Sunday, February 11, 2018

కైలాసమే శ్రీశైలం

కైలాసమే నీ నివాసం.. స్వయంభూవై వెలసెనిచ్చట..
అంటూ భక్తులు వేనోళ్ల పొగిడే దివ్యక్షేత్రం.. శ్రీశైలం..

ద్వాదశ జ్యోతిర్లింగ సహిత అష్టాదశ శక్తిపీఠ క్షేత్రంగా శ్రీశైల మహాక్షేత్రం విరాజిల్లుతోంది. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీభ్రమరాంబిక, మల్లికార్జునస్వామి వారిద్దరూ స్వయంభూవులే! శ్రీశైల మహాక్షేత్రాన్ని భూమండలానికి నాభిస్థానంగా పిలుస్తారు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఏ పూజ చేసినా, ఏ వ్రతంఆచరించినా శ్రీశైలాన్ని స్మరిస్తూ-‘శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే, శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే’ అని తాము శ్రీశైల క్షేత్రానికి ఏ దిక్కున ఉండి పూజ చేస్తున్నారో తెలియజేస్తూ సంకల్పం చెప్పుకుంటారు. అంతటి మహిమాన్వితమైనది ఈ క్షేత్రం!

దక్షిణ భారతదేశంలోని అతి ప్రాచీన శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీశైలాన్ని శ్రీగిరి, శ్రీ పర్వతం, శ్రీ నగరం అని కూడా పిలుస్తుంటారు. కుల, మత, జాతి తేడాలు లేకుండా, గర్భగుడిలోకి వెళ్లి శివలింగాన్ని చేతులతో స్పృశించి దర్శనం చేసుకునే అవకాశం ఉంది. భక్తులందరూ గర్భాలయంలోనికి వెళ్లి అభిషేకాలు చేయవచ్చు.

శ్రీశైలం చుట్టుపక్కల అంతా అనేక ఆయుర్వేద వనమూలికలతో నిండి ఉంది. కావున అక్కడ గాలి పీల్చినా సరే ఆ వనమూలికల ప్రభావం మనమీదపడి చిన్నా చితక అనారోగ్యాలు మటుమాయమైపోతాయని విశ్వసిస్తారు. పచ్చటి పరిసరాలమధ్య ఉండడంతో చక్కటి ప్రశాంతత లభిస్తుంది.

మల్లికార్జున నామ ప్రశస్తి :
స్వామి వారిని మల్లిఖార్జునుడు అని పిలవడానికి ఒక పురాణగాధ ఉన్నది. పూర్వం తలిదండ్రులపై కోపించిన కుమారస్వామి కైలాసం నుండి వచ్చి క్రౌంచ పర్వతం చేరాడు. ఆ పర్వతమే నేడు శ్రీశైలం అయినది. కుమారస్వామి వచ్చి ఉన్నచోట మద్దిచెట్టుకు మల్లెతీగ అల్లుకుని ఉన్నది. కుమారునికోసం వచ్చిన శంకరుడు ఆచెట్టు క్రిందనే లింగ రూపంలో వెలిశాడు కనుక స్వామిని “మల్లికార్జునుడు” అంటారు. అర్జున వృక్షం అంటే మద్ది చెట్టు.

మరొక కథ కూడా ఉన్నది : పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి శివుని పరమ భక్తురాలు. ఎపుడూ శివునిని ద్యానిస్తూ గడిపేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుడు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరము కావలెనో కోరుకోమ్మని అడగగా అంత చంద్రావతి స్వామీ! నేను మీ శిరముపై ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడి పోకుండా ఉండేలా వరం ప్రాసాదించమని కోరింది.అపుడు ఆ దండను శివుడు గంగ,చంద్రవంకల మద్య ధరిస్తాడు. శిరమున మల్లెపూల దండ ధరించాడు కావున స్వామి వారికి మల్లిఖార్జునుడు అనే పేరు వచ్చిందని అంటారు.

వృద్ధ మల్లిఖార్జునుడు : పూర్వం అమ్మవారు తపమాచరించి పరమేశ్వరుని ఇక్కడకు వచ్చి తనను వివాహమాడవలసినదిగా ప్రార్థించారు. అందుకు స్వామివారు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ప్రత్యక్షమౌతారు. అమ్మవారు స్వామీ ఏమిటి ఈ అవతారం అని ప్రశ్నించగా నేను అనాదినుండీ ఉన్నవాడను నారూపం ఇదే! ఇష్టమైనచో వివాహమాడుము అని తెలుపుతారు. అందుకు అమ్మ మాహాదేవా! మీ తత్వం నాకు తెలియనిది కాదు. మీ మనోహరత్వం నాకు బాగా తెలుసును మీరు ఏరూపంలో ఉన్నా నాకు ఆమోదమే అని తెలిపి స్వామిని వివాహం చేసుకుంటారు. అలా వచ్చిన స్వామే వృద్ధ మల్లిఖార్జునుడు. నేటికీ లింగ రూపంలో ప్రథాన ఆలయానికి కుడివైపున ఉన్నారు.

