Sunday, February 11, 2018

పరమశివుని దశావతారాలు

ఉపాసనాకాండ ద్వారా సేవింపబడే, మహాకాలమొదలగు పది శివుని అవతారములను గూర్చి నందీశ్వరుడు వివరించెను.  శివుని ప్రధామావతారం మహాకాలుడు. సత్పురుషులకు భుక్తిని, ముక్తిని ఇచ్చే మహాకాలావతారము వాటిలో మొదటిది. మహాకాళి ఈ మహాకాలుని భార్య. అపుడు శక్తి మహాకాలియై భక్తులకు ఫలములనిచ్చి కోర్కెలను నెరవేర్చును. పరమశివుని ద్వితీయావతారం తారకావతారం. తారకాదేవి ఈయన భార్య. "తార' అను అవతారము యందు శక్తి "తారా' యనబడును. వీరిద్దరు తమ సేవకులకు భుక్తిని ముక్తిని, సుఖమును ఇచ్చెదరు. పరమశివుని బాలభువనేశుడు మూడవ అవతారము. భాల భువనేశ్వరి భువనేశ్వరుని అర్ధాంగి. ఆ అవతారములో పార్వతి బాలభువనేశ్వరియై సత్పురుషులకు సుఖమునిచ్చును.

భక్తులకు భుక్తిని, ముక్తిని, సుఖమును, ఫలమును ఇచ్చే షోడశవిద్యేశుడు నాల్గవ అవతారము. దానిలో పార్వతి షోడశీ విద్యాదేవి యగును.  సర్వకాలములలో భక్తుల కోర్కెల నీడేర్చు భైరవుడు ప్రసిద్ధిగాంచిన అయిదవ అవతారము. దానియందు పార్వతి భైరవియై మంచి ఉపాసకుల కోర్కెలను తీర్చును.  శివుని ఆరవ అవతారమునకు ఛిన్నమస్తకుడని పేరు. గిరిజాదేవి ఛిన్నమస్తకయై భక్తుల కోర్కెలను తీర్చును. సర్వకామనలనీడేర్చి ఫలములనిచ్చే ధూమవంతుడు శివుని ఏడవ అవతారము. ఆ అవతారములో పార్వతి ధూమావతియై సత్పురుషులగు ఉపాసకుల కోర్కెలను తీర్చును. సుఖమునిచ్చు బగలాముఖుడు ఎనిమిదవ శివావతారము. దానిలో శక్తి మహానందా, బగలాముఖీ యను పేర్లతో ఖ్యాతిని పొందును. తొమ్మిదవ శివావతారము మాతంగుడు. దానిలో పార్వతి మాతంగియై సర్వకామనలను నెరవేర్చును. భుక్తిని ముక్తిని ఇచ్చే కమలుడు శంభుని పదియవ అవతారము. దానిలో పార్వతి కమలయై తన భక్తులను రక్షించును. ఈ పది శివావతారములు సత్పురుషులగు భక్తులకు సుఖమును, భుక్తిని, ముక్తిని, సర్వమును ఇచ్చును.

మహాత్ముడగు శంకరుని ఈ పది అవతారములను వికారములు లేకుండగా నిత్యము సేవించువారికి అనేక సుఖములు లభించును. తంత్ర శాస్త్రము మొదలగు వాటియందు నిగూఢముగా నున్న ఈ పది అవతారముల మహిమను శివ పర్వదినములయందు స్మరించిన సమస్త సుఖాలు, కోర్కెలు సిద్ధించును. తంత్ర శాస్త్రాదులలో నిగూఢముగా నున్న ఈ శక్తుల మహిమ అద్భుతము, కోర్కెలనన్నిటినీ నెరవేర్చును.  ఆ యాశక్తులు శత్రు సంహారము మొదలగు వాటిలో శ్రేష్ఠఫలము నిచ్చుననియు, దుష్టులను శిక్షించి నిత్యము బ్రహ్మవర్చస్సును వృద్ధి పొందించుననియు చెప్పబడినది.

శక్తితో గూడినవి, శుభకరమైనవి అగు మహాకాలాది పది మహేశ్వరావతారములను ఎవడైతే, భక్తి తత్పురుడై శైవపర్వదినములన్నిటి యందు ఈ పవిత్రమగు గాథను పఠించునో, వాడు శంభునకు మిక్కిలి ప్రియుడగును. బ్రాహ్మణుడు బ్రహ్మవర్చస్సు గలవాడగును. క్షత్రియుడు వినయమును పొందును. వైశ్యుడు ధనాఢ్యుడగును. శూద్రుడు సుఖమును పొందును. శివభక్తులు తమ ధర్మమును పాటిస్తూ ఈ చరితమును వినుచున్నచో విశేషసుఖమును పొందెదరు. వారి భక్తి వర్ధిల్లును.

ఇట్లు

శ్రీ గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...