Wednesday, February 21, 2018

గీతా మకరందము

కర్మయోగము
      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అ ॥ పదార్థములను భగవదర్పితము చేసి యనుభవించు వారికి కలుగు సత్ఫలము, స్వార్థము కొఱకు వినియోగించువారికి కలుగు దుష్ఫలితము వచించుచున్నారు -

యజ్ఞశిష్టాశినస్సన్తో
ముచ్యన్తే సర్వకిల్బిషైః ।
భుఞ్జతే తే త్వఘం పాపా
యే పచన్త్యాత్మకారణాత్  ॥

తా:- యజ్ఞమునందు (భగవదర్పణముచేసి) మిగిలిన పదార్థమును తిను సజ్జనులు సమస్తపాపముల నుండియు విడువబడుచున్నారు. అట్లు కాక ఎవరు తమ నిమిత్తమే భుజించు చున్నారో, అట్టివారు పాపమును తినువారే యగుదురు.

వ్యాఖ్య:- భగవదారాధనరూపములగు యజ్ఞములను గావించి, అన్నాదులను భగవంతునకు అర్పణచేసి (లేక, భగవత్స్వరూపులే యగు ప్రాణికోట్లకు కొంతభాగమును సమర్పించి) మిగిలిన పదార్థమును భుజించువాడు సమస్త పాపములనుండియు విముక్తుడగునని ఇచట చెప్పబడినది. ‘సర్వకిల్బిషైః’ - అని చెప్పబడినందున, ఒకటి రెండు పాపములనుండి కాదనియు, సమస్తపాపముల నుండియు విడివడునని తెలుపబడినది. దీనినిబట్టి యజ్ఞములకు, భగవన్నివేదనమునకు, త్యాగమునకు, పరోపకారమునకు ఎంతటి సామర్థ్యమున్నదో స్పష్టమగుచున్నది. కనుకనే ఈశావాస్యోపనిషత్తుయొక్క ఆరంభమున ‘తేన త్యక్తేన భుఞ్జీథాః’ - ‘నీకున్నదానిలో నొకింత త్యాగమొనర్చి భుజింపుము’ నీకున్నది భగవంతునకు అర్పించి భుజింపుము. - అని చెప్పబడినది. అట్లు కాక స్వార్థము కొఱకే భుజించువారు, దైవమున కర్పింపక భుజించువారు, పరప్రాణికి ఒకింతైనను త్యాగమొనర్పక భుజించువారు, పాపమును భుజించినట్లే యని భగవానుడు వారిని తీవ్రముగ మందలించిరి. వారు పాపమునే మూటకట్టుకొనుచున్నారు. లేక, పాపమునే భుజించుటచే అయ్యది వారి రక్తనాళములలో ప్రవేశింప వారు కేవలము పాపరూపులే యగుచున్నారని భావము. కావున స్వార్థమే పాపహేతువు, స్వార్థత్యాగమే మోక్షహేతువని ఈ శ్లోకముద్వారా తేటతెల్లమగుచున్నది. భగవంతునకు నివేదింపక, పరప్రాణికి ఒకింతైనను పెట్టక పంచభక్ష్యపరమాన్నములను ఆరగించినను విషము తినినట్లేయగుననియు ; ఈశ్వరార్పణముచేసి, భూతకోట్ల కొకింత త్యాగము చేసి గంజి త్రాగినను అది అమృతమేయగు ననియు నిట వెల్లడింపబడినది.

మఱియు మానవునకు తన నిత్యజీవితమున ఏదైన కోయునపుడు, నూఱునపుడు, విసఱుచున్నపుడు, వండునపుడు, ఊడ్చునపుడు, తెలియక కొంత ప్రాణిహింస జరుగవచ్చును. దానినే పంచసూనములందురు. ఆ పాపమును పరిహరించుటకు పంచమహాయజ్ఞము లేర్పడినవి. అవి యేవియనిన - (1) దేవయజ్ఞము (హోమము)  (2) పితృయజ్ఞము(తర్పణము) (3) నృయజ్ఞము (అతిథిపూజ)
(4) బ్రహ్మయజ్ఞము (వేదాధ్యయనము)
(5) భూతయజ్ఞము (ప్రాణులకు అన్నమిడుట).
కావున ఇవియు, ఇంకను భగవదారాధనరూపములై, పరోపకార సంబంధములైనట్టి ఇతరములునునగు యజ్ఞముల నాచరించుచు, యజ్ఞశేషమును మాత్రము భుజించుచు నుండువారు పాపరహితులై, క్రమముగా పరమశ్రేయము నొందగలరని భగవాను డీశ్లోకమున తెలుపుచున్నాడు.

ప్ర: యజ్ఞశేషమును (దైవార్పితముచేసి శేషించిన దానిని) భుజించువారికి కలుగు ఫలితమేమి ? 
ఉ: వారు సర్వపాపములనుండి విముక్తులగుదురు.
ప్ర: అట్లుకాక, స్వార్థముకొఱకు భుజించువారికి కలుగు ఫలితమేమి?
ఉ: వారు పాపమునే పొందుదురు. పాపరూపులే యగుదురు.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...