Sunday, February 11, 2018

శ్రీ_అపర్ణాదేవి_వ్రతము

శ్రీ అపర్ణాదేవి అమ్మవారి వ్రతమును ఈ క్రింది కారణాల కోసం ఆలయములో కాని, ఇంటి వద్ద కాని చేసుకొనవచ్చును

1. కుటుంబ సౌఖ్యము కొరకు (శుక్రవారం ఉ.10.30 గం. నుండి 12.00 గం. రాహుకాలమందు)

2. కుజగ్రహదోష నివృత్తికి, వివాహాలు కుదురుటకు (మంగళవారములయందు)

3. రాహు, కేతు గ్రహదోష నివృత్తికి (శుక్రవారం ఉ.10.30 గం. నుండి 12.00 గం. రాహుకాలమందు లేదా మంగళవారములయందు)

4. ఋణ బాధలు తొలగుటకు (మంగళవారములయందు)

5. ఉద్యోగం పొందుటకు, పదోన్నతులు, బదిలీలకు (అష్టమితో కూడిన మంగళవారమందు లేదా మంగళవారములయందు)

6. దాంపత్య సమస్యల నివృత్తికి, సంతానం కొరకు (శుక్రవారములయందు)

7. వ్యాపార వాణిజ్య విషయాలలో చిక్కులు తొలగి ఐశ్వర్యాభివృద్ధికి (శుక్రవారములయందు)

8. ఏ రంగం నందైనను విజయం సాధించడానికి (మంగళవారములయందు)

9. జ్ఞానసముపార్జనకు, తద్వారా మోక్షసాధనకు (శుక్రవారములయందు)

ఈ వ్రతమును ఏ మంగళ, శుక్రవారముల నందైనను జరుపుకొనవచ్చును. అష్టమి, చతుర్ధశితో కూడిన మంగళ, శుక్రవారములయందు చేసుకున్నచో విశేష ఫలప్రదము. మీ మీ సౌలభ్యములను బట్టి అమ్మ వారి దివ్యక్షేత్రము నందు ఈ పూజను జరిపించుకొనవచ్చును. మీ సమస్యను బట్టి ఏడు మంగళవారములు కాని, ఏడు శుక్రవారములు కాని ఈ వ్రతమును జరుపుకొనడము మంచిదిగా దైవజ్ఞులు నిర్ణయించారు. మీ ఇంటి దగ్గర అమ్మ వారి పూజను, దివ్యవ్రతమును జరుపుకొనవచ్చును, లేదా జరిపించుకొనవచ్చును. ప్రతీ మంగళవారము ఉదయం 6 గం. నుండి 12 గం. వరకు కుజగ్రహ దోష నివృత్తికి, వివాహాలు కుదరడానికి ఈ వ్రతమును జరిపించుకొనవచ్చును.

అపర్ణా వ్రతము

పూర్వము శౌనకాది మహర్షులు నైమిశారణ్యంలో సత్రయాగం చేస్తుండగా అక్కడకు సమస్త పురాణములు తెలిసిన సూత మహర్షులవారు వచ్చారు. ఋషులాయనకు ఆతిథ్యమిచ్చి సుఖాసీనుని చేసి "మహర్షీ! నీవు సమస్తము తెలిసినవాడవు. భూలోకములో జనులు కోరిన కోరికలు అన్నియు పొందుటకు సులభమైన వ్రతము ఏదైనా ఉన్నచో మాయందు దయతో వివరించవలసినదని ప్రార్థించగా" సూతమహర్షి ఈ విధముగా చెప్పెను. ఓ ఋషులారా! కలియుగమున వాంఛాసిద్ధి కలిగించుటకు "అపర్ణా వ్రతము" అను వ్రతమొకటి కలదు. ఆ వ్రతమును ఆచరించిన జనులకు కుజదోషము తొలగి కోరిన కోరికలు అన్నియూ నెరవేరును అని సూతమహర్షి చెప్పగా, ఋషులు మరలా ఇలా అడుగుచున్నారు. ఓ మహాత్మా! "అపర్ణా వ్రతమును ఏ విధముగా చేయవలెను, అందుకు విశేషమైనటువంటి పర్వదినములు ఏమైనా కలవా? ఈ వ్రతమునందు ఏ దేవతను పూజింపవలయును? ఏ విధముగా పూజ చేయవలయును? ఈ వ్రతము చేసినా వచ్చు ఫలమేమి?" అని ఋషులు కోరగా సూతమహర్షి ఈ విధముగా చెప్పుచున్నాడు.

