఇద్దరి హృదయమూ ఒక్కటే, వారికి భేదం చూపినవారికి ఉత్తమగతులు లేవని చెబుతోంది. తాత్త్వికంగా ఒక్కటే అయిన తత్త్వం అయిన పరబ్రహ్మ ఈ రెండు రూపాలగా కనబడుతుంది. శుద్ధస్ఫటిక రంగు శివునిది అని చెబుతుంది, అలాగే విష్ణువు నీలమేఘశ్యాముడు అని పురాణాలు వారి రంగుల గురించి చెప్పింది. మరి శుద్ధ సత్త్వ స్వరూపం తెల్లగా ఉండాలి కానీ నల్లగా ఉందేమిటి అని ప్రశ్న వేస్తున్నారు.

అసలు ఏ గుణం లేని ఏ రంగులేని ఏ రూపంలేని  పరమాత్మ మనకోసం ఉపాసనకోసం ఒక రూపం తీసుకున్నారు. ఒకసారి ఈ రంగుల ప్రాధాన్యత గురించి చూస్తె ఇంద్రధనస్సులోని ప్రాధమిక రంగులు అన్నీ కలిపితే వచ్చేది నలుపు రంగు. అన్ని గుణాలు కలిపిన పరమాత్మ తత్త్వానికి సంకేతంగా విష్ణువు నల్లని రూపం. విశ్వవ్యాపకుడైన బ్రహ్మాండనాయకుడు విశ్వమే తానై ఉన్నవాడు నల్లని రంగు, అన్నీ తనలో ఇముడ్చుకున్న వాడి రూపం విష్ణువు. విష్ణువు చెల్లెలు మహామాయ, నారాయణి కూడా నల్లటి రూపం, దుర్గ, కాళీ. నారాయణ నారాయణి ఒకే తత్త్వం చెబుతున్న పురుష-స్త్రీ రూపాలు. ఆ సంపూర్ణ శక్తి స్వరూపం తానే రెండు విధాలుగా కనబడతాడు. ఉపాసనకు అందేందుకు అమ్మలా శక్తిస్వరూపిణిగా కనబడతాడు, పరమపురుషునిగా విష్ణురూపంలో అనుగ్రహిస్తున్నాడు.

అదే అన్ని రంగులు నల్ల రంగునుండి ఒకొక్కటి తీసి వేస్తూ పోతే మిగిలేది కేవలం తెలుపు. అదే వర్ణం ఆదిదేవుడు ఆ మహేశ్వరుని స్వరూపం. ఏమీ లేని సృష్టి జరగని సమయంలో ఉన్న ఆ పరమాత్మ తనకు తాను విభాజించుకున్నాడు తన మాయ ద్వారా. తనను విభజించుకునే ముందు ఏదైతే ఏదైతే రూపం వుందో గుణరహితంగా ఉన్నదో అదే ఆ పరమాత్మ రూపం సదాశివుని వర్ణం. అదే సంపూర్ణంగా గుణాలు, వర్ణాలు సంతరించుకున్న రూపం ఆ విష్ణు రూపం. ఒక సెట్ థియరీ ప్రకారం యూనివర్స్ స్టేట్ విభజనకు ముందు ఏదైతే వుందో అదే అన్ని సెట్స్ యొక్క ఇంటర్సేక్షన్ అవుతుంది. ఇన్ఫినిటీ (పూర్ణం) అన్ని సంఖ్యలను కలిపితే వచ్చేది, అలాగే divisor అతి సూక్ష్మమైన సంఖ్యతో విభజిస్తే వచ్చేది కూడా ఇన్ఫినిటీ. అన్నీ కలిపినా ఇన్ఫినిటీ, తనకు తాను సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులుగా విభజించుకున్నా ఇన్ఫినిటీ. ఆ పూర్ణం నుండి పూర్ణం కలిపినా తీసినా విభజించినా వచ్చేది పూర్ణమే. అదే ఆ పరమాత్మ.

