Wednesday, February 21, 2018

ప్రపంచ మాతృభాష దినోత్సవము

ఫిబ్రవరి 21వ తేదీ ---- తల్లిభాష పండగ!

సృష్టిలో ప్రతి ప్రాణికి తనకంటూ ఒక భాష ఉంటుంది. మానవులకంటూ ఓ ప్రత్యేకత ఉంది. ఆయా ప్రాంతాలనుబట్టి రకరకాల భాషలు ఉంటాయి. ఎవరికివారే ఘనులు కాబట్టి అందరూ తమ జాతి, తమ భాష గొప్పతనాన్ని ఘనంగా చాటుకుంటూ ఉంటారు. జాతుల సంగతి ఎలా ఉన్నా భాష విషయానికి వస్తే ఏ భాష అభివృద్ధికైనా సాహిత్యమే పట్టుగొమ్మ. సాహిత్యానికేమో రచయిత, ప్రచురణకర్త, పుస్తక విక్రేత, పాఠకుడు మూలస్తంభాలు. ఇందులో ఏ ఒక్క స్తంభం దెబ్బతిన్నా సాహిత్యం పునాదులు కదిలినట్లే.

1947లో...భారత్‌ విభజన సమయంలో బెంగాల్‌ ప్రాంతంలోని పశ్చిమభాగం భారతదేశంలోని తూర్పుప్రాంతం పాకిస్థాన్‌లోకి వెళ్లిపోయాయి. తూర్పు పాకిస్థాన్‌గా గుర్తించిన ఆ ప్రాంతానికీ పాకిస్థాన్‌కీ మధ్య ఆనాటి నుంచే ఆర్థిక, సాంస్కృతిక, భాషాపరమైన సంఘర్షణ ఉండేది. ఉర్దూను పాక్‌ అధికార భాషగా గుర్తించడంతో , బెంగాలీ మాట్లాడే తూర్పు పాకిస్థాన్‌లో ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం వెుదలైంది. ప్రభుత్వం హింసామార్గాల్లో ఆ ఉద్యమాన్ని అణిచే ప్రయత్నం చేసింది. ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. అయినా ఉద్యమం ఆగలేదు. మరింతతీవ్రరూపం దాల్చింది. 1956 ఫిబ్రవరి 29న పాక్‌ సర్కారు బెంగాలీని కూడా మరో అధికార భాషగా గుర్తించింది. ఆతర్వాత జరిగిన విముక్తి పోరాటంలో ఆ ప్రాంతం బంగ్లాదేశ్‌గా అవతరించింది. మాతృభాష కోసం నలుగురు యువకులు ప్రాణాలర్పించిన ఫిబ్రవరి 21వ తేదీని ఐక్యరాజ్యసమితి సాంస్కృతిక విభాగమైన యునెస్కో 'అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం'గా ప్రకటించింది. ప్రతియేటా ఫిబ్రవరి 21వ తేదీన అంతర్జాతీ య మాతృభాషా దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్యసమితి మద్ధతుతో 17-11-1999న యునెస్కో ఈ ప్రకటన చేసింది. 1999లో యునెస్కో సభ్య త్వ మండలికి ఎన్నికైన బంగ్లాదేశ్‌ ఈ దినోత్స వ నిర్వాహణను గూర్చిన ప్రతిపాదన చేసింది.

ఎన్నో భాషలు!

మనదేశంలో 1652 మాతృభాషలున్నాయి. వీటిలో మహా అయితే ఓ పదిహేను, పదహారు భాషలకు లిపి ఉంది. రెండువందల భాషలకు పదహారు వందలకుపైగా మాండలికాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలున్న భాషలు సుమారు ఆరువేలు. ప్రపంచీకరణ పుణ్యమా అని వీటిలో సగానికిసగం ప్రమాదంలో పడ్డాయి. భాషాశాస్త్రవేత్తల అంచనా ప్రకారం...గత మూడువందల సంవత్సరాల్లో ఒక్క అమెరికా, ఆస్ట్రేలియాలలోనే అనేక మాతృభాషలు అంతమైపోయాయి. వివిధ తెగల భాషలు కనుమరుగైపోయాయి. ఈ ప్రమాదాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగానే యునెస్కో 'మాతృభాషల పరిరక్షణ అన్నది ప్రజల జాతీయ, పౌర, రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక హక్కులలో అంతర్భాగం' అని నిర్ధారించింది. 'కనీసం ముప్ఫైశాతం పిల్లలు తమ మాతృభాషను నేర్చుకోవడం మానేస్తే, ఆ భాష ఉనికి ప్రమాదంలో పడినట్టే' అంటూ హెచ్చరించింది. ఆ లెక్కన తెలుగు భాషకూ ప్రమాదం పొంచి ఉన్నట్టే!