శ్రీ అపర్ణా వ్రతము చేయు మానవులు ముందుగా విఘ్నేశ్వర పూజను ఆచరించి, మండపమును ఏర్పరిచి, కలశయందు వరుణదేవుని పూజించి, ప్రతిమారూపిణిగా అపర్ణాదేవిని పూజింపవలెను. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వైదికముగాను, శూద్రులు పురాణోక్తముగాను, ఈ కల్పములో చెప్పబడిన విధముగా పూజించి ప్రత్యేకముగా క్షీరాన్నము నివేదన గావించి, పూజ పూర్తిచేసి శ్రీ అపర్ణా వృత్తాంతము, కుజ జన్మ వృత్తాంతమును పఠింపవలెను. ఈ ప్రకారము చైత్ర మాసములో కాని, శ్రావణ, ఆశ్వీయుజ, కార్తీక, మాఘ మాసములందు గాని, ఈ వ్రతమును ఆచరించవలెను. ముఖ్యముగా ఈ వ్రతమును ఆచరించు భక్తులు ఏ మాసముల యందైనను మంగళ, శుక్రవారముల యందు శ్రీ అపర్ణాదేవిని పూజించుట విశేషము. కుజదోషము ఉన్న వివాహము కాని వారు, సంతానము లేనివారు మంగళవారము పూజించుట విశేషము. మరియు ఋణ, శత్రుబాధల నుండి విముక్తి కొఱకు మంగళవారము పూజింపవలెను.

శ్రీ అపర్ణాదేవిని శుక్రవారము పూజించినచో విద్యార్ధులకు విద్యాలాభము, వ్యాపారులకు ధనలాభము, స్త్రీలకు సౌభాగ్య సంపదలను, పురుషులకు సకల కార్యసిద్ధిని చేకూర్చును. ఈ వ్రతమును ఏడు మంగళవారములు గాని, ఏడు శుక్రవారములు గాని పూర్తిచేసి ఏడుగురు ముత్తైదువులకు వస్త్ర, దక్షిణ తాంబూలాదులు, శ్రీ అపర్ణా వ్రతకల్ప పుస్తకముతో వాయనమిచ్చి వారిచే ఆశీర్వచనము పొందవలెను. ముఖ్యముగా ఈ వ్రతము ఆచరించువారు ప్రారంభమునందు గాని, మధ్యలో గాని, చివరివారము నందు గాని, తాళ్లపురం(తాటిపర్తి) లో వేంచేసియున్న అపర్ణాదేవిని సందర్శించి, పూజించుకొనవలెను. ఈ ప్రకారము శ్రద్ధ, భక్తి విశ్వాసములతో ఎవరు ఈ వ్రతమును ఆచరిస్తారో వారికి అపర్ణాదేవి అనుగ్రహముచేత సకల కార్యములు సిద్ధించుటయే గాక, బ్రతికియున్నంత కాలము ధనము, పుత్రపుత్రికలు కలిగి సమస్తమైన ఐశ్వర్యములను అనుభవించి అంత్యమున దేవి సాన్నిధ్యము పొందుదురు. కలియుగమున వాంఛసిద్ధి కలిగించుటకు, కుజదోష నివృత్తికి ఇంతకంటే సులభమైన వ్రతము మరొకటి లేదని సూతుడు శౌనకాది మహర్షులకు చెప్పెను.

