Sunday, October 14, 2018

జీవుడే వధువు, దేవుడే వరుడు

ఆత్మవివాహము- స్త్రీ పురుష శరీర సంబంధహేతువైన వివాహ సంస్కారం వంటిది కాదు. ఇది జీవ-పరమాత్మలకు ఇద్దరికి నిర్వహింపబడేది. భగవంతునికి అనాదిగా దూరమైపోయి, జనన మరణరూప సంసార చక్రబంధంలో పడియున్న జీవునికి.. మానవజన్మలోని విశిష్టతను, జీవేశ్వరుల కు గల అవిభాజ్యమైన నిత్య సంబంధమును గుర్తు చేసి, తిరిగి భగవత్సన్నిధికి చేర్చుటే ఆత్మవివాహంలోని పరమార్థము. జన్మాంతర ప్రాప్తితో పూర్వజన్మ విషయకమైన మరపు ఏర్పడుతున్నది. కానీ పూర్వ దుసంస్కారం మాత్రం అనువర్తించి దుష్ప్రవృత్తికే ప్రేరణనిస్తున్నది. ఇదే ఒక మహామాయ.

ఇపుడే ఈ జీవునిలోనున్న చిరుదీపం వంటి వివేకం పని చేయవలసి ఉంటుంది. మనస్సనే గుర్రమును క్షుద్ర విషయాలపైకి పోనీయకుండా మరల్చుకొని ఊర్ధ్వగతికి చేర్చగల సన్మార్గములో నడిపించడమే ఈ వివేకము. ఇది జరిగినపుడే మానవజన్మ సార్థక్యము. అపుడే సత్సంగం, సదాచార్యానువృత్తి మొదలైన పరిణామాలతో క్రమంగా ఉజ్జీవించే శుభ పరిణామం ఏర్పడగలదు. ఇది ఈ ఆత్మవివాహానికి పూర్వరంగము. లౌకిక వివాహ ప్రక్రియతో పోల్చి, మానవ జన్మనెత్తిన జీవునికి శాశ్వత భగవత్సన్నిధిని కలిగించడమే ఆత్మవివాహం.

వివాహ ప్రక్రియలోని పలు అంశాలను, జీవుడు భగవత్సన్నిధికి చేరుటలో జరిగే పలు అంశాలతో పోల్చి చెప్పటమే ప్రస్తుత కర్తవ్యము. ఇచట జీవుడే ఒక యుక్తవయస్కురాలైన కన్యక. వరుడు పురుషోత్తముడైన శ్రీమన్నారాయణుడు. ఇచట ఆచార్యుడే ఆ తండ్రి. లోకంలో దేహ జన్మనిచ్చిన తండ్రి కన్యాదానం చేయగా, ఇచట ఆ జీవుడనే కన్యకకే సంస్కారాలతో ఉత్తమ శ్రీవైష్ణవ జన్మనిచ్చిన ఆచార్యుడు పితృస్థానంలో ఉండి కన్యాదానం చేస్తున్నాడు. వివాహానికి కావలసిన మంగళస్నానం, వస్త్రాభరణాదిరూపమైన అలంకరణం, మంత్ర మంగళసూత్రం మొదలైన వివాహ ప్రక్రియ (పెండ్లి తంతు) అంతా సిద్ధమైంది. కన్యతో, వరునితో పరస్పరం బాసలు చేయించి ఆచార్యుడే పురోహితుడై, కన్యను వరునికి అప్పగిస్తాడు.

శాకుంతలంలో కణ్వుడు వరుడైన దుష్యంతునికి ‘‘అస్మాన్‌ సాధువిచింత్య’’ ఇత్యాదిగా హితబోధను చేసి, తన బిడ్డయైున శకుంతలకూ ‘‘శుశ్రూషస్వ గురూన్‌’’ అని సుద్దులు చెప్పి వరుని వద్దకు పంపినట్లు, ఇక్కడ శ్రీవైష్ణవత్వ జన్మనిచ్చిన తండ్రియగు ఆచార్యుడు కూడా తన కన్యకు (శిష్యునికి) సదుపదేశాలు చేసి, వరుడగు పరమపురుషునికి అప్పగించి ప్రేమతో ఏలుకొమ్మని ఆయనకూ విన్నవిస్తాడు. ఇది రసవంతమైన పరమార్థమైన అతి మధుర వివాహ సన్నివేశం.

ఈ ముక్తికన్యాపరిణయాన్ని సంస్కృతంలో కొందరు కవులు నాటకరూపంలోనూ మలచినారు. సుస్నాతయైు ఆభరణాలంకృతయైు గుణవతియైున సుందరిని పరమాత్మ స్వీకరించి, పరిరంభణమిచ్చి, ముద్దాడి రంజింపజేసి తాను కూడ అలభ్యలాభమిదియని పరమానందంలో మునిగిపోతాడు. ఆ ఆత్మవివాహ ప్రక్రియనే మన పూర్వాచార్యులొకరు ఒక రసవంతమైన శ్లోకంలో వర్ణించినారు. ఆ శ్లోకమిదిగో...

శ్లోశ్రీశ్రీ కర్మజ్ఞానసురూపయౌవనవతీం భక్త్యాఖ్యదూత్యాహృతాం
కంఠాలంబితమన్త్రమంగళగుణాం జీవాఖ్యకన్యాం శుభాంశ్రీ
సుస్నాతాం విరజాజలే, శుచిముఖీం వైకుంఠశయ్యాంగతాం
దృష్ట్యా హృష్యతి రన్తుమిచ్ఛతి హరిః చిత్రం సతాం సన్నిధౌశ్రీశ్రీ

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ......✍

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...