మనకున్న చక్రాల పరంగా చూసుకుంటే లోనున్న శక్తి మూలాధారంలో నిండి వున్నప్పుడు ఆ ఏడు చక్రాల దాటాక వెళ్ళగలిగితే శివానికి చేరుకుంటుంది. లోనున్న విష్ణువు శివుడవుతున్నాడు. ఈ ఏడు చక్రాల/ఏడు రంగులలో కలిసున్న ఆ తత్త్వం విష్ణుతత్త్వం అనుకుంటే ఆ ఏడు రంగులను తీసి వేస్తె వచ్చే ఆ శుద్ధస్ఫటిక వర్ణం ఆ శివునిది.  అలా తన సహస్రారం నుండి శక్తిని శివునిలో కలిపితే ఎప్పటికీ మరణం అన్నది లేని మోక్షానికి చేరుకుంటున్నాడు. ఈ రెండు తత్త్వాల కలయికే శివశక్తి స్వరూపం, అర్ధనారీశ్వర తత్త్వం. దీనికి సంకేతంగా ఏడు కొండలపై నిలిచి వున్న ఆ వేంకటేశ్వరుడు మనల్ని రక్షించు గాక !!!

!! ఓం నమో వేంకటేశాయ !!
!! సర్వం శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు !!

అన్నదాన మహాత్మ్యం - ఒక కథ


అన్నపూర్ణ ఒక గృహిణి. కొంత ఆవేశం ఎక్కువ. కాని చాలా మంచిది.ఆమె మీద వాళ్ల అమ్మమ్మ ప్రభావం ఎక్కువ.

"ప్రతి రోజూ కొంత అదనంగా వండి ఎవరికైనా ఆకలితో ఉన్నవారికి పెట్టాలి " అని వాళ్ల అమ్మమ్మ చెప్పే మాటలను అన్నపూర్ణ శ్రద్ధగా పాటించేది.

అన్నపూర్ణ ప్రతి రోజూ కుటుంబానికి సరిపోయే రొట్టెలనే కాక అదనంగా మరో రెండు రొట్టెలను చేసి ఉంచేది.

వాళ్లింటికి ప్రతి రోజూ ఒక  ముసలి మరుగుజ్జు వాడు వచ్చేవాడు. అతని నడుక గాలిలో నడుస్తున్నట్లుగా ఉండేది.మొదట్లో అన్నపూర్ణ అతన్ని చూసి భయపడేది కాని తరువాత అలవాటైపోయింది ఆమెకు. ఆ రెండు రోట్టెలను అతనికి ఇచ్చేది.

అతడు ఆ రొట్టెలను తీసుకుని ..

"నీవు చేసిన చెడు నీతోనే ఉండు.
మంచి మాత్రం తిరిగి వచ్చు !"

అని పాడుకుంటూ వెళ్లి పోయేవాడు. వేగంగా పాడడం వల్ల అదేమి అన్నపూర్ణకు అర్థం అయ్యేది కాదు.

ఇలా ప్రతి రోజూ జరిగేది.

ఒక రోజు అతను ఏమంటున్నాడో వినాలనుకుని రెండు రొట్టెలను ఇస్తూ శ్రద్ధగా విన్నది.ఆమెకు చాలా కోపం వచ్చింది.

"ఇన్ని రోజులు వాడేదో వాడి భాషలో కృతజ్ఞతలు చెబుతున్నాడనుకుంది.కాని, వాడు తిడుతున్నాడు. ఎవరైనా చెడు తొలిగిపోవాలని దీవిస్తారు. వీడేంది? నా చెడు నాతోనే ఉంటుందంటాడు. "

ఇప్పటికే దాదాపు ఆరు సంవత్సరాల నుండి వస్తున్నాడు.ఎలాగైనా వీడిని వదిలించుకోవాలని మరునాడు ఆవేశంతో అతనికి ఇచ్చే రెండు రొట్టెలలో " పురుగుల మందు " కలిపింది.