*తెలుగు భాష*

బిడ్డ భూమ్మీద పడగానే ముందుగా కనిపించేది అమ్మ వెుహమే. ముందుగా వినిపించేది అమ్మ మాటే. ముందుగా పలికేది 'అమ్మ...' అనే కమ్మని పలుకే. అందుకే అది అమ్మభాష అయింది. బిడ్డ ఎదుగుదలకు అమ్మపాలెంత అవసరవో, వికాసానికి అమ్మభాషంత ముఖ్యం! మానసిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించిన మాటిది.

*ఏ భాష అయినా మాతృభాష తర్వాతే.*

*ఏ మాట అయినా తెలుగుమాట తర్వాతే.*

శతాబ్దాల నాడే మన అజంతాల భాష దిగంతాలకు వ్యాపించింది. క్రీస్తుశకం ఒకటో శతాబ్దం నాటికే శాతవాహన చక్రవర్తి హాలుడు తన 'గాథాసప్తశతి'లో తెలుగు పదాలు ప్రయోగించాడు. ప్రపంచ కథానికల్లో వెుట్టవెుదటిది, గుణాఢ్యుడు రాసిన తెలుగు కథే. తెలుగు భాషలో ప్రతి ఉచ్చారణకీ ఓ ప్రత్యేకాక్షరం ఉంది. పదం చివరలో అచ్చులు చేర్చుకునే సులువుండటం వల్ల ఏ భాషాపదాన్నయినా ఇట్టే సొంతం చేసుకోగల సత్తా ఉంది. అందుకే 'ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌' అని ఆకాశానికెత్తేశారు హాల్డెన్‌ దొరగారు. 'సుందర తెనుంగై' అని తెగ మెచ్చుకున్నారు తమిళకవి సుబ్రహ్మణ్యభారతి. అప్పయ్యదీక్షితులైతే తెలుగువాడిగా పుట్టనందుకు జీవితాంతం చింతించారు. 'ఆంధ్రత్వం ఆంధ్రభాషాచ... నాల్పస్య తపసఃఫలమ్‌' అంటూ తనకుతాను సర్దిచెప్పుకున్నారు. నిజమే మరి, తెలుగువాడిగా పుట్టాలన్నా, తెలుగు భాష మాట్లాడాలన్నా ఎంతో కొంత పుణ్యంచేసుకునుండాలి. పూర్వజన్మ సుకృతం ఉంటేకానీ, ఆ మహద్భాగ్యం దక్కదు.

యాభై ఏడక్షరాలు, మూడు ఉభయాక్షరాలున్న మన వర్ణమాల ప్రపంచ భాషల్లోనే రెండో అతి పెద్దదిగా మన్ననలందుకుంటున్నా. దేశం వెుత్తం మీద హిందీ తరువాత ఎక్కువమంది మాట్లాడే భాష మన తెలుగే! ఏ దేశమేగినా ఎన్ని భాషలు నేర్చుకున్నా అవన్నీ మాతృభాషకు ప్రత్యామ్నాయం కానేకావు. ఇంగ్లిషులో ఒక అక్షరం 4.71 బిట్ల సమాచారాన్ని అందించగలిగితే, తెలుగు అక్షరం అదే సమాచారాన్ని అందించడానికి 1.14 బిట్లు మాత్రమే ఉపయోగించుకుంటుందని తేలింది. హిందీకి 1.56 బిట్లు, తమిళానికి 1.26 బిట్లు, కన్నడానికీ మలయాళానికీ 1.21 బిట్లు అవసరమయ్యాయి. ఇంగ్లిషులో ఒకే పదానికి అనేక పర్యాయపదాలు ఉండగా, ఒక్కో ప్రత్యేక పదం ద్వారా ఒక్కో ప్రత్యేక భావాన్ని స్పష్టంగా అందించగల సామర్థ్యం తెలుగు భాషకుంది.

మాత్రుభాషలో విద్యాభోదన పిల్లలకు మానిసిక వత్తిడి నుండి మేలుచేస్తుందని మానసిక నిపునులు పదే పదే చెప్తున్నా మన సమాజము వినడం లేదు . దీనికి తోడుగా హిందీ కూడా నేర్పడము మరీ మంచిది కాదు . ప్రపంచ ప్రజలతో అనుసంధానముకోసం ఇంగ్లిష్ నేర్చుకోవడం తప్పనిసరి అయినందున మనవిద్యావిధానములో రెండేబాషలు ఉండి పాఠ్యాంశాలన్నీ తెలుగు (మాతృభాషలో)నే ఉండాలి. ఇంగ్లిష్ కమ్యూనికేషం భాష గా మాత్రమే మొదటి నుండీ నేర్పడము ఉత్తమమైన విద్యావిధానము

*తెలుగు వ్యాకరణం ఉపోద్ఘాతం*

ఏ భాషలోనైనా అంతర్గతంగా ఉన్న లక్షణాలను సూత్రీకరించి వ్రాసిన గ్రంధం వ్యాకరణ గ్రంధమవుతుంది.శబ్ద శాస్త్రమే వ్యాకరణం. ఆ భాషలో లక్షణాలే ఆ భాషకు వ్యాకరణం అవుతుంది.

