Sunday, October 14, 2018

అహం

మానవుడిలో అంతశ్శత్రువులు ఆరు. వాటిలో మదం ఒకటి. ‘మదం’ అంటే అహం... దీన్ని విడిచిపెడితేనే మనకు ఆనందం లభ్యమవుతుంది. అహం మన చర్మచక్షువునే కాదు,అంతఃచక్షువులనూ మూసేస్తుంది. చిన్నా పెద్దా తారతమ్యాన్ని, వివేచన, విచక్షణలను హరిస్తుంది. మర్యాద రహితుల్ని చేస్తుంది. సత్యాన్ని చూడనీయదు, మాట్లాడనీయదు. అంతేకాదు- దాన్ని దరిదాపులకు చేరనీయక అడ్డుకుంటుంది. ధర్మాన్ని పాటింపనీయదు. మంచి, చెడుల్ని కాననీయదు. క్రోధాన్ని పెంచి ఆవేశపూరితంగా, ఆలోచనారహితంగా మాట్లాడేలా చేస్తుంది. మానవుడి సర్వభ్రష్టత్వానికి మూలమైనదీ శత్రువు.
అంతశ్శత్రువులను జయించి తాను ఆనందాన్ని పొంది అందరికీ దాన్ని పంచినవాడిగా వసిష్ఠుడు నిలుస్తాడు. ఆయన బ్రహ్మర్షిత్వానికే వన్నెతెచ్చి దానికి మరింత మహత్వాన్ని ఆపాదించినవాడు. అందుకు విరుద్ధంగా- అహాన్ని వీడక తపశ్శక్తులను, వివేచన, విచక్షణలను తన కోపాగ్ని కీలల్లో ఆహుతి చేసుకున్నవాడు విశ్వామిత్రుడు. అహం పుట్టించే మరిన్ని శత్రువుల్లో అత్యంత ప్రధానమైనది ‘క్రోధం’. కౌశికుడి వృత్తాంతం మనకు బోధపరచేదిదే.

అహాన్ని శరీరంలోని అణువునా పోషించి, పెద్ద చేసినవాడు దుర్యోధనుడు. అహం తెచ్చే దుర్గుణాల్లో మూర్ఖత్వమొకటి. పినతండ్రి తనయులకు రాజ్యభాగాన్ని ఇవ్వనన్నాడు. మూర్ఖత్వపు పొరలు కమ్మిన అతడి కళ్లు సత్యాన్ని, ధర్మాన్ని చూడనీయలేదు. వాటి గురించి ఆలోచించనీయలేదు. కడకు మహాసంగ్రామానికి హేతువై అపార జననష్టాన్ని కలిగించిన వాడయ్యాడు. ఎందరికో గర్భశోకం వాటిల్లజేశాడు.

అహాన్ని దరిదాపుల్లోకి రానివ్వకూడనివాడు గురువు. తనకున్న పాండిత్యం, బోధనా ప్రతిభ మరెవ్వరికీ లేదన్న ఆలోచన వచ్చిన ఉత్తర క్షణం- అతడు గురుపీఠానికి అనర్హుడు. తాను చెప్పిందే సరైనదనే గర్వంతో పాటు వినయ, విధేయతలకు దూరమవుతాడు. జ్ఞాన సముపార్జనలో వెనకంజ వేస్తాడు. కుశాగ్ర బుద్ధి, జ్ఞానపిపాస కలిగిన విద్యార్థి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే ఆలోచన చేయక అతడి ప్రశ్నలే అర్థరహితమంటాడు. అందువల్ల ఆ విద్యార్థి దృష్టిలో చులకనవుతాడు. పొందవలసినంత గౌరవాన్ని పొందలేడు. విద్య వల్ల మన సహజమైన వినయం మరింత శోభిల్లాలి. సుగంధాలను పరివ్యాప్తం చేయాలి.
సాధించిన విజయాలు మరింత ఉత్సాహాన్ని నింపాలి. ఆలోచన కొత్తపుంతలు తొక్కి మరిన్ని పనులను చేపట్టి, విజయం సాధించాలి. అలాగాక, అహం తలెత్తిందా తిరోగమనం మొదలైనట్లే. అది విద్యార్థికి, శాస్త్రవేత్తకు, ఆటగాడికి, ఒక లక్ష్యాన్ని చేరుకుని మరిన్ని లక్ష్యాలను చేరుకునే తపన
అహం విడిచిన వేళ అంతా ప్రేమమయమే. అది మనల్ని సత్యశోధకులను, ప్రేమికులను చేస్తుంది. మన అవగాహనశక్తిని పెంచి, ఆలోచనాపరులను చేస్తుంది. శత్రుభావనను వీడేటట్లు చేసి అందర్నీ సమభావంతో చూసే ‘చూపు’నిస్తుంది.
అహాన్ని వీడి జ్ఞానమనే మహాసముద్రంలో ఈదేవాడికే జీవితం లోతు తెలిసివస్తుంది. అది అతడికి ఒద్దికను నేర్పుతుంది. విధేయుణ్ని చేస్తుంది. జ్ఞాన పిపాసిగా ఉండనిస్తుంది. మోక్షసాధనా మార్గంలో పెద్ద ప్రతిబంధకం ఈ అహం.

అహాన్ని విడిచిన మనసు నిర్మలమవుతుంది. అప్పుడే అది భగవంతుడి సన్నిధిని చేరువ చేస్తుంది...

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ.....✍

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...