Sunday, October 14, 2018

చూడు చూడు.. ‘తోడు

తోడు కావాలని కోరుకోవడం లోక సహజం. వివాహంలోనూ పెళ్లికొడుకుకు, పెళ్లికూతురికి ‘తోడు’ ఉంచడం సంప్రదాయం. ఈ తోడుపెళ్లికొడుకు, తోడుపెళ్లికూతురు చేసేదేమీ ఉండదు. వీరిద్దరూ అలంకారప్రాయమైనప్పటికీ అలంకారాల్లో మాత్రం లోటు ఉండదు. మంగళస్నానాలు చేస్తారు. కొత్తబట్టలూ, ఆభరణాలు ధరిస్తారు.
‘తోడు’ సంప్రదాయం ఎలా పుట్టిందన్నది ఆసక్తికరమైన ప్రశ్న. ఇందుకు రకరకాల జవాబులున్నాయి.
నిండు నూరేళ్లు నిలవవలసిన దాంపత్యం కోసం వివాహానికి సుముహూర్తాన్ని దైవజ్ఞులు నిర్ణయిస్తారు. ముహూర్తబలానికి తిరుగు ఉండదని అందరూ నమ్ముతారు. కాబట్టి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాల్సిందే. బాజా భజంత్రీలు మోగాల్సిందే. పెళ్లివిందు కనువిందుగా ఉండాల్సిందే. పెళ్లికి వచ్చే అతిథులకు దూరాభారాలుంటాయి. వ్యయప్రయాసలుంటాయి. ఆశలు, ఆశయాలు ఉంటాయి.  అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి ఆగడానికి వీల్లేదు. కనీసం వాయిదా పడకూడదు. వాగులు వంకలు దాటి వచ్చిన అతిథులకు నిరాశ కలగకూడదు. వాళ్లు బాధతో వెనుతిరగకూడదు. అసలు వివాహానికి అంతరాయం కలిగే పరిస్థితి ఎందుకు వస్తుంది? అవాంతరానికి కారణమేమిటి? కొన్ని పరిస్థితులు జీవుడి చేతిలో ఉండవు. దేవుడి చేతిలో ఉంటాయనేది అసంఖ్యాకుల విశ్వాసం. వెనకటి రోజుల్లో అనారోగ్యకారణాలు ఎక్కువగా ఉండేవి. ముహూర్తాన్ని ఎంతో ముందుగా నిర్ణయిస్తారు కదా! అనివార్యకారణాలవల్ల వధువుగానీ, వరుడుగానీ పెళ్లిరోజునాటికి హాజరు కాకుంటే ఎలా? అందుకే తోడుపెళ్లికొడుకు, తోడు పెళ్లికూతురు ఏర్పాటు చేశారు. ఏ కారణం వల్లనయినా పెళ్లికొడుకు అందుబాటులో లేకపోతే తోడుపెళ్లికొడుకు పెళ్లికొడుకవుతాడు. పెళ్లికూతురు అందుబాటులో లేకపోతే తోడుపెళ్లికూతురు పెళ్లికూతురవుతుంది. అంటే వధూవరులకు ప్రత్యామ్నాయం అన్నమాట.
ఏదయినా ఆచారం మొదలయితే ఆగదు. సంప్రదాయం మానరు. అయితే అంతరార్థాన్ని ఆలోచించక పోవడం విచిత్రం. ఈ రోజుల్లో పెళ్లిళ్లలో అయిదారేళ్ల బాలుడ్ని తోడుపెళ్లికొడుకుగా కూర్చోపెడుతున్నారు. బాల్యవివాహాల కాలంలో ఇది సరిపోయింది గాని ఇప్పుడు ఎలా కుదురుతుంది? అనుకోని పరిస్థితులు వస్తే పాతిక ముప్పయ్యేళ్ల వరుడికి అయిదారేళ్ల తోడుపెళ్లికొడుకు ప్రత్యామ్నాయం ఎలా అవుతాడు? పాతికేళ్ల వధువుకు నాలుగయిదేళ్ల తోడుపెళ్లికూతురు ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? ప్రయోజనం లేని ప్రత్యామ్నాయం కదా! అందుకే ఏదైనా ఆచారం మొదలైతే ఆగదు అన్నది.