వ్యవహారంలో మాట్లాడుకునే భాషకు కూడా వ్యాకరణం ఉంటుంది. వ్యావహారికంగా దేశ కాల పాత్రలనుబట్టి వచ్చే మార్పులు ఆ భాష వ్యాకరణంలో మార్పులు తీసుకొస్తాయి. ఎప్పటికప్పుడు వీటినుండి వ్యాకరణ సూత్రాలకు కూడా మార్పులు చేసుకుంటుండాలి. కాబట్టి ఆయా కాలాలలో శిష్ట వ్యవహారాలన్నింటినీ ఆధారం చేసుకుని వ్యాకరణ సూత్రాలని సరిదిద్దుకుంటూండడం సంప్రదాయకం అయింది.

భారత రాజ్యాంగం గుర్తించిన ముఖ్యమైన నాలుగు ద్రావిడ భాషలలో తెలుగు ఒకటి. మిగిలినవి తమిళం, కన్నడం, మలయాళం. భారతదేశంలో ద్రావిడ భాషలను మాట్లాడేవారిలో తెలుగు మాట్లాడేవారి సంఖ్య అధికం. ఈ విషయంలో మొత్తం భారతదేశంలో హిందీ ప్రధమ స్థానం వహిస్తే తెలుగు రెండవ స్థానం పొందుతూంది. తెలుగు వారి సాహిత్యం అతి ప్రాచీనమైంది. రెండు వేల (2,000)సంవత్సరాల క్రితమే తెలుగు ఒక స్వతంత్ర భాషగా స్థిరపడిపోయింది. తెలుగు నుడికారము, మృదుమధుర భావగర్భితము, అత్యంత హృదయానందకము.

ప్రపంచ భాషలలో ఎట్టి శబ్దాన్నైనా తనలో జీర్ణించుకోగల సత్తా, ఏ శబ్దాన్నైనా ఉచ్చరింపజేయగల శక్తి అటు సంస్కృతానికీ ఇటు తెలుగుకు తప్ప మరే భాషకూ లేదు. ఇట్టి తెలుగు భాషకు నన్నయభట్టు మొదలుకొని ఎందరెందరో కవులు వ్యాకరణాలు రచించారు. ఇంకా రచనలు కొనసాగిస్తూనే ఉన్నారు. తెలుగు వ్యాకరణాలలో మొట్టమొదటిది 11వ శతాబ్దంలో వెలువడిన "ఆంధ్ర శబ్ద చింతామణి". భారత రచనకు పూర్వమే నన్నయ దీనిని రచించాడనే వాదోపవాదాలు ఉన్నాయి. ఇది నన్నయ కృతమని కొందరు, కాదని మరికొందరూ వాదిస్తున్నారు. ఇది 80 అర్యావృత్తములతో సంస్కృతములో రచించబడింది.

క్రీ.శ. 13వ శతాబ్దంలో అధర్వణాచార్యులు ఆంధ్ర శబ్ద చింతామణి సూత్రాలకు వివరణలు, సవరణలు చూపుతూ వార్తికములు సంస్కృతంలో రచించారు. ఇంతేగాక ఇతడు తెలుగునకు సంస్కృత

భాషలో వికృతి వివేకము లేక అధర్వణ కార్తికావళి, త్రిలింగ శబ్దానుశాసనము అను రెండు వ్యాకరణాలను రచించాడంటారు. పై రెండు గ్రంధాలలోనూ లక్షణములేగానీ లక్ష్యములు లేవు. లక్షణ లక్ష్య సమన్వయంగా క్రీ.శ. 13వ శతాబ్దంలో కేతన (దశ కుమార చరిత్ర రచించిన కవి) ఆంధ్ర భాషాభూషణము తెలుగు మాటలకు తెలుగు భాషలో వ్రాయబడిన మొదటి గ్రంధము. 15వ శతాబ్దంలో విన్నకోట పెద్దన వ్యాకరణాంశములతోపాటు చందోలంకార రూపమగు కావ్య లక్షణాలను కూడా చేర్చి కావ్యాలంకార చూడామణిని తెలుగు పద్య రూపంలో రచించాడు. ఇదే కాలంలో వెల్లంకి తాతంభట్టు కవి లోక చింతామణి వ్యాకరణాంశాలతోపాటు కొన్ని లక్షణాలను చేర్చి తెలుగు పద్యాలలో రచించాడు. తరువాత 16వ శతాబ్దంలో ముద్దరాజు రామన పైవాటికన్నా కొంత మేలుగా "కవిజన సంజీవని" రచించాడు. ఇది కూడా పద్య రూపంలో ఉన్నా అక్కడక్కడ వచనాలతో వివరించబడింది.