కుజగ్రహ జనన వృత్తాంతము

సూత మహర్షిని శౌనకాది ఋషులు ఈ విధముగా అడుగుచున్నారు. ఓ మహర్షీ! ఈ లోకంలో కుజదోషం వలన కొంతమంది వివాహం కాకుండా ఉండిపోవుచున్నారు. కొందరు సంతానము లేక మరికొందరు ధనము లేక ఋణములతోను ఇంకొందరు వ్రణములు ; ప్రమాదములు, అగ్ని బాధలు, శత్రు బాధలు పొందుచున్నారు. అసలు కుజుడెవరు? అతని శక్తి సామర్థ్యములు ఎలాంటివి? కుజదోష నివారణోపాయములు ఏమిటి? అని అడుగగా, సూత మహర్షుల వారు ఋషులారా! శ్రద్ధగా వినండి, పై దోషములు గలవారు శ్రీ అపర్ణా వ్రతములను చేసి, కుజ జన్మ వృత్తాంతము, శ్రీ అపర్ణాదేవి కళ్యాణ వృత్తాంతమును ఎవరైతే శ్రద్ధగా, భక్తులతో పారాయణ చేస్తారో వారికి జన్మలగ్నవసాత్తు గాని, గోచారలగ్నవసాత్తు గాని, ద్వితీయ, చతుర్ధ, సప్తమ, అష్టమ వ్యయస్థానములలో కుజుడు ఉండుట వలన కలుగు సమస్త కుజదోషములు తొలగి కోరిన కోరికలు నెరవేరును. ముందుగా కుజ జన్మ వృత్తాంతము చెప్పుచున్నాను. శ్రద్ధగా వినవలెను, అని సూతులవారు ఈవిధంగా ప్రారంభించిరి.

శ్రీ మహావిష్ణువు తన నాభికమలము నుండి బ్రహ్మను సృజించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్షప్రజాపతి ఒకడు. దక్షుడు అనగా సమర్ధుడు అని అర్ధము. ఆ దక్షప్రజాపతి తన కుమార్తెలలో ఇరవైఏడు మందిని "అశ్వని" (నక్షత్రములు) మొదలగువారిని చంద్రునకు ఇచ్చి వివాహము చేసినాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమె దాక్షాయణి, శ్రీమాత. పరమశివుడు ప్రతీరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయనకు నటరాజు అనే పేరు వచ్చింది. ఆ నాట్యం చూడటానికి ముక్కోటి దేవతలు వస్తారు. దక్షుడు కూడా వచ్చేవాడు. దక్షుడు మామగారు ఐనప్పటినుండి శివుడు నాట్యం పూర్తైన తర్వాత ముందుగా దక్షుని సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగానంపేవాడు. ఒకరోజు వీలులేక దేవతలందరినీ సాగనంపి చివరకు దక్షుని సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు ఓ పెద్దయజ్ఞం తలపెట్టి దానికి కుమార్తెను, అల్లుడిని పిలవలేదు. మరీచ్యాది మహర్షులు హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు.

