Wednesday, February 21, 2018

పౌరాణిక కథ - వినాశకుడు పరిరక్షకుడైన సందర్భం

🕉🕉🕉🕉🕉🕉

శివుడు కాళీమాత పాదాల చెంత కొలువై ఉన్న చిత్రపటాలను చూస్తుంటాం. దానికి సంబంధించిన పురాణ గాథ ఇలా ఉన్నది :

ఒకప్పుడు రాక్షసులు తమ నాయకుడు రక్తబీజుని నాయకత్వంలో భూతలమున కల్లోలం సృష్టించారు. ఆ సమయంలో దుర్గమాత వారి సంహారానికి సమాయత్తమైనది. ఆయుధాలు ధరించి యుద్ధానికి తలపడింది. రాక్షస గణాలను ఒక్కొక్కరినే సంహరించింది. చివరకు వారి అధినాయకుడు మిగిలాడు.

రక్తబీజునితో యుద్ధం చేయడం సాధారణ చర్యకాదు. బ్రహ్మ ఇచ్చిన వరం ఫలితంగా రక్తబీజుని ఒంటి నుండి ఒక రక్తం చుక్క భూమిపై పడితే అప్పుడే వందలాది మంది సైనికులు పుట్టుకొస్తారు. దీనితో దుర్గ అతనితో తలపడి గాయపరచిన కొద్దీ అతని సైన్యం సంఖ్య పెరుగుతూ వచ్చింది. దుర్గాదేవి అయోమయస్థితిలో పడింది. సైనికులు మూకుమ్మడిగా దుర్గపై దాడి జరిపారు. ఆమెకు కలిగిన కోపంతో భయంకర రూపంలోని కాళి ఆవిర్భవించింది.

కాళి రక్తబీజుని సైనికులను సంహరించి, చివరకు అతనిపై దాడి జరిపింది. రక్తబీజుని ఒడిసి పట్టుకొని అతని ఒంటిలోని రక్తాన్ని పూర్తిగా గ్రోలింది. దీనితో రక్తబీజుడు మరణించాడు. రక్తం గ్రోలిన కాళి అతని కళేబరాన్ని దూరంగా విసిరివేసింది.

ఇప్పుడు ప్రపంచానికి మరో ముప్పు వచింది. రక్తబీజుని రక్తం కాళిపై దుష్ప్రభావం చూపసాగింది. దీనితో కాళి కరాళ నృత్యం ప్రారంభించింది. భూమిపై వేస్తున్న ఒక్కొక అడుగుతో కాళి వినాశం ప్రారంభించింది. దేవతలు రక్షణకై జోక్యం చేసుకోవాలని శివుని ప్రార్థించారు.

శివుడు యుద్ధభూమికి వచ్చి కాళిని శాంతింపచేయడానికై ఆమెను పలుమార్లు పిలిచాడు. అయితే ఆమె వినిపించుకొనే స్థితిలో లేదు. రాక్షసుల మాంసాన్ని తింటూ నృత్యం కొనసాగించింది. ఆమె కొప్పు ముడి తొలగి కేశరాశిగా మారింది. విప్పుకొన్న ఆమె కేశపాశం కదలికతో వెలువడే గాలి కొందరు దేవతలను దూరానికి విసిరివేసింది. ఆమె అడ్డుకోవడానికి ఎవరికీ తరం కాలేదు. శివుడు అన్ని విధాలా ప్రయత్నించి చివరకు గత్యంతరం లేక శాంతించమని కోరుతూ కాళి పాదాల చెంత వాలాడు.

తన పాదాల చెంత ఉన్న వ్యక్తి తన భర్త అని కాళి కొంతసేపు తర్వాత గ్రహిస్తుంది. ఆమె సుషుప్తి నుండి బయట పడి శాంతం వహిస్తుంది.

వినాశానికి కారకుడైన శివుడు ఆ సందర్భంలో పరిరక్షకుడైనాడు.

🕉🕉🕉🕉🕉🕉

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...