Wednesday, March 7, 2018

పూర్వజన్మ సుకృతమా? పెరిగిన వాతావరణమా?

🕉🕉🕉🕉🕉🕉

ఒక ఆశ్రమంలో గురు శిష్యుల మధ్య చర్చ జరుగుతోంది. మానవులలో కొంతమంది సన్మార్గులుగా, మరికొంతమంది హింసా ప్రవృత్తి కల దుర్మార్గులుగా, కొందరు ఆస్తికులుగా, మరి కొందరు నాస్తికులుగా జీవించడానికి గల కారణమేమిటని శిష్యుడి సందేహం. మనిషి పుట్టిన వాతావరణము, అక్కడి స్థితిగతులను బట్టి గుణభావములు ఏర్పడతాయి, అని చెపుతూ గురువుగారు శిష్యుడికి ఒక పిట్టకధను యిలా తెలియజేసారు.

ఒక అడవిలో ఒక పెద్ద వృక్షం మీద చిలక ఒకటి గూడు కట్టి గుడ్లను పెట్టింది. ఒక రోజు ఆ చిలక బయటకు వెళ్ళినప్పుడు ప్రమాదవశాత్తు చెట్టుమీది గూటిలోనుండి ఒక గ్రుడ్డు క్రిందపడి పగిలిపోయి అందులోంచి చిన్న చిలక బయటకు వచ్చి ఎగరలేక అవస్థలు పడుతూంటుంది. ఆది చూసిన ఒక కసాయివాడు ఆ చిలకను తనతోపాటు తీసుకుపోతాడు. తర్వాత, యింకొన్నాళ్ళకు మరొక గ్రుడ్డు కూడా క్రిందపడి చితికిపోయి మరో చిలక బయటకు వస్తుంది. ఆ దారిన పోతున్న ఒక సాధువు దానిని చూసి జాలిపడి తనతో తీసుకు పోయి జాగ్రత్తగా పెంచసాగాడు.

ఒకరోజు, ఆ రాజ్యాన్నేలే రాజు వేట కోసం అడవికి వచ్చి అలసిపోయి విశ్రాంతికోసం అనువైన చోటుకోసం వెతుకుతూ, కసాయివాడి గుడిసె వేపు వెళతాడు. రాజుగారిని చూసి, కసాయివాడు పెంచుతున్న చిలక గట్టిగా,  "  చెట్టుకు కట్టేయండి, చంపండి, నరకండి, బాగా చితక్కొట్టండి, చంపండి, చంపండి" అంటూ గోల గోలగా అరవడం ప్రారంభించింది.  రాజుగారు ఆ చిలక పలుకులకు నివ్వెరపోతూ , అక్కడనుండి వెడలి, సాధువున్న ఆశ్రమం వైపు వస్తాడు. రాజుగారిని చూసిన ఆ చిలక, గట్టిగా,"  అతిధులొచ్చారు. లోపలకు తీసుకువెళ్ళండి. ముందు దాహాన్ని తీర్చి, పళ్ళూ, ఫలహారాలు సమర్పించండి. విశ్రాంతికి ఏర్పాట్లు చేయండి " అంటూ చిలక పలుకులు పలుకుతుంది.
రాజుగారు ఆ ఆశ్రమవాసులు కల్పించిన ఆతిధ్యం తీసుకుని ఆనందంగా వెళతాడు.
ఒకే జాతి పక్షులే కానీ వాటి మాటలో, చేష్టలో ఎంతో తేడా . కారణం , అవి పెరిగిన వాతావరణం. పెంచినవారి సంస్కారం. ఆ సంస్కారం ఎలా లభిస్తుంది. పూర్వజన్మ సుకృతం వలన.
మరొక విషయం చెపుతాను. ఆకాశం వర్షిస్తుంది. మేఘాలలోంచి వచ్చే నీరు శుధ్ధమైనదే. కానీ అది క్రింద పడినప్పుడు ఉండే పరిసరాలను బట్టి ఆ నీటియొక్క, లక్షణమూ మారుతుంది. బురదలోపడిన వాన బురదమయంగా, నల్లమట్టిలో పడ్డ వాన నల్లగా త్రాగడానికి అనువైనదిగా ఉండదు. కానీ, అదే వర్షపు నీరు, బావులలో, చెరువులలో, నదులలో చేరితే దానిని మనం అనుభవించగలుగుతున్నాము. అంటే స్థల ప్రభావం అని తెలుస్తోంది.
మరొక విషయం చూడు. మన రామాయణ గాధే ఉంది. విభీషణుడు ,రావణ కుంభకర్ణుల సోదరుడు. జన్మతః అసురుడు. కానీ, ఏ పూర్వపుణ్యఫలం వలననో శ్రీరాముని మైత్రి చేసి ఆయన అనుగ్రహం పొందాడు. లోకమంతటిచేత ప్రశంసించబడ్డాడు.
మహాభారతగాధలోని కర్ణుడు సూర్యాంశతో జన్మించి, వీరాధివీరుడిగా,  దాతృత్వంలో అసమాన్యుడిగా, స్వామి భక్తుడిగా పేరుపొందాడు. కానీ, కర్ణుడిలోని మంచి లక్షణాలన్నీ దుర్యోధనుడి సహచర్యం వలన మరుగున పడిపోయాయి. దుష్ట సహవాసం చేసి దుష్ట చతుష్టయంలోని వ్యక్తిగా అందరిచేత పరిగణింపబడ్డాడు. దుర్యోధనుని అక్రమకార్యాలలో భాగస్తుడై బలి అయిపోయాడు."
గురువుగారు చేసిన హితోపదేశం శిష్యుడికి సంతోషం కలిగించింది. మన  జీవిత గమ్యాన్ని చేరడానికి,  లక్ష్యాన్ని సాధించడానికి సజ్జన సాంగత్యం, సుహృద్భావ వాతావరణం ఎంతో అవసరమని ఆ శిష్యుడు గ్రహించాడు.

🕉🕉🕉🕉🕉🕉

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...