నారద మహర్షుల ద్వారా యజ్ఞకార్యాన్ని గురించి విన్న దాక్షాయణి పరమశివుని యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. శివుడు పిలవని పేరంటానికి వెళ్ళడం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రమథగణాన్ని పంపించాడు. దాక్షాయణి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను (దాక్షాయణిని) చూసి దగ్గరకు వచ్చి పరమశివుని నిందించాడు. "అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలా సంతోషం" అన్నాడు. దాక్షాయణి తండ్రికి, అక్కడ ఉన్న దేవతలందరికి పరమశివుని గొప్పతనం చెప్పి, శివనింద చేసినవాని కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించింది. యజ్ఞకుండము దగ్గరకి వెళ్ళి యోగాగ్నిచే దగ్థమైంది. ఆవార్త తెలిసిన శివుడు దక్షయజ్ఞమును ధ్వంసము చేసినాడు. పిమ్మట శివుడు కైలాసమునకు వెళ్ళి సతీవిరహమును పొందుచూ తిరిగి హిమవత్ పర్వతము నందు తపస్సు చేయుచుండెను. అటుల తపస్సు చేయుచుండిన శివుని మూడవ నేత్రమునుండి శ్వేద బిందువులు నేలపై పడి, ఒక శిశువు ఉద్భవించెను. ఆ బాలుడు ఎర్రని కాంతితో దివ్య తేజస్సుతో నాలుగు భుజములతో ప్రకాశిస్తున్నాడు. దిక్కులు ప్రక్కటిల్లేలా ఏడవడం ప్రారంభిచాడు. ఆ ధ్వనికి భూమి, ఆకాశము ఏకమవుతున్నట్లు ఉంది. ఇంతలో భూదేవి స్త్రీ రూప ధారిణి అయి ఆబాలుడిని ఎత్తుకుని స్తన్యమిచ్చినది.

శివుడు భూదేవితో నీవు చాలా పుణ్యాత్మురాలవు. నా శ్వేదబిందువు నీపై పడుటచే ఈ బాలుడు ఉద్భవించాడు. నేటి నుండి నీకుమారుడిగా ప్రసిద్ధి చెందుతాడు. ఇతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక, తాపత్రయరహితుడై నీ పేరుతో విఖ్యాతి పొందును, అని చెప్పాడు. శివలలాటజలము భూమిపై పడి ఇతడు జన్మించుటచే (కు-భూమి యందు, జ-జన్మించినవాడు) కుజుడు అని ప్రసిద్ధి నామం కలిగెను. భూమి కుమారుడు గాన భౌముడనియు, అగ్ని తేజస్సుచే పుట్టినవాడు (సర్వాంగములను పీడించువాడు) గాన అంగారకుడనియు ప్రసిద్ధి నొందెను. ఇతడు జన్మించిన కొన్ని క్షణములకే యువకుడై కాశీయందు ఉండి చిరకాలము శివుని గురించి తపస్సు చేసి శివానుగ్రహముచే గ్రహత్వమునొంది శుక్రలోకమునకు పైభాగమున ఉండెను. నాటి నుండి ఎవరు ఇతనిని పూజిస్తారో వారికి వెంటనే కుజదోష నివృత్తి, సర్వకామ్యసిద్ధి కలుగును. ఈ కుజ జన్మ వృత్తాంతము పరమ పావనమైనది. అని సూతుడు శౌనకాది మునులకు తెలిపెను.