స్థల పురాణం: శిలాదుడనే మహర్షి సంతాన ప్రాప్తికోసం ఘోరమైన తపస్సుచేసి శివుని ప్రసన్నం చేసుకున్నాడు. శివుడివరంతో శిలాదుడికి నందీశ్వరుడు, పర్వతుడు అనే ఇద్దరు కుమారులు పుట్టారు. వారిలో నందీశ్వరుడు కూడా శివుడి కోసం తపస్సు చేసి కనురెప్పపాటు కూడా వృధాకాకుండా సేవచేసుకునే భాగ్యాన్ని కల్పించాలని, అంతేకాకుండా వాహనంగా ఉండేలా వరం పొందాడు. అందులో భాగంగానే శివుడున్న ప్రతిచోట నందీశ్వరుడు దర్శనమిస్తాడు. అయితే నందీశ్వరుడు సోదరుడు పర్వతుడు కూడా శివుడికోసం తపస్సుచేసి ఆయనను ప్రసన్నంచేసుకుని, శివపార్వతులతో సహా తన శిరస్సుపై కొలువుండేలా వరంపొందాడు. శివుడు కుమారస్వామిని వెతుక్కుంటూ రావడం, పార్వతిమాతకు ఆ ప్రాంత రమణీయత మైమరిపించడం పర్వతుడికి శివుడు వరం ఇవ్వడం లాంటి కారణాలవల్ల శివపార్వతులు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటుచేసుకున్నారు. శివుడు వెలసిన పర్వతమే శ్రీపర్వతం. తర్వాత అది శ్రీశైలంగా మారింది.

ఈ క్షేత్రం కృతయుగంలో హిరణ్యకశిపుడికి సభామందిరంగా ప్రసిద్ధికెక్కింది. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు సతీసమేతుడై మల్లికార్జునస్వామిని సేవించి సహస్ర లింగాల్ని ప్రతిష్ఠించారని పురాణగాథ. ద్వాపర యుగంలో పాండవులు ఈ స్వామిని సేవించారని ఇక్కడ ప్రతిష్ఠించిన లింగాల ఆధారంగా తెలుస్తోంది. అంతేకాక శ్రీశైల క్షేత్రానికి నాలుగు ద్వారాలు, నాలుగు ఉపద్వారాలున్నాయి. ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతక క్షేత్రం తూర్పు ద్వారంగా, కడప జిల్లా సిద్ధవట క్షేత్రం దక్షిణ ద్వారంగా, మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపుర క్షేత్రం పశ్చిమ ద్వారంగా, ఇదే జిల్లాలోని ఉమామహేశ్వర క్షేత్రం ఉత్తర ద్వారంగా స్కాంధపురాణంలో పేర్కొన్నారు. ఈ క్షేత్రానికి పుష్పగిరి క్షేత్రం(ఆగ్నేయ), సోమశిల క్షేత్రం(నైరుతి), సంగమేశ్వర క్షేత్రం(వాయువ్య), ఏలేశ్వర క్షేత్రం(ఈశాన్య) ఉప ద్వారాలుగా ఉన్నాయి.

క్రీ.శ. ఒకటో శతాబ్దం నుంచి ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందింది. శాతవాహనులు, విష్ణుకుండినులు, పల్లవులు, కదంబులు, తెలుగు చోళులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, చాళుక్య చోళులు, కాకతీయులు, కొండవీటిరెడ్డిరాజులు, విజయనగర రాజులు, ఛత్రపతి శివాజీ లాంటి ఎందరో రాజాధిరాజులు,చక్రవర్తులు, మండలాధీశులు ఈ క్షేత్రాన్ని పాలించి, సేవించి ఆధ్యాత్మిక సేవలో తరించారు. ఈ శ్రీశైల శిఖరాన్ని దర్శించిన... పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. మోక్షప్రాప్తి సిద్ధించి అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

ఇట్లు

గుట్టీ సుబ్రహ్మణ్యం శర్మ

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...