Friday, February 23, 2018

చిదంబరం నటరాజ స్వామి

పంచభూత లింగాలలో ఆకాశలింగంగా వ్యక్తమైన పరమేశ్వరుడు స్వయంభూగా నటరాజస్వామిగా కొలువుతీరిన అతి పుణ్య శైవక్షేత్రం చిదంబరం. చిత్ అంబరం. జ్ఞానాన్ని ప్రసాదించే దివ్యక్షేత్రం. పదవ శతాబ్దంలో యీ ఆలయనిర్మాణానికి ముందే పరమేష్టి నెలవైన స్థలం. చిదంబరానికి ముందు ఈ ఊరి పేరు తిల్లై. ఇప్పటికీ తిల్లై నటరాజస్వామిగానే వ్యవహరిస్తారు.  ఈ చిదంబర క్షేత్రంలోని అమ్మవారు శ్రీ శివకామి అమ్మవారు.
పద  శతాబ్దంలో చోళరాజులు యీ ఆలయాన్ని నిర్మించడమే కాక నటరాజస్వామిని తమ కులదైవంగా ప్రకటించారు. ఆ రోజుల్లో చిదంబరం చోళరాజుల రాజధానిగా భాసిల్లింది. స్కాందపురాణంలో, సంగం కాలంనాటి గ్రంధాలలో, ప్రముఖ నాయన్మార్ ల స్తుతి పాఠాలలో చిదంబరం నటరాజస్వామి ప్రశస్తి ఉంది. నలభై ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన యీ ఆలయం అనేక ప్రాకారాలతో, ఎత్తైన రాజగోపురాలతో, శిల్పకళా ప్రాభవంతో,దాక్షిణాత్య సంస్కృతికి నిలయంగా ,
నేటికీ విరాజిల్లుతున్నది. 

చిదంబరం దేవాలయంలోని నాలుగు ప్రధాన గోపురాలు చతుర్వేదాలను,  ఆలయ అంతర్భాగంలోని నవ ద్వారాలు మానవ శరీరంలోని నవరంధ్రాలను సూచిస్తాయని ఆధ్యాత్మిక తత్త్వవేత్తలు చెపుతారు. ఆకాశలింగరూపుడైన పరమశివుడు యీ ఆలయంలో మూడు రూపాలలో దర్శనమిస్తాడు. మొదటిది సంపూర్ణ రూపంలో నటరాజస్వామిగా, అసంపూర్ణ స్ఫటికలింగాకార రూపంలోని చంద్రమౌళీశ్వరుడు రెండవ రూపంగా,  నిర్వికార నిరాకార రూపం మూడవ మూర్తిగా భగవంతుడు భక్తులకు గోచరిస్తాడు.  మనకు గర్భాలయంలో కనిపించేది ఈ మూడవ  ఆకాశ , శూన్య స్థలమే . ఈ శూన్యం నుండి భగవత్ తత్వాన్ని  అర్ధాన్ని తెలుసుకొని,  పరమార్ధం గ్రహించగలిగినవారే మహిమాన్విత మహానుభావులు. ఆ జ్ఞాన సముపార్జన కోసమే యుగయుగాలుగా, మునులు, యోగులు, తాపసులు, జ్ఞానులు, ముముక్షువులు సర్వసంగ పరిత్యాగులై పరితపిస్తున్నారు.

చిదంబరంలోని నటరాజ స్వామి నాట్యానికి, నృత్యానికి అధిదేవత. పరమశివుడు తాండవ నృత్యంతో దర్శనమిచ్చిన పంచ శైవక్షేత్ర నృత్య సభలలో చిదంబరం ఒకటి. ఇక్కడి కనకసభలో శివతాండవం చేసి కనకసభాపతిగా దర్శనమిస్తున్నాడు. తిరువేలంగాడులో రత్నసభాపతిగా, మదురై సుందరేశ్వరాలయంలో రజతసభాపతిగా, తిరునల్వేలి నెల్లైయప్పర్ కోవెలలో తామ్రసభాపతిగా, ఆలయకుట్రాళంలో చిత్రసభాపతిగా నటరాజు భక్తులకు దర్శనమిస్తున్నాడు.  భరతముని భరతనాట్యశాస్త్రానికి, అందులో పేర్కొన్న నూట ఎనిమిది కరణాలకు మూలాధారం చిదంబరం, బృహదీశ్వరాలయం ప్రాంగణాలలోని శిల్పాలే. అక్కడి చిత్తరువులు ఆధారంగానే భరతనాట్య శాస్త్రం వ్రాయబడింది. భరతనాట్యం గురించి పరిశోధనా గ్రంధాలు వ్రాయడానికి కళాకారులంతా చిదంబరం వంటి నటరాజాలయాలనే ఆశ్రయిస్తారు. ప్రతీ ఏటా శివరాత్రి పర్వదినాలు మహా విశేషంగా జరుగుతాయి. అలాగే యిక్కడ జరిగే భరతనాట్యోత్సవాలలో పాల్గొనడానికి ప్రతి నృత్య కళాకారిణి, కళాకారుడు తపన పడతాడు. అదే తమ జీవితధ్యేయంగా భావిస్తారు.

భక్తులు తమకు తామే సమర్పించుకొని ముక్తికోసం తపించే దివ్యస్థలాలు యివి.  నటరాజు అంటే ఆదిశక్తితో కదిలే యీశ్వరశక్తి. లాస్యనాట్య విన్యాసాల శివతాండవ సంకేతమే నటరాజు. జనన మరణకారకుడు నటరాజు. చిదంబర నటరాజాలయ ధ్వజస్థంభానికి భక్తితో పూజించి, ప్రార్ధనలు చేసేవారికి మంచి ఫలితాలు కలుగుతాయి.

చిదంబరం ఆలయం వదలి బయటకు వచ్చి వెళ్తూ వెనుదిరిగి చూస్తే ఆలయ ప్రధాన గోపురం కూడా మనతో వస్తున్న అనుభూతి కలుగుతుంది.

🕉🕉🕉🕉🕉🕉

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...