‘పెళ్లికూతురిని చేయడానికి అమ్మాయిచేత మంగళస్నానం చేయిస్తారు. అప్పుడు పెళ్లికూతురులోకి పార్వతీదేవి ప్రవేశిస్తుంది. పెళ్లికొడుకును చేయడానికి అబ్బాయిచేత మంగళస్నానం చేయించినప్పుడు అతనిలోకి పరమేశ్వరుడు ప్రవేశిస్తాడు. అయితే దీన్ని అడ్డుకోవడానికి ఉగ్రభూతాలు ప్రయత్నిస్తుంటాయి. ఈ కారణంగా ఆ సమస్యని నివారించడానికి పెళ్లికొడుకుల పక్కన తోడు పెడతారు’ అని ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు అంటారు. తోడు పెళ్లికొడుకు, తోడు పెళ్లి కూతురుకు సంబంధించి ఇదొక అభిప్రాయం
సర్వాలంకార భూషితులైన వధూవరులకు దిష్టితగలకుండా చూడడమే ఈ ఏర్పాటు లక్ష్యమని కొందరంటారు. పెళ్లికొడుకు చేసే పనులను తోడుపెళ్లికొడుకు, పెళ్లి కూతురు చేసే పనులను తోడుపెళ్లికూతురు మౌనంగా చూస్తూ ఉండాలి. పెళ్లి ఆత్మజ్ఞానానికి సంబంధించినది కాబట్టి ‘తోడు’ వ్యవహారం కూడా అందులో భాగమేనన్నది కొందరు పండితుల ఉవాచ. పెళ్లికొడుకు జీవాత్మ అయితే తోడు పెళ్లికొడుకు ఆత్మ అంటున్నారు. పెళ్లి అనే ధర్మకార్యాన్ని పెళ్లికొడుకు చేసినప్పటికీ, దానివెనక ఆత్మ ఉందని చెప్పడానికే ఈ తంతు అని చెబుతారు. జీవాత్మ, ఆత్మ రెండూ దేవుని కుమారులేనంటారు వీరు
మానవ పరిణామ సిద్ధాంతంలాగా తోడుపెళ్లికొడుకు పరిణామ సిద్ధాంతం కూడా ఒకటుంది. అరవంలో మా పిళెతోళన్‌ అని అంటారు. అన్ని పెళ్ళిళ్లలోను ఈ వ్యక్తి ముఖ్యంగా వుండాలి. అంతేకాదు. అతడిని పెళ్లికొడుకు కంటే ఎక్కువగా చూడాలి. కొన్నిస్థలాల్లో ఈ తోడుపెళ్లికొడుకే అసలు పెళ్లికొడుకుని అలంకరిస్తారు. ఈ తోడుపెళ్లికొడుకునే పంక్తి భోజనాలలో మొట్టమొదట కూర్చోపెడతారు. ఇతడే పల్లకీ మొదట ఎక్కుతాడు. కొత్తబట్టలూ, కట్నాలు చదివించినప్పుడు మొదటి కట్నం ఈ తోడుపెళ్లికొడుకుదే. ఆ తర్వాత నుంచీ అసలు పెళ్లికొడుకుదే అధికారం అంటారు ‘పెళ్లిదాని పుట్టుపూర్వోత్తరాలు’ అనే గ్రంథంలో తాపీ ధర్మారావు గారు. ఏదేమయినా కల్యాణమంటపంలో తోడుపెళ్లికొడుకు, తోడుపెళ్లికూతురు దర్శనమిస్తూనే ఉన్నారు కేవలం ప్రదర్శన కోసం.

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......✍

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...