17వ శతాబ్దంలో బాల సరస్వతి ఆంధ్ర శబ్ద చింతామణికి బాల సరస్వతీయము అను తెలుగు టీకను వ్రాశాడు. బాల సరస్వతీయం వల్లే ఆంధ్ర శబ్ద చింతామణి ప్రచారంలోకి వచ్చింది. ఇదే శతాబ్దంలో కాకునూరి అప్పకవి ఆంధ్ర శబ్ద చింతామణిని తెనిగించి అప్పకవీయము రచించాడు. ఇదే సమగ్ర లక్షణ గ్రంధమనిపించుకుంది. 17వ శతాబ్దంలోనే అహోబల పండితుడు పూర్వ కవుల గ్రంధాలను పరిశోధించాడు. కవి శిరోభూషణము అను గ్రంధమును సంస్కృతంలో చింతామణికి వ్యాఖ్యానం వ్రాశారు. దీనినే పండితులు అహోబల పండితీయం అన్నారు. ఈ శతాబ్దంలోనే మండ నరసింహ కవి సూత్ర వివరణము సంస్కృతంలోనూ, ఉదాహరణలు తెలుగులోను పెట్టి ఆంధ్ర కౌముదిని రచించాడు.సర్వ లక్షణ సార సంగ్రహం గణపవరపు వేంకటకవి (17వ శతాబ్దం) రచంచాడు. అదే పేరుతో 18వ శతాబ్దంలో కూచిమంచి తిమ్మకవి మూడు ఆశ్వాసముల పద్య గ్రంధమును ఎక్కువ వ్యాకరణ విశేషాలతో లక్షణ సంస్కారంతో రచించాడు. తరువాత కస్తూరి రంగకవి "ఆనందరంగరాట్చందము", ఆడిదం సూరకవి యొక్క "కవి సంశయ విచ్చేదము" వచ్చాయి. ఆయా కాలాలకు తగినట్టుగా ఈ గ్రంధాలు కనిపించినా 19వ శతాబ్దం నాటికి అన్నీ అసమగ్రాలుగనే కనిపించాయి. చింతామణి, అహోబిల పండితీయం సంస్కృతంలో వచ్చాయి. ఇవి సంస్కృతం తెలిసినవారికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. తరువాత వచ్చిన ఆంధ్ర భాషాభూషణాదులు తెలుగు పద్యాలలో ఉన్నాయి. ఇవి తెలుగు తెలిసిన వారికి ఉపయోగపడినా ఎక్కువగా కావ్య లక్షణాలను నిరూపిస్తున్నాయి. కావ్యాలంకార చూడామణి, అప్పకవీయం మొదలైన వాటిలో వ్యాకరణాంశాలు బహుకొద్దిగా ఉన్నాయి.కావ్య వాజ్ఞ్మయం బహుముఖంగా విస్తరించుకుపోయింది. ముందువచ్చిన వ్యాకరణాలన్నీ 19వ శతాబ్దం నాటికి అసమగ్రాలుగా కనిపించాయి. ఇది గ్రహించి పరవస్తు చిన్నయ ప్రాచీన వ్యాకరణ మర్యాదలతో సంస్కృతంలో సూత్రప్రాయంగా తెలుగు వ్యాకరణం రచించాడు. ఇదేగాక ఇతడు సంస్కృత భాషలో పాండిత్యం సంపాదించాడు. అనేక ప్రాచీన లక్షణ గ్రంధాలను పరిశీలించాడు. తెలుగు భారతము, భాగవతము మొదలైన గ్రంధాలలో ప్రయోగాలను తెలుసుకున్నాడు. వీటితోపాటు అనుభవాన్ని కూడా జోడించి క్రమపద్ధతిలో తెలుగు సూత్రాలతో మిక్కిలి సులభ శైలిలో వివరణలతోసహా బాల వ్యాకరణం రచించాడు. ఈ చిన్నయ బాల వ్యాకరణమే తరువాత వచ్చిన వ్యాకరణకర్తలకు అందరికీ ఆధారమైంది. ఇదే ఆంధ్ర భాషకు ప్రామాణికమైన వ్యాకరణ గ్రంధము.

ఆంధ్ర వాజ్ఞ్మయానికి చిన్నయ రచించిన బాల వ్యాకరణం సంస్కృత వాజ్ఞ్మయానికి సిద్ధాంత కౌముది వంటిది.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...