శ్రీ అపర్ణా కళ్యాణము

సూతుడు మరలా ఇలా చెప్పుచున్నాడు. ఓ మునిపుంగవులారా! ముఖ్యమైన అపర్ణా కళ్యాణ వృత్తాంతమును చెప్పుచున్నాను. శ్రద్ధగా వినవలయును. దాక్షాయణి యోగాగ్నిచే తనువు వీడి పర్వతరాజైన హిమవంతునికి కూతురై జన్మించింది. హిమవంతుని కుమార్తె గావున హైమవతి అని, పర్వతరాజు కుమార్తెగా ఉన్న కారణంగా పార్వతి అని ప్రసిధ్ధి చెందింది. హిమవంతుని ఇంట ఆమె దినదిన ప్రవర్ధమాన మౌతున్న కాలంలో తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కొరకు కఠోరమైన తపస్సు చేసి సమస్త దేవతలను జయించగల వరములను పొందాడు. ఆ వర ప్రభావంతో లోకాలన్నీ జయించాడు. ఇంద్రుని పదవీ భ్రష్టుడ్ని చేసాడు. స్వర్గాధిపతి అయినాడు. ముక్కోటి దేవతలను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. దేవతలందరూ బ్రహ్మనాశ్రయించి వేడుకున్నారు. అప్పుడు బ్రహ్మ దేవతలతో "నా వరముల ప్రభావముతోనే వీడు ఇంతటి వాడైనాడు. విష వృక్షమైనా పెంచిపోషించినవాడు చంపరాదని శాస్త్రం. అందుచే నేనేమీ చేయలేను. శివుడు, విష్ణువు కూడా ఏమీ చేయలేరు. దీనికి ఒకటే ఉపాయం ఉంది. ఆదిశక్తి స్వరూపిణి అమ్మవారు హిమవంతుని కుమార్తెగా అవతరించింది. ఆమెను పరమశివుడు వివాహమాడితే వారికి కలిగే సంతానం ఈ రాక్షసుని సంహరిస్తాడు. అందుచే మీరంతా పార్వతీ కళ్యాణం జరపడానికి ప్రయత్నిచండి అని ఉపదేశించారు. దేవతలందరూ సమావేశమైనారు. నారదమహర్షి నావంతు కార్యము నేచేస్తానని బయలుదేరినాడు.

ఇంద్రాది దేవతలు మన్మథుని ఈ కార్యము నీవలననే కావాలన్నారు. మన్మథుడు దేవతలు తనకిచ్చిన ప్రాధాన్యతకు సంతసించాడు. వసంతుడు, కోయిలలు వెంటరాగా, రతీదేవితో సహా పరమశివుడు తపస్సు చేస్తున్న హిమాలయ శిఖరాలకు బయలుదేరాడు. నారదులవారు ఒకనాడు హిమవంతుడ్నిచూడగోరి వాని ఆతిథ్యం స్వీకరించి, అక్కడే పెరిగి పెద్దదవుతున్న పార్వతిని చూచి హిమవంతునితో "ఈమె శ్రీ మహారాజ్ఞి లలితాదేవి అమ్మవారు. పరమశివునికి అర్ధాంగి అవుతుంది. నీ శిఖరాలలో తపస్సు చేయుచున్నశివుని సేవకై ఈమెను వినియోగించు మేలు కలుగుతుంది" అని చెప్పాడు. హిమవంతుడు పార్వతిని శివుని సేవకై పంపించాడు. ఆమె సేవలు చేస్తుండగా అక్కడే సమయమునకై వేచియున్న మన్మథుడు శివునికి కామవికారము కలిగేటట్లు పుష్పబాణము సంధించాడు . శివుడు తనలో కలిగిన ఆ కామవికారానికి కారణం తెలుసుకుని ఉగ్రుడై మూడవకన్ను తెరిచాడు. ఎదురుగా ఉన్న మన్మథుడు భస్మమైనాడు. రతీదేవి శోకించింది. పార్వతి తన అందాన్ని తానే నిందించుకుంది. సౌందర్యముతో సాధించలేనిది తపస్సుతో సాధిస్తానని శివుని కొరకై వ్రతము పూనింది.

