Thursday, March 8, 2018

అంతర్జాతీయ మహిళా దినోత్సవం....

“యత్ర నార్యస్తు పూజ్యన్తే రమతే తత్ర దేవతాః” ..యత్రైతాస్తు నపూజ్యంతే సర్వాః తత్రాఫలాః క్రియాః అని చెప్పింది మనుస్మృతి...అదే మనుస్మృతి “న స్త్రీ స్వాతంత్ర్యమర్హతి” అంటూ స్త్రీలకు ఆంక్షలు విధించింది.

స్త్రీ ని దేవతగా కొలిచే భారతావనిలో ప్రతి స్త్రీ కి వందనం....

ఇంటి ఇల్లాలు సంతోషంగా లేనప్పుడు ఆ ఇంటి యజమాని దేవతార్చన అర్హతను కోల్పోతాడు.  దేవతలు ఆ ఇంటి మొహం గూడా చూడరు.

ముఖ్యో ధర్మః స్మ్రితిషు విహితో భర్త్రు శుశ్రుషాణం హి  :

స్త్రీకి ఆమె భర్త యొక్క సేవ ప్రాథమిక కర్తవ్యంగా విధించబడింది.

"ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి

              ఇల్లాలే ఈ జగతిగి జీవన జ్యోతి "అని

ఇంటా..బయటా అంతా నీవే...కుటుంబ భారాన్ని మోస్తూ... విశ్రాంతి లేక, నీ బాధ వినేవారు లేక భూమాతకు భారంగా మారుతున్నానని ఆవేదన చెందుతున్న ఓ మహిళా మేలుకో..

ప్రతి మనిషికి తల్లిగా, చెల్లిగా, తోబుట్టువుగా, జీవిత భాగస్వామిగా నేటి మహిళలు విభిన్నమైన పాత్రలను పోషిస్తున్నా, వారి గౌరవం నానాటికి ప్రశ్నార్థకంగానే మారుతోంది. మహిళను పూజించే చోటే పవిత్రత ఉంటుందన్న నానుడ్ని ప్రపంచానికి చాటిచెబుతున్న మనదేశంలోనే మహిళల పట్ల వివక్ష, అత్యాచార ఘటనలు రోజురోజుకి పెరగటం దురదృష్టకరం.

మహిళలు పూజించబడే చోట దేవతలుంటారంటారు. పూజించడం మాట అటుంచి కనీస గౌరవానికి కూడా వారు నోచుకోవడం లేదు. వనితలకు దక్కాల్సిన గౌరవం దక్కగపోగా వారిపై వేధింపులు నానాటికి హెచ్చుతున్నాయి. సమాజం ఎంత ముందుకు వెళ్లినా స్త్రీలపై హింస విషయంలో మాత్రం రాతియుగమే నయమనిపించేలా ఉంది నేటి పరిస్థితి.

స్త్రీలకు గౌరవం ఇవ్వడం పై మన వేదాలు,స్మృతులు ఏమంటున్నాయి?

స్త్రీలపై దాడులు,చేయిచేసుకోవడాలు (ఇక అత్యాచారాల సంగతి సరేసరి) సర్వసాధారణం అయిపోయాయి.

1."యత్ర నార్యస్తు పూజ్యన్తే రమన్తే తత్ర దేవతాః
యత్రైతాస్తునపూజ్యన్తే సర్వాస్తత్రా ఫలాఃక్రియాః" (మనుస్మృతి 3-56)

స్త్రీలు ఏ గృహమునందు పూజింపబడుచున్నారో ఆ గృహములందు దేవతలు క్రీడించుచున్నారు.అలా పూజింపబడనిచోట ఎన్ని మంచి పనులు చేసినా నిరుపయోగమే.

స్త్రీలు ఇంటిని ప్రకాశింపచేయు దీపములు,మరియు వారు సాక్షాత్ లక్ష్మీదేవుల స్వరూపమే. (మనుస్మృతి 9-26)

2."ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణాం శతం పితా,
సహస్రంతు పితౄన్ మాతా గౌరవేణాతిరిచ్యతే." (మనుస్మృతి 2-145)

10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు, 100 మంది ఆచార్యుల కంటే తండ్రి, 1000 మంది తండ్రుల కంటే తల్లిపూజ్యురాలు.

3."పతితఃపితా పరిత్యాజ్యోమాతాతు పుత్రే నపతతి "(వసిష్ఠ 13-15)
పతితుడైన తండ్రిని వదిలివేయచ్చు గాని తల్లి ఒకవేళ పతితురాలైనను వదిలివేయరాదు.

4."పతిర్జాయాం సంప్రవిశతి గర్భోభూత్వేహమాతరం
తస్యాం పునర్నవోభూత్వా నవమేమాసిజాయతె.
తజ్జాయా జాయాభవతియ దస్యాం జాయతే పునః" (ఐతరేయ బ్రాహ్మణం 7-3-13)

భర్త భార్యలో ప్రవేశించుచున్నాడు. భార్యనే తల్లిగా చేసుకొనుచున్నాడు. ఎలాగంటే తొమ్మిదిమాసముల పిదపభార్యయందు తిరిగి పుట్టుచున్నాడు. కాబట్టి భార్య కూడా తల్లిలా పూజ్యురాలే.

5."పత్నీ పారీణహ్యస్యేశే" (తైత్తిరీయ 6-2-1-1)
ఇంటిలోని ధనమునకు యజమాని స్త్రీయే.

మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ తల్లిదండ్రులకు వేదాలు దైవ స్థానాలను కల్పించినా, బ్రహ్మదేవుడు అంతటా తానేఉండాలన్న భావంతో తనకు బదులుగా తల్లిని సృష్టించాడని పురాణాలు చెబుతున్నా ఈనాటి మనుషులకు మాత్రంఇవేమీ పట్టవు. భార్యను తప్ప మిగతా స్త్రీలను అందరినీ తల్లిగా చూడాలని అన్నా ఎందరు పాటిస్తున్నారు చెప్పండి.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...