ఆ రొట్టెలను అతని కోసం సిద్ధంగా ఉంచే పాత్రలో పెడుతున్నపుడు ఆమె చేతులు వణికాయి.
"చీ! నేను చేస్తున్న పనేంటి?" అని, ఆమెపై ఆమెకే అసహ్యం వేసి ఆ రొట్టెలను పొయ్యి లోకి విసిరి, కొత్తగా రెండు మంచి రోట్టెలను చేసి సిద్ధంగా ఉంచింది.

ఎప్పటి మాదిరిగానే  ఆ ముసలి మరుగుజ్జు వచ్చాడు. రెండు రొట్టెలను ఆతనికి ఇచ్చింది.అవి తీసుకుని...

"నీవు చేసిన చెడు నీతోనే ఉండు.
మంచి మాత్రం తిరిగి వచ్చు !"

అని పాడుకుంటూ వెళ్లిపోయాడు.

అన్నపూర్ణ తన పనిలో లీనమైంది.
సాయంత్రమైంది. ఆమె మనసు సరిగ్గా లేదు. ఏదో తెలియని భయం, దడ దడ గా అనిపిస్తుంది.
"చీ! ఇవ్వాళ్లటి రోజే సరిగ్గా లేదు.
ప్రొద్దుననగా తిని వెళ్లిన కొడుకు ఇంకా తిరిగి రాలేదు. ఇలా ఎప్పుడూ జరగలేదు.ఆమె మనసు కీడును శంకించి " తన కొడుకు క్షేమంగా తిరిగి రావాలని "దేవుడిని ప్రార్థించసాగింది.

ఒక గంట తరువాత తలుపు వద్ద చప్పుడైతే ఆదుర్దాగా వెళ్లింది. ఎదురుగా చిరిగి, దుమ్ము కొట్టుకుపోయిన బట్టలతో కొడుకు.

వాడు వస్తూనే తల్లిని కావలించుకుని " అమ్మా ! ఈ రోజు ఒక అద్భుతం జరిగింది.
ప్రొద్దున నేను రొట్టెలు తిని వెళ్లానా ! కొంతసేపటి తరువాత ఏం జరిగిందో తెలియదు కాని, తల తిరగడం ప్రారంభమైంది. క్రింద పడిపోయాను. అలా ఎంతసేపు ఉన్నానో కూడా తెలియదు. అరుద్దామంటే నోరు పెగలడం లేదు.చచ్చిపోయాననే అనుకున్నాను.
అప్పుడోచ్చాడు ఒక ముసలి మరుగుజ్జు తాత. అతన్ని నేనెప్పుడూ చూడలేదు. వస్తూనే నా నోట్లో ఏదో పసరు పిండి బాగా నీళ్లు తాగించాడు. తరువాత వాంతి చేసుకున్నాను. మళ్లి ఏదో పసరు పిండాడు. తినడానికి రెండు రోట్టెలు ఇచ్చాడు. "అమ్మా ! అవి నువ్వు చేసే రోట్టెలు లాగా చాలా మధురంగా ఉన్నాయమ్మా !" అన్నాడు.

వింటున్న అన్నపూర్ణ తల గిర్రున తిరిగి పోయింది. ఆసరాగా గోడను పట్టుకుంది.వణుకుతున్న శరీరంతో వెళ్లి మందు కలిపిన రొట్టెలు విసిరిన వద్దకు వెళ్లి చూసింది. అవక్కడ లేవు.
వాటినే తన కొడుకు తిని వెళ్లాడా??? ఏమీ అర్థం కాలేదు!

ఎప్పుడు తెల్లవారుతుందా! ఎప్పుడు ఆ మరుగుజ్జు తాతను కలిసి మాట్లాడుదామా ! అని ఎదురు చూడసాగింది.
మరుసటి రోజు రొట్టెలతో పాటు ఇంకా ఇతర రుచికర పదార్థాలను వండి అతని కోసం ఎదురు చూడసాగింది. అతను రావలసిన సమయమైంది.