ముత్యాలహారాలు తీసి రుద్రాక్షమాలలు ధరించింది. ఒక చేతిలో రుద్రాక్షమాల, ఒక చేతిలో కమండలము పట్టి, రెండు చేతులు పైకెత్తి నమస్కార భంగిమతో తపస్సు ప్రారంభించెను. తల్లి మేనక ఆ తపస్సు వద్దని "ఉమా, ఉమా" అని పిలిచింది. నాటి నుండి పార్వతి "ఉమా" అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఎవరేమన్నా సరే శివుని సాక్షాత్కరింప చేసుకోవాలని తీవ్రమైన తపస్సు చేస్తోంది. కొంతకాలం ఆహారము తీసుకోవడం మానింది . మరికొంతకాలము పండ్లు తినటం మానివేసి, నీరు మాత్రం పుచ్చుకుంటూ తపమాచరించింది. కొంతకాలము ఆకులు, అలములు తింటూ తపస్సు చేసింది. చివరకు ఆకులు, అలములు తినటం మానివేసింది. పంచాగ్ని మధ్యములో ఒంటి కాలిపై నిలిచి తపస్సు చేస్తూఉంటే, దేవతలు ఆమెను "అపర్ణా, అపర్ణా" అంటూ పిలిచారు. పర్ణము అంటే ఆకు, పర్ణము కూడా తినలేదు కాబట్టి అపర్ణ అన్నారు. (అప గత ఋణ అపర్ణ అనగా ఋణములను పోగట్టునది) ఆమె తపస్సుకు పరమశివుడు మెచ్చాడు. బ్రహ్మచారియై ఆమె చెంతకు వచ్చాడు. ఆమె తపోకారణం గూర్చి అడిగి తెలుసుకున్నాడు. తల్లి తండ్రి లేనివాడు, ఇల్లు వాకిలి లేవు. స్మశాన నివాసి. పుర్రెలు మెడలో ధరిస్తాడు. తోలు కట్టుకుంటాడు. వట్టి అమంగళ వేషుడు. అతని గురించి తపస్సు చేయటం తెలివితక్కువ. నా తపస్సులో సగభాగం ఇస్తాను ఈ తపస్సు నుండి విరమించుకో అన్నాడు. అపర్ణకు కోపం వచ్చింది. శివ నిందాపరుల చెంత ఉండకూడదని అక్కడనుంచి లేచి దూరంగా వెళ్ళిపోయింది. ఇంతలో శివుడు ఆమె చేయి పట్టుకున్నాడు.

పార్వతి కోపంతో ఛీ.. దుర్మార్గుడా అంటూ వెనక్కి తిరిగింది. తీరా చూడపోతే పరమశివుడు ఒక్కసారిగా సిగ్గుపడిపోయింది. తన తపస్సు ఫలించినందుకు మురిసిపోయింది. మెల్లగా తనచేయి వెనక్కి తీసుకుంటూ, స్వామీ! పెద్దలున్నారు మానాన్నగారితో మాట్లాడండి అని చెలికత్తెలతో ఇంటికి వెళ్ళింది. పరమశివుడు పెండ్లిపెద్దలుగా సప్తఋషులను పంపించాడు. అరుంధతి మొదలగు వారితో హిమవంతుని చెంతకు రాయబారం పంపాడు. హిమవంతుడు ఎంతో సంతోషించాడు. తన జన్మ ధన్యమైనదనుకున్నాడు.

ముక్కోటి ముక్కోటి దేవతలు ఒక్కటై మహావైభవోపేతంగా అపర్ణా పరమేశ్వరుల కళ్యాణము జరిపించారు. తర్వాత కుమారస్వామి ఉదయించి తారకాసురుణ్ణి సంహరించి లోకకళ్యాణము గావించాడు. ఈ కథ విన్నవారలకు, చదివినవారలకు కోరిన కోరికలు శ్రీఅపర్ణాదేవి అమ్మవారు స్వయంగా తీరుస్తుంది. అని సూత మహర్షులవారు శౌనకాది ఋషులకు శ్రీఅపర్ణాదేవి అమ్మవారి చరిత్ర తెలియజేసినారు.

అపర్ణా వ్రతము చేయుటకు అవకాశము లేనివారు రాహుకాల పూజను శుక్రవారం ఆచరించవలెను. ప్రతీ శుక్రవారము ఉదయం గం॥ 10-30ని.ల నుండి 12 గం॥ వరకు ఉండు రాహుకాలములో శ్రీఅపర్ణాదేవి ఆలయమునందు 7 వారములు పూజ చేస్తారో వారికి సర్వాభిష్ట సిద్ధి కలిగి, రాహు, కేతు గ్రహదోష, కాల సర్పదోష నివృత్తి అగును.

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...