Thursday, February 22, 2018

ప్రాణాయామం

అస్త్రశస్త్రాలనే రెండు రకాలైన ఆయుధాలను చెప్పింది. ఖడ్గము, బాణముల వంటి ఆయుధాలు శస్త్రములని పిలవబడతాయి. మంత్రపూర్వకంగా ఉపయోగించేవి అస్త్రం. దర్భపుల్లను తీసుకొని తగిన మంత్రంతో అభిమంత్రించి వదిలితే అది శస్త్రముల కంటే శక్తివంతమైన ఆయుధమవుతుంది. ఎవరినుద్దేశించి లేదా దేనినుద్దేశించి ఆ అస్త్ర ప్రయోగం చేశారో అక్కడ సర్వనాశనం జరుగుతుంది. ద్విజులు అనుదినమూ ప్రయోగించవలసిన అస్త్రమొకటి ఉంది. అది అసురనాశనార్ధము మంత్రించబడిన అస్త్రము. ఆ అస్త్రము వలన మన బుద్ధిని ఆశ్రయించుకొని ఉన్న అసురశక్తులన్నీ మాయమైపోతాయి. ఆ అస్త్రప్రయోగమే అర్ఘ్యప్రదానము. అర్ఘ్యప్రదానము చేసేటప్పడు నా పాపములు చెడువర్తనము నశించుగాక అవి నా హృదయసీమలో ప్రకాశించే జ్ఞానభాస్కరుని ప్రకాశానికి ప్రతిబంధకాలై ఉన్నాయి. అవి తొలగిపోవాలి. జ్ఞానసూర్యుడు నాలోని తమస్సును పోగొట్టి సహస్రకిరణాలతో ఒక్కుమ్మడిగా జాజ్వల్యమానంగా ప్రకాశించాలి" అన్నభావంతో మనస్సును ఏకాగ్రంగా ఉంచుకొని చేయాలి...........
                              ఎవరైనా ఒక పని ఉత్సుకతతో మనస్ఫూర్తిగా చేస్తే ఊపిరి బిగపెట్టుకొని ఆ పని చేశాడని చెప్తాము. నంధ్యావందనం నిజంగా ఊపిరి బిగపట్టుకొని (ప్రాణాయామంతో) చేయవలసిన కార్యం. అలా చేస్తే అంతశ్శత్రువులైన కామక్రోధాదులు నశించిపోతాయి. ఈరోజుల్లో ప్రాణానాయామ్య అనగానే మనం ముక్కు పట్టుకుంటాము. ఊరికే ముక్కు పట్టుకోవడం కాదు కావలసింది. శాస్త్రములు నాసికాయామ్య అని చెప్పలేదు. ఉచ్చ్వాస నిశ్వానములను నియంత్రించాలి. ప్రాణాన్ని-జీవశక్తిని నియంత్రించాలి. ఇదంతా ఏకాగ్రతతో సాధించవలసి యున్నది. ఎంత చిత్తైకాగ్రత ఉంటే నీటిని అస్త్రంగా మార్చేశక్తి ఆవిర్భవిస్తుంది. ప్రాణాయామం యొక్క ప్రయోజనమిదే. ఉచ్ఛ్వాస నిశ్వాసముల నియంత్రణ ద్వారా చిత్తైకాగ్రత ఎలా సిద్ధిస్తుంది?....... పరమాశ్చర్యమో, పెద్ద దుఃఖమో వచ్చినపుడు నిర్ధాంతపోతాం. ఒక్క క్షణం ఊపిరి నిలిచిపోతుంది...... తరువాత వేగంగా ఊపిరి తీసుకోవడం మొదలుపెడతాం. కావాలని మనము ఊపిరి ఆపలేదు. అది సంకల్పితంగా జరిగింది. దీనిని బట్టి ఊపిరి ఆగడానికి చిత్తైకాగ్రతకు సంబంధమున్నదని అర్థం అవుతోంది కదా!....... దుర్భేద్యమైన మన అంతశత్రువులను జయించడానికి ఉవయోగించే మహాస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రాణాయామంతో ఈ చిత్తైకాగ్రత్యతను సంపాదించాలి.....      