కాని అతను రాలేదు.
అతని బదులుగా ఒక చిన్న పిల్లవాడు వచ్చి "ఒక మరుగుజ్జు తాత ఈ ఉత్తరాన్ని నీకు ఇమ్మన్నాడు. " అని ఇచ్చేసి వెళ్లిపోయాడు.

అందులో ఇలా ఉంది.

"తల్లీ ! నువ్వు మీ అమ్మమ్మ ఇంట్లో పురుడు పోసుకున్నావు. అప్పుడు మీ అమ్మమ్మ ,నీ కొడుకు జాతకాన్ని నాకు చూపించింది.
నేను చూసి వీడికి 12 సం॥వయస్సులో పెద్ద ప్రాణగండం ఉందని చెప్పాను. నా మునిమనవడిని ఎలాగైనా సరే నువ్వే కాపాడాలి అని నా దగ్గర మాట తీసుకుంది .
నిజానికి నేను చేసింది ఏమీ లేదు. నువ్వు ఆరు సంవత్సరాలుగా చేసిన అన్నదానం నీ కొడుక్కి అరవై సంవత్సరాల ఆయుస్సును పోసింది.
ఇక నా అవసరం నీకు, నీ అవసరం నాకు లేదు తల్లి! "

....ఉత్తరాన్ని చదవడం ముగించింది అన్నపూర్ణ.

ఇంకా ఆమె మనస్సులో...

"నీవు చేసిన చెడు నీతోనే ఉండు.
మంచి మాత్రం తిరిగి వచ్చు !"

....అనే మరుగుజ్జు తాత పాట ప్రతిధ్వనిస్తూ వుంది.

ఈ కథలో అన్నదాన మహాత్మ్యంతో పాటుగా "ఆవేశం అనర్థదాయకం" - "మంచి,చెడు ప్రవర్తన ఫలితాలు" అంతర్లీనంగా కనిపిస్తాయి.

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య  స్వామి క్షేత్రం


పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్ళి శివుడిని దర్శించి తిరిగి వెళ్ళే సమయంలో శివుడు రెండు కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకు వెళ్ళి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని రెండు పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంత సేపు విశ్రాంతికి ఆగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు.

కొండ దిగి వెళ్ళిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్యా యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగి బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్ళి కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటి నుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా, కావడిని ఉపయోగించే బద్ద ‘బ్రహ్మదండం’ అనీ కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది.

ఆ స్వామివారికి, స్కందుడు, సేనాని, మహాసేనుడు, శరవణభవ, కార్తికేయుడు, గాంగేయుడు, కుమారదేవుడు, వేలాయుధుడు, మురుగన్ అనే పేర్లున్నాయి

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి:

తిరుచెందూర్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో మొదటిది ఈ క్షేత్రములో స్వామి తారకాసురుడు, సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి, పరమశివుని పూజించిన పవిత్రమైన క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొండ మీద కొలువై ఉన్నాడు.

ఇక్కడే మామిడి చెట్టు రూపములో పద్మాసురుడు (సూర పద్మం) అనే రాక్షసుడు వస్తే, సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములు చేసి ఒకటి కుక్కుటముగా, ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణము చెబుతోంది. ఈ ఆలయం గురించి స్కాంద పురాణములో చెప్పబడినది. ఈ క్షేత్రంలోనే ఒక గొప్ప విచిత్రం జరిగింది. ఒక సారి జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూర్ వెళ్లారు. అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు, ఆలయం వెలుపల కూర్చుని ఉన్నారు.

అప్పుడు ఆయనకి ధ్యానములో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనము అయ్యింది. వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారు.ఈ భుజంగ స్తోత్రము ద్వారా, మనల్ని, మన వంశాలనీ పట్టి పీడించేసే కొన్ని దోషాలు ఉంటాయి, అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాల సర్ప దోషం ఒకటి . దీనికి కారణం మనం తప్పుచేయకపోవచ్చు, ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది, దాని ఫలితము అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చు.

ఉదాహరణకు, సంతానము కలుగక పోవడం, కుష్ఠ రోగం మొదలైనవి. అటువంటి దోషములను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంత గొప్పదో, శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగము ద్వారా తెలియజేశారు. ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది.

ఈ సంసారము అనే మహా సముద్రము నుండి మనలను కడతేర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసము ఉంటున్నారు. అందుకే శంకర భగవత్పాదులు స్వామిని “మహాంబోధితీరే మహాపాపచోరే. అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము లో. అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నది.

శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే “శరవణభవ”…ఓం శ్రీ వల్లిదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు షదాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం రుదస్య నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే. శ – శమింపజేయువాడు ర – రతిపుష్టిని ఇచ్చువాడు వ – వంధ్యత్వం రూపుమాపువాడు ణ – రణమున జయాన్నిచ్చేవాడు భ – భవసాగరాన్ని దాటించేవాడు వ – వందనీయుడు అని ‘శరవణభవ’కు గూఢార్థం.

ప్రదక్షిణం దేనిగురించి చేస్తారు?

ప్ర : ప్రదక్షిణం (గుడి చుట్టూ తిరగడం) దేనిగురించి చేస్తారు? ఇక్కడ ఏ మంత్రాలూ ఉపయోగిస్తారు? ఎన్ని సార్లు ప్రదక్షిణ చేయాలి?

జ: ప్రదక్షిణం చేయడం వల్ల పాప పరిహారం జరుగుతుంది. దేవాలయాలకు వెళితే ' గుడి చుట్టూ తిరగడం ప్రదక్షిణం'. మాములుగా ఇంట్లో దేవతారాధన చేస్తే చేయవలసినది 'ఆత్మప్రదక్షిన'. తనంత తాను దక్షిణం (కుడి) నుండి తిరగడం, మనలో ఉన్న పరమాత్మను దర్శించేందుకు అది ఒక విధానం. గుడిలో ఆత్మప్రదక్షిణ పనికిరాదు.

గుడిని నిర్మించిన ఆగమ శాస్త్రానుసారం గుడి నలువైపులా వివిధ దేవతాశక్తులు ప్రతిష్టింపబడి ఉంటాయి. గుడి చుట్టూ తిరగడం వల్ల ఆ దేవతా శక్తుల అనుగ్రహ దృష్టి మనపై పడుతుంది. అంతే కాక - గుడిలో ప్రధాన దైవం - దీపం వలె విశ్వతోముఖుడు. అంటే అన్నివైపుల నుండి నమస్కరించడం కూడా - ఆలయ ప్రదక్షిణలో అంతరార్థం. సాధారణంగా దేవాలయంలో ముమ్మార్లు ఆలయ ప్రదక్షిణ చేయాలి. మొక్కుబడులు ప్రకారం 11 - 108 మొదలైన సంఖ్యలు ఉంటాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాలు చదువుకోవాలి.

యానికాని చ పాపాని
జన్మాంతరకృతానిచ!
తాని తాని ప్రణశ్యoతి
ప్రదక్షిణ పదే పదే!!
పాపోహం పాపకర్మాహం
పాపాత్మా పాపసంభవః
త్రాహిమాం కృపయా దేవ
శరణాగత వత్సల!
"అన్యధా శరణం నాస్తి
త్వమేవ శరణం మమ!
తస్మాత్ కారుణ్యభావేన
రక్ష రక్ష మహేశ్వర!!

శక్తి దేవాలయాలకు వెళ్ళినప్పుడు పై శ్లోకాలలో

దేవ - దేవి
శరణాగత వత్సల - శరణాగతవత్సలే
మహేశ్వర - మహేశ్వరి అని మర్చి చదువుకోవాలి.

ఈ శబ్దాలు ఏ శక్తిదేవతకైనా సరిపోతాయి. అలాగే దేవ, మహేశ్వర మొదలైన శబ్దాలు విష్ణువుకైనా, శివునకైనా, ఇతర దైవానికైనా చెప్పవచ్చు

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.......

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...