                                   ప్రాణాయామపు అభ్యాసం ద్వారా మానసిక ఏకాగ్రత పొందవచ్చు. ఇది యోగమునకు ముఖ్యము. అధిక ప్రమాణంలో అభ్యాసం చేయడము కష్టము. అది గురు పర్యవేక్షణలో జరగాలి. సంధ్యావందనంలో పదిసార్లే ప్రాణాయామం చేస్తారు. కొన్ని కర్మల ముందుగా మూడుసార్లు ప్రాణాయామం చేస్తారు. పరిమితంగానైనా నిరంతరం శ్రద్ధతో చేసే ఈ ప్రాణాయామం క్షేమం ప్రసాదిస్తుంది. ఉపనయనమాదిగా ప్రతివారూ నిరంతరం విధివిధానంగా సంధ్యావందనంలో ప్రాణాయామం చేసి ఉన్నట్లయితే దేశం ఈపాటికి వేలాదిగా యోగివరులు ఉండెవారు. సంధ్యావందనాంగంగా ప్రాణాయామం చేసేటపుడు ముఫ్పై సెకన్ల కన్న గాలిని కుంభించరాదు. ఉచ్చ్వాస నిశ్వాసాలు నిలచిపోతే మనస్సు నిలిచిపోతుంది. ఆలాంటి ఏకాగ్రస్థితిలో అర్ధ్యం వదిలితే అంతశత్రువులు నిస్సందేహంగా తరిమివేయబడతాయి.....
                                    మనలోని చెడు శక్తుల నాశనానికి అర్థ్యం వదిలిన తరువాత ప్రశాంతచిత్తంలో గాయత్రీ జపం చేయాలి. వీలయినంతవరకూ - శక్త్యానుసారం - ఉచ్చ్వాస నిశ్వాసాలను నియంత్రణం చేయడం, గాలిని కుంభించి ఉంచడం చేస్తే చాలు. సంకల్పం, మార్జనం, అర్ఘ్యప్రదానం, జపం, స్తోత్రం, అభివాదం ఇవన్ని పరమేశ్వరానుగ్రహం కోసం చేసేవే! వీటన్నిటికి ముఖ్యంగా ప్రాణాయామం చేయాలి....
                                   శాస్త్రములు రోగిష్టులను కూడా మూడుసార్లు ప్రాణాయామం చేయమని.... చెబుతున్నాయి. దీనివల్ల ప్రాణాయామం కష్టమైనది కాదనీ సులభసాధ్యమనీ అర్థమవుతుంది. దీర్ఘాయుస్సు దీని అవాంతరల ప్రయోజనంగా చెప్పబడింది. అభివాదంలో ఏ బ్రహ్మర్షుల పరంపరలో మనం ఉద్భవించామో ఆ ఋషి పేరు చెప్పకొంటున్నాం. ఆ బ్రహ్మర్షి నుండి ప్రవర్థమానమైన శాఖల మూలపురుషులైన ఋషుల పేర్లు కూడా సంస్మరించబడుతున్నాయి. అందుకే మనకు ఏకార్షేయం, పంచార్షేయం, సప్తార్షేయములైన గోత్రములున్నవి. ఆ మహర్షుల వంశపరంపరకు చెందినవారమైనందువల్లనైనా మనం వైదిక కర్మానుష్టానం చేయాలి. మన పూర్వీకులైన ఋషులు దీర్ఘకాలం సంధ్యావందనమును అనుష్టించడం ద్వారా జ్ఞానులై బ్రహ్మతేజస్సులో ఆధ్యాత్మికౌన్నత్యంతో జీవించారట. ఈ విషయం మనుస్మృతిలో ఈ క్రింది శ్లోకం వివరిస్తుంది...
            
             "ఋషయో దీర్ఘ సంధ్యత్వాద్దిర్ఘమాయు రవాప్నుయుః!
                 ప్రజ్ఞాం యశశ్చ కీర్తించ బ్రహ్మవర్చసమేవచ!!"

                                         మన నిర్లక్ష్యము చేత తరతరములుగా వస్తున్న సంప్రదాయ తంతువును తెంపి వేయరాదు. సంధ్యావందనం కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గముల సమచ్చయము. సంధ్యావందనమును అర్థం ఎరిగి భక్తి విశ్వాసములతో పరమేశ్వరాధనగా అనుష్టించాలి....

No comments:

నేను పెట్టె ప్రతి అంశాన్ని NOTIFICATION ద్వారా పొందటానికి మీ EMAIL ID తో SUBSCRIBE చేసుకోండి

బలిపీఠం ...సకలభూత నైవేద్యపీఠం ఆలయం ఆగమం....!! ఆలయంలోకి ప్రవేశించగానే మనకు ఎత్తైన పీఠంపై విరిసిన పద్మం వలె ఉన్న బలిపీఠం దర్శనమిస్తుంది. గర్భగ...